3, సెప్టెంబర్ 2011, శనివారం

మర్జాలం = పిల్లి = మ్యావ్




ఐదో క్లాస్ పెద్ద పరీక్షలయాక ఎప్పటిలాగానే ఏప్రిల్ 25 న మా అమ్మ తో మేము ముగ్గురం పిల్లలం హైదరాబాద్ మా అమ్మమ్మ ఇంటికెళ్ళాం. రెండు నెలలు అక్కడే మేము ఇద్దరం అన్నదమ్ములం మధ్యలో ఒక ఆడపిల్ల , మా పెద్దమ్మ ఇద్దరు కొడుకులూ వెరసి నాలుగున్నర కోతులం. ఇల్లంతా లంక చేసి పెట్టేవాళ్ళం. అందుకని ఆ ఉధృతి తగ్గించటానికి మా అమ్మమ్మ ,మా పెద్దమ్మ, మా అమ్మ ముగ్గురూ శత విధాలా ప్రయత్నిస్తుండే వాళ్ళు.
పొద్దున్నే లెక్కలు చెప్పటం. సైన్సు బుక్స్ తెచ్చి అవి చదివి వివరించటం. ముఖ్యం గా ఫిజిక్స్ ఫర్ కిడ్స్ అనే బుక్స్ ఉండేవి అందులో పెద్ద పెద్ద భౌతిక శాస్త్ర సూత్రాలు చిన్న పిల్లలకు అర్ధం అయేందుకు ఇంట్లో అందుబాటు లో ఉండే పరికరాలతో ( గ్లాసు, గరాటు, కాగితం, నీళ్ళు, అట్టపెట్టెలు, రబ్బరు గొట్టం, ఇలా చాలా ) ప్రయోగాలు చేయించటం. ఏదోటి చేస్తూ మా అల్లరికి వరదకి భారీ ఆనకట్ట వేసే ప్రయత్నం చేసేవారు.

ఇంట్లో ఉన్న కధల పుస్తకాలు, కామిక్స్ అన్నీ చదవమని ఇచ్చేవాళ్ళు.పన్లో పనిగా వార పత్రికలు కూడా తీస్కోని అవన్నీ ఊదేసి నేను ఇంకా కావాలి అంటే మా పెద్దమ్మ ఒకరోజు మధ్యాన్నం మా ఇంటి రోడ్ చివర ఉన్న గగన్ మహల్ కాలనీ పార్క్ లో మేడ మీద ఉన్న లైబ్రరీ కి తీస్కెళ్ళి అక్కడ ఉన్న వందల పుస్తకాలు చూపించింది. నీ ఇష్టం ఇవ్వన్నీ నీకోసమే అని చెప్పింది. ఆ లైబ్రరీ లో అన్ని మాగజైనులు, నవలలూ, దొంతరల గా ఉన్నాయి. పొద్దున్న తొమ్మిది నుంచి రాత్రి ఎనిమిది దాకా మన ఇష్టం ఆతర్వాత ఇంటికి కూడా తీస్కేల్లోచ్చు. మెకన్నాస్ గోల్డ్ సినిమా లో కొలరాడో పరిస్థితి. అన్ని పుస్తకాలు ఉన్నాయి ఏది మొదట చదవాలా అని చూస్తుంటే పెద్దమ్మ ఒక రాక్ దగ్గర కొన్ని పుస్తకాలు చూపింది. శాంపిల్ గా ఆమె ఒక బుక్ తీసి ఇచ్చి ఈ బుక్ చదువు నీలాంటి వాడి కధే అని చెప్పింది. నారింజ రంగు అట్ట దాని మీద ఒక పిల్లాడి బొమ్మ కింద మార్క్ ట్వైన్ "టాం సాయర్" నండూరి రామమోహనరావు అన్న పేరు కనపడ్డాయి.
అలా మార్క్ ట్వైన్ మీద మక్కువ పెంచుకోవటానికి ఆ వయసులో నండూరి వారు నా మెదడు దుక్కి దున్ని, నాట్లేసి, మరిన్ని అనువాదాలతో నీరు పోసి, స్వచ్చమైన తేట తెలుగు అనువాదాల సేంద్రీయ ఎరువులేసి, నా పఠనాభిలాషని ఏపుగా పెంచి నేను మరిన్ని అనువాద పుస్తకాలు చదివేలా చేసిన అయన పుణ్యాత్ముడు.

అసలు పేరుకే అవి మార్క్ ట్వైన్ కధలు కానీ వాటిల్లో తెలుగుదనమేంతో ఉంది. ఆ వయసులో అప్పటికి మార్క్ ట్వైన్ ఎవరో తెలిసే పరిస్థితి లేదు కాబట్టి, అవన్నీ ఇంగ్లీష్ లో ఉన్నాయని తెలీదు. తెలిసినా ,పదేళ్ళ వయసులో తెలుగు మీడియం లో చదువుతున్న నాకు అవి గ్రేప్స్ నాట్ రీచబుల్ . ఇంగ్లీష్ పుస్తకాలు పుస్తకాలు చదవ లేను, కాబట్టి నండూరి వారి అనువాద సాహిత్యం" టాం సాయర్", విచిత్ర వ్యక్తి((మిస్టీరియస్ స్ట్రేంజర్) , హకల్బెరి ఫిన్, రాజు-పేద(డి ప్రిన్సు అండ్ డి పాపర్), రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ " ట్రెజర్ ఐలాండ్ " కాంచన ద్వీపం మొదలైన వన్నీ పిండి కొట్టేశాను.


నండూరి వారి గురించి నాకు పెద్దగా తెలియదు. చిన్నప్పుడు ఆయన అనువాద సాహిత్యం చదవటమే. ఒక దశాబ్దం క్రితం బుక్ ఎగ్జిబిషన్ లో ఆయన విశ్వదర్శనం రెండు పార్టులు , విశ్వరూపం కొని చదివినప్పుడు, చిన్నప్పటి బాల సాహిత్య రచయిత గా నా జ్ఞాపకం, ఇప్పటి విశ్వ దర్శనం చేయించిన ఈయన నిజరూపం ఏ మాత్రం పొంతన లేనివని గ్రహించా.
ఒక మంచి పాత్రికేయుడు, సంపాదకుడు.

నాకెందుకో ఇప్పటికీ ఇంగ్లీష్ లో చదివిన మార్క్ ట్వైన్ రచనల కన్నా నండూరి వారి అనువాదాలే బాగున్నాయని పిస్తుంది. ఎందుకంటే వీటిల్లో మన తెలుగుతనం, మన బాల్యం, చిక్కని తెలుగు తనం కనపడుతుంది.

ఇప్పటికీ నా మనసు నన్ను ఆరోక్లాస్ లోకి లాక్కేళ్ళమని మారాం చేస్తే నేను చేసే మొదటి పని
టాం సాయర్ బుక్ తీసి చదవటం. అదయ్యాక కాసేపు గోడలకు రంగేద్దామని, మా ఇంటి ఎదురు కొండ ఎక్కి దిగుదామని అని పిస్తూన్టుంది. అదేమీ జబ్బేమీ కాదు. నండూరి వారి అనువాద సాహిత్యం మహిమ. మనని మానసికం గా ఆరోగ్యం గా ఉంచే అరకు.

2006 లో పునఃప్రచురించిన ఆ పుస్తకాల ముందు మాటల్లో బాపురమణ గారలు సంయుక్తంగా చెప్పిన మాటల్లో కొన్ని పిప్పరమెంట్లు .....

"మార్జాలమంటే ఏంటి?"

" పిల్లి.. సార్ "
"ఇంకా సింపుల్ గా చెప్పాలి "
"మ్యావ్"
అనువాదానికి ఆయుపట్టయిన ఈ సులువు తెలిసిన పదిమంది లో తొమ్మండుగురు "నండూరి రామమోహనరావు గారే".
"ఈయన అనువాద మోహనుడే కాదు, వేద మోహనుడు, నాద మోహనుడు. భారతీయ పాశ్చాత్య వేద వేదాంతాలను మధించి వెన్న గాచిన నెయ్యిలా అందించారు."
ఈ అనువాద హనుమంతుడి ముందు ఇంకా కుప్పిగంతులేయము.
హాట్స్ ఆఫ్ !!
టోపీలు తొలగే
బాపురమణ
అంటూ ప్రేమగా అభిమానం గా ముందు మాట రాసేరు.

అంతటి మహనీయ పాత్రికేయుని, రచయితని, ఇంత కాలం బెజవాడ లో ఉండి చూడలేక పోయాను.

అందుకు సిగ్గు పడి ఈ మధ్యాన్నం వెళ్లి చూసి వచ్చా..
మౌనం గా ఆయన్ని కోరుకున్నా
లేవండి నేస్తం మరిన్ని రచనలు వార్చండి,
అనువాద మాయాజాలం పన్నండి,
లేవలేరా ? చేయి కదల్చలేరా?
విచిత్ర వ్యక్తి లోని సైతాన్ని పిలవనా
ఏదో మాయ చేసి మహిమ చూపి మిమ్మల్ని లేపమని ..?

నండూరి వారి ఆత్మ శాంతి కోసం

వారి కుటుంబ సభ్యలు మనఃశాంతి కోసం
భగవంతుని ప్రార్ధిస్తూ...

6 కామెంట్‌లు:

  1. TOM SAWYER CHADUVUTU UNTE MANALNI MANAM OOHINCHUKUNTAM. NAKU ANIPISTUNTUNDI MARKTWAIN PILLALA NAADI ELA PATTADA ANI ADE SAMAYAMLO MARKTWAIN NADINI RAMMOHANARAO GARU ELA PATTARA ANI
    CHADUVUTHUNNANTA SEPU MANAM OKA PALLETOORLO VIHARISTUNNATTU NIJANGANE NIDHI KOSAM VETUKUTUNNATTU ANI PISTUNDI. ADOKA ADBHUTA RACHANA DANIKI TAGINA ANUVADAM. OKA RAKAMGA MARKTWAIN TANA RACHANA TELUGU LONE CHESADEMO ANI ANIPISTUNDI.
    HUCKLEBERRIFIN KOODA ANTHE

    రిప్లయితొలగించండి
  2. ఎన్నార్ , ముళ్ళపూడి వంటి మహా రచయితలు ఎప్పటికీ చిరంజీవులే.

    మంచి స్పందన.

    శ్రీదేవి

    రిప్లయితొలగించండి
  3. మహానుభావులు అనే వాళ్ళని కోల్పోతున్నాం..(ఈ రోజు మహా పారిశ్రామిక వేత్త ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గార్ని కోల్పోయాం) వాళ్ళకి అశ్రుతర్పణాలు తప్ప, ఏమీ ఇచ్చుకోలేని అభాగ్యులం..

    రిప్లయితొలగించండి
  4. బాగా రాసారు. ఆ నాలుగు పుస్తకాలు అద్భుతాలు. బాగా తెలిసిన వ్యక్తిగా...ఆయన మరణం మాకు చాలా బాధాకరమైన వార్త. ఆయన లేని లోటు అలానే మిగిలిపోతుంది...

    రిప్లయితొలగించండి
  5. EE Tom sawyer pustakam (anuvaadam)entha vethikinaa dorakatledu.inthaku mundy chinnappudu ivaannee chadivi tharuvaatha original chadivithe anuvaadame baavundanipisthundi.

    రిప్లయితొలగించండి