
సత్యం సాయి అయితే, అసత్యం హాయి !! ఆయనకి ఏమీ అవలేదు బానే ఉన్నారు అనే మాట అసత్యం అయినా ఎంతో మందికి హాయే !!
ఇదేదో ప్రాస కోసం పడిన పాటు కాదు. గత మూడు వారాలు పైగా టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు పడుతున్న శ్రమ చూస్తే వెంట నే నాకు అలా స్పురించింది.
నేను సత్య సాయి భక్తులలో ఒకడిని కాదు, అలాగే అయన చేసే మహిమలను, భక్తుల విశ్వాసాన్ని ఖండించే శాస్త్రజ్ఞాని ని కూడా కాదు.
నా బాల్యం నుంచి సత్యసాయి ఆరాధన మా ఇంట్లో ఉంది. మా అమ్మ ఒక్కతే ఒంటరి ఈ విషయం లో. అసలు ఆయన ఫోటో ఎలా మా ఇంట్లో ప్రవేశించిందో, ఎ కారణం మా అమ్మ ని ఆయన ఆరాధన కు ప్రేరేపించిందో ముఖ్య విషయం కాదు.
మా అమ్మ ఎన్నో పూజలు చేసింది. త్రినాధ పూజ, సాయి బాబా భజనలు, గ్రహశాంతులంటూ ఆరాధనలు, దానాలు ఒకటేమిటి చాలా చేసింది.
అన్నిటికీ ఒకటే కారణం !! అయినా ఏమి చేసినా ఇప్పటికీ ఫలితం లేదు.
రిటైర్ అయ్యాక మరి కాస్త ఎక్కువ బాబా భక్తి వైపు మొగ్గింది. పదమూడు ఏళ్ళ క్రితం మా నాన్న పోయాక ఈ భక్తి మరింత ఎక్కువయింది. ఆ భక్తి లోనే పుట్టపర్తి లో చిన్న ఇల్లు కొనుక్కొని అక్కడే ఉండి పోతానని అడిగింది. వయసు పెరిగి ఎన్నో ఆటు పోట్లని చూసిన ఆమె కోరిక ఏదైనా సరే నని అనే వాడిని, లేదా సున్నితంగా వారించే వాడిని. ఈ కోరికకి మాత్రం తీవ్రంగా అభ్యంతర పెట్టాను. ఫలితం ఎప్పుడన్నా ఒకసారి పుట్ట పర్తి వెళ్లి ఆమె తృప్తి మీరా ఉండి వచ్చేది. ఆమె భక్తికి, ఆరాధన స్వేచ్చ కి ఎటువంటి ఆటకం లేదు మా ఇంట్లో. నేను కూడా మానసిక పరిపకత్వత లేని రోజుల్లో సాయిబాబా గారి గురించి, ఆయన భక్తుల గురించి , నోటి కొచ్చినట్లు మాట్లాడే వాడిని. కానీ గత కొద్ది సంవత్సరాలుగా నా మానసిక పరిపక్వత పెరిగిందో, లేక మానసిక స్థైర్యం తగ్గిందో నాకూ భగవంతుని మీద ధ్యాస పెరిగింది. ముక్ష్యంగా మా ఆమ్మ తీవ్ర అనారోగ్యం లో ఉన్నప్పుడు నాకు సహజం గానే భగవంతుని మీద మరింత గురి కుదిరింది. తప్పదు నా స్వార్ధం నాది. సంవత్సర కాలం తీవ్రం గా బాధ పడి నా దేవుడో,లేక ఆమె భగవానో కరుణించి ఆమె మళ్ళీ స్వస్థత పొందింది. అప్పటినుంచి నా మెదడు మనసు కు కమ్మిన పొరలు కరిగి, నా భావాల్లో దేవుళ్ళ మధ్య భేదాలు తొలగి పోయాయి. అప్పటి నుంచి దేవుడు ఒక్కడే అన్న భావం నాకు మరింత బలపడింది.
కానీ ఇదేంటి ఇప్పుడు ఇలా జరుగు తోంది, భగవాన్ అని కొలువ బడ్డ ఆయనే విషమ పరిస్థితి లో ఉన్నారు. ఇప్పుడు భగవంతుడు తన లీల చూపడా?
ప్రపంచవ్యాప్తం గా కోట్ల మంది భక్తులని కుదేలు చేస్తూ అయన అలా నిస్తేజం గా ఆసుపత్రి లో ఉండిపోయారు (?)
ఎన్నో ఆవేదనలు, ఆక్రందనలు, నిస్సహాయ, పరిస్థితుల మధ్య సాయి భగవాన్ భక్తులు కొట్టు మిట్టాడుతున్నారు.
రక రకాల టీవీ , పేపర్ కధనాల తో అయోమయ మయి ఏది వినాలో , ఏది నమ్మాలో తెలియక క్రుంగి పోతున్నారు.
మా అమ్మ కూడా మినహాయింపేమీ కాదు. మొదట్లో ఆశ గా పేపర్ చదివి, టీవీ చూసేది ....
రెండో వారం లో ఈ కధనాలు, దానికి కొంత మసాలా కలిసి కిచిడి వార్తలు ఎక్కువై మరింత బాధ పడటం మొదలు పెట్టింది. ఇది నేను తట్టుకోలేని విషయం.
గత వారం గా టీవీ కూడా ఒదిలేసి తన గది లో ఒంటరి గా గడపటం, ఆహారం మీద శ్రద్ధ తగ్గటం, మౌనం గా బాల్కనీ లో కుర్చీ వేసు కొని కూర్చోవటం నన్ను బాధ పెట్టే విషయాలు.
బయట ప్రపంచం లో కూడా విచిత్రమైన విషయాలు కొన్ని,
ఈ టీవీ, పేపర్ వాళ్ళ లాగే మామూలు జనం కూడా తమకు తోచింది మాట్లాడు కుంటున్నారు.
జీవితం లో ఒక్క పైసా పుట్టపర్తి సాయి ట్రస్ట్ కు దానం ఇవ్వని మనుషులు,
సాటి మనిషి ఇబ్బంది లో ఉంటే పైసా సాయం చెయ్యని వాళ్ళు,
అక్కడ లక్షల కోట్లు మూలుగు తున్నాయట, టన్నుల కొద్దీ బంగారం ఉందట అదంతా అయన (సాయి బాబా) భక్తుల నుంచి సంపాదించినదే కదా .. అంటూ మాట్లాడు కుంటున్నారు.
అసలు పుట్టపర్తి లో ఒక్కసారి కూడా కాలు పెట్టని వాళ్ళు
ఆయనంతా గొప్ప గొప్ప వాళ్ళకే ఇస్తాడు, మామూలు మనుషుల వంక చూడను కూడా చూడదు. అంటూ నిష్టూరాలు పోతున్నారు.
ఒకటి ఖచ్చితం గా చెప్పగలను ... ఇలా నిస్తూర పడే వాళ్లకి గనక అయన ఒక ఉంగరమో, విభూదో కనీసం యాదృచ్చికం గా ఇస్తే వాళ్ళు అయనని పొగిడే వాళ్ళేమో.
నేను పరిశీలించిన కొంత మంది మనుషులు దేవుడంటే, బాబాలంటే కేవలం మహిమ లే నంటూ అనుకునే వాళ్ళున్నారు.
చేసే ఉద్యోగం లో ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేకుండా, ప్రతి చిన్న విషయానికి నాలాటి వాడిని డౌట్లు అడిగే కొంత మంది ప్రభుద్దులు కూడా పుట్టపర్తి మీదా చర్చలు చేస్తున్నారు.
ఇక మా అమ్మ విషయానికి వస్తే , కొంత మంది పని లేని వాళ్ళు మా ఇంట్లోకి తొంగి చూసి "ఏంటి ఆయనింకా చచ్చిపోలేదా..? అంటూ అడుగు తుంటే సొంత అన్న కి ఒంట్లో బాలేక పోతే బాధ పడినట్లు , మౌనం గా ఒంటరిగా కుమిలి పోతోంది. ఇది నన్ను కలచి వేస్తోంది.
నేను బాబా భక్తుడిని కాదు , భజనలకి వెళ్ళ లేదు, పుట్టపర్తి చూడలేదు, బాబా ని బయట అస్సలు చూడ లేదు...
కానీ మా అమ్మ కోసం , మా అమ్మ లాంటి ఆ తరం వాళ్ళ కోసం...
సాయి భక్తిని ఒక పరంపరలా కొన సాగిస్తున్న వాళ్ళ కోసం...
సాయిని భజనలని ఒక సంస్కృతి లా పాటిస్తున్న వాళ్ళ కోసం..
కేవలం మన పెద్ద ల కోసం ఆ పెద్దాయన్ని తూలనాడటం, సరదా విషయం గా మాట్లాడు కోవటం మానేద్దాం.
ఒక ఎనభై ఆరేళ్ళ పెద్దాయన మన ఇంట్లో ఆ పరిస్థితి లో ఉంటే ఎలా గౌరవిస్తామో...అలా గౌరవిద్దాం.
అందునా విద్య, వైద్య, సేవా రంగాల్లో అయన చూపిన బాట ప్రభుత్వాలకే మార్గ దర్శకం కదా...
దాహార్తి తో గొంతెండి పోతున్నా మన ఇంటి ముందు రోడ్ వేసే కూలికే నీల్లివ్వని మనం
లక్షల మంది కి మంచి నీటి వసతి సమకూర్చిన అయన గురించి వెకిలి గా మాట్లాడొద్దు.
అవి ప్రజా ధనమే, అయన సొంత సోమ్మేమీ కాదు అనుకున్నా..
కోట్ల కొద్దీ ప్రజా ధనం సొంతానికి తినేసినా రాజా గాడి(నే)ద నే సహించాము.
ఈయనేమి చేసారు ?
వేల ఎకారాలు దిగ మింగి కొడుకులకిచ్చిన వెధవల నే భరించాము
ఈయనేమి చేసారు ?
అసలు రాజకీయం, అధికారం , అడ్డు పెట్టుకొని
పంది కొక్కుల్లా తినేస్తున్న వాళ్ళనే ఏమీ అనకుండా సహిస్తున్నాం కదా
ఈయనేమి చేసారు ?
అందుకే మౌనం గా ఉందాం
అయన బాగుంటే ఉంటె భక్తులకి ఆనందం
మనకెందుకూ ....?
మీ ఊహా గానాలలోలా అయన ఎప్పుడో వెళ్లి పోయున్దోచ్చు .....
లేదా అయన చెప్పినట్లు దివి నుంచి కాషాయ రంగు చుక్కలా దీవించ వచ్చు
ఇవేమీ కాదా ఆదివారం లేచి వచ్చి వెన్నెల నవ్వులు కురిపించా వచ్చు...
ఏదైనా మీరే గెలుస్తారు.
మీ ఊహలు నిజమవటమా..
లేక అయన మహిమాన్వితుడని నిరూపింపబడి మీరూ అయన భక్తిలోకి మళ్ళటమా ..!!
ఏమైనా ఈ సమయం లో మాట్లాడుకునే విషయాలు కానివి ఒదిలేద్దాం.
ఇది రాసిన నేను మనిషిని కేవలం మనిషిని
అయన మీద భక్తి తో రాయలేదు...
అయన మీద ద్వేషమూ లేదు...
నా మీద నాకు జాలి తప్ప.!!
ఒట్టు మీ అందరి మీద !!!