11, మార్చి 2012, ఆదివారం

నేనూ.. నా ఆముదం తాగిన మొహమూనూ ..


ఈరోజు పొద్దున్నే నా మొహం అద్దం లో చాలా సేపు చూసుకున్నా
రక రకాలు గా కోణాలు మార్చి మరీ చూసుకున్నా. కొద్దిగా వంచి, గడ్డం పైకెత్తి , ఎడమగా , కుడిగా తిప్పి, కళ్ళు చికిలించి, బాగా విప్పార్చి ఇలా ఎన్నో రకాలుగా..

ఎందుకంటారా ?

పొద్దున్నే చీకటి పాటునే లేచి దంత ధావనం అయ్యాక, స్వస్తిక్ బ్రాండ్ చిట్టాముదం, సీసా ఎత్తి తాగేసి ఆపై కొంచం వాము నమిలి , మా అమ్మ పెట్టిన కషాయం అన బడే వేడి వేడి చారు నాలుగు గ్లాసులు తాగి
హాల్లోంచి వంటగది లోకి, అక్కడ నుంచి డైనింగ్ హాల్లోకి , మళ్ళా కుడి వైపుకు తిరిగి బెడ్రూం లోకి, మళ్ళీ డైనింగ్ హాల్ ద్వారా హాల్లోకి ఇలా పలు మార్లు చేసి చివరకి మెరుపు లాంటి ఆలోచన వచ్చి బాల్కనీ లో
లైట్ వేసి అక్కడున్న సింక్ దగ్గర అద్దం లో పై ప్రక్రియలన్నీ చేశా ,

మళ్ళీ ఎందుకంటారా ?

ఆముదం తాగిన మొహం ఎలా ఉంటుందో చూద్దామని. ఎప్పుడూ చూడలేదని కాదు, ఎందుకో అలాంటి విచిత్రమైన కోరిక కలిగింది, చూసుకున్నాను బానేఉంది.
వెలిగి పోతూ, చాలా మంది చెయ్యలేని పని చేసిన గర్వంతో ..

ఈ ఆముదం తాగే అలవాటు మా అమ్మ చేసింది. రెండు మూడు నెలలకోసారి ఇలా పొద్దున్నే ఆముదం తాగి, ఆపై చారు గ్లాసులు గ్లాసులు తాగితే మూడు నాలుగు విడతలుగా వెళ్లి న్యూస్ పేపర్ చదివేసి వస్తే అటుపిమ్మట కలిగే ఆనందం ఆరోగ్యం అలాటిది ఇలాటిది కాదు. అరిగీ అరగక, కదిలీ కదలక, బెట్టు చేసే మనం తినే రక రకాల తిళ్ళు ఆ రోజు
బుద్ధి గా దారి కొచ్చేస్తాయి. అటు పిమ్మట రెండు అంగుళాలు తగ్గే బెల్ట్, లోపలి లాక్కుంటే ఫ్లాట్ గా కనపడే బొజ్జ ,
ఆహా ఏమి ఆనందం లే. అసలు గంట లో ఆరువేలు తీసుకొని పొట్ట సైజు రెండు అంగుళాలు తగ్గిస్తామని ప్రకటనలు వేస్కునే సంస్థలన్నీ ఇదే పని చేయిస్తాయేమో అని నా అనుమానం.
నా కాలేజీ రోజులనుంచీ ఈ అలవాటు మా అమ్మ ద్వారా సంక్రమించింది. మరీ ఎక్కువ కాదు గానీ ఏడాది కోసారి, రెండు సార్లు ఇలా ఆముదం తాగి, జూలు విదిల్చి ఆపై తేలిక పడి, మళ్ళీ మరుసటి రోజునుంచీ బరువులేత్తే పని లోపడటం బాగుంటుంది.

కాక పోతే ఆముదం తాగిన తరువాత పాటించాల్సిన నియమాల విషయం లో మా గురుస్వామి అమ్మ బాగా స్ట్రిక్ట్.

తెల్లారే నాలిగింటికి లేచి తాగుతామా..
పొద్దున్నే లేచే అలవాటు లేదు అందులో ఆదివారం కూడా కావటం తో మళ్ళీ పడుకోవాలని తెగ ఆరాట పడుతుంది మనసు, అది కూడదని మా అమ్మ అడ్డు పడుతుంది.
అలాగే గ్లాసుల కొద్దీ ఏడిచారు ఉహు.. వేడి చారు ఊదుకుంటూ తాగేయాలి.
అదయ్యాక మూడు నాలుగు తూర్లు వెళ్లి ఆహా అనుకోవాలి
మబ్బుపట్టిన రోజు ఆముదం తాగకూడదు, ఒంట్లో వేరే నలత ఉన్నప్పుడు అసలే కూడదు.
ఇవన్నీ సరే ..
ఈ మొత్తం క్రియ అయ్యేసరికి కడుపు పూర్తిగా ఖాళీ అయి నక నక లాడుతుంటుంది
కాఫీలు టీలు నేను తాగను. సరికదా మంచి టిఫిన్ తినే యోగం ఉండదు.
భోజనం లోకి ధనియాల కారప్పొడి, చారు , నీళ్ళ మజ్జిగ.,
మహా కోరితే అరటికాయ వేపుడు ఉప్పు కారం తక్కువగా (బంగాళాదుంప కూడదు వాతం అని తిడుతుంది).

ఇవన్నీ చేసి కాసేపు విశ్రమిద్దామంటే

మారథాన్ రేసు లో కబుర్లాడుకుంటూ సోడాలు తాగుతూ పరిగెడుతూ ఆలస్యంగా చిట్ట చివరికి వచ్చిన పరుగుల వాళ్ళ లాగా ఇంకో రౌండ్ పిలుస్తుంది.
అదీ అయ్యాక హాయిగా నిద్ర పోవటమే. సాయంత్రం నాలిగింటికి లేచి ఉల్లిపాయ పకోడీలో, శెనగలేసిన తప్పేల చేక్కో తిందామంటే కుదరదు.
అందుకే బయటకెళ్ళి ఏబండి మీదో కనపడింది కుమ్మేయటమే. విషయం మాత్రం గురుస్వామి అమ్మకి తెలియనీవకూడదు, నీ మొహం మండా ఆ మాత్రం ఆగలేవా ఒక్క పూట ... అని సతాయిస్తుంది.


ఇప్పుడంటే కరిచే కార్పరేట్ డాక్టర్లు అలా చెయ్యకూడదంటారు కానీ నలభై, యాభై ఏళ్ళ క్రితం పసి పిల్లలకి అమ్మమ్మలో, నాయనమ్మలో చూపుడు వేలు ఆముదం లో ముంచి, బుల్లి లక్క పిడత లాంటి నోట్లో
రాసి
అమ్మలూ చూడవే చంటాడు
మొహం ఎలా పెట్టాడో అనటం నాకు తెలుసు.



పెద్దదైన ఇంకో చిన్న విషయం అప్పుడప్పుడూ ఇలా ఆముదము తాగటం వాళ్ళ కడుపు క్లీన్సర్ లానే కాకుండా మొహం లో మంచి కాంతి వస్తుందిట.




ఈ మొత్తం మా ఆవిడకి వింతగా విడ్డూరం గా ఉంటుంది. అసలా సీసా చూస్తేనే గొంతులోకి రెండు వెళ్ళు దూర్చుకున్నంత వికారం గా మొహం పెడుతుంది.

మేము పత్యం తింటుంటే తను బరోడా మహారాణి లా పండు మిరపకాయల తొక్కు పచ్చడి అమూల్ మీగడ నంచుకుంటూ, లొట్టలేస్తూ తింటూ మావంక జాలిగా చూస్తుంటుంది.

ఏదేమైనా ఈ మొత్తం విధానం జరుగు తున్నంత సేపు మా అమ్మాయి రెండు విభిన్న ధ్రువాలని భూమధ్య రేఖ దగ్గర చూస్తున్నట్లు మొహం పెడుతుంది.


కొస మెరుపు : రెండు రౌండ్లయ్యాక నేనూ, మా అమ్మ ఎదురు, ఎదురు పడి ఎలా అయిందీ , అంతా ఒకే ! నా అనుకునే సమయం లో నాకు ఒక విచిత్ర ఆలోచన,

ఏ తిరుమల గుడి లైనులోనో , షిర్డీ బాబాగారి గుడి లైనులోనో గంటల కొద్దీ నుంచునప్పుడు పరిచయమయ్యే సాటి భక్తులు చివరాకరికి గర్భగుడి లో దూరమయి, దర్శనంయ్యాక
బయట కనపడి చూపులతోనే దర్శనం బాగా అయిందా అన్న పలకరింపులా అనిపిస్తుంది. ఏంటీ పోలిక బాలేదా .. ధూ.. నీ ... అనుకుంటున్నారా ?

మీరు కూడా మీ అమ్మ తో కలిసి ఉగ్గు గిన్నెడు ఆముదం సేవించి చూడండి, నేచెప్పింది పవిత్రంగా అనిపిస్తుంది.




13 కామెంట్‌లు:

  1. ఈ ప్రాక్టిస్ మా తాతగారు మహచక్కగా ఆముదాన్ని కాఫిలొ కలపి సేవించెవారు.మెము ఆరొజుల్లొ ఎలా తాగుతున్నారాని ఉత్సాహముగా పరిశీలించె వారము.ప్రస్తుతము ఉన్న మలబద్దకలక్షణానికి ఇదె సరీఅయిన తరుణొపాయము లావున్నది .జై తాతగారు జై ఆముదము.

    రిప్లయితొలగించండి
  2. ఈ ప్రాక్టిస్ మా తాతగారు మహచక్కగా ఆముదాన్ని కాఫిలొ కలపి సేవించెవారు.మెము ఆరొజుల్లొ ఎలా తాగుతున్నారాని ఉత్సాహముగా పరిశీలించె వారము.ప్రస్తుతము ఉన్న మలబద్దకలక్షణానికి ఇదె సరీఅయిన తరుణొపాయము లావున్నది .జై తాతగారు జై ఆముదము.

    రిప్లయితొలగించండి
  3. బాగుంది.
    ఇప్పుడు అమెరికాలో సౌందర్య ఆరోగ్య పోషణ నిమిత్తం cleansing అనేది పెద్ద ఇండస్ట్రీగా తయారయింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములు నారాయణ స్వామి గారు
      అంతా వేదాల్లోనిదేనిష..!!

      తొలగించండి
  4. అత్రేయగారూ చాలా రోజులనుంచి ఏమీ రాయడంలేదేమిట౦డీ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "నిజం చెప్పమంటారా , అబద్దం చెప్పమంటారా జ్యోతిర్మయి గారూ ....(పాతాళ భైరవి లో తోట రాముడిలా..)

      తొలగించండి
  5. దేముని ఎదుట ప్రమాణం చేసి(కోర్టు భాష) అంతా నిజమే చెప్పండి ఆత్రేయ గారూ...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోర్ట్ భాషా.. అయితే ఖచ్చితం గా అబద్దమే చెప్పాలి.
      "రాష్ట్రం లో ఉన్న సంక్షోభం నిలువరించాటానికి గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నా..!!"

      తొలగించండి