
...ఆ ... ఎక్కడున్నాం ? నేను బ్లాగులు రాయడం మొదలు పెట్టటం ఏదేదో రాసేసి చదువరుల దగ్గరనుంచి మెచ్చుకోలు ఆశించటం, భంగ పడటం దగ్గర ఆగాం కదా.
ఎప్పుడూ ఆఫీసులో పనికి సంభందించి పట్టు మని పది వాక్యాలు కూడా రాసి ఉండను.
అలాంటిది ఒక పాతిక లైనులు టపా రాయాలంటే కష్టమే మరి.
ఫోన్ బిల్లూ, పచారీ లిస్టు, పేపరు హెడ్లయినులూ మాత్రమే చదివే అలవాటున్న వాడిని
విశ్వనాధవారి నవల బట్టీ పట్టమన్నట్టుగా ఉండేది నా పరిస్థితి.
బ్లాగు లో టపా రాయటం కోసం గంటలు గంటలు లాప్టాప్ ఒళ్లోపెట్టుక్కూర్చోని
వేడికి కాళ్ళ మీద వాతలు పడ్డాయి కానీ. మంచి వాసికల టపా రాయలేక పోయా.
పైగా ఆఫీసు నుంచి ఎప్పుడు ఇంటికెళ్ళిపోదామా, ఏమి రాద్దామా అన్న ఆలోచనే.
పేకాడే వాడికి నిద్ర లో కలల్లో పేక ముక్కలు కన పడ్డట్టు,
నాకు క్విల్ పేడ్, గూగుల్ ట్రాన్స్లిటరేషన్ పేజో కనపడేవి.
ఏదోటి రాసి పోస్ట్ చెయ్యటం. వెళ్లి పడుకొని ఏ రాత్రి రెండింటికో లేచి ఎవరన్నా చదివారా ?
ఎమన్నా కామెంట్లు పెట్టారా ? అని చూస్కోవటం.
ఇంట్లో వాళ్లకి ఇదేదో వ్యసనంలా అనిపించటం. చాలా భాధలు పడ్డాను.
పైగా చాలా రోజులు నేను బ్లాగ్ రాస్తున్నానని ఎవరికీ చెప్పలేదు.
చుట్టాలకీ, స్నేహితులకీ నా ప్రతిభ తెలియాలి, కానీ నేరుగా వాళ్లకి చెప్పలేను.
ఇలా మధన పడి చివరకి మెయిల్ లో (ఇంకో మెయిల్ ఐడి ) ఎవరో చెప్పినట్లు బ్లాగు గురించి డప్పు కొట్టాను.
ఇలా ఎలాగోలా ఒక పది మందికి నా బ్లాగు గురించి తెలియజేశాను.
కానీ అందరికీ నా బ్లాగ్ హాస్యనిలవసరుకు( ఫన్ స్టాక్ ) అయిపొయింది.
ఇలా పడుతూ లేస్తూ గత సంవత్సర కాలం గా నా బ్లాగ్ నెట్టుకొస్తున్నాను.
పెళ్ళిళ్ళల్లో, శుభకార్యాల లో కలిసినపుడు ఆంతా నాగురించి మాట్లాడుకొని నవ్వేసుకుంటున్నారు.( నా వెనకే సుమా )
ఇంక నా వల్ల కాదనుకున్నప్పుడు అన్నమయ్య సినిమా లో నాగార్జునలా తెల్ల గడ్డం పెంచి .. "అంతర్యామీ అలసితి సొలసితి ..... " అంటూ ఆపేస్తా ...
అప్పటిదాకా ఉగ్గబట్టుకొని ఉండండి.