మళ్ళీ మొదలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మళ్ళీ మొదలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, నవంబర్ 2011, ఆదివారం

ఇప్పుడు మళ్ళీ .. మరింత శక్తి తో..

Image courtesy cartoonstudio.com

రెండు నెలల నిశబ్దం తర్వాత, మళ్ళీ చెయిజేస్కొని బ్లాగ్ దులిపా. ఎందుకో పెద్ద ఖాళీ ఏర్పడింది. రెండు నెలలూ నా బ్లాగ్ జోలికి రాలేదు కానీ, అన్నీ బ్లాగులూ చదువుతూనే ఉన్నా. మనసు పుడితే కామెంట్లు కూడా రాసా. రెండు నెలలూ నా బ్లాగ్ లో పోస్ట్స్ వ్రాయటం కన్నా వేరే వాళ్ళ బ్లాగులు చదివి విసుర్లు, చతుర్లు వేయటం చేసాను. అలా చేయటం చాలా బాగుంది. బాగుంది అనటం కన్నా తేలిక అనటం సబబేమో. ఇద్దరు ముగ్గురు మిత్రులు నాకు ఇలాగే సెటిల్ అయిపో నీ అసలు రాతల కంటే కొసరు కోతలే బాగున్నాయి, మేమంతా సుఖ శాంతులతో ఉన్నాం అని కబురెట్టారు. ఖాళీలో బ్లాగ్ చదువర్లందరూ చాలా సుఖం గా ఉన్నారనిపించారని పించింది. నా గోల లేక మీరంతా నిశ్చింతగా ఉండటం నాకే మాత్రం ఇష్టం లేదు.
అందుకే మళ్ళీ వచ్చాను...
అదేదో వాణిజ్య ప్రకటనలోలా
సారి మరింత ....తో...
మరింత ఎక్కువ .... తో...
మరింత .. గా..
కాసుకోండి సారీ కోసుకోండి సారీ సూస్కోండి.!!

17, డిసెంబర్ 2010, శుక్రవారం

సర్వే కష్టా సుఖినో జనంతు


అంటే సర్వర్ కష్ట పడితే జనం సుఖ పడతారని కాదు బాబోయ్....
అందరికీ నమస్కారం. నాలుగు రాతలు రాసి ఒకళ్లిద్దరి తో బావుందోయ్ అనిపించుకున్న తిమ్మిరి బావుంది, ఒక నెల రోజులుగా ఆ తిమ్మిరి లేదు, నెల పైబడి లిపిలేని భాష లో ఏమీ వ్యక్తీకరించలేక పోయా.కారణం పరీక్షలు. నాకేంటి పరీక్షలేంటి అని ఆశ్చర్యపడి పోకండి, ఉన్న వాడిని ఊరుకోకుండా పొయిన సంవత్సరం నాగార్జున యూనివెర్సిటీ దూర విద్య కేంద్రం లో MSc సైకాలజీ కీ ఫీజు కట్టా, మొదటి ఏడు పరీక్షలు బానే రాసా 63 %, వచ్చింది రెండో ఏడు పరీక్షలు ఇదిగో ఈనెల లో మొన్న 12 తో అయ్యాయి. దానికి ముందు అస్సైన్మెంట్లు అని తెగ టెన్షన్ పడి ఎలాగోల కానిచ్చా. ఆ హడావిడీ ఆఫీసు పని వత్తిడి తో సత మతమై ఈవయసులో నాకిది అవసరమా అని అనుకున్నా చాలాసార్లు.
కానీ ఆ టెన్షన్. పరీక్షల హడావిడి, ఎప్పుడో చిన్నప్పుడు పడి ఉన్నాకదా అందుకే మళ్ళీ ఇప్పుడు పడటం బాగుంది.
కాలేజీ రోజుల్లో ఎప్పుడు చదువుకి టెన్షన్ పడలేదు( అసలు సరిగ్గా చదివితేగా) బాగా కష్టపడి చదివి పరీక్షలు రాసి అదయ్యాక వచ్చే ఆనందమే వేరు. అలాంటి ఆనందం చాల కొద్ది సార్లు పడి ఉంటా. అందులో ఒకటి నాలుగో క్లాస్ లో హిందీ ప్రాధమిక రాసి ఇంటికొచ్చి ఆహా ఏమి హాయి ఇంక హిందీ ప్రయివేట్ కీ వెళ్ళక్కర్లేదు, ఇంకా ఎగస్ట్రా టయాం చదవక్కరలేదు అని. గోడలెక్కీ, గేటుఎక్కీ, మెట్లెక్కి దిగీ....చిత్ర మైన కపిస్వభావం చూపి పడ్డ ఆనందం ఇప్పటికీ నాకు గుర్తు ఉంది. అదయ్యాక అలా పరీక్షలైన ఆనందం ఏడో క్లాస్ లో అనుభవించా. సెవెంత్ కామన్ ఆఖరి పరీక్ష కాగానే హడావిడి గా ఫ్రెండ్స్ తో మా బందరు కృష్ణ కిషోర్ టాకీసు లో చూసిన "ఏజంట్ గోపి" సినిమా ఇంకా గుర్తుంది.

వేసవిలో కరెంట్ పోయి బాగా చెమట పట్టాక ,ఫాన్ తిరిగితే అనుభవించే చల్లదనం,
నవమాసాలు మోసి పడ్డ కష్టమంతా, పొత్తిళ్ళలో పాపాయిని చూసుకున్నప్పుడు మర్చిపోయినట్లు,
బజారు నుంచి రాగానే ఇరుకు బూట్లు విప్పిపడే సుఖం,
పరీక్షలయ్యాక వచ్చే ఆనందం గురించి చెప్పక్కర్లేదు.
అసలు పరీక్షలంటేనే అదో ఆనందం, రోజంతా స్కూల్లో ఉండక్కర్లేదు- సగం రోజే, అవయ్యాక కనీసం రెండు రోజులు రెస్ట్ ( పరీక్షల్లయ్యాయిగా ) పుస్తకాల బరువుండదు. హాయిగా అట్ట పెన్ను చాలు. పరీక్షలయ్యాక అట్ట ని బాట్ గా చేసి, పేపర్(పరీక్ష పేపర్ ) ని బాల్ (ఉండ) గా చుట్టి క్రికెట్ ఆడేవాళ్ళం. (ఇట్స్ మథర్స్ ఎగ్జామ్స్ అనుకుంటూ....తెలుగులో చదువు కొండే). ఇంకో ఆనందం ఏంటంటే ఆఖరు పరీక్ష రోజూ ఇంకు చల్లుకోవటం. పెన్నులో ఉన్న ఇంకంతా వేరే వాళ్ళమీద చల్లేసి ఆనక అమ్మయ్య ఇక ఇప్పట్లో ఇంకు తో పనిలేదు అని తృప్తిగా ఇంటికెల్లటం. అందుకోసం ఆఖరి పరీక్ష రోజూ రెండు పెన్నులతో , పాత చొక్కాలు వేసుకెళ్ళే వాళ్ళం.

మళ్ళీ పదో క్లాస్ లో కూడ ఏదో ఘనకార్యం చేసిన వాడిలా ఫీల్ అయ్యా. అప్పుడు వెళ్ళింది కొండవీటి సింహం సినిమాకి (సరిగ్గా గుర్తులేదుకానీ ఎన్టీవోడిదే). అనుకుంటా బోలెడు ఈలలు , కేకలతో చూసాం. తర్వాత కాలేజీ రోజుల్లో పరీక్షలైన ఆనందం ఎప్పుడూ లేదు, కారణం కాలేజీ రోజులాద్యంతం ఆనందో బ్రహ్మ నాకు. దీన్ని బట్టీ విషయమేంటంటే ఏదైనా కష్టపడ్డాక వచ్చే తీరిక సమయం నిజమైన ఆనందాన్ని ఇస్తుంది అని.

ఉద్యోగం లో చేరాక ప్రతి ఆర్ధిక సంవత్సర ముగింపు రోజూ మాకు (ఏప్రిల్ లో ఎప్పుడో బుక్స్ క్లోసింగ్) ఆ మార్చ్, ఏప్రిల్ రెండు నెలలూ రోజుకి 16 గంటలు పని చేసి ఆఖరి రోజూ రాత్రి ఏ రెండు గంటలకో విజయవంతం గా పూర్తి చేసి అప్పుడు ఆకళ్ళు , దాహాలు , గుర్తొచ్చి అప్పడు మా విజయవాడ బస్ స్టాండ్ కీ జ్జయ్యిమని ఒక పదిమందిమి వెళ్లి అక్కడ ఉండే 24 గంటల టిఫిన్ సెంటర్ లో వేడి వేడి ఇడ్లీలు, టమాట బాత్, ఇంకా మైసూర్ బజ్జీలు ఒకళ్ళ ప్లేట్ లోవి ఒకళ్ళు తిని జూసు తాగి, ఆనక సిగరెట్ తాగే వాళ్ళు ఒక ఘాడమైన దమ్ము లాగి రింగులు రింగులు గా పైకి పొగ ఒదిలి, ఒక సుదీర్ఘమైన శ్వాస విడిచి అమ్మయ్య ఇయరు క్లోజ్ చేసాం. అనుకునే లోపు మాతో వచ్చిన మా చీఫ్ రేపు (ఈరోజు డేట్ మారి చాల గంటలయింది ) ఎన్నింటికి కలుద్దాం అనే వాడు. ఒక్కసారి అందరం గట్టిగా నవ్వుకునే వాళ్ళం, మళ్ళీ మొదలా అని.

ఈ ఆఖరి రోజు సెంటిమెంట్ మాలో చాలామందికి ఉంది , ఇలా వచ్చి తిని తాగి కబుర్లాడి ఒకళ్ళ నొకళ్ళు సూటి పోటి మాటలనుకుంటూ, నవ్వుకోవటం.
ఆ టిఫిన్ సెంటర్ వాడికీ అలవాటయిపోయాయి మా కార్లు, మేము రాగానే మర్యాద చేసి వేడి వేడి టిపిని పెట్టేవాడు.
ఆ టైం లో మాలో రకరకాల సెంటిమెంట్లు మా సీనియర్ మానేజర్ జయప్రకాశ్ కైతే ఆ ఆఖరి రోజూ ఒక్క సిగరెట్టే తాగటం అలవాటు అంతే మళ్ళీ ఒక సంవత్సరం బంద్. ఇక పోతే టిఫిన్ బిల్లు నేనిస్తా నేనిస్తానని కొట్టుకోవటం అది కట్టటం (వచ్చే ఏడు బాగుంటుందని)ఒక సెంటిమెంట్ . పొయిన ఏడాది నేను బనానా షేక్ తాగా ఇప్పుడు అదే తాగుతా నెక్స్ట్ ఇయర్ కూడ బాగుంటుందనే వాళ్ళు, నా కార్లో వెళ్దాం నా కార్లో వెళ్దాం అని పోటీ పాడేవాళ్ళు, ఇది కూడ సెంటిమెంటే, అలాగే ఆ చివరి నెల రోజులు ఆఫీస్ కీ చాల క్యాసువల్ డ్రెస్ లో రావటం, ఒకోసారి నైట్ డ్రెస్ లో రావటం, నేనైతే కొన్ని సార్లు షార్ట్స్ లో కూడ వెళ్ళా ( ఫీల్ ఎట్ హోం) అంత మంచి ఆఫీస్ మాది అచ్చం ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది (గోల గోలగా నస నస గా). ఇన్ని ఆనందాలు పడ్డ కష్టాన్ని మర్చి పోయేలా చేసేవి. విజయం వెనక ఉన్న కష్టం అస్సలు కనపడదు అన్నది మాత్రం నిజం.
జీవితం లో అస్సలు టెన్షన్ లేక పోతే థ్రిల్లే లేదు, కష్టం లేక పోతే సుఖం విలువ తెలీదు.
"పొద్దత్తమానం ఒకేలా ఉంటే మనిషి దున్నపోతై పోవున్.. "(రమణ + గురజాడ అప్పారావు గార్లు కలిసి చెప్పారనుకోండి)
ఎవడికీ లక్షల జీతం ఊరికే ఇవ్వరు, కోట్ల లాభం ఊరికే రాదు,
దానెనక బోల్డ్ కట్టం, చెమట, వ్యధ, కొండొకచో రక్తం కూడ ఉంటాయి,
అలా లేక పోతే అది సత్సంపాదనే కాదు. మరేమంటారో మనందరకీ తెలుసు.
బయట పడిన కష్టమంతా ఇంటికొచ్చి మెట్లెక్కుతూ (లిఫ్ట్ కాదు) ఈల పాటేస్కుంటూ మరచిపోవచ్చు,
ఇంట్లోనే కష్టాలనే మగానుభావులకి ఆఫీసే సుఖనివాస్.
ఏది ఏదనేది ఎవడికి వాడి స్వానుభవం.

స్వగీత లో ఆత్రేయ ఏమన్నాడయ్యా అంటే
:సర్వే కష్టా సుఖినో జనంతు:
PS : నా తిమ్మిరి నాకు ఇచ్చెయ్యండి .. పిలీస్