8, అక్టోబర్ 2010, శుక్రవారం

మీ రెలా.... ??


పలకరిస్తారు ...

మీరెలా పలకరిస్తారు ? అదేనండి మీకు తెలిసిన వాళ్ళు కనబడితే మీరెలా పలకరిస్తారు ? హలో అనా ? హాయ్ అనా ? ఏమోయ్ ఎలా ఉన్నావనా? ఏమంటారు. ఈ అనుమానం ఎందుకొచ్చిందంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదివిన ఇంగ్లీష్ పుస్తకం వాట్ యు సే ఆఫ్టర్ సేయింగ్ హలో ( రచయిత :ఎరిక్ బెర్నె/ ప్రఖ్యాత మససిక విశ్లేషకుడు,/ ట్రాన్స్ అక్షనల్ అనాలిసిస్ పితమహహుడు) ఎందుకో గుర్తొచ్చింది. అసలు దానికంటే ముందు అంటే హలో కన్నా ముందు మనం ఎవరినైనా చూడగానే ఎలా స్పందిస్తాం?

బాగా తెలిసిన వాళ్ళు, కొంచం తెలిసినవాళ్ళు, తెలిసీ తెలియని వాళ్ళు ,ఇంకా అసలు తెలియని వాళ్ళు ఇలా నాలుగు రకాల జనం మనకు నిత్యం తారస పడతారు. అందులో మళ్ళీ మనకి ఇష్టమైన వాళ్ళు ,ఇష్టం లేని వాళ్ళు ,ఇష్టమయి, ఇష్టమవని వాళ్ళు అంటే సగమే ఇష్టం అన్నమాట ఆ మాట బయటకి అనం కదా అందుకే సగం సగం నటిస్తాం .
ఇలా నానా జాతుల వాళ్ళు మనకి పొద్దున్న లేస్తే కనబడీ లేక వినబడీ మన రోజులో పాలు పంచుకున్తుంటారు. వాళ్లకి ఏదో రకం గా మనం మన ప్రవర్తన ప్రదర్శిస్తాం. అందులో మొదటిదే పలకరింపు.
ఇష్టమైతే ఆప్యాయంగా ఒక పలరింపు కుదిరితే ఒక కప్ కాఫీ వీలైతే చిన్న పోట్లాట (బిల్ నేనిస్తా నేనిస్తానంటూ)
ఇలా సాగి పోవటానికి మొదటి పలకరింపు మీదైనా ఎదుటి వాళ్ళదైనా అది ఎలా ఉంటుంది మీరైతే ఏమంటారు ? ఎలా మొదలు పెడతారు ?

నాకు తెలిసిన కొన్ని పలకరింపులు చెప్తా చదవండి......
పదేళ్ళ క్రితం మా ఇంటి పక్కన ఇంట్లో ఒక కుటుంబం ఉండేది వాళ్ల అబ్బాయి నా వయసు అతనే. వచ్చిన మొదట్లో మా మెట్లు దిగుతుంటే ఎక్కుతుంటే వాళ్ల ఇంట్లోంచి పలకరింపు గా చూసే వారు మూడో రోజు నేను చిన్నగా నవ్వితే అయన ఎలా ఉన్నారు అన్నట్టుగా పెదవి విచ్చుకొని నవ్వేవారు. ఒక వారంయ్యాక మొదలైంది నాకు ఇబ్బంది నవ్వుల్లోంచి మాటల్లోకి దిగింది. బానే ఉందికదా అనుకుంటున్నారా...?అతను మాట్లాడే ఒకే మాట బాగున్నారా? "జవాబుగా నేను బాగున్నాను !! మీరు ? "అనేవాడిని. పొద్దున్న 6 గంటలకి ఇదే మాట... 8 గంటలకీ అదే మాట, 9 కి అదే మాట, మధ్యాన్నం 2 కి అదే, సాయంత్రం 6 కి అదే, రాత్రి 8 కి అదే, పడుకో బోయే ముందు కూడ అదే మాట (విసుక్కోకండి మీకే అలా ఉంటే ప్రత్యక్ష బలి చక్రవర్తిని నాకెలా ఉండాలి) ఇలా అయన ప్రతీసారి మలేరియా శాఖ వాళ్ల లాగా బాగున్నారా బాగున్నారా అని రోజుకి అన్ని సార్లు అడుగుతుంటే, తిరిగి బాగున్నాను.. మీరెలా ఉన్నారని అడగటం కష్టమై తోచి కొన్నాళ్ళకి మెట్లు దిగకుండా నీళ్ళ గొట్టం పట్టుకొని దిగే సాహసం కూడా చేశా.( మా మెట్లు వాళ్ళ వరండ వైపు ఉంటాయి కాబట్టి ఇంట్లో నే ఉంది లారీల వ్యాపారం చేసే అయన చూడకుండా నేను బయటకు వెళ్ళలేను) ఏమైనా ఈ సమస్యకి అంతం ఎలా అని ఆలోచిస్తుండగానే ఒక సంవత్సరం లో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కానీ నేను కొన్ని వారాలు మెట్లు దిగే టప్పుడు అదే ఆలాపన లో ఉండేవాడిని.
ఇంకో పలకరింపు గురించి చెప్తా .... మా ఇంట్లో అద్దెకి ఉన్న ఒక అయన అప్పట్లో ౩౦ ఏళ్ళు , బ్యాంకు లో ఉద్యోగం ఆ చేసేవాడు పొద్దున్న మాఇద్దరికీ భేటీ కుదిరేది కాదు సాయంత్రం ఇంటికొచ్చి బండి పెట్టేలోపు అతను పువ్వుల లుంగీ కట్ బనీను వేస్కొని ( ఆసరికే అయన ఇంటికొచ్చి సెటిల్ అయిపోయేవాడు) బయటకి వచ్చి ఏంటి సంగతులు సినిమాలు ఏమి చూసారు అని అడిగే వాడు. ఈ ప్రశ్న దాదాపు రోజు ఉండేది. నా సమాధానం ఒకటే రోజు "సంగతులు ఏమీ లేవు సినిమాలు ఏమీ చూడలేదు" ఇదే ప్ర.. జ .. కార్యక్రమం రోజూ... ఇలా చాలా నెలలయ్యాక నేను ఒక రోజు నా జవాబు మార్చా " నేను చూసే సినిమాలు ధియేటర్ లో రావట్లేదండీ చట్టాలు ఒప్పుకోవట అన్నా !! అప్పటినుంచి అయన ఆ ప్రశ్న మానేసాడు.
మా ఆఫీసు లో పనిమంతుడొకడు ప్రతీ రెందేల్లకీ ఒకసారి ఆఫీస్ ఇచ్చిన సౌకర్యం LTC వెళ్లి వచ్చి ఒక నెల రోజుల పాటు కనపడగానే, హలో సర్ ఈమధ్య ఎటన్నా టూర్లు వెళ్లారా ? అని అడిగి మనం సమాధానం చెప్పకుండానే, తను రెండునెలల క్రితం వెళ్ళిన టూర్ సంగతి పూస గుచ్చుతాడు.
మనం వదిలిచ్చుకోలేని ఉదంతాలు కళ్ళకు కట్టినట్టుగా డిల్లీ గిల్లీ బొంబాయి గింబై అంటూ సాగిపోతాడు మా సుబ్బూ ..
పైసా ఖర్చులేని యాత్ర స్పెషల్ అనుకుంటున్నారా ..
మీదాక వస్తే తెలుస్తుంది.

మా ఆఫీసు లోనే ఉన్న ఇంకో అయన పలకరింపు వింటే మన మీద మనకే ఎక్కడ లేని భరోసా వస్తుంది. గుడ్ మార్నింగ్ అని వెంటనే ఎలా ఉన్నారు అనకుండానే,
మీకేంటి సర్ హాయిగా.... అంటాడు.
అప్పటికి ఆయనకి రోసయ్యకున్నన్ని కష్టాలున్నట్లు .
నాకు మాత్రం అయన మాట తో ఆత్మ విశ్వాసం హద్దు మీరుతుంది.
ఒట్టు కావాలంటే మీరు ట్రై చేయండి మా కృష్ణారావ్ పలకరింపులు.

ఇవి కాక ఇంకా వివిధ రకాల పలకరింపులున్నాయి మీకు ఓపిక ఉందా?
కనబడగానే తనకున్న జలుబు, గాస్, ఇంకా తిమ్మిర్ల జాబితా తీసే రంగడు.
పక్కింట్లో వెల్లుల్లి వండారని నాకొచ్చి పిర్యాదు చేసే సత్యమన్న...
షేర్లు పెరగట్లేదని వాపోయే రమణ ..,
తన ఇంట్లోనే కాక చుట్టాలకి కూడ తనే ఖర్చు భరిస్తున్నాననే కృష్ణ బాబు
వీళ్ళంతా రోజు లో మొదటి పలకరింపు లో ఇవే చెప్తారు. మనం అడిగినా అడగక పోయినా....
మీరు అడగక పోయినా నేను ఇవి చెప్పినట్లే.....
ఇంకొన్ని విచిత్ర పలక రింపులు ఉంటాయి ...
సినిమా హాల్లో ముందు సీట్లోంచి వెనక్కి తిరిగి హాల్లో ఏంటి సినిమా కొచ్చారా అని అడిగే అనుమాన్లు , అలాగే పార్కులో .. పార్కొచ్చారా అని అడిగే హనుమాన్లు ..
ఎగ్జిబిషన్లో కుటుంబ సమేతంగా ఉంటే ...
ఎదురుబడి ఏంటి పిల్లలని తీస్కోచ్చారా అని అడిగే అచ్చెరువులు ఉంటారు,
మనమే సంభాలిచుకొని ఏదో సమాధానం చెప్పేయాలి తప్పదు.
నా చిన్నప్పుడు రామారావు అనే ఫ్రెండు ఉండేవాడు ప్రతీ వాక్యంలోను డైలీ అనే మాట బాగా అలవాటు మా ఇంటికొచ్చి హిందూ పేపర్ అడిగే వాడు అదీ శుక్రవారంది. అందులో అప్పట్లో సినిమాల గురించి రాసేవాళ్ళు. "ఫ్రైడే హిందూ ఇవ్వరా నేను డైలీ ఫ్రైడే హిందూ చదువుతా అంటూ అడిగే వాడు
" రోజూ ఫ్రైడే హిందూ నేనేక్కదినుంచి తెగలను రామా" అనుకునే వాడిని ...

ఇంకా ఒంట్లో బాలేక ఆస్పత్రి లో చేరిన వాళ్లనో ,వాళ్ళ బంధువులనో,
ఎలా వచ్చింది రోగం ఎప్పటినుంచీ అంటూ పలకరింపులతో
దాడి చేసే tv విలేఖరుల లాంటి మిత్రులు ,
చావు ఇంటి దగ్గర కొచ్చి పోయిన మనిషికి ఏమేమి అలవాట్లున్దేవి,
ఏమి జబ్బు పడి పోయారు అనే సందేహాలతో ఓదార్చే ప్రసాధువులుంటారు ...
ఒళ్ళు మండినా. ఓర్చుకోవాలి మరి ....

ఏదేదో రాసిన తిట్టుకోకుండా చదివారు..
ఇంతకీ మీరెలా పలకరిస్తారు .......
నాకైతే మౌనమైన చిరునవ్వు , ఆప్యాయతతో కూడిన చూపు చాలా ఇష్టం మరి నేనెలా....ప్రవర్తిస్తానో నా చుట్టూ ఉన్న వాళ్ళని అడగాలి ....

3 కామెంట్‌లు:

  1. చిన్న చిరునవ్వుతో పలకరింపు నాకు ఇష్టమైనదీ, అలవాటు అయినదీను.
    రోజూ ఫ్లాట్లో చూసే వాళ్ళని అంతకన్నా ఏం పలకరిస్తాం? కానీ కొంతమందికి ఇది నచ్చదు అదేంటో మరి!!
    మా అమ్మ రోజూ తొమ్మిదింటికి ఫోన్ చేసి, టిఫిన్ అయ్యిందామ్మా, అల్లుడుగారూ, మనవడూ ఆఫీసుకీ, కాలేజీకీ బయలుదేరారా అనటం నాకు బోర్.
    మీ బోరు కబుర్లూ బాగానే బోరు కొట్టించాయి. (హి.. సరదాగా...)

    రిప్లయితొలగించండి
  2. hahaha.... baga chepperu.........ilanti palakarimpula experiencelu andariki koddo goppu untune untai meeru vatini gurthochela chala baga analyse cheseru. north india lo oka chota unnappudu aina exp. chepthanu. pakkintlo ammai prathi roju maavaru office kelleppudu "namasthe uncle" tho modalaiyyedi(uttaradi vallaki pillalu peddalaki namasthe cheppadam samskaram. inka ennisarlu kanapadithe anni sarlu namasthe uncle anedi. memu navvukunevallam
    maa varaithe aa pillaki Namasthe uncle- ani peru kooda petteseru.
    inka konnipalakarimpulu marii ghoram ganu hurdaya vidarakam gaanu kooda untai. mukhyam ga evaraina poyinappudu palakarinchadam anedi chala badha ni kaliginche vishayam. koddiga vallu kudutana paddaka manam manaki theerikainappudu velli poyarataga ela poru lanti prasnalatho vallani himsinchi edipinchadam chala vicharinchadagga vishayam.
    chala baga vivarincheru vividharakala palakarimuplani..... navvukoleka potta pattukunna. thnks.

    రిప్లయితొలగించండి
  3. meekemi! chakkaga palakaristharu manasuni ullasa parichela chakkani maatalatho......... chirunavvu kanapadadhu ga mariiiiiiii ikkada.

    రిప్లయితొలగించండి