ఆహ్వానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆహ్వానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జనవరి 2011, శుక్రవారం

విజయవాడ పరిచయపత్రం (ప్రాస్పెక్టస్)


మా ఊరుకి నేను ఇల్లరికపు కొడుకుని. కొత్త మాటలా ఉందని తప్పు పట్టకండి.మా అత్తారూరు విజయవాడ కాదు కాబట్టీ , గత ఇరవై ఒక్క ఏళ్ళగా ఇక్కడే ఉంది పోయా కాబట్టీ ఇల్లరికపు కొడుకు సరైన మాటే.

ఉద్యోగరిత్యా ఒకే ఊర్లో ఉండటం వరమా ? శాపమా? నాకైతే ఇప్పటికీ తేల్చుకోలేని స్థితి. ఒకరకంగా వరమే. కరెంటు కోత, మంచి నీళ్ళ ఎద్దడి, వేరే ఏ రకమైన ఇబ్బందులూ లేని మా విజయవాడ లో దిగ్విజయంగా ఇప్పటికి 21 ఏళ్ళ పైగా సర్వీసు పూర్తి అయింది, ఇంకో పదిహేను సంవత్సరాల రెండు నెలలు మిగిలి ఉంది.

నేను ఊరు మారాలంటే ఒకే మార్గం ప్రమోషన్ మీద వెళ్ళటమే, అలా మారాల్సి వస్తుందని దాని వంకే చూడని నేను హాయిగా ఇక్కడే ఉండి పోయా. కొంచం వేడి ఎక్కువైనా మంచి వాతావరణం, విద్యా , వైద్య వసతులు బాగుండి ,అన్నిటి కన్నా మంచి మనుషుల మధ్య బతకటం అలవాటై పోయి నాకు విజయవాడ ఒదిలి వెళ్లాలని లేదు.

ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసేవాళ్ళు బాంకుల్లో పని చేసే అధికారులు బదిలీల మీద బదిలీలు అవుతూ రెండు మూడేళ్ళకో ఊరు వెళ్తూ రకరకాలా భాషలు సంస్కృతులు చవి చూస్తూ ఎదిగి పోతూ ఉంటె నేను మాత్రం ఒకే ఊర్లో ఉంటూ ఒకే భాష మాట్లాడుతూ( అది కూడా సరిగ్గా రాదు) పొరుగు రాష్ట్రము వెళ్తే ఏమి మాట్లాడాలో తెలీక తెల్ల మొహం వేస్తానని ఇప్పటికీ మా అన్న మూడు భాషల్లో బూతులు తిట్టి మరీ చెప్తాడు. ఏమి చేస్తా అది నా ప్రారబ్ధం. అందరికీ అన్నీ కుదరద్దూ.. ఒకవేళ ఆరాటాల పోరాటాల కారణం గా రాష్ట్రము తెలంగాణా, సీమ, కోస్తా, ఉత్తరాంధ్రా, ఇలా ముక్కలైతే నాలాటి వాడికి ఇక ఇబ్బంది ఉండదు. నాలుగైదు రాష్ట్రాల లో ఇంచక్కా తెలుగే మాట్లాడి నెగ్గుకు రాగలను.

ఇక పోతే మా విజయవాడ లో ఉన్న అదనపు సౌకర్యాలు మంచి సినిమా హాళ్ళు, ఇప్పుడిప్పుడే వెలుస్తున్న షాపింగ్ మాల్స్, ఒకట్రెండు థీమ్ పార్కులు, లెక్కలేనన్ని మంచి టిపిని సెంటర్లు, పెద్ద రైల్వే జంక్షను, అన్ని ప్రాంతాలకూ బస్సులున్న బస్టాండ్, మంచి రోడ్లు రోడ్ మీద పెరిగిన ట్రాఫిక్కూ. ఊరు చుట్టూ పొలాలు, కొండలూ, మామిడి తోటలు,ఒక వైపు కృష్ణమ్మా, వీటన్నిటి పైన అండగా కనకదుర్గమ్మ... పది మైళ్ళు వెళితే మంగళగిరి పానకాల స్వామి. ఎంత ప్రమోషన్ ఇస్తే మాత్రం ఇన్ని హంగులూ అండ దండలూ ఉన్న మా బంగారు విజయవాడ ని ఒదిలి ఎలా వెళ్లనూ ? అందుకే మరి కొంత కాలం ఇక్కడే ఉండ దల్చుకున్నా.

నెలకో సారి పని వత్తిడి కి చిరాకేస్తే ప్రకాశం బారేజ్ దాటి గుంటూరు జిల్లాలోకి తొంగి చూసి, అమరావతి రోడ్ కేసి వెళ్తే దారి పొడుగుతా పచ్చని పొలాలు, దాంట్లో పనిచేస్కుంటున్న రైతులు, అమరావతి లోకి అడుగు పెడితే వినిపించే ఆ పరమశివుడి జేగంట, పక్కనే గలగలా పారే కృష్ణమ్మా, అది దాటి వెళ్తే వచ్చే చిన్న చిన్న లంకలూ...సత్యం శంకరమంచి ఏమి చూసి పరవశించి అమరావతి కధలు రాసారో చెప్పకనే చెప్తాయి.

కొండపల్లి వెళ్లి ఖిల్లా మీంచి కిందకి చూస్తె కనపడే చిన్న చిన్న పెంకుటిళ్ళు, మనుషులు , వాహనాలు, ఆ కొండపల్లి బొమ్మల తయారీకి ప్రేరణ ఏంటో చెప్తాయి. అక్కడ ఉన్న శిధిలాలలో తిరుగుతూ ఆ రాతి తిన్నెల మీద కూర్చుంటే కలిగే రాజ ఠీవీ, దర్జా ముందు ఏ పదవైనా బలాదూరే. కొండ పల్లి ఖిల్లా ఎక్కాలంటే అందరూ కార్లోనో బండి మీదో ఘాట్ రోడ్ మీద వెళ్తారు కానీ అసలు మజా కావాలంటే బుద్దిగా మన వాహనం కొండ కింద నిలిపేసి. అడ్డం గా ఆ కొండ ఎక్కటమే సరైన పద్ధతి. కాకపోతే కాళ్ళకి ట్రెక్కింగ్ షూస్, పక్కన మనతో సమానం గా స్పందించగల స్నేహితుడూ, ఇద్దరి మధ్యలో భావ సారూప్యం ఉన్న విషయ పరిజ్ఞానం ఉంటే రోజులో నాలుగు సార్లు ఎక్కి దిగొచ్చు. మీకు ట్రెక్కింగ్ అభిలషణీయం కాదా ఒదిలేయండి. బండి మీదే వెళ్లి పైన కూర్చొని అలా చూస్తూ ఉండండి చాలు. మిగతాది ప్రకృతే చూస్కుంటుంది.

అసలు అంత దూర మెందుకూ.. ఆయాసం అంటారా నగర నడి మధ్యలో ఉన్న మొగల్రాజ పురం లో కొండ మీద ఒరిజినల్ దుర్గమ్మవారు ఉన్నారు, అంటే దుర్గమ్మ మొదట గా పదం పెట్టిన పీఠం, అక్కడ గుడి ఉంది, పచ్చని పౌర్ణమి రోజు ఆ కొండ నడిచి ఎక్కి (నడిచే ఎక్కాలి ఇంకో మార్గం లేదు) అక్కడ అమ్మకి దండం పెట్టుకొని, ముఖాన కుంకం బొట్టేట్టుకుని,కొబ్బరి ముక్కలు తింటూ చీకటి పడేదాకా కూర్చుంటే నిండు పాల బిందె తొణుక్కుంటూ వస్తుంటే తెల్లని పాలు చిమ్మినట్లు, చల్లని వెన్నెల చిమ్ము కుంటూ చందమామ వస్తాడు. చూస్తూ కూర్చుంటే నడి నెత్తిమీదకి వచ్చిన సంగతి కూడా తెలీదు. ప్రయత్నించండి...

వేసవి లో చల్ల గాలుల నిచ్చే కృష్ణవేణమ్మ ఘాట్లు, ఆవల కెళ్తే సీతానగరం లో ఉన్న స్వాములార్ల ఆశ్రమాలూ, గుళ్ళూ.. ఇసక తిన్నెలూ ..ఒకటేమిటీ.. ఎన్నో మా విజయవాడ లో. మీకో సంగత్తెలుసా కృష్ణ ఒడ్డున గట్టున కూర్చొని కాళ్ళు నదిలో వేసి ఆడించుకుంటూ టైం వేస్ట్ చేస్తుంటే, ఎంత వేస్ట్ చేసామో మనకే తెలీదు. సత్తె పెమానికం గా చెప్తున్నా నే చాలా సార్లు చేసా ఆపని. మీకు ఈత వస్తే మొలలోతు నదిలోకి దిగి ధైర్నం చేసి ఇంకొంచం ముందుకెళ్ళి బారలేస్కుంటూ ఆవలి కెళ్లటానికి ఆలీసం ఎందుకు?

మీకు తిండి మీద మంచి అభిరుచి ఉందా.. మా ఊళ్ళో ఎన్నో మంచి హోటళ్లు ఉన్నాయ్ . అప్పుడెప్పుడో స్వచ్చమైన నెయ్యేసి ఇడ్లీలు, పెసరట్టుప్మా లూ పెట్టేవారట, ఇప్పుడూ అక్కడక్కడ వాసనలోస్తాయి. నాకైతే ఎన్నో ఏళ్ళ తరబడీ పేరు మోసిన హోటళ్ళ కన్నా , రోడ్ పక్క బండి హోటళ్లు భలే మంచి టిఫిన్ పెడతాయి అనిపిస్తాయి. ఆవిర్లుకక్కే ఇడ్లీలు, వేడి వేడి దోశలు, ఉబ్బెత్తుగా ఉన్నాయికదాని పొడిస్తే వేడి సెగతో వేళ్ళు చురుక్కుమనిపించే పూరీలు, అందులోకి కొబ్బరి చట్నీలు, బంగాల దుంప కూరలూ.. రోడ్ మీద నుంచొని తింటున్నామనే స్పృహ ఒదిలేస్తే మహా రుచి గా పెట్టగల టిక్కీ హోటల్లు ఎన్నో ఉన్నాయి. వన్ టవున్ లో మార్వాడి తిళ్ళు భలే ఉంటాయి. అసలు విషయం చెప్పక పోతే ఆనక తిడతారు మా విజయవాడ మిరపకాయ బజ్జీలు, చిన్న చిన్న పునుకులు ఇంకెక్కడా దొరకవు కావాలంటే పైపందెం లో మా బీసంట్ రోడ్ రాసేస్తా అంత ధైర్యం నాకు ఈ విషయం లో...

బట్టల కొట్లైతే ఇంక చెప్పక్కర్లేదు. అందరు బ్రదర్సూ తమ తమ కొట్లని ఇక్కడ తెరిచారు. సిస్టర్స్ కి బోలెడు తగ్గింపు నిస్తూ.... కోరుకోవటం ఏరుకోవటం ఇక మన ఇష్టమే. బంగారమూ మినహాయింపు కాదు, ఖాన్లూ, ఖజానాలు, కీర్తులూ ఇలా ఎన్నో పేరుమోసిన దుకాణాలు. అయినా మా వన్ టవున్ బంగారం పని వాళ్ళ చేతుల్లో మంచి కళ ,నమ్మకం ఉంది.

కక్షిదారుల శ్రేయస్సు కోసమే హై కోర్ట్ బెంచ్ ఏర్పాటు చెయ్యమని ఆందోళన చేసే లాయర్లూ, లెక్కకి మిక్కిలి డాక్టర్లూ, సందు సందు కీ ఉన్నారు . మాఊర్లో డాక్టర్ల కోసమైతే ఒక రోడ్డే ఉంది అయితే దానిపేరు నక్కలరోడ్, ఎందుకో అడక్కండి నాకూ తెలీదు.

సినిమా హాళ్ల విషయాల కొస్తే ఇక తిరుగే లేదు, కొత్త సినిమా వస్తే పొద్దున్నే ఆరింటికే మీరు బోలెడు హడావిడి చూడొచ్చు, ఇంకేం పని లేదన్నట్టు అక్కడే తచ్చాడే అభిమాన సంఘాలనీ చూడొచ్చు.

ఇన్ని చక్కని వసతులు ఉన్న మా విజయవాడ భూతాల క్షమించాలి భూతల స్వర్గం.

ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్పానో అర్ధం అయిందా? ఏ తెలంగాణ నో వస్తే పెట్టుబడీ దారులూ, భూస్వాములూ, విద్యావ్యాపారులూ, రియల్ ఎస్టేట్ ఆసక్తి దారులూ, సినిమా వాళ్ళు మా విజయవాడ రండి.
ఇక్కడ జమిలి గా పెట్టుబడి పెట్టండి లాభాలు పొందండి, మాక్కూడా పంచండి.
విన్ విన్ ఫార్ములా అన్నమాట.