17, ఫిబ్రవరి 2011, గురువారం

గత జన్మలో నేను బోర్లు వేసేవాడిని....


"హలో నేను బద్రునండి!!.."
"హలో చెప్పు బద్రు"
"కొత్త బోరు వేయిస్తానన్నారుగా ఎప్పుడు వేయిస్తారు ?"
" వీలు చూసుకొని వస్తా లే .."
బద్రు అంటే నా మామిడి తోట లో ఉండే లంబాడి రైతు.
అక్కడ ఉన్న లంబాడి వాళ్ళలో కొంచం తెలివిగల చదువుకున్న రైతులలో ఒకడు.
నావి, నా స్నేహితుడి వి కలిపి చెరో పది ఎకరాల మామిడి తోట ని కౌలు చేసే రైతు కం మా వ్యవసాయ సలహా దారు.
ఇప్పుడు ఉన్న నీటి వసతి చాలట్లేదు, కాబట్టి మూడు నాలుగు కొత్త బోరులు వేస్తే పుష్కలంగా నీరు ఉంటుంది, మామిడి చెట్ల మధ్య వేరే పళ్ళ చెట్లు వేద్దాం, ఇంకా ఖాళీ ప్రదేశం లో కూరగాయల మొక్కలు సాగు చేద్దామని ప్రతి పాదించాడు.

నా చిరకాల కోరిక ప్రకారం, నా కష్టార్జితం పెట్టి, ఇంకాస్త అప్పు చేసి ఆ తోట కొని ఆరేళ్ళు అయింది. ఇన్నేళ్ళూ పెద్ద పట్టించుకోలేదు. వ్యవసాయం అంటే అంత తేలికైన వ్యవహారం కాదు. దానికి వెచ్చించ గల సమయం, ఓపిక, ఉండాలి. నేను వుండే ఇంటికి 70 కిలోమీటర్లు దూరం గా ఉండటం తో, ఆఫీస్ పని వత్తిడి తో అస్సలు తీరిక ఉండని నేను, నా స్నేహితుడు మా తోట లోకి చాలా అరుదైన అతిధులుగా గా అడుగు పెడుతుంటాం.

ప్రస్తుత పరిస్థితి ప్రకారం బద్రు ఎమెర్జన్సీ డిక్లేర్ చెయ్యడం తో ఒక రోజు ఆఫీస్ కి సెలవ్ పెట్టి వెళ్ళాల్సి వచ్చింది.
బోరు వెయ్యాలంటే అదో ఆషామాషీ వ్యవహారం కాదు. ఎక్కడ బోరు దింపాలో ఆ పాయింట్ జియాలజిస్ట్ గానీ, లేక సాంప్రదాయ పద్దతిలో భూమిలో నీరు ఉన్న పాయింట్లు పట్టే వాళ్ళు కానీ కావాలి.

సరేనని తెలిసిన ఇంజనీర్ ఒకాయన్ని అడిగి ఒక జియాలజిస్ట్ ఫోన్ నంబర్ సంపాదించాం. అయన కి ఫోన్ చేసి అప్పాయింట్మెంట్ తీస్కోని, ఆ రోజు తెల్లారే 5 గంటకి ఆయన్ని కార్ ఎక్కించుకొని తోట కి బయలుదేరాం.
ఈలోపు బద్రు కూడా తోట దగ్గర ఊర్లో ఉన్న ఒక యాదవులాయన కి ఈ విద్య తెలుసు అని ఆయన్ని కూడా పిలిపించాడు. మేము తోట లోకి వెళ్లేసరికి వాళ్ళు కూడా రెడీ గా ఉన్నారు.

మా జియాలజిస్ట్ వయసులో అరవై పైబడ్డాయన రిటైర్డ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగి , హాబీగా ఇలా ఈ విద్య తో అడిగిన వాళ్లకి సహాయం(?) చేస్తున్నారుట. అలా పాయింట్ గుర్తు పట్టి చెప్పినందుకు పాయింట్ కు రూ.500 /- మాత్రం పుచ్చుకుంటారు. మనమే లో వాహనం లో తీస్కేల్లాలి. నాటు పద్దతిలో పాయింట్లు చూపే అతనుకూడా రేట్ అంతే. మా సాంకేతిక (?) జియాలజిస్ట్ గారు ఆ నాటు మనిషిని చూసి, అతన్ని ఎందుకు పిలిచారు అని అడిగారు. మేము పిలవలలేదు మా బద్రు పిలిచాడని చెప్పాం. మేము వెళ్ళిన గంటకి రెండు పెద్ద వాహనాల్లో బోర్ వేసే యంత్రం వచ్చింది, వెంట పదిహేనుమంది పని వాళ్ళతో.

మా జియాలజిస్ట్ గారు బోర్ ఏ పక్కన కావాలో అడిగి అక్కడికి పదండన్నారు. ఈలోపు నాటు పద్ధతి మనిషిని నువ్వెలా పడతావోయ్ పాయింట్లు అని అడిగారు. అతను వేపకర్ర తోను, కొబ్బరికాయ తోను అని చెప్పాడు. పుట్టి బుద్దెరిగాక ఇలాంటి వేమీ చూడని మేము అమాయకంగా వాళ్ళని అనుసరించాము.

ఈశాన్యం మూల చూద్దాం అంటూ అయన జేబులోంచి L ఆకారం లో ఉన్న రెండు రాగి కడ్డీలు తీసి వాటిని రెండు చేతుల్లో పట్టుకొని గిర గిర తిప్పుతూ నడవసాగారు. అలా ఒక ఇరవై అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకి వెళ్లి, ఇలా అయిదు ఆరు సార్లు నడిచి ఈసారి దిశ మార్చి ఇంకో వైపు నడిచి మళ్ళీ ముందుకీ వెనక్కీ వెళ్ళొచ్చి, అచ్చం మన సెన్సెక్స్ లాగా ప్రవర్తించి . చివరకు ఒక చూట నుంచొని ఇక్కడ పుల్ల పాతండి గుర్తుగా అన్నారు. మా రైతు అసిస్టెంట్ గునపం తో తవ్వి అక్కడ ఒక ఒక గుంత చేసి చిన్న కర్ర పాతాడు. అక్కడనుంచి ఇంకొంచం పక్కకి వెళ్లి అక్కడా అలాగే షేర్ మార్కెట్ ట్రెండ్ లో ప్రవర్తించి ఇంకో చోట పాయింట్ పెట్టారు. ఇలా నాలుగు పాయింట్లు నా పొలం లో, నాలుగు పాయింట్లు నా స్నేహితుని పొలం లో వేసి ఆనక ఫీసు పుచ్చేస్కోని ఇక బోర్లేస్కోండి నీళ్ళే నీళ్ళు, అని చెప్పారు. అలా చెప్పిన మాట బుద్ది గా వినే లక్షణం మా బద్రు కీ లేదుగా . "నువ్వు నందా వయితే నేను బద్రు బద్రినాథ్ " అనే టైపు.

అంచేత తను పిలిపించిన అతన్ని కూడా ప్రతాపం చూపమన్నాడు.ఇక ఆ వచ్చిన అతను పేరు సరిగ్గా గుర్తు లేదు, ప్రస్తుతానికి భగీరధుడు అనుకుందాం, V షేప్ లో ఉన్న వేప కొమ్మ కి కింద తాటాకు బిగించి కట్టాడు. పంగల కర్ర లా ఉన్న ఆ వేప కొమ్మ ని రెండు చేతులతో వెనక్కి పట్టుకొని తల వంచుకొని భూమినే చూస్తూ నడవసాగాడు. ఇందాక పెద్దాయన లాగానే సెన్సెక్స్ స్వభావం చూపించి, ఒక చోటా ఆగి ఇక్కడే అన్నాడు. పైగా అరచేతిలో కొబ్బరికాయ పెట్టుకొని మళ్ళీ అలాగే నడిస్తే ఇందాక చూపిన ప్రదేశం దగ్గర కొచ్చేసరికి,
పీచు ఉన్న వైపు పైకి లేచి నుంచుంది. అలా ఒక పది సార్లు కొబ్బరి కాయ నుంచున్న తర్వాత సరిగ్గా ఇక్కడే అని మార్క్ చేసాడు. ఆ పాయింట్లు ఈ పాయింట్లు వేరే వేరే ఉన్నాయిగా దేన్నీ ఆధారం చేస్కోవాలి , అని అడిగా ఆ రెండు పాయింట్స్ మధ్య లో జల ఉన్నది ఎక్కడ వేసినా ౩ అంగుళాలు బోర్ నుంచొని పోస్తుంది ( ఏంటని అడక్కండి మా ఏరియా లో పొలాల బ్రోకర్లు చెప్పే రొటీన్ దవిలాగ్) అన్నారు.

సరే బోర్ వేసే వాహనం వచ్చి ఆ పాయింట్ మీద డ్రిల్ బిట్ వచ్చేలా నుంచుంది. నేనూ, మా వాడు భక్తిగా ఆ డ్రిల్ బిట్ కీ, దానికింద పాయింట్ కీ పూజ చేసి కొబ్బరి కాయ కొట్టి మహా జల యజ్ఞానికి శంఖు స్థాపన చేసిన మంత్రిగారిలా ఫీలయ్యం. ఆనక కొంచం ఎడం గా నుంచోండి తోలేసి. అంటూ డ్రిల్లింగ్ మొదలెట్టారు.

వచ్చిన పని వాళ్ళు మధ్య ప్రదేశ్ నుంచి వచ్చారు. కేవలం కూలి కోసం కుటుంబాలు ఒదిలేసి ఇక్కడ ఒంటరి గా ఉంటూ వండుకు తింటూ పని చేస్తూ ఉన్నారు. వీళ్ళని ఎందుకు పెట్టుకున్నారు మన తెలుగు వాళ్ళు లేరా అని అడిగా. దానికి కాంట్రాక్టార్ చెప్పిన సమాధానం "మన తెలుగు పని వాడు నాలుగు రోజులవగానే సీనియర్ అవుతాడు అటు తర్వాత పన్లోకి రమ్మంటే మనిషిని పంపుతా నాకూ వాడికీ జీతం ఇవ్వు అంటారు, శానా కష్టం వీళ్ళే రైటు పడుకోవటానికి చోటుఇచ్చి , తిండి పెట్టి నాలుగు వేలిస్తే కస్టపడి పని చేస్తారు పేచీలేని వ్యవహారం, అన్నాడు.

నిజం గా చాలా మంచి పనివాళ్ళు ఒక గోల లేదు, అరుపులు లేవు. ఒక పది మంది బోర్ దగ్గరుంటే మిగతా వాళ్ళలో ఇద్దరు బండి లోంచి గ్యాస్ స్టవ్ దింపి బియ్యం కడిగి పెద్ద గిన్నె తో అన్నం వండారు. బెండకాయలు ఉల్లిపాయలు టమాటోలు తరిగి కూర వేపారు. కారం ఉప్పు మసాల బాగా దట్టించి, చాలా సునాయాసం గా ఇరవై మందికి చాల కొద్ది సమయం లో భోజనం రెడీ చేసారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇద్దరిద్దరు క్రమ శిక్షణతో భోజనం చేసి పల్లెలు కడిగి మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయారు. ఎక్కడా పని ఆగలేదు. అలాగే రాత్రి లోపు మూడు సార్లు వండుకు తిన్నారు.

మూడు గంటల్లో సమయం లో 200 అడుగుల బోర్ వేసి, కేసింగ్ దింపి, పక్క పొలం లోకి వెళ్ళారు.
ఇంతకీ మన సైన్సు + నాటు శాస్త్రజ్గులు చూపిన పాయింట్ లో రెండు అంగుళాల కన్నా చిన్న బోర్ పడింది.
ఇక పక్క నా స్నేహితుని పొలం లో ప్రయత్నించిన రెండు పాయింట్లలో అంగుళం బోర్ పడింది దాంతో ఒక పాతిక వేలు ఖర్చు నిరాశ. పైగా పొద్దున్న ఆరుగంటల నుంచి రాత్రి పన్నెండు దాక ఆ బోర్ వాహనం పక్కన నుంచొని ఆశ గా చూడటం. కొంచం నిరాశ గా అనిపించినా మళ్ళీ వేయిద్దాం లే అని సర్ది చెప్పుకున్నాం.

ఎందుకీ కధంతా చెప్పానంటే ఈ మధ్య టీవీల్లో జాతకాలు వెర్సస్ నాస్తికులు, దేవుళ్ళు వెర్సస్ సాతానులు , వివిధ రకాల అడ్డగోలు చర్చలకు తోడుగా చానళ్ళ వాళ్ళు అతితెలివి కార్య క్రమాలు గత జన్మ లు అంటూ హడావిడి చేస్తున్నారుకదా. దాంట్లో శాస్త్రీయత ఎంతో గానీ ఆంకర్ మాత్రం చానల్ ఉప్పు నాకిన పాపానికి తెగ ఊదర కొట్టటం, ఆ వచ్చిన గత జన్మల డాక్టర్ కూడా విపరీతం గా ఒప్పించటం, అందులో పాల్గొన్న నటులు కూడా గత జన్మ లోకి వెళ్లి చూసి వచ్చేయండి అని వీసా ఇచ్చి పంపితే ఏకంగా వేల వేల ఏళ్ళ వెనక్కి వెళ్లి అక్కడ పాత రాతియుగం నాటి పనిముట్లు తెగ మెచ్చేసుకోవటం భలే కామెడీ గా ఉంది. ఇంకో చానల్ వాళ్ళు జన విజ్ఞాన వేదిక వాళ్ళని పిలిచీ ఆ వైద్యుడికీ, జవివే
వాళ్ళకీ తగవు మంట పెట్టి అందులో సిగరెట్ వెలిగించుకొని పొగ రింగులు ఒదలటం మొదలెట్టారు.

అసలు ఈ దొంక తిరుగుడు కధలేంటి ? ఆ బోర్ గోలేంటి ? పాయింట్లు పట్టటమేంటి ? మధ్యప్రదేశ్ పని వాళ్ళేంటి ? ఈ గత జన్మ రహస్యం గోలేంటి ? నీకేమైనా పిచ్చి పట్టిందా లింకుల్లేకుండా రాస్తున్నావ్ అనకండి.....
ఆ రోజు పొలం లో జియాలజిస్ట్ కరెక్టా ? నాటు భగీరధుడు కరెక్టా ? మరి రెండు పాయింట్లు ఫెయిల్ అయి పాతిక వేలు ఎలా పోయాయి ...?
టీవీ షోలో గత జన్మల డాక్టర్ కరక్టా? ఇలాటి వన్నీ చీల్చి చెండాడి ఎవరినైనా సరే తూ నా బొడ్డు అనే జవివే వాళ్ళు కరక్టా ? మరి జనం అలాంటి ప్రోగ్రాం ఎగబడి ఎందుకు చూస్తారు ఫోన్లెందుకు చేస్తారు ?

నాకైతే ఈ గోల ఏమీ పట్టకుండా ఆ రోజు పొలం లో పద్దెనిమి గంటలు క్రమశిక్షణ తో ఆగ కుండా పని చేసి, వంటలు చేసుకు తిన్న ఆ పని వాళ్ళే కరెక్ట్ అని పించారు.
సొంత రాష్ట్రము . సొంత మనుషులను ఒదిలి పొట్ట కూటికి వచ్చి,
మాయ మర్మం లేని,
అలుపులేని ఆ జీవిత బాట సారులే కరెక్ట్ అనిపించారు.
వాళ్లకి ఇలాంటి ఏ గోలా లేదు,
నమ్మకాలు లేవు, అమ్ముడు పోవటం తప్ప ,
టైమింగ్స్ లేవు, అలసి పోవటం తప్ప,
స్ట్రైకులు, బందులు, ప్రత్యేక కోరికలూ లేవు, డిమాండ్లు లేవు , కమాండ్లు లేవు, కుదిరిన చోట నడుము వంచటం తప్ప
జాతకాలు వాస్తులు లేవు, పనిలేక పోతే పస్తులు తప్ప
వాళ్ళని తీస్కెళ్ళి చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్లు వేయించి పని రాబట్టాలి.
వాళ్ళే కరెక్ట్ ఇంకెవరి వల్లా కాదు.

!!శ్రమయేవ జయతే !!


11 కామెంట్‌లు:

  1. సార్, కరెక్టుగా మీ టపా ఓపెన్ చేసే సమయానికి మాకు తెలిసున్న ఆవిడ ఫోన్ చేసారు..కొద్ది సేపు మాట్లాడాక ఇంక ఉంటానమ్మ గత జన్మ రహస్యం చూడాలి అన్నారు...అది ఏంటండీ అని అడిగాను...నా అమాయక మొహం ఊహించుకుని..విషయం చెప్పారు చూచాయగా..యీ లోపు షో టయిము అయ్యింది యీ రోజు ఆనంద్ సినేమాలో నటించిన రాజా గత జన్మ వస్తుందీ అని పెట్టేసారు. నేను ఆవిడ ఫోన్ లో చెప్పబట్టీ మీ పోస్ట్ రెండవ భాగము బాగా అర్థం అయ్యిందండీ...నేను బీసీ లో పుట్టినట్టు కర్రెంట్ అఫ్ఫైర్స్ లో ఇంత పూరా అని పెద్ద పెద్ద సందేహాలు వస్తున్నాయి నాకు..
    పోస్టు చాలా బాగుందండీ...లింకు భలే బాగా బాగుండి ఫ్లో బాగా కుదిరింది.చివర లయిన్లు సూపరు..

    రిప్లయితొలగించండి
  2. in our chitoor every body digging borewell up to 1000 feets, but no water ... since u gigged only up to 200 feets and bloged for it ........... surprise .............shocking............!!!!

    రిప్లయితొలగించండి
  3. @ ఎన్నెల : థాంక్స్ !
    @అజ్ఞాత : enni అడుగులు వేయాలన్నది ఆ ప్రదేశం మీద ఆధార పడి ఉంటుంది. మా ఏరియా లో ఇళ్ళల్లో బోర్లు నలభై అడుగులకే పడతాయి పొలాల్లో 200 అడుగులు వేస్తారు. బ్లాగ్ పోస్ట్ రాసింది ఎందుకో మళ్ళీ చదివి తెలుసుకోండి. and I too surprised and shocccckkked to read this comment !!

    రిప్లయితొలగించండి
  4. అజ్ఞాత చెప్పేది వాస్తవమే. అనంతపురంలో బోర్ వెల్స్ 500' దాకా వుంటాయి. కొన్నిచోట్ల 750' వరకూ వెళతారు. అది మన రాళ్ళసీమ ఆత్రేయ గారు. ఇది చూడండి.
    http://www.indiawaterportal.org/ask/5671

    రిప్లయితొలగించండి
  5. చాలా అద్భుతంగా రాశారు! ఈ దిష్టి యంత్రాలు అమ్మేవాళ్ళు , శని యంత్రాలు అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు ఛానెళ్ళలొ! శని ని ఒక విలన్ లాగా చూపిస్తున్నారు. ఆయన కన్ను మీ మీద పడిందా, సర్వ నాశనమే! మా పూసలు కొని కట్టుకోండి అని సందేశం!

    గత జనం రహస్యం వట్టి ట్రాష్ గా ఉంది. వాళ్ళ మీద ఒక PIL వేస్తే బాగుండనిపించేంత!
    గత జన్మ అంత ఆషామాషీగా గుర్తొస్తే ఇంకేముంది?

    నిజానికి ఇదంతా ఒక బిజెన్స్ టాక్టిక్! దీంట్లో డాక్టర్ల నుంచి మీరు చెప్పిన అందరికీ భాగం ఉంటుందేమో!

    చూసే ప్రేక్షలుంటే గత జన్మేమిటి, ఏకంగా దేవుడిని కూడా ప్రత్యక్షం చేయించేయగలరు వీళ్ళు!

    మీ పోస్టు ఆఖరి పేరా చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  6. thanks Sujatha garu !!

    ఇంకో అజ్ఞాత గారు మీక్కూడా మళ్ళీ : ఆ పోస్ట్ రాసింది బోర్ల గురించి కాదు. మా ఏరియా లో బోర్లు ఎక్కువ కింద కి వేయక్కర్లేదు. సరైన పాయింట్ దొరికితే 50 అడుగులే ఎక్కువ.

    రిప్లయితొలగించండి
  7. నేనూ ఈ ప్రోగ్రాం చూసానండోయ్. కాకపోతే నాకు ఏ మూగ మనసులు లాంటి సినిమానో రీమేక్ చేస్తే చూసిన ఫీలింగ్ మాత్రం కలిగింది. శ్రమయేవ జయతే, అదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్.

    రిప్లయితొలగించండి
  8. బలే ఉన్నై సార్ మీ ఎక్స్పీరియెన్స్

    రిప్లయితొలగించండి