అమ్ము బర్త్ డే లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అమ్ము బర్త్ డే లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, అక్టోబర్ 2010, శనివారం

మీకు తెలుసా ఈ రోజూ....


విజయదశమి ఈ రోజూ ఇదే కాక 17 అక్టోబర్ నా జీవితం లో చాలా ముఖ్యమైన రోజు పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఉదయం 7 గంటలకి మా మామ గారినించి ఫోన్ వచ్చింది... మా అవిడ కి నొప్పులోస్తున్నాయంటే కొత్త పేట లో పద్మావతి ఆస్పత్రి లో జేర్చటానికి వెళ్తున్నాం అని. తొమ్మిది నెలలుగా లేని ఏదో టెన్షన్..... ఎందుకో తెలీని ఉద్వేగం... ఎక్కడో చిన్న భయం .....ఇవన్నీ కాక ఇరవై ఆరేళ్ళ వయసు లో ఉండే అర్ధం కాని ఒక రకమైన అయోమయ స్థితి .... ఇవన్నీ కలగలిపి నన్ను చుట్టేయగా , బైక్ మీద గుంటూరు వెళ్లాను. నేరుగా ఆస్పత్రి కే వెళ్లాను అప్పటికే మా ఆవిడని స్ట్రెచర్ మీద ఫస్ట్ ఫ్లోర్ కి మారుస్తున్నారు అక్కడ ఆపరేషన్ ధియేటర్ ఉందని.
మా ఆవిడ నేను దగ్గరకి వెళ్ళగానే నా చెయ్యి గట్టిగా పట్టుకుంది నా వల్ల కాదు ఇది అన్నట్టుగా చూస్తూ ..కొంచం ఏడుపు కొంచం నిస్సహాయం కలిసిన గొంతు తో నేను ... ఏమీ కాదు నీకేం కాదు అని గొణుక్కుంటున్నాను...అంత కన్నా ఏమీ చెయ్యలేరేమో ఎవరూ.. ఆ పరిస్థితి లో.

అంతకు ముందు వారం దాక ఇద్దరం బైక్ మీద తిరిగి సినిమాలు చూసి హోటల్లో తిని, ఇప్పుడు ఉన్నట్లుండి అలా హాస్పిటల్ స్ట్రెచర్ మీద చూడటం కొంచం కష్టమైన పని.
డెలివరీ కి ఇవన్నీ తప్పవ్ అన్న విషయం తెలిసినా ఏదో అమాయకత్వం. సరే సిసరియన్ చెయ్యాలి అంటూ హడావిడి చేసారు ... నాకూ అదే బెటర్ అని పించింది ఎవరికన్నా దెబ్బ తగిలినా మా ఆవిడ ష్ ష్ ష్ అబ్బ అబ్బా అంటుంది ఇక తను పురిటి నొప్పులు పడటమా చాలా కష్టం. అంచేత సిసరియన్ కి తయారయ్యాం.

తొమ్మిదింటికి ధియేటర్ లోకి వెళ్ళారు ..నేను, మా మామ గారు, అత్తగారు , మరదలు బయట సినిమాల్లో లా కూర్చున్నాం. పది గంటల పదికి నర్స్ వచ్చి తెల్లటి టర్కీ టవల్ లో చుట్టి లేత గులాబీ రంగు లో ఉన్న చిన్న పాపని దగ్గరకి వచ్చేదాకా చెప్పలేదు ఆడో మగో దగ్గరకి వచ్చాక మొదటగా చేతుల్లోకి తీస్కున్నది నేనే ....గులాబీ మొగ్గలా లేత రంగులో , కాశ్మీరీ ఆపిల్ ల పెద్ద బుగ్గలతో.. పిస్తా పప్పంత చిన్న చట్టి ముక్కుతో చెర్రీ లాంటి పెదాలతో ... నీకోసం ఒకటి తెచ్చానోయ్ అన్నట్టుగా ముడుచుకున్న గుప్పెళ్ళతో నర్స్ చేతిలోంచి నా చేతిలోకి వచ్చిన నా కూతురు .. నా ఒక్కగా నొక్క కూతురు ఆడయినా, మగ అయినా ఒక్కళ్ళే చాలని మేము నమ్మిన సిద్ధాంతానికి ప్రతీక గా మా కూతురు ... నిజాయితీ గా చెప్పాలంటే ఆస్పత్రి లో ఒకే ఒక క్షణం నేను ఆడపిల్లను పెంచాలి అన్న చిన్న భయం .. అది మన రక్తం లోనే ఉందేమో కుటుంబపరంగా, సమాజం నుంచి, ఇంకా మన భారత జాతి కి ఉన్న ఆ చిన్న అనుమానం ..ఆడ పిల్ల భారం భాద్యత అన్న అవకర భావం. ఒకే క్షణం నేను ఆ భావనకి గురయ్యా.. వెంటనే ఆ భావన పోయింది .. అప్పుడు నాకనిపించింది నేనూ సగటు భారతీయుడినే అని. ఒకే ఒక్క క్షణం అంతే.. మళ్ళీ ఎప్పుడూ అలా అనుకోలేదు.


కావ్య ...పేరు కి కావ్య కానీ నేను పిలవని పేరు లేదు కావీ, కాయా , స్వీటూ , హాటూ, బంగారం , నానీ , అమ్మూ, చిన్నూ.. ఇలా ఎలా తోస్తే అలా పిలుస్తా నా కూతురుని..
పుట్టినప్పటి నుంచి ప్రతి ఏడాదీ 365 రోజులు పండగే పన్నెండు నెలలు .యాభై రెండు వారాలు , ఇంట్లో ఉన్న ఆఫీసు లో ఉన్న నా కూతురిని తలచుకొని క్షణం లేదు.
మొదటి పుట్టిన రోజూ నుంచి ఇప్పటి దాక ఎంతో బుద్ధిగా, దేనికీ పేచీ పెట్టక , నాకో మంచి నేస్తం .. సినిమాల గురించి చెప్పినా .. వాళ్ళ స్కూల్ విషయాలు చెప్పినా,
ఏదైనా బుక్ చదివి దాని గురించి చెప్పినా , ఏమైనా ఆ వివరణ కధనం ఎవరివల్లా కాదు, అందుకేమొన్నటి దాక మా అమ్మ రాత్రి పడుకునే ముందు ఒక గంట ఏదోటి చెప్పించుకొని పడుకునేది ... ఎల్కేజీ లో చేర్చి స్కూల్ లో ఎలా ఉందొ లంచ్ తిన్నదో, కక్కుకున్నదో .. అని మధ్య మధ్య లో స్కూల్ కి వెళ్లి చూసి వచ్చేవాడిని.
ఇప్పుడు ఇంజనీరింగ్ లో చేరి హాస్టల్ లో దూరం గా ఉంటూ... ఫోన్ లో కుదిరినంత న్యాయం చేస్తోంది.

ఈరోజు మా అమ్మాయి పుట్టిన రోజూ పద్దెనిమిదో పుట్టినరోజు .... మా బంగారం పుట్టిన రోజంటే ఒక నెల ముందు నుంచే ఎంత హడావిడి పడేదో... కొత్త డ్రెస్ లని .. కొత్త చెప్పులనీ , పార్టీ ఎవరికి ఎక్కడ ఇవ్వాలని పన్నెండింటికి ఎవరు ముందు గ్రీట్ చేస్తారోనని ఇలా రక రకాలుగా టెన్షన్ పడుతూ మమ్మల్ని పెడుతూ ఇలా గడిపేది ..


కానీ ఈసారి మాకు దూరం గా ఉంది పార్టీ సంగతి అడిగితే చూస్తాలే కుదిరితే ఫ్రెండ్స్ కి ఇస్తానన్నది , కొత్త డ్రెస్ వేస్కో అంటే అబ్బ బోర్ అంది ...


మొదటి సారి మాకు దూరం గా పుట్టినరోజు చేస్కుంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా చదువై, పెళ్లి అయ్యాక ఎక్కడో ఉంటే మాకు ఎలా ఉంటుందో ...

ఏది ఏమైనా ఇవన్నీ తప్పవు.. నాలాగా కొన్ని కొట్ల మంది ఉండి ఉంటారు .....ఎప్పటి నుంచో .... నేను ఈరోజు కొత్తగా ఆ స్థానం లోకి వచ్చా కాబట్టి ..
ఇలా అనుకుంటున్నానా... వాళ్ళ సంగతి ఏమో కానీ నాకు మాత్రం లోపల దిగులు బెంగ ఉన్నాయ్ పైకి మాత్రం మేకపోతు ఘంభీర్యం ప్రదర్సిస్తున్నా..
నీకొక్కడికే కూతురుందా .. మరీనూ అనకండి ... కొత్త లో మీరూ ఇంతేనని నాకు తెలుసు .. మీరూ ఇంతేకాక పోతే ... మీరు మనుషులే కాదు ...ఆడపిల్ల ఉన్న
సగటు భారతీయులే కాదు ... ఆ మాట కొస్తే మగ పిల్లడున్నా సరే.... ఈ బెంగ తప్పదు !!
హాపీ బర్త్ డే నానీ ... బాగా చదువుకో.....!!!
బ్రేకింగ్ న్యూస్ : ఈరోజు నా బ్లాగ్ రెండో నెల పుట్టిన రోజూ కూడా .. అందుకే నా బ్లాగ్ కి కూడ యాపీ బడ్డే