23, అక్టోబర్ 2010, శనివారం

నేనే రాధ నోయీ...


ఒక చిన్న జ్ఞాపకం కానీ పెద్ద అయన గురించి ..... అయన మా పెద్ద నాన్న గారు అంటే మా నాన్న అన్నగారు కాదు... మా అమ్మ అక్క గారి భర్త ... వరసకి పెదనాన్న గారైనా ఆయన్ని హైదరాబాద్ డాడీ అని పిలిచే వాళ్ళం నేనూ, మా అక్క , అన్న ముగ్గురం. జ్ఞాపకాల పుస్తకం లో ఎన్నో పేజీల్లో ఎంతో మంది ఉంటారు ఈ రోజూ ఎందుకో ఎక్కువ అయన గురించే తలచుకున్నా కారణం పొద్దున్నే భానుమతి పాట నేనే రాధనోయీ (అంత మన మంచికే ,1972 ) విన్నా .. ఆ పాట కి అయనకి ఏంటి లింక్ అని అడక్కండి నాకెందుకో అలా అర్ధం లేని, ఉన్నా చెప్పలేని గొలుసు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, ఒకటి తలచుకుంటే వెంటనే వేరోటి కూడా గుర్తొస్తుంది .... అదే వరస లో ఎన్ని సార్లయినా.

అలా భానుమతి పాడిన ఆ పాట విన గానే నాకు హైదరాబాద్, ఇంకా మా హైదరాబాద్ డాడీ గారు గుర్తొస్తారు. ఎందుకో చెప్తా, ప్రతీ సంవత్సరం వేసవి సెలవలకి దాదాపు నెలా ఇరవై రోజులు మా అమ్మమ్మ దగ్గర కి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం. అక్కడ మా పెద్దమ్మ కుటుంబం తో సెలవలు గడపి మళ్ళీ స్కూల్ తెరిచే నాటికీ ఇంటికి చేరేవాళ్ళం.


హైదరాబాద్ అనగానే సెలవలు, ఆడుకోవటం, మా అమ్మమ్మ చేసిన రక రకాల తిండి తినటం సాయంత్రాలు హైదరాబాద్ రోడ్లమీద తిరగటం... తో బాటు నాకు ప్రత్యేకంగా గుర్తున్న మాటల ఖజానా .. మా పెదన్నన్న గారు. హై కోర్ట్ లో వకీల్ .

రెండు కుటుంబాల లో మేము మొత్తం అయిదుగురం పిల్లలం అందరి లో నేనే చిన్న. కోర్ట్ నుంచి ఇంటి కొచ్చాక అయన సాధ్యమయినంత సమయం మాతో గడిపే వారు. బయటకి తీస్కెళ్ళ టం , సినిమా లేదా ఒక రౌండ్ అలా తిరిగి పంజాబీ దుకాణం లో రగడా తిని పించటం , ఇలా అయన మాతో చాలా ప్రేమ గా చనువుగా ఉండేవారు. రాత్రుళ్ళు భోజనం చేసాక మా అమ్మ పెద్దమ్మ ఇంక స్నేహితులు ఆరుబయట మంచాలు వేస్కొని కబుర్లాడు తుంటే ఆయన తన ఆఫీసు రూం లో పని చేస్కుంటూ నో , లేదా ఒక రకమైన రాగ యుక్తం గా కవితలు చదువుతూ ( ఆ రాగం ఇక్కడ రాసి చూపలేను కలిస్తే పాడి విని పిస్తా ) లేదా బెడ్ రూం లో తలకింద చెయ్యి మడిచి పెట్టుకొని పెద్ద రేడియో లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ముఖ్యం గా వివిధభారతి గానీ సంగీత కార్యక్రమాలు చిన్న స్వరం లో వింటూ ఉండే వారు. ఆ టైం లో పిల్లలయిన మమ్మల్ని పిలిచి ఒరేయ్ కాళ్ళు నొక్కండిరా, వేళ్ళు లాగండిరా అని అడిగి అవి చేస్తుంటే కబుర్లు చెప్పేవారు.


అంచేత ఆ టైం లో రేడియో లో వచ్చే పాటలు మేమూ వినే వాళ్ళం , నాకన్నా పెద్ద వాళ్లైన నలుగురూ ఒక్కోల్లల్లె జారుకునే వాళ్ళు. చివరకి నేనే మిగిలే వాడిని .. నువ్వేమీ చెయ్యొద్దు గానీ ఇలారారా అంటూ కూర్చోపెట్టుకొని కబుర్లు చెప్పేవారు. ఆయనకూ నాకూ ఉన్న ఒక సామాన్య విషయం బందరు. అయన సుమారు 1945 కి ముందు చిన్నతనం లో కొన్నేళ్ళు అక్కడే పెరిగారు ,నేనూ చిన్నప్పుడు అక్కడే ఉండేవాడిని. సినిమాలు ,షికార్లు, చిరు తిళ్ళు కన్నా ఆయనదగ్గర నేనూ ఆశించినది ఆయన చిన్నప్పటి కబుర్లు.. బందర్లో అయన ఉన్న" చల్లరస్త " ప్రాంతం గురించి అక్కడ పొద్దున్నే అమ్మే పాలు పెరుగు గురించి అయన ఒక గిన్నె తీస్కోని పదేళ్ళప్పుడు అణ దమ్మిడీ కాణీ లతో కూరగాయలు, పెరుగు షాపింగ్ చేసి అవి అయ్యాక మంజప్ప హోటల్ లో తిన్న ఇడ్లీలు దోసాలు తాగిన కాఫీలు వాటి ధరలు చెప్తూ 1975 లో రేట్లు ఎంత మండి పోతున్నాయో చెప్పేవారు. పైసా విలువ ( రూపాయి కాదు) ఎంత పడిపోయిందో చెప్పేవారు. ఆ కబుర్లు నా అగ్రజులెవరూ వినే వాళ్ళు కాదు నేనే కూర్చొని వినే వాడిని ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అంటూ...

తాజమహల్ హోటల్ లో పూరీల కన్నా, మశాల దోసల కన్నా , చూసిన ముత్యాల ముగ్గు సినిమా కన్నా, , తిరిగిన పార్కులు, జూ, మ్యూజియం కన్నా అయన కబుర్లే నాకు భలే ఇష్టమైనవి. అవి నాకే సొంతం ఇంకెవరూ షేర్ కోసం రారు ... కాబట్టి అలా లైట్లు ఆపేసిన ఆ చీకటి గది లో , మంద్ర స్థాయి రేడియో పక్కన ... అయన పాత సంగతులు చెప్తుంటే కిటికీ కి కట్టిన సగం కర్టెన్ పైనుంచి రోడ్ మీద వెళ్ళే కార్లు, ఆటోల, బళ్ళ లైట్లు గది గోడల మీద పడి పరిగెడుతుంటే .... ఆ లైట్ల వేగం వెంబడే కాలం కూడా పరిగేట్టేది . చాలా రాత్రయింది ఇంక పడుకోరా బుజ్జిగా... అంటూ అవలించే వారు.

అలా గడిపిన చాలా రాత్రుల్లో రేడియో లో రోజుకొక సారైనా ఆ భానుమతి పాట " నేనే రాధ నోయీ... గోపాలా నేనే రాధ నోయీ ...." వచ్చేది

అంతటి తీయటి సమయం లో విన్న పాట కాబట్టీ ఆ పాట ఇప్పుడు కూడా ఎప్పుడూ విన్నా ఆ విషయాలన్నీ నా మదిలో రేగి కళ్ళ ముందు మెదులు తాయి.

నిండైన శరీరం ,ఎలాంటి పరిస్తుల్లోనూ చలించని మనస్తత్వం, రేపెంటీ అన్న సమస్యే లేకుండా ఈ రోజే జీవితం అన్నట్టుండే అయన కళ్ళ ముందు కనబడి ఎరా బుజ్జీ మన బందరు లడ్డు లేవి ? నల్ల హల్వా ఏదీ అని అడుగు తునట్టే ఉంటుంది.


మంచి భోజన ప్రియులైన అంత కు మించిన దాతృత్వం కలిగిన మనిషి.

అయన మాటలు మనసునే కాదు కడుపు కూడ నింపే సేవి ... అంత ఆప్యాయంగా ఉండే వారు.

యాభై ఆరవ ఏట కాన్సర్ మహమ్మారి కి అయన బలయ్యే సమయానికి పక్కనే ఉన్న నాకు అయన పోతూ పోతూ గొణుగు తున్నట్లు గా పెదాలు కదుపుతుంటే నాకే ఏదో బందరు సంగతులు చెప్తున్నారేమో అని పించింది.


తల కింద చెయ్యి పెట్టుకొని కొలువైతివా రంగ సాయీ అన్నట్టని పించే అయన పోయి ఇరవై నాలుగేళ్ళు అయినా ఇప్పటికీ ఇంకా అయన గది లో కొలువైనట్లే ఉంటుంది నాకు ........


నేనే రాధనోయి గోపాలా నేనే రాధనోయి ...
అందమైన ఈ బృందావని లో నేనే రాధ నోయి .....
విరిసిన పున్నమి వెన్నెల లో చల్లని యమునా తీరం లో ....
నీ పెదవుల పై వేణు గాన మై పొంగిపోదురా నేనీవేళ ...
నేనే రాధనోయి గోపాల నేనే రాధనోయి...
ఆడే పొన్నాల నీడలలో నీ మృదు పదముల జాడలలో..
నేనే నీవై నీవే నేనై అనుసరింతురా నేనీవేలా
నేనే రాధనోయి గోపాలా నేనే రాధనోయి ....

అన్నట్టు అయన పేరు శ్రీ అ.వి.రాధకృష్ణ గారు











.

13 కామెంట్‌లు:

  1. ఏమిటి? మీది బందరే! అబ్బో! ఇహనేం! ఇహ మాట్లాడలేం!

    మాది బందరు! - అందుకులెండి ఈ ఆవేశం! :) :)

    రిప్లయితొలగించండి
  2. పాటలతో ఎన్ని అనుభూతులు,ఎన్ని జ్ఞాపకాలు ముడిపడిపోతాయో తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది.ఎండాకాలం మధ్యాన్నం నిద్ర మెలుకువ కాని స్థితిలో ఎక్కడినుండో వినిపించే పాట,రాత్రి మిద్దెపైన పడుకున్నప్పుడు పక్కన రేడియోలో సన్నగా వినపడే పాట...గాలి తరగలపైన ఎన్ని జ్ఞాపకాలను మోసుకొస్తాయో కదా.
    చాలా బాగుంది మీ టపా.

    రిప్లయితొలగించండి
  3. @ వంశి మోహన్ : తగ్గొద్దు అస్సలు ఏమాత్రం !!
    బందరంటే ఆమాత్రం లేక పోతే హెలా...?
    @ ఫ్రెండ్ : అవును ఎక్కడో కొడితే ఏదో రాలినట్లు, ఒక్క పాటేంటి..? నాకు పాత విషయాలు జ్ఞాపకానికి రావటానికి ఇదీ అదనీ లేదు .....థాంక్స్

    రిప్లయితొలగించండి
  4. Very good. 'Lipi leni bhasha' ante naku istham.
    Mi posts chala bavuntayi.

    రిప్లయితొలగించండి
  5. " కిటికీ లోంచి గోడ మీద పడ్డ లైట్లు పరిగెడు తుంటే దాంతో పాటే కాలం కూడ పరిగేట్టేది "
    మీ జ్ఞాపక శక్తా లేక జీవితం మీద మీకున్న ఆసక్తా లేక శ్రద్ధా ఏదైనా మీకు వే వేల జేజేలు ....
    ఐ జెలస్ ది వే యు లవ్ యువర్ లైఫ్

    రిప్లయితొలగించండి
  6. థాంక్స్ సుజాత గారు
    @ అనానిమస్ : ఎవరి జీవితం మీద ఎవరికి ఇష్టం ఉండదు? స్వార్ధపు మరక ఎప్పుడూ మంచిదే దానిని ఏ సర్ఫ్ ( విమర్శ) ఏమీ చెయ్యలేదు థాంక్స్ నన్ను పోగిడినందుకు.

    రిప్లయితొలగించండి
  7. My best wishes to ur brother on his birthday in advance

    రిప్లయితొలగించండి
  8. @Anonymous : i will,
    four days more to go,
    mean time let me know who u r. thanks

    రిప్లయితొలగించండి
  9. అయ్యా మీ పేరే ఆత్రేయా లేక, కలం పేరా? మీ అసలు పేరే అది అయితే మీ పూతి పేరు చెప్పండి ప్లీజ్..

    రిప్లయితొలగించండి
  10. the postreminds me of a family friend who passed away because ofan accident.

    రిప్లయితొలగించండి
  11. @ విమల్ అవును నా కలం పేరు ఆత్రేయ
    @ madhuri who reminded me or my pedananna?

    రిప్లయితొలగించండి
  12. చాలా బాగుందండి. నాకు కూడా కొన్ని పాటలు వింటున్నపుడు అవి మొదటిసారి విన్నప్పటి అనుభూతులో ఎక్కువ సార్లు విన్నప్పటి అనుభూతులో అలా కళ్ళముందు సినిమా రీళ్లలా కదులుతుంటాయి.

    రిప్లయితొలగించండి