
"హలో "
"హలో చెప్పండి "
"హలో హల్లో ఎవరూ ..?"
"హల్....నే ... తోందా?"
" ఎవరు ..?"
" నేనే ...హన రావ్ ని
" హలో సరిగ్గా వినపడట్లేదు .."
" హ..లో నే...అస..న రావు నండీ "
ఒక్క క్షణం అనుమానం ఆసన రావా ? అనాస రావా? ఆయాస రావా?
మళ్ళీ "హలో ఎవరూ..?"
"నే.. .. సహన రా.."
"సహన రా?"
".. న పడు... oదా?"
సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా.
"మళ్ళీ కాల్ చేస్తా ఈ నంబరు కే చెయ్యనా?"
"నే అసహన రావ్ ని ...తోందా?"
"లేదు "
"ధూ దీ న... ఫోనూ ధాల్ కనక్ ఛి డం "
చూస్తే కాల్ దిస్కనేక్టేడ్
ఈ సారి నేనే చేశా "కు.. కు.. కు.. మీరు డయలు చేసిన వాడి ఫోన్ స్విచాఫ్ చేయబడి ఉంది దయచేసి మళ్ళీ ప్రయత్నించండి"
గంట తర్వాత ఆఫీసు లో నా ముందు ఒకాయన ఉన్నాడు.
నమస్తే సార్ నా పేరు అసహన రావ్ (ఎక్కడో విన్నట్టు ఉందే..)
నేనే సార్ ఇందాక ఫోన్ చేశా సరిగ్గా వినపడలేదు.
అవును ఏదో పెద్ద శబ్దం తోకట్ అయింది మళ్ళీ నేనే కాల్ బాక్ చేశా స్విచాఫ్ అని వచ్చింది.
అవును సార్ కోపమొచ్చి నేల కేసి కొట్టా పగిలిపోయింది. మళ్ళీ చేద్దామంటే ఫోన్ లేదు మీ నంబరు కూడా లేదు.
ఆగు ఆగక్కడ సిగ్నల్ సరిగ్గా లేక పోతే ఫోన్ నేల కేసి కొడతావా...
అతనొచ్చిన పని ఒదిలేసి నా ఆలోచన లో నేను ... " ఏంటీ ఈ అసహనం? చిన్న విషయాలకే ఇంత రియాక్షనా?"
ఫోన్ సిగ్నల్ లేక పోతే మళ్ళీ కాల్ చేసి ప్రయత్నించాలి. అంతే గానీ ఫోన్ నేల కేసి కొడితే జరిగేది ఏంటి అసలు కే మోసం
అందుకే ఈయన పెద్దలు అసహన రావ్ అని పేరుపెట్టారు.
టీవీ లో స్క్రోల్ ...
జూనియర్ఇంటర్ చదివే పిల్ల కార్పరేట్ కాలేజీ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య
వత్తిడి తట్టు కోలేక అమ్మ నాన్నలని నిరాశ పరచలేక
నేను ప్రాణం ఒదిలేస్తున్నా నన్న లేఖ
ఇంకో ఛానల్ లో ఎక్స్ క్లూసివ్ మాదే...
ప్రేమికురాలి నిరాకరణ తో
ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య
పేపర్ లో....
ఆర్ధిక ఇబ్బందులూ అప్పుల బాధ తాళలేక కుటుంబం ఆత్మహత్య
హాస్పిటల్ లో రక్షింపబడి పదేళ్ళ బాలుడు అనాధగా మిగిలాడు
బ్రేకింగ్ న్యూస్
మా రాష్ట్రం మాకు ఇవ్వలేదని ఉరేసుకున్న పాతికేళ్ళ యువకుడు.
వీళ్ళందరికీ తల్లిదండ్రులూ,చదువు, సమాజం, వెనక నుండి నెట్టే నాయకులూ ఏమీ నేర్పరా ?
జీవితమన్నది ఒక్కటే నని,
చదువు, ప్రేమ, కుటుంబ బాధలూ, సొంత రాష్ట్రాలూ
ఇవన్నీ వివిధ మజిలీలనీ
అవి చేరక పోతే పోయేది ఏమీ పెద్దగా ఉండదనీ,
మళ్ళీ ప్రయత్నం చేయటం ద్వారా అవి సిద్దించ వచ్చని
అమాయకంగా ప్రాణాలు తీసుకుంటే మళ్ళీ తిరిగి రావనీ
ఇవన్నీ లేకుండా కూడా జీవితం ఉంటుందనీ
చచ్చి సాధించటానికి యిది అమర జీవుల శకం కాదనీ.
ఇంట్లో పిల్లలనుంచీ మొదలిడి బయట బంధు మిత్రుల దాకా
ఎవరైనా మానసిక ఒత్తిడికి గురైతే
డిప్రెషన్ లో ఉన్నట్లు కనపడితే
చేర దీయండి, నాలుగు మంచి మాటలు చెప్పి
ఏమార్చండి . అంతే కానీ పోయాక
సంతాప సభలు, ఓదార్పు యాత్రలూ, శవరాజకీయాలూ
ఎవడినో బాగు చేస్తాయి కానీ జీవితాన్ని తిరిగి ఇవ్వవు.
సెల్ అయితే మళ్ళీ కొనుక్కోవచ్చు, పరీక్ష పోతే మళ్ళీ వ్రాసి మంచి మార్కులు తెచ్చుకోవచ్చు,
ప్రేమ ఇంకోళ్ళనుంచి పొందొచ్చు, రాష్ట్రం బతికుండి సాధించు కోవచ్చు.
కానీ జీవితం ఒక్కటే అది మళ్ళీ రాదు,
పనికి మాలిన విషయాలకు, ఆశయాలకు దాన్ని బలి చేస్కోవద్దు.
చిన్నప్పుడు ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూసిన ఒక చెక్ సినిమా గుర్తొస్తోంది
ఒక ఫాక్టరీ కార్మికులు హక్కుల సాధనకై సమ్మె చేస్తారు. ఎన్ని రోజులు పోయినా యాజమాన్యం దిగి రాదు.
కార్మికుల కుటుంబాల లో కష్టాలు వివరం గా చూపిస్తారు.
చివరాకరికి విసుగొచ్చిన కార్మిక నాయకులు ఒక రాత్రి ఫ్యాక్టరీని తగుల బెట్టిస్తారు.
కార్మికులు విజయ గర్వం తో ఇంటికెళ్ళి కుటుంబ సభ్యులకి చెప్పి పడుకుంటారు.
తెల్లవారాక ఒక కార్మిక కుటుంబం లో దృశ్యం
అలవాటుగా కార్మికుడు యూనిఫారం తొడుక్కొని స్టీల్ టోపీ పెట్టుకొని గుమ్మం దాట బోతుంటే ...
వాళ్ళ పదేళ్ళ కూతురు ఇలా అంటుంది " Otec Kam jdeš ..?"
(నాన్న ఎక్కడికి వెళ్తున్నావ్)
జీవితం కూడా ఆ ఫాక్టరీ లాంటిదే తగుల బెట్టేస్తే ఎలా జీవిస్తాం ?