క్రిస్మస్ శుభాకాంక్షలు !! క్రిస్మస్ అంటే నాకున్న జ్ఞాపకాలు బందరు చుట్టూనే తిరుగుతాయి. హిందువు గా పుట్టిన మా ఇంట్లో క్రిస్మస్ ని పండగ గా చేస్కోవటానికీ, ముఖ్యం గా అన్ని మతాల దేవుళ్ళు అందరికీ దేవుళ్ళేననీ, అస్సలు తేడా లేదనీ నేను నమ్మటానికీ కారణం మా అమ్మ . భూమ్మీద మనం వేరే వేరే గా ఉండి, మేము ఎక్కువ మేము ఎక్కువ అని కొట్టుకు ఏడుస్తాం గానీ, పైన కృష్ణుడూ, జీసస్, అల్లా, అంతా కూర్చొని పాలు తాగుతూ పార్టీ చేస్కుంటూ మన అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారట. కింద ఉన్నన్నాళ్ళూ మీకు తెలీదురా పిల్లల్లారా. పైకి వచ్చాక మీకే క్లియర్ గా అర్ధం అవుతుంది, అనుకుంటూ ఉంటారట... ఇవన్నీ చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది నిజం ఒట్టు. ఆ నమ్మకాల తోనే పెరిగాను.
ఇంతకీ నా క్రిస్మస్ అనుభవాలు- బందరు గురించి చెప్పాలంటే, నా పదేళ్ళ లోపు వయసులో ఈ క్రిస్టమస్ రోజు మా అమ్మ స్నేహితురాళ్ళు లేయమ్మ గారు, లిల్లీ టీచర్ గారూ వాళ్ళ ఇంటికి తీస్కేల్లేది. దానికోసం ముందు రోజు గ్రీటింగులు, కేకు ,ఆపిల్స్ , కమలా పళ్ళూ కొనుక్కొని పొద్దున్నే రిక్షా మాట్లాడుకొని మా బందరు రైల్వే స్టేషన్ దగ్గర మల్కా పట్నం లో ఉండే వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే వాళ్ళం. మా అమ్మ కి వాళ్ళు సేనియర్ టేచర్లు . గురువులు, హితులు. మేము వెళ్ళగానే రా ఇందిరా రా అంటూ గేటు లోనే వాటేస్కోని, పిల్లలని కూడా తెచ్చావ్ చాలా సంతోషం అనే వాళ్ళు. కాసేపు కబుర్లయాక మాకు గసగసాలు వేసిన అరిసెలు, కేకు, కారప్పూస పెట్టేవాళ్ళు. అసలు నేను వెళ్లేదే అందుకు కాబట్టి మారు మాట్లాడకుండా, అల్లరితో పెద్దాళ్ళని విసిగించ కుండా తలొంచుకొని వాళ్ళు పెట్టినవి తినేసేవాడిని. వాళ్ళు ఇచ్చిన బలూన్స్ రిక్షా పైన కట్టుకొని నడిపించు నా నావా అని హమ్ చేస్కుంటూ ఇంటి కొచ్చేవాళ్ళం.
ఇంకా మా పక్కింటి బేబక్కా ( బేబీ అక్క) వాళ్ళ అమ్మ క్రిస్మస్ రోజు వాలింటికి వెళ్ళగానే యాపీ కిస్ మిస్ రా బుజ్జీ !! అనేవాళ్ళు, కన్యాశుల్కం ఇన్స్పిరేషన్ తో (ఎందుకలా అనే వారో అప్పట్లో అర్ధం కాలేదు హై స్కూల్లో కొచ్చాక కన్యాశుల్కం నాటకం చదివాక అర్ధమై అప్రయత్నం గా నవ్వుకున్నా). తర్వాత ఐదో క్లాసు లో నా స్నేహితుడు P. శ్రీధర్ ఒకే ఒక్క క్రిస్టియన్ మా క్లాసు లో, తల్లి లేని వాడు, వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఉండి చదువుకునే వాడు, ముందు రోజు వాళ్ళింట్లో క్రిస్మస్ ట్రీ అలంకరించడానికి శ్రీధర్ వాళ్ళ అక్కలకి హెల్ప్ చేసేవాళ్ళం. క్రిస్మస్ రోజు మమ్మల్ని చర్చి కి తీస్కేల్లెవాడు. అక్కడ ప్రార్ధనలు అయ్యాక వాళ్ళింటికి వెళ్లి కేకులు తిని, బల్లూన్స్ తో ఆడుకొని. కొన్ని ఇంటికి తెచ్చుకొనే వాడిని. విచిత్రం ఏంటంటే అదే శ్రీధర్ తోనే ఏదో గొడవ వచ్చి, మా ఇద్దరికీ మధ్య మత కలహాలు కూడా వచ్చినాయి, మా మతం గొప్పదంటే మా మతం గొప్పదని. (లోపల్లోపల లెంప లేస్కుంటూ పాపం చేస్తున్నానన్న భావం తో భయం తో). అయినా అది కొద్ది సేపే , తెలిసీ తెలీనితనం.
ప్రతి క్రిస్మస్ రోజు చిన్నప్పుడు నేను స్కెచ్ పెన్నులతో వేసిన జీసస్ బొమ్మ నా టేబుల్ మీద పెట్టి దాని ముందు కొవ్వోతులు వెలిగించేవాడిని. ఆ బొమ్మ కొంత కాలానికి కనపించటం మానేసింది ఎక్కడ పోయిందో ... తర్వాత ఎప్పటికో తెలిసింది మా నాన్న ఆ జీసస్ ని మా ఇంట్లో లాకర్ లో ముఖ్యమైన కాగితాల లో నా సర్టిఫికెట్ల తో దాచి ఉంచారు. నాకున్న పాక శాస్త్ర ఉత్సాహం తో ఒకటి రెండు సార్లు స్టవ్ మీద కేకు బేకే ప్రయత్నం కూడా చేశా అప్పట్లో అవెన్ లేక పోవటం వల్ల, అది తిన్న వాళ్ళ క్రిస్మస్ ఎంత ఆనంద దాయకమో నన్ను అడగొద్దు... నాకు గుర్తులేదు.
మా బందర్లో ఉన్న ఎన్నో పాత చర్చిలు చాలా ప్రసిద్దమైనవి, చరిత్ర కలవి. వాటిలో కాలేజీ రోజుల్లో ఫ్రెండ్ ఇజీకుమార్ (విజయకుమార్) తో కలిసి ఎన్నో సార్లు భయం భక్తీ లేని ప్రార్ధనలు చేశాము. ( అర్ధం చేస్కొండి చర్చి కి ఎందు కెళ్లామో ) అన్నిటినీ క్రీస్తు నవ్వుతూ క్షమించి స్వీకరించాడు. ఎందరి పాపాల కోసమో శిలువ నెక్కిన క్రీస్తు కి మా పిల్ల చేష్టలు పెద్ద పాపం లా కనబడలేదు.
అసలు డిసెంబర్ నెల అంటేనే చాలా బాగుండేది ..చలి గాలులు, సెలవలు, చలికాలం సాయంత్రం మాత్రమే బాగా సువాసన విరజిల్లే నైట్ క్వీన్ పరిమళాలు, అన్నీ కలిసి జీవితం ఎంత బాగుందో అని పించే ఫీల్ గుడ్ ఫేక్టర్లు. బుట్టాయి పేట లో టవున్ హాల్ వెనక రోడ్ లో మా ఇంటి వెనక ఉన్న మసీదు లో రోజూ అయిదు సార్లు నమాజు, పక్కనే ఉన్న వినాయకుడి గుడి మైకులో వినపడే హిందూ భక్తి గీతాలు, దూరం గా మైకుల్లోంచి లీల గా విన పడే క్రైస్తవ కీర్తనల తో నెలంతా పండగలాగానే అనిపించేది. అప్పుడప్పుడే ప్రాముఖ్యం చెందుతున్న అయ్యప్ప దీక్షల తాలూకు భజనలు కూడా భలే ఉండేవి. అప్పట్లో ఇన్ని భజన పాటలు రాలేదు ఒక స్వామీ అయ్యప్ప సినిమా పాటలే ఉండేవి అందులో జగముల నేతా భాగ్య విధాతా.. అనే పాట అందరి దేవుళ్ళ గురించి పాడుతున్నట్లనిపించేది. అది విష్ణువా, క్రీస్తా , అల్లా నా అని తేడా లేకుండా.
మా ఇంటి బాల్కనీ లో నుంచుంటే దూరం గా కొండ మీద కనపడే ఎన్నో స్టార్లు చూసి, అట్కిన్సన్ స్కూల్లో చదివే మా అమ్మాయి కూడా ముచ్చట పడితే నేనూ స్టార్ తెచ్చి బల్బ్ పెట్టి మా ఇంటి మీద పెట్టేవాడిని, అది చూసి మా కాలనీ లో చాలా మంది ఫలానా ఆయన క్రైస్తవ మతం పుచ్చుకున్నాదట అని చెవులు కొరుక్కునే వాళ్ళు... నన్ను అడిగే దమ్ము లేక. నిజమే మా అమ్మకి తీవ్రమైన అనారోగ్యం చేసి నప్పుడు తగ్గితే నాగ పట్నం వచ్చి ఆరోగ్యమాత దర్శనం చేస్కుంటా నని మొక్కుకోని, వెళ్లి గుండు కూడా చేయించుకొచ్చా. అదే కాదు తమిళ నాడు లోని నాగూర్ బాబా దర్గా కి కూడా వెళ్ళా, ఇంకా గురుద్వారా లు తిరిగా, ఆపద వచ్చినప్పుడే దైవం విలువ, సర్వ మానవ సమానత్వం తెలిసేది.
ఇలా తలచుకుంటే జ్ఞాపకాల్లో కొచ్చే నా చిన్న నాటి స్నేహితులందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలతో...