22, జనవరి 2011, శనివారం

ఇక్కడ అవసరం, సౌకర్యం, విలాసం అన్నీ ఒకటే


1993 ఫిబ్రవరి ఒకటో తారీకు సోమవారం సమయం ఉదయం పదకొండు గంటలు, ఆఫీసు లో ఉన్నా పని చేసుకుంటూ , ఆర్ధిక సంవత్సరం చివర్లో ఉండటం వల్ల కొంచం పని వత్తిడి ఎక్కువున్న రోజులు. అయినా నా మనసులో తొలిచేస్తున్న ఆలోచన ఒకటి ఉంది, అది ఇంకో వారం రోజుల్లో, అంటే రాబోయే ఆదివారం మా మొదటి పెళ్లి రోజు. సినిమాల్లో శోభన్ బాబు చేసినట్లు, నవల లలో కృష్ణ చైతన్య చేసినట్లు మొదటి పెళ్లి రోజుకు హీరోయిన్ కు ఏదో బహుమతి కొని సంభ్రమాశ్చర్యాలలో ముంచేసి, ఆనక పైకి తేలాక నా వంక చూసే మెచ్చుకోలు చూపుకై ఆశ పడి ఏదోటి కొనాలి అది పెద్ద ఖరీదు ఉండకూడదు, (నేను కొనలేను కాబట్టి) పెద్ద సైజులో ఉండ కూడదు (దాచి ఆరోజు చూపాలి కాబట్టి) తనకి లేనిదేదో కొత్తది అయి ఉండాలి (సంభ్రమము + ఆశ్చర్యమూ కలిగించాలి కాబట్టి) ఇలా మధనపడుతూ ఉన్నా.

చివరకి బంగారం అయితే బెస్ట్ ఎప్పటికీ పడి ఉంటుంది, ఆడాళ్ళకి ప్రీతికరమైనది,(PWO వాళ్ళూ నన్ను క్షమించాలి) పైగా మన డబ్బుకి విలువ కూడా పెరుగుతూ ఉంటుంది అని ఆర్ధిక శాస్త్ర వేత్త లా అలోచించి బంగారానికే మొగ్గు చూపా. వెంటనే కార్యాచరణ లోకి దిగా . సొంత పనులన్నీ ఆఫీసు టైములోనే చేసుకోవాలన్న సాంప్రదాయం ప్రకారం తిన్నగా బ్యాంకు కి వెళ్లి ఖాతా లో ఉన్నా ఆరు వేలు క్రెడిట్ బాలన్సు లోంచి మూడు వేలు , ఫెస్టివల్ అడ్వాన్సు పెడితే వచ్చే రెండు వేల అయిదు వందలూ , ఇంకా ఎమన్నా అవసరమైతే ఆ పైవాడు ఉన్నాడు అన్న ధైర్యం జేబులో డబ్బులు పెట్టుకొని. నిశ్చింతగా ఆఫీసు చేరుకొని పని చేసుకున్నా.

సాయంత్రం ఆఫీసు అయ్యాక ఒక్కడినే బంగారం కొట్ల మీదకి రైడు కెల్లా. అప్పటికింకా మా విజయవాడ లో బంగారం రెడీమేడ్ కొట్లు ఎక్కువ లేవు. మాఘమాసం అవటం వల్ల పెళ్ళిళ్ళ సందడి బాగా ఉంది ఉన్న నాలుగైదు రెడీమేడ్ బంగారం కొట్లు కిట కిట లాడుతున్నాయి. బాగా డబ్బు చేసిన వాళ్ళతో, తప్పక అప్పుచేసిన వాళ్ళతో బంగారం షాప్ లో కాలు పెట్టే ఖాళీ లేకుండా ఉంది. వెళ్ళిన పావుగంటకి ఒక కౌంటర్ ఎదురు కుర్చీ ఖాళీ అయితే నాకు అవకాశం వచ్చింది. నా దగ్గరున్న డబ్బులకి అప్పటి రేట్ ప్రకారం రెండు తులాలకి మించి ఏమీ రావు. కాబట్టి ఒక బ్రెస్లేటో, చెవి దిద్దుల జతో, లేక ఇద్దరికీ ఉంగరాలో ఏదోటి కొందామని నా ఆలోచన. అదే చెప్తే షాప్ అబ్బాయి బ్రేస్లేట్లు చూపించాడు. అందులో నాకు నచ్చిన ఒకటి ఎంచుకొని దానికి రేట్ చూసి బిల్ తయారు చెయ్యమని చెప్పి ,నుదుటి మీదకి జుట్టు రింగు లాగి, జేబుల్లో చేతులు పెట్టుకొని నుంచున్నా శోభన్ బాబు లా. అక్కడున్న అద్దాలలో నాకు నేనే పెద్ద హీరో లా అనిపించా.

సెలక్షన్ అయితే పావుగంట లో అయింది కానీ బిల్ మాత్రం అరగంట అయినా వేయలేదు. కారణం నాకన్నా డబ్బు చేసిన పెద్ద పెద్ద బిల్ గేట్లు చాలా మంది ఉన్నారు. అంటే నాలుగు జతల గాజులు, నెక్లస్ లు, వడ్డాణాలు వంకీలు కొని నలభై యాభై వేల బిల్లులు చెల్లించే వాళ్ళ మధ్య నా నాలుగు వేల మూడు వందల మొత్తం వాళ్లకి పెద్దగా ఆనలేదు.


అలా ఆ పెద్ద మొత్తాల వాళ్ళని చూస్తుంటే నాకు కొంచం చిన్నతనం వేసింది. నాకూ అలా అయిదు అంకెల బిల్లు కడుతూ షాపాయన మెచ్చుకోలు చూపులు, పక్క వాళ్ళ అసూయా (నాలాగా) బాణాలు గుచ్చుకుంటుంటే మహా సమ్మగా ఉండి, ముసి ముసి గా లోపల్లోపల నవ్వుకుంటూ పైకిమాత్రం ఇవన్నీ నాకు చాలా చిన్న విషయాలన్నట్టు నిర్లక్ష్యం గా నుంచో వాలి అని అనిపించింది. కానీ అప్పటికి అది సాధ్యం కాని విషయం.

ఏది ఏమైనా నా బిల్ నేను కట్టేసి కొంచం సిగ్గుగా వంగి,నే కొన్న వస్తువు జాగ్రతగా టక్ చేసిన షార్ట్ జేబులో వేసి నా మోటార్ సైకిల్ మీద ఇంటికేల్లిపోయా. కానీ అప్పటినుంచి అదో జబ్బులా అలా పెద్ద పెద్ద షాపుల కెళ్ళి పెద్ద పెద్ద వస్తువులు కొని నిర్లక్ష్యం గా ఒకా కాలు అడ్డం గా పెట్టి, ప్యాంటు జేబులో ఒక చెయ్యి పెట్టి నుంచోవాలన్న కల మాత్రం నన్ను వెంటాడు తూనే ఉంది.


ఆ కల నా వయసుతో బాటు పెరుగుతూ, నా జుట్టులో తెల్ల వెంట్రుకల్లా వ్యాపిస్తూ , నా బట్టతలా లా అభివృధి చెందుతూ, వచ్చింది. అలా పంతొమ్మిది ఏళ్ళలవుతోంది నా పెళ్ళయి. ఇప్పటికీ ఆ కల మాత్రం చెదరలేదు, మరవలేదు.


కట్ చేస్తే సంవత్సరం 2011 :

నిన్న ఆఫీసు లో ఉంటే వచ్చేటప్పుడు కూరలు కొని తీసుకురా అని మా ఆవిడా ఫోన్ చేసి చెప్పింది. మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ వెళ్తే రెండు లీటర్ల పెట్రోల్ కారు తాగుతుంది, ఆ తాగుడు ఖర్చు అక్షరాల నూట ముప్పై రూపాయలు కాబట్టి, ఆవిషయం కూడా హెచ్చరించి మరీ ఒదిలింది.


నాలోని అమర్త్య సేన్ కూడా నిజమే అని ఒప్పేసుకొని, ఆఫీసు అయ్యాక బుద్దిగా మా ఇంటికెళ్ళే రోడ్ లోని ఒక మార్ట్ కేసి దారి తీసాడు. అక్కడయితే పార్కింగ్ సమస్య ఉండదు, ఎక్కువ నడవకుండా కూరగాయలన్నీ కోనేయచ్చని. సాధారణంగా రకానికో కిలో చొప్పున ఒక ఆరు ఏడు రకాల కూరలు, ఆకు కూరలు, మిర్చి, అల్లం, కర్వేపాకు, కొత్తిమీర, పుదీనా కొని, వాటితో పాటు ఒక రెండు కిలోల ఉల్లిపాయలు, ఇంకా ఎమన్నా విచిత్ర మైన ఊదా రంగు కాబెజ్, లాంటికూరలు కొంటాను. వాటి విలువ నూట యాభై దాక అయ్యేది.

నిన్న కూడా అలాగే కొనేసా ట్రాలీ తోసుకొచ్చి బిల్ చేయిస్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళు కొంచం దూరం జరిగి నాకు దారి ఇచ్చి నా వంక వింతగా చూడటం గమనించా. సర్లే ఏదోలే అని సర్దుకొని బిల్ ఎంత అంటే రూ.412 /- అన్నాడు. వామ్మో అనుకున్న. బిల్ చేసాక తప్పేదేముండీ అని, డబ్బులు కడుతుంటే ఒక్కస్సారి గుర్తోచింది ఫ్లాష్ లా నా కల. ఎన్నేళ్ళ గానో నాతో పాటు పెరుగుతూ , నాలో ఇమడ లేక ఎప్పుడు బయట పడదామని తన్నుకుంటున్న నా బంగారు కల. జేబులో చెయ్యి, ఒక కాలు కొంచం వంకర గా పెట్టి నుంచోవటం, రెండు గుండీలు ఒదిలేసిన చొక్కా, నిర్లక్ష్యం గా నుదిటి మీద అల్లరిగా పడే జుట్టూ( లేదులే), ఎంత బిల్లయినా పర్లేదు నాకు లెక్క లేదు అన్న ఉదారం. ఎస్ స్స్ అదే నా కల నిజమైంది.
ఇలా కాయగూరల దగ్గర.
నా చేతిలో అయిదు వంద నోట్లు ,
అసూయ నాచుట్టూ ఉన్న కొంతమంది కంట్లో,
చిన్నగా విసిల్ నా నోట్లో.

యాదృచ్చికం : ఇది రాస్తుంటే నా కసిన్ దగ్గర నుంచి ఒక ఎస్ ఎం ఎస్
:
"First time in the history of mankind,
Need, Comfort, and Luxury sold at same price in India !!
Onions=Rs65, Petrol=Rs65 and Beer=Rs.65 "

సెహబాస్ భారత దేశమా, అవసరం, సౌకర్యం, విలాసం అన్నీ ఒకే ధర బాగు బాగు !!

7 కామెంట్‌లు:

  1. ఓ నా దేశ ప్రజలారా!
    మీరంతా యోగా ప్రాక్టీస్ చేయండి
    ఒక పూటే భోం చెయ్యండి (ఉల్లి లేకుండా)
    ఉడికించుకోకుండా తినండి
    గ్యాస్ ఆదా!
    ఆఫీస్ కి నడిచే వెళ్ళండి
    లేదా ఆఫీస్ లోనే పడుక్కోండి
    పెట్రోల్ ఆదా!
    ఐదేళ్ళ కోసారి మీ ఇంటి కొచ్చే
    బెగ్గర్ల కి మాత్రం ఓట్లేస్తునే వుండండి

    రిప్లయితొలగించండి
  2. THE ONLY PLACE IN INDIA WHERE FOOD IS CHEAP
    TEA-1.00
    SOUP-5.50
    DHAL-1.50
    MEALS-2.00
    CHAPATHI-1.00
    CHICKEN-24.50
    DOSA-4.00
    VEG BIRIYANI-8.00
    FISH-13.00
    THESE ITEMS R MEANT FOR ''POOR PEOPLE''
    IT IS AVAILABLE AT INDIAN PARLIAMENT CANTEEN .
    THE SALARY OF THOSE POOR PEOPLE IS RS 80000 PER MONTH .

    రిప్లయితొలగించండి
  3. ఆత్రేయ గారు,

    :)) మీ కల ఆవిధం గా నిజమైందన్నమాట.
    మీరు చాలా ఫన్నీ గా రాస్తారు.. I enjoy reading your posts..

    రిప్లయితొలగించండి
  4. Bharat Kumar Allada22 జన, 2011 11:26:00 PM

    జేబులో చెయ్యి, ఒక కాలు కొంచం వంకర గా పెట్టి నుంచోవటం, రెండు గుండీలు ఒదిలేసిన చొక్కా, నిర్లక్ష్యం గా నుదిటి మీద అల్లరిగా పడే జుట్టూ( లేదులే), ఎంత బిల్లయినా పర్లేదు నాకు లెక్క లేదు అన్న ఉదారం.

    రేపు నేనూ ఒక కిలో ఉల్లిపాయలు కొని ఈ పోస్ పెట్టి చూస్తా ... బాగుంది మీ పోస్ట్ (ADVANCE MARRIAGE ANNIVERSARY)

    రిప్లయితొలగించండి
  5. @వోలేటి గారు / రవిగారు ఊరికే ఆవేశ పడటమే కానీ మనమేమీ చెయ్యలేమా?
    @కృష్ణప్రియ: అదే ఏడవలేక నవ్వటం అంటే థాంక్స్
    @భరత్ : థాంక్స్ ఫర్ ద గ్రీటింగ్స్ / మీకు శోభన్ బాబు రింగ్ ఉందా? ఉంటే అదృష్టవంతులు

    రిప్లయితొలగించండి
  6. అజ్ఞాత23 జన, 2011 8:16:00 AM

    చాలా బాధ పడాల్సిన విషయాన్ని చాలా మెత్తగా వాత పెట్టినట్టు నవ్వులాటలాగా చెప్పారు.
    Very nice.
    శారద

    రిప్లయితొలగించండి
  7. chaala baavundi.. mee vyaakhya chaduvutunte drusyaalu kallaku katti natlu avupistunnayi. kaani, indulo sobhan babu ring nachhaledu.. emee anukokandi. Nakenduko chinnappati nunchi sobhan babu gari ring ante maha asahyam.. Marchipoyina daanni malllee kelikinatlu anipinchindi.. Chaminchandi..

    రిప్లయితొలగించండి