21, జులై 2011, గురువారం
"మా అమ్మ భానుమతి" పార్ట్-2
అలా సగం నిద్రా, సగం పాటలతో వెలుగు వచ్చేసింది. అంటే ఎండ కాదు కానీ చెట్లు ఆకుపచ్చగానూ, పొలాలు ఎర్రమన్నుతోనూ, దూరంగా కనీ కనపడని కొండలు నీలంగా నల్లగా కనపడే అంతగా వెలుగొచ్చింది. నేను కిటికీ లోంచి తల బయట పెట్టి విసురుగా తగిలే గాలికి నా జులపాల జుట్టు ఎగురుతుంటే, చల్ల గాలికి గుక్క తిప్పుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతూ తల లోపలకి తెచ్చేసుకుంటూ.. ఆనందిస్తున్నాను.
ఊహ తెలిసాక ఎప్పుడూ కొండలని అంత దగ్గరగా చూడని నేను శేషాద్రి కనుమలను చూస్తూ విస్తూబోతుంటే సూర్యుడు వచ్చి బోలెడు వెలుగు తెప్పించి ఎండ ఎక్కించాడు. మా బస్ దాదాపు తొమ్మిదికి కొంచం అటూ ఇటూ గా తిరుపతి బస్టాండు లో ఆగింది, మా రాజేశ్వరీ టీచరు వాళ్ళ తమ్ముడు ఆర్టీసీ లోనే పని. అయన బస్ దగ్గరకివచ్చి రిసీవ్ చేస్కొని రిక్షా మాట్లాడి, తను వెనుక సైకిల్ మీద అనుసరిస్తూ ఇంటికి తీస్కేల్లారు.
ఇంటికెళ్ళగానే మా రాజేశ్వరి టీచరు మొహం కడుక్కో, స్నానం చెయ్యి డ్రిల్ టీచరు అసలు స్వరూపం బయట పెట్టింది. ఆర్టీసీ బాబాయి వాళ్ళ ఇల్లు చిన్నగా పొందిగ్గా ఉంది, విచిత్రం గా వంటింటి పక్కనే బాత్రూం కూడా ఉంది ఆనుకుని. మా ఇంట్లో బాత్రూం అవీ కొంచం దూరం లో ఉండేవి. నేను వింతగా చూస్తుంటే ఇక్కదంతే జాగా తక్కువుండేదీ ఇల్లు గిలక్కాయల మాదిరి ఉండును. స్నానాల కొట్టు కూడా అందులోనే అని కొంచం యాస లో చెప్పింది పిన్నిగారు.
నేను స్నానం చేసా. అదేదో ముక్కు కి మంటగా ఉండే, బాదం కాయ షేప్ లో, గాజులా ఉన్న సబ్బు. పేరు చదివా పియర్స్. ఆ వాసన మొదటి సారి వాళ్ళింట్లో చూసానా.. ఆ తర్వాత ఎప్పుడు పియర్స్ తో స్నానం చేసినా నాకు తిరుపతీ ,ఆ చిన్న బాత్రూం, ఇత్తడి గంగాళం చెంబూ గుర్తోచ్చేస్తాయి. ఇప్పటికీ ఒట్టు.
అయ్యాక ఆరోజంతా రెస్ట్ సాయంత్రం బయటకి వెళ్లాం. గోవింద రాజ స్వామి గుడి కెళ్ళాం. ఆ గుడి నాకెందుకో తెగ నచ్చేసింది. సాయంత్రపు సేవ అనంతరం మాకు పెట్టిన దద్ద్యోజనం కారణమయి ఉంటుంది.
కాసేపు తిరుపతి వీధుల్లో తిరిగి ఇంటికొచ్చేసాం. ఆ రాత్రి మిద్దె మీద ఆరుబయట పడుకున్నాం. అక్కడి నుంచీ చూస్తే దూరంగా కొండలూ , బస్ దారీ, నడకదారీ వెంబడి లైట్లు లీలగా కనిపించిన నామాలూ. ఏదో లోకం లో ఉన్నట్లు గా అనిపించింది. అసలు తిరుపతి ఊరంతా ఏదో లోకం లా ఉంటుంది సందడి గా ఎంత రాత్రయినా మనుషుల అలికిడి తో, పెళ్లివారిల్లులా...
మరుసటి రోజు పొద్దున్నే లేపేసారు. కొండకి వెళ్లాలని స్నానం అయ్యాక జత బట్టలు చిన్న బాగ్ లో పెట్టుకున్నాక గుర్తొచ్చింది మా అమ్మ ఇచ్చిన బిస్కట్ పాకెట్.
అడుగు దామని మళ్ళీ ఊరుకున్నా. మేము నలుగురమూ మళ్ళీ బస్టాండ్ కి వెళ్లి ఆర్టీసీ బాబాయి ముందే డ్రైవరుకి కండక్టర్కి మనోళ్ళే కొండకి ఎల్తన్నారు కాస్త బస్ లో జాగా అట్టిపెట్టేదీ.. అని చెప్పి ఉంచటం వల్ల ముందు సీట్లలో కూర్చున్నాము. బస్ బయలు దేరగానే గోవిందా గోవిందా లతో మార్మోగింది. మా రాజేశ్వరి టీచరూ, పిన్ని గార్లూ నాకు జాగ్రత చెప్పారు బస్ కొండ ఎక్కేటప్పుడు మలుపు తిప్పుళ్ళలో వాంతులవుతాయి , అలా అనిపిస్తే ముందే చెప్పు అని. అరగంట తర్వాత బస్ కొండ ఎక్కడం ప్రారంభించింది.
ఇంకో పది నిముషాలకు రోడ్ మలుపులు రావటం మొదలయ్యాయి. నా పక్క వాళ్ళిద్దరూ నా సంగతి పట్టించుకోకుండా చీర కొంగులు ముక్కు కీ మూతికీ అడ్డం పెట్టుకొని ఏదో అవస్థ పడుతున్నారు. నాకు అర్ధం కాలేదు ఏమైందో అని.
ఉత్తర క్షణం లో ముందు రాజేశ్వరి టీచరు ఆనక ఆర్టీసీ పిన్నీ బస్ కిటికీ లోంచి తలలు బయటకి పెట్టి ఓక్క్.. ఓక్క్.. అంటూ డొక్కోవటం చూసా అలాగే బస్ లో ఇంకొంతమందీ..... అదయ్యాక సీసాలో నీళ్ళతో మూతి కడుక్కొని హ్యాండ్ బాగ్ లోంచి నిమ్మకాయలు ఇంకా నిమ్మతొనలనే బిళ్ళలూ తీసి ప్రధమ చికిస్థ ప్రారంభించారు. ఇలాటి బాధ లేమీ లేని నేను తిరుమల కొండల అందాలు చూస్తూ గడిపేశాను.
అంతలో తిరుమల వచ్చింది. ముందు కళ్యాణ కట్టకి వెళ్లి అక్కడ నా ఆరునెలల పొడుగు కేశ ఖండన చేయించి. స్నానం చేసాక బట్టలేస్కోని వెళ్లి పెద్ద పెద్ద కటకటాలున్న హళ్ళలో సిమెంటు బెంచీల మీద కూర్చున్నాం. ఎవరో మా హాలు కి తాళం వేసారు.
అలా కొన్ని గంటల తర్వాత మాముందు హాలు తెరిచి వాళ్ళని పంపారు. పోద్దునేప్పుడో తిన్న ఇడ్లీలు అరిగి కడుపు ఖాళీ అయితే నాకు ఆకలని అడగటానికి మొహమాటం, కాసేపటకి రాజేశ్వరి టీచరు తన దగ్గరున్న బాగ్ తెరచి అందులోంచి అమ్ప్రో బిస్కట్ ప్యాకెట్ ఇచ్చారు తినమని. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్న పాఠం షేరింగ్ ననుసరించి వాళ్లకు కూడా బిస్కట్ లు పంచాను, ఇంకా ఆమె బాగ్ లో నున్న పళ్ళూ తినుబండారాలు కూడా తిన్న తరువాత ఎప్పటికో మా హాలు తాళం తెరిచారు.
పొలోమని తోస్కుంటూ తొక్కుకుంటూ ఇంకో గంట కి ఆ కలియుగ దైవాన్ని దర్శించుకున్నాము. అప్పట్లో ఈ లఘు, మహాలఘువు లు లేవు తీర్ధం శటగోపం కూడా లోపలే ఇచ్చేవారు. స్వామి ని బాగా దగ్గర నుండీ చూడ అవకాశం కలిగేది.
మా అదృష్టం బాగుందీ మా ముందున్న ఎవరో పెద్దాయన గౌరవార్ధం హారతి ఇస్తే లైను మాతో గర్భగుడిలో ఆగిపోయి మేము కొద్ది నిముషాలు అలాగే ఉండి, దివ్య దర్శనం చేస్కున్నాము. బయటకి వచ్చి భోజనం చేసి, కాసేపు అటూ ఇటు తిరుగుతూ కొండపైనెక్కడో కనపడే గులాబీ రంగు భవనాన్ని జమునా బిల్డింగ్ అని చెప్పారు. జమునేవరో నాకు తెలీలా. ఆ భవనము ముందు గార్డెన్ లో కాసేపు ఉండి. చీకటి పడే వేళకు బస్టాండ్ కి వచ్చి బస్సెక్కి తిరుపతి వచ్చేసాం.
ఆ మరునాడు సాయంత్రం వాళ్ళ ఇంటి దగ్గర లో నున్న ఇంకో గుడికి తీస్కేల్లారు. పెద్ద గుడి ఆవరణ పెద్ద చెట్టు నాకు గుర్తున్నాయి. మంటపం లో ఎవరో పెద్దాయన పురాణం చెప్తున్నారు అక్కడ వెన్నెల్లో కూర్చొని చల్ల గాలి ఆస్వాదిస్తూ , చాలా మంది పురాణం వింటున్నారు. కొద్ది సేపట్లో మేము ఇంటికెళ్ళి పోయాము. బహుసా అది కోదండ రామాలయం అని నా ఊహ. ఆ మరునాడు సాయంత్రం మళ్ళీ తిరుగు ప్రయాణం. ఎందుకో చాలా దిగులుగా అనిపించింది. కారణం తెలీని దిగులు. ఆ దిగులు నాకు ఇప్పటికీ ఉండి తిరుమల వెళ్లి తిరుగు ప్రయాణం లో నేను అలా కాసేపు దిగులు గా అయిపోతా, ఆ దివ్య క్షేత్రం లో ఉన్న మహత్తు అలాంటిదో, మరింకేమో కారణం కానీ.
ఎందుకో తిరుగు ప్రయాణం గుర్తులేదు. మర్నాడు మా బందరు లో పొద్దున్న 9 గం లకి చేరాం వెంటనే ఇంటికెళ్ళి స్నానం చేసి స్కూల్ డ్రెస్ లేకుండానే పడి కి ఒక పడి నిముషాలు ఆలస్యం గా వెళ్ళాను అప్పటికి సరోజినీ టీచరు గారి ఫస్ట్ పిరియడ్ తెలుగు మొదలై పోయింది. ఆరునెలలుగా జులపాల తో ఉంది ఒక్క సారి గుండు కనిపించేసరికి మా క్లాస్ లో పదకొండు మంది అబ్బాయిలు కిల కిల నవ్వారు. మా సరోజినీ టీచరు నా వంక ఒక సారి తృప్తిగా చూసి అమ్మయ్య ఇప్పుడు హాయిగా ఉందిరా బుజ్జీ అన్నారు. మా క్లాసులో మిగతా పాతిక మందీ అమ్మాయిలు వాళ్ళలో వాళ్ళే ఏదో గుస గుస లాడుకొంటూ నవ్వుకుంటున్నారు.
నవ్వితే నవ్వారులే నాకేంటీ అని ఊరుకున్నా. మీరే చెప్పండి ఊరుకున్నంత ఉత్తమం, బోడి గుండంతా సుఖం లేదనేగా మీరూ అంటారు. అదే జరిగింది.
కొస మెరుపు : మధ్యానం తీరిక లో మా అమ్మ రాజేశ్వరీ టీచరుని అడిగింది మా వాడు ఎమన్నా ఇబ్బందీ, పేచీ పెట్టాడా అని ? ఆమె నవ్వి ఏమీ లేదు రాత్రి నిద్ర లో ఒక్క కాలు ఒక్క చెయ్యి నా మీద వేసి పడుకున్నాడు అంతే, నాకూ కదలడానికి వీలు లేకుండా అన్నారు. ఆమె కి ఎందుకనో పెళ్ళికాలేదు, అందుకే పిల్లల కాలూ, చెయ్యి గోల లేదు మరి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మంచి జ్ఞాపకం..చాలా బాగుంధి.మీ బిస్కెట్ పేకెట్ సరి అయిన సమయం లొ..పంచుకున్నారు. మీ రాజేశ్వరి టీచర్ కి.. ధన్యవాదములు చెప్పండి.స్వామి దర్శనం కి.. తీసుకుని వెళ్ళినందుకు జడలు వెసుకొకుండా మొక్కు తీర్పించడానికి తీసుకుని వెళ్ళినంధుకును.
రిప్లయితొలగించండి:)బాగున్నయండి మీ రెండూ టపాలూనూ..!!good memories.
రిప్లయితొలగించండిమీకు అమ్మయితే.. చాలా మందికి అమ్మమ్మ లేదా నాయనమ్మ...గడసరి అత్తయ్య..
రిప్లయితొలగించండిbagundi mee tirupati prayana gadhaa........ manchi teacher garu.budhimanthulaina sishyulu garu. mee ammagari pempakam grt.
రిప్లయితొలగించండి