19, మార్చి 2011, శనివారం

నిష్కృతి అనబడే రంగు..తలనొప్పికి మందు!

(above photo is taken from google images, if the owner has objection, it will be removed)

దాదాపు ఇరవై రోజుల తర్వాత మళ్ళీ రాస్తున్నా. గత నెల ఇరవై నాలుగో తారీకు ను ఒక దుర్దినంగా భావిస్తూ రాసిన నా క్రితపు బ్లాగ్ టపా తర్వాత మళ్ళీ ఇదే. విపరీత మైన పని ఒత్తిడి వల్ల రాసే మానసిక స్థితి లేక బ్లాగ్ లోకి చూడటం తగ్గించా. ఇంకో నెల రోజులు ఇలాగే పని ఉండొచ్చు కాబట్టి మీలో చాలా మంది కి ఉపశమనం. కానీ ఈరోజు కావాలని సమయం చేస్కొని రాయాలని కూర్చున్నా.

ఈరోజు హోలీ, మా విజయవాడ లో ఈమధ్య కాలం లోనే ఈ హోలీ పండగ ప్రాచూర్యం లోకి వచ్చింది. మార్వాడి, సింధీ, ఇతర ఉత్తర భారత కుంటుంబాలు, ఇంకా పొరుగు జిల్లాల ప్రభావమేమో, తెలుగు వాళ్లైన స్కూలు కాలేజీ పిల్లలు కూడా హోలీ చేస్కుంటున్నారు. కొత్త సంస్కృతి ని ఆహ్వానించటం కూడా ఆరోగ్యకరమైన మార్పే కదా. ఈ హోలీ మంచి హుషారైన పండగ. పిల్లలూ పెద్దలు అందరూ హుషారుగా ఒకటై చేస్కునే పండగ బాగుంటుంది కదా.


పొద్దున్నే మా ఫ్లాట్స్ లో పిల్లలు హోలీ చేస్తారేమో అని ఎదురు చూసా. ఎవరు రాలేదు, అంతా స్కూళ్ళకి , కాలేజీలకి వెళ్ళిపోయుంటారు. మా అమ్మూ ఇంట్లో ఉండి ఉంటే ముందు రోజే రంగులు కొనమని, ఇంకా ఎక్కువ కొనమనీ తెగ హడావిడి చేసి చివరకి టైం లేక కాలేజీ కి వెళ్ళిపోయేది. ఆ రంగులు కబోర్డ్ లో దాచి ఎప్పుడో ముగ్గులకి ఉపయోగించేది.


ఈరోజు ఆ ఆలోచనలతో ఆఫీస్ కి బయలుదేరి దార్లో చాలా మంది పిల్లలని చూసా రంగులతో సరదా చేస్కుంటూ. వాళ్ళంతా ఖరీదైన బైకులు, బోలెడు రంగులు, నోటి నిండా బూతులతో , పరిమితమైన స్నేహితులతో హోలీ ఆడుకుంటున్న సంపన్న వర్గాల పిల్లలు. నోటి నిండా బూతులు అని ఎందుకన్నానంటే ఆఫీసు కు వెళ్ళే దార్లో ఒక బ్యాంకు పని ఉండి, బ్యాంకు వెనుక రోడ్ లో కార్ పార్క్ చేసి, అక్కడ పది నిముషాలు ఆగి పని చూస్కొని తిరిగి వచ్చేసరికి , నా కార్ దగ్గర పక్కనే ఒక నాలుగు బైకులు మీద ఇరవై ఏళ్ళ వయసు కుర్రాళ్ళు, అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ లో ఎవరి తోనో హోలీ ఆడటానికి వచ్చి లోపలి కి వెళ్ళటానికి తటపాయిస్తూ ఒకళ్ళ నొకళ్ళు తోస్కుంటున్నారు . ఆ క్రమం లో వాళ్ళ బాష అలా ఉంది. నేను నా కార్ దగ్గరికి రాగానే కొంచం పక్కకి జరిగారు. అప్పటికే నా కార్ అద్దాల మీద బానేట్ మీద అంతా రంగు పడి ఉంది. నేను ఏమీ అనకుండా కార్ లోంచి గుడ్డ తీసి తుడుస్తుంటే, పక్కనుంచి అంకుల్ హోలీ ఆడతారా రంగు వేయమా అని వెటకారం గా అన్నారు.


మామూలుగా అయితే కొంచం రంగు వేయించు కొని, కొంత వాళ్ళ మీద వేసి వెళ్ళే వాడినే, ఎందుకనో వీళ్ళని చూస్తే అలా చెయ్యాలని అనిపించలేదు. అందుకే ఒద్దు అని కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయా. ఏదో వెలితి నేనేమన్నా అతి సీరియస్ గా ప్రవర్తించానా అన్న భావన.


చిన్న పిల్లలు కదా వాళ్ళతో నాకు ఈగో ఏంటి అని పించింది. నా కార్ మీద కొంచం రంగు పడినంత మాత్రాన వచ్చిన నష్టమేంటి? వాళ్ళు పెద్ద బైకులు వేస్కొని తిరిగినంత మాత్రాన భాధ్యతా రాహిత్యం గా ఉనట్టు నేను అనుకున్నాన్నా? వాళ్ళ పెద్దల ఇష్టం వాళ్లకి బైకులు కొనిచ్చారు మధ్యలో నాకేంటి. ఏదో కొంచం స్పీడ్ గా వెళ్తారు హారన్లు కొడతారు. సైలెన్సర్ లు పీకేసి వెనక నంబర్ ప్లేట్ మీద నంబర్ లేకుండా వాళ్ళ కులం పేరు రాస్కోని, వాళ్ళ కులం హీరో బొమ్మ పెట్టుకొని తిరుగుతారు మధ్యలో నాకేంటి?

లైసెన్స్ లేకుండా పెద్ద బైకులు వేస్కొని తిరుగుతున్నంత మాత్రాన వాళ్ళు చేసిన తప్పేంటి. వాళ్ళూ పిల్లలే కదా, పెద్దాళ్ళ నుంచి నేర్చుకున్న సంస్కారమే కదా అన్న వైవిధ్య భావనలతో ఆఫీసుకేసి వెళ్లాను.

నేను ఉద్యోగం లో చేరిన కొత్తలో ఆఫీసు లో మొదటి హోలీ కి రంగులు కొని నేను నాతో పాటే చేరిన సహా ఉద్యోగి కృష్ణ బాబు కలిసి అందరి సీట్ల దగ్గరికీ వెళ్లి రంగు పొట్లాలు చూపిస్తే అందరూ ఇదేంటి హోలీ మన పండగ కాదు కదా ( విజయవాడ లో హోలీ కి సెలవ లేదు) అని హాస్చర్య పోయారు. కానీ రంగు తీస్కోని మాకు రాసి వాళ్ళ మొహాలకి రాయించు కొని ఆనందించారు. కొందరైతే మా మతం ఒప్పుకోదు ఒద్దు అని తిరస్కరించారు. అప్పటికి మా వయసు 23 ఏళ్ళే, ఇప్పుడు మళ్ళీ వీళ్ళని చూస్తే అదే గుర్తొచ్చింది.


ఏమైనా విజయవాడ లో హోలీ పరిమితం గా ఆడతారు. ధనిక, వ్యాపార వర్గాలు, మార్వాడీ సింధీ కుటుంబాలు ఉండే ప్రదేశాలు, వాళ్ళ పక్కనే ఉండే మరికొన్ని తెలుగు కుటుంబాలు తప్ప మిగతా విజయవాడ అంతా హోలీ అంటే ఏంటో తెలీనట్టు స్తబ్దంగా గడిపేసింది.


పొద్దున్న ఆఫీసుకి వెళ్ళిన నేను మార్చ్ నెల లో పని ఒత్తిడి వల్ల రాత్రి ఏ పది కో ఇంటి వెళుతుంటాను. కానీ ఈరోజు తల నొప్పిగా ఉండి పని చెయ్యాలని లేక మధ్యాహ్నం
మూడున్నరకే ఇంటికి బయలుదేరా మా కాలనీ దాకా వచ్చాక మా రోడ్ చివర ఒక నలుగురు పిల్లలు కూర్చొని ఉన్నారు ఒక ఇంటి గేటు రాంప్ మీద, ఒంటి మీద రంగులు చేతిలో చిన్న కాగితం పొట్లాలు వాటిలో రంగు రంగులు కలిసి పోయి ఉన్నాయి.

చూస్తే మా కాలనీ లో అపార్ట్మెంట్ల లో పనిచేసే వాచ్ మాన్ పిల్ల లా ఉన్నారు. వాళ్ళ అమ్మలు ఇళ్ళల్లో పని చేస్తూ నాన్నలు వాచ్ మన్లు గా ఉంటూ ఇస్త్రీ చేస్తూ జీవనం గడిపే బడుగు కుటుంబాల పిల్లలు. ఎక్కడో దూరం గా ఉండే ప్రభుత్వ పాటశాలల్లో చదువుతూ ఉండే పిల్లలు. రోజూ స్కూల్ అయ్యాక మట్టిలో దొర్లుతూ రోడ్ మీద ఆడుకుంటూ గడిపే పిల్లలు ఈ రోజు హోలీ జరుపుకుంటూ నా కంట బడ్డారు. అప్రయత్నం గా కార్ స్లో అయింది, నా కార్ ఆగటం చూసి ఆ పిల్లలు లేచి నిలబడ్డారు.

నేను దిగి వాళ్ళ కేసి నడిచా.... వాళ్ళు బెదిరినట్టు గా దూరం వెళ్ళటానికి ప్రయత్నించారు. నేను నవ్వు ముఖం తో వాళ్ళను ఆగమని సైగ చేశా, వాళ్లకి నమ్మకం కలగలా నేనేదో అంటానేమో అన్న భయం వాళ్ళ ముఖం లో కనపడింది. వాళ్ళతో స్నేహం కోసం నేను వచ్చినట్లు వాళ్ళని ఒప్పించటానికి ఒకడి భుజం మీద చేయి వేసి హోలీ చేస్కున్తున్నారా అని అడిగా..

ఆ అపార్ట్మెంట్లలో వాళ్ళు రంగులిచ్చారు అని ఒకడు చెప్పాడు. మా తప్పేమీ లేదు అన్నట్టుగా ఉంది వాడి మాట.

"మంచిది నాక్కొంచం రంగు ఇవ్వండి" అని అడిగా,
తెల్లటి నా కుర్తా, పైజామా చూసి వాళ్ళు జంకారు. నేనే స్వయం గా వాళ్ళ చేతిలోంచి రంగు తీస్కోని వాళ్ళ ముఖాలకి రాసా ...వాళ్ళు కూడా నా చేతి మీద బెరుకు బెరుకు గా రంగు రాసారు. పర్లేదు రాయండి అన్నా వినలేదు.
ఆప్పటికీ వాళ్లకు నమ్మకం కలగలేదు, ఏదో కుట్ర తో ఈయన వచ్చాడు అన్నట్టు చూస్తున్నారు.
ఎందుకు వీళ్ళకి ఈ భయం ? ఏమి తప్పు చేసారని ?
ఎవరో పెద్దింటి పిల్లలు హోలీ ఆడుకొని, అలిసి పోయి మిగిలిన రంగులు వీళ్ళకి ఇస్తే,
ఇంత భయం భయం గా అడుకోవాలా?

ఒక అయిదు నిముషాల కాలం లో వాళ్లకి నమ్మకం కలిగి మాకు మైత్రి కుదిరింది అంతా పది పన్నెండు ఏళ్ళ పిల్లలు అందరూ వాచ్ మాన్ల పిల్లలే, బాగా చదువుతారా అంటే చదువుతాం అని తల ఊపారు. హోలీ అంటే రంగు లు వేస్కోటమేనా అని అడిగా... తెలిసీ తెలీదన్నట్టు తలలు ఊపారు. తిరిగి బయలు దేరుతూ వాళ్ల కి డబ్బులిచ్చి ఎమన్నా కొనుక్కొని తినండి అప్పుడు హోలీ పూర్తి అవుతుంది అని చెప్పా ... అవునా నిజమా అన్నట్టు చూసి నా చేతిలో డబ్బులు తీస్కోని షాప్ వైపు పరిగెత్తారు. వాళ్ళ ముఖం లో అప్పటికి నమ్మకం కనపడింది, నేను మంచి వాడినే అన్నవిషయం ధృడ పడింది.


వాళ్ళలా పరిగెడుతుంటే నాకు

వాళ్లకు జనం మీద భయం పోయిన సద్భావన ,
నా మీద నమ్మకం కాదు,
భవిష్యత్ మీద భరోసా కలిగినట్లు అనిపించింది.

పిల్లల ఆత్మవిశ్వాసం వాళ్ళవాళ్ళ కుటుంబాల కులం మీద కాక వాళ్ళ నాన్న సంపాదించే డబ్బు మీద కాక,

వాళ్ళు పెరుగు తున్న సమాజం మీద ఉండాలి. వాళ్ళ వాళ్ళ స్వశక్తి మీద కలగాలని
వాళ్ళ భవిష్యత్ రంగుల మయమయి రోజూ హోలీ జరగాలని కోరుకుందాం.
వెనక్కి తిరిగి నా కార్ వైపు నడిచా, అదేంటో.....
పన్లో పనిగా నా తల నొప్పి ఎగిరి పోయింది !!

హొయ్ ఇది నా యాభయ్యవ టపా

హుర్రే హుర్రే హాఫ్ సెంచురీ అప్ !!
సచిన్ నలభై తొమ్మిది తర్వాత కాస్త స్లో అయినట్లు నేనూ స్లో అయ్యా !!
సచిన్ కు క్రికెట్లో లాగా నాకు బ్లాగ్ రాతల్లో ఉజ్వల భవిష్యత్ ఉందేమో
నమ్మకం కలిగినట్లు గా డౌట్ గా ఉంది!!!