26, సెప్టెంబర్ 2010, ఆదివారం

తరం తరం నిరంతరం

వింటున్నారా వింటున్నారా .....

ఎదిగేసిన పెద్దాళ్ళూ...ఇది వినండి !! ఈమధ్యే వచ్చిన ఒక యువ పెసరట్ రెండో సినిమా లో పాట 'వింటున్నావా వింటున్నావా ....' మీద చక్కని వ్యాఖ్య మన బ్లాగ్ మిత్రులెవరో పోస్ట్ చేసారు, ఆ పాట సాహిత్యాన్ని ఇంకా ఆడియో ని కూడా ఉటంకిస్తూ. యాదృచ్చికం గా ఆ పోస్ట్ చదివి ఆ పాట విన్నా. ఆ బ్లాగర్ చెప్పినట్లు ఎంత బాగుందో.
సరిగ్గా మూడు నెలల క్రితం నా కూతురు నా లాప్ టాప్ లో ఇలాంటి పాటలు డవున్ లోడ్ చేసింది. తనకి నా పాత లాప్ టాప్ ఇచ్చినా
నాదే వాడేది. నేను చూసుకొని ఇదేంటి ఇల్లాంటి పిల్ల పాటలు పిచ్చి పాటలు నా కంపూ లోనా 'ఐసా కభీ నహీ హో సక్తా' అనుకున్నా .. కానీ కూతురు కదా ఏమన లేక ఊరుకున్న పైగా హాస్టల్ కి కూడా వెళ్లి పోతోంది అన్న ప్రేలి (ప్రేమ+జాలి) తో .రెండు నెల ల క్రితం తను హాస్టల్ కి వెళ్ళిన వెంటనే నా కంపూ లో ఉన్నా ఇలాంటి పిల్ల ఫైల్స్ అన్ని వెతికి పట్టుకొని డెలీట్ చేసి పారేసా. నిజానికి మా అమ్మాయి దీ నాదీ ఇంచుమించు ఒకే టేస్ట్ తిండి సరదాలు సంగీతాలు ( ముఖం కూడా).అయితే నేను మళ్ళీ మళ్ళీ వినాలనుకునే తరహ పాటలు మా అమ్మాయి ఒక సారి కూడా వినదు వినలేదు కూడా.
కొంచం ఎక్కువ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే నా చిన్న తనం లో మా నాన్న కర్నాటిక్ వోకల్ నేర్చుకోమన్నపుడు నా స్పందన గుర్తొచ్చింది. ఆయనకి ఎదురు చెప్పలేక , నా వల్ల కాదు అనలేక నా పన్నెండేళ్ళ పసి దేహం వెక్కెక్కి ఏడ్చేసింది అది చూసి సంగీత కచేరీలో కూడా ఇలాగే చేస్తానేమో అన్న అనుమానం తో మా నాన్న ఒద్దులే పో .. అన్నాక కుదుట పడ్డా. కానీ పాటలంటే ఇష్టం మాత్రం ఉండేది. ఎదిగే వయసు తో పాటు సౌండ్ కూడా పెరిగే పాటలు ఇష్ట పడుతూ పెరిగేసాను. ఈ పెరబోలా లో వెర్తెక్స్ ఎక్కడుందో గానీ కొన్నాళ్ళకి సౌండ్ తగ్గి చివరకి మంద్ర స్థాయి లో కొచ్చా. ఇప్పుడు నేను వినటం అంటే చెవిలో మనకోసమే పాడినంత చిన్నగా ఉండాలి.
ఇక సాహిత్యానికొస్తే మా అమ్మాయి కి ఇష్టమైన పాటల్ని పిల్ల పాటలు అని విమర్శించా గానీ ఆ వయసులో నేనూ "అచ్చా అచ్చా బచ్చా బచ్చా లాంటి పాటలు మొదటి గిచ్చుళ్ళు నిన్నే గిచ్చా .. " నీ మీద నాకు ఇదయ్యో ... లాంటి పాటలు పడీ పడీ విన్న వాడినే ... ఇప్పుడు తెచ్చిపెట్టుకున్న పెద్దరికం తో సాహిత్యమంటే అన్నమయ్యే సంగీత మంటే సుబ్బు లక్ష్మే అంటుంటా. నెరిసిన నా జుట్టు కి
చెంపల దగ్గర మాత్రం రంగేస్కోకుండా ..మిగతా అంతా బాగా నల్ల రంగేస్కోని. ఆ చెంపల దగ్గర మన పెద్దరికం కనపడాలని ( నిజానికి నాకు అది ఇష్టమైన స్టైల్) . సరే మనం వర్తమానం లోకి వస్తే ఆ వింటున్నారా వింటున్నారా ( సినిమా -ఎం మాయ చేసావో - అనంత శ్రీ రాం
రచయిత) విన్న తర్వాత ఎంత చక్కని సాహిత్యం, ఎంత మృదువైన భావాలు , ఎంత సొంపైన సంగీతం అని పించింది ఇల్లాంటి పాటలు మనకొత్త సినిమాల్లో చాలా ఉంటున్నాయి. ఎక్కువ యువతే వినే కొత్త పాటలు అసలు బాగుండవు అనే నా లాంటి (చంపల దగ్గర తెల్ల జుట్టు ) పెద్ద మనుషులు ఒప్పుకోరు కానీ ఎంతో సరళ మైన భాషా ఎంతో లోతైన భావం మరెంతో తియ్యనైన సంగీతం తో కూడిన పాటలు మన పాత పాటలకి ఏమాత్రం తీసి పోవు. ఆత్రేయ గారు రాసినట్లు, సాలూరి వారు చేసినట్లు, పాటలు ఈరోజు ఎవరూ చెయ్యలేరనే (తెల్ల మనసు) పెద్దమనుషులు ఈ కొత్త పాటలు వింటే వాళ్ళ అభిప్రాయం మార్చుకోవచ్చు. వక్కపొడి నములుతూ "ఈ కొత్త పాటలు మహా గోల గా ఉంటాయి ఆ నటీ నటులైతే ఇంకా ఘోరం రేషన్ లో బట్టలు కట్టుకుంటారు అనే మన అక్కలు అన్నలూ ఒకసారి ఈ పిల్ల పాటలు వినండి . వింటున్నారా వింటున్నారా...
మీతో మాట్లాడుతూ నా అసలు పని మర్చిపోయా ఎల్లుండి హాస్టల్ నుండి ఇంటి కొచ్చే మా అమ్మాయి, వచ్చే టైంకి ఆ డిలీట్ అయిన పిల్ల ( మొగ్గ) పాటలు మళ్ళీ డవున్ లోడ్ చెయ్యాలి అన్నీ గుర్తు లేవు గుర్తున్నంత వరకూ చేసి మిగతావి ఫోన్ లో అడిగి మరీ చేయాలి మా బంగారు అమ్మూగాడికి. వచ్చి హెడ్ ఫోన్స్ లో వింటూ ... ఓఓఓఓ ఆఆఆఆ హాఆఆఆఅ హైఇ ఉమ్మ్ .. అనే కూని రాగల మా కోయిలమ్మ కోసం ఈ ఆదివారమంతా వెచ్చిస్తా....

24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

మీరే .....




మీరు బరువు తగ్గించే డాక్టర్ కావచ్చు
Want to lose weight ? ask me HOW !

ఏదో బరువు తగ్గించే మందుల కంపెనీ ప్రకటన లా ఉందా..?

మీరేమీ
బాడ్జ్ పెట్టుకొని తిరగక్కరలేదు భయపడకండి.

ప్రయాసపడి
భారమును మోయు జనులార నాయోద్దకు రండు .. అనే ప్రభువు వాక్యం లా ఉన్నా
ఇది అది కూడా కూడాకాదు. మనకి అంత గొప్ప మహాత్యమేదీ..?
కానీ
మీరు ఎదుటి వాళ్ల బరువు తగ్గించోచ్చు.

పొద్దున్న
లేచిన దగ్గరనుంచి ఇంట్లో వాళ్ళు మన మీద అరిచినా,
రోడ్
మీద ట్రాఫిక్ లో ఎవరన్న తిట్టినా ,
ఆఫీసు
లో బాస్ఏమన్నా అన్నా,
చివరాకరికి
మన ప్రేయసో ప్రియుడో మన మీద విసుక్కున్నా,
లేట్
గా వస్తే అమ్మ నాన్నలు లేకపెళ్ళామో గదమాయించినా ,
మన
తోబుట్టువులు మనని అర్ధం చేసుకోక విమర్శించినా
ఇలాంటివి
ఏమి జరిగినాముందు మనకి జరిగేది మనసు చిన్నబుచ్చుకోవటం.
దీన్నే ఇంగ్లీష్ లో FEELING LOW అంటారుట.
దానివల్ల
మన మానసిక పరిస్థితి కొంచం సేపు బాగుండదు.
మనం
ఎదుర్కున్న అంశంని బట్టీ కొండొక చొ ఇంకా ఎక్కువ మనం బాధ పడొచ్చు.
సున్నిత మనస్కులయితే మనుషులు ఎదుటి వాళ్ల మీద ఎందుకలా అరుస్తారో
నిదానం
గా చెప్పలేరా అని మళ్లీమళ్ళీ ఇంకో సారి బాధ పడే ఆస్కారముంది
ఏమైనా నష్టం అరిపిచ్చుకున్న వాళ్ళకే.

దీనికి
విరుగుడు గా మనం అరిస్తే అరిచారులే కొంత సేపటికే వాళ్ళే ఊరుకుంటారు
అనుకుంటే
చాలా కొద్ది సేపట్లోమామూలు గా ఉండొచ్చు.
ఇదే
సాధన చేస్తే అస్సలు మనం ఎవరేమన్నా FEELING LOW కి చేరం.
దీనికో కధ ఒకపెద్దాయన చెప్పిందే చెప్తా వినండి .

ఫ్లోరిడా
లో ఉందే ఒక అమెరికన్ కాలమిస్ట్ పేరు డేవిడ్. జే . పోలాయ్ (పోలయ్య కాదు పోలాయ్ మన ఆంధ్రుడే అనుకునేరు.) అయన ఒక సిద్దాంతం చెప్పారు అదే ది లా అఫ్ గార్బేజ్ ట్రక్ , నెట్ తోపరిచయమున్న అందరికి దాదాపు గా పరికాయమున్న కధే ఇది ఆయినా మళ్లీ మనవి చేస్కుంటా . పోలాయ్ గారు ఒక పొద్దు న్యూ యార్క్ లో స్టేషన్ కి టాక్సీ లో వెళ్తుంటే జరిగిన సంఘటన లో టాక్సీ డ్రైవర్ దగ్గర నేర్చుకున్న జీవితసత్యం. ఎవరైతే నేంటి మంచి మంచే కదా . మాట కొస్తే వెన్న దొంగ నుంచి మనం గీత తెలుసుకోలేదా సేమ్ అలాగే.
అలా టాక్సీ లో వెళ్తుంటే సరైన దారిలోనే సరైన రూల్ ప్రకారం టాక్సీ డ్రైవ్ చేస్తున్నాడట. ఇంతలో ఒక పక్క పార్కింగ్లోంచి దూసుకు వచ్చిన ఒక నల్ల కార్ రోడ్ లో అడ్డం వచ్చి, మన పోలయ్య గారి టాక్సీ కి గుద్దినంత పని చేసి లోపుసర్దుకొని మన డ్రైవర్ ని ఏదో వినపడని బూతులు తిట్టేసి ఎడమచేతి మధ్య వేలు ఎత్తి చూపి ( ఏంటని అడగకండి పెద్దలారా ఒక క్రికెట్ కోచ్ కి కూడా ఇష్టమైన అదో రకం చేష్ట) వెళ్లి పోయాడుట. మన పోలయ్య గారి ఆశ్చర్యానికి కారణమవుతూ సదరు టాక్సీ డ్రైవర్ జూనియర్ వెన్న దొంగ లాగ ఒక చిరునవ్వు నవ్వి " పోనీ లెద్దురూ వాడేదో చిరాకు లో ఉండిఅలా చేసాడు , మనం పట్టించుకోక పోతే వాడే పోయాడు, గొడవ లేదు అన్నాడుట. ఇంకా మాట్లాడుతూ ప్రతి మనిషిఇంట్లోంచో ఆఫీసు లోంచో ఇంకా ఎక్కడనుంచో బయటకి వచ్చేటప్పుడు పుట్టెడు కోపాలు బాధలు అలకలు నెత్తిన పెట్టుకొనివస్తాడు, అవన్నీ ఎవరి మీద చూపాలో తెలియక ఇలా ప్రదర్శిస్తారు . మనం ఊరుకుంటే వాళ్ళే సర్దుకుంటారు అనిచెప్పాడుట.
ఒక రకం గా పైన చెప్పబడిన కోపాల్ తాపాల్ అలకల్ కులుకుల్ అన్ని చెత్త అనుకుంటే అవి మోసే (ఉన్న) మనిషి మనమునిసిపాలిటి చెత్త బండి లాంటి వాడు స్టైల్ గా చెప్పాలంటే గార్బేజ్ ట్రక్. చెత్త ఒకసారి ఎదుటి వాళ్ల మీదకుమ్మరించాక మామూలు బండి అవుతాడు (మళ్లీ నిండేదాకా). మనం కాసేపు మౌనం , శాంతం వహిస్తే వాళ్ళ చెత్తదించిన వాళ్ళ మవుతాం. మనమూ కోపం ప్రదర్శిస్తే చెత్త ని పెంచిన వాళ్ళం అవుతాం. నాకూ చెత్త నింపడం కంటే ఎదుటివాళ్ల చెత్త ఖాళీ చెయ్యటం ఇష్టం అని చిద్విలాసం గా సెలవిచ్చాదుట.
రెండు సంవత్సరాల క్రితం నేను చదివిన ధియరీ నాకూ చాలా సార్లు ఉపయోగ పడింది. కొని సార్లు జనం చేత నాకూపొగడ్తల నిచ్చింది కూడా. మన సొంత మనుషులతే నేమీ బయట వాళ్ళయితే నేమీ ఎవరి చెత్త నైనా మనం దింపటానికిసాయం చేయొచ్చు. పాపం చెత్త దింపే స్థలం (మనిషి) లేక వాళ్ళెంత ఇబ్బంది పడుతుంటారో ఒక్కసారి ఆలోచించండి.
కాబట్టి పుణ్య జనులార చెత్త వేయకండి , దింపండి (నేను మున్సిపల్ కార్పోరేషన్ లో పని చేస్తున్నానని మీలో కొంతమందికి డవుటు కూడా వచ్చేసి ఉంటుంది కానీ కాదు.)
బరువు
తగ్గించే డాక్టర్ అవుదామనుకున్న మీకు నిరాశ కలిగిస్తే క్షమించండి.

PS: చిన్న బ్లాగు పోస్ట్ చదివి డాక్టర్లు అవుదామనుకున్న మీకు కోపం వచ్చే ఉంటుంది .. దింపండి దింపండి మీ కొపపు చెత్త నా మీద దింపండి
నేను
Jr .కృష్ణుడిలా నవ్వుతూ స్వీకరిస్తా.
సినిమాల్లో
కృష్ణుడి లాగా మటుకు ఎడమ చేత్తో దీవిన్చను గ్యారంట్రీ ..............

23, సెప్టెంబర్ 2010, గురువారం

ప్రేమ లో పడే వయసా ఇది ..!!


ఎపుడైనా ప్రేమ లో పదండి .. వయసు నో ప్రోబ్లం ...

ఒక వర్షా కాలం పొద్దున్నే మంచిగా పెద్ద వాన పడుతుంటే లేక రాత్రంతా వాన కురిసి పొద్దున్నే ముసురు ముసురు గా ఉంటే నిద్ర లేవాలని ఉంటుందా, ఒక వేళ లేచినా అలా పొద్దున్నే లేవగానే ఏమి చేస్తాం ? బ్రషింగ్ అయ్యాక వేడి వేడి కాఫీయో టీయో తాగుతూ పేపర్ లోని చల్లారిన వార్తలు మళ్లీ చదువుతూ ( నిన్న రాత్రి టీవీ లో చూసేసాం కదా ) ఒక అరగంటైనా గడుపుతామా మరి . (ఇది నీకు కుదురు తుందేమో గానీ మాకు అంత టైం లేదు అంటారా మీ ఇష్టం) కుదిరిన కుదరక పోయినా ఇది చదవాల్సిందే తప్పదు.
ఒక వేళ ఈ రోజు ఆఫీసు కి వెళ్ళాలని లేక పోయినా ఇంకేదైనా పని ఉన్నా సెలవు పెడతాం కదా. ఇది కూడా నీకే చెల్లు మా వల్ల కాదంటారా మళ్ళీ మీ ఇష్టం. నో కామెంట్స్. కాఫీయో టీయో కావాలంటే ఏమి కావాలి బయట నుంచి పాలు, అవి కాయటానికి పనమ్మాయ్ వచ్చి గిన్నెలు తోమి రెడీ చేసి ఇవ్వాలి, ఇంకా అంతకన్నా ముందే పేపర్ అబ్బాయి పేపర్ వేసి వెళ్ళాలి. ఇన్ని జరిగితే మనం పై సీన్ బాగా పండిస్తాం.
మళ్లీ కధ మొదటికి వెళితే ఒక వర్షా కాలం పొద్దున్నే మంచి వాన లో ఏదైనా ఇబ్బందికి పనమ్మాయి రాకపోతే పాల అబ్బాయి పాకెట్స్ ఇవ్వక పోతే పేపర్ అబ్బాయి మన మొహాన ఆ యీక్షి, సానాడు కొట్టక పోతే...??? ఏంటి మార్గం ? మనవే అవును సాక్షాత్తు మనమే చేయాలి ఈ పనులన్నీ ఇందులో అడ పని మగ పనీ అని నేను బేధం నేను చెప్పట్లేదు ఎవరికీ ఎలా కుదిరితే అవి చెయ్యాల్సిందే ఆ రోజుకి. తీరా ఏ ఎనిమిదింటికో పనమ్మాయి వచ్చి వర్షానికి ఇల్లంతా నీల్లమ్మా తడవటం వల్ల జొరం కూడా వచ్చింది మా మగాయన పన్లోకి కి కూడా వెళ్ళలేదు ఇల్లాంటి సాకులు చెప్తే ఎలా ఉంటుంది ? ఒళ్ళు మండదూ... అబ్బే మేము చెంగల్పట్టు శాంతారాంలం మాకు అస్సలు కోపం రాదు అంటారా ! మీరు కాసేపు పక్కన ఉండండి. !!
గిన్నెలు తోమటం ఇల్లు ఊడవటం బయటకి వెళ్లి పాలు పేపర్ తెచ్చుకోవటం, మనకి తప్పవ్ కదా . కాసేపు తెల్ల మెడ ఉద్యోగం చేసే మా రాజులూ మా రాణులు మనకున్న సౌలభ్యాల గురించి ఆలోచిద్దాం ఒక పది నుంచి పదిహేను సాధారణ సెలవులు ఆదివారాలు పండగలు మనవి కాక పక్క రాస్త్రానివి కూడా , ఇంకా ప్రివిలేజ్ లీవులు కొంతమందికి శని వారం కూడా సెలవ్ ఇంకా సిక్ లీవ్ ఇలా లెక్క పెడితే హక్కుల సాధనలో మనం చాలా ముందున్నాం. నీకెందుకోయ్ ఏడుపు అవన్నీ ఇచ్చేవ్వాడికి లేని దురదా అని తిట్టకండి ఇవన్నీ నాకూ కావాలి. ఇందులో సేమ్ పించే .
కానీ మన ఇంట్లో పని చేసే వాళ్ళ మీద కొంచం కనికరం కూడా చూపుదాం. ఇబ్బంది వల్ల రాలేక పోయిన పనమ్మాయి కి ఎమన్నా తినడానికి పంపే ప్రయత్నం . వాన వల్లో చలి వల్లో లేట్ గా వచ్చే పాల పేపర్ అబ్బాయ్ లకు ఒక కప్పు చాయ్ ఇవ్వటం. లాంటివి. ఇవన్నీ మీరు చేస్తున్నారు నాకూ తెలుసు అయినా
వయసు మీద పడటం వల్ల వచ్చిన చాదస్తం తో చెప్తున్నా ..
ఇల్లాంటివే ఇంకా చాలా ఉన్నాయి లిస్టు రాయనా..
1 మన వాచ్ మాన్ కి రోజుకొకళ్ళు తినడానికి కూరో సాంబారో ఇవ్వటం కష్ట మైన పనేమీ కాదు ఉన్నా 20 లేక 30 ఫ్లాట్స్ లో నెలలో ఒక రోజు ఒకళ్ళకి పని అంతే ,
వాళ్ళ పిల్లలకి చదువు కి సాయం చేయటం అప్పుడప్పుడూ నోట్స్ లు పెన్నులు కానుకలు గా ఇవ్వటం , వారానికో నెలకో వాళ్ళకి మన కారులో లేదా బైక్ మీద స్కూల్ దగ్గర లేదా దార్లో దింపే సాయం చేయటం. ఏదన్న అనారోగ్యం వస్తే మందులకి చేత నైన సాయం చేయటం అన్నిటికన్నా ముక్ష్యం గా వాళ్ల పిల్లలకి పనులు చెప్పక పోవటం. మన పిల్లలతో సమానంగా కాక పోయినా కనీసం పిల్లలుగా చూడటం .
2 ఇంట్లో పని చేసే మనిషి మీద సెలవు విషయం లో కనికరించటం, వాళ్ళు మనలాంటి మనుషులన్న అవగాహన ఉండటం. పైన చెప్పిన చిన్న చిన్న సాయం వాళ్ల పిల్లలకీ చేయటం
3 పొద్దున్నే వాన లో లేదా చలి లో వచ్చే పాల అబ్బాయి కో పేపర్ అబ్బాయికో ఒక కప్ టీ ఇవ్వటం ఒక మంచి పలకరింపు చేయటం , కనీసం వాళ్ళ పేర్లు తెలుసుకొని వాళ్ళని పేర్ల తో పిలిచి సంతోష పెట్టటం . దీనికోసం మీరు పొద్దున్నే లేస్తారు అది మీకు ఎంతో ఆరోగ్యం ఆనందం కూడా.
4 మంచి ఎండాకాలం ఎండలోనో, వానాకాలం వాన లో వచ్చిన పోస్ట్ మాన్ కి కొరియర్ మనిషి కి చల్లటి నీళ్ళు ఇంకా మనసుంటే మజ్జిగో శరబతో ఇవ్వటం..
5 మన కాలనీ లేదా ఆఫీసు సెక్యూరిటీ గార్డ్ లను ఆదరించటం పొద్దున్నే మనమే గుడ్ మార్నింగ్ చెప్పటం. ఎపుడన్నా చిన్న మొత్తం బక్షీస్ ఇవ్వటం
6 ఇలా మనకి తెలిసిన వాళ్ళకే కాక అస్సలు తెలియని వాళ్ళకి కూడా సాయం చెయ్యొచ్చు లిఫ్ట్ అడిగి మరీ ఇవ్వటం ఆడాళ్ళ కైతే రెడీ అంటారా సర్ జీ మీ ఇష్టం ...
7 ఒక సెలవ రోజు డజను అరటి పళ్ళో ,జామ కాయలో కొని రోడ్ మీద బీద ముసలి వాళ్లకి పంచటం, బిస్కట్ ప్యాకెట్ లేదా బ్రెడ్ ప్యాకెట్ కొని ఆకలి కొన్న వాళ్ల ఆకలి తీర్చటం
( ఒక చెత్త సినిమా చూసినంత ఖర్చు కాదు )
ఈ రకం గా మీరు మీ చుట్టూ ఉన్నా వాళ్ళతో ఎపుడన్నా ప్రేమ లో పడొచ్చు , దీనికి వయసుతో నిమిత్తం లేదు పెళ్ళాం లేదా మొగుడి తో పేచీ లేదు
ఇవన్నీ మేము చేసేవే ఇంక నువ్వు చెప్పేదేంటి అంటారా మీకు ఈ స్క్రీన్ మీదే సాష్టాంగ ప్రణామం, బయట కనబడితే పెద్ద సలాం ....

17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

నెల బాలా ఓ నెల బాలా ...


నెల బాలా ఓ నెల బాలా

విజయవంతం గా నెల రోజులు పూర్తి చేస్కున్నా ....

అందరు బ్లాగ్ పెట్టి సంవత్సరం అయింది రెండేళ్ళూ మూడేళ్ళు ఇంకా ... ఎక్కువ అంటూ పోస్ట్స్ రాస్తుంటే నేను నెల అయింది అని రాస్కుంటున్నా....
సినిమా వాళ్ళ తో పోలిక : చాల ఏళ్ళ క్రితం సినిమా వంద రోజులు సిల్వర్ జూబ్లీ ఇలా ఉత్సాహ పాడేవాళ్ళు ఇంకా పుణ్యం పండితే సంవత్సరం ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.
కానీ ఇప్పుడు 5వ రోజు , పదో రోజు , 25 వ రోజు పుణ్యం పుచ్చితే 50 వ రోజు , మోక్షం అంటే వంద ( ఎప్పుడో కాని మోక్షం రావట్లేదు) ఇలా నడుస్తోంది కదా అల్లాగే నా బ్లాగ్ ఈరోజు తో నెల పూర్తి చేస్కుంది. ఆ ఆనందం లో ఎమన్నా ప్రవచిద్దాం .. అంటే గత నాలుగు రోజులుగా చాల బిజీ ఇంకో వారం దాక అంతే కాబట్టి బుర్ర పని చెయ్యక ఇలా సోది తో నింపు తున్నాను. దయ గల మా రాజులు, రాణులు, యువరాజ, యువరాణులు చదివి నన్ను ఆదరించ ప్రార్థన. ఈ రోజు ని బాగా సెలెబ్రేట్ చేస్కుందా మానుకున్న కానీ టైం లేక ఇలా కేకు, సమోసా తో కానిచేస్తున్నా...

ధన్యవాదాలు..

ఆత్రేయ
PS: ఆటో గ్రాఫులు అవీ వచ్చే గురు వారం ఇస్తా టైం లేదు సారీ

14, సెప్టెంబర్ 2010, మంగళవారం

భయం తో ఏడుపు

హైస్కూల్లోనే రౌడీలని ఫేస్ చేశా ...

నా గత ఏడుపులన్నీ చదివారుగా ఇప్పుడు భయం తో ఏడిచి సంగతి చెప్తా చదువుకోండి . నా 6 , 7 క్లాసులు ఒక స్కూల్లో గడచాయి. ఆ రెండేళ్లలో మా మీద బోణీ చేస్కున్న మాస్టర్లు ముగ్గురు ఉన్నారు, అంటే వాళ్ళ వాళ్ళ టీచర్ వృత్తి మాతోనే మొదలు పెట్టారన్న మాట, అలాంటి వాళ్ళలో సుధాకర్ సర్ అని హిందీ చెప్పటానికి జేరారు. సన్నగా పొడుగ్గా ఫుల్ హాండ్స్ చారల షర్ట్ ( దీనివల్ల ఇంకా సన్నగా కన పడేవారు) కొంచం వైవిధ్యమైన శరీర భంగిమలతో వింత గా కనిపించే వారు.
మంచి మాష్టారు కానీ పన్నెండేళ్ళ తోక లేని కోతుల మధ్య లంక లో సీతమ్మ వారిలా ఇబ్బంది పడే వారు. కొంచం చిలిపితనం పాలు ఎక్కువున్న నా లాంటి వాళ్ళకి అయన మంచి సబ్జెక్టు. పాపం శమించు గాక ..అయన మీద పరోక్షంగా ఎక్కువ, ప్రత్యక్షం గా కొంత వ్యంగ్యపు ధోరణి ఉండేది మాకు. ముఖ్యం గా అయన చేతులు మూతి కి అడ్డుపెట్టుకొని మాట్లాడే అలవాటు మా కందరికీ కూడా అలవాటయింది.
అలా ఆయనతో ఒక పూర్తి సంవత్సర కాలం గడపిన తర్వాత మాకు ఆయనంటే గౌరవం స్థానం లో ఒక రక మైన హేళన భావం పెరిగి పోయింది( మనస్పూర్తిగా ఆయన్ని క్షమించమని కోరుకుంటున్నాను..ఎదుట కనపడితే కాళ్ళు పట్టుకొని మరీ క్షమాపణ అడగాలని ఉండి) ఖాళీ టైం లో నా లాంటి ఔత్సాహికులు ఒక నలుగురికి ఆయన్ని అనుకరించి మిగతా వాళ్ళని ఆనంద పరచటమే పని గా మారింది. ఇలా మా ఏడో క్లాసు అయ్యాక హైస్కూల్ కోసం నేను ఆ స్కూల్ ఒదిలేసి ఒదిలి వెళ్ళిపోయాము.

కానీ వంకర తోక ఏమి చేసినా సాపు అవడుకదా... అదే రకమైన మిమిక్రీ షోలతో కొత్త స్కూల్లో కూడా జనాన్ని ఆనందింపచేసే వాళ్ళం. ఆ స్కూల్లో సగం పైగా నా పాత స్కూల్ ఫ్రెండ్సే మరి. ఇలా రోజులు గడుస్తున్న కాలం లో ఒక సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికెళ్ళే సమయం లో రోడ్ మీద మా పాత హిందీ సర్ సుధాకర్ గారు కనపడ్డారు పాత గురువు కనపడితే నమస్కారం చెయ్యల్సినది పోయి నవ్వు కున్నాం ., అయన మొహమ్మీదే ... పైగా మా గ్రూప్ లో ఒకడు ఆయన్ని ఎడిపించాలని అయన వెనక సుధాకర్ సుధాకర్ అని పిలిచాడు .... ఇలాంటి అంటూ రోగాలు తొందరగా పాకుతాయి కదా వెంటనే అయన వెనక చాలా సేపు ఈ విపరీత చేష్ట మేమంతా ఆచరించాము. ఆ పైశాచిక ఆనందం ఎలాంటి దంటే అల మూడు, నాలుగు , సార్లు స్కూల్ అవగానే అయన కనపడే రోడ్ మీద వేచి ఉండి ఆయన్ని అలా పేరుతో పిలిచి పారిపోయే వాళ్ళం.

కానీ రోజు దణ్ణం పెట్టుకునే మా హిందూ హై స్కూల్ సరస్వతి దేవి ఊరుకోదు కదా శాపం పెట్టింది.....

ఒక రోజు పొద్దున్న 11 45 కి ఇంటర్వెల్ లో గ్రౌండ్ లోకి వెళ్తే మా సుధాకర్ సర్ కనపడ్డారు చాలా ఆశ్చర్యమేసింది ఆయనేంటి ఇలా ఇక్కడ అనుకునే లోపు అయన వెనకే పొట్టిగా నల్లగా లావుగా మీసాలు మెలితిప్పిన ఒక వ్యక్తి కనపడి మమ్మల్ని దగ్గరకి పిలిచాడు ఇంటర్వెల్ లో ఎక్కడో గోడ దగ్గర చేయాల్సిన పని గ్రౌండ్ మధ్యలోనే అయినంత పనయ్యింది మా గ్యాంగ్ కి . దగ్గరకి వెళ్లి వణుకుతూ నున్చున్నాం. ఆ మీసలాయన ఎవడురా ఇందులో మాస్టారు ని పేరు పెట్టి పిలిచి అరుస్తున్నది ఇప్పుడు పిలవండి నాలిక లు తెగ కోస్తా అని చిరంజీవి లా అన్నాడు. మేమంతా నేను కాదండి, నేను కాదండి వాడు ఈరోజు రాలేందండి ,వస్తే చెప్తా మండి ఇలా చాలా అబద్దాలు చెప్పేసాం. ఇంకో సారి అలా చేస్తే చెప్పాగా ఏముతుందో అని అనగానే మొత్తం అందరం బేర్ బేర్ మని ఏడ్చాం . భలే భయమేసింది సినిమాల్లో చూడటమే ఇలా నిజం రౌడీలు వచ్చి వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుందో అనుభవమైంది. బెల్లు కొట్టిన మోత విన గానే వెళ్ళండి వెళ్లి ఇక నుంచి సరిగ్గా ఉండండి అని ఫైనల్ వార్నింగ్ ఇవ్వగానే బ్రతుకు జీవుడా అని క్లాస్సుల్లోకి వచ్చి పడ్డం. ఆ తర్వాతి పీరియడ్ అంతా వెక్కుతూనే ఉన్నాం అలా ఒక భయం తో కూడిన ఏడుపు జ్ఞాపకం నా మనసులో ఉండి పోయింది. ఇది 31 ఏళ్ళ క్రితం మాట సుధాకర్ సర్ ఎక్కడున్నా చల్లగా ఆరోగ్యం గా సుఖం గా ఉండాలని కోరుకుంటూ...
p s : ఇంతకీ ఆ వార్నింగ్ ఇచ్చిన రౌడీ మా ప్రకాష్ కి మంచి ఫ్రెండ్ B Sc ఫైనల్ ఇయర్ స్టూడెంట్ , ఈ సీను కోసం 15 రోజులు మీసాలు పెంచాదుట కష్ట పడి. ఇది తర్వాత తెలిసిన పచ్చి నిజం.
తర్వాత ఆ సీన్ లో నాతో పాటు ఏడ్చిన చిన్నాగాడు, ఫణి గాడు , తిలక్ గాడు, ఆ విషయం చెప్తే తెగ నవ్వారు గానీ , నాకూ మాత్రం ఆ ఏడుపు సీనే జ్ఞాపకం.

12, సెప్టెంబర్ 2010, ఆదివారం

ఈశ్వర్ అల్లా ఫ్రెండ్స్ ట..

గణేశుడు అల్లా షేక్ హ్యాండ్ సీన్ చూడండి...

కిందటి ఏడు మా ఆవిడ ఫ్రెండు రంజని ఆంటీ ఫోన్ చేసి ( అంటీ ఏంటని అనుకుంటున్నారా మా అమ్మాయి పిలుచేవరసలే నేనూ పిలుస్తా) మా ఆవిడని ఒక కోరిక కోరింది. నాకు తెల్సిన అబ్బాయి ఉన్నాడు భాషా అని ఇంటర్ మీడియాట్చదువు తున్నాడు ఆర్ధిక పరిస్థితి బాలేదు ట్యూషన్స్ జేరలేదు, కార్పొరేట్ కాలేజీ సందు లోంచి కూడా వెళ్ళలేడు, కెమిస్ట్రీచెప్పమని మా ఆవిడని కోరింది. మా ఆవిడ కెమిస్ట్రీ లెక్చరర్ గా చేసి రిజైన్ చేసి ఇంట్లో ఖాళీ గా ఉండి కాబట్టి వెంటనేఒప్పుకుంది.

భాషా మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు, బక్క గా, అమాయకంగా, వయసు పిల్లల కుండే సహజ మొహమాటంతో ఉన్నాడు. వారానికి రెండు మూడు సార్లు వచ్చేవాడు కెమిస్ట్రీ దవుట్ట్స్ చెప్పించుకునే వాడు. మంచి పిల్లాడు. తండ్రిరైల్వే లో పని కాని, మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక సాయం ( లిక్కర్ కొనుక్కొని తాగి) చేసే ప్రయత్నం లో ఇంటిని పట్టించుకావట్లేదు. తల్లి లేదు . నాయనమ్మ పాపం ఇళ్ళలో పని చేసి ఇంటి బండి నడుపుతోంది. రోజూ ఇంట్లో తండ్రి గోల, కుటుంబానికి ఆలంబన గా ఉండాల్సిన వాడే ఆందోళనా గా మారేడు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ సాయం చేసిన రోజుఇంట్లో భాషా ని వల్ల నాయనమ్మ ని కూడా కొడతాడట. మనమేమీ చేయలేని పరిస్థితి. చదువు విషయం లో చిన్నసాయం తప్ప. మా అమ్మాయి ఇంటర్మీడియట్ బుక్స్ అవీ ఇచి అతని భుజం తట్టడం తప్ప.

అలాంటి
భాషా ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు ఇంజనీరింగ్ ఎంట్రన్సు లో 95000 రాంక్ వచ్చింది విషయంచెప్పడానికి వచ్హాడు పోయిన వారం. ఇంజనీరింగ్ లో చేరతావా అని అడిగా మా ఊళ్లోనే ఒక ముస్లిం మైనారిటీ కాలేజీ లోరావచు కానీ ఫీజు కట్టలేను సర్ ప్రభుత్వం ఫీజు రీ ఇమ్బర్స్ మెంట్ పధకం ఆపేసింది , కాబట్టి ఇంజనీరింగ్ కష్టం సర్అన్నాడు. నాకూ ఆలోచిస్తే ప్రతి సంవత్సరం ఫీజు గురించి పుస్తాకాల గురించి తంటాలు పడుతూ ఎదురు చూస్తూ ఉండేకన్నా B Sc (ఎలక్ట్రానిక్స్) చదవటం మంచిది కదా ఫీజు తక్కువ అని పించింది. రకం గా చూసిన ఇంజనీరింగ్ కష్టంఅని డిగ్రీ లో జేరి పోమని సలహా ఇచ్చా,
నాకు తెలిసిన ముస్లిం స్నేహితులని విషయం లో సాయం అడిగా పోయిన వారం రంజాం మాసం నడుస్తోంది కాబట్టివాళ్ళ ఆచారం ప్రకారం జాకాత్ ( ప్రతీ ఇస్లాం మతస్తుడు తన మొత్తం ఆస్తి లో 2 .5 % వంతు ప్రతీ సంత్సరం బీదలకిదానం ఇవ్వటం) లోంచి తమకు తోచిన సాయం చేస్తారని. కొంత మంది సాయం చేసారు అది వాళ్ళ పేరు మీద అతనికి అందించా.

ఇంతకీ
వినాయకుడు అల్లా షేక్ హ్యాండ్ సంగతి ఏంటని మీరూ అడుగుతున్నారా... వస్తున్నా.. నేను గత నెల రోజులు గా అయ్యప్ప దీక్ష లో ఉన్నా.. మాల నియమాల ప్రకారము బయట వస్తువులేవీ తినట్లేదు ఇంట్లోవి తప్ప .. నిన్న రంజాన్ / వినాయక చవితి రెండూ ఓకే సారి వచ్చాయి కదా మన భాషా మా ఇంటికి ఒక స్టీల్ డబ్బా లో ఖర్జూరం జీడి పప్పు కిస్మిస్ఎందు కొబ్బరి తీసుకొచ్చాడు ఎందుకు భాషా ఇవన్నీ అంటే తీస్కోండి సర్ పండగ కదా అన్నాడు. నేను తీస్కున్నా.. ఈద్ముబారక్ చెప్పి అతన్ని చేతుల్లోకి తీస్కుని అటు ఇటు గలే మిలాప్ చేస్తే అబ్బాయి బాగా ఎమోషనల్ గాఅనిపించాడు. కాసేపు కూర్చూని మాట్లాడి వెళ్లి పోయాడు. భాషా తెచ్చిన బాక్స్ లోవి నేను అయ్యప్ప దీక్షా నియమాలప్రకారం బయటి పదార్థాలు కాబట్టి తినకూదనుకున్నా.. కానీ భాషా చెమర్చిన కళ్ళు నేను దగ్గరకి తీస్కునప్పుడు కొద్దిగావణికిన బక్క శరీరం గుర్తొచ్చి ఎందుకో తినాలని పించిది ఎంత ప్రేమగా తెచ్చాడో 10 కిలో మీటర్లు సైకిల్ మీద, అని గుర్తొచ్చితినేసా.. అయ్యప్ప ఏమి అనడు పైగా అయ్యప్పకి వావర్ స్వామి అని ఒక ముసల్మాన్ మిత్రుడు కూడాఉండేవారుట.ఏమన్నా ఉంటె వాళ్ళు వాళ్ళు మాట్లాడు కుంటారులే . అసలు అన్ని మతాలకీ కలిపి కొన్ని పండగలుఉంటె ఎంత బాగుండు .. ఉన్నాయ్ గా ఆగస్ట్ 15 జనవరి 26 అక్టోబర్ 2 అంటారా .....నిజమే అన్నీ మతాలకి అతీతం గా జరుపుకునే పండగలే ఉంటె ఎంత బాగుండు కనీసం ముందు తరాలకనా.......

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

అమ్మాయిలకి ఆటో గ్రాఫ్స ఇస్తున్నా సారీ బిజీ

అమ్మాయిలకు ఆటోగ్రాఫ్ ఇస్తున్నా సారీ బిజీ.....

ఒక
నాలుగు పేరాలు బ్లాగ్ లో రాసి ఒకల్లిద్దరి కంట్లో నా రాతలు పడగానే నాకు భలే మతింపు గా ఉంది .. ఒక రచయితఅయినట్లుగా.. పొగరు తో నిన్న రాత్రి పడుకున్నా.. పొద్దున్న లేచి పేపర్ చదువుతుంటే అనుబంధ సంచిక లో నా బ్లాగ్గురించి ఎవరో పేపర్లో వేసేసారు( రాసేసారు) తెగ మెచ్చుకుంటూ... వర్ధమాన రచయిత .. తెలుగు సాహిత్యానికి మళ్ళీమంచి రోజులొచ్చాయి ... పుస్తక ప్రియుల ఆశాకిరణం కాంతి పుంజం అంటూ.. ఇలా తెగ పొగుడుతూ... ఎవరో అభిమానిఅయుంటాడు లే అని సరిపెట్టుకున్నా.
మధ్యాన్నం
నుంచి ఫోన్ల మీద ఫోన్లు మీరేం చేస్తుంటారు ఎక్కడ ఉంటారు అంటూ ప్రశ్నల శర పరంపర అటు మెయిల్చూడ బోతే బాక్స్ నిండిందోయి ఇంకో బిందె పట్రా అంటూ జిమెయిల్ వాళ్ళు అరుపులు ఏంటో అభిమానం ఇంతగాకట్టి పడేస్తున్నారు నన్ను. ఆఫీసు లో ఫైల్స్ అలుక్కుపోయి కనపడుతున్నై ఏంటి సైట్ పెరిగిందా ఏంటి చెప్మా ... అనిచూస్తే కళ్ళు చెమర్చాయని పక్క వాళ్ళు సరి చేసారు. సరే ఇదంతా సరే వారం తిరిగే సరికి రిజిస్టర్ పోస్ట్ లో కేంద్రప్రభుత్వం సాహిత్య అకాడెమి నుంచి ఎమన్నా మీ రచనలు పంపండి అవార్డు ఇస్తాం ( మరీ ఊరికే ఇస్తే బాగుండదు అనికింద PS పెట్టి ). లోపు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తొందర పడింది బ్రేకింగ్ న్యూస్ లో ధర్మవరపు ని తొలగించి ఆ స్థానం లో నన్నుఉంచినట్లు.

సరే
ఇవన్నీ సరే బ్లాగ్ రచయితల కి ఏదో ఛానల్ వాళ్ళు అవార్డ్స్ ఫంక్షన్ పెట్టారు సరిగ్గా టీవీ అవార్డ్స్ లాగా.. ఇక్కడోసంగతి చెప్పాలి పొపులర్ రచయితలు , పెద్ద రచయితలు , పుస్తకాలు అచ్చోయించుకునే రచయితలు బ్లాగ్ జోలికి రానట్లు, బ్లాగ్ లో రాయటం చిన్నతనం అన్నట్లు, సినిమా అర్తిస్త్స్ లకి వివిధ అవార్డ్స్ ఇస్తూ చానల్స్ లైవ్ ప్రోగ్రాం పెడితే దాంట్లో టీవీనటులు వెనక వరుసలలో కూర్చొని తెగ చప్పట్లు కొడితే .. టీవీ అవార్డ్స్ ఫంక్షన్ కి సినిమా వాళ్ళు లైట్ తేస్కోని రానట్లుగా, మన బ్లాగర్స్ ఫంక్షన్ కి పెద్ద రచయితలు రారేమో అన్న అనుమానం ఏమో రోజు దాక వేచి చూడాలి ఏమిచేస్తారో వాళ్ళు . లోపు నేను మా ఇంట్లో మూడో బెడ్ రూం ని నా ఆఫీసు రూం గా మర్చేసుకున్నా . టేబుల్ కుర్చీ ఒకనాలుగు విసిటేర్స్ కుర్చీలు కిటికీ లో ఫెర్న్ మొక్క ,గోడ, దాని మీద ఒక బల్లి, కిటికీ అవతల జాజి తీగ, ఆకాశం లోచంద్రుడు ( ఎప్పుడూ ఉంటాడా అని అడక్కండి) ఇవన్నీ ఏర్పాటు చేసేస్కున్నా.. ఇప్పుడు ప్రెస్ వాళ్ళు టీవీ వాళ్ళురావటమే తరువాయి.

ఇన్ని
జరిగాక మన నానుడి ఉంది కదా తెలుగోడు పైకి వస్తే పక్కోడు కాళ్ళు పట్టి లాగేస్తాడని అదే జరినట్లు అనిపిస్తే తేరిపారా చూసా. తీరా చూస్తే ఆ పక్కోడు మా ఆవిడే .. లేవండి లేవండి ఎప్పటిలాగా రంజాన్ ఇవ్వాళ కాదట రేపట.. ఈ రోజూ మీకు ఆఫీసు ఉంది అంటూ....( పెళ్లాలున్నారే .. ..)

9, సెప్టెంబర్ 2010, గురువారం

మీ మీద అపవాదు పడకూదనుకుంటే ..చదవండి..


వినాయక చవితి

ప్రతి
విషయానికి రింగుల్లోకి వెళ్లి గతం గుర్తుకు తెచ్చుకునే నాకు వినాయక చవితి అనగానే మళ్లీ రింగులు పడ్డాయి మొహమ్మీద. ఇది నే పుట్టాక 45 వినాయక చవితి మొదటి అయిదు ఆరు చవితి పండగలు గుర్తులేవు అప్పటికి మనం చిన్నవాళ్ళం కదా.. అందుకే ఆ తర్వాత సంగతులు చెప్తా చవితి పండగకి మా అమ్మ అన్ని పండగల్లగానే మిషన్ కుట్టే సలీం ని ఇంటికి పిలిపించి చాప వేసి కూర్చో బెట్టి ఇదిగో గుడ్డలు తీస్కోని వీళ్ళిద్దరికీ చొక్కా లాగూలు బాగా పొడుగ్గా లూస్ గా కుట్టాలి అని నన్ను మా అన్న ను చూపించేది కింద చాప మీద బాసిపీట వేసికూర్చున్న సలీం భాయి కాల్లు ఊరికే ఆడిస్తూ ( అలవాటై పోయిన కాళ్ళు కదా ఊరికే ఉండేవి కాదట ) గుడ్డలు టేప్ తో కొలిచి మా ఇద్దరినీ పైకి కిందకీ తెగ చూసేసి కాసేపు గాల్లో లెక్కలు వేసి
" లాభం లేదు చాలా కష్టం రెండు లాగూలు రెండు చొక్కాలు కష్టం.. గుడ్డ తక్కువ
తీస్కున్నరమ్మా.. అంటూ బడ్జెట్ ముందు ప్రణబ్ గారిలా పెదవి విరిచే వాడు, మా అమ్మ సరిగ్గా చూడవయ్యా తమ్ముడూ సరిపోతాయి లే అంటే, ఏదో పోన్లే పాపం అన్నట్టు మొహం పెట్టి కొలతలు తీస్కుని చిన్నయనకి చొక్కా ఫుల్ హాండ్స్ రాదమ్మా అనగానే నా గుండెల్లో రైళ్ళు పరిగెత్తేవి. మా అమ్మ కొంచం గొంతు పెంచి సరిగ్గా చూడు కుదరక పోతే సత్రం కొట్టు అరుగుల మీద సుబ్బారావు( ఇంకో ప్రణబ్ లేక చిదంబరం) ని పిలుస్తా అంటే ఒద్దులే మళ్ళీ మీకు టయానికి ఇవ్వడు అని గుడ్డలు కవర్ లో సర్దేస్కునే వాడు. కేసు ఫైనల్ చేసిన జడ్జ్ గారిలా ... ఎంత గుడ్డలు, కొలతలు మనవైనా కుట్టే విద్య సలీం భాయి దే కదా ......
అలా వెళ్ళిన సలీం మేము రోజూ వెళ్లి వెంట పడితే గానీ పండగ ముందు రోజుకి రెడీ చేసే వాడు కాదు. స్కూల్ నుంచి
రాగానే రోజూ వెళ్లి వర్క్ ఇన్ ప్రొగ్రెస్స్ చూసే వాళ్ళం నేను మా అన్న. మీరూ వెళ్ళండి బాబూ నేను తెస్తా గా అనే వాడు. చివరకి మేమే తేచుకునే వాళ్ళం పాత ఆంధ్ర పత్రిక పేపర్ లో చుట్టిన మా కొత్త బట్టలు.
రెండు
రోజుల ముందే మా అమ్మ బియ్యం ఒక డబ్బాలో పోసి పిండి మర కెళ్ళి రవ్వ పట్టించుకోని రండి అని పంపేది అక్కడ మనకన్నా మందే డబ్బాలు లైను లోనే ఉండేవి అవి అయ్యి, మన వంతు వచ్చేదాకా మర లో అటూ ఇటు తిరుగుతూ, పక్కనే ఉన్న పోస్ట్ ఆఫీసు లోకి వెళ్లి అక్కడ ఉన్న జిగురు తో చిత్తూ కాగితాలు అక్కడే గోడలకి అంటించి పోస్ట్ మాస్టర్ తో చీవాట్లు తిని మొత్తానికి పనయ్యాక ఇంటికోచ్చె వాళ్ళం. పండగ ముందు రోజు సాయంత్రం కొబ్బరి కాయలు పళ్ళు పూలు ఇంకా కొన్ని అవసామైన సామాన్లు లిస్టు రాసితే సైకిలు నడిపించు కుంటూ మా అన్న నేను అక్కా తెచ్చే వాళ్ళం. పండగ రోజు పొద్దున్నే స్నానం చేసి రెడీ అయితే మళ్లీ కోనేరు సెంటర్ కి వెళ్లి పత్రి పూలు మట్టి వినాయకుడు ఫ్రెష్ గా పెర్సోనలైసేడ్ రోల్స్ రాయస్ లా మెరిసి పోతూ, మంచి బంక మన్ను వాసన వేస్తూ.. మనకోసమే తయారు చేయబడ్డాడని గర్వం గా ఎత్తుకొని ఇంటికి తీసుకోచ్చేవాళ్ళం . పదిన్నరకి మా అమ్మ సగం వంట పూర్తి చేస్తే, మేము అయిదుగురం మా నాన్న అమ్మ అన్న అక్క నేను మడి బట్టలు కట్టుకుని పూజ కి కూర్చునే వాళ్ళం మా నాన్న మాత్రం పట్టు పంచ ఉత్తరీయం వేస్కునే వాళ్ళు.
మా
నాన్న చవితి పుస్తకం చదువు తుంటే మా అమ్మ డైరెక్షన్ లో పూజ చేసే వాళ్ళం కధకి ముందు అక్షింతలు చేతిలో ఉంచుకొని కధ అయ్యాక గణపతి మీద వేసి నెత్తి మీద పెద్దవాళ్ళతో వేయించుకునే వాళ్ళం. లోపు పూజ లో ప్రసాదాల పాట వస్తే నాకు నోట్లో క్రిష్నమ్మ మా వాళ్ళందరూ కి నవ్వుల బంగాళా ఖాతం ... అలా పూజ అయ్యాక 11 30 కి మీరూ ఒక అరగంట కూర్చుంటే వంట పూర్తి చేసి మహా నైవేద్యం పెట్టి మీకు పెడతా అంటే లోపు కొబ్బరి ముక్కలు అరటి పళ్ళు మీదకి దాడి వెళ్ళేవాళ్ళం. మంచి ఉండ్రాళ్ళు పూర్ణాలు పులిహోర తో భోజనం చేసాక , మా నాన్న ఈరోజు ఒక గంట అన్న చదవండి మంచిది బాగా చదువు వస్తుంది అంటే కొంచెం సేపు ఏదో ఆక్షన్ చేసి లేచే వాళ్ళం. అలాంటి వినాయక చవితులు ఎన్నో గడిచాక ..
ఉద్యోగం
లో చేరాక పండగ రోజు ఇంటికెళ్ళి ఇంచుమించు అలాంటి చవితి పూజలే చేస్కున్నా.. పెళ్ళయ్యాక మా ఆవిడతో కూడా కలిపి అలాంటి చవితిలే చేస్కున్న మా అమ్మాయి పుట్టాక కూడా అలాంటి పండగే చేస్కున్న... నా 31 ఏట మా నాన్న శ్రావణ మాసం లో చెప్పకుండా హాటత్తు గా వెళ్లి పోతే భాద్రపదం లో
'నో ' పండగ. మరుసటి ఏడు మళ్ళీ చవితికి .. మా
నాన్న పట్టు బట్టలు ( నాకు కొత్తవి ఉన్నా..) కట్టుకొని దేవుడి ఎదురుగా మధ్య పీట మీద నేనే కూర్చొని పూజ పుస్తకం చదువుతూ మా అమ్మాయి తో పూజ చేస్తుంటే 32 ఏళ్ళకే ఎంతో పెద్ద అయిపోయిన భావన ...
ఇప్పుడు
45 దగ్గర పడుతున్న వయసులో చదువు పేరు తో దూరం గా ఉన్న మా అమ్మాయి ని తలుచుకుంటూ పూజ ఎలా చేస్తామో నేను మా ఆవిడా మా అమ్మా...
( కదా చదివి అక్షింతలు మీ నెత్తి మీద వేస్కో పోతే మీ దగ్గర
డ్రగ్స్ దొరికయన్న అపవాడు లేక అధిష్టానికి చెప్పకుండా ఓదార్పు చేసారన్న అపవాడు పడి కష్ట పడతారు తస్మాత్ జాగ్రుత జాగ్రుత ......)

8, సెప్టెంబర్ 2010, బుధవారం

మారేడు మిల్లి - ట్రిప్

మారేడుమిల్లి స్వర్గానికి కొంచం కిందుగా....ఉంది

మా ప్రభాకర్ గాడు ఎప్పటినుంచో తెగ చెప్తున్నాడు మారేడుమిల్లి వెళ్లాం , అక్కడ ఫారెస్ట్ గెస్ట్ లో ఉన్నాం చాలా బాగుంది నువ్వూ వెళ్ళరా బాబూ అని సరే కదా అని పోయిన అక్టోబర్ లో మా బ్రాంచ్ లో ఉన్న మా తో__ గ్యాంగ్ కూడా ఒక శనివారం నలుగురం బయలు దేరాం అలా రాజమండ్రి దాటి రంపచోడవరం మీదుగా మారేడుమిల్లి జేరాం. దారి పొడుగునా ప్రభాకర్ ఫోన్ లో మాకు కార్ కి రిమోట్ నావిగేటర్ గా పనిచేసాడు.
రాజమండ్రి లో ఆగి ఒక మంచి స్వీట్ షాప్ లో తినటానికి ( ఎప్పుడూ అని అడగొద్దు) ఎప్పుడైనా తినొచ్చు . చాలా స్వీట్స్ కారాలు కూల్ డ్రింక్ పెట్ బాటిల్స్ పెట్ సోడాలు కొన్నాం. కార్తీక మాసం అయినా ఎండా బానే ఉంది రంప వెళ్లేసరికి వాతావరణం మారింది కొంచం మబ్బుగా చల్ల గా.. మారేడుమిల్లి వెళ్ళే సరికి బాగా చలిగా దట్టమైన ఆ చెట్ల మధ్య నిజం గా నీడ చలి పెట్టింది.
ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కేర్ టకేర్ కి ఫోనేలోనే ముందే చెప్పాం కాబట్టి రూం కి బెంగ లేదు మేము వెళ్లేసరికి అతను ఎక్కడకో బయటకి వెళ్ళాడు ఒక అరగంట తర్వాత వచ్చి మా సంగతి అడిగి కొంచం ఇబ్బందిగా మొహం పెట్టి సారీ సర్ కింద గెస్ట్ హౌస్ ఖాళీ లేదు కొండ మీదే అక్కడికి వెళతారా అన్నాడు , మేము మనసులోనే పెద్దగా వీలేస్కోని అది నువ్వు అంతా ఇబ్బందిగా చెప్పాలా మేము పైకి వెళ్తాం కార్ ఉంది అని సర్దుకున్నాం. భోజనం కి ఏమి కావలి ఇక్కడ స్పెషల్ బొంగు చికెన్ అని చెప్పాడు అదేంటో ఈ పాటికే మీ అందరికీ తెలిసి పోయి ఉంటుంది కాబట్టి నేను వివరించాక్కర్లేదు అయిన చెప్తా చికెన్ ని మసాలా ఉప్పు కారం కలిపి పచ్చి బొంగు లో కూరి దాన్ని ఆకులతో మూసి మంటలో కాలుస్తారు, అక్కడి గిరిజన వంట ఇప్పుడు స్టార్ హోటల్స్ లో కూడా ఫేమస్ అయింది. అన్నం పప్పు వేపుడు సాంబార్ అప్పడం పెరుగు ఇవి స్టాండర్డ్ మేను. సరేఅని అవన్నీ ఆర్డర్ చేసి మేము కొండ మీదకి కి వెళ్లి పోయాం. అక్కడ రెండు a/c రూములు వెనక ముందు మంచి లాన్ మొక్కలు పెద్ద పెద్ద చెట్లతో చుట్టూ దట్టమైన అడవితో భలే భలే ఉంది.

మేము వెళ్లి కొంచం రిలాక్స్ అయి డ్రెస్ మార్చుకొని వెనక పచ్హని పచ్చిక మీద సెటిల్ అయాము . చెప్పగా మాది కొంచం తో _ గ్యాంగ్ అని అంచేత రెండు విదేశీ స్కాచ్ సీసాలు తో రెడీ అయ్యేసరికి ఫుడ్ తెచ్చారు. ఆ లాన్ లో నెల మీద కూర్చొని రెగ్యులర్ గా తాగే ఈశ్వర్, కొండ, 16 ఏళ్ళ క్రితం మందు మానేసిన నేను, అస్సలు అప్పటివరకూ మందే ముట్టని రంగ, ఎప్పుడన్నా పెళ్ళాం ఊరేల్తే రెచ్చిపోయే జానకి రాం నలుగురం కొంచెం కొంచెం అంటూ ఒక సీసా ఖాళీ చేసాం. దాంతో పాటు భోజనం కూడా అప్పటికి సాయంత్రం 6 అయింది.
మెల్లగా లేచి కొంచం స్వింగ్ లో .... కార్ తీసి కొండ కిందకి అడవిలోకి వెళ్ళాం అప్పటికే బాగా చీకటి పడి పోయింది కార్తీక పౌర్ణమి కి రెండు రోజుల ముందు చంద్రుడు కొంచం మొహమాటం గా ఆకాశం లోకి వచ్చాడు.
మొహమాటం తో పూర్తి మొహాన్ని చూపలేక కొంచం తక్కువ గా ఉన్నాడు. అలా కారులో భద్రాచలం రోడ్ మీద కి వెళ్లి ఒక పది కిలో మీటర్స్ వెళ్ళాం. చిన్న చిన్న గూడెం లు పూరి పాకలు వాటి మధ్య వంట తాలూకు పొగ మంటల పొయ్యిలు కనపడ్డాయి. అసలే ఒంట్లో మందు మంచి లొకేషన్ వాతావరణం చలిగా పైగా పైన మొహమాటపు చంద్రుడు ఇవన్ని మమ్మల్ని మాంచి స్వింగ్ లోకి తీస్కేల్లాయి . ఒక గంట అయ్యాక మళ్లీ వెనకొచ్చి రూం లో మిగిలిన ఆ రెండో సీసా ఎం పాపం చేసిందని దాన్ని కూడా మూత తీసాం. రాజముండ్రి లో కొన్న తిండి ఇంకా కొండ కింద కుక్ వేసిన అమ్లేట్లు టొమాటో కర్రీ అన్నం సెకండ్ రౌండ్ వేసేసరికి రాత్రి 11 అయింది. బుద్ధి గా పడుకుంటే ఇంటికి , మారేడుమిలి కి తేడా ఏముంటుందని బయటకి వెళ్తుంటే గెస్ట్ హౌస్ వాచ్ మాన్ ఈ టైం లో వెళ్ళకండి ఇది అడవి అని చెప్పాడు. ఇప్పుడే వస్తాం సిగరెట్స్ కావలి అని చెప్పి మళ్లీ అదే రోడ్ లోకి వెళ్ళాం అలా ఒక 15 కిలో మీటర్లు వెళ్ళాక మంచి దట్టమైన అడవిలో చిన్న వంతెనా దానికింద గల గల పారే యేరు దూరం గా ఏదో గూడెం పాకలు వాటి మధ్య గుడ్డి దీపాలు పొగ వచ్చే పొయ్యిలు ...పైన చంద్రుడు నిర్మలంగా ఆకాశం .. అన్నిటికన్నా మిన్న గా చలి దాన్ని లెక్క చెయ్యని ఒంట్లోని మందు .. ఆ వంతెన మీదే కూర్చున్నాం అక్కడ నా సెల్లోని ముఖేష్ లతా రఫీ పాటలు విని నా ఫ్రెండ్స్ చాలా ఫార్మల్ గా బిహేవ్ చేసారు థాంక్ యు రా నీ వల్ల మేము ఈరోజు స్వర్గం చూసాం కాదు కాదు వచ్చెం అని చాలా ఆనందపడ్డారు. అలా రాత్రి రెండు దాక పాటలు విని కబుర్లు చెప్పుకొని ఇలా మనతో రాని మన మిగతా బాచ్ పాపం దురదృష్టవంతులు కదా అని నిట్టూర్చాం. గెస్ట్ హౌస్ కోచి పడుకొని ఘంటసాల ఎ ఎం రాజా మాధవ పెద్ది ఇలా ఒకల్లెంటి అందరినీ పేరు పేరునా తలచుకొని వాళ్ళ పాటలు ఖూని చేసి చివరకి నిద్ర పోయాం.
పొద్దున్నే నిద్ర లేచే నేను 6 కి లేచి చూస్తె మంచు లో తడిసిన అడవి తల్లి ఎంతో అందంగా కనపడింది వెంటనే గ్యాంగ్ అంతటిని లేపాను కల్లునులుముకుంటూ లేచిన వాళ్ళు ఆ అడవిని చూసి రెప్పకూడా వేయలేదు ఆ చెట్లు తీగలు పూలు వాటి మధ్య కోతులు పిట్టలు చూస్తూ.
ఒక గంట లో అంతా రెడీ అయి మళ్లీ కొండ కిందకి వెళ్లాం ఈసారి భద్రాచలం రోడ్ మీద ఘాట్ రోడ్ మీంచి కిందకి నడుచుకుంటూ దిగి అక్కడో జల పాతం చూసాం ఎక్కడో కొండల మీంచి జారి పడే నీరు ఐస్ లాగా చల్లగా స్పటికం లా స్వచ్చం గా ఉంది . అక్కడ రెండు గంటలు జల క్రీడలు ఆడి మళ్లీ పైకి వచ్చాం. మారేడుమిల్లి ఊళ్ళో ఉన్న రెండు చిన్న హోటళ్ళలో ఒక దానికి వెళ్ళాం (పేరు గుర్తులేదు) వాళ్ళు రాజమండ్రి , కాకినాడ నుంచి వచ్చి అక్కడి వాళ్ళకోసం వెచ్చాల షాప్స్ హోటల్స్ పెట్టారు . ఆ హోటల్ లో తిన్న ఇడ్లి పెసరట్టు కాఫీ చాలా బాగున్నాయ్. ఎ స్టార్ హోటల్ లో రాని కమ్మని రుచి , కల్తీ లేని ఆప్యాయత, అయిదుగురు ఎంత తిన్నా వంద దాటని బిల్లు లోని అమాయకత్వం అన్నీ ఎంతో బాగున్నై ...పది గంటలకి రూం ఖాళీ చేస్తూ ఈసారి మళ్లీ వస్తే ఎకువ రోజులుందాం అని అనుకున్నాం. వెనక్కి వచ్చే దారిలో మాట్లాడుకుంటూ.. మన ఆఫీసు బ్రాంచ్ ఇక్కడ పెడితే పని చెయ్యటానికి మనం రెడీ నా అని ప్రస్నించు కుంటే కాసేపు నిశ్శబ్దం దాని చేదిస్తూ మా కొండలు " అయినా ఇలాంటి అడవి ఊళ్ళో ఒకటి రెండు రోజులు ఉండటం బాగుంటుది కాని ఉద్యోగమా వామ్మో కష్టం గురూ అన్నాడు.." అవునవును నిజమీ కష్టమే అంటూ వంత పడుతూ మేము కూడా ఒప్పే స్కున్నాం.

అయినా ఆ మాత్రం కొండలూ చెట్లు చంద్రుడూ కోతులు(మేమే) మా ఊళ్ళో లేవా ఏంటి... ఏమంటారు?
PS: ఇందులో మందు గోల తీసేస్తే ఎవరైనా అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయ్యోచు. మంచి టూరిస్ట్ స్పాట్ .
మరి మందెండుకు రాశావ్ అంటే కొంచెం fiction ఉండొద్దా నాక మాత్రం సొతంత్రం లేదా ఊహల్లో కూడా..?

సోడా మన సోడా

కనుమరుగవుతున్న సోడా బళ్ళు...

కిక్కీక్ కిక్కీక్ .. ఇలాంటి సౌండ్ మీరూ ఎక్కడన్నా విని ఉందోచు .... ఆ సౌండ్ పుట్టించే వివిధ వస్తువులు యంత్రాలు మన చుట్టూ ఎన్నో ఉండి ఉంటై .. కానీ నేను చెప్పే ఆ సౌండ్ కి సంభంధించే వస్తువు
ఒక సీసా అవునండి ఒక సీసా సోడా సీసా ... ఆకు పచ్హ రంగులో ఉండి అందం గా ఒంపు సొంపులుంది.. గరళ కంటుడిలా గొంతులో గోలీ పెట్టుకొని కడుపులో ఎంతో గ్యాసున్న ద్రవాన్ని నింపుకొని ఎంతో తక్కువ ధరకి మంచి
స్వాంతన నిచ్చే గోలీ సోడా. పెద్ద పెద్ద నగరాల్లో దాదాపు కనుమరుగవుతూ.. పట్టణాల్లో గ్రామాల్లో తమ ఉనికి ని చాటు కోవటానికి తంటాలు పడుతూ.. ఉన్న మన ఆంధ్రా గోలి సోడా
రింగుల్లోకి వెళితే... నా చిన్నప్పుడు నలభై ఏళ్ళ క్రితం నాకు గుర్తున్నంత లో అర్దన అంటే మూడు పైసలకి ఒకటి ఇచ్చే ఆ సోడా క్రమేపీ ధరలు బాగా మండి పోయే స్థాయి కి వచ్చి 5 పైసలు అయింది నా 8 ఏట అది 5 పైసలు గా నాకు గుర్తుంది అంటే ఇప్పటి మన రూపాయికి ఇరవై సోడాలు. అప్పట్లో మా బందర్లో మా రోడ్ లో అలవాటు గా ఒక సోడా సాయిబ్బు వచ్చే వాడు. సోడాసాయిబ్బు అని ఎందుకన్నానంటే అయన పేరు ఎవరికీ తెలీదు మతానికి ముసల్మాన్ అందుకే సోడా సాయిబ్ అని పిలిచే వాళ్ళు అందరూ. సాయంత్రం 5 అయ్యేసరికి ఆ .. సోడే ఆ .. సోడే అంటూ అరుస్తూ .. మా సందులోకి వచేవాడు .. ఆ సోడా కి అలవాటు పడ్డ వాళ్ళంతా ఆ సరికి బయటకి వచ్చి అరుగుల మీద ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ( క్లెమెంట్ కోసం ఎదురు చూసీ మన తెలుగు హీరో ల తమ్ముల్లలా..) అయన నింపాదిగా వచ్చి ఇళ్ళ మధ్యలో తన తోపుడు సోడా బండి ని పార్క్ చేసి అయిదారు సోడా సీసాలు చాల వొడుపుగా గా పట్టుకొని( మనం ఒక సీసకే భయపడేవాళ్ళం ఎందుకంటే అది కింద పడితే పెద్ద అణు విస్పోటనం అవుతుందని మాకంతా ఒక నమ్మకం ) వాటిల్తో పటు ఒక రబ్బరు ట్యూబ్ ముక్క ఒక చెక్క ముక్క తో ఇళ్ళల్లోకి వచ్చే వాడు ఒకోల్లకీ సోడా కొట్టిస్తూ.. పేరు పేరునా అడుగుతూ ఎంతో స్నేహంగా రోజూ వచ్చే చుట్టం లా కలియ తిరుగుతూ డబ్బులు వసూల్ చేస్కుంటూ.. అయన హడావిడి ఎంతో సందడిగా ఉండేది. మధ్యాన్నం భోజనం అరగని తాతయ్యల దగ్గరనుంచి ఎప్పుడు మదిలో ఉందే బామ్మలు , పైత్యం తో బాధ పడే మధ్యవయస్కుల నుంచి వేవిల్లతో బాధ పడే పడుచులదాకా , అల్లం రసం నిమ్మకాయ చెక్క కలిపి తాగే యూత్ దగ్గర నుంచి సోడా సౌండ్ వినటానికి ఉత్సాహ పడే పిల్లల దాక అందరికీ ఎంతో ఇష్టమైన సాయంత్రపు డ్రింకు. శత్రుఘ్న సింహ కి తెలియక పొవచు కానీ తెలిస్తే మీరూ నేనూ ఆంధ్రా సోడా ఈ సాయంత్రం... అని ప్రకటన ఊరికే చేసిపెట్టేవాడు.
సరే మన సోడా గోల లోకి వద్దాం.. ఎంత వాళ్ళ నైన లోపలికి రానివ్వని మడి బామ్మలు కూడా ఎంట్రీ పర్మిట్ ఇచేవాళ్ళు మన సాయిబ్ గారికి.. కాకపోతే సీస అందరూ కరచుకొని తాగుతారు కాబట్టి ఆ సోడా ని మడి గ్లాస్ లోకి బదలాయించి ఎతుకొని మరీ తాగేవాళ్లు. తాతాయ్యలకి ఇదేమీ లేదు కాబట్టి డైరెక్టర్ గానే తాగేవాళ్లు. మిగతా జనం వాళ్ళ వాళ్ళ అభిరుచి ని బట్టి గ్లాసుల్లో ఇంకా ఏమైనా కలుపుకొని తాగేవాళ్లు. నాకు గ్లాస్లో పోస్కోని చాలా సేపు తాగాలని ఉండేది కాని మా అమ్మ అలా చేస్తే గ్యాస్ పోతుంది సోడా తాగి ఉపయోగం లేదు సీసా తో ఒకే గుక్క లో తాగాలి అనేది కానీ ఆ సోడా గ్యాస్ మనని తాగ నిచేది కాదు మనం చిన్న పిల్లలం కదా ఇపుడంటే ఎ సీసా అయినా దింపకుండా తాగే సామర్ధ్యం వచ్చింది కాని అప్పుదేంతా.. చిన్న ప్రాణం.
ఇంకా వేవిల్లవాళ్ళకి ప్రత్యేకంగా ఇంట్లో కి రూం డెలివరీ ఇచ్చేవాడు ఆరోగ్యం ఎలా ఉండి అని కుసలమడిగి మరీ.... వాళ్ళ వాళ్ళ కనే తేదీలు ఇంట్లో వాళ్ళ కన్నా ఆయనకే బాగా గుర్తుండేవి... వచ్చే నెల పుట్టింకి వేలిపోతవా కల్యనమ్మా..
ఆ సోమవారం తో తోమ్మిదిలోకి వచావా దేవకీ తల్లి అంటూ ఉండేవాడు. రోజూ క్రమం తప్పకుండా సోడా తాగితే డాక్టర్ దగ్గరకి వేల్లకర్లేదని ఒక నమ్మకం కూడా లేవ దీసాడు. ఆయనకి ఈ రోజు అనారోగ్యం రాదనీ నేను నమ్మే వాడిని ఎందుకంటే హీన పక్షం రోజు కి నాలుగు సోదలైనా తాగక పోతాడా ఫ్రీ కదా అని నా ఉద్దేశ్యం.
ఇంకా ఇంట్లో పసి పిల్లలుంటే సోడా కొట్టి దాంతో వాళ్లకి ఒళ్లంతా కడిగే వాడు అలా చేస్తే ఎండా వడ కొత్తదుట, సోడా కొట్టి సీసా మూతి కి వేలు అడ్డం పెట్టి బాగా గిలకరించి కొంచం వేలు అడ్డు తీస్తే బుస్స్స్స్ మని మామ బాడీ స్ప్రే యార్ లాగా సోడా బయటకి చిమ్మేది దాంతో పసిపిల్లకి బాడీ వాష్ ఆ సోడా చుర్రుక్కి ఉలిక్కిపడి ఏడ్చే పిల్లలు కొండరతే గిలిగింతలు కలిగి కిలకిల లాడే గడుసు పిండాలు కొందరు.. ఇలా అన్ని వర్గాల వాళ్ళ సాయంత్రాలని ఆహ్లాదపరిచే సోడా సాయిబ్ అందరికీ ఎంతో ఆప్తుడు. అయన ఒక రోజు రాక పోయినా ఎంతో వెలితి, లేట్ గా వస్తే ఆందోళన చెందేవాళ్ళం ...
అలాంటి సోడా సాయిబ్ నా ఏదో క్లాసు లో రావటం మానేసాడు కొన్ని రోజులకి తెలిసింది అయన అల్లా దగ్గరకి వెళ్ళాడని అక్కడ అమృతం దొరక్క భాధ పడుతుంటే సాయం గా సోడా లివ్వతానికి వెళ్ళాడని ఇంకా మనకు అయన సోడాలు దొరకవని ... అదేంటి ఆయనకి అనారోగ్యం ఎలా వచ్చింది ? అయన సోడా అయన తాగేవాడు కాదా అని నాకు డౌట్ వచ్చి మా బామ్మ ని అడిగితే ఆమె" ఏమి తాగినా తాగక పోయినా పిలుపోస్తే వెళ్ళాలి అది రూలు అని వేదాంతం చెప్పింది.. "


అల్లాంటి మన గోలి సోడా లు ఆంధ్ర సోదాలు కనుమరుగవుతున్నై.. మన లోకల్ సోడళ్ళు పోయి విదేశీ సోదాలు వచాయి మన నాటు సోదాల్లో మంచి నీళ్ళు వాడరు, నలకలు ఉంటై ఇలాంటి వాదనలు కొంత నిజమే గానీ ఏమైనా నా బాల్యాన్ని మా ఊరుని మా సందుని మా అరుగులని గుర్తు తెచే ఆగోలీ సోడా కనపడితే తాగకుండా ఉండలేను
జై ఆంధ్ర సోడా.. జై జై గోలీ సోడా ( ఆంధ్ర అని వాడినందుకు మీరు క్షమిచాలి ఇది నలభై ఏళ్ళక్రితం అందరికి వర్తించే సోడా గురించే మాత్రమే ఇందులో ప్రాంతీయ తత్వం ఏమీ లేదు ఒక వేల ఉంది అనుకుంటే జై తెలంగాణా సోడా జై జై గోలీ సోడా అని చదువుకో ప్రార్ధన)