17, అక్టోబర్ 2012, బుధవారం

ఎందుకంటే ఈ రోజు నీది ...

నాకు గుర్తుంది !! 1993 అక్టోబర్ 17 న.....
అదే సంవత్సరం (సెప్టెంబర్ 12న) నెల క్రితం చేయించిన గుండు తో ఆకుపచ్చ పట్టులంగా, ఎర్ర జాకెట్ తో...
 అదే గుండు మీద నిలవని మామ్మ చేయించిన తక్కై( పాపటి చేరు)  గొలుసుతో,
మోటుగా ఉంటాయని నేను ఒద్దన్నా తాత పట్టుబట్టి కాళ్ళకు పెట్టిన  పట్టాలతో ,
మన వరండా లో పెదనాన్న చేసిన గోడ ఫ్యాన్ కింద కేకు కోసావ్.
గుంటూరు నుంచి వచ్చిన అమ్మమ్మ తాతల హడావిడి కి,
ఇంకా అత్తా, మామా, పిన్నిల ఎత్తుళ్ళకి..
కందిపోతూ..
కాంతు గాడు  కాయా నువ్వు గుండా ..? అంటుంటే మాటలు రాక తల ఆడించే దానివి.
నీ మొదటి పుట్టిన రోజుకి ,ఇరవయ్యో పుట్టిన రోజుకి  మధ్యలో ఎన్నేళ్ళయినా
ఇంకా అలాగే నాకళ్ళకి పసి దానిగానే కనిపిస్తావ్.
ఎలా నడవాలో నేర్చుకోవటం దగ్గర నుంచి నడవడిక ఎలా ఉండాలో
నేర్చుకున్న  దాక నువ్వు చేసిన వన్నీ నాకు గుర్తున్నాయి...
బట్టల అలమర తలుపు తీసినప్పుడల్లా తాకే అగరుబత్తి వాసనలా సున్నితంగా నన్ను నవ్విస్తూనే  ఉంటాయి.
చాలా మందిలా దేనికోసం నువ్వు అలగవు . 

చాలామందిలా ఏదీ లేదని నువ్వు అడగవు.
చాలా మందిలా ఎవరినీ ఏమీ ఆనవు. 

చాలా మందిలా నువ్వు బంగారు తల్లివి.
అందుకే ఇక నుంచి నువ్వేమి అడిగిన నేను సరే అనే అంటాను
ఎందుకంటే నువ్విప్పుడు నా అంత నువ్వు !! హాపీ బర్త్ డే నానీ !!