25, డిసెంబర్ 2011, ఆదివారం

స్మరణ కంటే ఆచరణ మిన్న....


Matthew 7:21-23

“Not everyone who says to me, ‘Lord, Lord,’ will enter the kingdom of heaven, but the one who does the will of my Father who is in heaven.

On that day many will say to me, ‘Lord, Lord, did we not prophesy in your name, and cast out demons in your name, and do many mighty works in your name?’ And then will I declare to them, ‘I never knew you; depart from me, you workers of lawlessness.’


మతమేదైనా , ప్రాంతమేదైనా , ప్రజలెవరైనా...

ఇప్పటి కాలనీతి, ప్రాంతరీతి,ఒకటే ..

అవినీతి మీద ధ్వజమెత్తుదాం,పోరాడుదాం, ఎదురెత్తుదాం.

అంత మేమో కానీ తగ్గిద్దాం
కనీసం అవినీతి వ్యతికర పోరాటానికి మద్దతిద్దాం.
అదే నిజమైన పండగ !!
అదే భువికేతేంచిన దైవ కుమారునికి సరైన నివాళి.
క్రిస్టమస్ శుభాకాంక్షలు !!

ఓ కల్కీ టైమైంది ఇంక రా..


శని వారం మధ్యాన్నం, చాలా రోజులకు మధ్యాన్నం మూడింటికి పావు గంట ముందే ఇంటి కొచ్చేసా..
నా పిఏ క్రిస్టమస్ మూడ్ లో ఉండటం వల్ల, ఇంటికెళ్ళి పోదాం సర్ అంటే..సరే నని.
మా ఆవిడా, సెలవలకి వచ్చిన మా అమ్మాయి బయటకి వెళ్ళటం వల్ల ఒంటరిగా ఉన్న నేను
టీవీ లో చానల్స్ తిప్పుతుంటే జెమినీ లో మధ్యాన్నం 3 30 గం లకి బ్రోకర్ సినిమా అని ప్రకటన..
హాల్ కెళ్ళి చూసే అలవాటు, టీవీ లో కూడా పూర్తిగా చూసే సహనం లేని నేను ఎప్పటినుంచో చూద్దామనుకున్న ఈ బ్రోకర్ ను చూడటానికి రెడీ అయ్యా ..
కానీ 3 కి కరెంట్ పోతుంది.
ఎలా చూడాలా అనుకుంటుంటే కరంట్ పోయింది.
పుస్తకం తో కాలక్షేపం చేస్తుంటే గిర్రున అరగంట తిరిగి
సరిగ్గా మూడున్నరకి ఏ దేవి వరము నీవో .. అన్నట్టు కరెంట్ వచ్చేసింది.
బ్రోకర్ సినిమా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం లో రూపొందింప బడింది.
సరిగ్గా మన రాష్ట్రము లో, కాదు కాదు దేశం లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకి
అద్దమే ఆ బ్రోకర్ సినిమా అనిపించింది.

వందలు
వేలు అసలు గుర్తులేవు
లక్షలు కనుమరుగయ్యాయి
కోట్లు కూడా వందల్లో వేలల్లో సంపాదిస్తున్న ఈ రోజుల్లో
ఆ సినిమా చూసి ఎవరన్నా మారతారా ?
దర్శకుని అత్యాశ.
అయినా ...
నాకు ఆ సినిమా బాగా నచ్చింది
ఒక బక్క పీసుగాడు వందమందిని తన్నే సీనులు లేవు
హీరోయిన్కి, హీరోకి ఉస్కో ఉస్కో మనే కులుకుడు పాటల్లేవు.
ఆ సినిమా ఉన్నదల్ల నగ్న ప్రదర్శన, మన అవినీతి యంత్రాంగ జీవన అంగాంగ నగ్న ప్రదర్శన.

అవినీతి మన వ్యవస్థ లో ఎంతగా వెళ్ళూనుకు పోయిందో...
మన జీవితాల్లోకి నవలలు,సినిమాలు, టీవీ సీరియళ్లు, 24గంటల వార్తా ఛానళ్ళు,
సెల్లుఫోనులు, పిజాలు బర్గర్లు, చైనా నాసివస్తువులు, ఐమాక్సులు,
ఎంత నిశబ్దంగా ప్రవేశించి పెనవేసుకుపోయాయో
అంతకన్నా ముందు నుంచే ఇంకోటి దూరిపోయి మనకన్న ఎక్కువ
మనతో జీవిస్తోంది.
మన జన జీవన స్రవంతిలో టంకం పెట్టినట్లు అతుక్కుపోయింది.
అవినీతి
ఎంత మంది మేధావులు, నాయకులు, అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు,
కళాకారులు, ఈ అవినీతి మీద ఉపన్యాసాలు ఇచ్చినా
కొండొకచొ .. ఎక్కడో ఒకచోట తప్పని సరిగా తల వంచే
బలమైన అంకుశం.

మనతో కలిపి మన చుట్టూ ఉన్న కోట్ల మంది ప్రజలు

తిట్టుకుంటూ, అసహ్యించుకుంటూ ప్రోత్సహిస్తున్న ఏకైన క్రీడా వినోదం.

ఇదివరకెన్నడో చట్టపరమైన నేరం చెయ్యవచ్చునా, న్యాయ పరమైన నేరం చెయ్యవచ్చునా అనే అమాయక చర్చలు జరిగేవి,

ఇప్పుడవేమీ లేవు. ఉన్నదల్లా ఒక్కటే
ప్రజల వైపునుంచీ చూస్తే ఎంత తక్కువ లంచాలతో పని చేయించు కోగలమా

అధికార యంత్రాంగం, నాయకుల వైపునుంచీ చూస్తే,
ఏ పక్క నుంచి ఎంత ఎక్కువ డబ్బు పిండుకో గలమా...
ఎంత ఎక్కువ అధికార దుర్వినియోగం తో పబ్బం గడుపుకోగలమా..
అన్న ఆరాటమే.

కొన్నేళ్ళ క్రితం మా అమ్మాయి హై స్కూల్లో ఉండగా అడిగింది,

"ఎందుకు నాన్నా.. నువ్వు షాపింగ్ చేసేటప్పుడు ధరలూ అవీ బాగా పట్టి పట్టి చూస్తావూ..
ఎందుకు కొన్ని వస్తువులు దుబారా అంటూ కొట్టి పడేస్తావు ?
ఎందుకు కొంత మంది నాస్నేహితుల నాన్నల లాగా డబ్బు ఖర్చు పెట్టలేవు..? "

నిజమే నేను ఖర్చు విషయం లో బాగా జాగ్రత్తగా ఉంటాను అలాగని పిసినారి తనం చూపను.

ఎక్కడ అవసరమో అక్కడ, ఎక్కడ అనవసరమో అక్కడ ధర్మ కాటా పట్టుకోవటం నాకలవాటు.
కొంత మంది లాగా విచ్చలవిడి గా ఉండటానికి నాకు అవకాశం లేదు.
కాదు కాదు అవసరం లేదు
అవసరమని ఎందుకన్నానంటే
జీతానికి పది రెట్లు లంచగొండి సంపాదన ఉండి
దానితో ఎటువంటి స్థిరాస్తులు కొనలేక, దాచలేక

బట్టలూ, మెక్దోనాల్డులు, సెల్లు ఫోనులు,
గజ బైకులు , బినామీ లావాదేవీలు,
అవసరానికి మించి ఖర్చులు (నల్ల ధనం దాచలేరుకనక)
ఇలాంటివి లంచాలతోనే సాధ్యం.
ఇంకొందరు డబ్బు పరంగా తినలేని వాటిని వస్తు రూపంలోనో,
ఇంకేదో కోరికలు తీర్చుకునే సాధనలోనో ఉంటారు, ఎవరి బాధలు వాళ్ళవి.

మా అమ్మాయి ప్రశ్నకు అప్పట్లో సరైన సమాధానం నేను ఇవ్వలేక పోయాగానీ

కాల క్రమం లో మా అమ్మాయే అన్నీ తెలుసుకుంది.
ఇప్పుడు తనే నాకు చెప్పగలదు, ఏది మంచో ఏది చెడో.

ఎందరో అక్రమ సంపాదన పరుల జీవితాల్లో తొంగి చూడండి

ఏదో ఒక విషాదం పొంచి కనపడుతుంది.
డబ్బు, వస్తువులు ఇచ్చే సుఖాలకన్నా, అవి లంచాల ద్వారా సమకూర్చిన ప్రజల
రోదన
పెను శాపమై కాటేస్తుంది. ఒకతరం కాక పోతే ఇంకో తరం పై ఫలితాలు ప్రకటిస్తుంది,
అది ఎన్ని ఉపసంహారలకూ లొంగదు !!

బ్రోకర్ సినిమా లో కూడా అదే వేలెత్తి చూపారు.
నిర్మాతకు డబ్బు, దర్శకునికి పేరు సంపాదించా లేక పూయున్దోచ్చు

కనీసం ఈ సినిమాకు అవార్డ్ ఇచ్చే ధైర్యం, విశాల మనస్తత్వం కూడా ఏ జూరీ లేక పోవచ్చు.( నా దగ్గర సరైన సమాచారం లేదు)

కానీ ఒక నిజాయితీ అయిన ప్రయత్నం,

మార్పు కోరుకునే మనసు ఉన్న
ఆ చిత్ర సారధులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.


నమస్కారం.

చాలా రోజులతర్వాత మళ్ళీ బ్లాగ్ దుమ్ము దులిపా...
ఇన్ని నెలలుగా నిశబ్దంగా ఉండటానికి కారణాలేవీ లేవు.
ఆఫీసు పని వత్తిడి , వేరే విధంగా ధ్యాస మరలి ఉండటం, అనారోగ్యమో, మనసు సమయం లేక పోవటం ఇవేమీ సరైన కారణాలు కావు.
ఎంత పని ఉన్న నే వ్రాయదలుచుకున్న పది వాక్యాలూ కోసం ఏ అర్ధరాత్రో సమయం వెచ్చించ లేక పోలేను.కానీ ఎందుకో ఉదాసీనం ఆవహించింది.
ఎందుకు వ్రాయటం లేదు అని అడిగి నిద్ర లేపిన ఇద్దరు బాబాయిలకూ థాంక్స్ .
ఎన్నో టపాలు మనసులో సగం, సగం తయారు చేసి అవి.. వాటిని కంప్యూటర్ లోకి ఎక్కించ కుండానే మరుగేసా..
అలా నా బ్లాగ్ పేరు " లిపి లేని భాష.." గా సార్ధక నామధేయమయింది.
మళ్ళీ కలుస్తా అతి త్వరలో...

6, నవంబర్ 2011, ఆదివారం

ఇప్పుడు మళ్ళీ .. మరింత శక్తి తో..

Image courtesy cartoonstudio.com

రెండు నెలల నిశబ్దం తర్వాత, మళ్ళీ చెయిజేస్కొని బ్లాగ్ దులిపా. ఎందుకో పెద్ద ఖాళీ ఏర్పడింది. రెండు నెలలూ నా బ్లాగ్ జోలికి రాలేదు కానీ, అన్నీ బ్లాగులూ చదువుతూనే ఉన్నా. మనసు పుడితే కామెంట్లు కూడా రాసా. రెండు నెలలూ నా బ్లాగ్ లో పోస్ట్స్ వ్రాయటం కన్నా వేరే వాళ్ళ బ్లాగులు చదివి విసుర్లు, చతుర్లు వేయటం చేసాను. అలా చేయటం చాలా బాగుంది. బాగుంది అనటం కన్నా తేలిక అనటం సబబేమో. ఇద్దరు ముగ్గురు మిత్రులు నాకు ఇలాగే సెటిల్ అయిపో నీ అసలు రాతల కంటే కొసరు కోతలే బాగున్నాయి, మేమంతా సుఖ శాంతులతో ఉన్నాం అని కబురెట్టారు. ఖాళీలో బ్లాగ్ చదువర్లందరూ చాలా సుఖం గా ఉన్నారనిపించారని పించింది. నా గోల లేక మీరంతా నిశ్చింతగా ఉండటం నాకే మాత్రం ఇష్టం లేదు.
అందుకే మళ్ళీ వచ్చాను...
అదేదో వాణిజ్య ప్రకటనలోలా
సారి మరింత ....తో...
మరింత ఎక్కువ .... తో...
మరింత .. గా..
కాసుకోండి సారీ కోసుకోండి సారీ సూస్కోండి.!!

4, సెప్టెంబర్ 2011, ఆదివారం

ఐ లవ్ మై టీచర్స్....


పాపం మేగాలాన్ అయన సహచరులు సముద్రం లో ఓడ దారి తప్పి పోయి వారాలు గడచీ తిండి అయిపోయి ఆకలికి తాళలేక ఓడ లోని కలప ని రంపం తో కోసి ఆ పొట్టు తిన్నాడు. కధ విన్న వయసుకి నాకు మేగాలన్ స్పానిషా, పోర్చుగీసా తెలీదు అసలు ఆ దేశాలు ఉన్నాయని కూడా తెలీదు. ఉబుసు పోక సాయంత్రాలు మా అమ్మ హిస్టరీ పాఠాలు చెప్పేది...కొలంబస్, వస్కోడా గామా అంటూ.

వినటానికి నాకు బోలెడు కుతూహలం, అర్ధం కాని అమాయకత్వం, నాలుగేళ్ళ వయసు ఉన్నాయి.
కడుపు లోకి అన్నం పెడుతూ, ఇలాంటి విషయాలు బుర్ర లోకి పంపించేది..
" మేగాలాన్ ఎందుకు షిప్ లో తిరిగేడు ఏమి సాధించాడు అనే విషయం కన్నా...ఆకలికి తిండి లేక రంపపు పొట్టు తిన్నాడన్న విషయం జీర్ణం కాని విషయం. అందులో మనం కమ్మగా అమ్మ చేతి ముద్ద తింటూ.."

హిస్టరీ, దేశభక్తి కధలు సోషల్ టీచర్ అయిన మా అమ్మ చెప్తుంటే జాలి తో మనసు బరువేక్కేది.
నిజం నాలుగేళ్ళకి ఇలాటి ఫీల్ ఉంటుందా అని మీకనుమానం రాకపోతే మీరు మిగతాది చదవండి.
అలా నా మొదటి గురువు మా అమ్మ మాట వినపడే వయసు నుంచి, మాట్లాడే వయసు గుండా, మాట వినే వయసుదాక ఎన్నో మంచి విషయాలు నేర్పి, మాట వినని వయసులోకి పంపింది మా అమ్మ.

ఆక్కూరలు తింటే సర్కస్ వాళ్ళలాగా తయరవచ్చు. సర్కస్ లో చేరొచ్చు అంటూ తినే తిండి దగ్గర మొదలు పెట్టి జీవితానికి దూర పరుగులో (లాంగ్ రన్) అవసరమైన పాఠాలు నేర్పిన మా నాన్న నాకు అమర్స్త్య సేన్ లాంటి గురువు.



ఒకటో క్లాసు నుంచి నుంచి మొదలుపెట్టి నాకు చదువు చెప్పిన సరోజినీ టీచర్, సుశీల టీచర్, నాగరత్నం టీచర్, శాంతి టీచర్ నాకు అభిమాన గురువులైతే.

తెలుగు మీడియం లో చదివిన నాకు ఐదో క్లాస్ ఒక్క సంవత్సరం లోనే హై-స్కూల్ ఇంగ్లీష్ నేర్పిన మార్తమ్మ టీచర్ నాకు సదా స్మరణీయురాలు.
హిందీ నేర్పిన కుసుమా టీచర్ నా పాలికి మున్షీ.

ఆ తర్వాత హై స్కూల్ లో నేను పిల్లలను పిల్లలుగా చూసిన టీచర్లను చూడలేదు. కేవలం భుక్తి కోసం చదువు చెప్పే ఉద్యోగులను తప్ప.

వాళ్ళ వాళ్ళ కుటుంబ సమస్యలు, ఆర్ధిక పరిస్థితులూ ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు కానీ అవి వారు చెప్పే చదువు వాసి పైనా , చెప్పించుకునే విద్యార్ధుల పైనా ప్రభావం చూపకూడదు కదా అని నేను అనుకునే వాడిని. వాళ్ళలో వాళ్లకి కీచులాటలు, రాజకీయాలు, ప్రయివేట్ పోటీలు, పక్షపాత ధోరణులు ఇవన్నీ విమర్శిస్తే నేను విద్యార్ధి ని కాను. అవన్నీ నాకనవసరం స్కూల్ కెల్లామా, కూర్చున్నామా ఇంటికొచ్చామా అన్నట్టు ఉండేవాడిని. లోపల్లోపల రగిలి పోతూ.

డిగ్రీ కాలేజి రోజుల్లో క్లాస్ కి సరిగ్గా వెళ్లక పోయినాన దూరం నుంచే చూసి, ఆఖరి రోజు దగ్గరకి పిలిచి నీ తెలివి కి నువ్వు చదవాల్సిన విధానం ఇది కాదు అంటూ నెమలి ఈక తో కొట్టినట్లు చెప్పిన మిత్రాజీ గారు, శాస్త్రిగారు. నాకు ఇప్పటికీ గుర్తొచ్చే గురువులు.


లా కాలేజి లో నేను చదివినది రెండేళ్ళే అయినా చేరిన రోజే నా బాల్య స్నేహితుడు నన్ను చిన్నప్పటి పేరు తో బుజ్జి అని పిలవగానే క్లాస్ లో అమ్మాయిల తో సహా అందరూ నన్ను బుజ్జి పిలవటం తో మా సుధాకర్ సార్ కూడా బుజ్జి అనిపిలిచి, నేను సరిగ్గా వినటల్లేదని ప్రతీ పాయింటు నన్నే లేపి అడిగి, తద్వారా నేను క్లాస్ లో అలెర్ట్ గా ఉండేలా చేసి నన్ను స్నేహితునిగా చూసుకున్న మహానుభావుడు.

అసలు పది మంది కూడి ఉన్న చోట ఎలా చెప్తే అందరూ మన మాటే వింటారో అనే ముఖ్య లక్షణం నేను నేర్చుకున్నది ఆయన దగ్గరే.
అప్పుడప్పుడూ నాకో టాపిక్ ఇచ్చి నన్ను లైబ్రరీ లో ప్రిపేర్ అవమని నాతో నే క్లాసు చెప్పించి, తప్పులు దిద్ది నాకు సబ్జెక్ట్ ఒంట బట్టేలా చేసిన పుల్లా రెడ్డిగారు,

23 ఏళ్ళకి సెకండ్ ఇయర్ లా మానేసి ఉద్యోగం వచ్చిందని ఎగురుకుంటూ జేరిపోయిన నాకు, రెండు నెలల ఇన్ హౌస్ ట్రైనింగ్ లో క్రమశిక్షణ అంటే ఏంటో తెలియ చెప్పి, ఉద్యోగమంటే ట్రైనింగ్ హాస్టల్ కాదు, సరదా కాదు, గీతాంజలి పాటలు కాదు ( హాస్టల్ బాత్ రూముల్లో మేము గంటల కొద్దీ కచేరీలు చేస్తుంటే అయన వచ్చి తలుపు మీద దరువేసి బయటకి లాగే వారు) " రాబోయే ముప్పై ఏడు ఏళ్ళు నువ్వు ఎన్నో అధిగ మించి ఎన్నో ఎత్తుల కెదిగి సాధించాల్సి ఉన్నది ఎంతో ఉంది అది ఒక్క క్రమశిక్షణ తోనే సాధ్యం" అంటూ నూరి పోసిన మా ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ డి. సీతారామరాజు గారూ నాకు ప్రతి ప్రాతః స్మరణీయుడు. బాగా స్ట్రిక్ట్ గా ఆయన్ని అందరూ తిట్టుకున్నా నేను లోపల్లోపల లెంపలేసుకుంటూ ఉండేవాడిని గౌరవించే వాడిని.


ఇరవై రెండేళ్ళ ఉద్యోగ గమనం లో పై అధికారులనుంచీ, సహోద్యుగుల నుంచీ, నేను నేర్చున్నది

ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో,
ఏమి చేస్తే ఫలిస్తుందో
ఏమి చెయ్యక పోతే వికటిస్తుందో
అన్నీ ప్రత్యక్షం గా నేర్చుకున్నా.. అవన్నీ పరోక్షం గా నేర్పిన పెద్దలకు వేల దండాలు.

వీల్లేనా ? మిత్రులు , బంధువులు, అందరినుంచీ ఎంతో కొంత నేర్చుకున్న ..

అందుకే వారందరినీ నా ఉపాధ్యాయులుగా భావించి అందరికీ కోటి దండాలు.

ఇప్పటికీ...
సబ్ కుచ్ సీఖా హమ్ నే , నా సీఖే హోషియారీ.... సచ్ హై దునియా వాలోం కి హమ్ హై అనారీ.. ....అనిపిస్తుంటుంది.

3, సెప్టెంబర్ 2011, శనివారం

మర్జాలం = పిల్లి = మ్యావ్




ఐదో క్లాస్ పెద్ద పరీక్షలయాక ఎప్పటిలాగానే ఏప్రిల్ 25 న మా అమ్మ తో మేము ముగ్గురం పిల్లలం హైదరాబాద్ మా అమ్మమ్మ ఇంటికెళ్ళాం. రెండు నెలలు అక్కడే మేము ఇద్దరం అన్నదమ్ములం మధ్యలో ఒక ఆడపిల్ల , మా పెద్దమ్మ ఇద్దరు కొడుకులూ వెరసి నాలుగున్నర కోతులం. ఇల్లంతా లంక చేసి పెట్టేవాళ్ళం. అందుకని ఆ ఉధృతి తగ్గించటానికి మా అమ్మమ్మ ,మా పెద్దమ్మ, మా అమ్మ ముగ్గురూ శత విధాలా ప్రయత్నిస్తుండే వాళ్ళు.
పొద్దున్నే లెక్కలు చెప్పటం. సైన్సు బుక్స్ తెచ్చి అవి చదివి వివరించటం. ముఖ్యం గా ఫిజిక్స్ ఫర్ కిడ్స్ అనే బుక్స్ ఉండేవి అందులో పెద్ద పెద్ద భౌతిక శాస్త్ర సూత్రాలు చిన్న పిల్లలకు అర్ధం అయేందుకు ఇంట్లో అందుబాటు లో ఉండే పరికరాలతో ( గ్లాసు, గరాటు, కాగితం, నీళ్ళు, అట్టపెట్టెలు, రబ్బరు గొట్టం, ఇలా చాలా ) ప్రయోగాలు చేయించటం. ఏదోటి చేస్తూ మా అల్లరికి వరదకి భారీ ఆనకట్ట వేసే ప్రయత్నం చేసేవారు.

ఇంట్లో ఉన్న కధల పుస్తకాలు, కామిక్స్ అన్నీ చదవమని ఇచ్చేవాళ్ళు.పన్లో పనిగా వార పత్రికలు కూడా తీస్కోని అవన్నీ ఊదేసి నేను ఇంకా కావాలి అంటే మా పెద్దమ్మ ఒకరోజు మధ్యాన్నం మా ఇంటి రోడ్ చివర ఉన్న గగన్ మహల్ కాలనీ పార్క్ లో మేడ మీద ఉన్న లైబ్రరీ కి తీస్కెళ్ళి అక్కడ ఉన్న వందల పుస్తకాలు చూపించింది. నీ ఇష్టం ఇవ్వన్నీ నీకోసమే అని చెప్పింది. ఆ లైబ్రరీ లో అన్ని మాగజైనులు, నవలలూ, దొంతరల గా ఉన్నాయి. పొద్దున్న తొమ్మిది నుంచి రాత్రి ఎనిమిది దాకా మన ఇష్టం ఆతర్వాత ఇంటికి కూడా తీస్కేల్లోచ్చు. మెకన్నాస్ గోల్డ్ సినిమా లో కొలరాడో పరిస్థితి. అన్ని పుస్తకాలు ఉన్నాయి ఏది మొదట చదవాలా అని చూస్తుంటే పెద్దమ్మ ఒక రాక్ దగ్గర కొన్ని పుస్తకాలు చూపింది. శాంపిల్ గా ఆమె ఒక బుక్ తీసి ఇచ్చి ఈ బుక్ చదువు నీలాంటి వాడి కధే అని చెప్పింది. నారింజ రంగు అట్ట దాని మీద ఒక పిల్లాడి బొమ్మ కింద మార్క్ ట్వైన్ "టాం సాయర్" నండూరి రామమోహనరావు అన్న పేరు కనపడ్డాయి.
అలా మార్క్ ట్వైన్ మీద మక్కువ పెంచుకోవటానికి ఆ వయసులో నండూరి వారు నా మెదడు దుక్కి దున్ని, నాట్లేసి, మరిన్ని అనువాదాలతో నీరు పోసి, స్వచ్చమైన తేట తెలుగు అనువాదాల సేంద్రీయ ఎరువులేసి, నా పఠనాభిలాషని ఏపుగా పెంచి నేను మరిన్ని అనువాద పుస్తకాలు చదివేలా చేసిన అయన పుణ్యాత్ముడు.

అసలు పేరుకే అవి మార్క్ ట్వైన్ కధలు కానీ వాటిల్లో తెలుగుదనమేంతో ఉంది. ఆ వయసులో అప్పటికి మార్క్ ట్వైన్ ఎవరో తెలిసే పరిస్థితి లేదు కాబట్టి, అవన్నీ ఇంగ్లీష్ లో ఉన్నాయని తెలీదు. తెలిసినా ,పదేళ్ళ వయసులో తెలుగు మీడియం లో చదువుతున్న నాకు అవి గ్రేప్స్ నాట్ రీచబుల్ . ఇంగ్లీష్ పుస్తకాలు పుస్తకాలు చదవ లేను, కాబట్టి నండూరి వారి అనువాద సాహిత్యం" టాం సాయర్", విచిత్ర వ్యక్తి((మిస్టీరియస్ స్ట్రేంజర్) , హకల్బెరి ఫిన్, రాజు-పేద(డి ప్రిన్సు అండ్ డి పాపర్), రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ " ట్రెజర్ ఐలాండ్ " కాంచన ద్వీపం మొదలైన వన్నీ పిండి కొట్టేశాను.


నండూరి వారి గురించి నాకు పెద్దగా తెలియదు. చిన్నప్పుడు ఆయన అనువాద సాహిత్యం చదవటమే. ఒక దశాబ్దం క్రితం బుక్ ఎగ్జిబిషన్ లో ఆయన విశ్వదర్శనం రెండు పార్టులు , విశ్వరూపం కొని చదివినప్పుడు, చిన్నప్పటి బాల సాహిత్య రచయిత గా నా జ్ఞాపకం, ఇప్పటి విశ్వ దర్శనం చేయించిన ఈయన నిజరూపం ఏ మాత్రం పొంతన లేనివని గ్రహించా.
ఒక మంచి పాత్రికేయుడు, సంపాదకుడు.

నాకెందుకో ఇప్పటికీ ఇంగ్లీష్ లో చదివిన మార్క్ ట్వైన్ రచనల కన్నా నండూరి వారి అనువాదాలే బాగున్నాయని పిస్తుంది. ఎందుకంటే వీటిల్లో మన తెలుగుతనం, మన బాల్యం, చిక్కని తెలుగు తనం కనపడుతుంది.

ఇప్పటికీ నా మనసు నన్ను ఆరోక్లాస్ లోకి లాక్కేళ్ళమని మారాం చేస్తే నేను చేసే మొదటి పని
టాం సాయర్ బుక్ తీసి చదవటం. అదయ్యాక కాసేపు గోడలకు రంగేద్దామని, మా ఇంటి ఎదురు కొండ ఎక్కి దిగుదామని అని పిస్తూన్టుంది. అదేమీ జబ్బేమీ కాదు. నండూరి వారి అనువాద సాహిత్యం మహిమ. మనని మానసికం గా ఆరోగ్యం గా ఉంచే అరకు.

2006 లో పునఃప్రచురించిన ఆ పుస్తకాల ముందు మాటల్లో బాపురమణ గారలు సంయుక్తంగా చెప్పిన మాటల్లో కొన్ని పిప్పరమెంట్లు .....

"మార్జాలమంటే ఏంటి?"

" పిల్లి.. సార్ "
"ఇంకా సింపుల్ గా చెప్పాలి "
"మ్యావ్"
అనువాదానికి ఆయుపట్టయిన ఈ సులువు తెలిసిన పదిమంది లో తొమ్మండుగురు "నండూరి రామమోహనరావు గారే".
"ఈయన అనువాద మోహనుడే కాదు, వేద మోహనుడు, నాద మోహనుడు. భారతీయ పాశ్చాత్య వేద వేదాంతాలను మధించి వెన్న గాచిన నెయ్యిలా అందించారు."
ఈ అనువాద హనుమంతుడి ముందు ఇంకా కుప్పిగంతులేయము.
హాట్స్ ఆఫ్ !!
టోపీలు తొలగే
బాపురమణ
అంటూ ప్రేమగా అభిమానం గా ముందు మాట రాసేరు.

అంతటి మహనీయ పాత్రికేయుని, రచయితని, ఇంత కాలం బెజవాడ లో ఉండి చూడలేక పోయాను.

అందుకు సిగ్గు పడి ఈ మధ్యాన్నం వెళ్లి చూసి వచ్చా..
మౌనం గా ఆయన్ని కోరుకున్నా
లేవండి నేస్తం మరిన్ని రచనలు వార్చండి,
అనువాద మాయాజాలం పన్నండి,
లేవలేరా ? చేయి కదల్చలేరా?
విచిత్ర వ్యక్తి లోని సైతాన్ని పిలవనా
ఏదో మాయ చేసి మహిమ చూపి మిమ్మల్ని లేపమని ..?

నండూరి వారి ఆత్మ శాంతి కోసం

వారి కుటుంబ సభ్యలు మనఃశాంతి కోసం
భగవంతుని ప్రార్ధిస్తూ...

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ఈయనెవరో చెప్పుకోండి ....


అందరూ ఫోటో పెట్టి ఈయనెవరో చెప్పండి చూద్దాం అంటున్నారుగా అలాగే నేనుకూడా
దమ్ము మీద దమ్ము వేస్తున్న ఈ పెద్దాయన ఎవరో చెప్పుకోండి ...

గణేషుని ఒకరోజు...


లొకేషన్ : హై ప్లేస్ గణేష్ లోకం
వినాయక అవెనూ
గణనాధ టవర్స్
పదహారో ఫ్లోర్ సుమారు కొన్ని లక్షల చదరపు అడుగుల వైశాల్యం ఉన్న బహుళ అంతస్తుల భవనం అది. అందులో పదహారో ఫ్లోర్ లో వేల చదరపు అడుగుల ఆఫీసు. నలువైపులా గాజు పలకలతో కట్టిన సోఫీస్టికెటెడ్ కార్యాలయం. హిందూ మతాచారం ప్రకారం విఘ్నాలని తొలగించి, ఆశీర్వదించే గణాధ్యక్షులవారి కార్యాలయం కాబట్టి, చాలా అధునాతనంగా ఉంది. దేవుడు ఒక్కడే కానీ కొలిచే వాళ్ళు వందల రకాలు కాబట్టి
ఆ ఫ్లోర్ అంతా క్యూబికల్స్ తో విభజింపబడి అన్నీ సీట్లలోను వినాయకుడే వివిధ రూపాలతో, వివిధ సంస్కృతులతో వివిధ ప్రాంతాల భక్తుల పూజలందుకొంటూ వాళ్ళ వాళ్ళ ఫైల్స్ చూస్తున్నాడు.

అన్నీ క్యూబికల్స్ మీద ప్రాంతాల పేర్లు రాసి వున్నాయి . కోస్తా వినాయకుడు, తెలంగాణా గణేష్, ఉత్తరఆంధ్రా విఘ్నేశ్వరుడు , సీమ గణపతి, ఏరియాల వారీ కాబిన్లు వాటిల్లో వివిధ వినాయక సాములు ఆసీనులై సీరియస్ గా ఫైళ్ళు చూసుకుంటున్నారు. కొంచం దూరం గా వేరే రాష్ట్రాల కాబిన్లు ఉన్నాయి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు.

మా టీవీ సున్నా ( టీవీ 0 ) విలేఖరి తెలుగు వాడు కాబట్టి ఫోకస్ తెలుగు కేబిన్ల పై మాత్రమే చేసాడు.
ఆ టైం లో సున్నా టీవీ విలేఖరి మొబైల్ మోగింది. ఫోనులో న్యూస్ రీడర్ కుతూహల, విలేఖరి గ్రాహక్ ని అడుగుతోంది " గ్రాహాక్ అక్కడ పరిస్థితేంటి ? "
విలేఖరి గ్రాహక్ " కుతూహలా ఇక్కడ పరిస్థితి చాలా సందడి గా ఉంది మన ప్రభుత్వ కార్యాలయాల్లోలా కాక ఇక్కడ అందరూ సీట్లలోనే ఉన్నారు ఎవరి పని వాళ్ళు చూస్తున్నారు" అన్నాడు.
"ఇంకా ఏమి జరుగుతోంది గ్రాహక్ ?" ఆత్రం గా కుతూహల.
"కుతూహలా జరిగేది, ఇంకా, ఇక్కడ, చెప్పాలంటే ,నిరంతరం వార్తలు, ఉన్నాయి " అంటూ ...కొన్ని పడికట్లేసి... కెమెరా ఆన్ చేసాడు.

తెలంగాణా గణేష్ పక్కన కేబిన్ల వైపు చూస్త "ఏంటి భాయ్ మీ ఆంధ్రోల్ల కి మా వాళ్ళని సూసి కాపీ కొట్టుడు ఎక్కువైంది పెద్ద పెద్ద విగ్రహాలూ, పెద్ద లడ్డూలు, భుజంనికి సెమ్కీ గుడ్డలూ, తలకి కాషాయ రిబ్బన్లూ అంతా మా వాళ్ళని కాపీ యే అన్నాడు టీసింగ్ గా.


కోస్తా ఆంధ్ర వినాయకుడు క్యూబికల్ పార్టిషన్ మీంచి చూస్తూ " ఏంటి గణేష్ మీ వాళ్ళు మాత్రం చేసేదంతా సొంత స్టైలా పాడా మహారాష్ట్ర వాళ్ళని ఉత్తరాది వాళ్ళనీ చూసి అనుకరిస్తున్నదే కదా" అన్నాడు రిటార్ట్ గా.

" పైగా మా ఆంధ్రా వాళ్ళ బిరియానీ పేడలా ఉంటుంది, వంటలు అదేదోగా ఉంటాయి, మీ పూజార్లు ముదుర్లు, మా వాళ్ళు లేతకువ్వలూ అనే మీ వాళ్లకు మా గోదావరి వంట వాళ్ళ లడ్డు తప్ప గతిలేదా? మీ దగ్గర అంత పెద్ద లడ్డు చేసే బావర్చీలు లేరా? " అన్నాడు వెటకారంగా.

తెలంగాణా గణేష్ కొంచం ఇబ్బందిగా చూస్తూ " గదేమ్లేదు ఏదో మీ వైపోల్లని పైకి తెద్దామని ..." అంటూ ఉండ్రాళ్ళు నమిలాడు.


ఉత్తరాంధ్రా విఘ్నేశ్వరుడు మిగతా అందరినీ చూస్తూ " ఈసారి రికార్డ్ లడ్డు మాదే 6000 కిలోలు, లడ్డూస్ బుక్ అఫ్ రికార్డ్స్ లోకి మేమే ఎక్కుతాం" అంటూ గీర పోయాడు.


తెలంగాణ గణెష్ "మా వాళ్ళు ఏదో ఉద్దెమం హడావిడి లో ఉంది ఈ సారి ఛాన్స్ మీకోదిలారు గానీ పెద్ద లడ్డూలు పెద్ద విగ్రహాలు ఏదైనా మమ్మల్ని కొట్టేవాల్లుందరు. అసలు ఈసారి మా వాళ్ళు విగ్రహాల విషయం లో కొంచం ఎక్కువ ఆలోచించే వాళ్ళు , బుద్ధ విగ్రహానికి పది రెట్లు విగ్రహం పెడదామని అనుకున్నారు కానీ మానుకున్నారు. అసలే హుస్సేన్ సాగరంతా ఆల్ రెడీగా విగ్రహాలున్నాయి కదా మల్ల ఇది కూడా సాలదని ఊరుకున్నారు. మీ పుల్లారావులు అడ్డం పడక పోతే త్వరలో మా సొంత రాష్ట్రం లోమా సొంత లడ్డూలతో, మా సొంత స్టైల్లో చాలా రికార్డులు నెల కొల్పుతాం. అప్పుడు మాట్లాడండి " అన్నాడు ఆశావహం గా.
పైగా
తెలంగాణా గణేష్ కోస్తా వినాయకుడుని చూస్తూ "ఇది చూడయ్యా మీ దగ్గర ఒక ప్రధాన నగరం లో ఇద్దరు నాయకులు పోటీలు పడి విగ్రహాలు పెట్టారు. లడ్డూలు కూడా పోటీలు పడ్డాయి . ఇలాంటి వీధి నాయకులు ఎంతమంది ఉంటే అన్ని విగ్రాహాలు నీకు,. ప్రజా సేవ లో లేని పోటీ తత్వం వినాయక సేవ లో ఉండటం గుడ్డిలో మెల్ల కదా." అన్నాడు.



సీమ గణపతి సీట్లోంచి కేచి రెండు చేతులూ పైకెత్తి వేళ్ళూ కలిపి వెనక్కి తిప్పి మెటికలు విరుచుకొని " అబ్బ ఆపండి మీ గోల అసలే మా వైపు ప్రజల కన్నా పాలకులే భక్తెక్కువై ఆ మైకం లో గుల్లల్లోకి చెప్పులు టక టక లాడించు కుంటూ వస్తుంటే మీరేంటి లడ్డూ సైజు, విగ్రహం సైజు అంటూ పాత విషయాలు మాట్లాడతారు ? " అన్నాడు నిరశన గా.
ఇంకా దారుణం ఏంటంటే ఆస్పత్రుళ్ళలో డాక్టర్లు వినాయక చవితి భక్తి లో మునిగి " పదిమంది పైగా పిల్ల మరణానికి కారణమయ్యారు " అంటూ దుష్ప్రచారం తప్పు కదా. అయినా వాళ్ళు మాత్రం మనుషులు కారా ... నన్ను పూజించుకోవద్దా? ఏమైనా జనానికి ఇవేమీ పట్టవు. రెండు రోజులు సెలవుమీద ఉంటే ఇంత గోల చేస్తున్నారు."

మిగతా ఏరియాల వినాయకుళ్లన్తా ఫైళ్ళు పక్కన పెట్టి సీమ గణపతి చుట్టూ చేరారు ఏమిటా చెప్పుల గోల మాకు చెప్పు అంటూ..

అప్పుడు సీమ గణపతి కొంచం పానకం తాగి గొంతు సవరించు కొని " ఆ ఏముందీ ఎప్పటిలాగానే మా ప్రాంత నాయకి ప్రభుత్వం తరుపున నాకు పట్టు బట్టలు పెట్టడానికి వస్తూ చెప్పులు విడవలేదని మా ప్రజలూ, గుళ్ళో పూజార్లు దుమ్మెత్తి పోశారు. అయినా ఆ రుణసుందరి కి ఇదేం కొత్త కాదుగా ఆమె వెనక పోనీటైలు వంకర కదా" అన్నాడు కసిగా.

ఇంతలో టీ బ్రేక్ బెల్ మోగింది... అందరూ కాంటీన్ కేసి నడిచి బల్ల చుట్టూ కూర్చొని ..ఇలా అనుకున్నారు.

"ఈ మనుషులకి ఎప్పటికి బుద్ది వస్తుందో ?
భక్తంటే భారా ఖర్చు కాదనీ
పూజంటే భారీ సైజు కాదని
శ్రద్ధ అంటే చెప్పులు మేక్అప్ లు కాదని
జీడి పప్పులతో,
వెయ్యిరూపాయల నోట్లతో,
టన్నుల కొద్దీ ఆపిల్ పళ్ళతో
కూరగాయలతో చేసే విగ్రాహాల ఖర్చు బదులు
భక్తి తో చేసే ఒక్క నమస్కారం దేవుళ్ళని చేరుతుందని"

అన్నార్తులకి పిడికెడు కూడు పెట్టని పూజ, బండెడు ప్రసాదం తో చేసినా అది దండగేననీ..!! తీర్మానించి,

ఇష్టం లేక పోయినా లంచం తీస్కోని పనిచేసే మామూలు ఉద్యోగుల్లా
వాళ్ళ ఫైళ్ళు చూడటానికి సీట్లలోకి వెళ్ళిపోయారు.

మన గ్రాహక్ కుతూహల ని దగ్గరనుంచి చూడాలనే కోరిక తో మళ్ళీ టీవీ సున్నా కార్యాలయానికి చేరాడు.


దేవతల పాత్రలను హాస్యానికి వాడుకునే సినిమా వాళ్ళనూ, రచయితలనూ అసహ్యించుకునే నేను
ఈరోజు నా బ్లాగ్ టపా కోసం వినాయకుడిని వాడుకున్నా, తప్పలా
నేను రాయటం మొదలెట్టాగా, నాకూ కోరికా , ఆశా, జేబూ, మెడా ఉన్నాయిగా..!!


31, ఆగస్టు 2011, బుధవారం

నేనూ, రజాకూ, ఒక రంజాన్.


ఒక చిన్న జ్ఞాపకం పెద్ద పండగ గురించి.

రంజాన్ పెద్ద పండగ. ఆ పండగ తాలూకు నెల రోజులూ ఊళ్ళో ఎక్కడ తిరిగినా రోజులో ఎక్కువ సార్లు వినపడే నమాజ్, ముస్లిం సోదరులు సాంప్రదాయ దుస్తులు, బజారులో తిరుగుతుంటే వచ్చే అత్తరు పరిమళాలు, బురఖాల్లో బజారులలో పండగ సంబారాల కోసం తిరిగే వదినమ్మలు, నెల రోజుల పైగా జరిగే సందడి, రోజూ చీకటితో మూడింటికే లేచి, వంటల హడావిడి , మొదటి నమాజ్ అయ్యాక పొద్దునే తినే భోజనం, అదయ్యాక రోజంతా నీరు కూడా తాగని కటిక ఉపవాసం, కొంత మంది నోటిలో ఊరే లాలాజాలం కూడా మింగకుండా ఉమ్మెసేవాళ్ళూ, సాయంత్రం మళ్ళీ నమాజ్ అయ్యాక చేసే ఇఫ్తార్ విందు . సేమ్యాలు ఇంట్లో తయారు చేస్కోవటం, కొత్తబట్టలు కొనుక్కోవటం కుట్టించుకొవటం, ఇలా చాలా పనులుంటాయి. చివరి రోజు నెలవంక కనపడే వరకు జరిగే చర్చలు, సౌదీ లో ఇవాలే కనపడిన్దంట భాయి వాళ్లకి ఈరోజే మనకి ఇంకా డిల్లి లో ఇమాం గారి కబురు రావాలి అంటూ సాయంత్రం ఎదురు చూపులు. ఇలా వాళ్ళకే కాదు ముస్లిమేతరులకి కూడా ఎంతో సందడి.


నా బాల్యంలో అయితే బందరులో మేముండే బుట్టయిపేట అరవగుడెం సందులో ( ఈపేరు ఇప్పుడు ఎవ్వరికీ తెలీదు అందుకని ఎవరినీ అడక్కండి ) మా ఇంటి ఎదురు ఖాళీ స్థలం లో వెనక వైపు మొత్తం ముస్లింలే ఉండేవాళ్ళు.
ఆర్ధికం గా చాలా దయనీయ పరిస్థితి లో ఉండే వాళ్ళు. మగాళ్ళు రిక్షా తొక్కేవాళ్ళు , రైసు మిల్లు లో పని చేసేవాళ్ళు, ఆడాళ్ళు ఇళ్ళలో పని చేసేవాళ్ళు, పిల్లలు ఐదో క్లాస్ లోపే చదువాపేసి, రోల్డ్ గోల్డ్ పనికో , చిన్న చిన్న పన్లకో వెళ్ళేవాళ్ళు. మా లాంటి మధ్యతరగతి కుటుంబాలు, కొంచం ఎగువ మధ్యతరగతికి చెందిన డాక్టర్ గారి కుటుంబంతో బాటు దిగువ మధ్యతరగతి కుటుంబాల చెంతన ఈ పేదరికపు అంచున వేలాడుతున్న పై చెప్పిన కుటుంబాలు కూడా ఉండేవి.

రంజాన్ రోజుల్లో వాళ్ళ సందడి భలే చూడ ముచ్చట గా ఉండేది, రంజాన్ నెల కి ఇంకా కొన్ని వారాల ముందే వాళ్ళ పండగ సంబరాలు మొదలయ్యేవి. వాళ్ళ ప్రతీ మాట లోనూ రంజాను ప్రస్తావన వస్తుండేది. అది చెయ్యాలి ఇది చెయ్యాలి అంటూ చెప్తుండేవాళ్ళు. వాళ్ళ ప్రభావం మామీద కూడా ఉండేది. అసలు ఆ రోడ్ లో పేద , మధ్య తరగతి, ధనిక వర్గాల మధ్య ఏ తేడా ఉండేది కాదు. చిన్న చిన్న తేడాలు ఉన్నా, అలిగినా మళ్ళీ రెండురోజులకే కలిసి పోయేవాళ్ళు.


రంజాన్ రోజుల్లో వాళ్ళ సందడి కొస్తే ఇత్తడి సేమ్యా మిషను తెచ్చి అది నులక మంచం పట్టీ కి బిగించి గోధుమపిండి ముద్ద కలిపి ఆ మిషను లో వేసి చేతిమర తిప్పితే జాలు వారే సేమ్యాలు ప్లేట్లు తిరగేసి , చేటలలోను వాటిని ముగ్గుల్లా పట్టి ఎండ పెట్టేవాళ్ళు. వాళ్ళల్లోనే ఇద్దరు ముగ్గురు మేన మామలు దర్జీ పని చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. పండగ బట్టలు తాడేపల్లివారి సత్రం అరుగు మీద ఉండే ఆ దర్జీలే కుట్టేవాళ్ళు. ఆమాట కొస్తే నేను కొంచం పెద్దయి సోకులు పెరిగేదాక నా లాగూలు చొక్కాలూ అక్కడే కుట్టించేది మా అమ్మ. పండగ రోజు రంగు రంగుల బట్టల్లో తిరుగుతూ, మా వీధంతా మసాల వాసనలు ఘుమ ఘుమ లాడిస్తూంటే, కొంతమంది మగాళ్ళు సూరయ్య బడ్డీ పక్కనే ఉన్న సారా కొట్టులో లయిటు గా తడిసి కొంచం తూగుతూ, ఎక్కువయితే కనపడని వాడెవడినో ..డెమ్మ ..డెక్క ...డాలి తిట్టుకుంటూ మా ఇంటి ముందు కరెంటు స్థంభం పట్టుకు నుంచొని మేమవరైనా బయట కనపడితే తువ్వాలు మూతికడ్డం పెట్టుకొని
"ఏంటి బాబు పండగ భోజనం తినడానికి మాయింటి కొస్తారా అంటూ " మొహమాటపు నవ్వు నవ్వి వెళ్లి పోయేవాళ్ళు.
ఎంతో ఆనందం తో కళ కళల్లడుతూ తిరిగి రాత్రి తొలాట సినిమా చూసి మళ్లోక సారి పలావ్ తిని అలసి సొలసి ఆదమరచి ఆరుబయట నిద్ర పోయేవారు.

నేను హై స్కూల్లో ఉన్నప్పుడు మాతో చదివే అబ్దుల్ బారీ అనే అబ్బాయి రంజాను రోజుల్లో ఉపవాసాలుండి, క్లాస్ జరుగుతున్నప్పుడు ప్రతీ అయిదు నిముషాలకోసారి లేచి సార్ ఉమ్మేయాలి అనేవాడు, మాస్టార్లు ఏంట్రా నువ్వు ఉపవాసాలుంటున్నావా అని అడిగి వాడు అవునంటే భేష్ కానియ్ వెళ్లి ఉమ్మేసి రా అనేవాళ్ళు. అందుకని మా బారీ ప్రతీ సారీ సార్ ఉమ్మేయాలి అని సైగ చేసేవాడు, వాడి బాధ భరించ లేక మాస్టార్లు " ఒరేయ్ ప్రతీసారి అడగక్కరలేదు లేచి వెళ్లి ఉమ్మేసి వచ్చి కూర్చో అనేవాళ్ళు. వాడు అలా రోజులో సగం టైం బయటకీ లోపలకీ తిరుగుతూ మా వంక కొంచం గర్వం గా చూసేవాడు (చూసారా నాకు మల్టిపుల్ ఎంట్రీ పెర్మిషను ఉండీ అన్నట్టు) మేము వాడి అదృష్టానికి చాలా కుళ్ళుకునే వాళ్ళం కనీసం ఈ ఒక్కనెలైనా ముసల్మాన్ గా పుట్టి ఉంటే ఇలా క్లాస్స్ స్పెషల్ ట్రీట్మెంట్ దొరికేది కదా అని.

నాకు తెలిసిన కొందరు ముస్లిం స్నేహితులు మతపరమైన నియమ నిభందన, ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు, రిటైర్ అయి చాలా సార్లు హజ్ వెళ్లి వచ్చిన రెహ్మాన్ గారు
ఈ రంజాన్ నెలలో పేద ముసల్మన్లయెడల చాలా వితరణ చూపిస్తారు. ఇంకో ముస్లిం కుటుంబం పెద్ద మాల్ యజమాని , పేదలకే కాక తెలిసిన వాళ్ళకందరకూ రంజాన్ విందు చేస్తారు. వాళ్ళ పద్దతులు చాలా ముచ్చట గొల్పుతాయి. పేద వాళ్ళకీ, స్నేహితులకే కాక ఇంకా కొంత మంది అధికార గణానికీ రంజాన్ తినిపింపుళ్ళు సేవ చేయాలని చెప్పినప్పుడు కొంచం భాధ కలిగింది. ఆ అధికార గణం ఎవరని అడక్కండి మీకు బాగా తెలుసు.

మా ఇంటికి రోజూ పూలు
తెచ్చే రజాక్ చాలా పేద వాడు, సాయంత్రం ఏడు ఎనిమిది మధ్య టoచనుగా రోజూ పూలు తెచ్చి ఇస్తాడు మరుసటి రోజు పూజ కి.
ఏమి పెట్టినా తినకుండా ఇంటికి తీస్కెళ తాడు పిల్లల కోసం ఎన్ని మైళ్ళు సైకిలు తొక్కితే ఎన్నిమూరలమ్మేనూ? ఎన్ని మూరలమ్మితే ఎంత మిగిలెను ?
బహు కష్ట జీవి రంజాను పండగ ఎలా ఉందీ అని అడిగితే దీనం గా ఏమి రంజాను సారూ అన్నాడు.

మాట కొస్తే ఆయనే కాదు మన ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ముస్లిమ్స్ లో చాలా మంది ఆర్ధికం గా వెనకబడినవారే. ఆటోనగర్లలో పనులు ,చిన్న చిన్న వృత్తులలో ఉన్నవారూ,చాలీ చాలని జీవితం గడిపేవారు,అలాంటి వారి జీవితాలలో రంజాన్ నెలపొడుపు కొత్తవెలుగులు తేవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...ఈద్ ముబారక్!!

16, ఆగస్టు 2011, మంగళవారం

ఎలాగోలా....


ఎలాగోలా సంవత్సర కాలం గడిపా
నాకిష్ట మోచ్చినట్లు రాసుకొని, పూస్కోని, మిమ్మల్ని విసిగించాను.
అనవసర ప్రసంగం చేసాను. అవసర నైవేద్యమూ చేసాను.
కొన్ని నాకు నిజమైన తృప్తి కలిగించాయి.
కొన్ని మీకు బలమైన సుత్తిలా తగిలుంటాయి.

చాలా సార్లు నేనూ నా ఫ్రెండూ గంటలు గంటలు
సొల్లేసుకుంటూ " జన్మ లో మనం మంచి పుస్తకాలు చదివి ఆనందిస్తున్నాం కదా,
కనీసం వచ్చే జన్మలోనైనా అవి రాసే స్థాయిలో పుట్టాలని " అనుకుంటూ వుండేవాళ్ళం.
దానికి రిహార్సల్లా నా బ్లాగ్ మొదలు పెట్టాను.

చదివి, చక్కదిద్ది, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ నా నమస్సులు.


15, ఆగస్టు 2011, సోమవారం

ఎక్సూస్ మీ డూ యు బ్లాక్..?


ఈరోజు ఝండా వందనం ,ఆఫీసు లో పని , రచయితల మహా సభ చివరి రోజని వెళ్ళటం ఇత్యాది పనులతో
ఈరోజు టపా నైవేద్యం తయారు చెయ్యలేదు.
పడుకునే ముందు మనసొప్పక ఈ చిన్న సంఘటన చదివిస్తా ..
" చాలా ఏళ్ళుగా ఒక పెద్దాయన తో నాకు పరిచయం. ఆయనకు 83 ఏళ్ళు, చూపు కాస్త మందగించింది, ఇంకా వినికిడి శక్తీ తగ్గింది.
నేను అప్పుడప్పుడూ అయన దగ్గర ఒక గంట గడుపుతా కేవలం పనిమనిషి మీద ఆధార పడి కుటుంబానికి దూరంగా ఉన్న అయన తో నాకు స్నేహం కలవటానికి కారణం ,
నాకెంతో ఇష్టమైన పాత సంగతులు అంటే సుమారు అరవై ఏళ్ళ క్రితం వి ఊరించి.. ఊరించి చెప్తారు.
అవి నాకెంతో వీనుల విందుగా ఉంటాయి.
ఆయనకీ నేనంటే చాలా ఇష్టం, బుద్ధిగా ఉన్నట్టు నటిస్తానని.
నే వెళ్ళగానే వచ్చావా..రా.. అంటూ వెలిగే అయన బోసి నోటి ముఖం నాకు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ని గుర్తు చేస్తుంది.
అలా ఒకసారి అయన తో గడపటానికి వెళ్ళా. అప్పటికి నా బ్లాగు తెరిచి నాలుగు నెలలై ఉంటుంది.
మెయిల్స్ ఎమన్నా వచ్చాయేమో అని పదే పదే మొబైల్ లో చూసుకోవటం అలవాటై పోయింది.
అయన దగ్గర ఉన్నపుడు ఫోన్ లోకి చూస్కుంటుంటే ఆయన " ఎంటీ చూస్కున్తున్నావ్ ఆ బిళ్ళ ఫోన్ లోకి..?" అని అడిగారు.
"మెయిల్స్ వచ్చెయేమో అని చూస్కుంటున్నా" అన్నాను.
"ఎక్కడ నుంచి రావాలీ?" అన్నారు.
"బ్లాగు తెరిచా దానికి జనం ఏమన్నారో అని చూస్కున్తున్నాను" అన్నాను.
"బ్లాకా ఏమి బ్లాక్ చేస్తావు ? అయినా అది నేరం కదా " అన్నారు.
ఫోన్ లోకి చూస్తూ సరిగ్గా వినిపించు కొని నేను " నేరమా అదేంటి చాలామంది చేస్తున్నారు అలాగే నేనూ" అన్నాను.
నే చెప్పింది జాగ్రత గా విని " ఎవడో వెధవలు( సీనియర్లు బ్లాగర్లూ సారీ ) చేసారని నువ్వూ చేస్తావా నీ బుద్దేమ్ ఏడిసింది ?"
అమ్మో ఈ తిట్లేంటి అనుకోని " బ్లాగ్ రాయటం అంటే మాటలు కాదు తెలుసా? " అన్నాను.
మళ్ళీ అయన " ఇంతకీ బ్లాకు లో ఏమి అమ్ముతున్నావు ? లాభం బాగా ఉందా ?" అన్నారు.
అప్పటికి నాకు వెలిగింది నే బ్లాగ్ అన్నది ఆయనకి బ్లాక్ లా వినపడింది అని,
నేనేదో నల్ల బజారు లో కొట్టు తెరిచానని ఆయనకి కోపగించారు అని.
అయన కి విడమర్చి సర్ది చెప్పా అసలు విషయము.

ఇంతకీ మనమంతా బ్లాకుతున్నామా ? బ్లాగుతున్నమా?

" నాకు మాత్రం మనసులోని చీకటి గదుల్లో ఉన్న ఊసులు బయటకి తెస్తున్నాం కాబట్టి ఇది బ్లాకింగే"


14, ఆగస్టు 2011, ఆదివారం

నాకా ఆగస్ట్ పదిహేనే కావాలి


"నాకు ఆగస్ట్ పదిహేనే కావాలి ..." కోరిక గా ..

" ఏది ?" సందేహంగా

"అదీ " మొండిగా

"ఏదే..?" కొంచం విసుగ్గా..

" అదే నాకు ఏడేళ్ళ వయసులో పొద్దున్నే లేచి స్నానం చేసి.
పక్క పాపిడి తీస్కోని దువ్వుకొని.
ఆకుపచ్చ
లాగూ పై తెల్ల చొక్కా వేస్కొని,
వేడి
అన్నంలో పెరుగు వేస్కొని హడావిడి గా తిని,
హవాయి
చెప్పులతో పొద్దున్నేస్కూల్ కెళ్ళి ,
ఎవరో ఇచ్చిన కాగితపు జండా బాడ్జ్ చొక్కాకి పెట్టుకొని,
పూలతో జండాకర్ర చుట్టూ
మెట్లు అలంకరించి.
సున్నం
తో వేసిన లైన్ల మీద కుదురుగా నుంచోని,
సరిగ్గా
ఎనిమిది కి మా సుగుణమ్మ ప్రిన్సిపాల్ గారు ఎగర వేసిన జండాకి వందనం పెట్టి .
ఆమె
చెప్పిన నాలుగు మాటలు వినీ విననట్లు ఉండి.
అదయ్యాక
అక్కలు పంచిన బిళ్ళలు చప్పరించి,
పది
దాకా స్కూల్లోనే ఆడుకుంటూ, దేశ భక్తి ప్రదర్శిస్తూ,
ఎండ
ఎక్కాక ఇంటికెళ్ళిన రోజుల్లోని ఆగస్ట్ పదిహేను." వస్తుందా మళ్ళీ ఆశగా..

"ఇప్పుదేమైందట" కరుగ్గా ..

" ఏమీ కాలేదు మామూలు రోజుల్లో ఆఫీసులో సరిగ్గా టైముకు రాక, వచ్చాక సీట్లో లేక పెత్తనాలు చేసే జనం రోజు పొద్దున్నే వచ్చి ఆఫీసు డబ్బులతో టిఫిన్లు మెక్కి, దేశ భక్తి, నిస్వార్ధమూ , త్యాగమూ , పునరంకితమూ
అంటూ కొన్ని వాళ్ళకీ తెలీని మాటలు మాట్లాడి చెమట తుడుచుకొని ఏసీ లోకి వచ్చి రిలాక్స్ అవుతుండటం నాకు నచ్చలేదు."

" దేశ సేవ పేరుతో పంది కొక్కుల్లా తిని తెగ బలిసి తన్నుకుంటున్న నాయకులు నాకు నచ్చలా "

" లంచాల సొమ్ము కోసం ప్రజలని పీడించే ప్రభుత్వ జలగలు నాకు నచ్చలా"

" మన కెందుకూ మన డాలర్లు మన కొస్తున్నాయా లేవా అని చూసుకునే వలస మేధావులు నాకు నచ్చలా"

" మనం మార్చగలిగేవి కావు కుళ్ళు రాజకీయాలు, తీర్చగలిగేవి కావు కష్ట నష్టాలు అంటూ వక్కపొడి నములుతూ వెనక్కి వాలే నిలవ మేతావులు నాకు నచ్చలా" ..ఉక్రోషం గా

" అందుకే నా పాత ఆగస్ట్ పదిహేనన్నా తెచ్చివ్వు లేదా ఇంకా వెనక్కి వెళ్లి తెల్ల పాలనన్నా తెచ్చివ్వు " అమాయకంగా

" ఎందుకూ.." అయోమయం గా ..

" మళ్ళీ బ్రిటీష్ వాళ్ళతో పోరాడి మీరు మరో స్వాతంత్రం తెచ్చుకుంటే నన్నా విలువ తెలుస్తుందేమో అని " కసిగా

" నిస్వార్ధం గా అవినీతి పై పోరాడాలంటే ఇన్ని కస్టాలు పడాలా అని వాపోయే వీరులందరికీ నా మల్లె పూదండ " ఆర్తి గా
జై
హింద్ !!


కామెంటితే ప్రాణాలిస్తా ..


కృష్ణ సినిమా టైటిల్ లా ఉందా?

కాదులే ... ఈ రోజు నా బ్లాగు కు సంభందించి నాకొరిగిన ప్రయోజనాలని చెప్తా.
మొదట్లో కొన్ని మెచ్చుకోలు కామెంట్లు పడ్డాయి. స్వల్ప సంఖ్యలోనే అయినా అవి నాకు మంచి కిక్కు నిచ్చాయి.
ముఖ్యం గా రహిమాన్ భాయి, మస్తాన్ అనే ఆయన, కొన్ని అజ్ఞాత కమెంటర్లు, అప్పుడప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ కామెంటారు.
ఆ అనందం లో వేగంగా రాయటం, అందులో చాలా టైపో లు ఉండటం, అవి సరిదిద్దుకోమని కొత్తపాళీ గారు లాంటి వాళ్ళు సున్నితంగా తొడ పాశం పెట్టటం చేసారు.
పంతులజోగారావు గారు లాంటి పెద్దలు కామెంటు రాయటం మంచి బలాన్నిచ్చింది.
ఆ జోరు లో "మారేడు మిల్లి ట్రిప్" కి ఓలేటి శంకర్ గారి మొదటి కామెంట్ బాణం " తాగి కార్ నడపటమే కాకుండా సిగ్గులేకుండా ఇంకా రాస్కుంటారా మీ వల్ల తెలుగుజాతి నాశనమవుతుంది" అని వాత వేసారు.
స్వాభావికంగా విమర్శ అనగానే రోమాలు నిక్క బోడుచుకునే మనిషిని కాబట్టి వెంటనే తప్పును సరి దిద్దుకున్నా కామెంటు లోనే. పోస్ట్ మాత్రం యదా తదం.
నిజానికి నా ఫ్రెండ్స్ లో నాకు తాగుడు అలవాటు లేదు. అందరూ మందేసిన మధుర క్షణాల్లో నేను చక్రధారి నవుతా అంతే.
అర్ధం కాలేదా స్టీరింగ్ వెనక నేను.. అదీ సంగతి.
అలా చేదుగా మొదలైన మా పరిచయం తియ్యగా సాగాలని ఓలేటి శంకర్ గారికి మెసేజ్ పంపా.
నిజం గానే మేము మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు.
ఈ కామెంట్ల విషయం కొస్తే ఒక్కోసారి నా వీపు నువ్వు గోకు నీ వీపు నే గోకుతా అనే ఆంగ్ల నానుడి లా ఉంటాయి.
చిన్నప్పుడు ( అంటే బ్లాగ్ మొదలేసిన కొత్తల్లో ..) నా కామెంటు కి రిప్లై ఇవ్వక పోయినా, లేక నా బ్లాగ్ లో ఎప్పుడన్నా కామెంటు వేయక పోయినా వాళ్ళ తో మనసు లోనే పచ్చి కొట్టేసే వాడిని.
పెద్దయ్యాక ఆ గుణం పోయింది.
సాధారణం గా అన్ని బ్లాగులూ చదువుతా. ఏదన్నా అనాలి అనిపించి నప్పుడు కామెంటుతా. అది ఎవరు ఎలా తీస్కున్న నాకనవసరం.
ఈ కామెంట్ల విషయం లో ఒకటి గ్రహించా..
కామెంటు మోడరేషన్ ఉన్న బ్లాగుల్లో కొంత మంది కనీసం అరడజను కామెంట్లు వచ్చేదాకా ప్రచురించరు. నా రేంజ్ మినిమం పది, పాతికా అన్నట్లు.
పోనీ చూస్కోరా అంటే అదీ కాదు...
కామెంటు వెయ్యగానే ప్రచురిస్తే , మరీ ఎదురుకోలు మేళం లా ఉంటుందని వాళ్ళ అభిప్రాయమేమో. ఏమో వాళ్ళిష్టం అది.
ఇంకొంత మంది కామెంట్లు ప్రచురించి వాటిలో కొంత మందికే జవాబు ఇస్తారు. మిగతా వాళ్లకి జవాబివ్వటం నా లెవెల్ కాదు అన్నట్టు.
వీళ్ళని మాత్రం నేను స్పృసించను. నా లెవల్ నాకూ ఉందిగా..
ఏదేమైనా మన బ్లాగ్ చదివి, వ్యాఖ్యానించిన వాళ్లకు ఇతోధికం గా జవాబు నివ్వటం మంచి సాంప్రదాయం.
ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకి కేటాయించిన సీట్లు వాళ్ళకే ఇవ్వటం లాంటిదన్నమాట.
సిమిలీ బాలేదా.. ? నిద్ర వస్తోంది అంతకన్నా మంచి పోలిక ...ఎనక్కు తెరియాదు...!!


13, ఆగస్టు 2011, శనివారం

వ్యసనాలు 8


...ఆ ... ఎక్కడున్నాం ? నేను బ్లాగులు రాయడం మొదలు పెట్టటం ఏదేదో రాసేసి చదువరుల దగ్గరనుంచి మెచ్చుకోలు ఆశించటం, భంగ పడటం దగ్గర ఆగాం కదా.
ఎప్పుడూ ఆఫీసులో పనికి సంభందించి పట్టు మని పది వాక్యాలు కూడా రాసి ఉండను.

అలాంటిది ఒక పాతిక లైనులు టపా రాయాలంటే కష్టమే మరి.

ఫోన్ బిల్లూ, పచారీ లిస్టు, పేపరు హెడ్లయినులూ మాత్రమే చదివే అలవాటున్న వాడిని
విశ్వనాధవారి నవల బట్టీ
పట్టమన్నట్టుగా ఉండేది నా పరిస్థితి.

బ్లాగు లో టపా రాయటం కోసం గంటలు గంటలు లాప్టాప్ ఒళ్లోపెట్టుక్కూర్చోని
వేడికి కాళ్ళ మీద వాతలు పడ్డాయి కానీ.
మంచి వాసికల టపా రాయలేక పోయా.
పైగా ఆఫీసు నుంచి ఎప్పుడు ఇంటికెళ్ళిపోదామా, ఏమి రాద్దామా అన్న ఆలోచనే.

పేకాడే వాడికి నిద్ర లో కలల్లో పేక ముక్కలు కన పడ్డట్టు,
నాకు క్విల్ పేడ్, గూగుల్ ట్రాన్స్లిటరేషన్
పేజో కనపడేవి.

ఏదోటి రాసి పోస్ట్ చెయ్యటం. వెళ్లి పడుకొని ఏ రాత్రి రెండింటికో లేచి ఎవరన్నా చదివారా ?
ఎమన్నా కామెంట్లు పెట్టారా ? అని చూస్కోవటం.

ఇంట్లో వాళ్లకి ఇదేదో వ్యసనంలా అనిపించటం. చాలా భాధలు పడ్డాను.

పైగా చాలా రోజులు నేను బ్లాగ్ రాస్తున్నానని ఎవరికీ చెప్పలేదు.

చుట్టాలకీ, స్నేహితులకీ నా ప్రతిభ తెలియాలి, కానీ నేరుగా వాళ్లకి చెప్పలేను.

ఇలా మధన పడి చివరకి మెయిల్ లో (ఇంకో మెయిల్ ఐడి ) ఎవరో చెప్పినట్లు బ్లాగు గురించి డప్పు కొట్టాను.

ఇలా ఎలాగోలా ఒక పది మందికి నా బ్లాగు గురించి తెలియజేశాను.

కానీ అందరికీ నా బ్లాగ్ హాస్యనిలవసరుకు( ఫన్ స్టాక్ ) అయిపొయింది.

ఇలా పడుతూ లేస్తూ గత సంవత్సర కాలం గా నా బ్లాగ్ నెట్టుకొస్తున్నాను.

పెళ్ళిళ్ళల్లో, శుభకార్యాల లో కలిసినపుడు ఆంతా నాగురించి మాట్లాడుకొని నవ్వేసుకుంటున్నారు.( నా వెనకే సుమా )

ఇంక నా వల్ల కాదనుకున్నప్పుడు అన్నమయ్య సినిమా లో నాగార్జునలా తెల్ల గడ్డం పెంచి .. "అంతర్యామీ అలసితి సొలసితి ..... " అంటూ ఆపేస్తా ...

అప్పటిదాకా ఉగ్గబట్టుకొని ఉండండి.





11, ఆగస్టు 2011, గురువారం

౦% కల్పితం



పోయినేడాది ఇదే నెలలో పదహారో తారీకు రమేష్ నాయుడు స్వరపరచిన పాటలు వెతుక్కుంటూ అందులో భాగంగా " లిపిలేని కంటి భాషా ... " అనే పాట విని, ఆ తర్వాత సెర్చ్ బాక్స్ లో కొబ్బరాకు అనే మాట బహుశా "కొబ్బరాకూ గాలి ..." పాట కోసం కొట్టి చూస్తే కొబ్బరాకు పేజి చూపింది.

చూస్తే అది గోపరాజు రాధాకృష్ణ గారి బ్లాగు. బ్లాగుల గురించి వినటం చదవటమే కానీ తెలుగు లో ఇంత లోతైన బ్లాగ్ ప్రపంచం ఉందని అప్పుడే చూసా. ముందు మెల్లగా కొన్ని బ్లాగులు చదివా.
అంతే ఎంతో కర కర లాడుతూ అప్పుడే చేసిన గోరువెచ్చని చేగోడీల లాంటి టపా లెన్నో గబా గబా చదివా.


ఇదేదో బాగుందే, మనమేమన్నా వ్రాసినా ఆ చిత్తుప్రతిని మళ్ళీ అందమైన చేవ్రాత తో వ్రాసి అదే వార పత్రికకో, దిన పత్రిక వార సంచికకో పంపాలని అనుకోవడమే కానీ, వ్రాసిన చిత్తు ప్రతి లేదూ లేదు. ఇంకా అందమైన చే దస్తూరీ నాకు లేదు. పోనీ ఇవన్నీ జరిగినా, ఉన్నా... ఆ పత్రిక వాళ్ళు మన పైత్యాన్ని ప్రచురిస్తారన్న హామీ లేదు.

పైగా వ్రాసింది మన సొంత పైత్యమే, మరొకరి వాతం కాదు అన్న హామీ పత్రం ఎలా ఇస్తాము ? కష్టం కదా !!
అందుకని మనమే బ్లాగు తెరిస్తే పైన చెప్పిన యాతన లేమీ ఉండవు. అసలు ఏ యాతన మన పడక్కర్లేదు. అదంతా చదివే వాళ్ళ భాధ్యత.

అంతే బ్లాగ్ తెరిచే పనిలో పడ్డా. ఆ తర్వాత అంతా దానంతట అదే జరిగాయి. బ్లాగ్ పేరేంటి, పేజి ఎలా ఉండాలి, ఎలాంటి సందేహం లేక అప్పుడే విన్న పాట "లిపి లేని భాష " గా స్థిరపడిపోయింది. పైగా నేను ఇందులో వ్రాసిన వన్నీ ఇప్పటివరకూ ఎవరికీ చెప్పలేదూ .. వ్రాయ లేదు, అలా లిపి లేకుండా నా మనసులో బలమైన జ్ఞాపకాలుగా నాటుకుపోయిన ఊసులు.


మొదటి నెల అంతా నే రాసింది ఎవరూ చదవలేదు. కారణం నా బ్లాగ్ ఉన్న సంగతి నాకు తప్ప ఎవరికీ తెలీదు.
తర్వాత సంకలిని , జల్లెడ, హారం, మాలిక, కూడలి సంకలిని లాంటి వారి సహకారం తో నా బ్లాగ్ వెలుగు లోకి వచ్చింది.

నే
వ్రాసిన టపాలు ఎలా ఉంటాయో నాకే సరైన క్లారిటీ లేదు. కానీ నన్ను కూడా మెచ్చుకునేవాళ్ళు ఉన్నారని అప్పుడప్పుడూ తెలుస్తోంది.

ఏదేమైనా అసలు పైన చెప్పినట్లు పాటలు నెట్లో వెతకటానికి కారణమైన, నన్ను బుజ్జి బాబాయి అని పిలిచే నా అంతర్జాలకూతురు రూప కి నేను ఎంతో రుణ పడి ఉంటా.
గాడ్ బ్లెస్ హర్ !!

ఇట్లు భవదీయుడు


విన్నపము
ఈ రోజు తో కలిపి ఇంకో ఏడు రోజులు అంటే సరిగ్గా వారానికి నా పుట్టినరోజు.
నాదంటే నా మనసుకి,
నా లిపిలేని భాషకి,
నా బ్లాగుకి,


శ్రీరామ
నవమికి ముందు
సందాలు ఒసూలు చేసి
సలవ పందిళ్లేసి సీరియల్( టీవీ లోవి కావు ) లైట్లు తగిలించి,
రేకు ( కోన్ ) మైకెట్టి సీతారాముల కల్యాణం చూతం రారండీ ... అనే పాటలేసి

పెద్ద పెద్ద మట్టి బానలు కొత్తవి కొని వాటిని మంచి నీళ్ళతోనూ ,

మజ్జిగ తేట తోనూ ( ఉప్పు నిమ్మరసం కరివేపాకు/ దబ్బాకు కలిపి మరీ ) నింపి,

దారే పోయే వాళ్లకి పిలిచి మరీ ఇచ్చి,
రామనవమి కి మీరు రావాలండీ,
పన్లలో ఓ చెయ్యి వేయాలండీ,
అలాగే మీకు తోచినంత సందా ఈడబ్బా లో వేయాలండీ,
మన కోసం కాదండీ, మీకు పుణ్యమనండీ,
అంటూ హడావిడి చేసినట్లు,
ఈ వారం రోజులూ మీకు రోజుకో చిన్న విషయం నా బ్లాగుకు సంభందించినది, తెలుపుకుంటాను.

ఆనక ఆ రోజు అంటే పుట్టిన రోజున
మీకు విధాయకంగా కృతజ్ఞతలు తెలుపు కుంటాను.
మీరంతా ఆ రామ భక్తుల్లాగా సాహితీ భక్తులు గాన
నన్ను అసీరదించి,
నన్ను ఆనందం లో ముంచి ,

తడిపి పిండి,
ఆరేయ
ప్రార్ధన
ఇట్లు భవదీయుడు
ఆత్రేయ

9, ఆగస్టు 2011, మంగళవారం

ఎస్ !! నేను లెజెండ్ నే....


రోజులాగానే నిన్న మా అమ్మాయి కి ఫోన్ చేశా,
రోజూ మాట్లాడుకునే సామాన్య విషయాలు
ఏమి చేస్తున్నావ్, అన్నం తిన్నావా ?
కాలేజీ లో ఈరోజు సంగతులేంటి అన్నీ అడిగేసి...
ఉన్నట్టుండి ఫీజు రసీదు పంపలేదేంటి అని అడిగా.
నడుస్తున్న విద్యా సంవత్సరం కి ట్యూషన్ ఫీజు,
హాస్టల్ ఫీజు ఎప్పుడో మే నెల లో డీడీలు తీసి కాలేజీ కి పోస్ట్ లో పంపాను.
మా అమ్మాయి జూలై లో కాలేజీ కి వెళ్ళింది.
వెళ్లేముందు రసీదులు తీస్కోని పోస్ట్ చెయ్యి అవి కావాలి అని అడిగా. అలాగే అంది.
నెల రోజులుగా అడపా దడపా అడుగు తూనే ఉన్నా .
కానీ మా అమ్మాయి పంపలా. ఏదో కారణాలు చెప్తుంది.
టాక్స్ ఫైల్ లో ఆ రసీదులు కూడా కొంత ప్రాముఖ్యం నంతరించు కుంటాయి.
నిజానికి పరిధి దాటి పోవటం వల్ల, ఆ ఫీజు మొత్తం వల్ల నా టాక్స్ రాయితీ ఏమీ తేడారాదు.
కానీ చెప్పినట్లు పంపక పోవటం కొంత అసహనాన్ని కలగ చేసింది.

దానికి తోడు నిన్న వేరే వేరే కారణాల వల్ల మనసు పరి పరి విధాల చిరాకుగా ఉంది.

ఆ చిరాకు లోంచి పుట్టిన చిరుకోపం మా అమ్మాయి మీద కొంచం చూపించా.
నీకేదైనా అవసరం అంటే నేను వెంటనే చెయ్యట్లేదా?
నీకేమైనా అవసరం అంటే,
పోస్ట్ చేస్తే , కొరియర్ చేస్తే లేట్ అవుతుందేమో అనుకుంటే
ఎవరైనా మనిషికిచ్చి పంపాలనే ఆత్రుత లో ఉంటా కదా
అదే నా విషయం లో నీకు ఎందుకింత నిర్లక్ష్యం ?
అంటూ ఇంగ్లిష్ లో మాట్లాడుతుంటే మా అమ్మాయికి అర్ధమైపోయింది
నాన్న బాగా కోపం లో ఉన్నాడని.
రేపు పంపుతా, నాకు కుదరలేదు బిజీ గా ఉంది అంటూ కారణాలు చెప్పి
నన్ను శాంత పరచటానికి ప్రయత్నించింది.

కానీ చెప్పాగా శని గాడు పడితే,
చంగల్పట్టు శాంతారాంలు కూడా బీపీరావు లవుతారని..

నా మెదడు మొబైల్ లో శనిగాడి ఎస్సేమెస్సులు సేవ్ అయిపోయి,
మా అమ్మాయి మాటలకి నేను కన్విన్సు అవలేదు.
అదయ్యాక మామూలుగా మాట్లాడలేక పోయి
మళ్ళీ ఫోన్ చేస్తాలే అని చెప్పి పెట్టేసా.

నిజానికి నా టాక్స్ ప్లానింగ్ రాయితీ లిమిట్ దాటి పోయింది.
ఆ రసీదు వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు.

కానీ చెప్పాగా వేరే కారణాల వల్ల బాలేని నా బాడ్ మూడ్ ని మా అమ్మాయి మీద చూపించా.
ఫోన్ పెట్టేసాక ,
ఎప్పటి లాగానే గుమ్మడి డాడీ ఆలోచించటం మొదలెట్టాడు.
మెస్ కి డిన్నర్ కి వెళ్లిందో లేదో,
నేను సీరియస్ గా మాట్లాడానని దిగులు తో తిన కుండా పడుకుంటుందేమో...
ఇంటర్నల్ ఎగ్జాంకి, చదువుతోందో లేదో.
ఒక్కతే, దూరంగా ఉంది కదా కోపం చూపకుండా ఉండాల్సింది.
అసలు అలా మాట్లాడ కుండా ఉండాల్సింది.
మెల్లగా చెప్పాల్సింది.

ఎవడో వెధవ మీద కోపం మా బంగారం మీద చూపటం తప్పుగా అనిపించింది.
గిల్టీ అంతకన్నా మా అమ్మాయి చిన్న బుచ్చుకుందేమో అన్న దిగులుతో
కాసేపు అటూ ఇటూ గడిపి ....

వరసగా మెసేజీలు పంపా.
జరిగిన విషయం లో తప్పునాదేనని, సారీ చెపుతూ
అన్నం తిన్నావా అంటూ,
నీకు వీలు కుదిరినప్పుడు రసీదులు పంపు అంటూ,
నాలుగు మెసేజీలు పంపాను.
పది దాటాక మా అమ్మాయి
"yaah naanna i had fud .
i cud understand ur anger
i am ok
dont worry "
అప్పటి దాకా నా మనసు చాల మధన పడింది.
ఆ మెసేజీ తో కుదుట పడి నేను నిద్రకి ఉపక్రమించాను.

నిజానికి నా ఉద్యోగ పని వత్తిడి ఎంత ఉన్నా నన్ను అసలేమీ చేయలేదు.

రోజుకి పది గంటలు పైన ఎంతో ఆనందం గా పని చేసి
చుట్టూ ఉన్ననాతో పని చేసే వాళ్ళనీ ఉత్సాహ పరుస్తా.
కొన్ని అదనపు భాధ్యతలు ఆనందం గా స్వీకరిస్తా,
వాటి వల్ల మరింత రీచార్జ్ అవుతనే గానీ ఉద్రేక పడను.

కానీ కొన్ని దుష్ట శక్తులు నా ఆనందాన్ని భంగ పరచాలని,

నా సెల్ఫ్ ఎస్టీం కించ పరచాలని
చాలా ప్రయత్నిస్తుంటాయి.
ఆ దుష్ట శక్తులకు వేరే పనేమీ ఉండదు
ఏదోటి అని నన్ను చిన్నబుచ్చాలని నిరంతరం ప్రయత్నిస్తుంటాయి.
ఆ ప్రయత్నాలకి నేను కొన్ని సార్లు పడిపోయి దిగులు పడుతుంటాను.

కానీ ఇప్పుడు దృడ మైన నిర్ణయం తీస్కున్నా

ఎవడో పనికిమాలిన వాడి మాటలు రోజూ చేసుకునే గడ్డం తో సమానం
ట్రిపుల్ ప్లస్ తో గీసి పారేసి
కూల్ జెల్ రాసి కులాసాగా ఉండటమే.


ఇలాంటి పరిస్థితుల్లో మా అమ్మాయి ఒకసారి అంది

అలా మాటలనే వారు ఎవరిని పడితే వారిని అనరుకదా నాన్నా
సేలెబ్రిటీలు, లెజండులు కి మాత్రమే అవి ఉంటాయి.
కాబట్టి నువ్వు రేంజ్ చీర్ అప్ !! అంది.
ఎస్ నా మటుకు నేను లెజెండ్ నే!!


7, ఆగస్టు 2011, ఆదివారం

ఎవరికి చెప్పను..?


నాకు ఫ్రెండ్స్ లేరు బాబోయ్,
ఇంకా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఎవరికీ చెప్పను?


జన్మ నిచ్చిన అమ్మ,

తోడబుట్టిన వాళ్ళు,
ఇరవై ఆరో ఏట నా జీవితం లోకి అడుగిడిన భార్యా,
అదే ఏడు చివర్లో నా జీవితం వెలిగించిన నా కూతురూ,
ఇంకా బంధువర్గం ...

ఎప్పుడో ఒకసారి తళుక్కున మెరిసే చిన్ననాటి మిత్రులు,

ఫోన్లలో సరాగాలాడే కాలేజీ సహచరులు,
అప్పుడప్పుడు మెదిలే ఉద్యోగం బాచ్మేట్లు,
విధి నిర్వహణ లో నిరంతరం తారసిల్లే మనుషులు,
ఇంటిచుట్టుపక్కల ఆప్యాయంగా మెసిలే ఇరుగుపొరుగు వాళ్ళు,


వీరెవరూ నాకు మంచి మిత్రులు కారు

మంచి మిత్రునికి నా నిర్వచనం వేరే ఉంది,
అచ్చు నాలాగే ఉండాలి
రూపం లో కాక పోయినా
గుణం లో, మనసులో, మెదడులో
అచ్చు నాలాగే ఉండాలి.
నా లాగే ఆలోచించాలి.
నా అభిరుచులే ఉండాలి.
నా గుణాలే ఉండాలి.
అటువంటి ఇంకో మనిషి ఉంటాడా?
ఉంటే నాకు ఫ్రెండ్ గా కావాలి
నేను ఫ్రెండ్షిప్ డే శుభాకాక్షలు చెప్పటానికి తహ తహ లాడే
ఆ వ్యక్తి ఉన్నాడా, ఉంటే నాకు వినిపించాలి, కనిపించాలి, నాతో మసలాలి.
అత్యాశ అనిపిస్తే ఒదిలేయండి.

నేనే వెతుక్కుంటాను

వెతికేసు కున్నాను.
దొరికేసాడు
అది నేనే,
నేను పొగుడు కోవటానికీ, విమర్శించు కోవటానికీ,
వద్దని వారించటానికీ, ముందు కెళ్లమని భుజం తట్టటానికీ,
ఒంటరిగా ఉంటే కబుర్లాడటానికీ, మనసు నొస్తే మౌనం గా ఉండటానికీ,
ఇష్టమైన మంచి తిండి, పుస్తకం, సంగీతం,
రంజితమైన క్షణాలు, నిమిషాలు, గంటలూ ,
రోజులూ, జీవితం, గడపటానికీ

నాకో నేస్తం ఉన్నాడు.

మీకు నేను స్వార్ధపరుడిలా అనిపించినా
నిజం చెప్తా
అది నేనే !!
అందుకే నాకు నేనే , మొట్ట మొదటి
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గ్రీటింగ్స్ !!
ఆనందకరమైన స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు !!

ఆతర్వాతే మిగతా వాళ్ళందరికీ , మీ అందరికీ

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే !!


5, ఆగస్టు 2011, శుక్రవారం

నా నిశబ్దం...


Adjustment with right people is always better than Argument with wrong people.

A meaningful silence is always better than meaningless words.


--------------------------------------------------------------------------

Never
you could understand the silence of parents,

Neither tried to understand the silence of siblings.

You have wise heart to analyse how you are right,

But never had a reason to analyse how wrong you might.

Three fourths of life gone always on wrong track,

and I worry we never get the time back.

Till now you have no regrets,

Even to think what possible way can lead out.



I pray the God ...

to make it possible for you to Live in PEACE,

till your soul Rests in PEACE.

22, జులై 2011, శుక్రవారం

తగుల బెట్టేస్తే ..?


"హలో "
"హలో చెప్పండి "
"హలో హల్లో ఎవరూ ..?"
"హల్....నే ... తోందా?"
" ఎవరు ..?"
" నేనే ...హన రావ్ ని
" హలో సరిగ్గా వినపడట్లేదు .."
" హ..లో నే...అస..న రావు నండీ "
ఒక్క క్షణం అనుమానం ఆసన రావా ? అనాస రావా? ఆయాస రావా?
మళ్ళీ "హలో ఎవరూ..?"
"నే.. .. సహన రా.."
"సహన రా?"
".. న పడు... oదా?"
సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా.
"మళ్ళీ కాల్ చేస్తా ఈ నంబరు కే చెయ్యనా?"
"నే అసహన రావ్ ని ...తోందా?"
"లేదు "
"ధూ దీ న... ఫోనూ ధాల్ కనక్ ఛి డం "
చూస్తే కాల్ దిస్కనేక్టేడ్
ఈ సారి నేనే చేశా "కు.. కు.. కు.. మీరు డయలు చేసిన వాడి ఫోన్ స్విచాఫ్ చేయబడి ఉంది దయచేసి మళ్ళీ ప్రయత్నించండి"
గంట తర్వాత ఆఫీసు లో నా ముందు ఒకాయన ఉన్నాడు.
నమస్తే సార్ నా పేరు అసహన రావ్ (ఎక్కడో విన్నట్టు ఉందే..)
నేనే సార్ ఇందాక ఫోన్ చేశా సరిగ్గా వినపడలేదు.
అవును ఏదో పెద్ద శబ్దం తోకట్ అయింది మళ్ళీ నేనే కాల్ బాక్ చేశా స్విచాఫ్ అని వచ్చింది.
అవును సార్ కోపమొచ్చి నేల కేసి కొట్టా పగిలిపోయింది. మళ్ళీ చేద్దామంటే ఫోన్ లేదు మీ నంబరు కూడా లేదు.

ఆగు ఆగక్కడ సిగ్నల్ సరిగ్గా లేక పోతే ఫోన్ నేల కేసి కొడతావా...

అతనొచ్చిన పని ఒదిలేసి నా ఆలోచన లో నేను ... " ఏంటీ ఈ అసహనం? చిన్న విషయాలకే ఇంత రియాక్షనా?"
ఫోన్ సిగ్నల్ లేక పోతే మళ్ళీ కాల్ చేసి ప్రయత్నించాలి. అంతే గానీ ఫోన్ నేల కేసి కొడితే జరిగేది ఏంటి అసలు కే మోసం
అందుకే ఈయన పెద్దలు అసహన రావ్ అని పేరుపెట్టారు.

టీవీ లో స్క్రోల్ ...

జూనియర్ఇంటర్ చదివే పిల్ల కార్పరేట్ కాలేజీ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య
వత్తిడి తట్టు కోలేక అమ్మ నాన్నలని నిరాశ పరచలేక
నేను ప్రాణం ఒదిలేస్తున్నా నన్న లేఖ

ఇంకో ఛానల్ లో ఎక్స్ క్లూసివ్ మాదే...

ప్రేమికురాలి నిరాకరణ తో
ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య

పేపర్ లో....
ఆర్ధిక ఇబ్బందులూ అప్పుల బాధ తాళలేక కుటుంబం ఆత్మహత్య
హాస్పిటల్ లో రక్షింపబడి పదేళ్ళ బాలుడు అనాధగా మిగిలాడు

బ్రేకింగ్ న్యూస్
మా రాష్ట్రం మాకు ఇవ్వలేదని ఉరేసుకున్న పాతికేళ్ళ యువకుడు.

వీళ్ళందరికీ తల్లిదండ్రులూ,చదువు, సమాజం, వెనక నుండి నెట్టే నాయకులూ ఏమీ నేర్పరా ?

జీవితమన్నది ఒక్కటే నని,
చదువు, ప్రేమ, కుటుంబ బాధలూ, సొంత రాష్ట్రాలూ
ఇవన్నీ వివిధ మజిలీలనీ
అవి చేరక పోతే పోయేది ఏమీ పెద్దగా ఉండదనీ,

మళ్ళీ ప్రయత్నం చేయటం ద్వారా అవి సిద్దించ వచ్చని
అమాయకంగా ప్రాణాలు తీసుకుంటే మళ్ళీ తిరిగి రావనీ

ఇవన్నీ లేకుండా కూడా జీవితం ఉంటుందనీ
చచ్చి సాధించటానికి యిది అమర జీవుల శకం కాదనీ.

ఇంట్లో పిల్లలనుంచీ మొదలిడి బయట బంధు మిత్రుల దాకా
ఎవరైనా మానసిక ఒత్తిడికి గురైతే
డిప్రెషన్ లో ఉన్నట్లు కనపడితే
చేర దీయండి, నాలుగు మంచి మాటలు చెప్పి
ఏమార్చండి . అంతే కానీ పోయాక
సంతాప సభలు, ఓదార్పు యాత్రలూ, శవరాజకీయాలూ
ఎవడినో బాగు చేస్తాయి కానీ జీవితాన్ని తిరిగి ఇవ్వవు.

సెల్ అయితే మళ్ళీ కొనుక్కోవచ్చు, పరీక్ష పోతే మళ్ళీ వ్రాసి మంచి మార్కులు తెచ్చుకోవచ్చు,
ప్రేమ ఇంకోళ్ళనుంచి పొందొచ్చు, రాష్ట్రం బతికుండి సాధించు కోవచ్చు.

కానీ జీవితం ఒక్కటే అది మళ్ళీ రాదు,
పనికి మాలిన విషయాలకు, ఆశయాలకు దాన్ని బలి చేస్కోవద్దు.

చిన్నప్పుడు ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూసిన ఒక చెక్ సినిమా గుర్తొస్తోంది

ఒక ఫాక్టరీ కార్మికులు హక్కుల సాధనకై సమ్మె చేస్తారు. ఎన్ని రోజులు పోయినా యాజమాన్యం దిగి రాదు.
కార్మికుల కుటుంబాల లో కష్టాలు వివరం గా చూపిస్తారు.
చివరాకరికి విసుగొచ్చిన కార్మిక నాయకులు ఒక రాత్రి ఫ్యాక్టరీని తగుల బెట్టిస్తారు.
కార్మికులు విజయ గర్వం తో ఇంటికెళ్ళి కుటుంబ సభ్యులకి చెప్పి పడుకుంటారు.
తెల్లవారాక ఒక కార్మిక కుటుంబం లో దృశ్యం
అలవాటుగా కార్మికుడు యూనిఫారం తొడుక్కొని స్టీల్ టోపీ పెట్టుకొని గుమ్మం దాట బోతుంటే ...
వాళ్ళ పదేళ్ళ కూతురు ఇలా అంటుంది "
Otec Kam jdeš ..?"
(నాన్న ఎక్కడికి వెళ్తున్నావ్)

జీవితం కూడా ఫాక్టరీ లాంటిదే తగుల బెట్టేస్తే ఎలా జీవిస్తాం ?


ఎవరి నష్టం, ఎవరికి లాభం ?



ఏపి భవన్ అంటే ? ఆంధ్ర ప్రదేశ్ భవన్ అని కదా...
మరి తెలంగాణా వాదులకు శ్రీ యాదిరెడ్డి భౌతిక కాయాన్ని అక్కడికి తీస్కేళ్ళాలనే ఆలోచన ఎందుకు కలిగిందో ?
ఇంకా విభజన జరగలేదు కాబట్టి అది ఉమ్మడి భవనమే అనుకుంటే..
మరి హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళ ఆస్తుల ధ్వంసం, విగ్రహాల కూలేయ్యడం లాంటి పనులెందుకు చేసినట్టో...

ఎవడో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలిఅవుతున్నారు

అది యాది రెడ్డి కావచ్చు,
ఇంకా తొందర పాటు చర్యలో ఆత్మాహుతి చేస్కున్న విద్యార్ధులే కావచ్చు,
వాళ్ళ ఆత్మ శాంతికి ప్రార్ధిద్దాం....

సామరస్య ధోరణి లో మాట్లాడి దెబ్బలు తిన్న జయప్రకాష్ నారాయణే కావచ్చు,
విధి నిర్వహణలో తన్నులు తిన్న చందర్రావు కావచ్చు
వాళ్ళ మనో శాంతికి ప్రార్ధిద్దాం...

ఏరోజు బందో, ఏరోజు భోజనమో తెలియని కడు పేదవారు కావచ్చు
వారి క్షుద్శాంతి కై ప్రార్ధిద్దాం...


ద్వంసమైన ఆస్తులు కావచ్చు
హింస పడిన మనసులు కావచ్చు
నష్టాన్ని తిరిగి ఎవరూ పూడ్చలేరు
ఎందుకంటే

AN OLD SAYING:
GOD ONLY CAN TAKE LIFE
'COZ HE ONLY CAN GIVE IT.

MODERN PHYSICS :
MATTER CAN NOT BE CREATED,
BUT CAN BE DESTROYED EASILY !!

21, జులై 2011, గురువారం

"మా అమ్మ భానుమతి" పార్ట్-2


అలా సగం నిద్రా, సగం పాటలతో వెలుగు వచ్చేసింది. అంటే ఎండ కాదు కానీ చెట్లు ఆకుపచ్చగానూ, పొలాలు ఎర్రమన్నుతోనూ, దూరంగా కనీ కనపడని కొండలు నీలంగా నల్లగా కనపడే అంతగా వెలుగొచ్చింది. నేను కిటికీ లోంచి తల బయట పెట్టి విసురుగా తగిలే గాలికి నా జులపాల జుట్టు ఎగురుతుంటే, చల్ల గాలికి గుక్క తిప్పుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతూ తల లోపలకి తెచ్చేసుకుంటూ.. ఆనందిస్తున్నాను.

ఊహ తెలిసాక ఎప్పుడూ కొండలని అంత దగ్గరగా చూడని నేను శేషాద్రి కనుమలను చూస్తూ విస్తూబోతుంటే సూర్యుడు వచ్చి బోలెడు వెలుగు తెప్పించి ఎండ ఎక్కించాడు. మా బస్ దాదాపు తొమ్మిదికి కొంచం అటూ ఇటూ గా తిరుపతి బస్టాండు లో ఆగింది, మా రాజేశ్వరీ టీచరు వాళ్ళ తమ్ముడు ఆర్టీసీ లోనే పని. అయన బస్ దగ్గరకివచ్చి రిసీవ్ చేస్కొని రిక్షా మాట్లాడి, తను వెనుక సైకిల్ మీద అనుసరిస్తూ ఇంటికి తీస్కేల్లారు.

ఇంటికెళ్ళగానే మా రాజేశ్వరి టీచరు మొహం కడుక్కో, స్నానం చెయ్యి డ్రిల్ టీచరు అసలు స్వరూపం బయట పెట్టింది. ఆర్టీసీ బాబాయి వాళ్ళ ఇల్లు చిన్నగా పొందిగ్గా ఉంది, విచిత్రం గా వంటింటి పక్కనే బాత్రూం కూడా ఉంది ఆనుకుని. మా ఇంట్లో బాత్రూం అవీ కొంచం దూరం లో ఉండేవి. నేను వింతగా చూస్తుంటే ఇక్కదంతే జాగా తక్కువుండేదీ ఇల్లు గిలక్కాయల మాదిరి ఉండును. స్నానాల కొట్టు కూడా అందులోనే అని కొంచం యాస లో చెప్పింది పిన్నిగారు.

నేను స్నానం చేసా. అదేదో ముక్కు కి మంటగా ఉండే, బాదం కాయ షేప్ లో, గాజులా ఉన్న సబ్బు. పేరు చదివా పియర్స్. ఆ వాసన మొదటి సారి వాళ్ళింట్లో చూసానా.. ఆ తర్వాత ఎప్పుడు పియర్స్ తో స్నానం చేసినా నాకు తిరుపతీ ,ఆ చిన్న బాత్రూం, ఇత్తడి గంగాళం చెంబూ గుర్తోచ్చేస్తాయి. ఇప్పటికీ ఒట్టు.

అయ్యాక ఆరోజంతా రెస్ట్ సాయంత్రం బయటకి వెళ్లాం. గోవింద రాజ స్వామి గుడి కెళ్ళాం. ఆ గుడి నాకెందుకో తెగ నచ్చేసింది. సాయంత్రపు సేవ అనంతరం మాకు పెట్టిన దద్ద్యోజనం కారణమయి ఉంటుంది.

కాసేపు తిరుపతి వీధుల్లో తిరిగి ఇంటికొచ్చేసాం. ఆ రాత్రి మిద్దె మీద ఆరుబయట పడుకున్నాం. అక్కడి నుంచీ చూస్తే దూరంగా కొండలూ , బస్ దారీ, నడకదారీ వెంబడి లైట్లు లీలగా కనిపించిన నామాలూ. ఏదో లోకం లో ఉన్నట్లు గా అనిపించింది. అసలు తిరుపతి ఊరంతా ఏదో లోకం లా ఉంటుంది సందడి గా ఎంత రాత్రయినా మనుషుల అలికిడి తో, పెళ్లివారిల్లులా...


మరుసటి రోజు పొద్దున్నే లేపేసారు. కొండకి వెళ్లాలని స్నానం అయ్యాక జత బట్టలు చిన్న బాగ్ లో పెట్టుకున్నాక గుర్తొచ్చింది మా అమ్మ ఇచ్చిన బిస్కట్ పాకెట్.

అడుగు దామని మళ్ళీ ఊరుకున్నా. మేము నలుగురమూ మళ్ళీ బస్టాండ్ కి వెళ్లి ఆర్టీసీ బాబాయి ముందే డ్రైవరుకి కండక్టర్కి మనోళ్ళే కొండకి ఎల్తన్నారు కాస్త బస్ లో జాగా అట్టిపెట్టేదీ.. అని చెప్పి ఉంచటం వల్ల ముందు సీట్లలో కూర్చున్నాము. బస్ బయలు దేరగానే గోవిందా గోవిందా లతో మార్మోగింది. మా రాజేశ్వరి టీచరూ, పిన్ని గార్లూ నాకు జాగ్రత చెప్పారు బస్ కొండ ఎక్కేటప్పుడు మలుపు తిప్పుళ్ళలో వాంతులవుతాయి , అలా అనిపిస్తే ముందే చెప్పు అని. అరగంట తర్వాత బస్ కొండ ఎక్కడం ప్రారంభించింది.

ఇంకో పది నిముషాలకు రోడ్ మలుపులు రావటం మొదలయ్యాయి. నా పక్క వాళ్ళిద్దరూ నా సంగతి పట్టించుకోకుండా చీర కొంగులు ముక్కు కీ మూతికీ అడ్డం పెట్టుకొని ఏదో అవస్థ పడుతున్నారు. నాకు అర్ధం కాలేదు ఏమైందో అని.

ఉత్తర క్షణం లో ముందు రాజేశ్వరి టీచరు ఆనక ఆర్టీసీ పిన్నీ బస్ కిటికీ లోంచి తలలు బయటకి పెట్టి ఓక్క్.. ఓక్క్.. అంటూ డొక్కోవటం చూసా అలాగే బస్ లో ఇంకొంతమందీ..... అదయ్యాక సీసాలో నీళ్ళతో మూతి కడుక్కొని హ్యాండ్ బాగ్ లోంచి నిమ్మకాయలు ఇంకా నిమ్మతొనలనే బిళ్ళలూ తీసి ప్రధమ చికిస్థ ప్రారంభించారు. ఇలాటి బాధ లేమీ లేని నేను తిరుమల కొండల అందాలు చూస్తూ గడిపేశాను.

అంతలో తిరుమల వచ్చింది. ముందు కళ్యాణ కట్టకి వెళ్లి అక్కడ నా ఆరునెలల పొడుగు కేశ ఖండన చేయించి. స్నానం చేసాక బట్టలేస్కోని వెళ్లి పెద్ద పెద్ద కటకటాలున్న హళ్ళలో సిమెంటు బెంచీల మీద కూర్చున్నాం. ఎవరో మా హాలు కి తాళం వేసారు.

అలా కొన్ని గంటల తర్వాత మాముందు హాలు తెరిచి వాళ్ళని పంపారు. పోద్దునేప్పుడో తిన్న ఇడ్లీలు అరిగి కడుపు ఖాళీ అయితే నాకు ఆకలని అడగటానికి మొహమాటం, కాసేపటకి రాజేశ్వరి టీచరు తన దగ్గరున్న బాగ్ తెరచి అందులోంచి అమ్ప్రో బిస్కట్ ప్యాకెట్ ఇచ్చారు తినమని. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్న పాఠం
షేరింగ్ ననుసరించి వాళ్లకు కూడా బిస్కట్ లు పంచాను, ఇంకా ఆమె బాగ్ లో నున్న పళ్ళూ తినుబండారాలు కూడా తిన్న తరువాత ఎప్పటికో మా హాలు తాళం తెరిచారు.

పొలోమని తోస్కుంటూ తొక్కుకుంటూ ఇంకో గంట కి ఆ కలియుగ దైవాన్ని దర్శించుకున్నాము. అప్పట్లో ఈ లఘు, మహాలఘువు లు లేవు తీర్ధం శటగోపం కూడా లోపలే ఇచ్చేవారు. స్వామి ని బాగా దగ్గర నుండీ చూడ అవకాశం కలిగేది.
మా అదృష్టం బాగుందీ మా ముందున్న ఎవరో పెద్దాయన గౌరవార్ధం హారతి ఇస్తే లైను మాతో గర్భగుడిలో ఆగిపోయి మేము కొద్ది నిముషాలు అలాగే ఉండి, దివ్య దర్శనం చేస్కున్నాము. బయటకి వచ్చి భోజనం చేసి, కాసేపు అటూ ఇటు తిరుగుతూ కొండపైనెక్కడో కనపడే గులాబీ రంగు భవనాన్ని జమునా బిల్డింగ్ అని చెప్పారు. జమునేవరో నాకు తెలీలా. ఆ భవనము ముందు గార్డెన్ లో కాసేపు ఉండి. చీకటి పడే వేళకు బస్టాండ్ కి వచ్చి బస్సెక్కి తిరుపతి వచ్చేసాం.

ఆ మరునాడు సాయంత్రం వాళ్ళ ఇంటి దగ్గర లో నున్న ఇంకో గుడికి తీస్కేల్లారు. పెద్ద గుడి ఆవరణ పెద్ద చెట్టు నాకు గుర్తున్నాయి. మంటపం లో ఎవరో పెద్దాయన పురాణం చెప్తున్నారు అక్కడ వెన్నెల్లో కూర్చొని చల్ల గాలి ఆస్వాదిస్తూ , చాలా మంది పురాణం వింటున్నారు. కొద్ది సేపట్లో మేము ఇంటికెళ్ళి పోయాము. బహుసా అది కోదండ రామాలయం అని నా ఊహ. ఆ మరునాడు సాయంత్రం మళ్ళీ తిరుగు ప్రయాణం. ఎందుకో చాలా దిగులుగా అనిపించింది. కారణం తెలీని దిగులు. ఆ దిగులు నాకు ఇప్పటికీ ఉండి తిరుమల వెళ్లి తిరుగు ప్రయాణం లో నేను అలా కాసేపు దిగులు గా అయిపోతా, ఆ దివ్య క్షేత్రం లో ఉన్న మహత్తు అలాంటిదో, మరింకేమో కారణం కానీ.


ఎందుకో తిరుగు ప్రయాణం గుర్తులేదు. మర్నాడు మా బందరు లో పొద్దున్న 9 గం లకి చేరాం వెంటనే ఇంటికెళ్ళి స్నానం చేసి స్కూల్ డ్రెస్ లేకుండానే పడి కి ఒక పడి నిముషాలు ఆలస్యం గా వెళ్ళాను అప్పటికి సరోజినీ టీచరు గారి ఫస్ట్ పిరియడ్ తెలుగు మొదలై పోయింది. ఆరునెలలుగా జులపాల తో ఉంది ఒక్క సారి గుండు కనిపించేసరికి మా క్లాస్ లో పదకొండు మంది అబ్బాయిలు కిల కిల నవ్వారు. మా సరోజినీ టీచరు నా వంక ఒక సారి తృప్తిగా చూసి అమ్మయ్య ఇప్పుడు హాయిగా ఉందిరా బుజ్జీ అన్నారు. మా క్లాసులో మిగతా పాతిక మందీ అమ్మాయిలు వాళ్ళలో వాళ్ళే ఏదో గుస గుస లాడుకొంటూ నవ్వుకుంటున్నారు.


నవ్వితే నవ్వారులే నాకేంటీ అని ఊరుకున్నా. మీరే చెప్పండి ఊరుకున్నంత ఉత్తమం, బోడి గుండంతా సుఖం లేదనేగా మీరూ అంటారు. అదే జరిగింది.


కొస మెరుపు : మధ్యానం తీరిక లో మా అమ్మ రాజేశ్వరీ టీచరుని అడిగింది మా వాడు ఎమన్నా ఇబ్బందీ, పేచీ పెట్టాడా అని ? ఆమె నవ్వి ఏమీ లేదు రాత్రి నిద్ర లో ఒక్క కాలు ఒక్క చెయ్యి నా మీద వేసి పడుకున్నాడు అంతే, నాకూ కదలడానికి వీలు లేకుండా అన్నారు. ఆమె కి ఎందుకనో పెళ్ళికాలేదు, అందుకే పిల్లల కాలూ, చెయ్యి గోల లేదు మరి.


20, జులై 2011, బుధవారం

మా అమ్మ భానుమతి !!




పాట ను ఆటో ప్లే లో పెట్టలేదు వినలనుకున్నవారు ప్లే బటన్ నొక్కండి


భానుమతి మా అమ్మ.
నిజం !! చిన్నప్పుడు నేను పొత్తిళ్ళ వయసులో ఉన్నప్పటి నుంచి ఎత్తుళ్ళ దాకా,
పారాడే వయసు లోంచి, మాట్లాడే వయసుదాకా మా ఇంట్లో భానుమతి అటూ ఇటూ తిరుగుతూ పని చేస్కుంటూ, దొడ్లో కాళ్ళ మీద కూర్చోపెట్టుకొని నీళ్ళు పోస్తూ "పెరిగే మా బాబు ధీరుడై ధరణీ సుఖాలా నేలగా....." అంటూనో
మాకు చదువు చెప్తూ, అన్నం వండుతూ, పొద్దున్నే స్కూల్ కి టైమవుతుంటే హడావిడిగా పూజ చేస్తూ మధ్యలో "సావిరహే తవ దీనా..." అంటూ కూని రాగాలు తీసేది
సాయంత్రం మేము చేసే పనులకు అరుస్తూ, మా వెంట పరిగెత్త లేక వగరుస్తూ,
స్కేల్ రొంపిన దోపుకొని దొరికాక వేస్తా మీకు మంచి పెసరట్లు అంటూ బెదిరిస్తూ " సన్నజాజి తీవేలోయ్ సంపంగి పూవులోయ్ ..." ఎప్పుడూ పాడుతుండేది

అంతమాత్రాన మీరంతా భానుమతంటే సినిమా లో భానుమతనుకునేరు మా అమ్మ భానుమతికి పిచ్చ ఫాను.
చాలా బాగా పాడేది. అంచేత మా ఇంట్లో మిగతా వాళ్ళ సంగతేమో కానీ నాకు మాత్రం భానుమతి పాటలంటే భలే ఇష్టం.

రోజు ఆఫీసు నుంచి వస్తూ ఆమె సీడీ వింటూ ఆమె పాటల్లో ఒక మంచి ముత్యం "మేలుకోవయ్యా కావేటి రంగా శ్రీరంగా మేలుకోవయ్యా .. దగ్గర ఆగి పోయా. క్రమం గా నా ఎనభై కిలోల బరువు తగ్గిపోయి నేను పొట్టిగా సన్నగా పీల గా
మెడల దాకా జుట్టు తో మారిపోయా. అదేంటో నా షూస్ బాగా లూస్ అయ్యాయి నా చొక్కా ప్యాంటు నా శరీరానికి నాలిగింతల పెద్దవి అయ్యాయి.

కారణం పాట వింటూ నేను నేను ముప్పై అయిదేళ్ళ వెనక్కి వెళ్ళిపోవటమే...
అప్పుడు నాకు పదేళ్ళు చదువు ఐదో క్లాస్ లో ఉన్నా. ప్రతీ ఏడు క్రమం తప్పక తరువాతి తరగతికి ఎదిగినట్లే, పొడుగు పెరిగినట్లే, పెద్దాడినయినట్లే, నాకింకో అలవాటు కూడా ఉంది.
అదేంటంటే ప్రతీ ఏడూ క్రమం తప్పక ఏదో ఒక అనారోగ్యం తెచ్చుకోవటం, కుట్లేసే అంత గాయం ఆటల్లో తగిలించు కోవటం చేసేవాడిని. ఒక ఏడు డబల్ టైఫాయిడ్ వస్తే ,ఇంకో ఏడు తడపర కోరింత దగ్గు, ఇంకో సారి ఆటలమ్మ.
ఇంకో సారి ఇంకోటీ ఇలా నా పద్ధతి లో నేను జబ్బు పడేవాడిని.

ఒక నెల రోజులు రెస్ట్ గా ఇంటి వద్దే విద్యాభ్యాసం. అల్లాంటి టైముల్లో మా అమ్మ గంగానమ్మ కి సద్ది పోయించంటం నుంచీ మొదలుకుని తిరుపతి వెంకన్నకు నా జుట్టు ఇస్తానని మొక్కుకోవటం దాకా. ఐదో క్లాస్ మొదట్లో వచ్చిన టైఫాయిడ్ కి తిరుపతి మొక్కు మొక్కింది. ఇక అప్పటి నుంచీ నో క్రాఫ్ అలా ఆరునెలలు గడచినాయి. తిరుపతి వెళ్ళే వీలు కాలేదు. మా అమ్మా నాన్న ఇద్దరూ ఉద్యోగాల వలన ఒకే సారి సెలవ దొరకకో, ఇంకేదో కారణాల వల్లో అలా నెలల తరబడీ నా మొక్కు తీరక, జుట్టు పెరిగి హిప్పీ లా తయారయ్యా.

ఇదంతా చూసి ఒక రోజు మా అమ్మా ఫ్రెండు రాజేశ్వరిటీచరుగారు వాళ్ళ తమ్ముడు తిరుపతిలో ఉంటారు, ఆయన్ని చుట్టపు చూడటానికి వెళ్తూ నన్ను తనతో పంపమని మొక్కు చెల్లించి తీసుకు వస్తానని చెప్పారు. ఇదేదో మంచి అయిడియా లా ఉందని మా అమ్మా ఒప్పుకుంది.

ఒక మంచి రోజుకు టికెట్స్ బుక్ అయ్యాయి. బందరు-తిరుపతి బస్ కి. సాయంత్రం ఏడు గంటలకి ప్రయాణం మొదలు. చక్కటి చిక్కని ఎర్రటి రంగున్న బస్ లో మూడు రెండు (3 బై 2 ) ఆకుపచ్చని రెగ్జిన్ సీట్లున్నాయి . గంటకు నలభై కిలోమీటర్ల వేగం మించని భద్రమైన మా మంచి బస్. సుమారు నాలుగు వందల తొంబై కిలోమీటర్ల దూరం పద్నాలుగు గంటల్లో తీస్కెళ్ళే ఉదారమైన బస్. ఉదారమంటే, మరంతేగా చిన్నప్పుడు బస్ ఎక్కితే గమ్యం త్వరగా రాకూడదు అని కోరుకునే వాడిని ఎంచక్కా బస్ లోనే ఉండచ్చని.
కిటికీ లోంచి చూస్తూ వెనక్కి పరిగెత్తే లైటు స్తంభాలు, చెట్లు, ఇళ్లు, మనుషులు ఇతర వాహనాలు చూస్తూ. (నిజానికి అవేమీ పరిగెత్తవుట మనమే ముందు వెళ్తామట మా శాంతీ టీచర్ చెప్పేవాళ్ళు).

ఇంతకీ రోజు రానే వచ్చింది నేనూ మా రాజేశ్వరి టీచరు బస్ ఎక్కాము. ఎక్కే ముందు మా ఆమ్మ ఒక అమ్ప్రో బిస్కట్ పాకెట్ కొనిచ్చింది. దార్లో ఆకలేస్తే తిను అని. అది మా టీచరమ్మ బాగ్ లో పెట్టేసారు. అడగటానికి నాకు మొహమాటం. ఆమె ఇవ్వలేదు.

అలా రాత్రి ఏడు గంటలకు మొదలైన మా ప్రయాణం సుమారు రెండు గంటల పై చిలుకు తర్వాత బెజవాడ జేరింది. పావుగంట తర్వాత మెల్లగా గుంటూరు వైపు దారి తీసింది. బస్ లో నిద్ర పట్టని నేను రెప్ప వాల్చకుండా కిటికీ లోంచి చూస్తూనే ఉన్నాను. మధ్యలో ఆకలి లేక పోయినా మా టీచరు బిస్కట్ పాకెట్ ఇస్తే బాగుండు కదా అనుకున్నా. ఉహు ఎం లాభం లేదు ఇవ్వలేదు పైగా సీటు వెనక్కి తల జేరేసి కళ్ళు మూస్కొని ధ్యానం చేస్తున్న భంగిమ లో ఉండి పోయారు.

నేను ఆమె వంక కిటికిలోంచి మార్చి మార్చి చూస్తూ గడుపుతున్నాను. ఒకటి రెండు సార్లు ఆమె కళ్ళు తెరిచి నన్ను ఇంక చూడటం ఆపి పడుకో అని హెచ్చరించారు కూడా . నే వినలా ముఖం అటు తిప్పి కిటికీ వీక్షణం చేశా.

బస్ ఎన్నో ఊర్లు దాటి చిలకలూరిపేట అనే చోట ఆగింది, పదకొండింటి సమయం లో ఎర్ర బల్బుల వెలుగు లోని ఊరు. ( అప్పటికి ట్యూబులైట్లు ఇంకా బాగా వాడకం లోకి రాలా ) చిన్న చిన్న కొట్లు, మనుషుల హడావిడి తో సందడి గా ఉంది. పేరుని బట్టీ ఊర్లో చిలకలెక్కువ ఉంటాయేమో అని అనుకున్నా. ఉన్నా చీకట్లో పడుకొని ఉంటాయి మన బస్ దగ్గరికి వచ్చి కువ కువ లాడవుకదా అని సరి పెట్టుకునా.

కూరల గంపలూ, వాసన ద్వారా తెలిసిన ఉల్లిపాయల బస్తాలు బస్ లోకి ఎక్కాయి. మళ్ళీ చీకటి లోకి బస్ దూసుకు పోవటం మొదలెట్టింది. లోపల కూరగాయల వాసన, బయట పొలాల మీంచి వచ్చే గమ్మతైన వాసనల తో బస్ ఎగుడు దిగుడు రోడ్ల మీద ఎగిరెగిరి పడుతూ వెళ్తోంది.
చల్లటి గాలి మొహమ్మీద కొడుతుంటే బస్ కుదుపులకి ఊయల హాయి వచ్చి, నాకు నిద్ర ముంచుకొచ్చి , మా రాజేశ్వరి టీచరు గారి చేతి మీద తల ఆన్చి నేనూ ధ్యానం లోకి వెళ్ళిపోయా.
ధ్యానం లో నాకెన్నో కనపడ్డాయి.... కొండలూ లోయలూ, నాకు బిస్కట్ పాకెట్ ఇవ్వకుండా ధ్యానం చేస్కుంటున్న మా రాజేశ్వరి టీచరూ, ఊయలా, ఉల్లిపాయలూ, వెంకటేశ్వరుడూ, మా బడీ, మా ఇల్లూ, మా ఆమ్మ భానుమతి, ఆమె పాటా ఇలా ఒకదానికొకటి పొంతనలేని వన్నీ దొంతర దొంతరలు గా వచ్చి కనపడి వినిపించాయి.

ఎందుకో ఊయల ఊపు ఆగింది ఎవరో ఊయాలని చేత్తో పట్టుకొని ఆపేశారు కానీ మా ఆమ్మ భానుమతి పాటా మాత్రం వస్తూనే ఉంది " పెరిగే మా బాబు ధీరుడై ........
శ్రీకర కరుణాల వాల వేణుగోపాలా....." అంటూ కమ్మగా చెవుల్లో కొంగు సన్నగా నులిమి, తలంటిన తడిని తుడుస్తున్న ఆమ్మ చీర గిలి లా .... పాట.

కొద్ది క్షణాల్లో నేను ధ్యానం లోంచి బయటకి వచ్చేసా. పక్కన ఆమ్మ బదులు రాజేశ్వరి టీచరు. నేను మొహం తిప్పి కిటికీ లోంచి చూస్తే ఏదో ఊర్లో బస్ ఆగిఉంది. కొంచం పెద్ద ఊరే మనుషులు చూస్తుంటే కొంచం బడాయిగా ఉన్నారు బస్ ఆగిన చోట పెద్ద బస్ స్టాండు టీ బ్యాంకు, మళ్ళీ అదే ఎర్రబల్బు కాక పోతే గ్రాం ఫోన్
రికార్డ్ దానికో స్పీకర్ డబ్బా.. అందులోంచి మా ఆమ్మ గొంతుతో ఇంకేదో పాట ".... వయ్యా... కావేటి రంగా శ్రీ రంగా మేలుకోవయ్యా.. తెల్లవారేనుగా ...".అంటూ.

ఇదేంటి మా ఆమ్మ ఈ పాట ఎప్పుడు పాడిందీ అనుకుంటూ కుతూహలంగా విన్నా ...ఆ తెల్లారి చీకట్ల లో అంత కమ్మని గొంతు తో అంత చక్కని ఆ పాట శ్రీ రంగనాధుడిని మేలుకో మంటూ వేడుకున్న పాట నా మనసు లో లోతుగా నాటుకు పోయింది. ఇంతకీ మేము ఆగిన ఆ ఊరు నెల్లూరు.

ఇలా తిరుపతి వెళ్ళే బస్సులన్నీ అక్కడ తెల్లారి ఆగుతాయిట. ఆగిన ప్రయాణీకులకి వాళ్ళ నెల్లూరు బడాయి అంతా చూపిస్తూ గ్రామఫోన్ లో వాళ్ళ శ్రీరంగడిని నిద్ర లేపే ఆ పాట వేస్తూ నాలాటి పామర జనానికి వాళ్ళ నెల్లూరి సంస్కృతీ ప్రాభావాలు ప్రదర్శిస్తారన్నమాట.
అందుకే దాన్ని బడాయి అన్నా.( నెల్లూరు సాములూ సరదాగా తీస్కోండి. నాకు నెల్లూరంటే చాలా ఇష్టం ).

ఆ తర్వాత బస్ బయలుదేరిన దగ్గరినుంచి ఇంక నిద్ర పట్టలేదు.
సాహిత్యం రాని ఆ పాట ని నా అపస్వర కూని రాగాలతో పాడుకుంటూనే ఉన్నా మధ్య మధ్య ధ్యానం చేస్తూ....

అదన్న మాట సంగతి !! ఈరోజు విన్న ఈ పాట నా మనసు జ్ఞాపకాలను అంత లోతుగా తవ్వి బయట పెట్టిన విధానం...

మీకు బోర్ కొట్టి ఉండవచ్చు కానీ నా లిపి లేని భాష ఇంకెక్కడ రాస్కోనూ..?