
గతం లో ఎప్పుడో ఒక రోజు , రాత్రి ఒంటి గంట నా ఫోన్ ట్రింగ్ ట్రింగ్ .... చేసింది మా ఉయ్యూరోడు ప్రెబాకరు.
నేను " హలో ..... ఏరా పక్కా !!"
"ఏమి చేస్తున్నావురాండి ? "
" ఏమీ లేదు రమణీయం నూట తొమ్మిదో సారి చదువు తున్నాన్రాండ్రి"
ఎరా ఒరేయ్ అనుకునే మా మధ్య అండి ( రా + అండి ) రాండి లు చొప్పించిన చిలిపి రమణ గారు లేరుట.
నా ఆరో ఏట నుంచి నుంచి బుడుగు తో మొదలెట్టి, అయన రాసిన వన్నీ చదివి చదివి ఆయనకి పెద్ద పంఖా లా తయారయ్యి.. నా వయసు తో బాటు పెరుగు తున్న శరీరం తో బాటు అయన మీద ( అయన సహచరుడు బాపు గారి తో కలిపి)
విపరీత మైన ప్రేమ అభిమానం గౌరవం పెంచుకొని,
సొంత బంధువు లా,
మరింత దగ్గరి చుట్టం లా,
ఎంతెంతో కుటుంబ సభ్యునిలా....
చేస్కున్న అయన ఇక లేరు
అయన లాంటి ఒక పెదనాన్న, ఒక బాబాయి, ఒక తాత, ఒక అన్న, మేన మామ , తమ్ముడు , చివరాకరికి ఒక బుడుగు లాంటి కొడుకు ఉంటె బాగుండనిపించే విశిష్ట వ్యక్తిత్వం "ముళ్ళపూడి " గారిది.
కస్టాలకేం పని లేదు వాటికేం తోచక మనకొస్తాయి,
ఇష్టాలతో పనిలేకుండా వాటిని ఆహ్వానించు, ఆస్వాదించు ,
ఆనక ఆనందంగా సాగ నంపు అనే అయన జీవిత వేదాంతం అయన రచనల్లో చదివి నిజం గా ఒంట పట్టించుకున్నా..
కేవలం నవ్వుకుంటే వచ్చే కంటి తడే కాదు
తవ్వుకుంటే వచ్చే బాధ తడి కూడా నవ్వుతూ తుడిచేసుకునే నేర్పు నేర్పారు.
అయన కేమిచ్చి తెలుగు సాహితీ ప్రియులు ఋణం మాఫీ చేయించుకో గలరు ?? ( ఇవ్వాలంటే ఆయనేరి ?)
జీవితం లో నేను చూసిన అతి కొద్ది అద్భుతాలలో బాపు రమణ గారు ఒకళ్ళు ( అవును వాళ్ళు ఒకళ్లె )
ఇది రాస్తుంటే పక్కాగాడి ఫోన్ ఎంటిరా ఇలా జరిగింది అంటూ..
భోరు మని ఏడిచే వయసు కాక పోయినా
హోరున తుళ్ళి పడుతున్న మనసుల అలల చెమ్మ ఇరు వైపులా తెలుస్తోంది.
అయన లేక పోతే మనకే ఇలా ఉంటె ఇంకా బాపుగారికెలా ఉంటుందో.
ఏమైనా మన ఏడుపు మనమే ఏడవాలి
మన కంటి తడి మనమే తుడవాలి
బాపు గారి కి
వెంకట రమణ గారి కుటుంబానికి
రమణ గారి అభిమానులందరికీ
ప్రగాఢ సంతాపం.. తో ...
ఏమి రాయాలో తోచని దిక్కులేని మనసు తో !!