25, డిసెంబర్ 2011, ఆదివారం

ఓ కల్కీ టైమైంది ఇంక రా..


శని వారం మధ్యాన్నం, చాలా రోజులకు మధ్యాన్నం మూడింటికి పావు గంట ముందే ఇంటి కొచ్చేసా..
నా పిఏ క్రిస్టమస్ మూడ్ లో ఉండటం వల్ల, ఇంటికెళ్ళి పోదాం సర్ అంటే..సరే నని.
మా ఆవిడా, సెలవలకి వచ్చిన మా అమ్మాయి బయటకి వెళ్ళటం వల్ల ఒంటరిగా ఉన్న నేను
టీవీ లో చానల్స్ తిప్పుతుంటే జెమినీ లో మధ్యాన్నం 3 30 గం లకి బ్రోకర్ సినిమా అని ప్రకటన..
హాల్ కెళ్ళి చూసే అలవాటు, టీవీ లో కూడా పూర్తిగా చూసే సహనం లేని నేను ఎప్పటినుంచో చూద్దామనుకున్న ఈ బ్రోకర్ ను చూడటానికి రెడీ అయ్యా ..
కానీ 3 కి కరెంట్ పోతుంది.
ఎలా చూడాలా అనుకుంటుంటే కరంట్ పోయింది.
పుస్తకం తో కాలక్షేపం చేస్తుంటే గిర్రున అరగంట తిరిగి
సరిగ్గా మూడున్నరకి ఏ దేవి వరము నీవో .. అన్నట్టు కరెంట్ వచ్చేసింది.
బ్రోకర్ సినిమా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం లో రూపొందింప బడింది.
సరిగ్గా మన రాష్ట్రము లో, కాదు కాదు దేశం లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకి
అద్దమే ఆ బ్రోకర్ సినిమా అనిపించింది.

వందలు
వేలు అసలు గుర్తులేవు
లక్షలు కనుమరుగయ్యాయి
కోట్లు కూడా వందల్లో వేలల్లో సంపాదిస్తున్న ఈ రోజుల్లో
ఆ సినిమా చూసి ఎవరన్నా మారతారా ?
దర్శకుని అత్యాశ.
అయినా ...
నాకు ఆ సినిమా బాగా నచ్చింది
ఒక బక్క పీసుగాడు వందమందిని తన్నే సీనులు లేవు
హీరోయిన్కి, హీరోకి ఉస్కో ఉస్కో మనే కులుకుడు పాటల్లేవు.
ఆ సినిమా ఉన్నదల్ల నగ్న ప్రదర్శన, మన అవినీతి యంత్రాంగ జీవన అంగాంగ నగ్న ప్రదర్శన.

అవినీతి మన వ్యవస్థ లో ఎంతగా వెళ్ళూనుకు పోయిందో...
మన జీవితాల్లోకి నవలలు,సినిమాలు, టీవీ సీరియళ్లు, 24గంటల వార్తా ఛానళ్ళు,
సెల్లుఫోనులు, పిజాలు బర్గర్లు, చైనా నాసివస్తువులు, ఐమాక్సులు,
ఎంత నిశబ్దంగా ప్రవేశించి పెనవేసుకుపోయాయో
అంతకన్నా ముందు నుంచే ఇంకోటి దూరిపోయి మనకన్న ఎక్కువ
మనతో జీవిస్తోంది.
మన జన జీవన స్రవంతిలో టంకం పెట్టినట్లు అతుక్కుపోయింది.
అవినీతి
ఎంత మంది మేధావులు, నాయకులు, అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు,
కళాకారులు, ఈ అవినీతి మీద ఉపన్యాసాలు ఇచ్చినా
కొండొకచొ .. ఎక్కడో ఒకచోట తప్పని సరిగా తల వంచే
బలమైన అంకుశం.

మనతో కలిపి మన చుట్టూ ఉన్న కోట్ల మంది ప్రజలు

తిట్టుకుంటూ, అసహ్యించుకుంటూ ప్రోత్సహిస్తున్న ఏకైన క్రీడా వినోదం.

ఇదివరకెన్నడో చట్టపరమైన నేరం చెయ్యవచ్చునా, న్యాయ పరమైన నేరం చెయ్యవచ్చునా అనే అమాయక చర్చలు జరిగేవి,

ఇప్పుడవేమీ లేవు. ఉన్నదల్లా ఒక్కటే
ప్రజల వైపునుంచీ చూస్తే ఎంత తక్కువ లంచాలతో పని చేయించు కోగలమా

అధికార యంత్రాంగం, నాయకుల వైపునుంచీ చూస్తే,
ఏ పక్క నుంచి ఎంత ఎక్కువ డబ్బు పిండుకో గలమా...
ఎంత ఎక్కువ అధికార దుర్వినియోగం తో పబ్బం గడుపుకోగలమా..
అన్న ఆరాటమే.

కొన్నేళ్ళ క్రితం మా అమ్మాయి హై స్కూల్లో ఉండగా అడిగింది,

"ఎందుకు నాన్నా.. నువ్వు షాపింగ్ చేసేటప్పుడు ధరలూ అవీ బాగా పట్టి పట్టి చూస్తావూ..
ఎందుకు కొన్ని వస్తువులు దుబారా అంటూ కొట్టి పడేస్తావు ?
ఎందుకు కొంత మంది నాస్నేహితుల నాన్నల లాగా డబ్బు ఖర్చు పెట్టలేవు..? "

నిజమే నేను ఖర్చు విషయం లో బాగా జాగ్రత్తగా ఉంటాను అలాగని పిసినారి తనం చూపను.

ఎక్కడ అవసరమో అక్కడ, ఎక్కడ అనవసరమో అక్కడ ధర్మ కాటా పట్టుకోవటం నాకలవాటు.
కొంత మంది లాగా విచ్చలవిడి గా ఉండటానికి నాకు అవకాశం లేదు.
కాదు కాదు అవసరం లేదు
అవసరమని ఎందుకన్నానంటే
జీతానికి పది రెట్లు లంచగొండి సంపాదన ఉండి
దానితో ఎటువంటి స్థిరాస్తులు కొనలేక, దాచలేక

బట్టలూ, మెక్దోనాల్డులు, సెల్లు ఫోనులు,
గజ బైకులు , బినామీ లావాదేవీలు,
అవసరానికి మించి ఖర్చులు (నల్ల ధనం దాచలేరుకనక)
ఇలాంటివి లంచాలతోనే సాధ్యం.
ఇంకొందరు డబ్బు పరంగా తినలేని వాటిని వస్తు రూపంలోనో,
ఇంకేదో కోరికలు తీర్చుకునే సాధనలోనో ఉంటారు, ఎవరి బాధలు వాళ్ళవి.

మా అమ్మాయి ప్రశ్నకు అప్పట్లో సరైన సమాధానం నేను ఇవ్వలేక పోయాగానీ

కాల క్రమం లో మా అమ్మాయే అన్నీ తెలుసుకుంది.
ఇప్పుడు తనే నాకు చెప్పగలదు, ఏది మంచో ఏది చెడో.

ఎందరో అక్రమ సంపాదన పరుల జీవితాల్లో తొంగి చూడండి

ఏదో ఒక విషాదం పొంచి కనపడుతుంది.
డబ్బు, వస్తువులు ఇచ్చే సుఖాలకన్నా, అవి లంచాల ద్వారా సమకూర్చిన ప్రజల
రోదన
పెను శాపమై కాటేస్తుంది. ఒకతరం కాక పోతే ఇంకో తరం పై ఫలితాలు ప్రకటిస్తుంది,
అది ఎన్ని ఉపసంహారలకూ లొంగదు !!

బ్రోకర్ సినిమా లో కూడా అదే వేలెత్తి చూపారు.
నిర్మాతకు డబ్బు, దర్శకునికి పేరు సంపాదించా లేక పూయున్దోచ్చు

కనీసం ఈ సినిమాకు అవార్డ్ ఇచ్చే ధైర్యం, విశాల మనస్తత్వం కూడా ఏ జూరీ లేక పోవచ్చు.( నా దగ్గర సరైన సమాచారం లేదు)

కానీ ఒక నిజాయితీ అయిన ప్రయత్నం,

మార్పు కోరుకునే మనసు ఉన్న
ఆ చిత్ర సారధులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.


నమస్కారం.

చాలా రోజులతర్వాత మళ్ళీ బ్లాగ్ దుమ్ము దులిపా...
ఇన్ని నెలలుగా నిశబ్దంగా ఉండటానికి కారణాలేవీ లేవు.
ఆఫీసు పని వత్తిడి , వేరే విధంగా ధ్యాస మరలి ఉండటం, అనారోగ్యమో, మనసు సమయం లేక పోవటం ఇవేమీ సరైన కారణాలు కావు.
ఎంత పని ఉన్న నే వ్రాయదలుచుకున్న పది వాక్యాలూ కోసం ఏ అర్ధరాత్రో సమయం వెచ్చించ లేక పోలేను.కానీ ఎందుకో ఉదాసీనం ఆవహించింది.
ఎందుకు వ్రాయటం లేదు అని అడిగి నిద్ర లేపిన ఇద్దరు బాబాయిలకూ థాంక్స్ .
ఎన్నో టపాలు మనసులో సగం, సగం తయారు చేసి అవి.. వాటిని కంప్యూటర్ లోకి ఎక్కించ కుండానే మరుగేసా..
అలా నా బ్లాగ్ పేరు " లిపి లేని భాష.." గా సార్ధక నామధేయమయింది.
మళ్ళీ కలుస్తా అతి త్వరలో...

4 కామెంట్‌లు:

  1. నేను ఈ "బ్రోకర్" సినిమాని చుసి అనుకున్న మాటలు "నిర్మాతకు డబ్బు, దర్శకునికి పేరు సంపాదించా లేకపోయుండొచ్చు
    కనీసం ఈ సినిమాకు అవార్డ్ ఇచ్చే ధైర్యం, విశాల మనస్తత్వం కూడా ఏ జూరీ లేక పోవచ్చు" మీరు రాసారు....
    సినిమాచూసి ఎంతమంది మారారో నాకు తెలియదు కాని నేను మాత్రం లంచం ఇవ్వకూడదు అని నిర్ణయించుకుని ఇవ్వలేదు.(దాని కారణంగా వేరొక చోటికి బదిలీ అయ్యాను అనుకోండి:-) అది వేరే విషయం). నాకు చాలాబాగా నచ్చిన చిత్రాల్లో ఇది ఒకటి అందుకే సి.డి కొని పెట్టుకున్నా...

    రిప్లయితొలగించండి
  2. మీకు మాత్రమే ప్రత్యేక మైన శైలిలో అవినీతి ఎలా వెళ్లూనుకుందో..చెప్పేశారు. ఎవరికి వారు అవినీతికి పాల్పడకూడదు అని నిశ్చయించుకుని ఉంటారో..వాళ్ళని అవసరం కల్గినప్పుడు బాదేసే అవినీతి పరుల ముందు ఎలా అంది బ్రతకగల్గడం? అందుకే అవినీతి పాల్బడ టమో, అవినీతికి బలి అవడమో నిత్య కృత్యమైనది. మీ పోస్ట్ ల కోసం చాలా రోజులు ఎదురు చూసి చూసి ..విసుగేసింది. మళ్ళీ "లిపి లేని భాష " ప్రత్యక్షమైనందుకు సంతోషం.

    రిప్లయితొలగించండి
  3. మనతో కలిపి మన చుట్టూ ఉన్న కోట్ల మంది ప్రజలు
    తిట్టుకుంటూ, అసహ్యించుకుంటూ ప్రోత్సహిస్తున్న ఏకైన క్రీడా వినోదం...........ee sentence chaaalu mana samajaniki pattina cheeda emito manaki teliyadaaniki.... weldone sir.

    రిప్లయితొలగించండి