వ్యాపారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వ్యాపారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జనవరి 2011, సోమవారం

చ ఉ వ్యా బే ?


ఆఫ్ఘన్ భాషలో తిట్టానని కోంపడకండి !! దాని అర్ధం
అ) చదువు - ఆ) ఉద్యోగం - ఇ) వ్యాపారం -
ఈ) బేవార్స్
ఏదో కేబీసీ లో ఆప్షన్స్ ఇచ్చినట్లు ఉందికదా? నేను చదువుకునే రోజుల్లో నాకున్న వివిధ ఐచ్చికాలు. అలా అనగానే చదువుకునే రోజుల్లో నాకు ఉద్యోగం వచ్చిందనో, లేక మా కుటుంబ వ్యాపారం చూసుకోమని మా పెద్దలు ఆఫర్ చేసారనో అనుకోకండి. అప్పట్లో కాంపస్ రిక్రూట్మెంట్స్ లేవు అసలు ఉద్యోగాలే కరువు రోజులు, ఇకపోతే వ్యాపారం మా ఇంట వంటా లేవు, మా నాన్న ఒక ఉద్యోగి మీదు మిక్కిలి నేను కూడా బాగా చదువు కొని మంచి ఉద్యోగం చెయ్యాలనే జి.ఓ కూడా మా ఇంట్లో అమలు లో ఉండేది.

ఇంకా నాకు ఉన్న ఆప్షన్లు ఏమి మిగిలాయి? అ) చదువు ఈ) బేవార్స్. ఇరవై ఏళ్ళ వయసులో వచ్చే జ్వరానికి చదువు ఒక
చేదు మాత్ర.
అంచేత ఆఖరి ఆప్షన్ ఈ) బేవార్స్ ఒక్కటే మిగిలింది. నిజం గా భలే మత్తుగా ఉండే ఆప్షన్. ఈ బేవార్స్ లో ఉన్న సుఖమేంటంటే ఏమీ చదవ కుండా, గాలికి తిరుగుతూ, ఫ్రెండ్స్ తో కబుర్లు, సినిమాలు, అప్పుడప్పుడు కంటికి నచ్చిన అమ్మాయి కనపడితే కోర చూపు విసరటం ( అంత వరకే ), అప్పట్లో బేవార్స్ అంటే చాలా వరకూ అంతే. ఇప్పుడైతే ఇంకా కొన్ని కలిసాయి, మందు, బాగా సరళీకరించబడిన సామాజిక ప్రవర్తనా నియమావళి, ఇంటర్నెట్, అయితే ఇవన్నీ చేసే వాళ్ళు బేవార్స్ అని నా ఉద్దేశ్యం కాదు.

అయినా నా ఈ టపా ఉద్దేశ్యం ఒక మంచి కధని పరిచయం చేయటం.
శ్రీ శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారు నాకిష్టమైన రచయితల్లో ఒకరు .

గ్రాంధికం కాకుండా వాడుక భాష లో, కాకపోతే పాత తెలుగువారి వాడుక భాషలో ఉండి, బాగా పాత తెలుగు వాసన వచ్చే ఆయన కధా వస్తువులు, కధనం నన్ను ఎప్పుడూ అయన కాలానికి తీస్కెళ్ళి విహరింప చేస్తాయి. బామ్మ మడి తో దాచుకొన్న పాత ఉసిరికాయ, చింతకాయ తొక్కు బయటకి తీసి ఫ్రెష్ గా తిరగ మోత వేసినట్లు విశాలాంధ్ర వారు అయన రచనలని ఒక దశాబ్ద కాలం పైగా వెలుగు లోకి తెచ్చారు. శ్రీపాద వారి రచనలు ఇంకా ప్రాచూర్యం లోకి రావాలి. ఈ తరం తెలుగు భాషా ప్రేమికులకు, చదువరులకు అంతగా అందుబాటు లో లేవు.

అయన పుస్తకం లో శ్రీపాద గారి పరిచయ వాక్యాలలో ఇలా ఉంది "శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారు కవి, పండితుడు, వైద్యుడు,వర్తకుడు." వర్తకపు ధోరణి అయన కధలు రెండు మూడింటి లో బాగా కనపడుతుంది.

అందులో ఒక కధ "
నలుగుర్ని పోషిస్తున్ననిప్పుడు" . ఈ కధ రాసిన కాలానికి బ్రిటిష్ పాలనలోనే ఉంది భారత దేశం. నిరుద్యోగ సమస్య లేదు.

ప్రధమ పురుషలో సాగే ఈ కధా నాయకుడు చెప్పిన విధం గా ....

అమలాపురం లో పద్దెనిమిదో ఏట స్కూల్ ఫైనల్ పూర్తి చేసిన సీతారాముడు అరవై ఏళ్ళ విధవరాలైన తల్లితో రాజమండ్రి చేరి అక్కడ అతికష్టం మీద నగర సంఘం లోనెలకి పాతిక రూపాయల జీతం మీద చిరు ఉద్యోగి గా చేరతాడు. ఇన్నీసుపేట లో సూరీరావు గారనబడే ఒక బట్టల వ్యాపారి ఇంట చిన్న భాగం లో అద్దెకి దిగుతారు. ఆ వచ్చే కొద్ది పాటి జీతం తో జీవితం పొదుపుగా లాక్కోస్తుంటారు ఆ తల్లీ కొడుకులు. కొంత కాలానికి కొన్ని కారణాల వల్ల నౌకరీ పోయి సీతారాముడు దిగులు పడుతుంటే సూరీ రావు గారు అయన కొట్లో గుమస్తా గా చేర్చుకుంటారు.


మెల్లగా ఆ బట్టల కొట్లో వ్యాపార లావాదేవీలు నేర్చిన కధా నాయకుడు, ఆ కొట్లోనే ఉన్న ఒక ముస్లిం దర్జీ దగ్గర కుట్టుపని మెళకువలు కూడా బాగా నేరుస్తాడు.

దాంతో దశ తిరిగి ఇంతై, వటుడింతై నట్లు ఆయన దర్జీ గా , బట్టల కొట్లో భాగస్వామిగా పెరిగి మంచి సంపాదన పరుడవుతడు. ఆనక ఆయన్ని ప్రోత్శహించిన సూరిరావు తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేసి స్నేహాన్ని బంధుత్వం గా మార్చుకుంటారు. ఈ కధలో చదువైన దగ్గరనుంచి వ్యాపారం లో లాభించే స్థాయి దాక సీతారాముడి కష్టం పట్టుదల చాలా సరళం గా నైనా మనసుకి హత్తుకు పోయేలా రాసేరు శ్రీపాద వారు. ఉద్యోగ వ్యవసాయ, వ్యాపారలనేవి ఎ ఒక్కరి సొత్తు కావు ఎవరు ఏ పనైనా చెయ్యొచ్చు. కష్టపడే నైజం, కొద్దిపాటి తెలివి ఉండాలే గానీ ఎ ఉద్యోగం ఇవ్వలేని సంపాదన, తృప్తీ వ్యాపారం ఇస్తుందనీ, కులానికి బ్రాహ్మణుడైన సీతారాముడు వ్యాపారం లో ఎలా నిలదొక్కుకున్నాడో చెప్పే ఈ కధ ఇప్పటికీ ఎంతో మందికి మార్గదర్శకం.

చదివిన చదువుకు వచ్చిన ఉద్యోగం సరైన ప్రతిఫలం ముట్ట చెప్పలేక పోతే ఏమి చెయ్యాలో, ఏమి ఒదలాలో, ఏమి పట్టుకోవాలో సూటిగా చెప్పే ఆ కధ నా కాలేజి రోజుల్లో చదివా, అది బాగా నాటుకుపోయింది, టపా మొదట్లో ఉదహరించినట్లు చదువా ? ఉద్యోగమా? వ్యాపారమా? అన్న స్థితి లో నేను డిగ్రీ చదివే రోజుల్లోనే చాలా చిన్న స్థాయి వ్యాపారం చేసేవాడిని. మా అమ్మ నాన్నలు, అమ్మమ్మ మొదలగుగా పెద్దలు బట్టలు కొనుక్కోమని ఇచ్చిన డబ్బులు పోగేసి వాటితో పాతికేళ్ళ క్రితం 80' ల్లో బాగా మోజు లో ఉన్న విడియో కాసేట్ అద్దెకి తిప్పే వ్యాపారం చేసేవాడిని. ఆ పని నేను ప్రత్యక్షం గా చేయకుండా నా డబ్బులతో కొన్న కేసెట్ల ని ఒక విడియో కొట్లో ఇచ్చేవాడిని, అయన ఒకో కాసేట్ కి ఇరవై రూపాయలున్న అద్దె లో సగం ఇచ్చేవారు. ఏదో బానే ఉండేది, నా ఖర్చులకి సరిపడా. కాక పోతే ఈ విషయం పెద్దలెవరికీ తెలియ నిచ్చే వాడిని కాదు, తిడతారనే భయం తో.


ఈనాటి పరిస్థితులకు ఈ కధ ఎంతగా వర్తిస్తుందో, కానీ సుమారు డెబ్బై ఎనభై ఏళ్ళ క్రితం శ్రీపాద వారి తెగువ రచనా పరంగా నైనా సరే నాలాటి వాళ్లకు శిరోధార్యం.