24, ఏప్రిల్ 2011, ఆదివారం

నాణెం అటు ఇటు..



సత్యం సాయి అయితే, అసత్యం హాయి !! ఆయనకి ఏమీ అవలేదు బానే ఉన్నారు అనే మాట అసత్యం అయినా ఎంతో మందికి హాయే !!
ఇదేదో ప్రాస కోసం పడిన పాటు కాదు. గత మూడు వారాలు పైగా టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు పడుతున్న శ్రమ చూస్తే వెంట నే నాకు అలా స్పురించింది.
నేను సత్య సాయి భక్తులలో ఒకడిని కాదు, అలాగే అయన చేసే మహిమలను, భక్తుల విశ్వాసాన్ని ఖండించే శాస్త్రజ్ఞాని ని కూడా కాదు.

నా బాల్యం నుంచి సత్యసాయి ఆరాధన మా ఇంట్లో ఉంది. మా అమ్మ ఒక్కతే ఒంటరి ఈ విషయం లో. అసలు ఆయన ఫోటో ఎలా మా ఇంట్లో ప్రవేశించిందో, ఎ కారణం మా అమ్మ ని ఆయన ఆరాధన కు ప్రేరేపించిందో ముఖ్య విషయం కాదు.

మా అమ్మ ఎన్నో పూజలు చేసింది. త్రినాధ పూజ, సాయి బాబా భజనలు, గ్రహశాంతులంటూ ఆరాధనలు, దానాలు ఒకటేమిటి చాలా చేసింది.
అన్నిటికీ ఒకటే కారణం !! అయినా ఏమి చేసినా ఇప్పటికీ ఫలితం లేదు.

రిటైర్ అయ్యాక మరి కాస్త ఎక్కువ బాబా భక్తి వైపు మొగ్గింది. పదమూడు ఏళ్ళ క్రితం మా నాన్న పోయాక ఈ భక్తి మరింత ఎక్కువయింది. ఆ భక్తి లోనే పుట్టపర్తి లో చిన్న ఇల్లు కొనుక్కొని అక్కడే ఉండి పోతానని అడిగింది. వయసు పెరిగి ఎన్నో ఆటు పోట్లని చూసిన ఆమె కోరిక ఏదైనా సరే నని అనే వాడిని, లేదా సున్నితంగా వారించే వాడిని. ఈ కోరికకి మాత్రం తీవ్రంగా అభ్యంతర పెట్టాను. ఫలితం ఎప్పుడన్నా ఒకసారి పుట్ట పర్తి వెళ్లి ఆమె తృప్తి మీరా ఉండి వచ్చేది. ఆమె భక్తికి, ఆరాధన స్వేచ్చ కి ఎటువంటి ఆటకం లేదు మా ఇంట్లో. నేను కూడా మానసిక పరిపకత్వత లేని రోజుల్లో సాయిబాబా గారి గురించి, ఆయన భక్తుల గురించి , నోటి కొచ్చినట్లు మాట్లాడే వాడిని. కానీ గత కొద్ది సంవత్సరాలుగా నా మానసిక పరిపక్వత పెరిగిందో, లేక మానసిక స్థైర్యం తగ్గిందో నాకూ భగవంతుని మీద ధ్యాస పెరిగింది. ముక్ష్యంగా మా ఆమ్మ తీవ్ర అనారోగ్యం లో ఉన్నప్పుడు నాకు సహజం గానే భగవంతుని మీద మరింత గురి కుదిరింది. తప్పదు నా స్వార్ధం నాది. సంవత్సర కాలం తీవ్రం గా బాధ పడి నా దేవుడో,లేక ఆమె భగవానో కరుణించి ఆమె మళ్ళీ స్వస్థత పొందింది. అప్పటినుంచి నా మెదడు మనసు కు కమ్మిన పొరలు కరిగి, నా భావాల్లో దేవుళ్ళ మధ్య భేదాలు తొలగి పోయాయి. అప్పటి నుంచి దేవుడు ఒక్కడే అన్న భావం నాకు మరింత బలపడింది.


కానీ ఇదేంటి ఇప్పుడు ఇలా జరుగు తోంది, భగవాన్ అని కొలువ బడ్డ ఆయనే విషమ పరిస్థితి లో ఉన్నారు. ఇప్పుడు భగవంతుడు తన లీల చూపడా?

ప్రపంచవ్యాప్తం గా కోట్ల మంది భక్తులని కుదేలు చేస్తూ అయన అలా నిస్తేజం గా ఆసుపత్రి లో ఉండిపోయారు (?)
ఎన్నో ఆవేదనలు, ఆక్రందనలు, నిస్సహాయ, పరిస్థితుల మధ్య సాయి భగవాన్ భక్తులు కొట్టు మిట్టాడుతున్నారు.
రక రకాల టీవీ , పేపర్ కధనాల తో అయోమయ మయి ఏది వినాలో , ఏది నమ్మాలో తెలియక క్రుంగి పోతున్నారు.
మా అమ్మ కూడా మినహాయింపేమీ కాదు. మొదట్లో ఆశ గా పేపర్ చదివి, టీవీ చూసేది ....
రెండో వారం లో ఈ కధనాలు, దానికి కొంత మసాలా కలిసి కిచిడి వార్తలు ఎక్కువై మరింత బాధ పడటం మొదలు పెట్టింది. ఇది నేను తట్టుకోలేని విషయం.
గత వారం గా టీవీ కూడా ఒదిలేసి తన గది లో ఒంటరి గా గడపటం, ఆహారం మీద శ్రద్ధ తగ్గటం, మౌనం గా బాల్కనీ లో కుర్చీ వేసు కొని కూర్చోవటం నన్ను బాధ పెట్టే విషయాలు.

బయట ప్రపంచం లో కూడా విచిత్రమైన విషయాలు కొన్ని,

ఈ టీవీ, పేపర్ వాళ్ళ లాగే మామూలు జనం కూడా తమకు తోచింది మాట్లాడు కుంటున్నారు.
జీవితం లో ఒక్క పైసా పుట్టపర్తి సాయి ట్రస్ట్ కు దానం ఇవ్వని మనుషులు,
సాటి మనిషి ఇబ్బంది లో ఉంటే పైసా సాయం చెయ్యని వాళ్ళు,
అక్కడ లక్షల కోట్లు మూలుగు తున్నాయట, టన్నుల కొద్దీ బంగారం ఉందట అదంతా అయన (సాయి బాబా) భక్తుల నుంచి సంపాదించినదే కదా .. అంటూ మాట్లాడు కుంటున్నారు.
అసలు పుట్టపర్తి లో ఒక్కసారి కూడా కాలు పెట్టని వాళ్ళు
ఆయనంతా గొప్ప గొప్ప వాళ్ళకే ఇస్తాడు, మామూలు మనుషుల వంక చూడను కూడా చూడదు. అంటూ నిష్టూరాలు పోతున్నారు.
ఒకటి ఖచ్చితం గా చెప్పగలను ... ఇలా నిస్తూర పడే వాళ్లకి గనక అయన ఒక ఉంగరమో, విభూదో కనీసం యాదృచ్చికం గా ఇస్తే వాళ్ళు అయనని పొగిడే వాళ్ళేమో.
నేను పరిశీలించిన కొంత మంది మనుషులు దేవుడంటే, బాబాలంటే కేవలం మహిమ లే నంటూ అనుకునే వాళ్ళున్నారు.
చేసే ఉద్యోగం లో ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేకుండా, ప్రతి చిన్న విషయానికి నాలాటి వాడిని డౌట్లు అడిగే కొంత మంది ప్రభుద్దులు కూడా పుట్టపర్తి మీదా చర్చలు చేస్తున్నారు.


ఇక మా అమ్మ విషయానికి వస్తే , కొంత మంది పని లేని వాళ్ళు మా ఇంట్లోకి తొంగి చూసి "ఏంటి ఆయనింకా చచ్చిపోలేదా..? అంటూ అడుగు తుంటే సొంత అన్న కి ఒంట్లో బాలేక పోతే బాధ పడినట్లు , మౌనం గా ఒంటరిగా కుమిలి పోతోంది. ఇది నన్ను కలచి వేస్తోంది.

నేను బాబా భక్తుడిని కాదు , భజనలకి వెళ్ళ లేదు, పుట్టపర్తి చూడలేదు, బాబా ని బయట అస్సలు చూడ లేదు...

కానీ మా అమ్మ కోసం , మా అమ్మ లాంటి ఆ తరం వాళ్ళ కోసం...

సాయి భక్తిని ఒక పరంపరలా కొన సాగిస్తున్న వాళ్ళ కోసం...
సాయిని భజనలని ఒక సంస్కృతి లా పాటిస్తున్న వాళ్ళ కోసం..
కేవలం మన పెద్ద ల కోసం ఆ పెద్దాయన్ని తూలనాడటం, సరదా విషయం గా మాట్లాడు కోవటం మానేద్దాం.

ఒక ఎనభై ఆరేళ్ళ పెద్దాయన మన ఇంట్లో ఆ పరిస్థితి లో ఉంటే ఎలా గౌరవిస్తామో...అలా గౌరవిద్దాం.

అందునా విద్య, వైద్య, సేవా రంగాల్లో అయన చూపిన బాట ప్రభుత్వాలకే మార్గ దర్శకం కదా...
దాహార్తి తో గొంతెండి పోతున్నా మన ఇంటి ముందు రోడ్ వేసే కూలికే నీల్లివ్వని మనం
లక్షల మంది కి మంచి నీటి వసతి సమకూర్చిన అయన గురించి వెకిలి గా మాట్లాడొద్దు.
అవి ప్రజా ధనమే, అయన సొంత సోమ్మేమీ కాదు అనుకున్నా..

కోట్ల కొద్దీ ప్రజా ధనం సొంతానికి తినేసినా
రాజా గాడి(నే)ద నే సహించాము.
ఈయనేమి చేసారు ?
వేల ఎకారాలు దిగ మింగి కొడుకులకిచ్చిన వెధవల నే భరించాము
ఈయనేమి చేసారు ?
అసలు రాజకీయం, అధికారం , అడ్డు పెట్టుకొని
పంది కొక్కుల్లా తినేస్తున్న వాళ్ళనే ఏమీ అనకుండా సహిస్తున్నాం కదా
ఈయనేమి చేసారు ?

అందుకే మౌనం గా ఉందాం

అయన బాగుంటే ఉంటె భక్తులకి ఆనందం
మనకెందుకూ ....?

మీ ఊహా గానాలలోలా అయన ఎప్పుడో వెళ్లి పోయున్దోచ్చు .....

లేదా అయన చెప్పినట్లు దివి నుంచి కాషాయ రంగు చుక్కలా దీవించ వచ్చు
ఇవేమీ కాదా ఆదివారం లేచి వచ్చి వెన్నెల నవ్వులు కురిపించా వచ్చు...
ఏదైనా మీరే గెలుస్తారు.
మీ ఊహలు నిజమవటమా..
లేక అయన మహిమాన్వితుడని నిరూపింపబడి మీరూ అయన భక్తిలోకి మళ్ళటమా ..!!
ఏమైనా ఈ సమయం లో మాట్లాడుకునే విషయాలు కానివి ఒదిలేద్దాం.

ఇది రాసిన నేను మనిషిని కేవలం మనిషిని

అయన మీద భక్తి తో రాయలేదు...
అయన మీద ద్వేషమూ లేదు...
నా మీద నాకు జాలి తప్ప.!!
ఒట్టు మీ అందరి మీద !!!

17, ఏప్రిల్ 2011, ఆదివారం

ఐ లవ్ వంశీ


నాకూ వంశీ కు మధ్య ప్రేమ

ఇది చూడగానే నేనేదో ఆ టైప్ అనుకోకండి. నిజ్జం గా ఐ లవ్ వంశీ.
అవును
ఆ వంశీ నే.... ఎందుకని వంశీ
ని అంతగా లవ్ చేస్తున్నాను ? ఏమో నాకు క్లారిటీ లేదు.
బహుసా వంశీ రచనల్లో ఎప్పుడు చూడని కొత్త లోకం ఉంటుందనా ?
లేక మన చుట్టూ ఉన్న లోకాన్నే దిగంబరం చేసి (రాసి) చూపుతాడనా ?
ఎటువంటి కౌపట్యం లేని సాదా సీదా మనిషనా?
లేక భావోద్వేగాలు కూసింత ఎక్కువున్న కళారాధకుడనా ?
సినిమాల సంగతి పక్కన పెడితే, రచయితగా అయన మాత్రం నాకు లవబుల్ మాన్.

చాలా సార్లు అనుకుంటా వంశీ లాంటి మిత్రుడుంటే, భలే ఉంటుందే అని. నా మిత్రుడైన వంశీ దర్సకుడవక్కర్లేదు . రచయిత కూడా కానక్కర్లేదు. అసలు లోకం లో జనాలకి తెలియక్కర్లేదు. నాకు మాత్రమే తెలిసి, అయన చదివిన పుస్తకాలు నాకు వివరిస్తూ ... సైకిలేసుకొని గోదారెంట వెళుతూ ఏ కిళ్ళీ కొట్లోనో సోడా కోసం ఆగి కాసిని సోడా నీళ్ళు మొహమ్మీద పోస్కోని భలే ఉంది బాసూ అనుకుంటూ, ఆనక బయలు దేరి చిన్న గోల్డ్ ఫ్లాక్ సిగరేట్టన్టించి గట్టిగా దమ్ము లాగి, ఈ గోదారంటే నాకు భలే ఇష్టం బాసూ అని చెబుతూ.. ఏ మాధవ రావు హోటల్లోనో వేడి ఇడ్లీలో పెసరట్లో తినిపించి అయ్యాక ఏ కొబ్బరి చెట్ల సందునో దూరి పడుకొని ఆకాశం వంక చూస్తూ, జీవిత మంటే ఇంతే, ఏదో లేదని ఉన్న సుఖాన్ని పోగొట్టుకో కూడదు అని హితభోధ చేసే వాడై ఉండాలి.

ఏం మాయరోగం వీడికి పాత టపాల్లో కొన్నింట్లో చాలా నీతులు చెప్పాడు. ఇప్పుడేమో మారుమూల పల్లెలో వంశీ తో రొమాన్సు ఆడాలని ఉవ్వి ళ్ళూరుతున్నాడని అనుకో బాకండి.


గత
నెల రోజుల పైగా విపరీత మైన పని వత్తిడి తో మతి కొంచం చలించి, దారి తప్పి కరీం బీడీ కావాలని, తాటి కల్లు కావాలని, వంశీ లాటి మగాడితో మధుర క్షణాలు గడపాలని కోరుకుంటోంది.అది దాని తప్పు కాదు.
నా తప్పూ కాదు. చాలా రోజుల తర్వాత ఈ రోజు పూర్తిగా ఖాళీగా ఉంది " వంశీ కి నచ్చిన కధలు " పుస్తకం చేబూని యాదృచ్చికం గా చదవటం చేశా. ఎన్నో సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ కొత్త గా అనిపించే , ప్రసిద్ధ రచయితల యాభై కధలు ఒక పుస్తకం గా అచ్చేసి, ప్రతీ కధ చివర ఎందుకు నచ్చిందో అన్న విషయం చిన్నగా తాళింపెట్టి మరీ ఒదిలారు.

ఈ అర్దరాత్రి ఎవరికీ చెప్పను ఆ కధల మత్తు మహత్తు. ఇలాంటివి చెప్పుకొని ఆనందించే మా ప్రెబాకరు గాడు ఇదివరలోలా స్పందిచట్లేదు. పక్కనున్న మా ఆవిడ కి వివరిద్దామా అంటే అప్పటికే సైలెన్సర్ తీసేసిన లూనా లా గుర్రు గుర్రు అంటోంది, పోనీ ఇంజను ఆపి విషయం చెబ్దామా అంటే మంచం మీద నుంచి నన్ను కిందకు తోసేయగలదు. అన్న భయం ఉంది. అప్పుడు ఉన్నట్టుండి గుర్తొచ్చింది.

నా లిపిలేనిభాష లో భాద పడి చాలా రోజులయింది అని. అంచేత ఆ పుస్తకం గురించి మీతో పంచుకుందామని ఇలా మొదలెట్టా. వివిధ విషయాంశాల తో , మాండలీకాలతో, ప్రదేశ వర్ణనలతో, ఉన్న ఆ కధలు వంశీ గారికి నచ్చటం ఏమంత కొత్త విషయం కాదు. చాలా కధల్లో కధావస్తువు రాత్రి ,అడవి,నది, వాన కొండ ప్రాంతం ఇలా ఉన్నాయి. నాకెందుకో చిన్నప్పటి నుంచి ఏజెన్సీ ఏరియా అన్నా కొండలు గుట్టలన్న భలే ఇష్టం , వాటి చుట్టూ తిరిగే కధలుంటే అందునా చేయి తీరిన రచయితలు రాసిన వంటే ఇక చెప్పక్కర్లేదు. బహుశా వంశి గారికి కూడా అలాంటి ఇష్టమే ఉంది అనుకుంటా.

ఆ పుస్తకం మొదటి సారి చదివి నప్పుడు ఒక విచిత్రమైన పోలిక తో కూడిన జ్ఞాపకం, చాలా ఏళ్ళ క్రితం వృత్తి పరం గా నాకో స్నేహితుడుండే వారు వయస్సులో నాకన్నా ఇరవై ఏళ్ళు పెద్ద. వృత్తి రైల్వే కాంట్రాక్టర్, కెరీర్ లో అప్పుడప్పుడే పైకి వస్తున్న నాకు ఆయన వ్యాపార దక్షత చూస్తే భలే ఆశ్చర్యం గా ఉండేది. ఆయనింటికి ఎప్పడన్నా మధ్యాన్నం వెళితే భోజనం చేస్తూ నన్నూ రమ్మనే వారు. నేను చేయనని ఒద్దంటే కొంచం టిఫిన్ తినండని, భార్యకు పురమాయించే వారు. మీరు నమ్మరు ...ఆమె సుమారు పదిహేను అంగుళాల వ్యాసమున్న పెద్ద ప్లేట్ లో రకానికొకటి చొప్పున కజ్జికాయ, పాలకోవా, లడ్డు , జిలేబీ చుట్ట, బర్ఫీ, నాలుగు గవ్వలు రెండు చేగోడీలు, ఒక జంతిక , గుప్పెడు కారప్పూసా, గరిటెడు బూంది, ఇలా మొత్తం నింపేసి , ఆయన భోజనమయ్యే లోపు ఈ కాసిని నమలండి అని తెచ్చిపెట్టేది. నేను అన్నీ ఒక్కక్కటే తింటూ, లడ్డు మధ్య లో చేగోడి కొరికి, కారప్పూస తింటూ కోవా కొరికి, ఇలా చాలా హడావిడి పడేవాడిని. విడివిగా తిన్నా, కలిపి తిన్నా, కొంచం కొంచం తిన్నా, మొత్తం తిన్నా భలే రుచి గా ఉండేవి తియ్యగా కమ్మగా ఆ స్నేహితుడి ప్రేమంత హాయిగా, ఆమె అభిమానమంత చల్లగా.

అలాగే ఈ కధలు చదువుతూ అనుభూతి పొందుతూ ఒక కధ లోంచి ఇంకో కధ లోకి, ఒక పేజీ లోంచి ఇంకో పేజీ లోకి దూకుతూ అవి సంకలన పరచిన వంశీ గారి అభిరుచి కి జేజేలు చెప్పుకుంటూ ఉంటాను.
ఈ పుస్తకాన్ని సమీక్షిస్తూ చాలా బ్లాగుల్లో టపాలు వచ్చి ఉండొచ్చు. అయినా వంశీ ని ఇంతగా ప్రేమిస్తూ నేనూ మెచ్చుకోలు మాటలు రాయక పోతే చదివిన పుస్తకం లో లైనులు లెక్క పెట్టినంత పాపం.

చివరగా పైన చెప్పిన పోలిక లోని నా మిత్రులు శ్రీ ..... గారు ఎంతో పెద్ద వ్యాపారవేత్త అయుండి, విధివశాత్తు ఆర్ధికం గా దెబ్బతిని, కనుమరుగై ఎక్కడో దూరంగా మళ్ళీ జీవితం ప్రారంభించారు.
అయన మళ్ళీ బాగా పుంజుకుని పూర్వపు వైభవం తెచ్చుకుని, అయన భార్య నాకు థాలీ నిండా తినుబండారాలు పెట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...

3, ఏప్రిల్ 2011, ఆదివారం

తెలుగు బ్లాగుల్లో ఉగాది పురస్కారాలు

(ఫోటో గూగుల్ ఇమజేస్ నుంచి గ్రహించ బడినది )
ఖరనామ
సంవత్సర ఉగాది !! బ్లాగ్ లోకం లో ఒక మరపురాని యుగాది. ఏదో ఎవరి గోలలో వాళ్ళు గా రాసుకు పోతున్న బ్లాగ్ మిత్రులందరికీ ఒక నిజమైన పండగ గా అవతరించింది. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ పూనుకొని బ్లాగులని, బ్లాగ్ రచయితల్నీ కూడా సాహితీ సేవకులుగా గుర్తించి, గత సంవత్సర కాలం లో వాళ్ళ కృతులన్నీ పరిశీలించి వివిధ విభాగాలుగా విభజించి, అందులో చక్కటి రచనలకు పురస్కారాలు ప్రకటించింది.
వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

మొదట గా
సాహిత్య / పద్య విభాగం లో నమోదై నిత్యం కవితా పూరణ మీద అద్వితీయం గా బ్లాగ్ నడుపుతున్నకొన్ని బ్లాగులు
శ్రీ నింపే సమస్యా రావు గారి "చేతనైతే పూరించు "
శ్రీ ఎర్ర మల్లెలయ్య గారి "విప్లవ నాదం"
శ్రీ గోల బుల్లెస్వర రావు గారి "పద -రోద"
శ్రీ హరి విశ్వాసం గారి " నిత్య దైవనుతం "

శ్రీ నింపే సమస్యా రావు గారి : " చేతనైతే పూరించు "
బ్లాగ్ కి ఉత్తమ బ్లాగ్ గా నిర్ణయించట మయినది.
వారి బ్లాగ్ లో ఒక మచ్చు తునక
సమస్యా: ' ...బండ గా హాయైన నిదుర బోయే !!'

పూరించిన వారు అపర చాకచక్యం గారు :

"బగలంత సీరియళ్ళు చూసి మరువంగ
ఆహార నియమము విడువంగ పిల్లలున్
భర్తయున్ అలసి నింటికి చేరంగ సొలసిన యా
పడతి ఫోమ్ బెడ్ పై బండగా హాయైన నిదుర బోయే:"

ఆధ్యాత్మికం
విభాగం లో స్వదైవ నమస్మరణ పర మతదూషణ బాగా చేసిన కొన్ని బ్లాగ్ నమోదులు
శ్రీ రామదాసు గారి "అంతా రామమాయం .."
శ్రీ భోలేనాద్ గారి " జై బోలో శంకర్ "
శ్రీ తుకారం గారి "నిత్య జీవితం లో దైవ స్మరణ"
శ్రీ రెట్ట మతబాబు గారి " మా మతమే మతం"
శ్రీ వికారి గారి " మీ దేవుడికేం రావు...."

విభాగం లో శ్రీ వికారి గారి బ్లాగ్ "మీ దేవుడికేం రావు..."
అందులో ఒక ముచ్చు విరుపు
" ............ఫలానా మతం వాళ్ళు ఊరికే రొద పెడతారుగానీ, వాళ్లకేం తెలీదు. చాందసం గా ప్రవర్తించటం తప్ప. అసలా
మాట కొస్తే వాళ్ళ దేవుడికే ఏమీ తెలీదు.
అజ్ఞాన వర్గాల భోగట్ట ఏంటంటే వాళ్ళ దేముడు వారానికోసారి హెలికాప్టర్ లో అర్దరాత్రి దిగడి పోయి మన దేవుడిని భక్త జన
ఆకర్షణ కిటుకులూ,ధర్మ సందేహాలు అడిగి తెలుసుకొని, తెల్లారి ఏమీ ఎరగనట్లు కూర్చుంటాడట "

సాంకేతికం
విభాగం లో నమోదైన బ్లాగులు
శ్రీ టెక్నో రావు గారి " మీరూ మీ కంప్యూటరు"
శ్రీమతి విద్యుల్లత గారి " షాకుల్లేని కరెంట్ "
శ్రీ జాకీ గారి " మీకు కారుందా..."

విభాగం లో శ్రీ విద్యుల్లత గారి "షాకుల్లేని కరెంటు "
అందులోని చిన్న షాక్
" సారి నా బ్లాగ్ టపా లో కరెంట్ వాడకం - పొదుపు లో మెలకువల గురించి రాస్తాను. ఎంతో మంది అభిమాన
చదువరుల కోరిక పై ఎలెక్ట్రిక్ ఇంజనీరు నైన నేను ఒక ఉపయుక్తమైన టపా రాయాలని ఇది మొదలెట్టా..
సాధారణం గా మన అతివలు వంటింట్లో
మిక్సీ, గ్రైండర్ , ఓవెన్, కరెంటు స్టవ్వులు, ఇంకా బాత్ రూములో గీజర్లు, ఇలా ఎన్నో కరంటు పరికరాలు వాడతాము. వాడి మళ్ళీ బిల్లోచ్చాక బెమ్బెలేట్టటం మామూలే ...
అలా బిల్లు రాకుండా చూసేందుకు కొన్ని చిట్కాలు
మిక్సీ లో పచ్చళ్ళు చేయకుండా రోట్లో నూరుకోండి, అలాగే ఇడ్లీ పిండి కూడా అందులోనే కానిచ్చేయండి.
ఓవెన్లు , కరెంట్ స్టవ్వులు కరంటు బాగా లాగుతాయి కాబట్టి అసలవి కొనకుండా ఉంటె బిల్లు తగ్గు, ఇంకా డబ్బు ఆదా.
బాత్రూం లో గీజర్ విషయం లో .. స్నానానికి గంట ముందు బకెట్ నీళ్ళు డాబా మీద ఎండలో పెట్టి ఆనక అక్కడే స్నానం
చేస్తే కరంటు సమస్యే లేదు.

హాస్యం
విభాగం లో నమోదైన కొన్ని పువ్వులు
శ్రీ రుబాబు గారి : "నవ్వండి బే..."
శ్రీమతి మటం మోహ గారి : " నవ్వొస్తే ఏమనుకోవద్దు .."
శ్రీ చిరు నగేస్వరరావు గారి : "ముసి ముసి "
శ్రీ అడవి ఆర్భాటం గారి : "వికటాట్ట హాసం "

హాస్య
విభాగం లో కూడా ఆడ లేడీస్ కే పట్టం కట్టాం
శ్రీమతి మటం మోహ గారి "నవ్వొస్తే ఏమనుకోవద్దు .." లో ఒక తటపాయింపు
" సారి టపా లో కూడా ముందుగా మీ అందరినీ క్షమించమని కోరుకుంటున్నా, ఎందుకంటే క్రితం రాసిన టపా లోని
హాస్య తరంగం మిమ్మల్ని అంతగా తడప లేక పోయిందని మీ వ్యాఖ్యల ద్వారా తెలిసి కొంచం ఫీలయ్యా.
అందుకే ఈసారి రాసే జోక్స్ మిమ్మల్ని అంతగా అలరిస్తాయో లేదో అని నేను తటపాయిస్తున్నా ఏమైనా తిరిగే కాలు తిట్టే
నోరు రాసే బ్లాగు ఊరికే ఉండవని నానుడి కదా అందుకే మరికొన్ని జోక్స్ టపా లో పొందుపరుస్తున్నా.
దయచేసి ఏమనుకోకండి ......."
ఇలా సాగింది

సినిమాలు - పాటలు
విభాగం లో వెల్లువెత్తిన కొన్ని కెరటాలు..
శ్రీ పనిలేని గాలేష్ గారి " బాక్సాపీసు "
శ్రీ ముసలి వయోజన్ గారి "సినిమా కనుమా"
శ్రీమతి చిత్రా చలన్ గారి " నా పిచ్చి- సినిమాలు "
శ్రీ తరుణ్ హరన్ గారి " హాలుకే అంకితం "
శ్రీ సినికపి గారి "సినిమా పాటలు -క్విజ్ "

విభాగం లో రెండు పురస్కారాలు ఇచ్చాం
శ్రీ తరుణ్ హరన్ గారి "హాలుకే అంకితం "
టపా : నా వారాంతాలు ..టపా లోంచి రెండు వాక్యాలు
నాకు సినిమా అంటే ఎంత పిచ్చి అంటే మాటల్లో చెప్పలేను. అందుకు కారణం కూడా ఉంది లెండి, నేను పుట్టిన ఆసుపత్రి
డాక్టర్ కు రెండు సినిమా హాళ్ళు ఉన్నాయి, హాళ్ళు, ఆసుపత్రి ఒకే భవన సముదాయం లో ఉన్నాయి, డాక్టరూ నర్సులూ బేరాలేనప్పుడు టికెట్లు చింపే పనిలో ఉండే వాళ్ళుట అలాంటి చోట పుట్టిన నాకు మాత్రం సినిమా పిచ్చి లేక పోవటం తప్పుకదా. అందుకే వారాంతాలు రెండు రోజులూ సినిమా హాళ్ళలో గడిపేస్తూ ఉంటాను . మిగతా అయిదు రోజులూ ఆఫీస్ లో ఎలాగు ఆన్ లైన్ మూవీస్, డివిడి లలో చూస్తూ ఉంటాలే... ఇలా నిరంతరం కాల హరణ సినిమాల ద్వారా చేస్తూ తరిస్తూ ఉంటాను...- మీ తరుణ్

రెండో టపా
శ్రీ సినికపి గారి "సినిమా పాటల -క్విజ్ "
లో ఒక ప్రశ్నా శరం
పాట ఎందులోది ? పల్లవి, సందర్భం రెండూ రాయండి
'.....నువ్వు చెయ్యలేక మంగళ వారం అన్నావే ...'
జవాబు గా
తాయారు " చిత్రం : పక్కలో బల్లెం "
పల్లవి : అనుకున్నా నేననుకున్నా నీకు చేతగాదని అందుకే ఇలా ....
అందులో హీరోయిన్ జనమాలి హీరో సాకుల్రావ్ కు గడ్డి పీకటం రాదనీ ఆట(?) పట్టిస్తూ పాడే అల్లరి సాంగ్
సినికపి : తాయారు గారు ఈసారి కూడా మీరే ముందు కరక్ట్ సమాధానం రాసారు. హాట్స్ ఆఫ్
అసలంత తయారు గా ఎలా ఉంటారు తాయారు గారూ ..?

ఇక వంటా- వార్పూ విభాగం లో నమోదులు
శ్రీమతి అమృతహస్తం గారి : మా పాకాల వంటలు
శ్రీమతి పుష్టి వర్ధని గారి : మృస్టాన్నం
శ్రీమతి ఆశ గారి : పెసర మొలకలు
శ్రీ గరిట తిప్పేస్వరరావు గారి : " మోగాళ్ళే వంటలో మొనగాళ్ళు "

వంటా-వార్పూ విభాగం లో
శ్రీమతి ఆశ గారి " పెసర మొలకలు " లో ఒక మొలక టపా
" కొత్తిమీర తరుగుడు లో మెళకువలు "
అందులోంచి కొంత తరుగు (అంటే తరిగినది అని)

కొత్తిమీర రోజూ వాడతాం. అయితే అది తరుక్కోవటం కొంచం కష్టమని కొంతమంది చదువరులు నన్ను ఒక టపా
రాయమని కోరారు
వాళ్ళ కోరిక మీద టపా తరిగాను, సారీ రాసాను.
ముందుగా కొత్తిమీర కట్ట నీళ్ళలో ముంచి వెల్ల కున్న మట్టి పోయే దాకా కడగాలి
కట్ట విప్పకుండా కట్టింగ్ ట్రే మీద పెట్టి కుడి చేత్తో కట్ట ఆకులు చేతి కింద వచ్చేలా పట్టుకొని వేళ్ళు బయటకు ఉండేలా
చూస్కోవాలి, ఇప్పుడు కత్తి ఎడమ చేత్తో పట్టుకొని జాగ్రత్తగా కోయాలి. ఇప్పుడు తరిగిన వేళ్ళు బిన్ లో పారేసి ఆకులు మాత్రం చిన్న చిన్న గా తరుక్కోవాలి. ఇలా తరిగిన ఆకులు కూరల్లో, చారు లో, పప్పు లో వేసుకోవచ్చు. కుడి చేతి వాటం వాళ్ళు నే చెప్పిన పద్ధతి రివర్స్ లో చేయ్యాలండోయ్. నాది ఎడమ చేతి వాటం లెండి.

ప్రత్యేక పురస్కారం గా తిప్పేస్వరరావు గారి టపా బంగాళ దుంప ఎపుడు కి ఇవ్వబడింది.
దాంట్లోంచి
చిన్న ముక్క
" సనాదారాలు గాలి తిరుగుడు తిరక్కుండా ఇంటికాడనే ఉన్న గా, అందుకే నోటికి కారం గా ఏదన్నా తినాలనిపించి
కూరల బుట్ట ఎతికా ... నాలుగు పెద్ద దుంపలూ
రెండు బుడ్డ ఉల్లి గడ్డలు కానడ్డాయి. ఎంటనే అవి తరిగి, పొయ్యి మీద మూకుడెట్టి అందులో రెండు కిలోల చమురేసి
ముక్కలు ఏపేసి ఆనక పావుకిలో ఉప్పు కారం దూసేసి, ఏడి అన్నం లో ఏస్కోని కుమ్మేసా....."

ఇక పోతే మిగతా చిల్లర బ్లాగుల్లో

శ్రీ భేతాళ్ గారి బాక్స్ బద్దలు కొడతా
"...నాయాల్ది నాకొడుకులు అసలు మా కులపోల్ల జోలికొస్తే సారి నా బ్లాగులో రక్తం కారేలా (ఎవరికి?) రాస్తా .......

శ్రీ
లడ్డు గారి గారి " తినదగు నెవ్వరు పెట్టిన "
" రోజు కూడా ఎప్పటిలాగే మా ఇంట్లో భోంచేసి పక్క వీధిలో ఉన్న మా చిన్నక్క ఇంటికేళ్ళా, వాలింట్లో పూట
తలకాయ మాంసం, ఇంకా తప్పేదేముండీ మళ్ళీ కూర్చున్న బోయినాలకి...."

శ్రీ చలనం గారి " మగాడు తిరక్క చెడ్డాడు "
"...జంట నగరాలలో ఉన్న అందమైన ఆడాల్లందరూ ఎమన్నా ఇబ్బంది వస్తే( ఏమి ఇబ్బంది?) నా నెంబర్ కి ఫోన్
చెయ్యండి నేను అంతుచూస్తా ఇబ్బందిదేలే... "
( బ్లాగ్ లో రచయిత అందమైన ఫోటో అదుర్స్ ..మరియూ ఉచితం కూడా)

శ్రీమతి ఉల్లాస గారి "మనసా కొట్టుకోకే "
"....పేరుకి ఆనందం గా ఉన్నా నా మనసెప్పుడు ఎందుకో ఒకందుకు కొట్టుకుంటూ ఉంటుంది, ఎందుకో తెలీదు, తెలిస్తే
చెబ్దురూ ......"
శ్రీ మొగ్గ గారి " సరసం విరసం "
" అప్పుడు నేను ఇంటర్ ఐదో సంవత్సరం చదువుతుండే వాడిని , మా పక్క ఇంట్లో కొత్తగా ఒక జంట అద్దెకి దిగారు, ఆమె
బాగుంది కదా అని మొదటి రోజే లైను వేసా
వారం తిరిగే సరికి వాళ్ళ అయన లైను లో నేనే పడ్డా, ఇప్పటికీ ఆయనా నేను ఇద్దరం కలుస్తూనే ఉంటాం. సరదాయే
వేరు.

శ్రీమతి మృణ్మయ గారి " నా కెమెరా విన్యాసం "
రోజు మా పెళ్లిరోజు గుడి కెళ్ళాం. శ్రావణ మాసం అవటం వల్ల అమ్మవారి గుడి బాగా రష్ గా ఉంది పూజారిగారు శఠ
గోపం పెట్టి అక్షింతలు వేసారు.గుడి లోంచి బయటకి వచ్చేసరికి సన్నగా వాన, రొమాంటిక్ గా ఉంటుందని తడుస్తూనే ఇంటికేల్లాం, మా అయన వెనక నుంచి వచ్చి నా తలలో ఏవో చిన్న చిన్న మొలకలు ఉన్నాయని చెప్పారు, వెంటనే చూస్కుంటే అవి అక్షింతలు వానకి మొలకలోచ్చాయి. అద్దంముందు నా కెమేరాతో నేనే ఫోటో లు తీస్కున్నా
బుజ్జి ముండలు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి
(స్థలా భావం వల్ల ఫోటోలు ఇప్పుడు పెట్టలేదు)

శ్రీ చంచా గారి " విపరీత నటుడు చిరాయువు "
మన అభిమాన నటుడు చిరాయువు ఆయన తమ్ముళ్ళు మేనల్లుళ్ళు, మనవళ్ళు నటించిన చిత్రాలు వారం విడుదల
సందర్భంగా అందరికీ (మాకెందుకూ ?) అభినందనలు .....

వీరందరికీ ప్రత్యేక ప్రశంసా పత్రాలు ఇవ్వబడతాయి.

ఇంకా
వేరే వాళ్ళని బూతులు తిట్టటానికి, దుమ్మెత్తి పోసే బ్లాగులను పరిశీలించి అనర్హం గా నిర్ణయించాం.
రాష్ట్ర ప్రభుత్వం మాదే కనుక మా పార్టీ కి వ్యతిరేక బ్లాగులు ప్రతిపక్ష అనుకూల బ్లాగులూ చూడనే లేదు.
విమర్సలకు బెదిరి అసలు రాజకీయ బ్లాగులనే పక్కన పెట్టాం.

కొస మెరుపు: అందరి మీదా పడి ఏడ్చే ఆత్రేయ బ్లాగ్ " లిపి లేని భాష " తీసి తుంగలో తొక్కాం.

ఇది
సరదా కోసమే కానీ ఎవ్వరినీ కించపరచాలని కాదు.








1, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఇది చదివితే మీరూ....


ఏప్రిల్ ఫస్ట్ పండగ : ఈ ఫూల్స్ డే ఆనందం, ఎదుటి వాళ్ళని వెధవ (ఫూల్) ని చేసి ఆ కాసేపు పడే సరదా ఎలా గుంటుందో మన అందరికీ తెలుసు.
మళ్ళీ కొత్తగా చెప్పేదేముంది ?
చాల రోజుల క్రితం చదివిన మార్క్ ట్వైన్ కొటేషన్ గుర్తుండి పోయింది. "ఏప్రిల్ ఒకటి: ఈ రోజు, సంవత్సరమంతా మనమేంటో గుర్తు చేసే రోజు."
రోజులాగానే నిన్న కూడాహాస్టల్ లో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేసి కాసేపు కబుర్లు చెప్పి రేపు ఏప్రిల్ ఫస్ట్ కదా అందరినీ ఫూల్ చేస్తారా నువ్వు నీ ఫ్రెండ్స్ అని అడిగా..
ఏమైనా ఇళ్ళకి ఫోన్ చేసి అమ్మ నాన్నలకీ పెద్దలకీ ఫోన్ లో ఫూల్ చెయ్యటం కోసం ఏదన్నా బాధాకర మైన విషయం చెప్పకండి కంగారు పడతారు. కాసేపైనా సరే ఆ కంగారు భరించ లేనిది అని నీతి సూత్రం చెప్ప బోయా
వెంటనే మా అమ్మాయి " ఏ కాలం లో ఉన్నావు నాన్నా నువ్వు, ఇంకా అలా ఎందుకు చేస్తాం, అయినా మేమే పెద్ద ఫూల్స్ ఇంకోళ్ళని చెయ్యటమా? అంది.
అదేంటి అని ఆరా తీసా
ప్రతి పరీక్ష ముందు బాగా చదివి నట్లనుకుని, రాసి, ఈ లోపు అందరికీ బాగా రాసా నని చెప్పుక్కొని ,తీరా రిజల్ట్స్ వచ్చాక మార్కులు పెద్ద గా రాక ఫూల్స్ అవట్లేదా? కొత్త గా అయ్యేదేముంది అంది.
సరదా చెప్పినా ఈ సూత్రం మన అందరికీ వర్తిస్తుందని అనుకున్నా.
కొస మెరుపుగా ఇంకో విషయం చెప్పింది "మనం ఎవరినన్నా ఫూల్ చేసాం అంటే అది మన తెలివి కాదు,
ఎదుటి వాళ్లకు మన మీద ఉన్న విశ్వాసం, దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరినో ఫూల్ చెయ్యటమంటే మనని మనం ఫూల్ చేస్కునట్లే " అంది.
నాకు జ్ఞాన నేత్రం తెరుచు కుంది.

ఈ విషయం మాత్రం నిజం,

మనం...
మనం ఎప్పటికీ వెధవలమే.
మనం గుప్పెడు నోట్ల తో బజారు కెళ్ళి
వీసెడు సరుకుల తో చప్పుడు చెయ్యకుండా ఇంటి కొచ్చి
మౌనం గా బాధ పడే మంచి వెధవలం..
మన పన్నులతో జీతాలు తింటూ మన పనికే లంచం అడిగితే
ఇవ్వక తప్పని నిస్సహాయులం...

మనం

చేసే పని లంచం తో కొలుస్తూ, దేశాన్ని తొలుస్తూ
సొంత ఇంటికే కన్నం వేస్కునే దొంగ వెధలం.
మనం
ఎవడి వెనకో ఝండా పట్టుకు తిరుగుతూ
అదంతా ప్రజా సేవ అనుకుంటూ
కుటుంబాన్ని దేవుడికి ఒదిలేసే కార్యకర్తలం...
రోజు కష్టాన్ని, రెండు గంటల సినిమా చూసి,
ఆ ఆనందంతో డబ్బుని, కష్టాన్ని ఒదిలించుకునే సరసులం.

కష్టాలనీ, దు:ఖాన్ని, ఒక్క గుక్క మద్యం తో కడిగేసి

సుఖం గా ఉందామనుకునే నిషారాబులం..
షేర్ మార్కెట్ మెట్లమీద, దున్నలతో తన్నించు కుంటూ, ఎలుగుతో గీరించు కుంటూ..
అయినా అక్కడే, పోయిన సంపద నెతుక్కునే అశాజీవులం,
మనం
జూదపు ముక్కల రవ్వడిని, గుర్రపు డెక్కల సవ్వడినీ,
వింటూ జీవితాలని పణం పేట్టే ధర్మ రాజులం....

మనం

మన వోట్లతో మన నెత్తికెక్కి, మనలో మనకి కీచు లాటలు పెట్టి
ఆ సందట్లో డబ్బు చేసుకునే నలుగురు వెధవల లో ఒక వెధవ నెన్నుకొని
వాడే సరైన నాయకుడు, వాడిని మించిన వాడు లేడు, రాబోడు

అనుకుంటూ రోజులు వెళ్ళ బోస్తున్న పెద్ద వెధవలం
అందుకే మనలో మనకి హ్యాపీ ఫూల్స్ డే !!!