
"రుడాలి " రాజస్థానీ పల్లెల్లో ఒక బీద వ్యవస్థ. ధనికుల ఇళ్ళల్లో ఎవరైనా చనిపోతే డబ్బులు తీస్కోని శవం పక్క ధీర్గాలు తీసే ఒక వృత్తి. వ్యవసాయం లేక, చేతి వృత్తులకు తగినంత ఆదరణ లేక పొట్ట కూటికి ధనికుల ఇళ్ళల్లో ఏడిచే అపశకునపు వృత్తి. పితరుల ఆత్మ శాంతికి పెట్టే పిండపుకూడు తినే కాకి కన్నా కనా కష్ట మైయిన వృత్తి. ఆ కాకి ఆకలి తీర్చుకోవటానికే ఆ పిండం తింటుంది మనస్పూర్తిగా ఆర్తిగా.
కానీ ఈ రుడాలీల వృత్తి తమ జీవితంతో సంభంధం లేని పరాయి వ్యక్తుల మరణంతో ముడివడి ఉన్న విచిత్ర మైన వృత్తి. దుఖం లేకున్నా చనిపోయిన వ్యక్తి కోసం ఎంతో భాద నటిస్తూ శోకం ప్రదర్శించే కల.
ఈ వృత్తి ఎలా పుట్టిందో ..? నేననుకోవటం ధనిక వర్గాల కుటుంబాల్లో మగవాళ్ళు చనిపోతే వాళ్ళకోసం బిగ్గరగా రోదించే అవకాశం ఆ కుటుంబాల్లో లేక, పరదాల చాటున మూగ గా రోదిస్తూ ఉంటే, బయట శవం దగ్గర మగ వాళ్ళు కూడా ఘంభీరం గా కూర్చొని ఉంటే ఆ చావింటి దుఖమయ వాతావరణం కోసం ఇలాంటి వృత్తి పుట్టిందేమో.
పేదరికపు వేడికి తాళలేక ఆ రాజస్థానీ స్త్రీలు ఇలాంటి వృత్తికి ప్రేరేరింపబడి ఉంటారు.
బీడు బడిన భూములలో వ్యవసాయప్పనులు లేక,
గ్రాసం లేక పాడి ఎండిపోతే ప్రాచీన కాలం లో పుట్టిన కొత్త వృత్తి "రుడాలీలు"
1993లో విడుదలైన ఈ చిత్రం నేను ఇప్పటికీ చూడలేదు. నేను చదివిన దాని ప్రకారం
కధ విషయానికి వస్తే తండ్రి మరణానంతరం తల్లి ఒదిలేస్తే దిక్కులేని ఒక పేద స్త్రీ 'శనిచరి'
బాల్యమే కాక వివాహం కూడా కష్టాల్లో ఒదిలేసిన తాగుబోతు భర్తతో తనకి కలిగిన మతిస్థిమితం లేని కొడుకుతో పేదరికం లో మగ్గుతూ కూడా ఎప్పుడు దుఖాన్ని ప్రదర్శించని దీరువు.
కానీ పైన చెప్పబడినట్లు పేదరికపు కోరల్లో ఇరుక్కుని
తన కొడుకు ఆకలి కోసం రుడాలీ గా మారి కృత్రిమ రోదన అలవాటు చేసుకుంటుంది.
ఆ క్రమం లో ఒక ధనికుని తో ప్రేమ(?) లో పడుతుంది.
ఎన్ని భాధలున్న ఎన్ని కష్టా లొచ్చినా ..
తన ప్రేమని అడ్డం పెట్టుకొని ధన సహాయం అడగని
శనిచరి అలా బాధలు పడుతూనే ఉంటుంది.
కధ విషయం లొ నాకు ఏ మాత్రం క్లారిటీ లేదు.. కారణం చెప్పాగా నేనా సినిమా చూడలేదు, సిడి కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు.
మీలో చాలా మంది చూసే ఉంటారు కాబట్టి నేను ఆ సినిమా రివ్యూ రాయను.
కానీ ఎందుకు ఆ సినిమా మీద ఈ టపా రాయాల్సి వచ్చింది ?
భూపేన్ హజారిక ... సంగీతం !! ముఖ్యం గా అయన స్వర పరచి స్వయంగా పాడిన "దిల్ హూం హూం కారే ఘబరాయే ..." అనే పాట నన్ను ఎంతగానో కట్టిపడేసింది.
భూపేన్ హజారిక స్వరం లొ ఉన్న ఆ ఆర్తి, ఘంభీరత, వ్యధ .. ఎన్ని సార్లు విన్నా నన్ను కూడా దుఖం లోకి తీస్కెలతాయి.
వెనక వచ్చే ఆ పహాడీ సంస్కృతి సంగీతం నన్ను ఎక్కడికో లాక్కెళ్తుంది.
ఇదే పాట లతా మంగేష్కర్ కోకిల స్వరం లొ కూడా ఉంది.
ఆమె గొంతులో ఈ పాట బెల్లం యాలకులు కలిపినా పానకం లా ఉంటే
భూపేన్ సాబ్ గొంతులో వింటే అదే పానకం లొ కొంచం మిరియాలు కలిసిన ఘాటు కూడా తోస్తుంది.
నాలాంటి వాత మనస్కులకు మిరియపు ఘాటు మంచిదే !!
ఈ టపా చదువుతుంటే వెనక వస్తున్న ఆ పాట మీలో చాలా మంది కి నచ్చిందని నాకు తెలుసు.( మీ స్పీకర్లు ఆన్ చేస్కొండి)
ఆ పాట ని తెలుగు లొ స్వేచ్చానువాదం చేశా .. తప్పులున్నా పాట మాధుర్యం లొ తేలిపోతూ నన్ను క్షమించేయండి !!
గుండె ధీర్గ శ్వాస తీస్కున్టోన్ది, భయంతో ఎగిసిపడుతోంది...
మేఘాలు ఉరిమినప్పుడల్లా.. మనసు ఇంకా భయపడుతోంది..
నా కనుకొలుకుల్లోంచి అప్పుడప్పుడూ ఒక చినుకు వర్షిస్తోంది...
గుండె ధీర్గ శ్వాస తీస్కున్టోన్ది, భయంతో ఎగిసిపడుతోంది...
నీ ముల్లె విప్పి పరిచి చూస్తే అన్నీ ఎండుటాకులే ఉన్నాయి ..
(కానీ) నువ్వు స్పృశించినపుడు ఎండిన నా మేను చిగురులు తొడిగి పచ్చబడింది..
గుండె ధీర్గ శ్వాస తీస్కున్టోన్ది, భయంతో ఎగిసిపడుతోంది...
నువ్వు తాకిన నా మేనుని ముడుచుకు దాచుకుంటున్నాను ..
ఏ మనసునైతే నీ కళ్ళతో చూడగలిగావో, ఆ మనసుని ఇంకెవరికి చూపగలను..?
ఓ చల్లని చందమామా.. నీ వెచ్చని వెన్నెల నా తనువుని దహిస్తోంది ..
నువ్వెక్కడో అంతరిక్ష గవాక్షం లో ....రెక్కలు కత్తిరించుకున్న అశక్తత తో నేను ఇక్కడ..
గుండె ధీర్గ శ్వాస తీస్కున్టోన్ది, భయంతో ఎగిసిపడుతోంది...
మేఘాలు ఉరిమినప్పుడల్లా.. మనసు ఇంకా భయపడుతోంది..
నా కనుకొలుకుల్లోంచి అప్పుడప్పుడూ ఒక చినుకు వర్షిస్తోంది...
గుండె ధీర్గ శ్వాస తీస్కున్టోన్ది, భయంతో ఎగిసిపడుతోంది...!!
నా కామెంట్ : చదవని పుస్తకం గురించి
వినని గీతం గురించి
చూడని సినిమా గురించి
మాట్లాడటం, రాయటం , పొగడటం , తెగడటం, ఏదైనా తప్పని నాకు తెలుసు !!
అందుకే ముందే చెప్పేస్తున్నా
ఈ టపా రుడాలి సినిమా గురించి కాదు
భూపేన్ దా గురించీ, అయన సృష్టి అయిన ఆ పాట గురించి
ఆ పాటని అంత మెచ్చేసుకునే ముందు అసలు రుడాలి వ్యవస్థ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశా.. చేసి చాలా నొచ్చుకున్నా. ఆ బాధ ఎంత వరకూ వెళ్లిందంటే ఒక పూర్తి రాత్రి ఆ పాట విన్నాను అవే ఆలోచనలతో పడుకున్నాను. కల్లో కూడా బాధ ఎక్కువయింది "ముఖపరిచయం లేని రుడాలీలు నా చుట్టూ చేరి ఏడుస్తున్నారు... మాకింతకన్నా మెరుగైన జీవితం లేదా ? ప్రకృతే కాక సమాజం కూడా చిన్న చూపు చూస్తోంది అని వాపోయారు."
నేను రాసింది " ఒక కళ్ళు లేనివాడు నాలుగు ఏనుగుల్ని వర్ణించి నట్లు ఉందని నాకూ తెలుసు "
అందుకే మళ్లోక్కసారి క్షమించేసి టపా ని చదవండి !!
చదివి, సలహా సహాయం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు !!