

తొమ్మిది గంటల పదిహేను నిముషాలు స్కూల్ కి వెళ్ళే ముందు అన్నం తినేసి రెడీ అవుతున్న సమయం.
"ఈ రోజు పగలు పదకొండింటికి సైరన్ మోగగానే ఎక్కడున్నా సరే నుంచొని రెండు నిముషాలు మౌనం పాటించాలి. "
"ఆ టైం లో స్కూల్లో ఉంటాగా పైగా క్లాస్ లో ఉంటా. .."
"అయినా పర్లేదు సైరన్ మోగగానే అందరు లేవండి, అయినా నేను పక్క క్లాస్ లోనే ఉంటాగా అసెంబ్లీ లో చెప్తారు ఆ విషయం ..
మర్చి పోకుండా పదకొండింటికి నేను చెప్పింది చెయ్యండి."
ఇది జరిగి దాదాపు ముప్పైఅయిదు ఏళ్ళు పైన అయింది జనవరి ముప్పై గాంధి గారి వర్ధంతి, రోజున మా అమ్మ ఆనవాయితీగా చెప్పే ముందస్తు జాగ్రతలు.
అప్పటికి నేను నాలుగో ఐదో చదువు తున్న రోజులు.
ప్రతి జనవరి ముప్పైన గాంధి గారి గురించి స్కూల్ అసెంబ్లీ లో కొంచం సేపు మాట్లాడి, రెండో పీరియడ్ లో పదకొండింటి ఆంధ్ర సైంటిఫిక్ కంపనీ సైరన్ మోగుతుంది
గాంధీ గారు చనిపోయిన క్షణాలను గుర్తు చేస్తూ... అప్పుడు ఎక్కడున్న వాళ్ళు అక్కడే నుంచొని రెండు నిముషాలు మౌన ప్రార్ధన చేయండి, మా ప్రిన్సిపాల్ గారి హుకూం.
నాకు బాగా గుర్తు పదకొండింటికి ఆ సైరన్ మోగ గానే బయట గ్రౌండ్ లో నడుస్తున్న మా టీచర్లు అక్కడే మౌనం గా నుంచోవటం. మా క్లాసు ముందు కటకటాల ల్లోంచి చూసిన ఆ దృశ్యం నా మనసులో బలంగా నాటుకు పోయింది.
ఇప్పుడు ఆఫీసు లో అదే పాటిస్తే వింతగా చూసే జనం మధ్య నేను ఏమీ సిగ్గు ఫీలవను...
ఆ ఎనిమిది ఏళ్ళ వయసు లో గాంధీగారి గురించి పోయిన దిగులు కన్నా క్లాస్ మధ్యలో చిన్న బ్రేక్ వస్తుందన్న ఉత్సాహం ఎక్కువ. అది ఎంత చిన్నదైనా,
ఆ బ్రేక్ తర్వాత టీచర్ కొంచం సేపు ఆ రోజు గురించి మాట్లాడతారుకదా. అది చాలు మాకు గుస గుస లకి, రిలాక్స్ అవటానికీ.
అప్పుడు మాలో మా గోల ని అడ్డుపడుతూ టీచర్ చెప్పే వాళ్ళు "1948 లో సరిగ్గా ఇదే రోజు గాంధీ గారిని ఒక మతోన్మాది (?) హత్య చేసాడు, అయన ఆత్మ శాంతి కోసం ఇలా రెండు నిముషాలు మౌనం పాటించాలి."
గాంధీ గారి గొప్ప తనం ఈరోజు ఎంత మంది పిల్లలకి తెలుసో ఏమో కానీ?
ఆయనంటే ఎంత మంది ఈతరం పిల్లలకు గౌరవం ఉందొ కానీ
నా చిన్నప్పుడు మాత్రం సినిమా ముందు ఫిలిం డివిజన్ వాళ్ళ డాక్యుమెంటరీ లలో, కొన్ని సార్లు సినిమాల్లో, నలుపు తెలుపూ లలో గాంధీ గారి వడి వడిగా నడిచే సీన్ , మైకు ముందు మడత కాల్లెస్కుని కూర్చొని ఉపన్యసిస్తున్న సీను రాగానే కింది తరగతుల నుంచీ పైన బాల్కనీ జనం దాకా అందరూ చప్పట్లు కొట్టే వారు. ఆ కొద్ది క్షణాలూ రణ గొణ ధ్వని వచ్చేది హాల్లో.... అది చాలు అయన పట్ల అప్పటి సామాన్య జనానికి ఉన్న గౌరవం చూపటానికి.
అయన అందించిన స్వాతంత్య్రం ఒక్కటే గుర్తుండి పోయిన మనకు మిగతా సందేశాలైన సత్యం, అహింస, నిరాడంబరత, మరుగున పడిపోయాయి.
మరీ అమాయకత్వం కాక పోతే ....
అసలు అబద్దాలు ఆడకుండా రోజెలా గడుస్తుంది
ఎవరినో ఒకళ్ళ నన్నా హింస పెట్టకుండా (మానసికంగా) పొద్దెలా పోతుంది
దంబమూ దర్పమూ చూపకుండా మన ఉనికేలా తెలుస్తుందీ..
ఇంకా అయన చెప్పిన శాఖాహారం ,
బ్రహ్మచర్యం ముసలి తనం వచ్చాక ఎలాగూ తప్పవు.
మిగిలిన విశ్వాసం ఎలాగూ కష్టమైన పని.
ఏమిమిదో సూత్రం స్వరాజ్ ఎలాగూ వచ్చేసింది.
గాంధీ గారి సూత్రాలలో నాలుగో సూత్రం అయిన నయీ తాలిం అంటే అందరికీ ప్రాధమిక విద్య ఇదైనా మన నాయకులు పాటిస్తే బాగుండు.
మిగతావి అన్నీ ఆచరణకి అసాధ్యాలు ఈనాటి తెల్ల టోపీలకి, తెల్ల చొక్కలకీ.
ప్రతి భావి భారత పౌరుడినీ విద్యా వంతుడిగా చూసే మార్గం వేయమని కోరుకుందాం.
కష్టమైనా నావంతుగా పై ఎనిమిది సూత్రాలలో సాధ్యమైనన్ని ఆచరించటానికి ప్రయాత్నిస్తా.
ఆనందించాల్సిన విషయం ..
నాకూ గాంధీ గారికీ ఒక పోలిక ఉంది అదేంటంటే చేవ్రాత, చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది కానీ ఏమి రాసానో అర్ధం కాదని చాలా మంది నన్ను దెప్పుతారు.
అయినా చేవ్రాత బాగుంటే తల రాత బాగోదన్న ముతక నమ్మకం నేను బాగా నమ్ముతా.
ఎవరన్నా నా చేవ్రాతని విమర్శిస్తే గాంధి గారిని గుర్తు చేసి దారి మల్లిస్తా..
మర్చిపోయిన గాంధిగారిని గుర్తు చేసి గర్విస్తా....