12, జులై 2011, మంగళవారం
ఆకులో ఆకునై...!!
గీతా చార్యుడేమన్నాడు...?
పత్రం పుష్పం ఫలం తోయం
యో మే భక్త్య ప్రయచ్చతి
తద్ అహం భక్తి -ఉపహ్రితం
ఆహ్నామి ప్రయతాత్మనః
ఎవరైతే నాకు ఆకైనా, పండైనా, పువ్వైనా, కనీసం నీరైనా భక్తితో, ప్రేమతో సమర్పిస్తారో
అట్టివానిని నేను అత్యంత ప్రీతితో స్వీకరిస్తాను.
చిన్నప్పుడు ఘంటసాల గారి భగవద్ గీత రోజుకో సారి విని, విని ఈ శ్లోకం దగ్గర కొంచం డౌట్ పడేవాడిని.
భక్తులెవరన్నా ఆ కృష్ణుడికి పళ్ళివచ్చు , పూలివ్వచ్చు , పోన్లే నీరు కూడా సమర్పించ్చొచ్చు ,
మరీ ఆకులిస్తారా ఏంటి? ఇస్తే ఏమి ఆకులిస్తారు ?
పళ్ళిస్తే హాయిగా వనంలో గోవులు కాసుకుంటూ తినొచ్చు. మరీ ఎక్కువయితే రసం తీసి తాగొచ్చు.
పూలిస్తే పక్కింట్లో రాధ కివ్వొచ్చు, లేదా దండ చేసి మెళ్ళో వేసుకోవచ్చు, అప్పుడు చెంగల్వ పూదండ పద్యం లో లాగా అందం గా కనపడొచ్చు.
నీరిస్తే దాహమేస్తే తాగొచ్చు, మొహం కడుక్కోవచ్చు . లేదా బాగా ఎక్కువిస్తే స్నానం కూడా చెయ్యొచ్చు.
మరీ అకులేంటి ?
భక్తులు శ్రీ కృష్ణునికి మరీ ఆకులిస్తారా ఏంటి?
ఇస్తే ఏమి ఆకులిస్తారు ?
ఇలా ఆలోచిస్తే ఎన్నో ఆకులూ స్పురిస్తాయి...
తమలపాకులిస్తే కిళ్ళీలు చుట్టి వేస్కోవచ్చు. రుక్మిణికిస్తే రాత్రి బోనాలయాక అంతఃపురం గవాక్షం లో వెన్నెల్లో ఉన్న తూగుటుయ్యాల పై మాగన్నుగా నిద్దరోస్తుంటే, చిలకలు చుట్టి వేళ్ళకి తొడుక్కొని ఈ ఒక్కటీ, ఈ ఒక్కటీ అంటూ బుజ్జగిస్తూ నమిలిస్తుంది, భేష్ బానే ఉంది ఈ ఐడియా !!
అబ్బే శ్రీ కృష్ణుడు కిళ్ళీలు, చిలకలు అలవాటు లేని బుద్ధిమంతుడు అంటారా.
సుబ్బరం గా ఏ ఆదివారం సాయంత్రమో శనగపిండి జారుగా కలిపి వామేయించి సత్యభామ తో బజ్జీలు వేయించు కుంటాడు.
ఇంటి వెనక పొగడ చెట్టు కింద కూర్చొని గోపబాలురు ఆడే ఆటలు చూస్తూ ఇంచక్కా తినేయచ్చు.
ఇంకా ఏంటి ఉపయోగాలంటారా .. ?
పాలూ మీగడ వెన్న ఎక్కువయ్యి బొజ్జ నోస్తే,ఆముదం రాసి
కుంపటి సెగ మీద వేడిచేసిన తమల పాకు తో కాపడం పెడితే దెబ్బకి నొప్పి హరీ !!
అంచేత తమలపాకు ఇస్తే ఉపయోగమే.
ఇంకా ఎ అరటి తోటలున్న ఆసామో రెండు కట్టల అరిటాకులు సమర్పించుకుంటే ..
రోజూ అందులోనే కృష్ణ పరమాత్మ భోజనం చెయ్యొచ్చు.
పెద్దాకులు చిరిగితే వెండి ఫలహారప్పళ్ళెం కొలతకు కత్తిరించి అదివేసి వేడి వేడి నేతి పెసరట్టేస్కోని అల్లం మిరపకయముక్కలూ, ఆ వేడికి అరిటాకు రసంతో కలిస్తే ఆ రుచే వేరని
అమ్మ యశోదమ్మ మరీ రెండు అట్లెక్కువ తినిపిస్తుంది.
ఇంకా చిన్న అరిటాకులు మిగిలిపోతే మినప గారెలు తట్టుకోవడానికి పనికి వస్తాయి.
కాబట్టి అరిటాకులిచ్చినా సరే ఉపయోగ పడతాయి.
ఇంకా తోటకూరాకు ఇస్తే వడియాలూ, కందిపప్పు తో పొడికూర చేస్కోవచ్చు.
లేదా ఒక చిన్న మామిడికాయ వేసి పప్పు చేస్కో వచ్చు.
అందులోకి వేయించిన ఎండు మిరపకాయలు మర్చిపోకుండా ఉంటె భేష్ భేష్.
తోటకూరనగానే నాకో బాల్య జ్ఞాపకం ( ఏంటీ దొంగతనమా అని మీకు సందేహం ఒద్దు)
నా చిన్నప్పుడు సుమారు ఏడు ఎనిమిదేళ్ళ వయసులో నేను ఆకుకూరలు తినక పోతే
మా నాన్న మా బందరు బస్టాండు పక్కనున్న గ్రవుండు లో వచ్చిన న్యూ గ్రాండ్ సర్కస్ కి తీస్కెళ్ళి చూపించి,
ఆ మర్నాటి నుంచి భోజనాల, సర్కస్ ఆ అబ్బాయిలు అలా ఎలా ఫీట్లు చేసారో తెలుసా చిన్నప్పుడు బోలెడు (మేటలు మేటలు) తోటకూర తింటారుట,అందుకే వాళ్ళు అలా బలంగా ఉంటారు,
అలా ఎగిరి దూకగలరు అనే వాళ్ళు.
సర్కస్ అబ్బాయిలంటే విపరీతమైన మోజులో ఉండే నేను మారు మాట్లాడకుండా కంచంలో తోటకూర కూర మాయం చేసి మళ్ళీ వేయమన్నట్లు మా అమ్మ వంక చూసేవాడిని. ఎప్పుడు తోటకూరను నేను స్వీకరించనూ అని మారాం చేసినా మా అమ్మేమి మాట్లాడేది కాదు, అందుకు గంధర్వులు ఉన్నార్లే అన్న ధీమా గా మా నాన్న వంక చూస్తూ.. అప్పుడు మా నాన్న సేరియస్సుగా మొహం పెట్టి, ఇంకేమీ సబ్జెక్ట్ లేనట్టు సర్కస్ అబ్బాయిల ఉదంతం మొదలెట్టేవారు.
అంతే అత్యంత అమాయకం గా ||తోకూ|| తినటం ద్వారా మాయం చేసేవాడిని.
అలా ఇప్పటికీ మా ఇంట్లో పెద్దాళ్ళకి నేనంటే అదే అలుసు భోజనాల దగ్గర సర్కస్ అబ్బాయంటూ హాస్యమాడతారు.నవ్విపోదురు గాక నాకేమీ ఇప్పటికీ నా బలం సర్కస్ అబ్బాయిలకేమీ తీసి పోదు.
నిజం తోటకూరమీదోట్టు.
చుక్కకూరాకు ఇస్తే పెసరపప్పు తో మేళ విస్తే అద్భుతమైన రుచి, మళ్ళీ పచ్చిమిరపకాయ నంచుకోవటం కృష్ణుడికి గుర్తుచేయ్యాలి.
చింతాకు సరే సరి పప్పు విసుగనిపిస్తే రొయ్యలతోనో, వేట మాంసం తోనో ( శాఖాహారులు క్షమించాలి కృష్ణుడు యాదవుడు, ఆయనకు తినే పర్మిషన్ ఉంది)
గోంగూర కూడా అదే కాంబినేషను కానీ పచ్చడికే నా ఓటు,
ఎంతైనా ఆంధ్రమాత కదా, మరి ఉత్తరాదివాడైన కృష్ణుడేమి చేయించు కుంటాడో ఆయనిష్టం.
నాలాంటి తింగరోడు ఎవరైనా కాకరాకు సమర్పిస్తే స్వామీ ..?
ఏమీ పర్వాలేదు అష్ట నాయికలనూ కూర్చోబెట్టి , వాళ్ళ పాలేరు పెళ్ళాం తో బోలెడు గోరింటాకు రుబ్బించి
వాళ్ళ అరిచేతుల్లో ఆ కాకరాకు వేసి అందం గా గోరింటాకు పెట్టేయగల నేర్పరి.
ఏ పల్లెటూర్లో భక్తుడే ఊరికే దొరికాయని తామరాకులు ఇస్తే
ఏమి చేస్కుంటాడు దానిమీద ప్రణయ లేఖలు రాసి సఖుల కిస్తాడా..?
లేదా బాగా ఎండ వేడి గా ఉన్నప్పుడు శయనాగారం లో తల్పం మీద పరుచుకొని పడుకుంటారా..?
అయన సంగతేమో కానీ తామరాకులనగానే మళ్ళీ నా ఫ్లాష్ బ్యాక్
నాకు గుర్తు కొచ్చింది. అప్పుడప్పుడూ సాయంత్రాలు బజారు నుంచి వస్తూ
ఎండు తామరాకు లో వేడి వేడి మిరపకాయ బజ్జీలు
మా నాన్నఇంట్లోకి తెచ్చి నప్పుడు , ఆ పొట్లం విప్పినప్పుడు వచ్చే ఆ సువాసన నాకింకా గుర్తు
బజ్జీల వేడికి ఆ ఎండు తామరాకులు కమిలి చక్కటి పరిమళం వచ్చేది.
అందరూ బజ్జీలు తింటుంటే నేను ఆ వాసన ఆఘ్రాణిస్తూ ..ఉండిపోవడం !! నాకింకా గుర్తు.
ఇంకా ఏమేమి ఆకులివ్వొచ్చు
ఆలోచించండి ...
ఫ్లాష్ లా గుర్తొచ్చింది
పోయిన్నెలలో తీరిక దొరికి ఒక పది రోజులు మంగళూరు
చుట్టుపక్క ప్రదేశాలు చూద్దామని నేనూ మా ఆవిడా వెళ్లాం.
మంగళూరులో దిగ గానే వసతి ఎక్కడ బాగుంటుందని మా ఆవిడా ,
తిండి ఎక్కడ బాగుంటుందని నేనూ వాకబు జేస్తే,
కేయస్ రావ్ రోడ్ లోని జనత డీలక్స్ హోటల్ మంచి చోటని చెప్పారు
నిజం గానే చాలా శుభ్రంగా దర్పంగా ఉంది
కొంచం రేట్లెక్కువయినా బాగుంది.
మొదటి రెండు రోజులు అక్కడ బ్రేక్ ఫాస్ట్ చేసాం ఇడ్లిసాంబారు,మషాలాదోశ , రవ్వరోశ , పూరీలు అన్నీ బాగున్నాయి.
మూడో రోజు ఇవన్నీ మనింట్లో కూడా తినేవే కదా, మంగళూరు స్పెషలేంటో అని స్టివార్డ్ ని అడిగా
వెంటనే పత్రోడ్ అన్నాడు. అంటే హేమిటీ దేంతో చేస్తారు అని అడిగా, సగం ఇంగ్లిష్ లో
మేడ్ లీవ్స్ టిపిన్ అన్నాడు. ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేసి ఉన్న నేను ధ్రిల్లయి వెంటనే ఆ పత్రోడ్ గారిని ప్రవేశ పెట్టు అన్నాను. ఆయన తెచ్చాడు. తొక్కతీయ కుండా కుక్కరు లో ఉడక పెట్టిన
పచ్చి అరటికాయ షేపూ, రంగూ లో ఉన్న ఒకటి ప్లేట్ లో ఉంది.
పైగా కాంటినెంటల్ డిష్ లా పక్కన నైఫు ఫోర్క్ స్పూనూ
నేను కొంచం జంకి మా ఆవిడ వంక సావకాశంగా చూసా ట్రై చెయ్యి అన్నట్లు,
ఇలాంటి వాటికి చాలా దూరం లో ఉండే ఆవిడ ససేమీరా అంది,
ఆర్డరిచ్చిన నేరానికి నేనే ఆ ప్లేట్ ముందుకి లాక్కొని
నైఫ్ తో చాప్ చేసి ఫోర్క్ గుచ్చి చిన్న ముక్క నోట్లో పెట్టుకున్నా
ఏదో తెలియని భావాలు
ఎక్కడో పరిచయమున్న జ్ఞాపకాలు
ఆ వెలిగింది... చామాకులు పిండి రాసి చుట్టి ఆవిరి మీద ఉడికించి తెచ్చాడు.
మా చిన్నప్పుడు మా అమ్మ చేసేది చామాకు బుట్టలు అని
చామాకులు మీద శనగ పిండి ఉప్పు కారం జీలకర్రపొడి మిశ్రమం రాసి అవి చుట్టి
ఆవిరి మీద ఉడికించి ఆనక బయటకి తీసి చక్రాలు అడ్డంగా కోసి నూనెలో వేయించేది.
భలే బాగుండేవి. కాకపోతే చిన్న చిట్కా పాటించక పోతే గొంతులో దురద వచ్చి వికారం కలుగుతుంది.
అదేంటంటే శనగ పిండి మిశ్రమం లో చితపండు కలపితే దురద రాదు.
వీడి మొహం మండా ఇది టిఫినా అనుకోని మళ్ళీ మా అవిడ పరిహాసానికి గురి అవ్వాల్సి వస్తుందని
చాలా నేర్పుగా అరగంట లో తినేసా.
ఇంతకీ చెప్పొచ్చేదేమంటే ఎవరైనా భక్తులు భక్తిగా చామాకులు కృష్ణునికి
సమర్పిస్తే వాటిని ఆయనేం చేస్కున్తాడో.
ఆయన పదారువేలమంది భార్యలకీ, ఇద్దరమ్మలకీ చామాకు బుట్టలు కూర చెయ్యటం వచ్చో రాదో ?
వస్తే గొంతులో దురద రాకుండా చెయ్యటం చిట్కా తెలుసో లేదో ?
ఏదేమైనా ఏమాకులిచ్చిన ఏదో ఒక ఉపయోగం.
ఎదీలేక పోతే ఎప్పుడన్నా చేతులు కాలాక పట్టుకోవడానికైన పనికొస్తాయి.
అయినా ఆ దేవ దేవుడి చేతులెందుకు కాల్తాయి..?
కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయం శ్లోకం.... లో ఏమిచ్చినా ఆ భగవానునికి దాని ఉపయోగించటం పెద్ద సమస్య కాదని తెలుసుకోవటానికి నాకు ఇన్నేళ్ళు పట్టింది.
కాకపోతే భక్తితో ఆర్తితో ఇవ్వాలి !!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బావున్నాయండి మీ ఆకుల కబుర్లు
రిప్లయితొలగించండిఅమ్మో! చాలా ఆకులు చదివారండీ మీరు. ఇంకా ఎక్కువ చదివించారు.ధన్యవాధములు. చాలా బాగుంది
రిప్లయితొలగించండిచదివినంత సేపూ సేరియసా లేక చాతుర్లాడుతున్నారా తేల్చుకోలేక పోయా
రిప్లయితొలగించండికానీ చాలా సరదాగా చాలా సమాచారం ఇచ్చారు
మీ బ్లాగ్ జోరు తగ్గింది ఎందుకని
-బొరుగుల రెడ్డి
గుర్తుపట్టారా
@లతా&వనజ గార్లు ధన్యవాదములు. ఎంత చెట్టుకి అన్ని ఆకులని ...
రిప్లయితొలగించండి@బొ.రెడ్డి నా ఆఫీసు పని మీరు చేస్తానంటే....జోరు పెంచుతా
"నాలాంటి తింగరోడు ఎవరైనా కాకరాకు సమర్పిస్తే స్వామీ ..?
రిప్లయితొలగించండిఏమీ పర్వాలేదు అష్ట నాయికలనూ కూర్చోబెట్టి , వాళ్ళ పాలేరు పెళ్ళాం తో బోలెడు గోరింటాకు రుబ్బించి
వాళ్ళ అరిచేతుల్లో ఆ కాకరాకు వేసి అందం గా గోరింటాకు పెట్టేయగల నేర్పరి."
ఇది చాలా బాగుంది. ఇంత పేద్ద పోస్ట్ ఎలా రాయగలరు?
నీ బ్లాగులో చాలా ఇన్ఫర్మేషన్ దాగి వుంది అన్నా
రిప్లయితొలగించండిchala bagundi mee post.
రిప్లయితొలగించండిమీ సరసం మీకే చెల్లు, బాధయినా, భక్తయినా వెటకారం మాత్రం చెయ్యకుండా ఒదలరు.
రిప్లయితొలగించండిమురళిప్రసాద్
థాంక్స్ చందూ
రిప్లయితొలగించండిహేమంత్, రామ్, మురళీప్రసాద్.
anni aakuluu chepperu.. but ikkada PATRAM ante TUALASI emo!!!! Nallanayyaku atyanta preeti ayyinadi TULASI kaduu!? alaage VATAPATRAM kooda nu.
రిప్లయితొలగించండి