3, ఏప్రిల్ 2011, ఆదివారం

తెలుగు బ్లాగుల్లో ఉగాది పురస్కారాలు

(ఫోటో గూగుల్ ఇమజేస్ నుంచి గ్రహించ బడినది )
ఖరనామ
సంవత్సర ఉగాది !! బ్లాగ్ లోకం లో ఒక మరపురాని యుగాది. ఏదో ఎవరి గోలలో వాళ్ళు గా రాసుకు పోతున్న బ్లాగ్ మిత్రులందరికీ ఒక నిజమైన పండగ గా అవతరించింది. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ పూనుకొని బ్లాగులని, బ్లాగ్ రచయితల్నీ కూడా సాహితీ సేవకులుగా గుర్తించి, గత సంవత్సర కాలం లో వాళ్ళ కృతులన్నీ పరిశీలించి వివిధ విభాగాలుగా విభజించి, అందులో చక్కటి రచనలకు పురస్కారాలు ప్రకటించింది.
వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

మొదట గా
సాహిత్య / పద్య విభాగం లో నమోదై నిత్యం కవితా పూరణ మీద అద్వితీయం గా బ్లాగ్ నడుపుతున్నకొన్ని బ్లాగులు
శ్రీ నింపే సమస్యా రావు గారి "చేతనైతే పూరించు "
శ్రీ ఎర్ర మల్లెలయ్య గారి "విప్లవ నాదం"
శ్రీ గోల బుల్లెస్వర రావు గారి "పద -రోద"
శ్రీ హరి విశ్వాసం గారి " నిత్య దైవనుతం "

శ్రీ నింపే సమస్యా రావు గారి : " చేతనైతే పూరించు "
బ్లాగ్ కి ఉత్తమ బ్లాగ్ గా నిర్ణయించట మయినది.
వారి బ్లాగ్ లో ఒక మచ్చు తునక
సమస్యా: ' ...బండ గా హాయైన నిదుర బోయే !!'

పూరించిన వారు అపర చాకచక్యం గారు :

"బగలంత సీరియళ్ళు చూసి మరువంగ
ఆహార నియమము విడువంగ పిల్లలున్
భర్తయున్ అలసి నింటికి చేరంగ సొలసిన యా
పడతి ఫోమ్ బెడ్ పై బండగా హాయైన నిదుర బోయే:"

ఆధ్యాత్మికం
విభాగం లో స్వదైవ నమస్మరణ పర మతదూషణ బాగా చేసిన కొన్ని బ్లాగ్ నమోదులు
శ్రీ రామదాసు గారి "అంతా రామమాయం .."
శ్రీ భోలేనాద్ గారి " జై బోలో శంకర్ "
శ్రీ తుకారం గారి "నిత్య జీవితం లో దైవ స్మరణ"
శ్రీ రెట్ట మతబాబు గారి " మా మతమే మతం"
శ్రీ వికారి గారి " మీ దేవుడికేం రావు...."

విభాగం లో శ్రీ వికారి గారి బ్లాగ్ "మీ దేవుడికేం రావు..."
అందులో ఒక ముచ్చు విరుపు
" ............ఫలానా మతం వాళ్ళు ఊరికే రొద పెడతారుగానీ, వాళ్లకేం తెలీదు. చాందసం గా ప్రవర్తించటం తప్ప. అసలా
మాట కొస్తే వాళ్ళ దేవుడికే ఏమీ తెలీదు.
అజ్ఞాన వర్గాల భోగట్ట ఏంటంటే వాళ్ళ దేముడు వారానికోసారి హెలికాప్టర్ లో అర్దరాత్రి దిగడి పోయి మన దేవుడిని భక్త జన
ఆకర్షణ కిటుకులూ,ధర్మ సందేహాలు అడిగి తెలుసుకొని, తెల్లారి ఏమీ ఎరగనట్లు కూర్చుంటాడట "

సాంకేతికం
విభాగం లో నమోదైన బ్లాగులు
శ్రీ టెక్నో రావు గారి " మీరూ మీ కంప్యూటరు"
శ్రీమతి విద్యుల్లత గారి " షాకుల్లేని కరెంట్ "
శ్రీ జాకీ గారి " మీకు కారుందా..."

విభాగం లో శ్రీ విద్యుల్లత గారి "షాకుల్లేని కరెంటు "
అందులోని చిన్న షాక్
" సారి నా బ్లాగ్ టపా లో కరెంట్ వాడకం - పొదుపు లో మెలకువల గురించి రాస్తాను. ఎంతో మంది అభిమాన
చదువరుల కోరిక పై ఎలెక్ట్రిక్ ఇంజనీరు నైన నేను ఒక ఉపయుక్తమైన టపా రాయాలని ఇది మొదలెట్టా..
సాధారణం గా మన అతివలు వంటింట్లో
మిక్సీ, గ్రైండర్ , ఓవెన్, కరెంటు స్టవ్వులు, ఇంకా బాత్ రూములో గీజర్లు, ఇలా ఎన్నో కరంటు పరికరాలు వాడతాము. వాడి మళ్ళీ బిల్లోచ్చాక బెమ్బెలేట్టటం మామూలే ...
అలా బిల్లు రాకుండా చూసేందుకు కొన్ని చిట్కాలు
మిక్సీ లో పచ్చళ్ళు చేయకుండా రోట్లో నూరుకోండి, అలాగే ఇడ్లీ పిండి కూడా అందులోనే కానిచ్చేయండి.
ఓవెన్లు , కరెంట్ స్టవ్వులు కరంటు బాగా లాగుతాయి కాబట్టి అసలవి కొనకుండా ఉంటె బిల్లు తగ్గు, ఇంకా డబ్బు ఆదా.
బాత్రూం లో గీజర్ విషయం లో .. స్నానానికి గంట ముందు బకెట్ నీళ్ళు డాబా మీద ఎండలో పెట్టి ఆనక అక్కడే స్నానం
చేస్తే కరంటు సమస్యే లేదు.

హాస్యం
విభాగం లో నమోదైన కొన్ని పువ్వులు
శ్రీ రుబాబు గారి : "నవ్వండి బే..."
శ్రీమతి మటం మోహ గారి : " నవ్వొస్తే ఏమనుకోవద్దు .."
శ్రీ చిరు నగేస్వరరావు గారి : "ముసి ముసి "
శ్రీ అడవి ఆర్భాటం గారి : "వికటాట్ట హాసం "

హాస్య
విభాగం లో కూడా ఆడ లేడీస్ కే పట్టం కట్టాం
శ్రీమతి మటం మోహ గారి "నవ్వొస్తే ఏమనుకోవద్దు .." లో ఒక తటపాయింపు
" సారి టపా లో కూడా ముందుగా మీ అందరినీ క్షమించమని కోరుకుంటున్నా, ఎందుకంటే క్రితం రాసిన టపా లోని
హాస్య తరంగం మిమ్మల్ని అంతగా తడప లేక పోయిందని మీ వ్యాఖ్యల ద్వారా తెలిసి కొంచం ఫీలయ్యా.
అందుకే ఈసారి రాసే జోక్స్ మిమ్మల్ని అంతగా అలరిస్తాయో లేదో అని నేను తటపాయిస్తున్నా ఏమైనా తిరిగే కాలు తిట్టే
నోరు రాసే బ్లాగు ఊరికే ఉండవని నానుడి కదా అందుకే మరికొన్ని జోక్స్ టపా లో పొందుపరుస్తున్నా.
దయచేసి ఏమనుకోకండి ......."
ఇలా సాగింది

సినిమాలు - పాటలు
విభాగం లో వెల్లువెత్తిన కొన్ని కెరటాలు..
శ్రీ పనిలేని గాలేష్ గారి " బాక్సాపీసు "
శ్రీ ముసలి వయోజన్ గారి "సినిమా కనుమా"
శ్రీమతి చిత్రా చలన్ గారి " నా పిచ్చి- సినిమాలు "
శ్రీ తరుణ్ హరన్ గారి " హాలుకే అంకితం "
శ్రీ సినికపి గారి "సినిమా పాటలు -క్విజ్ "

విభాగం లో రెండు పురస్కారాలు ఇచ్చాం
శ్రీ తరుణ్ హరన్ గారి "హాలుకే అంకితం "
టపా : నా వారాంతాలు ..టపా లోంచి రెండు వాక్యాలు
నాకు సినిమా అంటే ఎంత పిచ్చి అంటే మాటల్లో చెప్పలేను. అందుకు కారణం కూడా ఉంది లెండి, నేను పుట్టిన ఆసుపత్రి
డాక్టర్ కు రెండు సినిమా హాళ్ళు ఉన్నాయి, హాళ్ళు, ఆసుపత్రి ఒకే భవన సముదాయం లో ఉన్నాయి, డాక్టరూ నర్సులూ బేరాలేనప్పుడు టికెట్లు చింపే పనిలో ఉండే వాళ్ళుట అలాంటి చోట పుట్టిన నాకు మాత్రం సినిమా పిచ్చి లేక పోవటం తప్పుకదా. అందుకే వారాంతాలు రెండు రోజులూ సినిమా హాళ్ళలో గడిపేస్తూ ఉంటాను . మిగతా అయిదు రోజులూ ఆఫీస్ లో ఎలాగు ఆన్ లైన్ మూవీస్, డివిడి లలో చూస్తూ ఉంటాలే... ఇలా నిరంతరం కాల హరణ సినిమాల ద్వారా చేస్తూ తరిస్తూ ఉంటాను...- మీ తరుణ్

రెండో టపా
శ్రీ సినికపి గారి "సినిమా పాటల -క్విజ్ "
లో ఒక ప్రశ్నా శరం
పాట ఎందులోది ? పల్లవి, సందర్భం రెండూ రాయండి
'.....నువ్వు చెయ్యలేక మంగళ వారం అన్నావే ...'
జవాబు గా
తాయారు " చిత్రం : పక్కలో బల్లెం "
పల్లవి : అనుకున్నా నేననుకున్నా నీకు చేతగాదని అందుకే ఇలా ....
అందులో హీరోయిన్ జనమాలి హీరో సాకుల్రావ్ కు గడ్డి పీకటం రాదనీ ఆట(?) పట్టిస్తూ పాడే అల్లరి సాంగ్
సినికపి : తాయారు గారు ఈసారి కూడా మీరే ముందు కరక్ట్ సమాధానం రాసారు. హాట్స్ ఆఫ్
అసలంత తయారు గా ఎలా ఉంటారు తాయారు గారూ ..?

ఇక వంటా- వార్పూ విభాగం లో నమోదులు
శ్రీమతి అమృతహస్తం గారి : మా పాకాల వంటలు
శ్రీమతి పుష్టి వర్ధని గారి : మృస్టాన్నం
శ్రీమతి ఆశ గారి : పెసర మొలకలు
శ్రీ గరిట తిప్పేస్వరరావు గారి : " మోగాళ్ళే వంటలో మొనగాళ్ళు "

వంటా-వార్పూ విభాగం లో
శ్రీమతి ఆశ గారి " పెసర మొలకలు " లో ఒక మొలక టపా
" కొత్తిమీర తరుగుడు లో మెళకువలు "
అందులోంచి కొంత తరుగు (అంటే తరిగినది అని)

కొత్తిమీర రోజూ వాడతాం. అయితే అది తరుక్కోవటం కొంచం కష్టమని కొంతమంది చదువరులు నన్ను ఒక టపా
రాయమని కోరారు
వాళ్ళ కోరిక మీద టపా తరిగాను, సారీ రాసాను.
ముందుగా కొత్తిమీర కట్ట నీళ్ళలో ముంచి వెల్ల కున్న మట్టి పోయే దాకా కడగాలి
కట్ట విప్పకుండా కట్టింగ్ ట్రే మీద పెట్టి కుడి చేత్తో కట్ట ఆకులు చేతి కింద వచ్చేలా పట్టుకొని వేళ్ళు బయటకు ఉండేలా
చూస్కోవాలి, ఇప్పుడు కత్తి ఎడమ చేత్తో పట్టుకొని జాగ్రత్తగా కోయాలి. ఇప్పుడు తరిగిన వేళ్ళు బిన్ లో పారేసి ఆకులు మాత్రం చిన్న చిన్న గా తరుక్కోవాలి. ఇలా తరిగిన ఆకులు కూరల్లో, చారు లో, పప్పు లో వేసుకోవచ్చు. కుడి చేతి వాటం వాళ్ళు నే చెప్పిన పద్ధతి రివర్స్ లో చేయ్యాలండోయ్. నాది ఎడమ చేతి వాటం లెండి.

ప్రత్యేక పురస్కారం గా తిప్పేస్వరరావు గారి టపా బంగాళ దుంప ఎపుడు కి ఇవ్వబడింది.
దాంట్లోంచి
చిన్న ముక్క
" సనాదారాలు గాలి తిరుగుడు తిరక్కుండా ఇంటికాడనే ఉన్న గా, అందుకే నోటికి కారం గా ఏదన్నా తినాలనిపించి
కూరల బుట్ట ఎతికా ... నాలుగు పెద్ద దుంపలూ
రెండు బుడ్డ ఉల్లి గడ్డలు కానడ్డాయి. ఎంటనే అవి తరిగి, పొయ్యి మీద మూకుడెట్టి అందులో రెండు కిలోల చమురేసి
ముక్కలు ఏపేసి ఆనక పావుకిలో ఉప్పు కారం దూసేసి, ఏడి అన్నం లో ఏస్కోని కుమ్మేసా....."

ఇక పోతే మిగతా చిల్లర బ్లాగుల్లో

శ్రీ భేతాళ్ గారి బాక్స్ బద్దలు కొడతా
"...నాయాల్ది నాకొడుకులు అసలు మా కులపోల్ల జోలికొస్తే సారి నా బ్లాగులో రక్తం కారేలా (ఎవరికి?) రాస్తా .......

శ్రీ
లడ్డు గారి గారి " తినదగు నెవ్వరు పెట్టిన "
" రోజు కూడా ఎప్పటిలాగే మా ఇంట్లో భోంచేసి పక్క వీధిలో ఉన్న మా చిన్నక్క ఇంటికేళ్ళా, వాలింట్లో పూట
తలకాయ మాంసం, ఇంకా తప్పేదేముండీ మళ్ళీ కూర్చున్న బోయినాలకి...."

శ్రీ చలనం గారి " మగాడు తిరక్క చెడ్డాడు "
"...జంట నగరాలలో ఉన్న అందమైన ఆడాల్లందరూ ఎమన్నా ఇబ్బంది వస్తే( ఏమి ఇబ్బంది?) నా నెంబర్ కి ఫోన్
చెయ్యండి నేను అంతుచూస్తా ఇబ్బందిదేలే... "
( బ్లాగ్ లో రచయిత అందమైన ఫోటో అదుర్స్ ..మరియూ ఉచితం కూడా)

శ్రీమతి ఉల్లాస గారి "మనసా కొట్టుకోకే "
"....పేరుకి ఆనందం గా ఉన్నా నా మనసెప్పుడు ఎందుకో ఒకందుకు కొట్టుకుంటూ ఉంటుంది, ఎందుకో తెలీదు, తెలిస్తే
చెబ్దురూ ......"
శ్రీ మొగ్గ గారి " సరసం విరసం "
" అప్పుడు నేను ఇంటర్ ఐదో సంవత్సరం చదువుతుండే వాడిని , మా పక్క ఇంట్లో కొత్తగా ఒక జంట అద్దెకి దిగారు, ఆమె
బాగుంది కదా అని మొదటి రోజే లైను వేసా
వారం తిరిగే సరికి వాళ్ళ అయన లైను లో నేనే పడ్డా, ఇప్పటికీ ఆయనా నేను ఇద్దరం కలుస్తూనే ఉంటాం. సరదాయే
వేరు.

శ్రీమతి మృణ్మయ గారి " నా కెమెరా విన్యాసం "
రోజు మా పెళ్లిరోజు గుడి కెళ్ళాం. శ్రావణ మాసం అవటం వల్ల అమ్మవారి గుడి బాగా రష్ గా ఉంది పూజారిగారు శఠ
గోపం పెట్టి అక్షింతలు వేసారు.గుడి లోంచి బయటకి వచ్చేసరికి సన్నగా వాన, రొమాంటిక్ గా ఉంటుందని తడుస్తూనే ఇంటికేల్లాం, మా అయన వెనక నుంచి వచ్చి నా తలలో ఏవో చిన్న చిన్న మొలకలు ఉన్నాయని చెప్పారు, వెంటనే చూస్కుంటే అవి అక్షింతలు వానకి మొలకలోచ్చాయి. అద్దంముందు నా కెమేరాతో నేనే ఫోటో లు తీస్కున్నా
బుజ్జి ముండలు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి
(స్థలా భావం వల్ల ఫోటోలు ఇప్పుడు పెట్టలేదు)

శ్రీ చంచా గారి " విపరీత నటుడు చిరాయువు "
మన అభిమాన నటుడు చిరాయువు ఆయన తమ్ముళ్ళు మేనల్లుళ్ళు, మనవళ్ళు నటించిన చిత్రాలు వారం విడుదల
సందర్భంగా అందరికీ (మాకెందుకూ ?) అభినందనలు .....

వీరందరికీ ప్రత్యేక ప్రశంసా పత్రాలు ఇవ్వబడతాయి.

ఇంకా
వేరే వాళ్ళని బూతులు తిట్టటానికి, దుమ్మెత్తి పోసే బ్లాగులను పరిశీలించి అనర్హం గా నిర్ణయించాం.
రాష్ట్ర ప్రభుత్వం మాదే కనుక మా పార్టీ కి వ్యతిరేక బ్లాగులు ప్రతిపక్ష అనుకూల బ్లాగులూ చూడనే లేదు.
విమర్సలకు బెదిరి అసలు రాజకీయ బ్లాగులనే పక్కన పెట్టాం.

కొస మెరుపు: అందరి మీదా పడి ఏడ్చే ఆత్రేయ బ్లాగ్ " లిపి లేని భాష " తీసి తుంగలో తొక్కాం.

ఇది
సరదా కోసమే కానీ ఎవ్వరినీ కించపరచాలని కాదు.








1, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఇది చదివితే మీరూ....


ఏప్రిల్ ఫస్ట్ పండగ : ఈ ఫూల్స్ డే ఆనందం, ఎదుటి వాళ్ళని వెధవ (ఫూల్) ని చేసి ఆ కాసేపు పడే సరదా ఎలా గుంటుందో మన అందరికీ తెలుసు.
మళ్ళీ కొత్తగా చెప్పేదేముంది ?
చాల రోజుల క్రితం చదివిన మార్క్ ట్వైన్ కొటేషన్ గుర్తుండి పోయింది. "ఏప్రిల్ ఒకటి: ఈ రోజు, సంవత్సరమంతా మనమేంటో గుర్తు చేసే రోజు."
రోజులాగానే నిన్న కూడాహాస్టల్ లో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేసి కాసేపు కబుర్లు చెప్పి రేపు ఏప్రిల్ ఫస్ట్ కదా అందరినీ ఫూల్ చేస్తారా నువ్వు నీ ఫ్రెండ్స్ అని అడిగా..
ఏమైనా ఇళ్ళకి ఫోన్ చేసి అమ్మ నాన్నలకీ పెద్దలకీ ఫోన్ లో ఫూల్ చెయ్యటం కోసం ఏదన్నా బాధాకర మైన విషయం చెప్పకండి కంగారు పడతారు. కాసేపైనా సరే ఆ కంగారు భరించ లేనిది అని నీతి సూత్రం చెప్ప బోయా
వెంటనే మా అమ్మాయి " ఏ కాలం లో ఉన్నావు నాన్నా నువ్వు, ఇంకా అలా ఎందుకు చేస్తాం, అయినా మేమే పెద్ద ఫూల్స్ ఇంకోళ్ళని చెయ్యటమా? అంది.
అదేంటి అని ఆరా తీసా
ప్రతి పరీక్ష ముందు బాగా చదివి నట్లనుకుని, రాసి, ఈ లోపు అందరికీ బాగా రాసా నని చెప్పుక్కొని ,తీరా రిజల్ట్స్ వచ్చాక మార్కులు పెద్ద గా రాక ఫూల్స్ అవట్లేదా? కొత్త గా అయ్యేదేముంది అంది.
సరదా చెప్పినా ఈ సూత్రం మన అందరికీ వర్తిస్తుందని అనుకున్నా.
కొస మెరుపుగా ఇంకో విషయం చెప్పింది "మనం ఎవరినన్నా ఫూల్ చేసాం అంటే అది మన తెలివి కాదు,
ఎదుటి వాళ్లకు మన మీద ఉన్న విశ్వాసం, దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరినో ఫూల్ చెయ్యటమంటే మనని మనం ఫూల్ చేస్కునట్లే " అంది.
నాకు జ్ఞాన నేత్రం తెరుచు కుంది.

ఈ విషయం మాత్రం నిజం,

మనం...
మనం ఎప్పటికీ వెధవలమే.
మనం గుప్పెడు నోట్ల తో బజారు కెళ్ళి
వీసెడు సరుకుల తో చప్పుడు చెయ్యకుండా ఇంటి కొచ్చి
మౌనం గా బాధ పడే మంచి వెధవలం..
మన పన్నులతో జీతాలు తింటూ మన పనికే లంచం అడిగితే
ఇవ్వక తప్పని నిస్సహాయులం...

మనం

చేసే పని లంచం తో కొలుస్తూ, దేశాన్ని తొలుస్తూ
సొంత ఇంటికే కన్నం వేస్కునే దొంగ వెధలం.
మనం
ఎవడి వెనకో ఝండా పట్టుకు తిరుగుతూ
అదంతా ప్రజా సేవ అనుకుంటూ
కుటుంబాన్ని దేవుడికి ఒదిలేసే కార్యకర్తలం...
రోజు కష్టాన్ని, రెండు గంటల సినిమా చూసి,
ఆ ఆనందంతో డబ్బుని, కష్టాన్ని ఒదిలించుకునే సరసులం.

కష్టాలనీ, దు:ఖాన్ని, ఒక్క గుక్క మద్యం తో కడిగేసి

సుఖం గా ఉందామనుకునే నిషారాబులం..
షేర్ మార్కెట్ మెట్లమీద, దున్నలతో తన్నించు కుంటూ, ఎలుగుతో గీరించు కుంటూ..
అయినా అక్కడే, పోయిన సంపద నెతుక్కునే అశాజీవులం,
మనం
జూదపు ముక్కల రవ్వడిని, గుర్రపు డెక్కల సవ్వడినీ,
వింటూ జీవితాలని పణం పేట్టే ధర్మ రాజులం....

మనం

మన వోట్లతో మన నెత్తికెక్కి, మనలో మనకి కీచు లాటలు పెట్టి
ఆ సందట్లో డబ్బు చేసుకునే నలుగురు వెధవల లో ఒక వెధవ నెన్నుకొని
వాడే సరైన నాయకుడు, వాడిని మించిన వాడు లేడు, రాబోడు

అనుకుంటూ రోజులు వెళ్ళ బోస్తున్న పెద్ద వెధవలం
అందుకే మనలో మనకి హ్యాపీ ఫూల్స్ డే !!!