29, అక్టోబర్ 2013, మంగళవారం

నలుపు తెలుపుల వాన..



వాన రంగు తెలుపు
చల్లగా గాలితో మొదలెట్టి తుంపరనిపించి, వడిగా పడి..
వాడి గా కురిసి ..
ఒకటి కాదు రెండు కాదు వారం రోజులుగా అదే పన్లో ఉంది.
ఆ వరసలో నేను
పొద్దున్న ఆలస్యం గా లేవటం, ఆబగా  కాఫీ తాగి,
బద్ధకం గా ఒళ్ళు విరుచుకొని, నిదానంగా తయారయ్యి ఆఫీసుకి వెళ్లి
చలిగా ఉందని ఏసీ కొంచం తగ్గించి,
ఎవరూ రారని , పని కూడా లేదని అప్పుడో కాగితం చూడటం,
ఇప్పుడో టీ తాగటం చేసేసి, మూడు ముప్పావుకి ఇంకా చాల్లే అని ఇంటి దోవ పట్టి
నాలుగున్నార కల్లా ఇంటికేల్తే, వర్షమని ఇంటి కొచ్చేసిన పిల్లలు పాత పేపర్లతో పడవలు చేసి
ఐదో అంతస్తులో ఎక్కడ వెయ్యాలా అని అయోమయంగా చూస్తే, ఎత్తులో ఉన్నామని మురిసి పోతూ చూసిన
మా ఆవిడని , ఖరీదైనా పర్లేదు ఉల్లిపాయ పకోడీలే వెయ్యమని ,
బాల్కనీ లో కుర్చీలో కూర్చొని వేడి ప్లేట్ పడిపోకుండా ఎతైన బోజ్జమీద పెట్టుకొని
విలాసంగా నములుతూ దూరంగా కొండ మీద పడుతున్న వాన,
దగ్గరలో రోడ్ మీద పడుతున్న వానల మధ్య తేడా బేరీజు వేస్కుంటూ
ఇదే సుఖం ఇలాగే రోజులు గడిచిపోవాలి అని కోరుకున్న.
ఏ వర్షపు సెలవు రోజైనా మధ్యాన్నం
వెచ్చగా దుప్పటి కప్పుకొని
చలం రచనలో, కలాం అనుభవాలో, హలం డాన్సులో  ఆస్వాదిస్తూ
నా అంత ఉన్నత అభిరుచులు , సున్నిత భావుకతా ఇంకెవడి కుంటాయిలే
అన్న ధీమాతో  , బీమా చేసిన జీవితం లా నిబ్బరంగా ఉన్నా !!

వాన రంగు నలుపు 
ఎప్పుడూ ఉక్కగా వేడిగా ఉండే వాతావరణం ఒక్కసారి చల్లబడి 
మబ్బేసి ముసురేసి స్తబ్దుగా ఉంది..
గొనె అడ్డం కట్టిన ద్వారం (?) లోంచి పైకి చూస్తే కనపడే చుక్కలు. అర చంద్రుడు కనపడట్లేదు..
చూరు వంక చూస్తుంటే  ఇరుకైన భావన ..
గాలి తిరిగింది .. ఆగి ఆగి విసురుగా నిలబెట్టిన రేకుల్ని ఊపేస్తోంది,
దానికున్న చిన్న చిన్న చిల్లుల్లోంచి ఏసీ పెట్టినట్టు తోస్తోంది.
రేపెలా ఉంటుందో ..?
తెల్లారితే తెలుపోస్తుందో లేదో ...
అలా తటపాయిస్తూ.. తచ్చాడుతూ కునుకు వచ్చింది.
బుగ్గ మీద పడ్డ చినుకుతో మెలకువ వచ్చింది.
తుంపర పడుతోంది, అందులో ఒక చినుకు గాలితో దిశ మార్చుకొని, గొనె పక్కన సందు చేస్కొని 
చాపమీద ఉన్న నా బుగ్గని ముద్దాడింది, ఎదో నా మీద ప్రేమ ఉన్నట్టు.
అంతా నాటకం, ఆ ప్రేమ కాస్త ఎక్కువైతే నా కష్టాలు ఆ దేవుడికే ఎరుక.
రేకు అవతల సన్నని వెలుగు రేఖ. చిన్న అలికిడి, పేపర్లేసే వార్తాహరుడు సురేష్ లేచినట్లున్నాడు
రెండింటికి లేచి ఆరే నిముషాల్లో తయారయ్యి
, అరగంట సైకిల్ తొక్కి జమ్మిచెట్టు దగ్గర మూసేసిన షాపుల ముందు పడేసిన పేపర్ల కట్టలు విప్పుకుని తన వంతు లెక్క పెట్టుకొని ప్లాస్టిక్ షీట్ తో చుట్టుకొని వానకి దడిచి, తలకో బిగ్ బజార్ కవర్ బిగించి , ఒంటిమీద పాత జెర్కిన్ సరి చేస్కొని, ప్యాంటు రెండు మడతలు పైకి చుట్టి మూడు  గంటల్లో అవన్నీ పంచేసి ఇంటికి రావాలి మరి. సైకిలు స్టాండ్ తీసిన తరువాత , బలంగా తొక్కుతున్న కిర్రు కిర్రు మోత. బెల్లు కొట్టడు మిగతా వారికి నిద్రాభంగమన్న సంస్కారం.
ఇంకో రేకుపక్క పాల  పేకెట్లు వేసే కాశి అప్పటికే వెళ్ళి పోయినట్టున్నాడు. వాడి నాలుగేళ్ల తమ్ముడు నిద్ర లేచి సన్నగా ఏడుస్తున్నాడు, బహుశ ఆకలేమో.
అలా రెండు గంటలు గడిచే సరికి ... ఎదురు రేకుల్లో ఉండే పాచి పని మణెమ్మ జుట్టు బిగిస్తోంది వానైనా ఏమైనా వెళ్ళాల్సిందే కదా.   చాప మీంచి లేచి గొనె తప్పించి బయటకి వచ్చా, తుంపర మొహానికి కొడుతుంటే మొహం కడిగే అవసరం లేక పాయె. బస్తీ అంతా మేల్కొంది. కూరలమ్మే వాళ్లు, పనుల్లో కెళ్లేవాళ్ళు, కూలి వెతుకోవాల్సినవాళ్ళు
అసలు తమను తామే  వెతుక్కోవలసిన వాళ్ళు.. అంతా కోలాహలం.
మూడు రోజులు అలా గడిచి ముసురు జడివాన గా మారిగా ఏడిపిస్తున్నా ...
సురేష్ కి పేపర్లు తప్పలా, కాశీకి పాల పేకెట్లు తప్పలా, మణెమ్మకి అంట్లూ, పాచీ తప్పలా 
ఎవరికీ ఏదీ తప్పలా. 
వానకి ఆకుకూరల మళ్ళు, కూరగాయలు కుళ్ళిపోయాయిరేట్లు  రెట్టింపయ్యాయి,
రోడ్ పక్కన జంగిడీలు తడిసి ముద్దయి , బేరాల్లేక విల విల లాడాయి.
ఆటో వాళ్ళు కిరాయి, సున్నం మట్టి పని కూలీలు పనులు దొరక్క బెంబేలు అయ్యారు.
బస్తీ లో పొగ చుట్టాల్సిన  రేకులు తడితో మెతక బడ్డాయి. 
అర్ధాకలి తో ఆడే పిల్లలు పస్తు తో పడుకున్నారు.
ఇళ్ళమధ్య నీళ్ళు నిండి మురుగు చేరి  దోమలు, వాటితో బాటు జోరాలు కూడా వచ్చాయి.
ఒదిలేస్తే  ఇంకా ఏదేదో అవుతుందేమో అన్న కారణాన గవర్నమెంటు టీవీ లో ప్రకటన కూడా ఇచ్చింది 
వర్షాన్ని  అరికడతాం, బురదని ఎండ బెదతాం అంటూ..

ఐదో రోజు కూడా వానే, రోడ్ మీద, భవనాల మీద డాబాల మీద, పెంకుల మీద, రేకుల మీద, తాటాకుల మీద 
వినైల్ షీటు మీద- దానికింద గాక్కున్న జీవుల మీదవానే వాన.
చాలా బతుకులు అస్తవ్యస్తం చేసేసి, చాలా ఆచ్చాదనలు చిందరవందర చేసేసిన వానే వాన.
చేలల్లో పంటలు ముంచేసి, గుడిసెల్లో వంటలు ఆపేసి,
కళ్ళాల్లో కంకులు మొలకలేసి, కళ్ళల్లో దైన్యం పుట్టించిన
ఈ ముసురు వాన ఎవడికైనా ఆనందమేమో కానీ మాకు మాత్రం కాదు.
నాలాగా ఇంకా చాలామంది..
అరవై ఐదేళ్ళ వయసులో బ్రతుకు తెరువుకి ఇంటింటికీ తిరిగి వారపత్రికలు పంచే సీతారామయ్య గారు,
నలుగురు పిల్లలు, తాగి ఆక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్న ఏసోబు బతుకు భారం మోసేందుకు ఇళ్ళల్లో పాచి పనిచేసే దేవమ్మ, 
పగలు ఇంటర్ చదవటానికి తెల్లారే పాల పాకెట్లు, పేపర్లు  వేసే పదిహేడేళ్ళ సురేష్ బాబు,
గంపెడు కుటుంబ భారం మోయటానికి రోజుకి పన్నెండు గంటలు పూల తిరిగి అమ్మే సాయిబు రజాకు,
ఇలా లెక్కేస్తే వర్షానికి ఆనందించే వాళ్ళ కన్నా, కళ్ళ నీళ్ళు పెట్టుకునే వాళ్ళ సంఖ్యే పెద్దది.

అందుకే ఈ వాన నాకు నల్ల వాన.  రోజువారి కలలు వమ్ము చేసే కల్ల వాన.








30, జులై 2013, మంగళవారం

మనమే !!



ఈ  కాంగ్రెస్ ని గెలిపించింది మనమే
తెలుగు దేశం మనదన్నదీ  మనమే,
కాషాయం కావాలన్నది మనమే,
జై జగన్ అన్నదీ మనమే,
మతానికి ఓటేసింది మనమే,
ఎర్ర జండెత్తింది కూడా మనమే
మనమంటే మనం
మనమంటే జనం
ఛీ ఛీ అన్నా,  ఛా ఛా  అన్నా  మనకే
ఖాండ్రించి ఉమ్మినా మనమీదే...
అంతేత్తునున్న ఆకాశం మనమే.. 

దిగజారి కింద పడింది మనమే ..
మనమంటే జనం
అంటే ఓటేసిన జనం 

మనమంటే
పోటీ పడ్డ అజ్ఞానం !!