14, సెప్టెంబర్ 2010, మంగళవారం

భయం తో ఏడుపు

హైస్కూల్లోనే రౌడీలని ఫేస్ చేశా ...

నా గత ఏడుపులన్నీ చదివారుగా ఇప్పుడు భయం తో ఏడిచి సంగతి చెప్తా చదువుకోండి . నా 6 , 7 క్లాసులు ఒక స్కూల్లో గడచాయి. ఆ రెండేళ్లలో మా మీద బోణీ చేస్కున్న మాస్టర్లు ముగ్గురు ఉన్నారు, అంటే వాళ్ళ వాళ్ళ టీచర్ వృత్తి మాతోనే మొదలు పెట్టారన్న మాట, అలాంటి వాళ్ళలో సుధాకర్ సర్ అని హిందీ చెప్పటానికి జేరారు. సన్నగా పొడుగ్గా ఫుల్ హాండ్స్ చారల షర్ట్ ( దీనివల్ల ఇంకా సన్నగా కన పడేవారు) కొంచం వైవిధ్యమైన శరీర భంగిమలతో వింత గా కనిపించే వారు.
మంచి మాష్టారు కానీ పన్నెండేళ్ళ తోక లేని కోతుల మధ్య లంక లో సీతమ్మ వారిలా ఇబ్బంది పడే వారు. కొంచం చిలిపితనం పాలు ఎక్కువున్న నా లాంటి వాళ్ళకి అయన మంచి సబ్జెక్టు. పాపం శమించు గాక ..అయన మీద పరోక్షంగా ఎక్కువ, ప్రత్యక్షం గా కొంత వ్యంగ్యపు ధోరణి ఉండేది మాకు. ముఖ్యం గా అయన చేతులు మూతి కి అడ్డుపెట్టుకొని మాట్లాడే అలవాటు మా కందరికీ కూడా అలవాటయింది.
అలా ఆయనతో ఒక పూర్తి సంవత్సర కాలం గడపిన తర్వాత మాకు ఆయనంటే గౌరవం స్థానం లో ఒక రక మైన హేళన భావం పెరిగి పోయింది( మనస్పూర్తిగా ఆయన్ని క్షమించమని కోరుకుంటున్నాను..ఎదుట కనపడితే కాళ్ళు పట్టుకొని మరీ క్షమాపణ అడగాలని ఉండి) ఖాళీ టైం లో నా లాంటి ఔత్సాహికులు ఒక నలుగురికి ఆయన్ని అనుకరించి మిగతా వాళ్ళని ఆనంద పరచటమే పని గా మారింది. ఇలా మా ఏడో క్లాసు అయ్యాక హైస్కూల్ కోసం నేను ఆ స్కూల్ ఒదిలేసి ఒదిలి వెళ్ళిపోయాము.

కానీ వంకర తోక ఏమి చేసినా సాపు అవడుకదా... అదే రకమైన మిమిక్రీ షోలతో కొత్త స్కూల్లో కూడా జనాన్ని ఆనందింపచేసే వాళ్ళం. ఆ స్కూల్లో సగం పైగా నా పాత స్కూల్ ఫ్రెండ్సే మరి. ఇలా రోజులు గడుస్తున్న కాలం లో ఒక సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికెళ్ళే సమయం లో రోడ్ మీద మా పాత హిందీ సర్ సుధాకర్ గారు కనపడ్డారు పాత గురువు కనపడితే నమస్కారం చెయ్యల్సినది పోయి నవ్వు కున్నాం ., అయన మొహమ్మీదే ... పైగా మా గ్రూప్ లో ఒకడు ఆయన్ని ఎడిపించాలని అయన వెనక సుధాకర్ సుధాకర్ అని పిలిచాడు .... ఇలాంటి అంటూ రోగాలు తొందరగా పాకుతాయి కదా వెంటనే అయన వెనక చాలా సేపు ఈ విపరీత చేష్ట మేమంతా ఆచరించాము. ఆ పైశాచిక ఆనందం ఎలాంటి దంటే అల మూడు, నాలుగు , సార్లు స్కూల్ అవగానే అయన కనపడే రోడ్ మీద వేచి ఉండి ఆయన్ని అలా పేరుతో పిలిచి పారిపోయే వాళ్ళం.

కానీ రోజు దణ్ణం పెట్టుకునే మా హిందూ హై స్కూల్ సరస్వతి దేవి ఊరుకోదు కదా శాపం పెట్టింది.....

ఒక రోజు పొద్దున్న 11 45 కి ఇంటర్వెల్ లో గ్రౌండ్ లోకి వెళ్తే మా సుధాకర్ సర్ కనపడ్డారు చాలా ఆశ్చర్యమేసింది ఆయనేంటి ఇలా ఇక్కడ అనుకునే లోపు అయన వెనకే పొట్టిగా నల్లగా లావుగా మీసాలు మెలితిప్పిన ఒక వ్యక్తి కనపడి మమ్మల్ని దగ్గరకి పిలిచాడు ఇంటర్వెల్ లో ఎక్కడో గోడ దగ్గర చేయాల్సిన పని గ్రౌండ్ మధ్యలోనే అయినంత పనయ్యింది మా గ్యాంగ్ కి . దగ్గరకి వెళ్లి వణుకుతూ నున్చున్నాం. ఆ మీసలాయన ఎవడురా ఇందులో మాస్టారు ని పేరు పెట్టి పిలిచి అరుస్తున్నది ఇప్పుడు పిలవండి నాలిక లు తెగ కోస్తా అని చిరంజీవి లా అన్నాడు. మేమంతా నేను కాదండి, నేను కాదండి వాడు ఈరోజు రాలేందండి ,వస్తే చెప్తా మండి ఇలా చాలా అబద్దాలు చెప్పేసాం. ఇంకో సారి అలా చేస్తే చెప్పాగా ఏముతుందో అని అనగానే మొత్తం అందరం బేర్ బేర్ మని ఏడ్చాం . భలే భయమేసింది సినిమాల్లో చూడటమే ఇలా నిజం రౌడీలు వచ్చి వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుందో అనుభవమైంది. బెల్లు కొట్టిన మోత విన గానే వెళ్ళండి వెళ్లి ఇక నుంచి సరిగ్గా ఉండండి అని ఫైనల్ వార్నింగ్ ఇవ్వగానే బ్రతుకు జీవుడా అని క్లాస్సుల్లోకి వచ్చి పడ్డం. ఆ తర్వాతి పీరియడ్ అంతా వెక్కుతూనే ఉన్నాం అలా ఒక భయం తో కూడిన ఏడుపు జ్ఞాపకం నా మనసులో ఉండి పోయింది. ఇది 31 ఏళ్ళ క్రితం మాట సుధాకర్ సర్ ఎక్కడున్నా చల్లగా ఆరోగ్యం గా సుఖం గా ఉండాలని కోరుకుంటూ...
p s : ఇంతకీ ఆ వార్నింగ్ ఇచ్చిన రౌడీ మా ప్రకాష్ కి మంచి ఫ్రెండ్ B Sc ఫైనల్ ఇయర్ స్టూడెంట్ , ఈ సీను కోసం 15 రోజులు మీసాలు పెంచాదుట కష్ట పడి. ఇది తర్వాత తెలిసిన పచ్చి నిజం.
తర్వాత ఆ సీన్ లో నాతో పాటు ఏడ్చిన చిన్నాగాడు, ఫణి గాడు , తిలక్ గాడు, ఆ విషయం చెప్తే తెగ నవ్వారు గానీ , నాకూ మాత్రం ఆ ఏడుపు సీనే జ్ఞాపకం.

1 కామెంట్‌:

  1. నిజం చెప్పండి ఆత్రేయ గారూ మీది బందరేనా.. హిందూ హై స్కూల్లోనే సరస్వతి దేవి గుడి ఉంది. మీరు ఎప్పుడు చదివారు ? అంతకు ముందు చదివిన స్కూల్ ఏది ?
    ఏదేమైనా చాలా చక్కని జ్ఞానపకాలన్ని వెలికి తీసారు, మీ మిగతా ఎడుపులన్నీ ఇప్పుడే చదివాను చాలా బాగున్నాయి. ఆ సరస్వతిదేవి కటాక్షం మీకుండు గాక..

    రిప్లయితొలగించండి