ఐపీల్ మాచ్ ల కోసం ఎర్రటి ఎండలో టీ స్టాల్ దగ్గర ఎండలో నుంచుంటే..
వేడి వేడి టీ కావాలా అన్నాడు స్టాల్ ఓనరు ...
ఒద్దు అలవాటు లేదు , అయినా నేను ఫ్రీగా టీవీ చూడటానికి వచ్చినోడిని,
నాకెందుకూ టీ అన్నా ..
ఇంతలో ఎవడో చానల్ మార్చాడు
బజ్జ్ ..
అబ్బనీ తియ్యనీ దెబ్బా... ఛీ ఈడి పాటలేంటి తీయండీడిని....
బజ్జ్
నువ్విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ... ఒర్నియమ్మ ఈడి ఇజిలుకి అంత పవరున్నదా దీయండేహే ఎనక మాల ఎవడో ఇసుగు...
బజ్జ్
ఆప్రకారం ముందుకు పోతున్నామని మనవి చేస్కుంటున్నాను .....నువ్వు ముందుకెల్తే మాకేటీ మూస్కేల్తే మాకేటీ.. ఎల్లెల్లు..
బజ్జ్
హం ఇస్ ప్రకార్ హొనే నహీ దేంగే .... అమ్మ ఉవాచ ...మరెలా చేయనిస్తావ్ ?...
బజ్జ్
అండ్ హి వాన్న టేక్ ఆన్ ... అర్ధం కాలే తీసెయ్...
బజ్జ్
లాస్ట్ వీక్ రూపీ అగైనేస్ట్ డాలర్ హాడ్.... మనకాడ పైసలే లేవు రూపాయలు డాలర్లు కూడానా ...
బజ్జ్
ఇట్స్ ఇమ్మటిరియల్ వెదర్ వే స్టాండ్ విత్ అన్నా ప్లస్.... మంచి ఉద్దోగం సేసావ్ కమ్మ గా నాలుగు రాళ్ళు (?) సంపాదించి సుక పడక ఎందుకమ్మా బేడమ్మా నీకీ గోల..
బజ్జ్
రాజధాని లో పోలీసులను అప్రమత్తం చేసారు, అందరి సెలవలను రద్దు చేస్తూ అదనపు బలగాలు మొహరించారు...
అరేయ్ రిమోట్ ఎక్కడ రా మార్చబాకండిరా... మారనీయ బాకండిరా ... మన అన్నని లోపలేస్తారా..
దొంగ నాకొడుకులు... మరీ అరాచాకమైపోయింది.. ఇంత అన్యాయమా...
ఎన్నో వేల కుటుంబాలని ఓదార్చిన మహా మనసుని ఓదార్చే సహృదయులు ఎక్కడా?
కడుపు మండి పోతంది... నాకూ టీ చెప్పండిరా వేడి వేడి గా ...
ఇదిగో.... టీ...
పొగలు కక్కుతూ ... సెగలతో ఆవేశంగా ..
నాలాగా ...
ఒక్క గుక్క నాలిక మీంచి గొంతు లోకి . గొంతు లోంచి లోపలి పోనంటుంది... చేదుగా అలవాటు లేని వార్తలా ...
ధూ... నీయమ్మా... ఎవడురా ఈ టీ చేసిన నా..కొ..కు ?....
చేతిలో గాజు గ్లాసు గోడకేసి భళ్ళున ....శబ్ధం...
ఎదురు అద్దం మీదా టీ మరకలు అసహ్యకరమైన అధికార చారల్లా...
కింద గాజుముక్కలూ , సామాన్యుడి జీవితం నడవటానికి లేకుండా గుచ్చుకుంటూ...
నే డబ్బులివ్వను ...
అప్పటికే ఖంగుతిన్న ఓనరు ..
నేను అడగను ..
నిన్నటిదాకా వానపాములా సాల్ట్ బిస్కట్ తిని టీవీ చూసే ఈడు , ఈ రోజు బురదకయ్యలా బస్సు మంటున్నాదేంటి అని అచ్చెరువుతో...
అయినా ఏమవుద్దిలే ఒక అరెస్ట్ అంతేగా దానికే ఇంత గోలా?
ఒక అరెస్ట్ , ఒక రోగం , ఒక ఎసి గది నిమ్స్ లో ఒక వారం ఎండ పొడ సోకని సుకమైన నిద్ర ...
ఆనక ఏముతుందో సూడటానికి.... నాకెందుకు ?
నల్ల కోట్లున్నాయి, వాటి కివ్వటానికి నల్ల కోట్లున్నాయి.
మళ్ళీ మొదటి చానల్ పెట్టండిరా ..
అబ్బ నీ తీయనీ దెబ్బా .... ఎంత కమ్మ గా ఉందిరోయ్ అబ్బా...
చిరంజీవి డెబ్బ కమ్మగా ఉండదే , ఇదేంటి కవి ఇలా రాసేడు ?
అయినా ఎవడికి డెబ్బ?
ఎవడికి కమ్మదనం ?
ఎవడికి రుచి ?
ఎవడికి సుకం ?
పిచ్చ నాకో...ల్లారా..
లేవండి ఎవరో విజిలేస్తున్నారు ... చెడ్డీలు ...మిడ్డీలు బిగించి లేవండి ..
ఉన్న పై బట్ట పైకెగిరి పోక ముందే లేవండి ..
కనీసం ఇదన్నా మిగిల్చుకుందాం.
27, మే 2012, ఆదివారం
11, మార్చి 2012, ఆదివారం
నేనూ.. నా ఆముదం తాగిన మొహమూనూ ..

ఈరోజు పొద్దున్నే నా మొహం అద్దం లో చాలా సేపు చూసుకున్నా
రక రకాలు గా కోణాలు మార్చి మరీ చూసుకున్నా. కొద్దిగా వంచి, గడ్డం పైకెత్తి , ఎడమగా , కుడిగా తిప్పి, కళ్ళు చికిలించి, బాగా విప్పార్చి ఇలా ఎన్నో రకాలుగా..
ఎందుకంటారా ?
పొద్దున్నే చీకటి పాటునే లేచి దంత ధావనం అయ్యాక, స్వస్తిక్ బ్రాండ్ చిట్టాముదం, సీసా ఎత్తి తాగేసి ఆపై కొంచం వాము నమిలి , మా అమ్మ పెట్టిన కషాయం అన బడే వేడి వేడి చారు నాలుగు గ్లాసులు తాగి
హాల్లోంచి వంటగది లోకి, అక్కడ నుంచి డైనింగ్ హాల్లోకి , మళ్ళా కుడి వైపుకు తిరిగి బెడ్రూం లోకి, మళ్ళీ డైనింగ్ హాల్ ద్వారా హాల్లోకి ఇలా పలు మార్లు చేసి చివరకి మెరుపు లాంటి ఆలోచన వచ్చి బాల్కనీ లో
లైట్ వేసి అక్కడున్న సింక్ దగ్గర అద్దం లో పై ప్రక్రియలన్నీ చేశా ,
మళ్ళీ ఎందుకంటారా ?
ఆముదం తాగిన మొహం ఎలా ఉంటుందో చూద్దామని. ఎప్పుడూ చూడలేదని కాదు, ఎందుకో అలాంటి విచిత్రమైన కోరిక కలిగింది, చూసుకున్నాను బానేఉంది.
వెలిగి పోతూ, చాలా మంది చెయ్యలేని పని చేసిన గర్వంతో ..
ఈ ఆముదం తాగే అలవాటు మా అమ్మ చేసింది. రెండు మూడు నెలలకోసారి ఇలా పొద్దున్నే ఆముదం తాగి, ఆపై చారు గ్లాసులు గ్లాసులు తాగితే మూడు నాలుగు విడతలుగా వెళ్లి న్యూస్ పేపర్ చదివేసి వస్తే అటుపిమ్మట కలిగే ఆనందం ఆరోగ్యం అలాటిది ఇలాటిది కాదు. అరిగీ అరగక, కదిలీ కదలక, బెట్టు చేసే మనం తినే రక రకాల తిళ్ళు ఆ రోజు బుద్ధి గా దారి కొచ్చేస్తాయి. అటు పిమ్మట రెండు అంగుళాలు తగ్గే బెల్ట్, లోపలి లాక్కుంటే ఫ్లాట్ గా కనపడే బొజ్జ ,
ఆహా ఏమి ఆనందం లే. అసలు గంట లో ఆరువేలు తీసుకొని పొట్ట సైజు రెండు అంగుళాలు తగ్గిస్తామని ప్రకటనలు వేస్కునే సంస్థలన్నీ ఇదే పని చేయిస్తాయేమో అని నా అనుమానం.
నా కాలేజీ రోజులనుంచీ ఈ అలవాటు మా అమ్మ ద్వారా సంక్రమించింది. మరీ ఎక్కువ కాదు గానీ ఏడాది కోసారి, రెండు సార్లు ఇలా ఆముదం తాగి, జూలు విదిల్చి ఆపై తేలిక పడి, మళ్ళీ మరుసటి రోజునుంచీ బరువులేత్తే పని లోపడటం బాగుంటుంది.
కాక పోతే ఆముదం తాగిన తరువాత పాటించాల్సిన నియమాల విషయం లో మా గురుస్వామి అమ్మ బాగా స్ట్రిక్ట్.
తెల్లారే నాలిగింటికి లేచి తాగుతామా..
పొద్దున్నే లేచే అలవాటు లేదు అందులో ఆదివారం కూడా కావటం తో మళ్ళీ పడుకోవాలని తెగ ఆరాట పడుతుంది మనసు, అది కూడదని మా అమ్మ అడ్డు పడుతుంది.
అలాగే గ్లాసుల కొద్దీ ఏడిచారు ఉహు.. వేడి చారు ఊదుకుంటూ తాగేయాలి.
అదయ్యాక మూడు నాలుగు తూర్లు వెళ్లి ఆహా అనుకోవాలి
మబ్బుపట్టిన రోజు ఆముదం తాగకూడదు, ఒంట్లో వేరే నలత ఉన్నప్పుడు అసలే కూడదు.
ఇవన్నీ సరే ..
ఈ మొత్తం క్రియ అయ్యేసరికి కడుపు పూర్తిగా ఖాళీ అయి నక నక లాడుతుంటుంది
కాఫీలు టీలు నేను తాగను. సరికదా మంచి టిఫిన్ తినే యోగం ఉండదు.
భోజనం లోకి ధనియాల కారప్పొడి, చారు , నీళ్ళ మజ్జిగ.,
మహా కోరితే అరటికాయ వేపుడు ఉప్పు కారం తక్కువగా (బంగాళాదుంప కూడదు వాతం అని తిడుతుంది).
ఇవన్నీ చేసి కాసేపు విశ్రమిద్దామంటే
మారథాన్ రేసు లో కబుర్లాడుకుంటూ సోడాలు తాగుతూ పరిగెడుతూ ఆలస్యంగా చిట్ట చివరికి వచ్చిన పరుగుల వాళ్ళ లాగా ఇంకో రౌండ్ పిలుస్తుంది.
అదీ అయ్యాక హాయిగా నిద్ర పోవటమే. సాయంత్రం నాలిగింటికి లేచి ఉల్లిపాయ పకోడీలో, శెనగలేసిన తప్పేల చేక్కో తిందామంటే కుదరదు.
అందుకే బయటకెళ్ళి ఏబండి మీదో కనపడింది కుమ్మేయటమే. విషయం మాత్రం గురుస్వామి అమ్మకి తెలియనీవకూడదు, నీ మొహం మండా ఆ మాత్రం ఆగలేవా ఒక్క పూట ... అని సతాయిస్తుంది.
ఇప్పుడంటే కరిచే కార్పరేట్ డాక్టర్లు అలా చెయ్యకూడదంటారు కానీ నలభై, యాభై ఏళ్ళ క్రితం పసి పిల్లలకి అమ్మమ్మలో, నాయనమ్మలో చూపుడు వేలు ఆముదం లో ముంచి, బుల్లి లక్క పిడత లాంటి నోట్లో రాసి
అమ్మలూ చూడవే చంటాడు మొహం ఎలా పెట్టాడో అనటం నాకు తెలుసు.
పెద్దదైన ఇంకో చిన్న విషయం అప్పుడప్పుడూ ఇలా ఆముదము తాగటం వాళ్ళ కడుపు క్లీన్సర్ లానే కాకుండా మొహం లో మంచి కాంతి వస్తుందిట.
ఈ మొత్తం మా ఆవిడకి వింతగా విడ్డూరం గా ఉంటుంది. అసలా సీసా చూస్తేనే గొంతులోకి రెండు వెళ్ళు దూర్చుకున్నంత వికారం గా మొహం పెడుతుంది.
మేము పత్యం తింటుంటే తను బరోడా మహారాణి లా పండు మిరపకాయల తొక్కు పచ్చడి అమూల్ మీగడ నంచుకుంటూ, లొట్టలేస్తూ తింటూ మావంక జాలిగా చూస్తుంటుంది.
ఏదేమైనా ఈ మొత్తం విధానం జరుగు తున్నంత సేపు మా అమ్మాయి రెండు విభిన్న ధ్రువాలని భూమధ్య రేఖ దగ్గర చూస్తున్నట్లు మొహం పెడుతుంది.
కొస మెరుపు : రెండు రౌండ్లయ్యాక నేనూ, మా అమ్మ ఎదురు, ఎదురు పడి ఎలా అయిందీ , అంతా ఒకే ! నా అనుకునే సమయం లో నాకు ఒక విచిత్ర ఆలోచన,
ఏ తిరుమల గుడి లైనులోనో , షిర్డీ బాబాగారి గుడి లైనులోనో గంటల కొద్దీ నుంచునప్పుడు పరిచయమయ్యే సాటి భక్తులు చివరాకరికి గర్భగుడి లో దూరమయి, దర్శనంయ్యాక
బయట కనపడి చూపులతోనే దర్శనం బాగా అయిందా అన్న పలకరింపులా అనిపిస్తుంది. ఏంటీ పోలిక బాలేదా .. ధూ.. నీ ... అనుకుంటున్నారా ?
మీరు కూడా మీ అమ్మ తో కలిసి ఉగ్గు గిన్నెడు ఆముదం సేవించి చూడండి, నేచెప్పింది పవిత్రంగా అనిపిస్తుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)