30, జనవరి 2011, ఆదివారం

అయన ఒదిలి వెళ్ళిన ఆ ఎనిమిది...తొమ్మిది గంటల పదిహేను నిముషాలు స్కూల్ కి వెళ్ళే ముందు అన్నం తినేసి రెడీ అవుతున్న సమయం.
" రోజు పగలు పదకొండింటికి సైరన్ మోగగానే ఎక్కడున్నా సరే నుంచొని రెండు నిముషాలు మౌనం పాటించాలి. "
" టైం లో స్కూల్లో ఉంటాగా పైగా క్లాస్ లో ఉంటా. .."
"అయినా పర్లేదు సైరన్ మోగగానే అందరు లేవండి, అయినా నేను పక్క క్లాస్ లోనే ఉంటాగా అసెంబ్లీ లో చెప్తారు
విషయం ..
మర్చి పోకుండా పదకొండింటికి నేను చెప్పింది చెయ్యండి."
ఇది జరిగి దాదాపు ముప్పైఅయిదు ఏళ్ళు పైన అయింది జనవరి ముప్పై గాంధి గారి వర్ధంతి, రోజున మా అమ్మ ఆనవాయితీగా
చెప్పే ముందస్తు జాగ్రతలు.
అప్పటికి నేను నాలుగో ఐదో చదువు తున్న రోజులు.
ప్రతి జనవరి ముప్పైన గాంధి గారి గురించి స్కూల్ అసెంబ్లీ లో కొంచం సేపు మాట్లాడి, రెండో పీరియడ్ లో పదకొండింటి
ఆంధ్ర సైంటిఫిక్ కంపనీ సైరన్ మోగుతుంది
గాంధీ గారు చనిపోయిన క్షణాలను గుర్తు చేస్తూ... అప్పుడు ఎక్కడున్న వాళ్ళు అక్కడే నుంచొని రెండు నిముషాలు మౌన
ప్రార్ధన చేయండి, మా ప్రిన్సిపాల్ గారి హుకూం.

నాకు బాగా గుర్తు పదకొండింటికి సైరన్ మోగ గానే బయట గ్రౌండ్ లో నడుస్తున్న మా టీచర్లు అక్కడే మౌనం గా
నుంచోవటం. మా క్లాసు ముందు కటకటాల ల్లోంచి చూసిన దృశ్యం నా మనసులో బలంగా నాటుకు పోయింది.
ఇప్పుడు ఆఫీసు లో అదే పాటిస్తే వింతగా చూసే జనం మధ్య నేను ఏమీ సిగ్గు ఫీలవను...
ఎనిమిది ఏళ్ళ వయసు లో గాంధీగారి గురించి పోయిన దిగులు కన్నా క్లాస్ మధ్యలో చిన్న బ్రేక్ వస్తుందన్న
ఉత్సాహం ఎక్కువ. అది ఎంత చిన్నదైనా,
బ్రేక్ తర్వాత టీచర్ కొంచం సేపు రోజు గురించి మాట్లాడతారుకదా. అది చాలు మాకు గుస గుస లకి, రిలాక్స్
అవటానికీ.
అప్పుడు మాలో మా గోల ని అడ్డుపడుతూ టీచర్ చెప్పే వాళ్ళు "1948 లో సరిగ్గా ఇదే రోజు గాంధీ గారిని ఒక మతోన్మాది
(?) హత్య చేసాడు, అయన ఆత్మ శాంతి కోసం ఇలా రెండు నిముషాలు మౌనం పాటించాలి."
గాంధీ గారి గొప్ప తనం ఈరోజు ఎంత మంది పిల్లలకి తెలుసో ఏమో కానీ?
ఆయనంటే ఎంత మంది ఈతరం పిల్లలకు గౌరవం ఉందొ కానీ
నా చిన్నప్పుడు మాత్రం సినిమా ముందు ఫిలిం డివిజన్ వాళ్ళ డాక్యుమెంటరీ లలో, కొన్ని సార్లు సినిమాల్లో, నలుపు
తెలుపూ లలో గాంధీ గారి వడి వడిగా నడిచే సీన్ , మైకు ముందు మడత కాల్లెస్కుని కూర్చొని ఉపన్యసిస్తున్న సీను రాగానే కింది తరగతుల నుంచీ పైన బాల్కనీ జనం దాకా అందరూ చప్పట్లు కొట్టే వారు. కొద్ది క్షణాలూ రణ గొణ ధ్వని వచ్చేది హాల్లో.... అది చాలు అయన పట్ల అప్పటి సామాన్య జనానికి ఉన్న గౌరవం చూపటానికి.
అయన అందించిన స్వాతంత్య్రం ఒక్కటే గుర్తుండి పోయిన మనకు మిగతా సందేశాలైన సత్యం, అహింస, నిరాడంబరత, మరుగున పడిపోయాయి.
మరీ అమాయకత్వం కాక పోతే ....
అసలు అబద్దాలు ఆడకుండా రోజెలా గడుస్తుంది
ఎవరినో ఒకళ్ళ నన్నా హింస పెట్టకుండా (మానసికంగా) పొద్దెలా పోతుంది
దంబమూ దర్పమూ చూపకుండా మన ఉనికేలా తెలుస్తుందీ..
ఇంకా అయన చెప్పిన శాఖాహారం ,
బ్రహ్మచర్యం
ముసలి తనం వచ్చాక ఎలాగూ తప్పవు.
మిగిలిన
విశ్వాసం ఎలాగూ కష్టమైన పని.
ఏమిమిదో
సూత్రం స్వరాజ్ ఎలాగూ వచ్చేసింది.
గాంధీ గారి సూత్రాలలో నాలుగో సూత్రం అయిన నయీ తాలిం అంటే అందరికీ ప్రాధమిక విద్య ఇదైనా మన నాయకులు పాటిస్తే
బాగుండు.
మిగతావి అన్నీ ఆచరణకి అసాధ్యాలు ఈనాటి తెల్ల టోపీలకి, తెల్ల చొక్కలకీ.
ప్రతి భావి భారత పౌరుడినీ విద్యా వంతుడిగా చూసే మార్గం వేయమని కోరుకుందాం.
కష్టమైనా నావంతుగా పై ఎనిమిది సూత్రాలలో సాధ్యమైనన్ని ఆచరించటానికి ప్రయాత్నిస్తా.
ఆనందించాల్సిన విషయం ..
నాకూ గాంధీ గారికీ ఒక పోలిక ఉంది అదేంటంటే చేవ్రాత, చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది కానీ ఏమి రాసానో అర్ధం
కాదని చాలా మంది నన్ను దెప్పుతారు.
అయినా చేవ్రాత బాగుంటే తల రాత బాగోదన్న ముతక నమ్మకం నేను బాగా నమ్ముతా.
ఎవరన్నా నా చేవ్రాతని విమర్శిస్తే గాంధి గారిని గుర్తు చేసి దారి మల్లిస్తా..
మర్చిపోయిన గాంధిగారిని గుర్తు చేసి గర్విస్తా....26, జనవరి 2011, బుధవారం

ప్రధానికి వచ్చిన మూడో కానుక

" అమ్మవడి " బ్లాగ్ లో అక్క ఆదిలక్ష్మి యడ్ల గారి పోస్ట్ లో రాసిన ప్రధానికి రెండు కానుకలు చదివి వచ్చిన స్ఫూర్తి తో ...

ఒక పార్సెల్ లో సరిహద్దు నుంచి సైనికులు రక్తం తో తడిసిన మట్టి ఉందిట

రెండో పార్సెల్ లో కష్టాల లో ఉన్న రైతు చెమట తో తడిసిన మట్టి ఉందిట ,,

రెండేనా ఇంకో పార్సెల్ కూడా వచ్చింది
అందులో
అధిక ధరల బరువుల మధ్య,
అవినీతి పరుల వల్ల పోయిన పరువుల మధ్య,
అతివృస్టి, అనావృస్టి కరువుల మధ్య,
సామాన్యుడి కన్నీటి చెరువుల తడిసిన మన్ను ఉంది
అందులో....
తొంభై కోట్ల సామాన్యుల వ్యధ ఉంది ఆ మంటి లో
తొంభై కోట్ల సామాన్యుల రోద ఉంది వాళ్ళ కంటి లో .....
అయినా సరే మేరా భారత మహాన్ !!
ఏమైనా సరే హమారా బ్రస్టాచార్ జహా దేఖో వహా హాజిర్ హై !!!


ఏంటి ? ఈవ్ టీసింగా..?


  గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !!                         చిన్నప్పుడు స్కూల్ రోజుల్లో ఆగస్ట్ పదిహేను కోసము, జనవరి ఇరవై ఆరు కోసము తెగ ఎదురు చూసే వాడిని. పుట్టిన రోజు కోసం ఎదురు చూసినంత ఆత్రుత తో
                 కొత్త బట్టల్లేని పండగ, పిండి వంటల్లేని
పండగ. అయినా బోలెడంత ఉద్వేగం, చాలినంత ఉత్సాహంతో రోజు కోసం ఎదురు చూసేవాడిని
            నాకు బాగా గుర్తు పొద్దున్నే రేడియో లో వినిపించే దేశ భక్తి గీతాలు వింటూ పొద్దున్నే మా అమ్మ వండిన వేడన్నం లో పెరుగు కలుపుకొని తిని ఆకుపచ్చ లాగు పైన తెల్ల చొక్కా వేస్కొని జేబుకి కాగితం ఝండా తగిలించుకొని ఏడింటికల్లా మా అమ్మ తో బడికెళ్లే వాడిని. మా అమ్మ టీచరు గా ఉన్న స్కూల్లోనే నేను చదివా కాబట్టి బాగా పెందలాడే వెళ్ళేవాడిని.

           అక్కడ
స్టేజి ముందు ఝండా దిమ్మ చుట్టూ ఉన్న మూడు మెట్ల పై పూల తో అలకరించటం, తర్వాత మా ఎండిఎస్సు టీచరు గారు (NDS టీచరు పేరు రాజేశ్వరి గారు) ఝండా ని ఎంతో నైపుణ్యం తో ముడేసి తాడుతో పైకి లాగి, ప్రిన్సిపాల్ గారు ఒక్కసారి సుతారం గా లాగ గానే జూలు విదిల్చిన సింహం లా గ ర్వంగా ఎగిరెలా ఏర్పాటు చెయ్యటం ముప్పై అయిదు ఏళ్ళ క్రితం జరిగినా  
 ఇప్పటికీ బాగా గుర్తు. టీచర్ ఎన్ని సార్లు
ఝండా కట్టినా అది ఎప్పుడు పైకి ఎగరటానికి మొరాయించంటం కానీ,
లేదా
మన కంపు రాజకీయ పార్టీ అఫీసుల్లోలా తలకిందులు గా ఎగరవేయ బడటం జరగా లేదు. మా టీచర్ కి ఝండా అన్నా, దేశమన్నా అంత గౌరవం భక్తి ఉండేవి. ఝండా వందనం అయిన తర్వాత ఒక గంట సేపు మీటింగ్ జరిగేది ప్రిన్సిపాల్ గారు ,టీచర్లు, పెద్దలు అంతా మాట్లాడేవాళ్ళు . టైం లో మా ధ్యాస అంతా ఝండా మీదే ఉండేది ఉండేది , వీచే గాలికి ఝండా రెప రెప లాడుతుంటే బోలెడు ఆనంద మేసేది. అందరూ ఝండా వంక చూసే వాళ్ళం "ఝండా ఎగురు తోంది .. ఝండా ఎగురు తోంది.. అంటూ గుస గుస లాడుతూ..

సరదా సంబరం ఇప్పుడు నాకు లేవు. ఆఫీసు లో ఝండా వందనం గురించి కన్నా , తర్వాత ఏమి తినాలో అని రెండు రోజులు ముందే ప్లాన్ చేసే మనుషుల మధ్య ఉంటూ, ఆఫీసు ఖర్చే కాబట్టి సాధ్యమైనంత ఖరీదైన హోటల్ నుంచి వీలైనన్న ఎక్కువ అయిటేమ్స్ తెప్పించండి గురూ అని ఉబలాట పడే టిఫిన్ దోశ భక్తుల మధ్య సరదా ఎప్పుడో సమాధి అయింది.

అయితే
గత వారం రోజులుగా ఒక విచిత్ర మైన కోరిక కలిగింది.
అందరూ స్వాతంత్ర దినోత్సవం గణ తంత్ర దినోత్సవం 
పండగ సెలవలు జరుపు కుంటారు కదా..
అసలు రెండిటికీ తేడా ఏంటో ఎంత మందికి తెలుసు ? అని.
మీరు
నమ్మాలి... సుమారు యాభై మందిని అడిగి చూసా ముగ్గురు మాత్రమే సరిగ్గా చెప్ప గలిగారు. అందరూ చదువు కున్న వాళ్ళే , కునే వాళ్ళే.
పన్నెండు
మంది మధ్య వయస్కులు నాకు పరిచయ మున్న పెద్ద హోదా లో ఉద్యోగం చేసే వాళ్ళు. ఇరవై మంది నన్ను ఎరుగని వ్యక్తులు, మార్కెట్ లో రోడ్ మీద మాల్స్ లో తిరుగుతూ అడిగా ,
ఆరుగురు
ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులు,
పది మంది స్కూల్ విద్యార్థులు, ఒకళ్ళిద్దరు అటో వాళ్ళని అడిగా,
ఒక
స్కూల్ విద్యార్ధి, ఒక ప్రభుత్వ అధికారి, ఒక రోడ్ మీద అపరిచిత వ్యక్తి సరిగ్గా చెప్పారు.
మిగతా
వాళ్ళు ఏదో చెప్పారు
కొంత
మంది మాకు తెలీదని,
కొంత మంది మర్చిపోయామని.
ఒకళ్ళు నేను చెప్పనని,
ఇద్దరు మీరెవరు ఎందుకు అడుగుతున్నరూ అనీ,
కొంత మంది మీరు టీవీ వాళ్ళా కెమెరా ఎక్కడ దాచారు అంటూ సరసమాడి తప్పించుకున్నారు.
ఒక
పాతికేళ్ళ అమ్మయితే " ఏంటి ఈవ్ టీసింగా అంది". అంతే గానీ తెలీదని ఒప్పుకోలా.

ఆగస్ట్
పదిహేను భారత దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఒదిలి స్వతంత్రం వచ్చిన రోజైతే.
ఇరవైఆరు
జనవరి అంటే మన భారత రాజ్యాంగం 1950 నుంచి అమలు లోకి వచ్చిన దినం.
రెండు
వందల ఏళ్ళ బ్రిటీష్ పాలన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏక్ట్ 1935 ని తోసిరాజని భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చింది.
అప్పటి
వరకూ భారత ప్రభుత్వానికి సరైన రాజ్యంగా పరమైన శాశ్వత నియమావళి లేదు, ఉన్న నియమాలన్నీ బ్రిటీష్ ప్రభుత్వ రాచరికానికి అనుగుణం గా ఉన్న గవర్నమెంట్ అఫ్ ఇండియా 1935 చట్టానికి లోబడినవే.
అందుకని
మన కంటూ మనచే నిర్ణయించ బడిన, నిర్మించ బడిన రాజ్యాంగం అవసరమని భావించిన అప్పటి రాజకీయ మేధావులు పెద్దలు కూర్చిన రాజ్యాంగం అమలు లకి వచ్చింది.
జనవరి
26 తారీకు ప్రాముఖ్యత ఏంటంటే అదే రోజు 1930 లో భారత జాతీయ కాంగ్రెస్స్ పూర్ణ స్వరాజ్ ప్రకటించిన దినం. అప్పటి కల మహాత్ముల కృషివల్ల త్యాగాల ఫలం గా 1947 ఆగస్ట్ 15 భారత దేశం స్వతంత్ర దేశమైతే,
పరిపాలనా
పరం గా మరింత పటిష్టం అవటానికి మేధావుల కృషి వాళ్ళ మూడు సంవత్సరాల కాలం లో సుమారు మూడు వందల మంది నాయకులూ ఆమోదించిన, రాజ్యంగ ప్రతి, రెండు భాషల్లో రాయబడి 26 నవంబరు 1949 దాఖలు చేయబడింది. రాజ్యాంగం పూర్తి స్థాయి లో అమలు లోకి రావటానికి ఇంకొన్ని నెలలు పట్టి జనవరి 26 , 1950 భారత దేశము ప్రపంచం లో అతిపెద్ద గణతంత్ర దేశం గా అవతరించింది.

అదీ కధ అని నేను క్లుప్తం గా చెప్తే విని జాతీయ ఝండా లోంచి నాలుగు పూలు, అక్షింతలు నెత్తిన వేస్కొని , రెండు చాక్లెట్లు నోట్లో వేస్కొన్న దేశ భక్తులందరినీ భారత మాత చల్లగా చూస్తుంది.

జైహింద్ !!

22, జనవరి 2011, శనివారం

ఇక్కడ అవసరం, సౌకర్యం, విలాసం అన్నీ ఒకటే


1993 ఫిబ్రవరి ఒకటో తారీకు సోమవారం సమయం ఉదయం పదకొండు గంటలు, ఆఫీసు లో ఉన్నా పని చేసుకుంటూ , ఆర్ధిక సంవత్సరం చివర్లో ఉండటం వల్ల కొంచం పని వత్తిడి ఎక్కువున్న రోజులు. అయినా నా మనసులో తొలిచేస్తున్న ఆలోచన ఒకటి ఉంది, అది ఇంకో వారం రోజుల్లో, అంటే రాబోయే ఆదివారం మా మొదటి పెళ్లి రోజు. సినిమాల్లో శోభన్ బాబు చేసినట్లు, నవల లలో కృష్ణ చైతన్య చేసినట్లు మొదటి పెళ్లి రోజుకు హీరోయిన్ కు ఏదో బహుమతి కొని సంభ్రమాశ్చర్యాలలో ముంచేసి, ఆనక పైకి తేలాక నా వంక చూసే మెచ్చుకోలు చూపుకై ఆశ పడి ఏదోటి కొనాలి అది పెద్ద ఖరీదు ఉండకూడదు, (నేను కొనలేను కాబట్టి) పెద్ద సైజులో ఉండ కూడదు (దాచి ఆరోజు చూపాలి కాబట్టి) తనకి లేనిదేదో కొత్తది అయి ఉండాలి (సంభ్రమము + ఆశ్చర్యమూ కలిగించాలి కాబట్టి) ఇలా మధనపడుతూ ఉన్నా.

చివరకి బంగారం అయితే బెస్ట్ ఎప్పటికీ పడి ఉంటుంది, ఆడాళ్ళకి ప్రీతికరమైనది,(PWO వాళ్ళూ నన్ను క్షమించాలి) పైగా మన డబ్బుకి విలువ కూడా పెరుగుతూ ఉంటుంది అని ఆర్ధిక శాస్త్ర వేత్త లా అలోచించి బంగారానికే మొగ్గు చూపా. వెంటనే కార్యాచరణ లోకి దిగా . సొంత పనులన్నీ ఆఫీసు టైములోనే చేసుకోవాలన్న సాంప్రదాయం ప్రకారం తిన్నగా బ్యాంకు కి వెళ్లి ఖాతా లో ఉన్నా ఆరు వేలు క్రెడిట్ బాలన్సు లోంచి మూడు వేలు , ఫెస్టివల్ అడ్వాన్సు పెడితే వచ్చే రెండు వేల అయిదు వందలూ , ఇంకా ఎమన్నా అవసరమైతే ఆ పైవాడు ఉన్నాడు అన్న ధైర్యం జేబులో డబ్బులు పెట్టుకొని. నిశ్చింతగా ఆఫీసు చేరుకొని పని చేసుకున్నా.

సాయంత్రం ఆఫీసు అయ్యాక ఒక్కడినే బంగారం కొట్ల మీదకి రైడు కెల్లా. అప్పటికింకా మా విజయవాడ లో బంగారం రెడీమేడ్ కొట్లు ఎక్కువ లేవు. మాఘమాసం అవటం వల్ల పెళ్ళిళ్ళ సందడి బాగా ఉంది ఉన్న నాలుగైదు రెడీమేడ్ బంగారం కొట్లు కిట కిట లాడుతున్నాయి. బాగా డబ్బు చేసిన వాళ్ళతో, తప్పక అప్పుచేసిన వాళ్ళతో బంగారం షాప్ లో కాలు పెట్టే ఖాళీ లేకుండా ఉంది. వెళ్ళిన పావుగంటకి ఒక కౌంటర్ ఎదురు కుర్చీ ఖాళీ అయితే నాకు అవకాశం వచ్చింది. నా దగ్గరున్న డబ్బులకి అప్పటి రేట్ ప్రకారం రెండు తులాలకి మించి ఏమీ రావు. కాబట్టి ఒక బ్రెస్లేటో, చెవి దిద్దుల జతో, లేక ఇద్దరికీ ఉంగరాలో ఏదోటి కొందామని నా ఆలోచన. అదే చెప్తే షాప్ అబ్బాయి బ్రేస్లేట్లు చూపించాడు. అందులో నాకు నచ్చిన ఒకటి ఎంచుకొని దానికి రేట్ చూసి బిల్ తయారు చెయ్యమని చెప్పి ,నుదుటి మీదకి జుట్టు రింగు లాగి, జేబుల్లో చేతులు పెట్టుకొని నుంచున్నా శోభన్ బాబు లా. అక్కడున్న అద్దాలలో నాకు నేనే పెద్ద హీరో లా అనిపించా.

సెలక్షన్ అయితే పావుగంట లో అయింది కానీ బిల్ మాత్రం అరగంట అయినా వేయలేదు. కారణం నాకన్నా డబ్బు చేసిన పెద్ద పెద్ద బిల్ గేట్లు చాలా మంది ఉన్నారు. అంటే నాలుగు జతల గాజులు, నెక్లస్ లు, వడ్డాణాలు వంకీలు కొని నలభై యాభై వేల బిల్లులు చెల్లించే వాళ్ళ మధ్య నా నాలుగు వేల మూడు వందల మొత్తం వాళ్లకి పెద్దగా ఆనలేదు.


అలా ఆ పెద్ద మొత్తాల వాళ్ళని చూస్తుంటే నాకు కొంచం చిన్నతనం వేసింది. నాకూ అలా అయిదు అంకెల బిల్లు కడుతూ షాపాయన మెచ్చుకోలు చూపులు, పక్క వాళ్ళ అసూయా (నాలాగా) బాణాలు గుచ్చుకుంటుంటే మహా సమ్మగా ఉండి, ముసి ముసి గా లోపల్లోపల నవ్వుకుంటూ పైకిమాత్రం ఇవన్నీ నాకు చాలా చిన్న విషయాలన్నట్టు నిర్లక్ష్యం గా నుంచో వాలి అని అనిపించింది. కానీ అప్పటికి అది సాధ్యం కాని విషయం.

ఏది ఏమైనా నా బిల్ నేను కట్టేసి కొంచం సిగ్గుగా వంగి,నే కొన్న వస్తువు జాగ్రతగా టక్ చేసిన షార్ట్ జేబులో వేసి నా మోటార్ సైకిల్ మీద ఇంటికేల్లిపోయా. కానీ అప్పటినుంచి అదో జబ్బులా అలా పెద్ద పెద్ద షాపుల కెళ్ళి పెద్ద పెద్ద వస్తువులు కొని నిర్లక్ష్యం గా ఒకా కాలు అడ్డం గా పెట్టి, ప్యాంటు జేబులో ఒక చెయ్యి పెట్టి నుంచోవాలన్న కల మాత్రం నన్ను వెంటాడు తూనే ఉంది.


ఆ కల నా వయసుతో బాటు పెరుగుతూ, నా జుట్టులో తెల్ల వెంట్రుకల్లా వ్యాపిస్తూ , నా బట్టతలా లా అభివృధి చెందుతూ, వచ్చింది. అలా పంతొమ్మిది ఏళ్ళలవుతోంది నా పెళ్ళయి. ఇప్పటికీ ఆ కల మాత్రం చెదరలేదు, మరవలేదు.


కట్ చేస్తే సంవత్సరం 2011 :

నిన్న ఆఫీసు లో ఉంటే వచ్చేటప్పుడు కూరలు కొని తీసుకురా అని మా ఆవిడా ఫోన్ చేసి చెప్పింది. మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ వెళ్తే రెండు లీటర్ల పెట్రోల్ కారు తాగుతుంది, ఆ తాగుడు ఖర్చు అక్షరాల నూట ముప్పై రూపాయలు కాబట్టి, ఆవిషయం కూడా హెచ్చరించి మరీ ఒదిలింది.


నాలోని అమర్త్య సేన్ కూడా నిజమే అని ఒప్పేసుకొని, ఆఫీసు అయ్యాక బుద్దిగా మా ఇంటికెళ్ళే రోడ్ లోని ఒక మార్ట్ కేసి దారి తీసాడు. అక్కడయితే పార్కింగ్ సమస్య ఉండదు, ఎక్కువ నడవకుండా కూరగాయలన్నీ కోనేయచ్చని. సాధారణంగా రకానికో కిలో చొప్పున ఒక ఆరు ఏడు రకాల కూరలు, ఆకు కూరలు, మిర్చి, అల్లం, కర్వేపాకు, కొత్తిమీర, పుదీనా కొని, వాటితో పాటు ఒక రెండు కిలోల ఉల్లిపాయలు, ఇంకా ఎమన్నా విచిత్ర మైన ఊదా రంగు కాబెజ్, లాంటికూరలు కొంటాను. వాటి విలువ నూట యాభై దాక అయ్యేది.

నిన్న కూడా అలాగే కొనేసా ట్రాలీ తోసుకొచ్చి బిల్ చేయిస్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళు కొంచం దూరం జరిగి నాకు దారి ఇచ్చి నా వంక వింతగా చూడటం గమనించా. సర్లే ఏదోలే అని సర్దుకొని బిల్ ఎంత అంటే రూ.412 /- అన్నాడు. వామ్మో అనుకున్న. బిల్ చేసాక తప్పేదేముండీ అని, డబ్బులు కడుతుంటే ఒక్కస్సారి గుర్తోచింది ఫ్లాష్ లా నా కల. ఎన్నేళ్ళ గానో నాతో పాటు పెరుగుతూ , నాలో ఇమడ లేక ఎప్పుడు బయట పడదామని తన్నుకుంటున్న నా బంగారు కల. జేబులో చెయ్యి, ఒక కాలు కొంచం వంకర గా పెట్టి నుంచోవటం, రెండు గుండీలు ఒదిలేసిన చొక్కా, నిర్లక్ష్యం గా నుదిటి మీద అల్లరిగా పడే జుట్టూ( లేదులే), ఎంత బిల్లయినా పర్లేదు నాకు లెక్క లేదు అన్న ఉదారం. ఎస్ స్స్ అదే నా కల నిజమైంది.
ఇలా కాయగూరల దగ్గర.
నా చేతిలో అయిదు వంద నోట్లు ,
అసూయ నాచుట్టూ ఉన్న కొంతమంది కంట్లో,
చిన్నగా విసిల్ నా నోట్లో.

యాదృచ్చికం : ఇది రాస్తుంటే నా కసిన్ దగ్గర నుంచి ఒక ఎస్ ఎం ఎస్
:
"First time in the history of mankind,
Need, Comfort, and Luxury sold at same price in India !!
Onions=Rs65, Petrol=Rs65 and Beer=Rs.65 "

సెహబాస్ భారత దేశమా, అవసరం, సౌకర్యం, విలాసం అన్నీ ఒకే ధర బాగు బాగు !!

10, జనవరి 2011, సోమవారం

చ ఉ వ్యా బే ?


ఆఫ్ఘన్ భాషలో తిట్టానని కోంపడకండి !! దాని అర్ధం
అ) చదువు - ఆ) ఉద్యోగం - ఇ) వ్యాపారం -
ఈ) బేవార్స్
ఏదో కేబీసీ లో ఆప్షన్స్ ఇచ్చినట్లు ఉందికదా? నేను చదువుకునే రోజుల్లో నాకున్న వివిధ ఐచ్చికాలు. అలా అనగానే చదువుకునే రోజుల్లో నాకు ఉద్యోగం వచ్చిందనో, లేక మా కుటుంబ వ్యాపారం చూసుకోమని మా పెద్దలు ఆఫర్ చేసారనో అనుకోకండి. అప్పట్లో కాంపస్ రిక్రూట్మెంట్స్ లేవు అసలు ఉద్యోగాలే కరువు రోజులు, ఇకపోతే వ్యాపారం మా ఇంట వంటా లేవు, మా నాన్న ఒక ఉద్యోగి మీదు మిక్కిలి నేను కూడా బాగా చదువు కొని మంచి ఉద్యోగం చెయ్యాలనే జి.ఓ కూడా మా ఇంట్లో అమలు లో ఉండేది.

ఇంకా నాకు ఉన్న ఆప్షన్లు ఏమి మిగిలాయి? అ) చదువు ఈ) బేవార్స్. ఇరవై ఏళ్ళ వయసులో వచ్చే జ్వరానికి చదువు ఒక
చేదు మాత్ర.
అంచేత ఆఖరి ఆప్షన్ ఈ) బేవార్స్ ఒక్కటే మిగిలింది. నిజం గా భలే మత్తుగా ఉండే ఆప్షన్. ఈ బేవార్స్ లో ఉన్న సుఖమేంటంటే ఏమీ చదవ కుండా, గాలికి తిరుగుతూ, ఫ్రెండ్స్ తో కబుర్లు, సినిమాలు, అప్పుడప్పుడు కంటికి నచ్చిన అమ్మాయి కనపడితే కోర చూపు విసరటం ( అంత వరకే ), అప్పట్లో బేవార్స్ అంటే చాలా వరకూ అంతే. ఇప్పుడైతే ఇంకా కొన్ని కలిసాయి, మందు, బాగా సరళీకరించబడిన సామాజిక ప్రవర్తనా నియమావళి, ఇంటర్నెట్, అయితే ఇవన్నీ చేసే వాళ్ళు బేవార్స్ అని నా ఉద్దేశ్యం కాదు.

అయినా నా ఈ టపా ఉద్దేశ్యం ఒక మంచి కధని పరిచయం చేయటం.
శ్రీ శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారు నాకిష్టమైన రచయితల్లో ఒకరు .

గ్రాంధికం కాకుండా వాడుక భాష లో, కాకపోతే పాత తెలుగువారి వాడుక భాషలో ఉండి, బాగా పాత తెలుగు వాసన వచ్చే ఆయన కధా వస్తువులు, కధనం నన్ను ఎప్పుడూ అయన కాలానికి తీస్కెళ్ళి విహరింప చేస్తాయి. బామ్మ మడి తో దాచుకొన్న పాత ఉసిరికాయ, చింతకాయ తొక్కు బయటకి తీసి ఫ్రెష్ గా తిరగ మోత వేసినట్లు విశాలాంధ్ర వారు అయన రచనలని ఒక దశాబ్ద కాలం పైగా వెలుగు లోకి తెచ్చారు. శ్రీపాద వారి రచనలు ఇంకా ప్రాచూర్యం లోకి రావాలి. ఈ తరం తెలుగు భాషా ప్రేమికులకు, చదువరులకు అంతగా అందుబాటు లో లేవు.

అయన పుస్తకం లో శ్రీపాద గారి పరిచయ వాక్యాలలో ఇలా ఉంది "శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారు కవి, పండితుడు, వైద్యుడు,వర్తకుడు." వర్తకపు ధోరణి అయన కధలు రెండు మూడింటి లో బాగా కనపడుతుంది.

అందులో ఒక కధ "
నలుగుర్ని పోషిస్తున్ననిప్పుడు" . ఈ కధ రాసిన కాలానికి బ్రిటిష్ పాలనలోనే ఉంది భారత దేశం. నిరుద్యోగ సమస్య లేదు.

ప్రధమ పురుషలో సాగే ఈ కధా నాయకుడు చెప్పిన విధం గా ....

అమలాపురం లో పద్దెనిమిదో ఏట స్కూల్ ఫైనల్ పూర్తి చేసిన సీతారాముడు అరవై ఏళ్ళ విధవరాలైన తల్లితో రాజమండ్రి చేరి అక్కడ అతికష్టం మీద నగర సంఘం లోనెలకి పాతిక రూపాయల జీతం మీద చిరు ఉద్యోగి గా చేరతాడు. ఇన్నీసుపేట లో సూరీరావు గారనబడే ఒక బట్టల వ్యాపారి ఇంట చిన్న భాగం లో అద్దెకి దిగుతారు. ఆ వచ్చే కొద్ది పాటి జీతం తో జీవితం పొదుపుగా లాక్కోస్తుంటారు ఆ తల్లీ కొడుకులు. కొంత కాలానికి కొన్ని కారణాల వల్ల నౌకరీ పోయి సీతారాముడు దిగులు పడుతుంటే సూరీ రావు గారు అయన కొట్లో గుమస్తా గా చేర్చుకుంటారు.


మెల్లగా ఆ బట్టల కొట్లో వ్యాపార లావాదేవీలు నేర్చిన కధా నాయకుడు, ఆ కొట్లోనే ఉన్న ఒక ముస్లిం దర్జీ దగ్గర కుట్టుపని మెళకువలు కూడా బాగా నేరుస్తాడు.

దాంతో దశ తిరిగి ఇంతై, వటుడింతై నట్లు ఆయన దర్జీ గా , బట్టల కొట్లో భాగస్వామిగా పెరిగి మంచి సంపాదన పరుడవుతడు. ఆనక ఆయన్ని ప్రోత్శహించిన సూరిరావు తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేసి స్నేహాన్ని బంధుత్వం గా మార్చుకుంటారు. ఈ కధలో చదువైన దగ్గరనుంచి వ్యాపారం లో లాభించే స్థాయి దాక సీతారాముడి కష్టం పట్టుదల చాలా సరళం గా నైనా మనసుకి హత్తుకు పోయేలా రాసేరు శ్రీపాద వారు. ఉద్యోగ వ్యవసాయ, వ్యాపారలనేవి ఎ ఒక్కరి సొత్తు కావు ఎవరు ఏ పనైనా చెయ్యొచ్చు. కష్టపడే నైజం, కొద్దిపాటి తెలివి ఉండాలే గానీ ఎ ఉద్యోగం ఇవ్వలేని సంపాదన, తృప్తీ వ్యాపారం ఇస్తుందనీ, కులానికి బ్రాహ్మణుడైన సీతారాముడు వ్యాపారం లో ఎలా నిలదొక్కుకున్నాడో చెప్పే ఈ కధ ఇప్పటికీ ఎంతో మందికి మార్గదర్శకం.

చదివిన చదువుకు వచ్చిన ఉద్యోగం సరైన ప్రతిఫలం ముట్ట చెప్పలేక పోతే ఏమి చెయ్యాలో, ఏమి ఒదలాలో, ఏమి పట్టుకోవాలో సూటిగా చెప్పే ఆ కధ నా కాలేజి రోజుల్లో చదివా, అది బాగా నాటుకుపోయింది, టపా మొదట్లో ఉదహరించినట్లు చదువా ? ఉద్యోగమా? వ్యాపారమా? అన్న స్థితి లో నేను డిగ్రీ చదివే రోజుల్లోనే చాలా చిన్న స్థాయి వ్యాపారం చేసేవాడిని. మా అమ్మ నాన్నలు, అమ్మమ్మ మొదలగుగా పెద్దలు బట్టలు కొనుక్కోమని ఇచ్చిన డబ్బులు పోగేసి వాటితో పాతికేళ్ళ క్రితం 80' ల్లో బాగా మోజు లో ఉన్న విడియో కాసేట్ అద్దెకి తిప్పే వ్యాపారం చేసేవాడిని. ఆ పని నేను ప్రత్యక్షం గా చేయకుండా నా డబ్బులతో కొన్న కేసెట్ల ని ఒక విడియో కొట్లో ఇచ్చేవాడిని, అయన ఒకో కాసేట్ కి ఇరవై రూపాయలున్న అద్దె లో సగం ఇచ్చేవారు. ఏదో బానే ఉండేది, నా ఖర్చులకి సరిపడా. కాక పోతే ఈ విషయం పెద్దలెవరికీ తెలియ నిచ్చే వాడిని కాదు, తిడతారనే భయం తో.


ఈనాటి పరిస్థితులకు ఈ కధ ఎంతగా వర్తిస్తుందో, కానీ సుమారు డెబ్బై ఎనభై ఏళ్ళ క్రితం శ్రీపాద వారి తెగువ రచనా పరంగా నైనా సరే నాలాటి వాళ్లకు శిరోధార్యం.

7, జనవరి 2011, శుక్రవారం

విజయవాడ పరిచయపత్రం (ప్రాస్పెక్టస్)


మా ఊరుకి నేను ఇల్లరికపు కొడుకుని. కొత్త మాటలా ఉందని తప్పు పట్టకండి.మా అత్తారూరు విజయవాడ కాదు కాబట్టీ , గత ఇరవై ఒక్క ఏళ్ళగా ఇక్కడే ఉంది పోయా కాబట్టీ ఇల్లరికపు కొడుకు సరైన మాటే.

ఉద్యోగరిత్యా ఒకే ఊర్లో ఉండటం వరమా ? శాపమా? నాకైతే ఇప్పటికీ తేల్చుకోలేని స్థితి. ఒకరకంగా వరమే. కరెంటు కోత, మంచి నీళ్ళ ఎద్దడి, వేరే ఏ రకమైన ఇబ్బందులూ లేని మా విజయవాడ లో దిగ్విజయంగా ఇప్పటికి 21 ఏళ్ళ పైగా సర్వీసు పూర్తి అయింది, ఇంకో పదిహేను సంవత్సరాల రెండు నెలలు మిగిలి ఉంది.

నేను ఊరు మారాలంటే ఒకే మార్గం ప్రమోషన్ మీద వెళ్ళటమే, అలా మారాల్సి వస్తుందని దాని వంకే చూడని నేను హాయిగా ఇక్కడే ఉండి పోయా. కొంచం వేడి ఎక్కువైనా మంచి వాతావరణం, విద్యా , వైద్య వసతులు బాగుండి ,అన్నిటి కన్నా మంచి మనుషుల మధ్య బతకటం అలవాటై పోయి నాకు విజయవాడ ఒదిలి వెళ్లాలని లేదు.

ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసేవాళ్ళు బాంకుల్లో పని చేసే అధికారులు బదిలీల మీద బదిలీలు అవుతూ రెండు మూడేళ్ళకో ఊరు వెళ్తూ రకరకాలా భాషలు సంస్కృతులు చవి చూస్తూ ఎదిగి పోతూ ఉంటె నేను మాత్రం ఒకే ఊర్లో ఉంటూ ఒకే భాష మాట్లాడుతూ( అది కూడా సరిగ్గా రాదు) పొరుగు రాష్ట్రము వెళ్తే ఏమి మాట్లాడాలో తెలీక తెల్ల మొహం వేస్తానని ఇప్పటికీ మా అన్న మూడు భాషల్లో బూతులు తిట్టి మరీ చెప్తాడు. ఏమి చేస్తా అది నా ప్రారబ్ధం. అందరికీ అన్నీ కుదరద్దూ.. ఒకవేళ ఆరాటాల పోరాటాల కారణం గా రాష్ట్రము తెలంగాణా, సీమ, కోస్తా, ఉత్తరాంధ్రా, ఇలా ముక్కలైతే నాలాటి వాడికి ఇక ఇబ్బంది ఉండదు. నాలుగైదు రాష్ట్రాల లో ఇంచక్కా తెలుగే మాట్లాడి నెగ్గుకు రాగలను.

ఇక పోతే మా విజయవాడ లో ఉన్న అదనపు సౌకర్యాలు మంచి సినిమా హాళ్ళు, ఇప్పుడిప్పుడే వెలుస్తున్న షాపింగ్ మాల్స్, ఒకట్రెండు థీమ్ పార్కులు, లెక్కలేనన్ని మంచి టిపిని సెంటర్లు, పెద్ద రైల్వే జంక్షను, అన్ని ప్రాంతాలకూ బస్సులున్న బస్టాండ్, మంచి రోడ్లు రోడ్ మీద పెరిగిన ట్రాఫిక్కూ. ఊరు చుట్టూ పొలాలు, కొండలూ, మామిడి తోటలు,ఒక వైపు కృష్ణమ్మా, వీటన్నిటి పైన అండగా కనకదుర్గమ్మ... పది మైళ్ళు వెళితే మంగళగిరి పానకాల స్వామి. ఎంత ప్రమోషన్ ఇస్తే మాత్రం ఇన్ని హంగులూ అండ దండలూ ఉన్న మా బంగారు విజయవాడ ని ఒదిలి ఎలా వెళ్లనూ ? అందుకే మరి కొంత కాలం ఇక్కడే ఉండ దల్చుకున్నా.

నెలకో సారి పని వత్తిడి కి చిరాకేస్తే ప్రకాశం బారేజ్ దాటి గుంటూరు జిల్లాలోకి తొంగి చూసి, అమరావతి రోడ్ కేసి వెళ్తే దారి పొడుగుతా పచ్చని పొలాలు, దాంట్లో పనిచేస్కుంటున్న రైతులు, అమరావతి లోకి అడుగు పెడితే వినిపించే ఆ పరమశివుడి జేగంట, పక్కనే గలగలా పారే కృష్ణమ్మా, అది దాటి వెళ్తే వచ్చే చిన్న చిన్న లంకలూ...సత్యం శంకరమంచి ఏమి చూసి పరవశించి అమరావతి కధలు రాసారో చెప్పకనే చెప్తాయి.

కొండపల్లి వెళ్లి ఖిల్లా మీంచి కిందకి చూస్తె కనపడే చిన్న చిన్న పెంకుటిళ్ళు, మనుషులు , వాహనాలు, ఆ కొండపల్లి బొమ్మల తయారీకి ప్రేరణ ఏంటో చెప్తాయి. అక్కడ ఉన్న శిధిలాలలో తిరుగుతూ ఆ రాతి తిన్నెల మీద కూర్చుంటే కలిగే రాజ ఠీవీ, దర్జా ముందు ఏ పదవైనా బలాదూరే. కొండ పల్లి ఖిల్లా ఎక్కాలంటే అందరూ కార్లోనో బండి మీదో ఘాట్ రోడ్ మీద వెళ్తారు కానీ అసలు మజా కావాలంటే బుద్దిగా మన వాహనం కొండ కింద నిలిపేసి. అడ్డం గా ఆ కొండ ఎక్కటమే సరైన పద్ధతి. కాకపోతే కాళ్ళకి ట్రెక్కింగ్ షూస్, పక్కన మనతో సమానం గా స్పందించగల స్నేహితుడూ, ఇద్దరి మధ్యలో భావ సారూప్యం ఉన్న విషయ పరిజ్ఞానం ఉంటే రోజులో నాలుగు సార్లు ఎక్కి దిగొచ్చు. మీకు ట్రెక్కింగ్ అభిలషణీయం కాదా ఒదిలేయండి. బండి మీదే వెళ్లి పైన కూర్చొని అలా చూస్తూ ఉండండి చాలు. మిగతాది ప్రకృతే చూస్కుంటుంది.

అసలు అంత దూర మెందుకూ.. ఆయాసం అంటారా నగర నడి మధ్యలో ఉన్న మొగల్రాజ పురం లో కొండ మీద ఒరిజినల్ దుర్గమ్మవారు ఉన్నారు, అంటే దుర్గమ్మ మొదట గా పదం పెట్టిన పీఠం, అక్కడ గుడి ఉంది, పచ్చని పౌర్ణమి రోజు ఆ కొండ నడిచి ఎక్కి (నడిచే ఎక్కాలి ఇంకో మార్గం లేదు) అక్కడ అమ్మకి దండం పెట్టుకొని, ముఖాన కుంకం బొట్టేట్టుకుని,కొబ్బరి ముక్కలు తింటూ చీకటి పడేదాకా కూర్చుంటే నిండు పాల బిందె తొణుక్కుంటూ వస్తుంటే తెల్లని పాలు చిమ్మినట్లు, చల్లని వెన్నెల చిమ్ము కుంటూ చందమామ వస్తాడు. చూస్తూ కూర్చుంటే నడి నెత్తిమీదకి వచ్చిన సంగతి కూడా తెలీదు. ప్రయత్నించండి...

వేసవి లో చల్ల గాలుల నిచ్చే కృష్ణవేణమ్మ ఘాట్లు, ఆవల కెళ్తే సీతానగరం లో ఉన్న స్వాములార్ల ఆశ్రమాలూ, గుళ్ళూ.. ఇసక తిన్నెలూ ..ఒకటేమిటీ.. ఎన్నో మా విజయవాడ లో. మీకో సంగత్తెలుసా కృష్ణ ఒడ్డున గట్టున కూర్చొని కాళ్ళు నదిలో వేసి ఆడించుకుంటూ టైం వేస్ట్ చేస్తుంటే, ఎంత వేస్ట్ చేసామో మనకే తెలీదు. సత్తె పెమానికం గా చెప్తున్నా నే చాలా సార్లు చేసా ఆపని. మీకు ఈత వస్తే మొలలోతు నదిలోకి దిగి ధైర్నం చేసి ఇంకొంచం ముందుకెళ్ళి బారలేస్కుంటూ ఆవలి కెళ్లటానికి ఆలీసం ఎందుకు?

మీకు తిండి మీద మంచి అభిరుచి ఉందా.. మా ఊళ్ళో ఎన్నో మంచి హోటళ్లు ఉన్నాయ్ . అప్పుడెప్పుడో స్వచ్చమైన నెయ్యేసి ఇడ్లీలు, పెసరట్టుప్మా లూ పెట్టేవారట, ఇప్పుడూ అక్కడక్కడ వాసనలోస్తాయి. నాకైతే ఎన్నో ఏళ్ళ తరబడీ పేరు మోసిన హోటళ్ళ కన్నా , రోడ్ పక్క బండి హోటళ్లు భలే మంచి టిఫిన్ పెడతాయి అనిపిస్తాయి. ఆవిర్లుకక్కే ఇడ్లీలు, వేడి వేడి దోశలు, ఉబ్బెత్తుగా ఉన్నాయికదాని పొడిస్తే వేడి సెగతో వేళ్ళు చురుక్కుమనిపించే పూరీలు, అందులోకి కొబ్బరి చట్నీలు, బంగాల దుంప కూరలూ.. రోడ్ మీద నుంచొని తింటున్నామనే స్పృహ ఒదిలేస్తే మహా రుచి గా పెట్టగల టిక్కీ హోటల్లు ఎన్నో ఉన్నాయి. వన్ టవున్ లో మార్వాడి తిళ్ళు భలే ఉంటాయి. అసలు విషయం చెప్పక పోతే ఆనక తిడతారు మా విజయవాడ మిరపకాయ బజ్జీలు, చిన్న చిన్న పునుకులు ఇంకెక్కడా దొరకవు కావాలంటే పైపందెం లో మా బీసంట్ రోడ్ రాసేస్తా అంత ధైర్యం నాకు ఈ విషయం లో...

బట్టల కొట్లైతే ఇంక చెప్పక్కర్లేదు. అందరు బ్రదర్సూ తమ తమ కొట్లని ఇక్కడ తెరిచారు. సిస్టర్స్ కి బోలెడు తగ్గింపు నిస్తూ.... కోరుకోవటం ఏరుకోవటం ఇక మన ఇష్టమే. బంగారమూ మినహాయింపు కాదు, ఖాన్లూ, ఖజానాలు, కీర్తులూ ఇలా ఎన్నో పేరుమోసిన దుకాణాలు. అయినా మా వన్ టవున్ బంగారం పని వాళ్ళ చేతుల్లో మంచి కళ ,నమ్మకం ఉంది.

కక్షిదారుల శ్రేయస్సు కోసమే హై కోర్ట్ బెంచ్ ఏర్పాటు చెయ్యమని ఆందోళన చేసే లాయర్లూ, లెక్కకి మిక్కిలి డాక్టర్లూ, సందు సందు కీ ఉన్నారు . మాఊర్లో డాక్టర్ల కోసమైతే ఒక రోడ్డే ఉంది అయితే దానిపేరు నక్కలరోడ్, ఎందుకో అడక్కండి నాకూ తెలీదు.

సినిమా హాళ్ల విషయాల కొస్తే ఇక తిరుగే లేదు, కొత్త సినిమా వస్తే పొద్దున్నే ఆరింటికే మీరు బోలెడు హడావిడి చూడొచ్చు, ఇంకేం పని లేదన్నట్టు అక్కడే తచ్చాడే అభిమాన సంఘాలనీ చూడొచ్చు.

ఇన్ని చక్కని వసతులు ఉన్న మా విజయవాడ భూతాల క్షమించాలి భూతల స్వర్గం.

ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్పానో అర్ధం అయిందా? ఏ తెలంగాణ నో వస్తే పెట్టుబడీ దారులూ, భూస్వాములూ, విద్యావ్యాపారులూ, రియల్ ఎస్టేట్ ఆసక్తి దారులూ, సినిమా వాళ్ళు మా విజయవాడ రండి.
ఇక్కడ జమిలి గా పెట్టుబడి పెట్టండి లాభాలు పొందండి, మాక్కూడా పంచండి.
విన్ విన్ ఫార్ములా అన్నమాట.