24, జనవరి 2012, మంగళవారం

ఇప్పుడు కాక పోతే ఎప్పుడు ?


సంక్రాంతి పండగ సెలవు ఆదివారం లో కలిసి పోయి, పని వత్తిడి లో ఇటు శనివారం, అటు సోమవారం కూడా పండగా అంటే ఏంటి అనుకునే స్థాయి లో గడిచిపోయింది.
పండగ సెలవు సంగతి ఎలా ఉన్నా ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు దార్లో స్వరాజ్ మైదాన్ మూల ప్రతి సంవత్సరం లాగానే గాలిపటాలు దారము, మాంజా చర్కాలు అమ్ముతుంటే ఆగి కొన్నా.
ప్రతీ ఏడు సంక్రాంతికి ఇలా పెద్ద గాలిపటం, చరఖా కొనటం దాన్ని ఎగర వేయటానికి సరైన తోడులేక,కింద ఫ్లాట్స్ లో పిల్లలని రమ్మని అడగటం రోడ్ మీద క్రికెట్, ప్లే స్టేషన్, కొత్త సినిమా సీడీల మీద అభిరుచి ఉన్న ఇప్పటి పిల్లలు ఎప్పుడూ గాలిపటం మీద అసలు ఉత్సాహం చూపలేదు.
ఒక్కడినే ఎగరేయటానికి బద్దకించి ఆ గాలిపటం, చరఖా ఇంట్లో దీవాన్ కింద దాచి పెడతాను.
ఒక నాలుగు రోజులయ్యాక మా ఆవిడా ఈ చెత్తంతా ఇంట్లో చేర్చద్దు, లక్ష్మికిచ్చేస్తా (పనమ్మాయి),
వాళ్ళ అబ్బాయికి తీసుకెళ్తుంది, అని బెదిరించి అన్నంత పనీ చేసేస్తుంది.
పోన్లే ఎవరో ఒకళ్ళకి ఉపయోగ పడుతుంది కదా అని సరిపెట్టుకోవటం నాకూ అలవాటైపోయింది.

ఈ సారి కూడా కొన్న సిల్వర్ ఎరుపు రంగుల మెరిసే గాలిపటం, మాంజా తెచ్చి దీవాన్ కింద పెట్టాను.
శనివారం మా ఫ్లాట్ కింద ఉన్న ఇంజనీరింగ్ అబ్బాయి శ్రీధర్ కి మెస్సేజ్ లు పెట్టా (దాదాపు పది ), జవాబు లేదు,
చివరకి చీకటి పడే ముందు అయిదున్నరకి నేనే టెర్రస్ మీదకి వెళ్లి అరగంట సేపు ఎగరేసి,
మళ్ళీ దింపే సమయం లో మాంజా చుట్టే పక్కసాయం లేక అంతా చిక్కులు పడేసాను.
ఏమైనా సరదా తీరింది కదా అని ఆనందపడ్డా.

మరుసటి రోజు ఆదివారం కూడా పిల్లలెవరైనా వస్తారేమో అని చూసా, ఉహు నా అత్యాశ, ఎవరూ రాలేదు.
ఎదురింట్లో ఉన్న యాభై ఎనిమిది ఏళ్ళ మూర్తి గారిని అడిగా గాలిపటం ఎగరేద్దాం సర్ అని, అలాగే నన్నారు,
కానీ అయన పన్లో అయన బిజీగా ఉంటె నేను గాలిపటం పట్టుకొని అయన వెనక పడటం అంత పెద్దరికంగా ఉండదని
ఆదివారం రెండు సార్లు ఒక్కడినే ఎగరేసి.. కార్గిల్ మీద ఝండా ఎగరేసిన వీర జవాన్లా గర్వ పడ్డా.

ఇంట్లో కొచ్చాక స్థిమితం గా కూర్చొని ఫ్లాష్ బాక్ లోకి వెళ్తే ........... అబ్బో ఎన్ని గుండ్రాలో...

చిన్నప్పుడు పన్నెండు ఏళ్ళ లోపే, గాలిపటం అయిదు పైసలు, పది పైసలు ఖరీదు ఉండేది.
అది కొనాలంటే ఎందుకురా డబ్బులు దండగా అనే పెద్దాళ్ళు. నిజమే అనుకోని న్యూస్ పేపర్. కొబ్బరి చీపురు పుల్లలు సిద్దం గా పెట్టుకొని,
సెలవలే కాబట్టి ఇంట్లో మా అమ్మ మధ్యాన్నం వంటిల్లు ని ఒదిలేసే సమయం కోసం ఎదురు చూసి,
మైదా పిండి ఎక్కడ ఉందొ వెతుక్కుని రెండు మూడు పిళ్లు పరీక్షించి ( అబ్బో అదో పెద్ద శాస్త్రం రసాయనిక శాస్త్రం కంటే కష్టం
బియ్యపు పిండీ, గోధుమ పిండీ, మైదా పిండీ అన్నీ తెల్లగా ఉంటాయికదా. చివరికి మైదా పిండిని నిర్ధారించుకొని )
పాత ఇనుప గరిటలో మైదా పిండి నీళ్ళూ కలిపి స్టవ్ మీద ఉడక పెట్టి ఆ గరిటా, పేపర్, చీపురు పుల్లలూ తీస్కోని ఏ మెట్లకిందో దూరి గాలిపటం చేస్కొని.
ఇంట్లో మా అమ్మ దాచుకున్న దారపు రీలు దొంగిలించి (?) పనయ్యాక మళ్ళీ పెట్టేద్దాములే అని డాబా పైకి వెళ్లి ఎగరేసే ప్రయత్నం చేస్తే గంటల సమయం గడిచి పోయేవి.
చెమటలతో కంపుకొట్టే చొక్కాలు, ఎండకి (గాలిపటం సరిగ్గా ఎగరలేదన్న దిగులు తో ) వాడిపోయిన ముఖాలు వేస్కొని మా అన్న, నేనూ కిండాలి దిగేవాళ్ళం.

కొంచం పెద్దయ్యాక మా అన్న రక రకాల ఫార్ములాలు తెలుసుకొని మైదాలో ఎర్రరంగు, జిగురు, గాజు పెంకుల పొడి కలిపి ట్విన్ దారానికి రాస్తే ప్రసస్తమైన మాంజా తయారవుతుందని మీద మీద ఆ ఖారఖాన కూడా పెట్టాడు. దారం మెడ మీద నేత కార్మికుడిలా వరసలేసి, పైన చెప్పిన ఫార్ములాలో తయారు చేసిన లేహ్యం చేతిలోకి తీస్కోని దారానికి రాసి, ఆ ప్రక్రియ లో చేతికి గాజుపెంకుల వాళ్ళ గాయాలు చేసుకొని, (ఇంట్లోకూడా చెప్పకుండా దాచేవాడు) బాగా ఎండిన తర్వాత పాత పౌడర్ డబ్బాకి చుట్టి పెట్టేవాడు.

అసలు మాంజా ఎందుకు ? పోటీలు పడి గాలి పటాలు ఎగరేసేటప్పుడు,
మనం అతి లాఘవం తో పక్క వాళ్ళ గాలిపటాలు తెంపదానికి.
మా వూళ్ళో అంత పోటీలు పడి ఎగరేసే సీను లేదు.
ఆమాట కొస్తే గాలిపటాలు కూడా చాలా అరుదు.
అందుకని తయారు చేసిన మాంజా అంతా చేత్తో తడిమి ఆనంద పడటమే కానీ " కై పోచె ... " అంటూ అరిచి హడావిడి చేసే అవకాశం రాలేదు.

అలాంటి శ్రమ ఏమాత్రం లేకుండా డబ్బులు
వెదజల్లే తల్లిదండ్రులు ఉన్నా
ఈ తరం పిల్లలకు ఆ గాలిపటం సరదా లేక పోవటం నన్ను కొంచం చిన్నబుచ్చుకునేలా చేసింది.
వాటి స్థానాలలో క్రికెట్, ప్లే స్టేషన్, విడియో గేమ్స్,టీవీ లో సినిమాలు,
ఇవి కాక సినిమా
హాళ్ళలో పోకిరిలు, భడవా రాస్కేళ్ళు, సన్నాసిధీరులు, దివాలా బిజినెస్మాన్లు, ఉంటారుకదా !!
వాళ్ళతో కష్టం, వాళ్ళు ఒద్దని వారిస్తారు వీళ్ళని.
చదువు కు సంభందించి పుస్తకాలు తప్ప మిగతావి చదవటం పోయింది, చాలామంది
పిల్లలకు ఆటలంటే ఒక్క క్రికెట్టే.

పదేళ్ళ వయసులో మా ఇంటి గేట్ పక్కన అరుగులమీద నుంచొని చూస్తే ఎదురుగా ఖాళీ స్తలం లో ఉన్న గుడిసెల లో ఉండే
రిక్షావాళ్ళ పిల్లలు పాత రిక్షా టైర్ ని చిన్న పుల్ల తో కొడుతూ తోస్తూ రోడ్ మీద పరిగేట్టేవాళ్ళు .
ఆ పరిగెట్టే ఆట ఒక క్రమమైన లయ లో ఎంతో బాగుండేది.
ఇంకోచం ఖరీదైన ఆట ఉండేది అది పాడైన రిక్షా రిమ్ము తో అలా ఆడటం.
దీనికైతే పుల్ల తో కొట్టక్కర్లేదు.రిమ్ము నించో పెట్టి పుల్ల దాని మద్య గాడి లో పెట్టి తోస్తూ పోవటం.
అది ఒక రకమైన శబ్దం చేస్తూ వెళ్ళేది. ఈ ఆట నాకు ఎంతో విలాసవంతం గా కనిపించేది.
అలాగే రెండు తాటి కాయలలో ముంజెలు తినేసి వాటిని టైర్లు గా చేసి తోసే బండి తయారు చేసే వాళ్ళు అది కూడా నాకు నచ్చేది.

అలా వాళ్ళని చూసి ఎంత అదృష్టవంతులో ఈ పిల్లలు ఏది కావాలంటే అది ఆడుకుంటారు. మట్టి లో పొర్లి ఆడుతూ కొట్టుకుంటారు.
వాళ్ళని చూసి ఈర్ష్య పడే ఇంకో విషయం మా ఎదురు స్థలం లో ఉండే తాడిచెట్ల నుంచి బాగా పండి రాలి పడే తాటి పళ్ళను తినటం.
నలభై ఆరేళ్ళ నా జీవితం లో ఇప్పటికీ నేను తాటి ముంజెలు తినటమే కానీ , తాటి పళ్ళను తినలేదు.
పాపం వాళ్లకి కడుపునిండా తిండి ఉండేది కాదు, స్కూల్ చదువు ఉండేది కాదు
పదేళ్ళ వయసు పైబడే వరకు ఆటలాడుకుంటూ గడిపేవాళ్ళు, పది పన్నెండు వయసులో ఆడపిల్లలైతే ఇళ్ళల్లో పనికి,
మగ పిల్లలైతే దర్జీల దగ్గర ఖాజాలు కుట్టటం, రోల్డ్ గోల్డ్ పని నేర్చుకోవటం,
లేదా నాన్న రిక్షానే తొక్కటం, ఇలా ఉండేవి పాపం వాళ్ళ జీవితాలు. ఇప్పుడు కొంచం మారి ఉంటాయి.

అలా ఆ పేద పిల్లలు ఆడే ఆటలు నా చిన్నతనం లో నాకు ఎంతో ప్రియంగా అనిపించేవి.
అలా సందులో వాళ్ళు పరిగెడుతుంటే నాకూ అలా ఆడాలని పించేది.
కానీ ఇంట్లో వీపు చీరేసేందుకు మా అమ్మ రెడీగా ఉండేది.
నేనూ అలా ఆడుకోనా ?

ఉహు మా క్లాస్ అమ్మ ఆ మాస్ ఆటలు ఆడనిచ్చేది కాదు.
అలాగని క్లాస్ ఆటలకీ ఒదిలేది కాదు. అది వేరే సంగతి.

నా చిన్నప్పుడు స్కూల్లో క్రికెట్ ఉండేది, అంతే కాక మా హైస్కూల్లో బేస్ బాల్ కూడా ఆడేవాళ్ళం. కానీ కర్రబిళ్ళ, గోలీలు, బెచ్చాలు ఇచ్చే మజా ఇంకేవీ ఇవ్వవు.


కర్రబిళ్ళ ఆట కూడా ఆడాలని పించే కోరిక మాత్రం తీరింది.
ఈ కోరిక కాలేజీ లో డిగ్రీ చదివే టప్పుడు బాగా తీర్చుకున్నాం.
క్రికెట్ పిచ్ మధ్యలో కర్రబిళ్ళ ఆడేందుకు ప్లస్ ఆకారం లో గాళ్ళు కొట్టి, మంచి బాణా కర్రని అడుగున్నర కర్రలు గా.
ఆరు అంగుళాల బిళ్ళలు గా మేదర వాళ్ళ దగ్గర చెక్కించి సాయంత్రం క్రికెట్ ఆడినట్లు టీమ్స్ వేస్కొని,
స్కోరు షీట్ వ్రాస్తూ ఆడేవాళ్ళం. దీనికి ఎంపైర్ కూడా ఉండేవాడు.
మా పీడీ సర్, ప్రిన్సిపాల్ మాతో ఆ ఆట మానిపించటానికి చాలా ప్రాధేయ పడేవాళ్లు. కాలేజీ పరువు పోతుంది కావాలంటే రోజంతా క్రికెట్ ఆడుకోండి ఏమీ అనం అని.

ఇంకో చిన్న సరదా చెప్పి ఆపేస్తాను
తిరనాళ్ళలో గాలికి తిరిగే కాగితపు ఫానులు చూసేఉంటారు.
అది చెయ్యటం చాలా ఈజీ.
నలుచదరపు కాగితం, ఇల్లు ఊడ్చే కుంచె చీపురు పుల్ల (బెండుముక్కలా పెన్సిల్ అంతా లావుగా ఉండేది), గుండు సూది.
మొదటిది కాగీతం ఎప్పుడూ రెడీ, రెండోది చీపురు లోంచి లాగితే మా అమ్మ ఆ చీపురు పెట్టే ఒక్కటేసేది. అలా పుల్లలు గొట్టం లోంచి లాగితే చీపురు ఒదులై పోయే పుల్లల్లన్ని ఊడిపోతాయని.
అలాగే మూడోది గుండు సూది ఇది ఎంత కష్టమో ? ఇప్పుడంటే ఏది పడితే కొనుక్కుంటున్నాం సుమారు 1975 ప్రాంతం లో గుండు సూది బయట దొరికేది కాదు ఎక్కడో ఆఫీసుల్లో తప్ప.
షాపులో అమ్మినా అది నాలుగో క్లాస్ చదివే నాకు కొనే వస్తువు కాదు (ఒక్క గుండు సూది అమ్మరు ఇప్పటికీ)
కాబట్టి గుండు సూది దొరకగానే నేను మొదట ఆ గాలికి తిరిగే పంఖానే చేసే వాడిని.
దాని తిరిగే ఫ్యాన్ కింద పెడితే అబ్బో ఇంతా స్పీడుగా తిరిగేదనీ....

ఆ మజా రిమోట్ కార్లతో ఆడే వాళ్ళకి ఎప్పటికీ తెలీదు.



ఎక్కడో గాలిపటాల దగ్గర మొదలు పెట్టి ఇంకేక్కిడికో వెళ్లి ఏవేవో జ్ఞాపకాలు ఎందుకు బయటకి లాగానంటే ....
ఏళ్ళు గడుస్తున్న కొద్దీ మరుగున పడి పోతున్న ఎన్నో ఆటలు, అలవాట్లు, ఎప్పుడు
సరదా అప్పుడే తీర్చుకోవాలి.

ఆనక పెద్దయ్యాక, లేదా పెద్దమనిషి అనిపించున్నాక ఆడదామన్న ఆడలేము. కాళ్ళు, కీళ్ళు, ఒళ్ళు సహకరించక !!

ఇది
చదివిన వాళ్లెవరైనా గోలీలు ఆడతానంటే నేరెడీ !!
సంచీడు మామూలు గోలీలు, ఒక సోడా గోలీ, ఒక సీసం గోలీ కొని ఉంచా మా ఆఫీసు అడుగు డ్రా లో.. ఎందుకంటే ఇంటికి తెస్తే మా ఆవిడ ఉంచదు, లక్ష్మి కొడుక్కిచ్చేస్తుంది !!





13, జనవరి 2012, శుక్రవారం

ఆదివారం, అమావాశ్య కాదు కాదు పౌర్ణమి...





ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం 6 :30 గంటలు సాక్షి, ఈనాడు పోటా పోటీ వార్తలు చదివేసాక, ఎదురింటి ముందు దీనంగా పడున్న హిందూ కూడా చూసేసి, సమయం ఏడున్నర అవుతుండగా సెల్ మోగింది కళాసాగర్ గారి ఫోన్ మన మీటింగ్ కి ఎంత మంది రావచ్చు (?) భలే ప్రశ్న. నేను అనుకున్నది పది మంది వస్తే మీటింగ్ ధన్యమే. సంఖ్యా పరం గా చెప్పలేను కానీ మీ వంతు గుర్తు చెయ్యాల్సిన వాళ్ళని చూస్కోండి నా కోటా నేచూస్కుంటా అని చెప్పా. ఒక గంట సేపు నా ఆఫీసు పని మెయిల్స్ చూస్కొని, మొదటి పెళ్ళిచూపులకు కూచో బోయే అమ్మాయిలా తెగ టెన్షన్ పడిపోయా.
తొమ్మిది కల్లా స్నానం, పూజ, టిఫిన్ అయిపోయి నేను ఆఫీసు దగ్గర కొచ్చి సెక్యూరిటీ గార్డ్ ని అడిగా ఎవరన్నా వచ్చారా అని. ఉహు అన్నాడు వెంకట్రావ్.

సరే మూడో ఫ్లోర్ తాళం తీసి మీటింగ్ హాల్స్ లో ఒకటి రెడీ గా ఉంచు అని చెప్పా. నిజానికి ముందు రోజే చెప్పా. అందుకని తయారు గా ఉంది.

గేటు దగ్గరే నుంచున్నా సుమారు పావుగంట తర్వాత ఒకతను వచ్చారు మాది వెస్ట్ గోదావరి డిస్టిక్ , ఇక్కడ బ్లోగే వాళ్ళ మీటింగ్ ఉందటగా నిన్న బుక్ ఎగ్జిబిషన్ లో చెప్పారు అన్నారు. అవును నిజమే కానీ మన ఇద్దరమే ఉన్నాము. మీకు ఇష్టమేనా నాతో భేటీ కి అన్నట్టుగా చూసా. అంతే అయన అక్కడే యూని కోడ్, తెలుగు లో ఫాంట్లు, సెంట్రల్ గవర్నమెంట్ వారి సీడి, అంటూ నాకు తెలీని విషయాలు చాలా మాట్లాడారు. ఇంతలో ఒక పెద్దాయన వచ్చారు దుర్గ ప్రసాద్ గారు పేరు (బాబు కార్టూన్స్) మంచి ఆనంద మేసింది. కొంతమంది వచ్హాక పైకి వెళ్లి కూర్చుందాం అని చెప్పి అక్కడే కబుర్లలో పడ్డాం. ఇంతలో అరవై నాలుగు కళల కళాసాగర్. సృజన ప్రియ పత్రిక తో టచ్ ఉన్న తమిరి పుల్లారావ్ గారూ, ముక్తలేఖ బ్లాగ్ ఓనరు సునీత గారూ ఆటో గిగారు . ఒక ఏడెనిమిది మంది ఉన్నాం కదాని పైకి వెళ్లి నా సీట్ దగ్గరే కూర్చున్నాం. కాసేపు పిచ్చా పాటి మాట్లాడుతుంద గానే రెహ్మాన్ వాళ్ళ అసిస్టెంట్ తో వచ్హాడు. తనని అడిగా ఎల్సిడీ ఇక్కడే ఏర్పాటు చేస్కుందాం ఎక్కువ మంది లేరుకదా అని. ప్రాజెక్ట్ చెయ్యటానికి స్క్రీన్ ఎలా అన్నాడు. మా చాంబర్ లో గోడ మీద బిల్ బోర్డ్ కి కంప్యూటర్ లో వాడే తెల్లకాగితాలు పిన్నుల తో గుచ్చి మూడు బై నాలుగు స్క్రీన్ రెడీ చేసాం. ఇంతలో అక్షర మోహనం బ్లాగ్ రాంప్రసాద్ గారు, ఏవియం గుప్తా పేరుగల కార్టూనిస్ట్ వచ్చారు. ఇంకో నిముషానికి పీవీ సుబ్రహ్మణ్యం గారనే పెద్దాయన ( ఇంకా బ్లాగ్ లేదు త్వరలో మొదలు పెడతారు) రిటైర్డ్ హెడ్ మాష్టారు చాలా ఉత్సాహం గా వచ్చారు. ఆయనతో ఒక యువ కిశోరం భరత్ అని (వన్ టిడ్ బిట్ ఆంగ్ల బ్లాగ్ ) టెక్ కుర్రాడు ఎంటర్ కొట్టాడు. ఆశ్చర్యంగా బాగా పరిచయమున్న మొహం కొంచం పెరిగిన గడ్డం తో ఒకాయన పేరు సరసి, అవును " మనమీదేనర్రోయి" అని చిన్నగా చురకలేసే పెద్ద కార్టూనిస్ట్ హైదరాబాద్ నుంచీ వచ్చారు. మన మీటింగ్ టపా విరిగి బ్లాగులో పడ్డదే అనుకున్నా. ఆయనతో బీఎస్సఎన్నల్ 3G లో పని చేసే వాళ్ళబ్బాయి కూడా వచ్చారు. ఇంతలో నవ్వులాట శ్రీకాంత్ గారు నవ్వకుండానే కామ్ గా ఎంటరై పోయారు.


ఇంకో ఔత్సాహికులు ప్రకాశ రావు గారు, మందుల కంపనీ మానేజర్ శివ కుమార్, బ్లాగులా గురించి తెలుగు వికీ గురించీ తెలుసు కోవటానికి వచ్చారు. అంతా సర్దుకుని కూర్చున్ తుం డంగా ఏలూరు రామలింగ కవిలా బులుసు సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఎవ్వరి పేర్లు ఎవరికీ ముందే తెలీవు కాబట్టి స్వ పరిచయాలు, వాళ్ళ వాళ్ళ బ్లాగోగులు చెప్పుకున్నాం.ఆ పనిలో ఉండగానే రెహ్మాన్ ప్రోజేక్తర్ సెట్ చేసుకున్నాడు. మేమంతా రెహ్మాన్ షైక్ చెప్పే తెలుగు ఫాంట్లు, తెవికి , తెలుగు కీబోర్డ్ గురించి వింటుండగానే కౌటిల్య వచ్చారు. వనజ వనమాలీ గారు (తెలుగు లో విజయవాడ నుంచీ పెద్ద బ్లాగర్ అనొచ్చా ? అనేస్తాలే ) పద్మావతి శర్మ గారు, స్టేట్ బ్యాంకు లో పని చేసే కె పుల్లారావు గారు, ఇంకో బీ ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగి రామచంద్ర రావు గారు వచ్చారు.
రెహ్మాన్, తను మరియు (తెలుగు) సుజాత గార్లు బ్లాగులు ప్రారంభించటం నిర్వహించటం మీద వ్రాసిన పుస్తకం పరిచయం చేసాడు. తెలుగు కీ బోర్డ్ డెమో ఇచ్చాడు.

ఈ టపా మొత్తం రెహ్మాన్ ని ఏక వచనం లో ప్రస్తావించా ఎందుకో తమ్ముడిలా అనిపించాడు అందుకే చనువు.


మొత్తం మీద మూడు గంటలు సమయం తెలీకుండా గడిచి పోయాయి. మొదటి సారి చూడటం అప్పుడే పేర్లు తెలుసుకోవటం వల్ల ఎవరి నైనా ప్రస్తావిన్చకుంటే నన్ను క్షమించండి.
మధ్యాన్నం రెండు గంటలు సమయానికి విజయవాడలో మొదటి తెలుగు బ్లాగర్ల సమావేశం ముగించి కిందకు వచ్చేసాం.
ఇంకా చాలా మంది హాజరవుతారని అనుకున్నా. పెద్దలు . అనుభవజ్ఞులు రాశి, వాసి రెండుకల బ్లోగుల్లున్నవారు విజయవాడ లో ఎంతో మంది ఉన్నారు వారందరితో రెండో సమావేశం త్వరలో జరుపుకోవాలని నా కోరిక.
నాకు సరియిన సమయం లేక పోవటం, అనుభవ రాహిత్యం, ఇంకా సమాచార లోపం వల్ల ఈ సారి ఇరవై మంది తో మాత్రమే జరుపుకున్నా నీల్ అర్మ్ స్ట్రాంగ్ .. ఈ చిన్న అడుగు మానవాళి మనుగడకు పెద్ద ముందడు గై నట్లు తెలుగు బ్లాగులు వర్ధిల్లి విరాజిల్లాలని కోరుకుంటూ....

క్షమాపణలు : పొరుగూరి నుంచి వచ్చిన పెద్దలు పీవీ సుబ్రహ్మణ్యం గారిని, బులుసు వారిని, ఇంకా మిగతా పెద్దలను భోజనానికి ఆహ్వానించలేని నా బుద్ది మాంద్యానికి మన్నిస్తారని ఆశిస్తున్నాను.

ఆరోజు మూడు గంటల నుంచీ రాత్రి ఏడు దాకా నాకు ఆఫీసు పని ఉండటం వల్ల అందులో పడి నేను కూడా భోజనం చెయ్యలేదు, పెద్దలను గౌరవించనందుకు దేముడు అలా శాపం పెట్టాడు.

4, జనవరి 2012, బుధవారం

ఆహ్వానం


అనుకున్నట్టుగానే మనం జనవరి ఎనిమిదో (08 /01 /2012 ) ఆదివారం ఉదయం పది గంటలకు, విజయవాడ బెసెంట్ రోడ్ లో ఉన్న భారతీయ జీవిత భీమ కార్యాలయం,
(LIC ) " జీవన్ కృష్ణ " మూడో అంతస్తు లో కలుద్దాం.

సరిగ్గా పదిగంటలకు సమయ పాలన తో కలుద్దాం.

సమావేశం లో శ్రీ రెహ్మాన్ షైక్ గారు ప్రస్తావించబోయే అంశాలు ..

అ ) కంప్యూటర్లలో తెలుగు
వ్రాయటం, చదవటం
ఆ) తెలుగు లిపి కి సంభందించిన సాఫ్ట్ వార్ల వాడకం
ఇ) అంతర్జాలం లో తెలుగు వాడకం
ఈ) తెలుగు వికీ పీడియాలో ప్రాచుర్యం, భాగస్వామ్యం, మొదలైన అంశాలు.
ఉ) బ్లాగింగ్ కి సంభందించి అన్నీ అంశాలు.

పన్లో పనిగా విజయవాడ (ప్రాంతీయ భావం కాదు దగ్గరవున్నఒకే గూటి పిట్టలం) పరిసర ప్రాంతాల బ్లాగర్లందరూ కలిసి ఒక అసమితి గా ఏర్పడి అప్పుడప్పుడూ కలిసి ముచ్చటించునే విధం గా ఏర్పాటు చేసుకుందాం.

బ్లాగర్లే కాక, కొత్తగా బ్లాగుల మీద ఆసక్తి ఉన్న వారిని కూడా ఆహ్వానించి, హాజరయ్యేలా చూద్దాం.

ఆత్రేయ : +91 995 1366 577


3, జనవరి 2012, మంగళవారం

విజయవాడ పరిసర ప్రాంత బ్లాగర్లూ..


విజయవాడ,గుంటూరు, ఏలూరు పరిసర ప్రాంత బ్లాగర్లకు ఉపయోగపడే ఆసక్తి కరమైన ఒక సమావేశం.
మన తెలుగు బ్లాగులకు సుపరిచితులు రెహ్మాన్ షైక్ గారు,
తెలుగు వికీ వాడకం, భాగస్వామ్యం, తెలుగు లో బ్లాగుల నిర్వహణ మీద అవగాహనా సదస్సు ఏర్పాటు చేద్దామని అన్నారు.
కావున 8 జనవరి 2012 ఆదివారం విజయవాడ నగరం లో సమావేశం అవుదాం.
సీనియర్ బ్లాగర్లు, అనుభవజ్గులు, తమ సహాయాన్ని అందించి తెలుగు బ్లాగులకు మరింత ప్రాచుర్యం కలిగించాలని కోరుతున్నాను.

మన ప్రాంత బ్లాగర్ల ఫోన్ నంబర్లు. మెయిల్ ఐడిలు నా వద్ద లేనందున,
ఆత్రేయ : 9951366577 , లకు మీ పేరు సంక్షిప్త సందేశం (sms) పంపితే సమావేశ వేదిక, సమయం వివరాలు పంపుతాను.




1, జనవరి 2012, ఆదివారం

శుభ సంవత్సరం



ప్రతి ఆశా నెరవేరాలి,
ప్రతి ఎదురు చూపు తృప్తి చెందాలి,
ప్రతి మనసు తనివి తీరాలి,
ప్రతి మొలక పైకి ఎదగాలి,
ప్రతి అహం ఒదిగి మలగాలి,
ప్రతి ప్రాణీ సుఖంగా, ఆనందంగా జీవించాలి..!!
సర్వేజనా సుఖినో భవంతు: