24, జనవరి 2012, మంగళవారం

ఇప్పుడు కాక పోతే ఎప్పుడు ?


సంక్రాంతి పండగ సెలవు ఆదివారం లో కలిసి పోయి, పని వత్తిడి లో ఇటు శనివారం, అటు సోమవారం కూడా పండగా అంటే ఏంటి అనుకునే స్థాయి లో గడిచిపోయింది.
పండగ సెలవు సంగతి ఎలా ఉన్నా ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు దార్లో స్వరాజ్ మైదాన్ మూల ప్రతి సంవత్సరం లాగానే గాలిపటాలు దారము, మాంజా చర్కాలు అమ్ముతుంటే ఆగి కొన్నా.
ప్రతీ ఏడు సంక్రాంతికి ఇలా పెద్ద గాలిపటం, చరఖా కొనటం దాన్ని ఎగర వేయటానికి సరైన తోడులేక,కింద ఫ్లాట్స్ లో పిల్లలని రమ్మని అడగటం రోడ్ మీద క్రికెట్, ప్లే స్టేషన్, కొత్త సినిమా సీడీల మీద అభిరుచి ఉన్న ఇప్పటి పిల్లలు ఎప్పుడూ గాలిపటం మీద అసలు ఉత్సాహం చూపలేదు.
ఒక్కడినే ఎగరేయటానికి బద్దకించి ఆ గాలిపటం, చరఖా ఇంట్లో దీవాన్ కింద దాచి పెడతాను.
ఒక నాలుగు రోజులయ్యాక మా ఆవిడా ఈ చెత్తంతా ఇంట్లో చేర్చద్దు, లక్ష్మికిచ్చేస్తా (పనమ్మాయి),
వాళ్ళ అబ్బాయికి తీసుకెళ్తుంది, అని బెదిరించి అన్నంత పనీ చేసేస్తుంది.
పోన్లే ఎవరో ఒకళ్ళకి ఉపయోగ పడుతుంది కదా అని సరిపెట్టుకోవటం నాకూ అలవాటైపోయింది.

ఈ సారి కూడా కొన్న సిల్వర్ ఎరుపు రంగుల మెరిసే గాలిపటం, మాంజా తెచ్చి దీవాన్ కింద పెట్టాను.
శనివారం మా ఫ్లాట్ కింద ఉన్న ఇంజనీరింగ్ అబ్బాయి శ్రీధర్ కి మెస్సేజ్ లు పెట్టా (దాదాపు పది ), జవాబు లేదు,
చివరకి చీకటి పడే ముందు అయిదున్నరకి నేనే టెర్రస్ మీదకి వెళ్లి అరగంట సేపు ఎగరేసి,
మళ్ళీ దింపే సమయం లో మాంజా చుట్టే పక్కసాయం లేక అంతా చిక్కులు పడేసాను.
ఏమైనా సరదా తీరింది కదా అని ఆనందపడ్డా.

మరుసటి రోజు ఆదివారం కూడా పిల్లలెవరైనా వస్తారేమో అని చూసా, ఉహు నా అత్యాశ, ఎవరూ రాలేదు.
ఎదురింట్లో ఉన్న యాభై ఎనిమిది ఏళ్ళ మూర్తి గారిని అడిగా గాలిపటం ఎగరేద్దాం సర్ అని, అలాగే నన్నారు,
కానీ అయన పన్లో అయన బిజీగా ఉంటె నేను గాలిపటం పట్టుకొని అయన వెనక పడటం అంత పెద్దరికంగా ఉండదని
ఆదివారం రెండు సార్లు ఒక్కడినే ఎగరేసి.. కార్గిల్ మీద ఝండా ఎగరేసిన వీర జవాన్లా గర్వ పడ్డా.

ఇంట్లో కొచ్చాక స్థిమితం గా కూర్చొని ఫ్లాష్ బాక్ లోకి వెళ్తే ........... అబ్బో ఎన్ని గుండ్రాలో...

చిన్నప్పుడు పన్నెండు ఏళ్ళ లోపే, గాలిపటం అయిదు పైసలు, పది పైసలు ఖరీదు ఉండేది.
అది కొనాలంటే ఎందుకురా డబ్బులు దండగా అనే పెద్దాళ్ళు. నిజమే అనుకోని న్యూస్ పేపర్. కొబ్బరి చీపురు పుల్లలు సిద్దం గా పెట్టుకొని,
సెలవలే కాబట్టి ఇంట్లో మా అమ్మ మధ్యాన్నం వంటిల్లు ని ఒదిలేసే సమయం కోసం ఎదురు చూసి,
మైదా పిండి ఎక్కడ ఉందొ వెతుక్కుని రెండు మూడు పిళ్లు పరీక్షించి ( అబ్బో అదో పెద్ద శాస్త్రం రసాయనిక శాస్త్రం కంటే కష్టం
బియ్యపు పిండీ, గోధుమ పిండీ, మైదా పిండీ అన్నీ తెల్లగా ఉంటాయికదా. చివరికి మైదా పిండిని నిర్ధారించుకొని )
పాత ఇనుప గరిటలో మైదా పిండి నీళ్ళూ కలిపి స్టవ్ మీద ఉడక పెట్టి ఆ గరిటా, పేపర్, చీపురు పుల్లలూ తీస్కోని ఏ మెట్లకిందో దూరి గాలిపటం చేస్కొని.
ఇంట్లో మా అమ్మ దాచుకున్న దారపు రీలు దొంగిలించి (?) పనయ్యాక మళ్ళీ పెట్టేద్దాములే అని డాబా పైకి వెళ్లి ఎగరేసే ప్రయత్నం చేస్తే గంటల సమయం గడిచి పోయేవి.
చెమటలతో కంపుకొట్టే చొక్కాలు, ఎండకి (గాలిపటం సరిగ్గా ఎగరలేదన్న దిగులు తో ) వాడిపోయిన ముఖాలు వేస్కొని మా అన్న, నేనూ కిండాలి దిగేవాళ్ళం.

కొంచం పెద్దయ్యాక మా అన్న రక రకాల ఫార్ములాలు తెలుసుకొని మైదాలో ఎర్రరంగు, జిగురు, గాజు పెంకుల పొడి కలిపి ట్విన్ దారానికి రాస్తే ప్రసస్తమైన మాంజా తయారవుతుందని మీద మీద ఆ ఖారఖాన కూడా పెట్టాడు. దారం మెడ మీద నేత కార్మికుడిలా వరసలేసి, పైన చెప్పిన ఫార్ములాలో తయారు చేసిన లేహ్యం చేతిలోకి తీస్కోని దారానికి రాసి, ఆ ప్రక్రియ లో చేతికి గాజుపెంకుల వాళ్ళ గాయాలు చేసుకొని, (ఇంట్లోకూడా చెప్పకుండా దాచేవాడు) బాగా ఎండిన తర్వాత పాత పౌడర్ డబ్బాకి చుట్టి పెట్టేవాడు.

అసలు మాంజా ఎందుకు ? పోటీలు పడి గాలి పటాలు ఎగరేసేటప్పుడు,
మనం అతి లాఘవం తో పక్క వాళ్ళ గాలిపటాలు తెంపదానికి.
మా వూళ్ళో అంత పోటీలు పడి ఎగరేసే సీను లేదు.
ఆమాట కొస్తే గాలిపటాలు కూడా చాలా అరుదు.
అందుకని తయారు చేసిన మాంజా అంతా చేత్తో తడిమి ఆనంద పడటమే కానీ " కై పోచె ... " అంటూ అరిచి హడావిడి చేసే అవకాశం రాలేదు.

అలాంటి శ్రమ ఏమాత్రం లేకుండా డబ్బులు
వెదజల్లే తల్లిదండ్రులు ఉన్నా
ఈ తరం పిల్లలకు ఆ గాలిపటం సరదా లేక పోవటం నన్ను కొంచం చిన్నబుచ్చుకునేలా చేసింది.
వాటి స్థానాలలో క్రికెట్, ప్లే స్టేషన్, విడియో గేమ్స్,టీవీ లో సినిమాలు,
ఇవి కాక సినిమా
హాళ్ళలో పోకిరిలు, భడవా రాస్కేళ్ళు, సన్నాసిధీరులు, దివాలా బిజినెస్మాన్లు, ఉంటారుకదా !!
వాళ్ళతో కష్టం, వాళ్ళు ఒద్దని వారిస్తారు వీళ్ళని.
చదువు కు సంభందించి పుస్తకాలు తప్ప మిగతావి చదవటం పోయింది, చాలామంది
పిల్లలకు ఆటలంటే ఒక్క క్రికెట్టే.

పదేళ్ళ వయసులో మా ఇంటి గేట్ పక్కన అరుగులమీద నుంచొని చూస్తే ఎదురుగా ఖాళీ స్తలం లో ఉన్న గుడిసెల లో ఉండే
రిక్షావాళ్ళ పిల్లలు పాత రిక్షా టైర్ ని చిన్న పుల్ల తో కొడుతూ తోస్తూ రోడ్ మీద పరిగేట్టేవాళ్ళు .
ఆ పరిగెట్టే ఆట ఒక క్రమమైన లయ లో ఎంతో బాగుండేది.
ఇంకోచం ఖరీదైన ఆట ఉండేది అది పాడైన రిక్షా రిమ్ము తో అలా ఆడటం.
దీనికైతే పుల్ల తో కొట్టక్కర్లేదు.రిమ్ము నించో పెట్టి పుల్ల దాని మద్య గాడి లో పెట్టి తోస్తూ పోవటం.
అది ఒక రకమైన శబ్దం చేస్తూ వెళ్ళేది. ఈ ఆట నాకు ఎంతో విలాసవంతం గా కనిపించేది.
అలాగే రెండు తాటి కాయలలో ముంజెలు తినేసి వాటిని టైర్లు గా చేసి తోసే బండి తయారు చేసే వాళ్ళు అది కూడా నాకు నచ్చేది.

అలా వాళ్ళని చూసి ఎంత అదృష్టవంతులో ఈ పిల్లలు ఏది కావాలంటే అది ఆడుకుంటారు. మట్టి లో పొర్లి ఆడుతూ కొట్టుకుంటారు.
వాళ్ళని చూసి ఈర్ష్య పడే ఇంకో విషయం మా ఎదురు స్థలం లో ఉండే తాడిచెట్ల నుంచి బాగా పండి రాలి పడే తాటి పళ్ళను తినటం.
నలభై ఆరేళ్ళ నా జీవితం లో ఇప్పటికీ నేను తాటి ముంజెలు తినటమే కానీ , తాటి పళ్ళను తినలేదు.
పాపం వాళ్లకి కడుపునిండా తిండి ఉండేది కాదు, స్కూల్ చదువు ఉండేది కాదు
పదేళ్ళ వయసు పైబడే వరకు ఆటలాడుకుంటూ గడిపేవాళ్ళు, పది పన్నెండు వయసులో ఆడపిల్లలైతే ఇళ్ళల్లో పనికి,
మగ పిల్లలైతే దర్జీల దగ్గర ఖాజాలు కుట్టటం, రోల్డ్ గోల్డ్ పని నేర్చుకోవటం,
లేదా నాన్న రిక్షానే తొక్కటం, ఇలా ఉండేవి పాపం వాళ్ళ జీవితాలు. ఇప్పుడు కొంచం మారి ఉంటాయి.

అలా ఆ పేద పిల్లలు ఆడే ఆటలు నా చిన్నతనం లో నాకు ఎంతో ప్రియంగా అనిపించేవి.
అలా సందులో వాళ్ళు పరిగెడుతుంటే నాకూ అలా ఆడాలని పించేది.
కానీ ఇంట్లో వీపు చీరేసేందుకు మా అమ్మ రెడీగా ఉండేది.
నేనూ అలా ఆడుకోనా ?

ఉహు మా క్లాస్ అమ్మ ఆ మాస్ ఆటలు ఆడనిచ్చేది కాదు.
అలాగని క్లాస్ ఆటలకీ ఒదిలేది కాదు. అది వేరే సంగతి.

నా చిన్నప్పుడు స్కూల్లో క్రికెట్ ఉండేది, అంతే కాక మా హైస్కూల్లో బేస్ బాల్ కూడా ఆడేవాళ్ళం. కానీ కర్రబిళ్ళ, గోలీలు, బెచ్చాలు ఇచ్చే మజా ఇంకేవీ ఇవ్వవు.


కర్రబిళ్ళ ఆట కూడా ఆడాలని పించే కోరిక మాత్రం తీరింది.
ఈ కోరిక కాలేజీ లో డిగ్రీ చదివే టప్పుడు బాగా తీర్చుకున్నాం.
క్రికెట్ పిచ్ మధ్యలో కర్రబిళ్ళ ఆడేందుకు ప్లస్ ఆకారం లో గాళ్ళు కొట్టి, మంచి బాణా కర్రని అడుగున్నర కర్రలు గా.
ఆరు అంగుళాల బిళ్ళలు గా మేదర వాళ్ళ దగ్గర చెక్కించి సాయంత్రం క్రికెట్ ఆడినట్లు టీమ్స్ వేస్కొని,
స్కోరు షీట్ వ్రాస్తూ ఆడేవాళ్ళం. దీనికి ఎంపైర్ కూడా ఉండేవాడు.
మా పీడీ సర్, ప్రిన్సిపాల్ మాతో ఆ ఆట మానిపించటానికి చాలా ప్రాధేయ పడేవాళ్లు. కాలేజీ పరువు పోతుంది కావాలంటే రోజంతా క్రికెట్ ఆడుకోండి ఏమీ అనం అని.

ఇంకో చిన్న సరదా చెప్పి ఆపేస్తాను
తిరనాళ్ళలో గాలికి తిరిగే కాగితపు ఫానులు చూసేఉంటారు.
అది చెయ్యటం చాలా ఈజీ.
నలుచదరపు కాగితం, ఇల్లు ఊడ్చే కుంచె చీపురు పుల్ల (బెండుముక్కలా పెన్సిల్ అంతా లావుగా ఉండేది), గుండు సూది.
మొదటిది కాగీతం ఎప్పుడూ రెడీ, రెండోది చీపురు లోంచి లాగితే మా అమ్మ ఆ చీపురు పెట్టే ఒక్కటేసేది. అలా పుల్లలు గొట్టం లోంచి లాగితే చీపురు ఒదులై పోయే పుల్లల్లన్ని ఊడిపోతాయని.
అలాగే మూడోది గుండు సూది ఇది ఎంత కష్టమో ? ఇప్పుడంటే ఏది పడితే కొనుక్కుంటున్నాం సుమారు 1975 ప్రాంతం లో గుండు సూది బయట దొరికేది కాదు ఎక్కడో ఆఫీసుల్లో తప్ప.
షాపులో అమ్మినా అది నాలుగో క్లాస్ చదివే నాకు కొనే వస్తువు కాదు (ఒక్క గుండు సూది అమ్మరు ఇప్పటికీ)
కాబట్టి గుండు సూది దొరకగానే నేను మొదట ఆ గాలికి తిరిగే పంఖానే చేసే వాడిని.
దాని తిరిగే ఫ్యాన్ కింద పెడితే అబ్బో ఇంతా స్పీడుగా తిరిగేదనీ....

ఆ మజా రిమోట్ కార్లతో ఆడే వాళ్ళకి ఎప్పటికీ తెలీదు.



ఎక్కడో గాలిపటాల దగ్గర మొదలు పెట్టి ఇంకేక్కిడికో వెళ్లి ఏవేవో జ్ఞాపకాలు ఎందుకు బయటకి లాగానంటే ....
ఏళ్ళు గడుస్తున్న కొద్దీ మరుగున పడి పోతున్న ఎన్నో ఆటలు, అలవాట్లు, ఎప్పుడు
సరదా అప్పుడే తీర్చుకోవాలి.

ఆనక పెద్దయ్యాక, లేదా పెద్దమనిషి అనిపించున్నాక ఆడదామన్న ఆడలేము. కాళ్ళు, కీళ్ళు, ఒళ్ళు సహకరించక !!

ఇది
చదివిన వాళ్లెవరైనా గోలీలు ఆడతానంటే నేరెడీ !!
సంచీడు మామూలు గోలీలు, ఒక సోడా గోలీ, ఒక సీసం గోలీ కొని ఉంచా మా ఆఫీసు అడుగు డ్రా లో.. ఎందుకంటే ఇంటికి తెస్తే మా ఆవిడ ఉంచదు, లక్ష్మి కొడుక్కిచ్చేస్తుంది !!





42 కామెంట్‌లు:

  1. బాగుందండీ....
    మీలా పతంగులవీ తయారుచేసి ఎగరేయకపొయినా..... ఆ ఫాను అదీ మేము చేసేవారం...
    నిజమే ఇప్పటి వాళ్ళకి అవన్ని ఎలా తెలుస్తాయో.... పుస్తకాల్లో చదువుతారేమొ అనుకున్నా ఇవన్నీ ఏ పుస్తకాల్లోనూ రాయరు కదా....

    వారికీ చిన్న చిన్న ఆనందాల గురించి తెలిసే అవకాశం ఉందంటారా...?
    మనం చెబుదామని కూర్చోబెడితే మాత్రం మన మాట వింటారా....??

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అసలు ఆనందమంటే లోపలుండేదని,
      బయట వస్తువులిచ్చేది కేవలం వినోదమని,
      చిన్న చిన్న ఆనందాలు మనసు మీద వేసే ముద్రలు ఎంతో విలువైనవని,
      భారీ ఖర్చుల వినోదం వల్ల మిగిలేది ఏమీలేదని పిల్లలకి తల్లిదండ్రులే తెలియ చేయాలి.
      థాంక్స్ మాధవి గారు !!

      తొలగించండి
  2. అమ్మో! ఈ గోలీలాట నాకు రాదు నాకు వచ్చినదల్లా బ్రైన్వీటా మాత్రమే! బోర్న్వీటా తాగుతూ నేర్చుకున్నా! దానికయితే సిద్ధమే! గాలిపటాలకి కూడా! ఈ సారి ఆ దాచేదేదో మా ఇంట్లో దాచి పెట్టరూ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీకు రాదన్నరుగా గోలీలాట
      ఇంకెందుకు నేను మీ ఇంట్లో దాయటం? వేస్ట్ కదా?

      తొలగించండి
  3. చాలా బాగా రాసారు. గోళీలాడటానికి ఎవ్వరూ దొరకరేమో సార్. ఈ మధ్య చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా చూడలేదు ఈ ఆటని.

    శలవు రోజుల్లో టీవీ పెద్దల్నే అలా తన ముందు నుండి కదలనీయట్లేదు, వారి బాట లోనే పిల్లలూను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రిషి గారూ
      ఇనపరేకులు, బాప్ భీ బచ్చా థా, లాంటి సీరియల్స్ చూడటం మానేసిన అమ్మ నాన్నలకు బోలెడు సమయం
      పిల్లలకు చాలా నేర్పించ్చొచ్చు.
      థాంక్ యు !!

      తొలగించండి
  4. ఆత్రేయ గారూ! నాకు గోలీలాట అంత బాగా రాదుకానీ, ఈసారి బ్లాగర్ల మీటు అరేంజి చెయ్యండి... అప్పుడు మీతో ఆడటానికి నేను రెడీ!..ః)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కౌటిల్యా
      వచ్చే ఆదివారం స్వరాజ్ మైదాన్ లో ఆడదాం వస్తారా?
      ముందే చెప్పండి
      లేదా నేను వేరే వాళ్ళతో గోటీ బిళ్ళకి సిద్దమవుతా !
      థాంక్స్ !!

      తొలగించండి
  5. ఆత్రేయ గారూ! గోలీలాట నాకు అంతబాగా రాదు కానీ, మీరు ఈసారి బ్లాగర్ల మీటు అరేంజి చేస్తే , ఆడటానికి నేను రెడీ మీతో...ః)

    రిప్లయితొలగించండి
  6. ఆత్రేయ గారూ మీ కబుర్లు వింటుంటే అవన్నీ కళ్ళ ముందు కదిలాయి. మీరు కాగితపు ఫాను చేసినట్లుగా మేము తాటాకుతో చేసే వాళ్ళం దానికి గుండుసూది కాకుండా తాటి ముల్లు వాడేవాళ్ళం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జ్యోతిర్మయి గారు,
      తాటాకు
      తాటి ముల్లు
      భలే మంచి అయిడియా
      థాంక్స్ !!

      తొలగించండి
  7. అజ్ఞాత24 జన, 2012 8:40:00 AM

    చిన్నతనపు ఆటలు బాగా గుర్తుచేశారు. బచ్చాలాట మరిచిపోయారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారు
      బచ్చాలాట మరవలేదండి, ప్రస్తావించాను.
      కాక పోతే ఆ సిగరెట్ పెట్టె డొక్కులు ఇంట్లోకు తెస్తే మా నాన్న నా వీపు మీద బచ్చాలాటే ..
      థాంక్ యు !!

      తొలగించండి
  8. గోళీలకి సై,
    ఎదరా,
    మేలా ?
    (ఇది మా వూరి భాష, మీరేమంటారో తెలీదు)

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. மீதோ கோலீலா ?
      ஆணாக செய்யி கடுக்கொவாளி
      ரொம்ப நன்றி !!

      తొలగించండి
    2. ఆత్రేయ వారు,

      నాకు తెలిసిన ఆ 'రవ్వంత' తెలుగూ, 'అరవ' తెలుగంటారు ! ఎం చేద్దాం !!

      చీర్స్
      జిలేబి.

      తొలగించండి
  9. గోళీలు, బచ్చాలు,బొంగరాలు బస్తిమే సవాల్. నేను ఎక్స్పెర్ట్ ని మా చిన్నప్పుడు. రెండు రోజులకొక బొంగరం పగిలేది బొంగరాల యుద్ధాలలో. మళ్ళీ బొంగరం కొనుక్కోడానికి ఒక కాణి కోసం ఎంత ఏడ్చి సాధించే వాళ్ళమో. మా వూరి (భీమవరం) వీరమ్మ చెరువు గట్టున కర్రా బిళ్ళా, చెడుగుడు అప్పుడప్పుడు గాలిపటాలు ఎగరవేయడం. గాలిపటాలకి సీజన్ అంటూ ఉండేది కాదు మాకు. ఎప్పుడు దారపు ఉండ దొరికితే అప్పుడే చేసేవాళ్లం. పోస్ట్ ఆఫీసు లలో జిగురు డబ్బా ఉండేది. అక్కడినుంచి ఎత్తుకు వచ్చే వాళ్లం. పోట్లాలు కి కట్టిన దారం భద్రంగా దాచేవాళ్లం. అది రెండు పేటలు వేసి, దానికి కూడా ఇంత జిగురు పూసి ముళ్ళు వేసి ఉపయోగించే వాళ్ళం.

    మీ టపా కన్నా పెద్దది అయే టట్టు ఉంది కామెంటు. ఆపేస్తాను. థాంక్యూ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బులుసువారూ ,
      బ్లాగావత్తోత్తములు.
      పోస్టాఆఫీసులో జిగురు దొంగతనమా
      లార్డ్ కృష్ణా కళలు కూడా ఉన్నాయన్నమాట మీలో.
      మీతో ఏమి ఆడగలం, మీరేదైనా చెప్తే వినటమే
      ధన్యవాదాలు !!

      తొలగించండి
  10. golila aataa super. naaku maha istam. nenu kooda ready. paatha aatalani baga gurthu cheseru. thanks andi.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రౌడీ అక్కలతో
      ఏమీ ఆడలేము
      పోట్లాడిగెలుస్తారు.
      థాంక్ యు !!

      తొలగించండి
  11. చాలా బాగా రాశారు. మీ గోళీలాట ముచ్చట చూసి నాకు శ్రీరమణ గారి సోడానాయుడు కథ గుర్తొచ్చింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోస్ట్ అసలు ఉద్దేశ్యం మరుగున పడి నాకు గోలీలంటే బాగా ఇష్టమని నిర్దారించారే ..!! హ్మ్ !!

      తొలగించండి
  12. ఆత్రేయ గారు,
    ఈసారి మీకు పాతంగాలు ఎగురవేయాలంటే నాకు కాల్ చేయండి నేను వస్తా.
    నేర్చుకుంటా... :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భరత్ ,
      ఈసారి ట్రెక్కింగ్ కి వెళదాం అమరావతి వెళ్ళే దారిలో ఉన్న వైకుంఠపురం కొండకి. నీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పు.

      తొలగించండి
    2. ఆత్రేయ గారు తప్పకుండ వెళ్దాం. నా తెలుగు బ్లాగ్ ని కూడా విక్షీంచండి

      http://www.onetidbit.com/telugublog/

      తొలగించండి
  13. చాలా విశేషాలు చెప్పారు. చాలా బాగున్నాయి. పెద్ద వాళ్ళెప్పుడు అంతే..మాస్ ఆటలు ఆడనివ్వరు. నిజమండీ!!!

    ఈ సారి బ్లాగర్ సమావేశాలప్పుడు..నేను ,కౌటిల్య రెడీ.. అండీ.. ఈ లోపు రసజ్ఞ కి కూడా నేర్పుతాను. ఏమైనా సరే గోళీలాట ఆడాల్సిందే.!!!!.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి గొలీల టోర్నీ పెడదామా... మన బెజవాడ లో ..
      థాంక్ యు !!

      తొలగించండి
  14. మీ బ్లాగు చదివి, నా చిన్నతనపు రోజు గుర్తుకు వచ్చాయి. నేను మీకన్న వయసులో పెద్దవాడినే అయినా, చిన్నతనపు అనుభవాలు ఇంచుమించుగా ఒక్కటే. కాకపోతే, ప్రదేశం, సమయం తేడా అంటే. ఆ రోజులలో మధ్య తరగతి తల్లులు అందరూ ఒకేలా ఆలోచింకెవారు. వారి పిల్లలని దిగువ మధ్య తరగతి లేదా ఇంకా బడుగు వర్గాల వారి పిల్లలతో కలవనీయకుండా జాగ్రత్త పడేవారు. ఇంకా కాలేజీకి వచ్చేసరికి అంతా సమవయస్కులే ఉండడంతో వాళ్ళు కూడా నాలాగే ఇంట్లో తల్లుల యొక్క అదుపు ఆజ్ఞాలతో పెరిగిన వారేమో వాళ్ళకీ నాలాగే తీరని కోర్కె గిల్లీ దండా లేదా కర్ర బిళ్లా క్లాసులు ఎగ్గొట్టి ఆడేవాళ్లం. ఇంకా బచ్చలు అనేవి ఉండేవి అవి ఖాళీ సిగరెట్ పాకెట్ ముక్కలతో ఆడేవాళ్లం. చాలా ఆటలు ఈ రోజు పిల్లలని ఆడమని చేబ్దామన్నా వాళ్ళు ఆడే స్థితిలో లేరు కారణం టీవీ ముందు కూర్చొని పోగో నో లేదా వేరే కార్యక్రమాలో చూస్తారే తప్ప ఆ ఆటలు నగరాల్లో ఉండేవారికి అసలు పేర్లుకూడా తెలియవు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవి మన బాల్యం సంగతి నాకు తెలుసు కదా. థాంక్స్ !!

      తొలగించండి
  15. naku kuda golilu aata istam , nenu kuda golilu pi oka post rasanu

    రిప్లయితొలగించండి
  16. edaina aadalante kastha potladadam kooda raavali thammuduu....kastha..nerchukondi.thank u.

    రిప్లయితొలగించండి
  17. "ఇవన్నీ పెద్దాళ్ళకు ఇస్టంలేకుండా చిన్నప్పుడు ఆడేసిన ఆటలు.దొంగతనంగా ఆడటంవల్ల అన్నింట్లోనూ ప్రవేశంతప్ప ప్రావీణ్యం వుండేదికాదు. కానీ, గాలిపటాలు మాత్రం రకరకాల రంగు కాగితాలతో తయారు చేసెవాణ్ణి.బాల్యం గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు. " - బాబు కార్టూన్స్ (కొలనుకొండ దుర్గ ప్రసాద్)

    ఆత్రేయ : ఆ ఆటల్లో ప్రావీణ్యం అక్కర్లేదు.
    జీవితాంతం గుర్తుండే మధురమైన జ్ఞాపకాలున్నాయి అవి చాలవు ?
    ధన్యవాదములు బాబుగారు.

    రిప్లయితొలగించండి
  18. ఆత్రేయ గారూ మీ కబుర్లు వింటుంటే
    అవన్నీ కళ్ళ ముందు కదిలాయి.
    ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు.
    థాంక్యూ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కళాసాగర్ గారూ వెనక్కి వచ్చేయండి
      ఇక్కడ మీరు చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి
      థాంక్ యు.

      తొలగించండి
  19. బుజ్జి....

    మా అమ్మ నన్ను ఆడనీయలేదు ...:(:( చూసేవాడిని అంతే....!!!దొంగచాటుగా ఆడినా మా అమ్మకు ఎవడు చెప్పేస్తాడో అని భయం ఉండేది....

    రిప్లయితొలగించండి
  20. అందరు అమ్మలూ అంతే
    వాళ్ళ భయం మనం ఆడి చెడిపోతామనా ?
    లేక బట్టలు మాపుకుంటామనా?
    రెండోది అయితే మనం ఎలా అడుకోవాలో ?

    రిప్లయితొలగించండి
  21. ఆత్రేయ గారు నన్ను మీరు క్షమించాలి , మీ ఉల్లాసం లో నేను పాలు పంచుకోలేక పోయాను , మీకు ఉన్న హుషారు లో మాకు కనీసం ౧ శాతం అయిన ఉంది ఉంటెయ్ బాగుండేది....
    ఒక చిన్న మాట గురు గారు, ఈ గాలి పటాలు అనేది ఒక ఆట మాత్రమె కాదు అని నా ఉద్దేశం, సంక్రాంతి కి గాలి దిస ని మార్చుకుంటుంది అంటారు,తద్వారా పక్షులకి నీరు ఉన్న వైపుకు దారిని చూపేందుకు ఉపయోగ పడుతుంది,
    పూర్వం ఈ గాలి పటాలు విద్యుత్త్ ని కూడా సౌకర్యా పరుస్తుందని ఒక చోట చదివాను..., మన పూర్వికులు ఏమి చేసిన కచ్చితంగా ఏదో ప్రయోజినం తో కూడి ఉంటుంది అని నా భావన.
    ఈ విషయ జ్ఞానం మన విద్యర్దుల్లోకి అలవారిస్తేయి మన శాస్త్ర ఆగమనాన పురోగమనం చెయ్యచ్చు అని తెలియచేసుకోగాలవాడను..
    ఈ సందర్భంగా చిన్న పాత గుర్తొస్తోంది ... తోడి కోడళ్ళు చిత్రం లో " గాలి పాఠం గాలి పాఠం" అనే పాత చాలా బాగా ఇష్టం నాకు... అంతా హాయిగా ఆడుకోవ;లని కూరిక కూడా ఉన్నది కాని పరిస్తితుల ప్రభావం దృష్ట్యా అవకాసం లేదేమో నన్న బాధ ఉన్నది.. కాని మీరు వ్రాసిన ఈ వ్యాఖ్య మనసుకు చాలా దగ్గర గా ఉన్నది .

    ఆలస్యం గా ప్రతుత్తరం చేస్తునందుకు మన్నించండి... ఇట్లు మీ సిస్ష్య పరమానువుడు...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పర్వాలేదు శిష్యా..
      ముందు తెలుగు టైపింగ్ లో ఉన్న దోషాలు సవరించు.
      లేదా ఇదే వ్యాఖ్య పాతిక సార్లు వ్రాయి.

      తొలగించండి
    2. గురువు గారు ఇది మరీ విపరీతము, గూగుల్ వారి సౌజన్యం తో నేను ఏదో తెలుగు లో వ్రాసాను ,
      ఎమన్నా తప్పులు పడితే అది గూగుల్ వారి అచ్చు తప్పులు గాన
      నన్ను అందున మినహించుకో గలిగితే అదృష్ట వంతుడను
      ఈ సారి నుంచి సవరించి వ్రాస్తాను కాని ఇలా imposition ఇస్తే అల్పులం అయిపోతాం

      తొలగించండి
  22. ఆత్రేయ గారు నన్ను మీరు క్షమించాలి , మీ ఉల్లాసం లో నేను పాలు పంచుకోలేక పోయాను , మీకు ఉన్న హుషారు లో మాకు కనీసం ౧ శాతం అయిన ఉంది ఉంటెయ్ బాగుండేది....
    ఒక చిన్న మాట గురు గారు, ఈ గాలి పటాలు అనేది ఒక ఆట మాత్రమె కాదు అని నా ఉద్దేశం, సంక్రాంతి కి గాలి దిస ని మార్చుకుంటుంది అంటారు,తద్వారా పక్షులకి నీరు ఉన్న వైపుకు దారిని చూపేందుకు ఉపయోగ పడుతుంది,
    పూర్వం ఈ గాలి పటాలు విద్యుత్త్ ని కూడా సౌకర్యా పరుస్తుందని ఒక చోట చదివాను..., మన పూర్వికులు ఏమి చేసిన కచ్చితంగా ఏదో ప్రయోజినం తో కూడి ఉంటుంది అని నా భావన.
    ఈ విషయ జ్ఞానం మన విద్యర్దుల్లోకి అలవారిస్తేయి మన శాస్త్ర ఆగమనాన పురోగమనం చెయ్యచ్చు అని తెలియచేసుకోగాలవాడను..
    ఈ సందర్భంగా చిన్న పాత గుర్తొస్తోంది ... తోడి కోడళ్ళు చిత్రం లో " గాలి పాఠం గాలి పాఠం" అనే పాత చాలా బాగా ఇష్టం నాకు... అంతా హాయిగా ఆడుకోవ;లని కూరిక కూడా ఉన్నది కాని పరిస్తితుల ప్రభావం దృష్ట్యా అవకాసం లేదేమో నన్న బాధ ఉన్నది.. కాని మీరు వ్రాసిన ఈ వ్యాఖ్య మనసుకు చాలా దగ్గర గా ఉన్నది .

    ఆలస్యం గా ప్రతుత్తరం చేస్తునందుకు మన్నించండి... ఇట్లు మీ సిస్ష్య పరమానువుడు...

    రిప్లయితొలగించండి