24, ఫిబ్రవరి 2011, గురువారం

ముళ్ళపూడి ...గొంతు పూడి....


గతం లో ఎప్పుడో ఒక రోజు , రాత్రి ఒంటి గంట నా ఫోన్ ట్రింగ్ ట్రింగ్ .... చేసింది మా ఉయ్యూరోడు ప్రెబాకరు.
నేను " హలో ..... ఏరా పక్కా !!"
"ఏమి చేస్తున్నావురాండి ? "
" ఏమీ లేదు రమణీయం నూట తొమ్మిదో సారి చదువు తున్నాన్రాండ్రి"
ఎరా ఒరేయ్ అనుకునే మా మధ్య అండి ( రా + అండి ) రాండి లు చొప్పించిన చిలిపి రమణ గారు లేరుట.
నా ఆరో ఏట నుంచి నుంచి బుడుగు తో మొదలెట్టి, అయన రాసిన వన్నీ చదివి చదివి ఆయనకి పెద్ద పంఖా లా
తయారయ్యి.. నా వయసు తో బాటు పెరుగు తున్న శరీరం తో బాటు అయన మీద ( అయన సహచరుడు బాపు గారి తో కలిపి)
విపరీత
మైన ప్రేమ అభిమానం గౌరవం పెంచుకొని,
సొంత బంధువు లా,
మరింత దగ్గరి చుట్టం లా,
ఎంతెంతో కుటుంబ సభ్యునిలా....
చేస్కున్న అయన ఇక లేరు
అయన లాంటి ఒక పెదనాన్న, ఒక బాబాయి, ఒక తాత, ఒక అన్న, మేన మామ , తమ్ముడు , చివరాకరికి ఒక బుడుగు
లాంటి కొడుకు ఉంటె బాగుండనిపించే విశిష్ట వ్యక్తిత్వం "ముళ్ళపూడి " గారిది.
కస్టాలకేం పని లేదు వాటికేం తోచక మనకొస్తాయి,
ఇష్టాలతో పనిలేకుండా వాటిని ఆహ్వానించు, ఆస్వాదించు ,
ఆనక ఆనందంగా సాగ నంపు అనే అయన జీవిత వేదాంతం అయన రచనల్లో చదివి నిజం గా ఒంట పట్టించుకున్నా..
కేవలం నవ్వుకుంటే వచ్చే కంటి తడే కాదు
తవ్వుకుంటే వచ్చే బాధ తడి కూడా నవ్వుతూ తుడిచేసుకునే నేర్పు నేర్పారు.
అయన కేమిచ్చి తెలుగు సాహితీ ప్రియులు ఋణం మాఫీ చేయించుకో గలరు ?? ( ఇవ్వాలంటే ఆయనేరి ?)
జీవితం లో నేను చూసిన అతి కొద్ది అద్భుతాలలో బాపు రమణ గారు ఒకళ్ళు ( అవును వాళ్ళు ఒకళ్లె )
ఇది రాస్తుంటే
పక్కాగాడి ఫోన్ ఎంటిరా ఇలా జరిగింది అంటూ..
భోరు మని ఏడిచే వయసు కాక పోయినా
హోరున తుళ్ళి పడుతున్న మనసుల అలల చెమ్మ ఇరు వైపులా తెలుస్తోంది.
అయన లేక పోతే మనకే ఇలా ఉంటె ఇంకా బాపుగారికెలా ఉంటుందో.
ఏమైనా మన ఏడుపు మనమే ఏడవాలి
మన కంటి తడి మనమే తుడవాలి
బాపు గారి కి
వెంకట రమణ గారి కుటుంబానికి
రమణ గారి అభిమానులందరికీ
ప్రగాఢ సంతాపం.. తో ...
ఏమి రాయాలో తోచని దిక్కులేని మనసు తో !!

17, ఫిబ్రవరి 2011, గురువారం

గత జన్మలో నేను బోర్లు వేసేవాడిని....


"హలో నేను బద్రునండి!!.."
"హలో చెప్పు బద్రు"
"కొత్త బోరు వేయిస్తానన్నారుగా ఎప్పుడు వేయిస్తారు ?"
" వీలు చూసుకొని వస్తా లే .."
బద్రు అంటే నా మామిడి తోట లో ఉండే లంబాడి రైతు.
అక్కడ ఉన్న లంబాడి వాళ్ళలో కొంచం తెలివిగల చదువుకున్న రైతులలో ఒకడు.
నావి, నా స్నేహితుడి వి కలిపి చెరో పది ఎకరాల మామిడి తోట ని కౌలు చేసే రైతు కం మా వ్యవసాయ సలహా దారు.
ఇప్పుడు ఉన్న నీటి వసతి చాలట్లేదు, కాబట్టి మూడు నాలుగు కొత్త బోరులు వేస్తే పుష్కలంగా నీరు ఉంటుంది, మామిడి చెట్ల మధ్య వేరే పళ్ళ చెట్లు వేద్దాం, ఇంకా ఖాళీ ప్రదేశం లో కూరగాయల మొక్కలు సాగు చేద్దామని ప్రతి పాదించాడు.

నా చిరకాల కోరిక ప్రకారం, నా కష్టార్జితం పెట్టి, ఇంకాస్త అప్పు చేసి ఆ తోట కొని ఆరేళ్ళు అయింది. ఇన్నేళ్ళూ పెద్ద పట్టించుకోలేదు. వ్యవసాయం అంటే అంత తేలికైన వ్యవహారం కాదు. దానికి వెచ్చించ గల సమయం, ఓపిక, ఉండాలి. నేను వుండే ఇంటికి 70 కిలోమీటర్లు దూరం గా ఉండటం తో, ఆఫీస్ పని వత్తిడి తో అస్సలు తీరిక ఉండని నేను, నా స్నేహితుడు మా తోట లోకి చాలా అరుదైన అతిధులుగా గా అడుగు పెడుతుంటాం.

ప్రస్తుత పరిస్థితి ప్రకారం బద్రు ఎమెర్జన్సీ డిక్లేర్ చెయ్యడం తో ఒక రోజు ఆఫీస్ కి సెలవ్ పెట్టి వెళ్ళాల్సి వచ్చింది.
బోరు వెయ్యాలంటే అదో ఆషామాషీ వ్యవహారం కాదు. ఎక్కడ బోరు దింపాలో ఆ పాయింట్ జియాలజిస్ట్ గానీ, లేక సాంప్రదాయ పద్దతిలో భూమిలో నీరు ఉన్న పాయింట్లు పట్టే వాళ్ళు కానీ కావాలి.

సరేనని తెలిసిన ఇంజనీర్ ఒకాయన్ని అడిగి ఒక జియాలజిస్ట్ ఫోన్ నంబర్ సంపాదించాం. అయన కి ఫోన్ చేసి అప్పాయింట్మెంట్ తీస్కోని, ఆ రోజు తెల్లారే 5 గంటకి ఆయన్ని కార్ ఎక్కించుకొని తోట కి బయలుదేరాం.
ఈలోపు బద్రు కూడా తోట దగ్గర ఊర్లో ఉన్న ఒక యాదవులాయన కి ఈ విద్య తెలుసు అని ఆయన్ని కూడా పిలిపించాడు. మేము తోట లోకి వెళ్లేసరికి వాళ్ళు కూడా రెడీ గా ఉన్నారు.

మా జియాలజిస్ట్ వయసులో అరవై పైబడ్డాయన రిటైర్డ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగి , హాబీగా ఇలా ఈ విద్య తో అడిగిన వాళ్లకి సహాయం(?) చేస్తున్నారుట. అలా పాయింట్ గుర్తు పట్టి చెప్పినందుకు పాయింట్ కు రూ.500 /- మాత్రం పుచ్చుకుంటారు. మనమే లో వాహనం లో తీస్కేల్లాలి. నాటు పద్దతిలో పాయింట్లు చూపే అతనుకూడా రేట్ అంతే. మా సాంకేతిక (?) జియాలజిస్ట్ గారు ఆ నాటు మనిషిని చూసి, అతన్ని ఎందుకు పిలిచారు అని అడిగారు. మేము పిలవలలేదు మా బద్రు పిలిచాడని చెప్పాం. మేము వెళ్ళిన గంటకి రెండు పెద్ద వాహనాల్లో బోర్ వేసే యంత్రం వచ్చింది, వెంట పదిహేనుమంది పని వాళ్ళతో.

మా జియాలజిస్ట్ గారు బోర్ ఏ పక్కన కావాలో అడిగి అక్కడికి పదండన్నారు. ఈలోపు నాటు పద్ధతి మనిషిని నువ్వెలా పడతావోయ్ పాయింట్లు అని అడిగారు. అతను వేపకర్ర తోను, కొబ్బరికాయ తోను అని చెప్పాడు. పుట్టి బుద్దెరిగాక ఇలాంటి వేమీ చూడని మేము అమాయకంగా వాళ్ళని అనుసరించాము.

ఈశాన్యం మూల చూద్దాం అంటూ అయన జేబులోంచి L ఆకారం లో ఉన్న రెండు రాగి కడ్డీలు తీసి వాటిని రెండు చేతుల్లో పట్టుకొని గిర గిర తిప్పుతూ నడవసాగారు. అలా ఒక ఇరవై అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకి వెళ్లి, ఇలా అయిదు ఆరు సార్లు నడిచి ఈసారి దిశ మార్చి ఇంకో వైపు నడిచి మళ్ళీ ముందుకీ వెనక్కీ వెళ్ళొచ్చి, అచ్చం మన సెన్సెక్స్ లాగా ప్రవర్తించి . చివరకు ఒక చూట నుంచొని ఇక్కడ పుల్ల పాతండి గుర్తుగా అన్నారు. మా రైతు అసిస్టెంట్ గునపం తో తవ్వి అక్కడ ఒక ఒక గుంత చేసి చిన్న కర్ర పాతాడు. అక్కడనుంచి ఇంకొంచం పక్కకి వెళ్లి అక్కడా అలాగే షేర్ మార్కెట్ ట్రెండ్ లో ప్రవర్తించి ఇంకో చోట పాయింట్ పెట్టారు. ఇలా నాలుగు పాయింట్లు నా పొలం లో, నాలుగు పాయింట్లు నా స్నేహితుని పొలం లో వేసి ఆనక ఫీసు పుచ్చేస్కోని ఇక బోర్లేస్కోండి నీళ్ళే నీళ్ళు, అని చెప్పారు. అలా చెప్పిన మాట బుద్ది గా వినే లక్షణం మా బద్రు కీ లేదుగా . "నువ్వు నందా వయితే నేను బద్రు బద్రినాథ్ " అనే టైపు.

అంచేత తను పిలిపించిన అతన్ని కూడా ప్రతాపం చూపమన్నాడు.ఇక ఆ వచ్చిన అతను పేరు సరిగ్గా గుర్తు లేదు, ప్రస్తుతానికి భగీరధుడు అనుకుందాం, V షేప్ లో ఉన్న వేప కొమ్మ కి కింద తాటాకు బిగించి కట్టాడు. పంగల కర్ర లా ఉన్న ఆ వేప కొమ్మ ని రెండు చేతులతో వెనక్కి పట్టుకొని తల వంచుకొని భూమినే చూస్తూ నడవసాగాడు. ఇందాక పెద్దాయన లాగానే సెన్సెక్స్ స్వభావం చూపించి, ఒక చోటా ఆగి ఇక్కడే అన్నాడు. పైగా అరచేతిలో కొబ్బరికాయ పెట్టుకొని మళ్ళీ అలాగే నడిస్తే ఇందాక చూపిన ప్రదేశం దగ్గర కొచ్చేసరికి,
పీచు ఉన్న వైపు పైకి లేచి నుంచుంది. అలా ఒక పది సార్లు కొబ్బరి కాయ నుంచున్న తర్వాత సరిగ్గా ఇక్కడే అని మార్క్ చేసాడు. ఆ పాయింట్లు ఈ పాయింట్లు వేరే వేరే ఉన్నాయిగా దేన్నీ ఆధారం చేస్కోవాలి , అని అడిగా ఆ రెండు పాయింట్స్ మధ్య లో జల ఉన్నది ఎక్కడ వేసినా ౩ అంగుళాలు బోర్ నుంచొని పోస్తుంది ( ఏంటని అడక్కండి మా ఏరియా లో పొలాల బ్రోకర్లు చెప్పే రొటీన్ దవిలాగ్) అన్నారు.

సరే బోర్ వేసే వాహనం వచ్చి ఆ పాయింట్ మీద డ్రిల్ బిట్ వచ్చేలా నుంచుంది. నేనూ, మా వాడు భక్తిగా ఆ డ్రిల్ బిట్ కీ, దానికింద పాయింట్ కీ పూజ చేసి కొబ్బరి కాయ కొట్టి మహా జల యజ్ఞానికి శంఖు స్థాపన చేసిన మంత్రిగారిలా ఫీలయ్యం. ఆనక కొంచం ఎడం గా నుంచోండి తోలేసి. అంటూ డ్రిల్లింగ్ మొదలెట్టారు.

వచ్చిన పని వాళ్ళు మధ్య ప్రదేశ్ నుంచి వచ్చారు. కేవలం కూలి కోసం కుటుంబాలు ఒదిలేసి ఇక్కడ ఒంటరి గా ఉంటూ వండుకు తింటూ పని చేస్తూ ఉన్నారు. వీళ్ళని ఎందుకు పెట్టుకున్నారు మన తెలుగు వాళ్ళు లేరా అని అడిగా. దానికి కాంట్రాక్టార్ చెప్పిన సమాధానం "మన తెలుగు పని వాడు నాలుగు రోజులవగానే సీనియర్ అవుతాడు అటు తర్వాత పన్లోకి రమ్మంటే మనిషిని పంపుతా నాకూ వాడికీ జీతం ఇవ్వు అంటారు, శానా కష్టం వీళ్ళే రైటు పడుకోవటానికి చోటుఇచ్చి , తిండి పెట్టి నాలుగు వేలిస్తే కస్టపడి పని చేస్తారు పేచీలేని వ్యవహారం, అన్నాడు.

నిజం గా చాలా మంచి పనివాళ్ళు ఒక గోల లేదు, అరుపులు లేవు. ఒక పది మంది బోర్ దగ్గరుంటే మిగతా వాళ్ళలో ఇద్దరు బండి లోంచి గ్యాస్ స్టవ్ దింపి బియ్యం కడిగి పెద్ద గిన్నె తో అన్నం వండారు. బెండకాయలు ఉల్లిపాయలు టమాటోలు తరిగి కూర వేపారు. కారం ఉప్పు మసాల బాగా దట్టించి, చాలా సునాయాసం గా ఇరవై మందికి చాల కొద్ది సమయం లో భోజనం రెడీ చేసారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇద్దరిద్దరు క్రమ శిక్షణతో భోజనం చేసి పల్లెలు కడిగి మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయారు. ఎక్కడా పని ఆగలేదు. అలాగే రాత్రి లోపు మూడు సార్లు వండుకు తిన్నారు.

మూడు గంటల్లో సమయం లో 200 అడుగుల బోర్ వేసి, కేసింగ్ దింపి, పక్క పొలం లోకి వెళ్ళారు.
ఇంతకీ మన సైన్సు + నాటు శాస్త్రజ్గులు చూపిన పాయింట్ లో రెండు అంగుళాల కన్నా చిన్న బోర్ పడింది.
ఇక పక్క నా స్నేహితుని పొలం లో ప్రయత్నించిన రెండు పాయింట్లలో అంగుళం బోర్ పడింది దాంతో ఒక పాతిక వేలు ఖర్చు నిరాశ. పైగా పొద్దున్న ఆరుగంటల నుంచి రాత్రి పన్నెండు దాక ఆ బోర్ వాహనం పక్కన నుంచొని ఆశ గా చూడటం. కొంచం నిరాశ గా అనిపించినా మళ్ళీ వేయిద్దాం లే అని సర్ది చెప్పుకున్నాం.

ఎందుకీ కధంతా చెప్పానంటే ఈ మధ్య టీవీల్లో జాతకాలు వెర్సస్ నాస్తికులు, దేవుళ్ళు వెర్సస్ సాతానులు , వివిధ రకాల అడ్డగోలు చర్చలకు తోడుగా చానళ్ళ వాళ్ళు అతితెలివి కార్య క్రమాలు గత జన్మ లు అంటూ హడావిడి చేస్తున్నారుకదా. దాంట్లో శాస్త్రీయత ఎంతో గానీ ఆంకర్ మాత్రం చానల్ ఉప్పు నాకిన పాపానికి తెగ ఊదర కొట్టటం, ఆ వచ్చిన గత జన్మల డాక్టర్ కూడా విపరీతం గా ఒప్పించటం, అందులో పాల్గొన్న నటులు కూడా గత జన్మ లోకి వెళ్లి చూసి వచ్చేయండి అని వీసా ఇచ్చి పంపితే ఏకంగా వేల వేల ఏళ్ళ వెనక్కి వెళ్లి అక్కడ పాత రాతియుగం నాటి పనిముట్లు తెగ మెచ్చేసుకోవటం భలే కామెడీ గా ఉంది. ఇంకో చానల్ వాళ్ళు జన విజ్ఞాన వేదిక వాళ్ళని పిలిచీ ఆ వైద్యుడికీ, జవివే
వాళ్ళకీ తగవు మంట పెట్టి అందులో సిగరెట్ వెలిగించుకొని పొగ రింగులు ఒదలటం మొదలెట్టారు.

అసలు ఈ దొంక తిరుగుడు కధలేంటి ? ఆ బోర్ గోలేంటి ? పాయింట్లు పట్టటమేంటి ? మధ్యప్రదేశ్ పని వాళ్ళేంటి ? ఈ గత జన్మ రహస్యం గోలేంటి ? నీకేమైనా పిచ్చి పట్టిందా లింకుల్లేకుండా రాస్తున్నావ్ అనకండి.....
ఆ రోజు పొలం లో జియాలజిస్ట్ కరెక్టా ? నాటు భగీరధుడు కరెక్టా ? మరి రెండు పాయింట్లు ఫెయిల్ అయి పాతిక వేలు ఎలా పోయాయి ...?
టీవీ షోలో గత జన్మల డాక్టర్ కరక్టా? ఇలాటి వన్నీ చీల్చి చెండాడి ఎవరినైనా సరే తూ నా బొడ్డు అనే జవివే వాళ్ళు కరక్టా ? మరి జనం అలాంటి ప్రోగ్రాం ఎగబడి ఎందుకు చూస్తారు ఫోన్లెందుకు చేస్తారు ?

నాకైతే ఈ గోల ఏమీ పట్టకుండా ఆ రోజు పొలం లో పద్దెనిమి గంటలు క్రమశిక్షణ తో ఆగ కుండా పని చేసి, వంటలు చేసుకు తిన్న ఆ పని వాళ్ళే కరెక్ట్ అని పించారు.
సొంత రాష్ట్రము . సొంత మనుషులను ఒదిలి పొట్ట కూటికి వచ్చి,
మాయ మర్మం లేని,
అలుపులేని ఆ జీవిత బాట సారులే కరెక్ట్ అనిపించారు.
వాళ్లకి ఇలాంటి ఏ గోలా లేదు,
నమ్మకాలు లేవు, అమ్ముడు పోవటం తప్ప ,
టైమింగ్స్ లేవు, అలసి పోవటం తప్ప,
స్ట్రైకులు, బందులు, ప్రత్యేక కోరికలూ లేవు, డిమాండ్లు లేవు , కమాండ్లు లేవు, కుదిరిన చోట నడుము వంచటం తప్ప
జాతకాలు వాస్తులు లేవు, పనిలేక పోతే పస్తులు తప్ప
వాళ్ళని తీస్కెళ్ళి చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్లు వేయించి పని రాబట్టాలి.
వాళ్ళే కరెక్ట్ ఇంకెవరి వల్లా కాదు.

!!శ్రమయేవ జయతే !!


13, ఫిబ్రవరి 2011, ఆదివారం

మా బాబాయ్ భీష్ముడు !!


ఈ రోజు భీష్మ ఏకాదశి
రోజుతో నాకున్న ప్రత్యేక సంబంధం ... ఈరోజు మా బాబాయి అనుముల సీతారామయ్య గారు శాశ్వతం గా మాకు వీడ్కోలు చెప్పిన రోజు.
బాబాయి
అంటే మా నాన్న తమ్ముడో, మా అమ్మ చెల్లెలి భర్తో అనుకునేరు, కానే కాదు నా బాల్యం లో మేము అద్దెకున్న ఇంటి యజమాని అల్లుడు.
మా అమ్మ నాన్న ల పెళ్లి అయ్యి ఉద్యోగ నిమిత్తం బందర్లో జీవితం ప్రారంభించిన రోజు సుమారు 1960 నుంచి బందరు బుట్టాయిపేట లో అరవగుడెం సందులో గబ్బిట సత్యనారాయణ గారింట్లో ఉన్నారు. అలా ప్రారంభమయిన వాళ్ళ జీవితం లోకి మేము ముగ్గురు పిల్లలం వచ్చి పెరిగి పెద్దయే దాకా సుమారు ముప్పైఆరు సంవత్సరాలు అదే ఇంట్లో ఉన్నాము. మా గబ్బిట సత్యం గారి ఏకైక కుమార్తె సావిత్రి గారి భర్త అనుముల సీతారామయ్య గారు. ఎంతో మంది ఎన్నో ఇండ్లల్లో అద్దెకుంటారు, ఖాళీ చేసి వెళ్ళిపోతారు, మీ కధేంటి ఏమన్నా ప్రత్యేకం అనుకుంటున్నారా?
మేము ముగ్గురం ఆ ఇంట్లో ఉండగానే పుట్టాం. మొదట్లో మూడు గదుల భాగం తో ప్రారంభించి కొన్నేళ్ళకు ఆరుగదుల మొత్తం ఇల్లు మారి అన్నేళ్ళు ఒకే ఇంట్లో ఉండటం సామాన్య విషయం కాదు. అలా ఉండటానికి కారణం మా అమ్మ నాన్నల మంచి తనమే కాదు, ఇంటి యాజమాని ఔదార్యం కూడా ఉంది. గబ్బిట సత్యం గారి అమ్మాయికి పిల్లలు లేరు, అల్లుడు కూడా అదే ఊర్లో ఉద్యోగం అవటం వల్ల వాళ్ళింట్లోనే కలిసి ఉండే వాళ్ళు. పైన వాళ్ళు కింద మేము ఇంకో అవుట్ హవుస్ లాంటి ఇంట్లో వేరే వాళ్ళు ఉండే వాళ్ళు. మా చిన్నతనం లో ఆ అవుట్ హవుస్ లో మేమే ఉండేవాళ్ళం, మేము పెద్ద ఔతుండటం వల్ల ఇల్లు చాలక మెయిన్ బిల్డింగ్ లోకి మారాం. ఇవి పరిచయ వాక్యాలే.
అసలు మా బాబాయి తో మా అనుబధం గురించి చెప్తా.. మా ముగ్గురినీ సమానం గా సొంత పిల్లల్లా చూస్కునే వాళ్ళు. మేము అయితే మా ఇంట్లో, లేక పోతే వాళ్ళ ఇంట్లో గడిపే వాళ్ళం. సొంత తాత అమ్మమ్మ ల కన్నా ఎక్కువ చనువుతో
పిన్నీ
బాబాయి అని పిలుస్తూ. మా బాబాయి చూడటానికి మంచి అందగాడు హీరో రామకృష్ణ లా ఉండే వాడు నొక్కుల జుట్టు మంచి ఒద్దు పొడుగు, మానరిజమ్స్ హీరో కృష్ణ లా ఉండేవి, అయితే అక్కినేని వీరాభిమాని.
కొంచం
పక్కకి తిరిగి మెట్లు దిగుతుంటే , హీరో కృష్ణ ,హీరో కృష్ణ అని మేము వీలలేసి అరుస్తుంటే, ముసి ముసి గా నవ్వుకునేవాడు.సిగరెట్ తాగుతుంటే నాగేశ్వరావు అనేవాళ్ళం .
కృష్ణ
జిల్లా పరిషద్ ఆఫీసు లో కొన్నేళ్ళు, కంకిపాడు సమితి ఆఫీసులో కొన్నేళ్ళు ఉద్యోగం చేసిన అయన స్వగ్రామం మానికొండ (కృష్ణ జిల్లా). మాంచి డ్రెస్ సెన్స్ మరింత ఒంటి మీద శ్రద్ద ఉండే మనిషి. మైసూరు సాండల్ సబ్బు అరగంట అరగదీసి స్నానం చేసి ఫ్యాన్ కింద నిలబడి ఆరాక , ఆపై కుటికురా పౌడర్ ఒళ్లంతా చల్లుకొని, మంచి ఫుల్ హాండ్స్ షార్ట్ బెల్ బాటం ప్యాంటు వేస్కొని, పాండ్స్ స్నో తో మొహమంతా చుక్కలు పెట్టుకొని అవన్నే కలిపెస్తూ జాలీ పేస్ పౌడర్ రాస్కోని సినిమా హీరో లా తయారయ్యేవాడు.
మా
దిన చర్య స్కూల్ మినహా ఎక్కువ భాగం ఆయనతోనే జరిగేది,కాలం తో బాటు మా అనుబధం వట వృక్షం లా పెరిగి ఊడలు దిగి వాళ్ళ కుటుంబం తో పెనవేసుకుపోయింది.
నేనైతే ఆయనతో నే స్నానం చేసేవాడిని. ఆయన భోజనం చేస్తూ పక్కన కూర్చో బెట్టుకుని ముద్ద పప్పు లో గోంగూర కలిపి ఆ కారం నువ్వు తినలేవురా అంటూ ముద్ద లపై నెయ్యి వేసి పెట్టేవాడు.
సాయంత్రాలు
చెయ్యి పట్టుకొని షికారు కి తీస్కేల్లెవాడు. కోనేరు సెంటర్ చుట్టూ రౌండ్ వేసి రాధిక దియేటర్ పక్క సందులో ఉష కంపనీ మానేజర్ రామమూర్తి గారి తో కబుర్లాడి, ఎనిమిదేళ్ళ నన్ను చూపించి మా అబ్బాయికేమన్నా సంబంధాలు చూడయ్యా అని సరస మాడేవాడు. నేను సిగ్గు తో మెలికలు తిరిగితే ఇద్దరూ నవ్వుకునే వాళ్ళు.
రాత్రుళ్ళు
అయన దగ్గరే పడుకునే వాడిని. డాబా మీద సిగరెట్ తాగుతూ నీకో గమ్మత్తు (అయన ఊతపదం) చూపిస్తారా అంటూ వెన్నెల్లో పొగ రింగులు గా ఒదులుతూ చూపించే వాడు.
ప్రేమనగర్
సినిమా చూసి వచ్చి కొత్తల్లో రాత్రి పడుకునే టైం లో నాగేశ్వరావులా తాగినట్లు మాట్లాడి మమ్మల్ని దడిపించే వాడు. గరుకైన గడ్డం తో నా అరచేతి లో రాసి గిలిగింతలు పెట్టె వాడు.
ఎప్పుడు
బయటనుంచి వచ్చినా పైన వాళ్ళింట్లోకి వెళ్లి కిటికీ లోంచి కిందకి కేక పట్టేవాడు "ఒరే బుజ్జి పైకి రారా నీకో గమ్మత్తు చూపిస్తా.." అంటూ,
పైకి
పరిగేట్టుకేల్లె వాళ్ళం ఏమీ లేదురా ఊరికే పిలిచా అనేవాడు. అప్పుడప్పు మాకు మంచి గిఫ్ట్లు ఇచ్చేవాడు. నేను మొదటి సారి చూసిన చైనా హీరో పెన్ ( పైన గోల్డ్ కేప్ కింద ఆకుపచ్చ పెన్ను) అప్పట్లో ఖరీదు, ఆయనే కొనుక్కోచి దీంతో రాసుకో మన్నాడు . మేము ఆశర్యం తో తల మునక లయ్యే లోపు నవ్వి జగ్రతరా బాబూ అసలే ఆ పెన్ను సున్నితం అనేవాడు.
ఉద్యోగానికి మా అన్న పెళ్ళయి మా అక్క కొంత కాలానికి వెళ్ళిపోయినా నేను అయన ఇద్దరం మిగిలాం, మేడ మీద బోలెడు తొట్లు పెట్టి మట్టి నింపి అందులో బోలెడు రంగు రంగుల గులాబి మొక్కలు పెంచే వాళ్ళం రోజూ పొద్దున్న సాయంత్రం వాటికి నీళ్ళు పోస్తూ ఆకులూ కొమ్మలు కత్తిరిస్తూ బోలెడు కబుర్లాడుకునే వాళ్ళం. మా రోడ్ చివర ఇంజనీరింగ్ చదివే ఒక తెల్లటి అమ్మాయి వెళ్తుంటే ...ఒరేయ్ ఒక గులాబీ కోసి ఆ అమ్మాయికి(ముంతాజ్ అని పేరు ఆయనే పెట్టాడు) ఇవ్వరా రోజూ నిన్ను ఓరకంట చూస్తోంది అని సరస మాడేవాడు.
మమ్మల్నే కాదు మా అక్క కొడుకుని కూడా ఆయన పెంచాడు. చిన్నప్పుడు మాకు చేసిన సేవలన్నీ వాడికీ చేసాడు.
ఫలితం గా మా మేనల్లుడు రెండేళ్ళ వయసులోనే అయన లుంగీ ఎలా మడిచేవాడు, సిగరెట్ ఎలా వెలిగించేవాడు ఎక్షను
చేసి చూపేవాడు. వాడు కూడా ఆయన్ని బాబాయ్ అనే పిలిచేవాడు.
మా అమ్మాయినే అయన చూడలేదు. అయన పోయే నాటికి మా అమ్మాయి కి మూడు నెలల వయసు.

మమ్మల్ని
సొంత పిల్లలానే కాక మంచి స్నేహితుల్లా , మరింత ఆత్మ బంధువుల్లా చూస్కున్న అయన చెప్పా పెట్టకుండా కనీసం చివరి చూపు కూడా దక్క కుండా పోయారు.
1993 ఫిబ్రవరి లో విజయవాడ లో ఉద్యోగం చేస్తున్న నేను నా మిత్రుడు వివాహానికి హైదరాబాద్ వెళ్ళాలని బట్టలు
సర్దుకుంటుంటే బందరు నుంచి ఇంట్లో అద్దె కున్నాయన ఫోన్ చేసి చెప్పారు మీ బాబాయి గారు పోయారని. హైదరాబాద్ ప్రయాణం మానేసి బైక్ మీద ఒక్కడినే సాయంత్రం ఆరు గంటలకి బందరు బయలు దేరా. బందరు శివార్లలో రోడ్ కి ఎడమ వైపు ఉన్న స్మశాన వాటిక మీంచి వెళ్తుంటే ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఎర్రటి మంటలు చూసి ఎవరిదో చితి అనుకున్నా. పది నిముషాల తర్వాత ఇంటి దాకా వెళ్ళాక తెలిసింది అప్పటికే ఆయన అంతిమ పయనం అయిపోయిందని, నేను చూసిన ఆ చితి ఆయనదే అని. ఏమీ చెయ్యకుండానే అయన ఋణం అలా మిగిలి పోయింది.

నేను
మా అమ్మ అప్పుడప్పుడూ కూర్చొని జ్ఞాపకాల పాతరలు తవ్వుకుంటుంటే మా ముందు నుంచునే నిలువెత్తు పుణ్య మూర్తి మా బాబాయి.

అప్పుడప్పుడూ కలలోకి వచ్చి "ఒరే బుజ్జి గమ్మత్తు చూపిస్తా రారా....." అంటూనే మాయమయి
పోతాడు,
ఉలిక్కిపడి లేచి చూస్తే అయన జ్ఞాపకాలు ...
నాచుట్టూ అయన కాల్చిన సిగరెట్ పొగలా లీలగా, వాసన లా
ఘాటుగా ...

చిన్నా
,మున్ని, బుజ్జి తరుపున మా బాబాయి కి నివాళి !!

చిన్న కోరిక : ఈ భీష్మ ఏకాదశి రోజు సిగరెట్లు తాగే వాళ్ళందరికీ ఒక విన్నపం సిగరెట్ మానేస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేసి చూడండి.


12, ఫిబ్రవరి 2011, శనివారం

సరదాగా కాసేపు..ద్వేషంగా రాసేవు..


గత సంవత్సరం ఆగస్ట్ 17 న నేను ఒక డిపార్ట్ మెంటల్ స్టోర్స్ లో సేల్స్ మాన్ గా చేరాను.
అప్పటికే నేను చేస్తున్న ఉద్యోగం తో నేను చాలా బిజీ, అయినా ఎప్పుడు ఏదో ఒక కొత్త పనులు నెత్తిన వేసుకోవటం తద్వారా బుర్రకీ శరీరానికీ పని చెప్పటం, నాకు అలవాటు.
దానివల్ల లాభం లేక పోయినా నష్టమైతే రాదు. అయినా లాభం కనపడింది అందువల్ల ఈ అదనపు ఉద్యోగం నాకు బాగుంది.
ఇక పోతే నేను పని లో చేరిన డిపార్ట్ మెంటల్ స్టోర్ గురించి చెప్పాలంటే అదొక వైవిధ్యమున్న వ్యాపారం.
అక్కడ ఏది అమ్మాలన్నా, సేల్స్ పని వాళ్ళే తయారు చేస్కొని వెళ్ళాలి, అంటే అక్కడేమీ వస్తువులు ఉండవు, మనం తీస్కేళ్ళినవే అందం గా పేర్చి, ఆ పైన ప్యాకింగ్ లు మరింత అందం గా కూర్చి,
అక్కడ అమ్ముకోవాలి. ఎన్ని అమ్మాలి , ఎంత సేపు అమ్మాలి అనే నియమ నిభందనలు లేవు, మన సరుకు సొగసు ను బట్టే అమ్మకాలుంటాయి. లాభం లో ఎవరికీ వాటా ఇవ్వఖర్లేదు.
జనాల మెచ్చుకోళ్ళు , భుజం తట్లు, ఈసడింపులు తిట్లు మనకే సొంతం. ఇంకెవరూ అడగరు.
ఇదేదో బాగుందే అనుకోని నేను ఆ ఉద్యోగం లో చేరి పోయా.
అక్కడ చిన్న సైజు ఆంధ్ర రాష్ట్రమే ఉంది
వందల మంది అమ్మే వాళ్ళు , వేల మంది కొనే వాళ్ళు,
వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వారు వందల సంఖ్య లో జమ అవటం వల్ల, సహజం గానే అక్కడ
ప్రాంతీయ తత్వం, వయో ఆధారిత సమీకరణలు, ఆడ వనాలు ,మగ జనాలు, పిల్ల గ్రూపులు
పెద్ద ట్రూపులు, ఇలా ఒకటేంటి ఎన్నో రకాల సంధులు, సమాసాలు ఉన్నాయి అక్కడ.
సినిమా వార్తలు అమ్మే వాళ్ళు, కధలు తుమ్మె వాళ్ళు, కవితలు చిమ్మే వాళ్ళు, నవ్వులు రువ్వే వాళ్ళు,
రాజకీయాలు చేణికే వాళ్ళు, విజ్ఞానం వడికే వాళ్ళు, నిజాలు సర్దేవాళ్ళు వాళ్ళు, అబద్దాలు అద్దే వాళ్ళు, వంటలు వండేవాళ్ళు, అవి తిని పండే వాళ్ళు,
ఇలా ఎంతో మంది సహా వ్యాపారులను చూసా.
సరసం పేరుతో రంజింప చేద్దామనుకునే వాళ్ళు,
విరహం తో కంపింప చేసే వాళ్ళు
ఒకళ్ళేమిటి...
మినీ ఆంధ్ర ప్రదేశ్ కాదు మినీ ప్రపంచమే ఉంది మా వ్యాపార కేంద్రం లో, కాక పోతే భాష ఒక్కటే తెలుగు.
యాసలు వేరు అంతే.
మొత్తానికి ఎక్కడికీ వెళ్ళకుండా కూర్చున్న చోటే వైవిధ్యం పొందే అవకాశం నాకు భలే నచ్చేసింది.
నేను కూడా కొన్ని సరుకులు అమ్మాను.లాభం గా కొన్ని భుజం తట్లు పొందాను.
అన్నిటికన్నా నాకు నచ్చిన విషయం అక్కడ ఎందఱో విద్యాధికులు, మేధావులు, ఎంతో సృజనాత్మకత, ఎంతో భావుకత, రసికత, తాదత్మికత, భావావేశం, ప్రేమ, ఆప్యాయత కురిపించి మురిపించే ...
భగవద్ బంధువులు,సాహితీ మిత్రులు , కలల బేహారులు, రాగాల పల్లకీ బోయీలు, తో కళ కళ లాడుతున్న మా వ్యాపార కేంద్రం నాకు మంచి వ్యాపకం అయింది.
కానీ పుణ్య క్షేత్రం లో కూడా కుచిత రాజకీయ పార్టీ కార్యాలయం ఉన్నట్లు ,
పాపపంకిల వేశ్య వాటిక ఉన్నట్లు,
చీకటి కోణాల వ్యాపార మార్గాలున్నట్లు
ఇక్కడ కూడా కొన్ని వక్ర వేదిక లున్నాయి.
ఆరునెలల కన్నా తక్కువ సమయం ,
అరవంద కన్నా తక్కువ సరుకులమ్మిన అనుభవం,
స్వావిభావికం గా తెలివి తక్కువ పాళ్ళలో ఉండటం వల్ల నేను ఇక్కడ నిశబ్ద అమ్మకం దారుడిగా ఉండి పోయా.
ఒకళ్ళ సరుకుని మరొకళ్ళు విమర్శించుకోవటం
ఒకళ్ళ భావాలని మరొకళ్ళు తప్పు పట్టటం
నేనే గొప్ప అనే దానికన్నా వేరే తప్పు అనే భావజాలం
ఈ ప్రక్రియ లో కొంత మంది మరొకరిని దూషించటం
దూషణ అతిక్రమించి బూతించటం .
విద్య లో ఎంతో సాధించిన వారు
సాంకేతికంగా ఎంతో జ్ఞానం సంపాదించిన వారు
ఉద్యోగం లో ఎంతో ఎత్తుకి ఎదిగిన వారు
జీవితం లో ఎన్నో విజయాలు, అనుభవాలు, ఉన్న వాళ్ళు పెద్దలు, గురువులు ఉన్నారు
ఎవరికి వారు వాళ్ళ వాళ్ళ పరిధి లో, వాళ్ళ వాళ్ళ పరిమితులలో లోబడి ఉన్నారు...
జరుగుతున్న విషయాలను గమనిస్తూ, సహిస్తూ, భరిస్తూ మనకెందుకులే అనుకుంటూ...
అంచేత నేను ఒక నిర్ణయానికి వచ్చాను
నేను చేరిన వ్యాపార కేంద్రం ముందు మోకరిల్లి , ప్రాధేయ పడుతున్నా...
ఇష్టం లేక పోతే అసలు ఒకళ్ళ సరుకులు ఒకళ్ళు చూడొద్దు
ఒకళ్ళ నొకళ్ళు కించ పరుచుకోవద్దు...
నేను చెప్పిన సూచన నాకే చెప్పొద్దూ (నువ్వే మా సరుకులు చూడకు అని)
మీ సరుకుల నాణ్యం బాగుంది కనకనే చూడ కుండా ఉండలేను.
అందుకే
మీ మేధస్సు ముందు నా అజ్ఞానాన్ని నేల రాసి ప్రాధేయ పడుతున్నా...
మీ మీ విజ్ఞానపు మందిరాల మీద విమర్శల పిట్టల రెట్టలు వేయకండి.
మీ మీ భావుకత మాసన సరోవరం లో కాకుల్ని ఈదనీయకండి.
మీ మీ మేధో గగనాల మీద ద్వేష పూరిత డేగలని కమ్ముకోనీయకండి.
LIVE AND LET LIVE
जियो और जीनेदो ||