
పాపం మేగాలాన్ అయన సహచరులు సముద్రం లో ఓడ దారి తప్పి పోయి వారాలు గడచీ తిండి అయిపోయి ఆకలికి తాళలేక ఓడ లోని కలప ని రంపం తో కోసి ఆ పొట్టు తిన్నాడు. కధ విన్న వయసుకి నాకు మేగాలన్ స్పానిషా, పోర్చుగీసా తెలీదు అసలు ఆ దేశాలు ఉన్నాయని కూడా తెలీదు. ఉబుసు పోక సాయంత్రాలు మా అమ్మ హిస్టరీ పాఠాలు చెప్పేది...కొలంబస్, వస్కోడా గామా అంటూ.
వినటానికి నాకు బోలెడు కుతూహలం, అర్ధం కాని అమాయకత్వం, నాలుగేళ్ళ వయసు ఉన్నాయి.
కడుపు లోకి అన్నం పెడుతూ, ఇలాంటి విషయాలు బుర్ర లోకి పంపించేది..
" మేగాలాన్ ఎందుకు షిప్ లో తిరిగేడు ఏమి సాధించాడు అనే విషయం కన్నా...ఆకలికి తిండి లేక రంపపు పొట్టు తిన్నాడన్న విషయం జీర్ణం కాని విషయం. అందులో మనం కమ్మగా అమ్మ చేతి ముద్ద తింటూ.."
హిస్టరీ, దేశభక్తి కధలు సోషల్ టీచర్ అయిన మా అమ్మ చెప్తుంటే జాలి తో మనసు బరువేక్కేది.
నిజం నాలుగేళ్ళకి ఇలాటి ఫీల్ ఉంటుందా అని మీకనుమానం రాకపోతే మీరు మిగతాది చదవండి.
అలా నా మొదటి గురువు మా అమ్మ మాట వినపడే వయసు నుంచి, మాట్లాడే వయసు గుండా, మాట వినే వయసుదాక ఎన్నో మంచి విషయాలు నేర్పి, మాట వినని వయసులోకి పంపింది మా అమ్మ.
ఆక్కూరలు తింటే సర్కస్ వాళ్ళలాగా తయరవచ్చు. సర్కస్ లో చేరొచ్చు అంటూ తినే తిండి దగ్గర మొదలు పెట్టి జీవితానికి దూర పరుగులో (లాంగ్ రన్) అవసరమైన పాఠాలు నేర్పిన మా నాన్న నాకు అమర్స్త్య సేన్ లాంటి గురువు.
ఒకటో క్లాసు నుంచి నుంచి మొదలుపెట్టి నాకు చదువు చెప్పిన సరోజినీ టీచర్, సుశీల టీచర్, నాగరత్నం టీచర్, శాంతి టీచర్ నాకు అభిమాన గురువులైతే.
తెలుగు మీడియం లో చదివిన నాకు ఐదో క్లాస్ ఒక్క సంవత్సరం లోనే హై-స్కూల్ ఇంగ్లీష్ నేర్పిన మార్తమ్మ టీచర్ నాకు సదా స్మరణీయురాలు.
హిందీ నేర్పిన కుసుమా టీచర్ నా పాలికి మున్షీ.
ఆ తర్వాత హై స్కూల్ లో నేను పిల్లలను పిల్లలుగా చూసిన టీచర్లను చూడలేదు. కేవలం భుక్తి కోసం చదువు చెప్పే ఉద్యోగులను తప్ప.
వాళ్ళ వాళ్ళ కుటుంబ సమస్యలు, ఆర్ధిక పరిస్థితులూ ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు కానీ అవి వారు చెప్పే చదువు వాసి పైనా , చెప్పించుకునే విద్యార్ధుల పైనా ప్రభావం చూపకూడదు కదా అని నేను అనుకునే వాడిని. వాళ్ళలో వాళ్లకి కీచులాటలు, రాజకీయాలు, ప్రయివేట్ పోటీలు, పక్షపాత ధోరణులు ఇవన్నీ విమర్శిస్తే నేను విద్యార్ధి ని కాను. అవన్నీ నాకనవసరం స్కూల్ కెల్లామా, కూర్చున్నామా ఇంటికొచ్చామా అన్నట్టు ఉండేవాడిని. లోపల్లోపల రగిలి పోతూ.
డిగ్రీ కాలేజి రోజుల్లో క్లాస్ కి సరిగ్గా వెళ్లక పోయినాన దూరం నుంచే చూసి, ఆఖరి రోజు దగ్గరకి పిలిచి నీ తెలివి కి నువ్వు చదవాల్సిన విధానం ఇది కాదు అంటూ నెమలి ఈక తో కొట్టినట్లు చెప్పిన మిత్రాజీ గారు, శాస్త్రిగారు. నాకు ఇప్పటికీ గుర్తొచ్చే గురువులు.
లా కాలేజి లో నేను చదివినది రెండేళ్ళే అయినా చేరిన రోజే నా బాల్య స్నేహితుడు నన్ను చిన్నప్పటి పేరు తో బుజ్జి అని పిలవగానే క్లాస్ లో అమ్మాయిల తో సహా అందరూ నన్ను బుజ్జి పిలవటం తో మా సుధాకర్ సార్ కూడా బుజ్జి అనిపిలిచి, నేను సరిగ్గా వినటల్లేదని ప్రతీ పాయింటు నన్నే లేపి అడిగి, తద్వారా నేను క్లాస్ లో అలెర్ట్ గా ఉండేలా చేసి నన్ను స్నేహితునిగా చూసుకున్న మహానుభావుడు.
అసలు పది మంది కూడి ఉన్న చోట ఎలా చెప్తే అందరూ మన మాటే వింటారో అనే ముఖ్య లక్షణం నేను నేర్చుకున్నది ఆయన దగ్గరే.
అప్పుడప్పుడూ నాకో టాపిక్ ఇచ్చి నన్ను లైబ్రరీ లో ప్రిపేర్ అవమని నాతో నే క్లాసు చెప్పించి, తప్పులు దిద్ది నాకు సబ్జెక్ట్ ఒంట బట్టేలా చేసిన పుల్లా రెడ్డిగారు,
23 ఏళ్ళకి సెకండ్ ఇయర్ లా మానేసి ఉద్యోగం వచ్చిందని ఎగురుకుంటూ జేరిపోయిన నాకు, రెండు నెలల ఇన్ హౌస్ ట్రైనింగ్ లో క్రమశిక్షణ అంటే ఏంటో తెలియ చెప్పి, ఉద్యోగమంటే ట్రైనింగ్ హాస్టల్ కాదు, సరదా కాదు, గీతాంజలి పాటలు కాదు ( హాస్టల్ బాత్ రూముల్లో మేము గంటల కొద్దీ కచేరీలు చేస్తుంటే అయన వచ్చి తలుపు మీద దరువేసి బయటకి లాగే వారు) " రాబోయే ముప్పై ఏడు ఏళ్ళు నువ్వు ఎన్నో అధిగ మించి ఎన్నో ఎత్తుల కెదిగి సాధించాల్సి ఉన్నది ఎంతో ఉంది అది ఒక్క క్రమశిక్షణ తోనే సాధ్యం" అంటూ నూరి పోసిన మా ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ డి. సీతారామరాజు గారూ నాకు ప్రతి ప్రాతః స్మరణీయుడు. బాగా స్ట్రిక్ట్ గా ఆయన్ని అందరూ తిట్టుకున్నా నేను లోపల్లోపల లెంపలేసుకుంటూ ఉండేవాడిని గౌరవించే వాడిని.
ఇరవై రెండేళ్ళ ఉద్యోగ గమనం లో పై అధికారులనుంచీ, సహోద్యుగుల నుంచీ, నేను నేర్చున్నది
ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో,
ఏమి చేస్తే ఫలిస్తుందో
ఏమి చెయ్యక పోతే వికటిస్తుందో
అన్నీ ప్రత్యక్షం గా నేర్చుకున్నా.. అవన్నీ పరోక్షం గా నేర్పిన పెద్దలకు వేల దండాలు.
వీల్లేనా ? మిత్రులు , బంధువులు, అందరినుంచీ ఎంతో కొంత నేర్చుకున్న ..
అందుకే వారందరినీ నా ఉపాధ్యాయులుగా భావించి అందరికీ కోటి దండాలు.
ఇప్పటికీ... సబ్ కుచ్ సీఖా హమ్ నే , నా సీఖే హోషియారీ.... సచ్ హై దునియా వాలోం కి హమ్ హై అనారీ.. ....అనిపిస్తుంటుంది.