20, జులై 2011, బుధవారం
మా అమ్మ భానుమతి !!
పాట ను ఆటో ప్లే లో పెట్టలేదు వినలనుకున్నవారు ప్లే బటన్ నొక్కండి
భానుమతి మా అమ్మ.
నిజం !! చిన్నప్పుడు నేను పొత్తిళ్ళ వయసులో ఉన్నప్పటి నుంచి ఎత్తుళ్ళ దాకా,
పారాడే వయసు లోంచి, మాట్లాడే వయసుదాకా మా ఇంట్లో భానుమతి అటూ ఇటూ తిరుగుతూ పని చేస్కుంటూ, దొడ్లో కాళ్ళ మీద కూర్చోపెట్టుకొని నీళ్ళు పోస్తూ "పెరిగే మా బాబు ధీరుడై ధరణీ సుఖాలా నేలగా....." అంటూనో
మాకు చదువు చెప్తూ, అన్నం వండుతూ, పొద్దున్నే స్కూల్ కి టైమవుతుంటే హడావిడిగా పూజ చేస్తూ మధ్యలో "సావిరహే తవ దీనా..." అంటూ కూని రాగాలు తీసేది
సాయంత్రం మేము చేసే పనులకు అరుస్తూ, మా వెంట పరిగెత్త లేక వగరుస్తూ,
స్కేల్ రొంపిన దోపుకొని దొరికాక వేస్తా మీకు మంచి పెసరట్లు అంటూ బెదిరిస్తూ " సన్నజాజి తీవేలోయ్ సంపంగి పూవులోయ్ ..." ఎప్పుడూ పాడుతుండేది
అంతమాత్రాన మీరంతా భానుమతంటే సినిమా లో భానుమతనుకునేరు మా అమ్మ భానుమతికి పిచ్చ ఫాను.
చాలా బాగా పాడేది. అంచేత మా ఇంట్లో మిగతా వాళ్ళ సంగతేమో కానీ నాకు మాత్రం భానుమతి పాటలంటే భలే ఇష్టం.
ఈ రోజు ఆఫీసు నుంచి వస్తూ ఆమె సీడీ వింటూ ఆమె పాటల్లో ఒక మంచి ముత్యం "మేలుకోవయ్యా కావేటి రంగా శ్రీరంగా మేలుకోవయ్యా .. దగ్గర ఆగి పోయా. క్రమం గా నా ఎనభై కిలోల బరువు తగ్గిపోయి నేను పొట్టిగా సన్నగా పీల గా
మెడల దాకా జుట్టు తో మారిపోయా. అదేంటో నా షూస్ బాగా లూస్ అయ్యాయి నా చొక్కా ప్యాంటు నా శరీరానికి నాలిగింతల పెద్దవి అయ్యాయి.
కారణం ఆ పాట వింటూ నేను నేను ముప్పై అయిదేళ్ళ వెనక్కి వెళ్ళిపోవటమే...
అప్పుడు నాకు పదేళ్ళు చదువు ఐదో క్లాస్ లో ఉన్నా. ప్రతీ ఏడు క్రమం తప్పక తరువాతి తరగతికి ఎదిగినట్లే, పొడుగు పెరిగినట్లే, పెద్దాడినయినట్లే, నాకింకో అలవాటు కూడా ఉంది.
అదేంటంటే ప్రతీ ఏడూ క్రమం తప్పక ఏదో ఒక అనారోగ్యం తెచ్చుకోవటం, కుట్లేసే అంత గాయం ఆటల్లో తగిలించు కోవటం చేసేవాడిని. ఒక ఏడు డబల్ టైఫాయిడ్ వస్తే ,ఇంకో ఏడు తడపర కోరింత దగ్గు, ఇంకో సారి ఆటలమ్మ.
ఇంకో సారి ఇంకోటీ ఇలా నా పద్ధతి లో నేను జబ్బు పడేవాడిని.
ఒక నెల రోజులు రెస్ట్ గా ఇంటి వద్దే విద్యాభ్యాసం. అల్లాంటి టైముల్లో మా అమ్మ గంగానమ్మ కి సద్ది పోయించంటం నుంచీ మొదలుకుని తిరుపతి వెంకన్నకు నా జుట్టు ఇస్తానని మొక్కుకోవటం దాకా. ఐదో క్లాస్ మొదట్లో వచ్చిన టైఫాయిడ్ కి తిరుపతి మొక్కు మొక్కింది. ఇక అప్పటి నుంచీ నో క్రాఫ్ అలా ఆరునెలలు గడచినాయి. తిరుపతి వెళ్ళే వీలు కాలేదు. మా అమ్మా నాన్న ఇద్దరూ ఉద్యోగాల వలన ఒకే సారి సెలవ దొరకకో, ఇంకేదో కారణాల వల్లో అలా నెలల తరబడీ నా మొక్కు తీరక, జుట్టు పెరిగి హిప్పీ లా తయారయ్యా.
ఇదంతా చూసి ఒక రోజు మా అమ్మా ఫ్రెండు రాజేశ్వరిటీచరుగారు వాళ్ళ తమ్ముడు తిరుపతిలో ఉంటారు, ఆయన్ని చుట్టపు చూడటానికి వెళ్తూ నన్ను తనతో పంపమని మొక్కు చెల్లించి తీసుకు వస్తానని చెప్పారు. ఇదేదో మంచి అయిడియా లా ఉందని మా అమ్మా ఒప్పుకుంది.
ఒక మంచి రోజుకు టికెట్స్ బుక్ అయ్యాయి. బందరు-తిరుపతి బస్ కి. సాయంత్రం ఏడు గంటలకి ప్రయాణం మొదలు. చక్కటి చిక్కని ఎర్రటి రంగున్న బస్ లో మూడు రెండు (3 బై 2 ) ఆకుపచ్చని రెగ్జిన్ సీట్లున్నాయి . గంటకు నలభై కిలోమీటర్ల వేగం మించని భద్రమైన మా మంచి బస్. సుమారు నాలుగు వందల తొంబై కిలోమీటర్ల దూరం పద్నాలుగు గంటల్లో తీస్కెళ్ళే ఉదారమైన బస్. ఉదారమంటే, మరంతేగా చిన్నప్పుడు బస్ ఎక్కితే గమ్యం త్వరగా రాకూడదు అని కోరుకునే వాడిని ఎంచక్కా బస్ లోనే ఉండచ్చని.
కిటికీ లోంచి చూస్తూ వెనక్కి పరిగెత్తే లైటు స్తంభాలు, చెట్లు, ఇళ్లు, మనుషులు ఇతర వాహనాలు చూస్తూ. (నిజానికి అవేమీ పరిగెత్తవుట మనమే ముందు వెళ్తామట మా శాంతీ టీచర్ చెప్పేవాళ్ళు).
ఇంతకీ ఆ రోజు రానే వచ్చింది నేనూ మా రాజేశ్వరి టీచరు బస్ ఎక్కాము. ఎక్కే ముందు మా ఆమ్మ ఒక అమ్ప్రో బిస్కట్ పాకెట్ కొనిచ్చింది. దార్లో ఆకలేస్తే తిను అని. అది మా టీచరమ్మ బాగ్ లో పెట్టేసారు. అడగటానికి నాకు మొహమాటం. ఆమె ఇవ్వలేదు.
అలా రాత్రి ఏడు గంటలకు మొదలైన మా ప్రయాణం సుమారు రెండు గంటల పై చిలుకు తర్వాత బెజవాడ జేరింది. పావుగంట తర్వాత మెల్లగా గుంటూరు వైపు దారి తీసింది. బస్ లో నిద్ర పట్టని నేను రెప్ప వాల్చకుండా కిటికీ లోంచి చూస్తూనే ఉన్నాను. మధ్యలో ఆకలి లేక పోయినా మా టీచరు బిస్కట్ పాకెట్ ఇస్తే బాగుండు కదా అనుకున్నా. ఉహు ఎం లాభం లేదు ఇవ్వలేదు పైగా సీటు వెనక్కి తల జేరేసి కళ్ళు మూస్కొని ధ్యానం చేస్తున్న భంగిమ లో ఉండి పోయారు.
నేను ఆమె వంక కిటికిలోంచి మార్చి మార్చి చూస్తూ గడుపుతున్నాను. ఒకటి రెండు సార్లు ఆమె కళ్ళు తెరిచి నన్ను ఇంక చూడటం ఆపి పడుకో అని హెచ్చరించారు కూడా . నే వినలా ముఖం అటు తిప్పి కిటికీ వీక్షణం చేశా.
బస్ ఎన్నో ఊర్లు దాటి చిలకలూరిపేట అనే చోట ఆగింది, ఆ పదకొండింటి సమయం లో ఎర్ర బల్బుల వెలుగు లోని ఆ ఊరు. ( అప్పటికి ట్యూబులైట్లు ఇంకా బాగా వాడకం లోకి రాలా ) చిన్న చిన్న కొట్లు, మనుషుల హడావిడి తో సందడి గా ఉంది. పేరుని బట్టీ ఆ ఊర్లో చిలకలెక్కువ ఉంటాయేమో అని అనుకున్నా. ఉన్నా ఆ చీకట్లో పడుకొని ఉంటాయి మన బస్ దగ్గరికి వచ్చి కువ కువ లాడవుకదా అని సరి పెట్టుకునా.
కూరల గంపలూ, వాసన ద్వారా తెలిసిన ఉల్లిపాయల బస్తాలు బస్ లోకి ఎక్కాయి. మళ్ళీ చీకటి లోకి బస్ దూసుకు పోవటం మొదలెట్టింది. లోపల కూరగాయల వాసన, బయట పొలాల మీంచి వచ్చే గమ్మతైన వాసనల తో బస్ ఎగుడు దిగుడు రోడ్ల మీద ఎగిరెగిరి పడుతూ వెళ్తోంది.
చల్లటి గాలి మొహమ్మీద కొడుతుంటే బస్ కుదుపులకి ఊయల హాయి వచ్చి, నాకు నిద్ర ముంచుకొచ్చి , మా రాజేశ్వరి టీచరు గారి చేతి మీద తల ఆన్చి నేనూ ధ్యానం లోకి వెళ్ళిపోయా.
ఆ ధ్యానం లో నాకెన్నో కనపడ్డాయి.... కొండలూ లోయలూ, నాకు బిస్కట్ పాకెట్ ఇవ్వకుండా ధ్యానం చేస్కుంటున్న మా రాజేశ్వరి టీచరూ, ఊయలా, ఉల్లిపాయలూ, వెంకటేశ్వరుడూ, మా బడీ, మా ఇల్లూ, మా ఆమ్మ భానుమతి, ఆమె పాటా ఇలా ఒకదానికొకటి పొంతనలేని వన్నీ దొంతర దొంతరలు గా వచ్చి కనపడి వినిపించాయి.
ఎందుకో ఊయల ఊపు ఆగింది ఎవరో ఊయాలని చేత్తో పట్టుకొని ఆపేశారు కానీ మా ఆమ్మ భానుమతి పాటా మాత్రం వస్తూనే ఉంది " పెరిగే మా బాబు ధీరుడై ........
శ్రీకర కరుణాల వాల వేణుగోపాలా....." అంటూ కమ్మగా చెవుల్లో కొంగు సన్నగా నులిమి, తలంటిన తడిని తుడుస్తున్న ఆమ్మ చీర గిలి లా .... పాట.
కొద్ది క్షణాల్లో నేను ధ్యానం లోంచి బయటకి వచ్చేసా. పక్కన ఆమ్మ బదులు రాజేశ్వరి టీచరు. నేను మొహం తిప్పి కిటికీ లోంచి చూస్తే ఏదో ఊర్లో బస్ ఆగిఉంది. కొంచం పెద్ద ఊరే మనుషులు చూస్తుంటే కొంచం బడాయిగా ఉన్నారు బస్ ఆగిన చోట పెద్ద బస్ స్టాండు టీ బ్యాంకు, మళ్ళీ అదే ఎర్రబల్బు కాక పోతే గ్రాం ఫోన్
రికార్డ్ దానికో స్పీకర్ డబ్బా.. అందులోంచి మా ఆమ్మ గొంతుతో ఇంకేదో పాట ".... వయ్యా... కావేటి రంగా శ్రీ రంగా మేలుకోవయ్యా.. తెల్లవారేనుగా ...".అంటూ.
ఇదేంటి మా ఆమ్మ ఈ పాట ఎప్పుడు పాడిందీ అనుకుంటూ కుతూహలంగా విన్నా ...ఆ తెల్లారి చీకట్ల లో అంత కమ్మని గొంతు తో అంత చక్కని ఆ పాట శ్రీ రంగనాధుడిని మేలుకో మంటూ వేడుకున్న పాట నా మనసు లో లోతుగా నాటుకు పోయింది. ఇంతకీ మేము ఆగిన ఆ ఊరు నెల్లూరు.
ఇలా తిరుపతి వెళ్ళే బస్సులన్నీ అక్కడ తెల్లారి ఆగుతాయిట. ఆగిన ప్రయాణీకులకి వాళ్ళ నెల్లూరు బడాయి అంతా చూపిస్తూ గ్రామఫోన్ లో వాళ్ళ శ్రీరంగడిని నిద్ర లేపే ఆ పాట వేస్తూ నాలాటి పామర జనానికి వాళ్ళ నెల్లూరి సంస్కృతీ ప్రాభావాలు ప్రదర్శిస్తారన్నమాట.
అందుకే దాన్ని బడాయి అన్నా.( నెల్లూరు సాములూ సరదాగా తీస్కోండి. నాకు నెల్లూరంటే చాలా ఇష్టం ).
ఆ తర్వాత బస్ బయలుదేరిన దగ్గరినుంచి ఇంక నిద్ర పట్టలేదు.
సాహిత్యం రాని ఆ పాట ని నా అపస్వర కూని రాగాలతో పాడుకుంటూనే ఉన్నా మధ్య మధ్య ధ్యానం చేస్తూ....
అదన్న మాట సంగతి !! ఈరోజు విన్న ఈ పాట నా మనసు జ్ఞాపకాలను అంత లోతుగా తవ్వి బయట పెట్టిన విధానం...
మీకు బోర్ కొట్టి ఉండవచ్చు కానీ నా లిపి లేని భాష ఇంకెక్కడ రాస్కోనూ..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అమ్మ పాట.. అందునా..రంగడి..మేలుకొలుఫు. యెలా మరువగలరు. చాలా బాగుంధి. బిస్కెట్ల పేకెట్ ఎమైందో..చెప్పలేదు. రాజేశ్వరి టీచర్ బాకీ ఉన్నారు. మర్చిపోకుండా తీసుకొండి ఇప్పుడైనా.:)))))))
రిప్లయితొలగించండి@వనజ : ఆమె లేరు చాలా చిన్న వయసులోనే కాన్సర్ వల్ల మరణించారు. ఇక పోతే బిస్కట్ పాకెట్ గురించి అంత కుతూహలం గా ఉంటే మరో టపా చదివే ఓపిక ఉండాలి ? మీకుందా?
రిప్లయితొలగించండిgurthukosthunnaayiiiiiii......... chala bagundi amma paatani amma sparsa ni marchipoyevallu ee lokam lo undaremo..
రిప్లయితొలగించండిvery nice :)
రిప్లయితొలగించండిచాల బాగా రాసారు.
రిప్లయితొలగించండిరేపు మా అమ్మగారికి 75
వసంతాలు నిండుతాయి. అమ్మ
కోసం ఏదయినా రాద్దామని అనుకున్నాను. మీరు రాసింది చదివిన తరువాత మీ ప్రేరణ తో
నేను కూడా రాసాను ధన్యవాదాలు మీకు
ఆ దేవదేవుడు అమ్మకి శతాయుస్షు, సంపూర్ణ ఆరోగ్యం. శాంతి సౌఖ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను.
తొలగించండిఅమ్మ మీద మీరు వ్రాసానన్న టపా మీ బ్లాగ్ లో కనపడలేదేమి....?