5, జూన్ 2011, ఆదివారం

పరైకడవు అంటే నాకిష్టం ...







సమయం అయిదు గంటల పదిహేను నిముషాలు పరైకడవు గ్రామం కేరళ రాష్ట్రము సముద్రపు ఒడ్డున ఉన్న చిన్న పల్లెటూరు.
సునామీ వల్ల దెబ్బతిన్న తీర ప్రాంతపు కుగ్రామం. సునామీ తర్వాత తీస్కున్న జాగ్రత తో తీరం వెంబడే వేయబడిన కొండ రాళ్ళ వల్ల సముద్రుడి తాకిడి కొంత అడ్డుకోబడింది. కొన్ని రోజులు ఆ గ్రామం లో గడపటానికి వెళ్ళిన మేము ఆ సాయంత్రం సముద్రపు ఒడ్డున వచ్చాం .
తీరం వెంబడే నడిచి నడిచి ఒక రాయి మీద కూర్చున్నాము , మాలా చాలా మంది అలా కూర్చున్నారు.
చుట్టూ పరికించి చూసా, కొంత మంది గుంపులుగా ఉంటె, కొంతమంది ఒంటరిగా ఉన్నారు.

అలలు బలం గా కొండ రాళ్ళకు కొట్టుకొని , వేయి తునకలై చింది పడుతున్న సముద్రపు నీరు పెదాల కు తగిలి ఉప్పగా అని పిస్తోంది.

ఎన్నో లక్షల కెరటాల తగిలి తగిలి ఆ రాళ్ళు శుభ్ర పడి ,నున్న పడి కూర్చున్న వాళ్లకి సౌఖ్యనిస్తున్నాయి.
చుట్టూ ఉన్న మనుషులు నిశ్శబ్దం గా అలా సముద్రం కేసి ఆకాశం కేసి చూస్తూ ఉన్నారు.
సముద్రం కేసి తదేకం గా చూస్తూ మౌనం గా ఉంటే, అలా ఒంటరిగా ఆకాశం సముద్రం కలిసే చోటుని చూస్తూ ఉంటే ఎలా తోస్తుందా అనుకున్నా.
అయినా నాకూ కొన్ని సార్లు ఒంటరిగా ఉండటం ఇష్టం. రోజులో ఒక గంట అయినా అలా గడుపుతా మౌనం గా, ఒంటరిగా.
నాలాగే వాళ్ళూ అనుకున్నా.నారింజ రంగు ఆకాశం, ఉండుంది పెద్దదవుతున్న సూర్య బింబం,
అలల హోరు, ఏదో ట్రాన్స్ లోకి తీస్కెలుతున్నాయి.

కాసేపయ్యాక మా వాళ్ళు లేచి వెళ్దామని అంటే, నేను కాసేపు ఒంటరిగా కూర్చొని వస్తా నని చెప్పి ఉండి పోయా.
వాళ్ళు వెళ్ళాక ఇంకో రెండు రాళ్ళు ముందుకి జరిగి సముద్రం లోకి చూస్తే
అస్తమిస్తున్న సూర్య కిరణాలు పడి నారింజ రంగు లో మెరుస్తున్న సముద్రం,
సాయంత్రమయ్యే కొద్ది ఎగిసి పడే అలలు. ఉద్రుతమవుతున్న సముద్రం నన్ను కట్టి పడేశాయి.

వెనక్కి
తిరిగి చూస్తే ... ఎటువంటి హడావిడి లేని సామాన్య గ్రామం పరైకడవు,
సముద్రపు ఒడ్డున ఉన్న చిన్న గుడిలో పెట్టిన మైకు లోంచి విని పించే మలయాళ దేవగానం గాల్లో తేలి తేలి వినపడుతోంది.
జేసుదాసు మధుర గాత్రం, ఇంకెవరో గాయకుల కమ్మని అలాపనలూ,
ఉండుండి వినిపించే జేగంట ఎలాంటి నాస్తికుడి నైనా చెవి అప్పగించి వినేలా చేస్తున్నాయి.
వేట కెళ్ళని జాలర్లు వలలు రెండు కొబ్బరి చెట్ల మధ్య కట్టి ముళ్ళు వేసుకుంటూ ఉన్నారు.
ఉన్న రెండు కిరణా దుకాణాల యజమానులూ అప్పుడప్పుడోచ్చే బేరాలు చూస్కుంటూ మధ్య లో ఊసులాడుకుంటున్నారు.
ఆడవాళ్ళు గుడిసెల బయట ఎండ బెట్టిన చేపలు గోతాల కెత్తి చూరు కిందకి తెచ్చుకుంటున్నారు.
పిల్లలు కొబ్బరి మట్ట బాట్ గా చేసి చిన్న కొబ్బరి కాయ నే బాల్ గా చేసి లిమిటెడ్ ఓవర్ల మాచ్ అడుతున్నారు.
ఏ అవకాశం దొరుకుతుందా స్కాం చేసి డబ్బులు నొక్కేద్దామా అని ఎదురు చూసే నాయకుల్లా సముద్రం మీద గద్దలు ఎగురు తున్నాయి ఆశగా తొంగి చూస్తూ.

భారత దేశపు ఎన్నో పర్యాటక కేంద్రాలయిన, చాలా సముద్రా తీరా ప్రాంతాల లాగా ఇక్కడ వ్యాపార ధోరణి, హడావిడి ఉండదు.

ప్రశాంతం గా జీవితం లో అన్నీ చవి చూసి రాటు దేలి నిలబడ్డ మనిషిలా స్థిత ప్రజ్ఞత తో ఉంది.
అసలిది పర్యాటక కేంద్రం కాదు, అయినా దేశ విదేశ పర్యాటకులతో ఆహ్లాదం గా ఉంది ఆ ప్రాంతం,
కానీ అట్టహాసం లేదు. అసలు ఎందుకింత మంది జనం ఇక్కడికి వస్తున్నారు ..?

సునామీ తాకిడి కి ఒకప్పుడు చిగురుటాకులా ఒణికిన తీర గ్రామం మళ్ళీ
హగ్గింగ్ మామ్ గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మాతా అమృతానందమయి ఆశ్రమ సౌజన్యం తో, సేవతో మళ్ళీ గుక్క తిప్పుకొని ఒక చక్కని గ్రామం గా రూపు దిద్దుకుంది. అలాంటి గ్రామాలు కేరళ తమిళనాడు లోనే కాక ప్రపంచ వ్యాప్తం గా ఎన్నో ఉన్నాయి. అలాంటి సేవ భావం తో అలరాడుతున్న ఆశ్రమం లో గడపటం నిజం గా ఒక అద్భుత అనుభూతి. అక్కడ రాజకీయాల ఊసే రాదు, టీవీ సీరియళ్ళ గోలే లేదు, సంపాదన, సౌఖ్యం, ఆరాట పోరాటాలు అసలే లేవు. చాలా నిరాడంబర మైన జీవనం, మౌనం, ధ్యానం, ఒళ్ళువొంఛి చేసే సేవ తప్ప వేరే విషయాలు ఏవీ లేవు.

ఒక చక్కని ఆధ్యాత్మిక సేవ కేంద్రం, విద్య, ఆరోగ్య, సమాజ సేవ కేంద్రం. ఏ ఊటీ, కొడై, మున్నార్ హిల్స్ ఇవ్వని సామాన్య సౌఖ్యం ప్రశాంతత అక్కడ దొరుకుతాయి.

నిజానికి అలాంటి గ్రామాల్లోనే స్వచ్చమైన వాతావరణం ఉంటుంది. అంతే కాదు స్వచ్చమైన మనుషులు మనస్తత్వాలు, దొరికే అరుదైన ప్రదేశాలలో ఒకటి.
ఒక పక్క కేరళ బ్యాక్ వాటర్స్ , ఇంకో పక్క మహా సముద్రం మధ్య ఉన్న మంచి ముత్యం లాంటి మాతా అమృతానంద మయి ఆశ్రమం.

ఏసి రూములు, కాశ్మీరీ పలావులు, బట్టర్ నాన్లు, దొరకవు కానీ, సాంప్రదాయ కేరళ భోజనం, శుభ్రమైన వసతి ఉంటాయి. ఎంతటి కోటీశ్వరులైన అక్కడ నిరాడంబరం గా గడుపుతారు. మద్యం, ధూమపానం, మాంసాహారం పూర్తిగా నిషేధం. ఎన్ని రోజులైనా అక్కడ ఉండటానికి అనుమతి ఉంది. ఆ వాతావరణం నాకు ఎంతగా నచ్చిందంటే

రెండు నెలల కోసారి ఏదో ఒక వంక తో అక్కడికి వెళ్ళటం అలవాటు చేస్కున్నా. మీరూ ప్రయత్నించండి.
కేరళ నిజం గా దేవుడి సొంత దేశమే !!



3 కామెంట్‌లు:

  1. మీవర్ణనచాలా బాగుంది. ఆద్రుష్టవంతులండీ రెండు నెలలకి ఒకసారి అలాంటి వాతావరణం లోకి వెళ్ళగలుగుతున్నందుకు.

    రిప్లయితొలగించండి
  2. @ ఆత్రేయ గారూ, మీమీద చాలా జలసీ గా వుంది. అక్కడి కెళ్ళే మార్గం ఎలాగో చెప్తే దేవుడు తన కోసం సృష్టింకున్న ఆ వూరు మేం కూడా దర్శించుకుంటాం..

    రిప్లయితొలగించండి
  3. ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
    ఇట్లు నిర్వాహకులు

    రిప్లయితొలగించండి