నేను పెద్దమనిషి అయ్యా నువ్వెప్పుడురా..?? అంటున్నాడు మా అన్న నన్ను ఈమధ్య ...
మా అన్న నేను ఇద్దరం మంచి వాళ్ళం.
స్వర్ణ హరిత మయమయిన మా ఇంట్లో
మేము ఇద్దరం చాలా కాలం గా బానే ఉన్నాం.
మా అమ్మ నాన్న ఇద్దరినీ సమానంగానే పెంచినా...
వాడిని కొంచం ఎక్కువ సమానం గా చూసేరు.
అలాగే ఇద్దరం సమానంగా మంచి వాళ్ళమే
కానీ నేను కొంచం ఎక్కువ మంచాడినన్న మాట.
కావాలంటే వాడిని అడగండి ఇదే చెప్తాడు
నన్ను కొంచం ఎక్కువ సమానంగా చూసినట్లు
అలాగే వాడు కొంచం ఎక్కువ మంచాడయినట్లు.
ఇలా సమానంగా ఆలోచించు కుంటూ ఇద్దరం పెరిగాం
మా ఇంటి వనరులన్నీ సమానంగా పంచుకుంటూ..
కాక పోతే ముందే చెప్పాగా వాడు మా వనరులని
కొంచం ఎక్కువ సమానంగా వాడుకున్నాడు.
నాకని పిస్తుంది పెద్దవాడు,
మనకన్నా వయసు లో మా పెద్దాల్లకి దగ్గరవాడు అవటం వల్ల
వాడి మీద మా వాళ్ళు కొంచం ఖర్చు ఎక్కువే పెట్టారు,
ముద్దు ముచ్చట్లకీ చదువు కీ షోకులకీ.
చిన్న వాడవటం వల్ల నేను ఏదీ కావాలని అడిగే వాడిని కాను
కానీ అన్నీ నాకూ సమకూరేవి.
కానీ ఏమైందో తెలీదు ఈ మధ్య మా అన్న నా మీద పగ పట్టాడు.
చిన్నపట్నుంచి నాకూ ఏదీ ప్రతేకంగా కావాలని అడిగే అలవాటు లేదు
దొరికిన దాంతో సరిపెట్టుకోవటం అలవాటై పోయింది ,
అయినా నాకూ ఎక్కువే దొరికేది అనుకోండి.
అలిగిన మా అన్న ఊరుకోకుండా ఆస్తి పంచేస్కుందాం అన్నాడు
తన వాటా కింద మేము బోర్ వేసిన పడమటి వాటా భూమి
అలాగే మేము నడిపే ఖార్ఖానా ఉన్న రేకుల షెడ్డు
ఇంకా డబ్బు దస్కం లో ఎక్కువ శాతం తనకే కావాలని పేచీ మొదలెట్టాడు.
ఆ బోర్ వేసిన ఎకరాలు పోతే నా వాటా కి మిగిలేవి నీటి వసతి లేని ఎండు భూమే
నా దగ్గరున్న డబ్బులన్నీ పెట్టుబడి పెట్టిన ఖార్ఖానా ఉన్న షెడ్ పోతే
నాకూ ఇక మిగిలేది ఖాళీ ఇల్లు ...ఖాళీ సమయం ....
అందుకే నేనూ కలిసే ఉందామని మా పెద్దాళ్ళ తో కబురేట్టా....
మా అన్న ఉహు ససేమీరా అన్నాడు.
నేను మాత్రం తక్కువ?? వాడు అడిగిన దానికి ఏ మాత్రం కుదరదని చెప్పేసా..
ఏ మాటకామాటే చెప్పుకోవాలి
బోర్ పడమటి భూమిలో ఉన్నా నీరు పారేది నాకొచ్చిన తూర్పు వాటాలోకే ..
ఖార్ఖానా లో పని చేసేది మా అన్నే అయినా లాభాల మూట నాకే వస్తుంది, పెట్టుబడే నాది.
అందుకని ఇప్పుడున్న స్థితినే ఉండనిద్దామని నచ్చచెప్పే ప్రయత్నం చేశా..
అయినా వాడు వినటం లే.....
రోజూ తాగి వచ్చి గోల చెయ్యటం మొదలెట్టాడు.
దీనివల్ల మా ఇంటి పరువు రోడ్ కెక్కింది ,
ఈ పరిణామం చుట్టూ పక్క వాళ్లకి వినోదాన్ని ,
చెట్టుకింద లాయరు గారికిమంచి ఆదాయ వనరు లా,
పేపర్ మిత్రులకీ , టీవీ చుట్టాలకీ మంచి కాలక్షేపంలా తయారయ్యింది....
మేమిద్దరం ఇలా కొట్టు కోవటం మా అమ్మ భూదేవి కి భార మైన అవమానం గా ఉంది
పోయిన మా నాన్న ఏదో ఈ మాత్రమైనా అమర్చగలిగా ..
ఇది కూడా లేక పోతే దేనికోసం కొట్టుకునే వాళ్లురా
అన్నట్టు దీనం గా చూస్తున్నారు ఫోటో లోంచి
అయినా మా పంతం మాదే
మా పిల్లలు చదువు మానేసి
మా నాన్న కరేక్టంటే మా నాన్నే కరక్టంటూ వాదించు కుంటున్నారు
అసలు వేరే వేరే ఇళ్ళ నుంచి వచ్చిన మా ఆవిడా, మా వదిన
ఈ గోల లో బాగా దగ్గరయి ఈ అవమానం భరించలేక అప్పుడప్పుడూ కిరోసిన్ తో బెదిరిస్తున్నారు.
అయినా మాకు మాత్రం బుద్ది రావట్లేదు.
మేమిద్దరం ఇలా కొట్టుకుంటుంటే చిన్నప్పుడే అరవ దేశం లో ఉన్న
మా పెదనాన్నకి దత్తత వెళ్ళిన మా అక్క
ఇంట్లో నగలూ నట్రా అన్నీ ఊడ్చుకెల్లింది.
ఆమె ని ఎవరూ ఆపలేక పోయాం కారణం మా గొడవల్లో మేముండటమే.
ఇంకా దారుణం మా ఖార్ఖానా లో పని చేసే
పని వాళ్ళు వేరే చోట చేరి పోతున్నారు
ఇక్కడ ఉంటె పని ఉంటుందో లేదో అన్న భయం తో ....
ఇలాంటి గొడవల మధ్య మా అమ్మ 54 వ పుట్టిన రోజు వచ్చింది
ఏమి చేస్కుంటాం ? మేమిరువురం మా గోల లో ఉండి మా అమ్మ ను పట్టించుకోలేదు మామూలుగా అయితే పూర్ణాలు పులిహోర తినే వాళ్ళం..
కానీ మా అమ్మ మనసు బాలేక
ఇద్దరిలో ఎవరికీ సర్ది చెప్పలేక,
ఎవరిని సమర్దిస్తే ఇంకెవరు భాధ పడతారో అన్న భయం తో..
దగ్గుతూ, ఆయాసపడుతూ ఒంటరిగా తనే గుడి కెళ్ళి దండం పెట్టుకోచ్చింది :
" దేవుడా త్వరగా ఈ సమస్యకి ఏదో పరిష్కారం చూపు స్వామి అని
నా ఇల్లు ని తిరిగి స్వర్ణ హరిత మయం చేయి స్వామి అని
నా పిల్లలు మధ్య సమతా సామరస్యం ప్రతిష్టించు దేవా అని
ప్రతి కుటుంబ క్షేమం సమాజ క్షేమం కనుక ఇంకెక్కడా ఇలా జరక్కుండా చూడు తండ్రీ అని.."
కుదిరితే మీరు ప్రార్ధించండి మా ఇద్దరికీ బుద్ది రావాలని..!!
అయ్యా! ఇన్ డైరెక్ట్ గా "తెలంగాణా" గొడవ మీదే మీ సెటైర్ అని ఓ పేరా తర్వాత అర్ధం అయ్యింది.. కాని ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేని తెలంగాణా నాయకుల వల్లే ఈ రణరంగం.. వీళ్ళంతా కోట్లు సంపాదిస్తుంటే.. అమాయక ప్రజలు, విద్యార్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు.. మీ కధ చివర్లొ "స్వర్ణ హరిత మయం" అనుకుంటా.. సరిచెయ్యండి..
రిప్లయితొలగించండివోలేటి గారూ
రిప్లయితొలగించండినేను మీకేమపకారం చేశా? మా ఇంటి విషయం తెలంగాణా ఉద్యమానికి కి ముడి పెట్టారు ?
సరే మా అమ్మ ప్రార్ధన ని సరి చేశా
ధన్యవాదములు
మీరు మహా ముదురు ఆత్రేయ గారు
రిప్లయితొలగించండిమీ కీ బోర్డు అన్ని అక్షరాలకీ పదునే
గుడ్ గోయింగ్ ఇంకా ఇలాంటివి రాయండి
తెలంగాణా గోల మీద
@ అజ్ఞాత అవును నేను ముదురే వయసు 44 పైచిలుకే
రిప్లయితొలగించండినా కీ బోర్డ్ లో అక్షరాలకి పదునుంటే ఈ పాటికి నా వేళ్ళు తెగేవి.
మీరన్నట్లు తెలంగాణా గోల కాదు ఉద్యమం,
CHALA BAVUNDI.. BULUSU GARU CHEPPENTHA VARAKOO IDI "PINK PANTHER" UDYAMAM ANI GRAHINCHALEKAPOYENU.. AATREYA GARU, MEERU MUDURENTANDI???.. MEE VAYASU JUST RENDU NAALUGULE !!!
రిప్లయితొలగించండిబాగా రాశారు, నేకూడా ప్రార్ధిస్తున్నా..
రిప్లయితొలగించండిఅదేంటండీ మీ ఇంట్లో గొడవ అచ్చు మా ఇంట్లో గొడవలాగానే అనిపిస్తున్నాది. మా ఇంట్లో కూడా ఇంతే, ఇదే సమస్య. కాకపోతే మేము అక్కాచెల్లెళ్లం, మీరు అన్నాదమ్ములు (అనుకుంటున్నాం). చాలా బాగా రాసారు.
రిప్లయితొలగించండిఅవును సౌమ్య గారు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో అందరి ఇళ్ళల్లో ఇదే గొడవ ఎప్పటికి తీరేనో ..??
రిప్లయితొలగించండిఅదేమిటి అల్లా ఆదుర్దా పడుతున్నారు? మీసమస్యని పెద్దన్న గారు పరిశీలిస్తున్నారు. కొత్త సంవత్సరానికి ఆయనేదో వీలునామా రాసిస్తారుట. అది చదువుకొన్న తరవాత దెబ్బలాడు కోవడానికి కొత్త కోణాలు దొరుకుతాయట.ఓపిక పట్టండి సారూ.
రిప్లయితొలగించండిఒకప్పుడు వరసెంబడి వచ్చిన ఉమ్మడి కుటుంబాల సినిమాలు చూపించారు కదండీ. అన్న పెద్దవాడిగా త్యాగం చేసి తమ్ముడిచేత వేరే కాపురం పెట్టేస్తే పోతుంది. కొన్ని కష్టాలు పడి తన తప్పు తెలుసుకుని ఫ్యామిలీసాంగు పాడుకుంటూ మళ్ళీ దగ్గరికి వచ్చేస్తాడు.
రిప్లయితొలగించండిLyricist Bhuvana Chandra was the chief guest at IIT Madras' celebration of the AP Formation Day. I attended the programme. He said,"We are celebrating this year, what about the next?"
రిప్లయితొలగించండిI had tears in my eyes.