7, మే 2011, శనివారం
పారిపోరా నీ గమ్యం చేరుకోరా....
పది రోజుల క్రితం, రాత్రి 7:30, ఆ రోజు పని అయింది. ఆఫీసు మెట్లు దిగాను. పార్కింగ్ దగ్గర కారులో పర్వతాలు కనపడ్డాడు. నా కన్నా వయసులో మూడేళ్ళు పెద్ద, ఉద్యోగం లో లేట్ గా చేరాడు. నాకు సర్వీసు లో జూనియర్.ఆరేళ్ళ క్రితం ట్రాస్ఫర్ అయి మా ఆఫీసుకి వచ్చాడు.
మనిషి మంచివాడు కాకపోతే ఆఫీసు పని లో కొంచం నెమ్మది, కోపం జాస్తి, ప్రతి చిన్న దానికీ చుట్టుపక్కల అందరి మీద చిర్రుబుర్రులాడుతుంటాడు. అతను ఎందుకలా ప్రవర్తిస్తాడో నేను అర్ధం చేసుకోగలను. ఏదో అభద్రతా భావన, ఆఫీసు పని లో సరైన నైపుణ్యం చూపలేక పోతున్నానన్న న్యూనత కావచ్చు. అతనికి మనసు బాలేనప్పుడో , ఒంటరినన్న ఫీల్ ఉనప్పుడు కాసేపు నన్ను ఆసరా గా తీస్కుంటాడు. ఏదో కబుర్లు చెప్పి అప్పటికప్పుడు అతన్ని ఊరట చెందింపచేయటం నాకు అప్పుడప్పుడు పడే స్పెషల్ డ్యూటీ.
ఆరోజు ఎందుకో డల్ గా ఉన్నాడు,
రోజు పనిలో మూడు నాలుగు రౌండ్స్ ఫైరింగ్ చేసాడు ఎదుటివాళ్ళ మీద.
ఆనక ముభావంగా కూర్చున్నాడు. నా ఆలోచన కరక్టే !!
ఏదో దిగులు, సమస్య పీడిస్తున్నాయి.
నా పార్కింగ్ దగ్గరకి వచ్చి హెడ్ లైట్స్ కొట్టా ఎంటీ సంగతీ అన్నట్టు.
కార్ దిగి వచ్చి నా కారులో కూర్చున్నాడు.
కొంచం మాట్లాడాలి సార్ అంటూ...
చెప్పండి అన్నా
మా అబ్బాయి ఫస్ట్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి, కెమిస్ట్రీ పేపర్ తప్పాడు, మిగతావి కూడా బాగా తక్కువ గా వచ్చాయి ఒక కార్పోరేట్ a/c కాలేజీ హాస్టల్ లో పెట్టి సంవత్సరానికి లక్ష ఫీజ్ కట్టి చదివిస్తున్నాను.
రిజల్ట్స్ ఇలా ఉన్నాయి, ఏమి చెయ్యాలో తెలియట్లేదు అని బాధ పడ్డాడు.
దానికి తోడు మిగతా స్టాఫ్ లో మా అమ్మాయికి 97 % అని చెప్పిన వాళ్ళు
మా అబ్బాయికి ఫిజిక్స్, మాత్స్ సెంట్ పర్సంట్ అని చెప్పే వాళ్ళ మధ్య ఆ బాధ ఇంకొంచం ఎక్కువయుంటుంది.
సప్లిమెన్టరి ఉంటుందిగా బాగా చదవ మని చెప్పండి అన్నా ..
అదే కడుతున్నాడు. కానీ ముందు ఎందుకని చదవలేదో అర్ధం కావట్లేదు అని అన్నాడు.
జరిగి పోయిన విషయం ఇప్పుడు దేనికి.. ముందు జరగాల్సింది చూడండి, మీరు పర్సనల్ గా మాట్లాడండి, కోపం గా వద్దు, కొంచం మెల్లగా చెప్పండి అని సలహా ఇచ్చా..
దానికి బదులుగా "నాకేం మాట్లాడాలో తెలియదు
ఇంటి కెళ్లాలంటే ఏంటో గా ఉంది అన్నాడు.
మీ అబ్బాయి హాస్టల్ లో ఉన్నాడు కదా రేపు బ్రేక్ లో వెళ్దాం నేను మాట్లాడుతా అని సర్ది చెప్పే ప్రయత్నం చేసాను.
లేదు నాకు ఇంటి కెళ్ళాలని లేదు అన్నాడు.
బయటకి వెళ్దామా అని అడిగా
బయటకి అంటే హై వే మీద బార్
నెలకి ఒకటి రెండు సార్లు ఒక నలుగురైదుగురం అలా వెళ్లి ఒక రెండు గంటలు మాట్లాడుకొని రావటం అలవాటే, కానీ అది ఎప్పుడూ మంచి మూడ్ లో, సరదాగా గడపటానికి మాత్రమే.
ఆ గేదరింగ్ కి నా అవసరం చాలా ఉంది. ఒకటి పార్టీ ఆసాంతం కబుర్లు చెప్పటానికి, రెండోది రిటర్న్ లో "మాట్లాడని రధ సారధి కావాలి "
లేక పోతే పోలీసులు గాలి ఊదు అంటూ పరీక్షలు పెడతారు, అందులో పాసయ్యేది నేనే.
ఇక ఇప్పటి సంగతి కొస్తే మా పర్వతాలుని ఇంటికి పంపే ప్రయత్నం ఫలించ లేదు.
ఇంట్లో హై స్కూల్ చదివే రెండో కొడుకు, భార్యా ఇద్దరు ఉన్నారు, ఇంటి కెళ్ళాలంటే ఏదో వైఫల్య భావన, ఉన్నట్టుంది.
కానీ ఎంత సేపు ఇంటి కెళ్లకుండా తిరుగుతాడు ?
ఏమి చెప్పాలా ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే .... ఫ్లాష్ బ్యాక్ తగిలింది
1977 లో నేను ఏడో క్లాస్ చదువు తున్న రోజులు సమయం రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిముషాలు... టెన్త్ చదివే మా అక్క , ఇంటర్ చదివే మా అన్న, నేను మా మూడు గదుల ఇంట్లో మొదటి గది లో చదువుతున్నట్లు నటిస్తున్నాము. సరిగ్గా ఆరు గంటల పదిహేను నిముషాలకు క్లబ్ కి వెళ్లి , మళ్ళీ ఎనిమిది పదిహేనుకి ఠంచన్ గా ఇంట్లో అడుగు పెట్టే మా ఇంటి ఫిలియాస్ ఫాగ్ (మా నాన్న) ఆ రోజెందుకో సైలంట్ గా వచ్చారు. ఎలాంటి సిగ్నల్ ముందు లేనందున మా అన్న, అక్క, యధేచ్చ గా తిట్టుకుంటున్నారు. కారణం ఏమీ సీరియస్ కాదు, అదో తుత్తి అంతే .. కానీ మా నాన్న మూడ్ ఆరోజేందుకో బాలేదనుకుంటా ఇంట్లో కొచ్చి మా అక్క ని(మహిళా రిజర్వేషన్ ) ఒదిలేసి మా అన్నని నాలుగు, నన్ను రెండు వీపుమీద చంపేశారు. మా అన్న కరుడు గట్టిన సమర యోధుడు కాబట్టి ఏమీ రియాక్షను లేదు , కానీ మితవాది నైన నేను ఈ దాడి కి బాగా హర్ట్ అయ్యా ... దాంతో ఏడుపు, రోషం తన్నుకు వచ్చి (రోషం పాలే ఎక్కువ). మా నాన్న డ్రెస్ మార్చు కొని కాళ్ళు కడుక్కొని వచ్చేలోపే నేను ఇంటి బయటకి వచ్చి, రోడ్ మీదకి దూకేసా ...
అలా వచ్చిన వాడిని మా బందరు పోర్ట్ రోడ్ మీదుగా కోనేరు సెంటర్ దాకా వచ్చేసా ... అలా నడిచే సమయం లో ఇంకా ఎప్పుడు ఇంటి కి తిరిగి రాకూడదు ,నా దారి నేను చూస్కోవాలి, పన్నెండేళ్ళ వయసు లో సినిమాల్లో ఎంతమంది బాల నటులు ఇంట్లోంచి వెళ్ళిపోయి పెద్దయ్యాక ఎర్ర చెవర్లెట్ కార్, పసుపచ్చ కోటూ, చెవుల మీదుగా అమితాబచ్చను క్రాఫూ, జేబీలో నల్ల రివాల్వరు తో ఇంటికొచ్చేవాళ్ళనీ..? వాళ్ళంతా మదిలో మెదిలి నన్ను వెళ్ళు వెళ్ళు అని నెట్టారు. పైగా కొద్ది రోజుల ముందే చూసినా ఫకీరా సినిమా లో శశి కపూర్ "చల్ చ్చలా చల్ ..ఫకీరా చ్చల్ చ్చలా చల్ ... అంటూ పాడి పెద్దయి పోయాడు కూడానూ.... ఆ స్ఫూర్తి తో నేను కిలో మీటరు దూరం వచ్చి కోనేరు సెంటర్ దగ్గర కుడి పక్క కి తిరిగి అప్పటి సూర్య అండ్ సన్స్ ఎదురు దొరడ్లాస్ సందులో కి మళ్లి అక్కడ కట్టేసి ఉన్న ఒక షాప్ ముందు కూర్చున్నా ...
మనసు లో స్థిరంగా నిర్ణయించుకున్న ఎట్టి పరిస్థితి లో ఇంటికె ళ్ళకూడదు , ఏదో ఒక పని చేసుకుంటూ పెద్దయిపోవాలి, అని చాలా సీరియస్ గా అనుకున్నా. నిజం ఆ నిర్ణయం ఎంత గట్టిదంటే నా కు దగ్గరలో ఒక బండి మీద బనీన్లు అండర్ వేర్ లు అమ్మే ఒక అబ్బాయి ఉన్నాడు. సోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకొని నల్లగా ఉన్నాడు ఇరవై ఏళ్ళ వయసుంటుంది, అతన్ని బతిమిలాడి ఆ మొబైల్ బనియన్ షాప్ లో సహాయకుడిగా చేరి పోదాము, ఎంత జీతమైనా పర్లేదు అని గట్టిగా అనేసుకున్నా..
మా అమ్మ నాన్న వాళ్ళు ఎప్పుడన్నా బజారు వస్తే నన్ను ఆ బండి దగ్గర చూసి బతిమిలాడినా ఇంటికెళ్ళ కూడదు. ఇంటి కెళ్లడమంటూ జరిగితే అది పెద్దయ్యాకే !!
ఇలా ఆలోచిస్తుంటే దుఖం ఆగలేదు .. కళ్ళ వెంబడి నీళ్ళు... కడుపులో దిగులు . అయినా స్వయం ప్రయోజకుడవ్వాలనే ఆలోచనతో గుండె చిక్కపట్టుకొని అలాగే కూర్చున్నా,
దాదాపు గంట పైన అయింది ఇల్లు వదిలి ..
కొంచం ఆకలి , ఇకనుంచి ఒంటరిగా ఉండాలన్న బెంగ,
నాకు ఎవరు లేరన్న ఒంటరి ఫీల్ ... ఇలా ఎన్నో మిశ్రిత భావాలు ...
తిప్పెస్తుంటే ఆ షాప్ మెట్ల మీద గొంతుక్కూర్చున్నా ....
మెల్ల మెల్లగా బజారు ఖాళీ అవుతోంది
నా గాడ్ ఫాదర్ (మొబైల్ బనియన్ షాప్ ఓనర్) నా వంక మధ్య మధ్య అనుమానం గా చూస్తూ అట్ట పెట్టెల్లో బనియన్లూ డ్రాయర్లూ సర్దుకుంటున్నాడు.
నాకు సమయం ఆసన్నమయింది లేచి ఉద్యోగ విషయం అడగాలి అని పించింది.
ఒకటొకటే లైట్లు ఆరిపోయి ఆ సందంతా చీకటి ఆవరించి, నా మనసులా శూన్యం గా దిగులుగా అనిపించింది....
నా సోడాబుడ్డి కళ్ళద్దాల గాడ్ ఫాదర్ సర్దుకోవటం అయిపొయింది. బండి రోడ్ మీదకి లాగి ఒక సారి దగ్గి నా వంక సానుకూలం గా చూసాడు
ఏదో అడగాలనుకున్నట్లు నాకనిపించింది.
అదే టైం లో తెల్ల పైజామా, బనీను తో ఒక పరిచిత ఆకారం ఆ మసక చీకట్లో నన్ను సమీపించింది. తేరిపారా చూస్తే అది మా అన్న. ఇంటికెల్దాం పద అని డైరెక్ట్ గా పాయింటు కొచ్చాడు.
నేను రాను పో అన్నాను నేను.
రా రా ఆకలిగా ఉంది ఇంట్లో ఎవరు తినలేదు నీకోసం చూస్తున్నారు అన్నాడు వాడు.
ఉహు నేను రాను .. ఇక ఎప్పటికీ రాను (బుద్దిమంతుడిలో పాట లా ..) అన్నాను నేను.
కాసేపు బతిమిలాడి నా మీద కేసులన్నీ ఎత్తేస్తేనే మన ఇంటి కాబినెట్ లో కొనసాగుతా అని అల్టి మేటం ఇచ్చా.
మా చర్చలు ఫలించి నా భుజం మీద చెయ్యేసి మా అన్న నన్ను ఇంటి దారిపట్టించాడు.
ఎందుకో వెనక్కి తిరిగి చూస్తే మా సోడాబుడ్డి గాడ్ ఫాదర్ కళ్ళల్లో చీకట్లో కూడా నిరాశ కనిపించింది.
సారీ మిత్రమా నీకు తోడు ఉండబోవట్లేదు అన్నట్టు చూసి ఇంటిదోవ పట్టాను మా అన్నతో.
ఇంట్లో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దం గా అన్నం తిని పడుకుని మర్నాడు అన్నీ మరిచిపోయాం.
రెండురోజుల తర్వాత మా అమ్మ ఎవరితోనో ఈ విషయం చెప్తూ .. తన స్నేహితురాలు ఎవరో ఈ విషయమై మీ బుజ్జి చాలా సెన్సిటివ్ అనుకుంట కదా , ఏమీ అనకండి,
మళ్ళీ వెళ్లి పోతాడేమో అని హెచ్చరించింది అని చెప్తుంటే విన్నా ...(అయినా ఆరోజంటే రోషమొచ్చింది కానీ, అలాంటి పని మళ్ళీ ఎప్పుడు చేయలేదు).
ఇప్పటి మా పర్వతాలు విషయానికొస్తే ... మరుసటి రోజు సాయంత్రం ఊరు బయట ఉన్న వాళ్ళబ్బాయి కాలేజీ కి వెళ్లి బ్రేఅక్ లో ఒక గంట సేపు మాట్లాడాను.
ఏ కారణం వల్ల చదవలేక పోయాడు అన్న విషయం కనుక్కొని, చదవక పోతే వెనకపడి పోయి ఏమి నష్ట పోతామో అని నచ్చచెప్పా.. ఆ అబ్బాయి బుద్ది గా తలూపి బాగా చదువుతా అంకుల్ సప్లి లో బాగా మార్కులు వస్తాయి అని చెప్పాడు..
మా ఇద్దరినీ ఒంటరిగా ఒదిలేసి బయట గంట సేపు గడపిన పర్వతాలు కూడా సంతృప్తి గా కనిపించాడు.
ఇప్పుడు మా పర్వతాలు ఇంటి కెళ్లదానికి వెనకాడట్లేదు.
ఎవరైనా పిల్లలకి నచ్చ చెప్పండి , మీరూ సరిగ్గా చదవక పోతే ,
మీ ప్రవర్తన బాగాలేక పోతే తండ్రులు ఇంటికెళ్ళ దానికి ఎంత తటపాయిస్తారో..
ఎక్కువ సమయం బయటే ఎందుకు గడుపుతారో, తాగి ఇంటికెందుకెల్తారో...
అకారణం గా మీ మీద ఎందుకు విసుక్కుంటారో ..
మిమ్మల్ని దూరంగా హాస్టల్ లో ఎందుకుంచుతారో .....
అలాగే తండ్రులకి కూడా నచ్చచెప్పండి...
కేవలం కార్పోరేట్ కాలేజీలో పిల్లల్ని పడేస్తే సరిపోదు
వాళ్ళకు సాధ్యాసాధ్యా లుంటాయని,
వాళ్ళ సాధక భాధకాలు పట్టించుకోండని.
మనం చేయలేనివి వాళ్ళ మీద రుద్ది
చేయిద్దామనుకోవటం మంచి పద్ధతి కాదని
బయట మనం చూపే హాస్య ప్రియత్వం , స్నేహభావం
ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా అవసరమని
ముఖ్యం గా ముఖం ముడుచు కూర్చుంటే ముడతలు తప్ప ఏమీ మిగలవని....!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
chala baga chepperu.........mukham muduchukkurchunte mudathalu..... u r right. ika pothe mee MAATLADADAM... vishayanikosthe meeru MAATLADARANI chakkaga cheppaka cheppina vidhanam chala bagundi
రిప్లయితొలగించండిofcorse meeru MAATLADARANI meeru cheppakapoyina telusulendi. a good and useful for the parents and children too. chinnappudu intlonchi vellipodamanukune sandarbham chala mandi pillalake vasthundi....aithe adi kshanikame kabatti no probs. but counciling avasaram.
బహు బాగా చెప్పారు సార్... మీ అనుభవాన్ని కూడా మిస్రమించి చెప్పారు.... దీని గురించి విశ్లేషణ ఇవ్వడానికి నా అనుభవం సరిపోదు ... కాని మీ మాటల గారడీ ని పొగడ కుండా ఉండలేను.....
రిప్లయితొలగించండిఇంటర్ ఆక్టివ్ గా ఉంది మీ వివరణా....
నాకు తెలిసిన నాలుగు ముక్కలు...
మనం 17 పెంచిన మన పిల్లలకి ఎటువంటి వాతావరణం సరిపోతుందో తెలుసుకోగాలగాలి...
అందరు వెళ్తున్నారు కదా అని కోర్పోరాటే కాలేజిలో చేర్పించడం అంత మంచిది కాదేమో అని భావన...
చదువుని చదవడం కన్నా అర్ధం చేసుకుని మన చుట్టూ ఉన్న వాటి లో ఆ చదువు ఎంత వరకు పనికి వస్తుంది ఎక్కడ ఆ చదువు ని వినియోగిస్తారు అనేది తెలుసుకున్తేయ్ మనకి చదవడం చాల సులభ సాధ్యం..
ఇది పెద్ద కష్టం ఎమీ కాదు మనం సినిమా చూస్తున్నప్పుడు మన నిజ జేవితానీ పోల్చుకుంటాం అది సరిగ్గా చదువులో పెట్టగలిగితే చాలు
నాకు అనిపించినా ఆలోచన....
ఈ కర్పోరాటే కాలేజీ వాళ్ళు పిల్లలకి వచ్చిన మార్కులని గొప్ప గ చెప్తారు.... 1st వచ్చారు మాకు ఇన్ని రాంకులు వక్చయీ అనీ.... కాని నిజంగా అంత బాగా చదివిస్తేయి ఆ పిల్లలు ఎన్ని ప్రోయాగాలు ఎన్ని కొత్త విషయాలు కనిపెట్టేవారు కాని అవగాహనా లోపం వల్లా కేవలం మార్కులకే పరిమితం అవుతున్నారు .... ఎందుకు మన దేశానికి ఇటురా దేశాల లాగ నోబెల్ బహుమతులు రావడం లేదు... కేవలం MIT , USA ఫిజిక్స్ డిపార్టుమెంటు లో 28 నోబెల్ బహుమతులు తెచ్చుకున్నవారు ఉన్నారు.... మనకి ఎందుకు రావడం లెదూ... ఆ శాస్త్రాలు మన వాళ్ళు ఎప్పుడూ మనకి బూధించారు కాని మనం దానిని ఇమ్ప్లేమేంట్ చెయ్యలేక పోతున్నాం... కారణం ???
ఎం చేసిన అర్ధం చేసుకుని చేస్తే బావుంటుందని నా అభిప్రాయం.....
మొదటగా...బందర్ రోడ్, కోనేరు సెంటర్ ఈ పేర్లు వినగానే ప్రాణం లేగిసోచ్చినట్లు హాయిగా అనిపించింది.
రిప్లయితొలగించండిఇంకా అసలు విషయంలోకి వస్తే...చక్కటి మెసేజ్ ను కాస్త హాస్యం జతకలిపి బాగా చెప్పారు.
కొంచం లేట్ గా చదివాను మీ కొత్త టపా
రిప్లయితొలగించండిబాగుంది.
ముక్ష్యం గా రెండు వేరు వేరు విషయాలని లింక్ చేస్తూ మీరు రాసే టపాలు ఆద్యంతమూ బాగుంటాయి.