1, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఇది చదివితే మీరూ....


ఏప్రిల్ ఫస్ట్ పండగ : ఈ ఫూల్స్ డే ఆనందం, ఎదుటి వాళ్ళని వెధవ (ఫూల్) ని చేసి ఆ కాసేపు పడే సరదా ఎలా గుంటుందో మన అందరికీ తెలుసు.
మళ్ళీ కొత్తగా చెప్పేదేముంది ?
చాల రోజుల క్రితం చదివిన మార్క్ ట్వైన్ కొటేషన్ గుర్తుండి పోయింది. "ఏప్రిల్ ఒకటి: ఈ రోజు, సంవత్సరమంతా మనమేంటో గుర్తు చేసే రోజు."
రోజులాగానే నిన్న కూడాహాస్టల్ లో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేసి కాసేపు కబుర్లు చెప్పి రేపు ఏప్రిల్ ఫస్ట్ కదా అందరినీ ఫూల్ చేస్తారా నువ్వు నీ ఫ్రెండ్స్ అని అడిగా..
ఏమైనా ఇళ్ళకి ఫోన్ చేసి అమ్మ నాన్నలకీ పెద్దలకీ ఫోన్ లో ఫూల్ చెయ్యటం కోసం ఏదన్నా బాధాకర మైన విషయం చెప్పకండి కంగారు పడతారు. కాసేపైనా సరే ఆ కంగారు భరించ లేనిది అని నీతి సూత్రం చెప్ప బోయా
వెంటనే మా అమ్మాయి " ఏ కాలం లో ఉన్నావు నాన్నా నువ్వు, ఇంకా అలా ఎందుకు చేస్తాం, అయినా మేమే పెద్ద ఫూల్స్ ఇంకోళ్ళని చెయ్యటమా? అంది.
అదేంటి అని ఆరా తీసా
ప్రతి పరీక్ష ముందు బాగా చదివి నట్లనుకుని, రాసి, ఈ లోపు అందరికీ బాగా రాసా నని చెప్పుక్కొని ,తీరా రిజల్ట్స్ వచ్చాక మార్కులు పెద్ద గా రాక ఫూల్స్ అవట్లేదా? కొత్త గా అయ్యేదేముంది అంది.
సరదా చెప్పినా ఈ సూత్రం మన అందరికీ వర్తిస్తుందని అనుకున్నా.
కొస మెరుపుగా ఇంకో విషయం చెప్పింది "మనం ఎవరినన్నా ఫూల్ చేసాం అంటే అది మన తెలివి కాదు,
ఎదుటి వాళ్లకు మన మీద ఉన్న విశ్వాసం, దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరినో ఫూల్ చెయ్యటమంటే మనని మనం ఫూల్ చేస్కునట్లే " అంది.
నాకు జ్ఞాన నేత్రం తెరుచు కుంది.

ఈ విషయం మాత్రం నిజం,

మనం...
మనం ఎప్పటికీ వెధవలమే.
మనం గుప్పెడు నోట్ల తో బజారు కెళ్ళి
వీసెడు సరుకుల తో చప్పుడు చెయ్యకుండా ఇంటి కొచ్చి
మౌనం గా బాధ పడే మంచి వెధవలం..
మన పన్నులతో జీతాలు తింటూ మన పనికే లంచం అడిగితే
ఇవ్వక తప్పని నిస్సహాయులం...

మనం

చేసే పని లంచం తో కొలుస్తూ, దేశాన్ని తొలుస్తూ
సొంత ఇంటికే కన్నం వేస్కునే దొంగ వెధలం.
మనం
ఎవడి వెనకో ఝండా పట్టుకు తిరుగుతూ
అదంతా ప్రజా సేవ అనుకుంటూ
కుటుంబాన్ని దేవుడికి ఒదిలేసే కార్యకర్తలం...
రోజు కష్టాన్ని, రెండు గంటల సినిమా చూసి,
ఆ ఆనందంతో డబ్బుని, కష్టాన్ని ఒదిలించుకునే సరసులం.

కష్టాలనీ, దు:ఖాన్ని, ఒక్క గుక్క మద్యం తో కడిగేసి

సుఖం గా ఉందామనుకునే నిషారాబులం..
షేర్ మార్కెట్ మెట్లమీద, దున్నలతో తన్నించు కుంటూ, ఎలుగుతో గీరించు కుంటూ..
అయినా అక్కడే, పోయిన సంపద నెతుక్కునే అశాజీవులం,
మనం
జూదపు ముక్కల రవ్వడిని, గుర్రపు డెక్కల సవ్వడినీ,
వింటూ జీవితాలని పణం పేట్టే ధర్మ రాజులం....

మనం

మన వోట్లతో మన నెత్తికెక్కి, మనలో మనకి కీచు లాటలు పెట్టి
ఆ సందట్లో డబ్బు చేసుకునే నలుగురు వెధవల లో ఒక వెధవ నెన్నుకొని
వాడే సరైన నాయకుడు, వాడిని మించిన వాడు లేడు, రాబోడు

అనుకుంటూ రోజులు వెళ్ళ బోస్తున్న పెద్ద వెధవలం
అందుకే మనలో మనకి హ్యాపీ ఫూల్స్ డే !!!




6 కామెంట్‌లు:

  1. ayya baaboy! vaasthavamlo brathakaalanukunte Inthagaa manani manam thittukovaalaa!? baagundhandi.. jeernam chesukovadaaniki prayathnisthaanu.

    రిప్లయితొలగించండి
  2. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ....
    ధన్యోస్మి !!

    రిప్లయితొలగించండి
  3. >>
    "మనం ఎవరినన్నా ఫూల్ చేసాం అంటే అది మన తెలివి కాదు,
    ఎదుటి వాళ్లకు మన మీద ఉన్న విశ్వాసం, దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరినో ఫూల్ చెయ్యటమంటే మనని మనం ఫూల్ చేస్కునట్లే >>

    Excellent sir.

    May god bless your daughter.

    రిప్లయితొలగించండి
  4. >>"మనం ఎవరినన్నా ఫూల్ చేసాం అంటే అది మన తెలివి కాదు,
    ఎదుటి వాళ్లకు మన మీద ఉన్న విశ్వాసం, దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరినో ఫూల్ చెయ్యటమంటే మనని మనం ఫూల్ చేస్కునట్లే "<<

    మీ చిన్నారి ఆలోచనా విధానానికి హ్యాట్సాఫ్ ఆత్రేయ గారు.. తనని అలా పెంచినందుకు మీకు కూడా అభినందనలు. మీ చిన్నారి ఎన్నో ఉన్నత శిఖరాలని అందుకోవాలనీ భావిజీవితం తను కోరుకున్నరీతిలో ఆనందంగా గడపాలని నా శుభాశీస్సులు...

    రిప్లయితొలగించండి
  5. @ సునీల్ గారు, వేణు గారు, మా అమ్మాయిని ఎవరన్నా పొగిడినా, దీవించినా నాకు అవధుల్లేని ఆనందం
    ఆ ఆనందం కల్పించిన మిమ్మల్ని దేవుడు చల్లగా చూస్తాడు. ధన్యవాదములు.
    @కొత్తపాళీ గారూ
    ధన్యవాదములు

    రిప్లయితొలగించండి