25, డిసెంబర్ 2010, శనివారం

పైకెళ్ళాక తెలుస్తుంది


క్రిస్మస్
శుభాకాంక్షలు !! క్రిస్మస్ అంటే నాకున్న జ్ఞాపకాలు బందరు చుట్టూనే తిరుగుతాయి. హిందువు గా పుట్టిన మా ఇంట్లో క్రిస్మస్ ని పండగ గా చేస్కోవటానికీ, ముఖ్యం గా అన్ని మతాల దేవుళ్ళు అందరికీ దేవుళ్ళేననీ, అస్సలు తేడా లేదనీ నేను నమ్మటానికీ కారణం మా అమ్మ . భూమ్మీద మనం వేరే వేరే గా ఉండి, మేము ఎక్కువ మేము ఎక్కువ అని కొట్టుకు ఏడుస్తాం గానీ, పైన కృష్ణుడూ, జీసస్, అల్లా, అంతా కూర్చొని పాలు తాగుతూ పార్టీ చేస్కుంటూ మన అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారట. కింద ఉన్నన్నాళ్ళూ మీకు తెలీదురా పిల్లల్లారా. పైకి వచ్చాక మీకే క్లియర్ గా అర్ధం అవుతుంది, అనుకుంటూ ఉంటారట... ఇవన్నీ చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది నిజం ఒట్టు. నమ్మకాల తోనే పెరిగాను.

ఇంతకీ
నా క్రిస్మస్ అనుభవాలు- బందరు గురించి చెప్పాలంటే, నా పదేళ్ళ లోపు వయసులో క్రిస్టమస్ రోజు మా అమ్మ స్నేహితురాళ్ళు లేయమ్మ గారు, లిల్లీ టీచర్ గారూ వాళ్ళ ఇంటికి తీస్కేల్లేది. దానికోసం ముందు రోజు గ్రీటింగులు, కేకు ,ఆపిల్స్ , కమలా పళ్ళూ కొనుక్కొని పొద్దున్నే రిక్షా మాట్లాడుకొని మా బందరు రైల్వే స్టేషన్ దగ్గర మల్కా పట్నం లో ఉండే వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే వాళ్ళం. మా అమ్మ కి వాళ్ళు సేనియర్ టేచర్లు . గురువులు, హితులు. మేము వెళ్ళగానే రా ఇందిరా రా అంటూ గేటు లోనే వాటేస్కోని, పిల్లలని కూడా తెచ్చావ్ చాలా సంతోషం అనే వాళ్ళు. కాసేపు కబుర్లయాక మాకు గసగసాలు వేసిన అరిసెలు, కేకు, కారప్పూస పెట్టేవాళ్ళు. అసలు నేను వెళ్లేదే అందుకు కాబట్టి మారు మాట్లాడకుండా, అల్లరితో పెద్దాళ్ళని విసిగించ కుండా తలొంచుకొని వాళ్ళు పెట్టినవి తినేసేవాడిని. వాళ్ళు ఇచ్చిన బలూన్స్ రిక్షా పైన కట్టుకొని నడిపించు నా నావా అని హమ్ చేస్కుంటూ ఇంటి కొచ్చేవాళ్ళం.

ఇంకా
మా పక్కింటి బేబక్కా ( బేబీ అక్క) వాళ్ళ అమ్మ క్రిస్మస్ రోజు వాలింటికి వెళ్ళగానే యాపీ కిస్ మిస్ రా బుజ్జీ !! అనేవాళ్ళు, కన్యాశుల్కం ఇన్స్పిరేషన్ తో (ఎందుకలా అనే వారో అప్పట్లో అర్ధం కాలేదు హై స్కూల్లో కొచ్చాక కన్యాశుల్కం నాటకం చదివాక అర్ధమై అప్రయత్నం గా నవ్వుకున్నా). తర్వాత ఐదో క్లాసు లో నా స్నేహితుడు P. శ్రీధర్ ఒకే ఒక్క క్రిస్టియన్ మా క్లాసు లో, తల్లి లేని వాడు, వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఉండి చదువుకునే వాడు, ముందు రోజు వాళ్ళింట్లో క్రిస్మస్ ట్రీ అలంకరించడానికి శ్రీధర్ వాళ్ళ అక్కలకి హెల్ప్ చేసేవాళ్ళం. క్రిస్మస్ రోజు మమ్మల్ని చర్చి కి తీస్కేల్లెవాడు. అక్కడ ప్రార్ధనలు అయ్యాక వాళ్ళింటికి వెళ్లి కేకులు తిని, బల్లూన్స్ తో ఆడుకొని. కొన్ని ఇంటికి తెచ్చుకొనే వాడిని. విచిత్రం ఏంటంటే అదే శ్రీధర్ తోనే ఏదో గొడవ వచ్చి, మా ఇద్దరికీ మధ్య మత కలహాలు కూడా వచ్చినాయి, మా మతం గొప్పదంటే మా మతం గొప్పదని. (లోపల్లోపల లెంప లేస్కుంటూ పాపం చేస్తున్నానన్న భావం తో భయం తో). అయినా అది కొద్ది సేపే , తెలిసీ తెలీనితనం.

ప్రతి
క్రిస్మస్ రోజు చిన్నప్పుడు నేను స్కెచ్ పెన్నులతో వేసిన జీసస్ బొమ్మ నా టేబుల్ మీద పెట్టి దాని ముందు కొవ్వోతులు వెలిగించేవాడిని. బొమ్మ కొంత కాలానికి కనపించటం మానేసింది ఎక్కడ పోయిందో ... తర్వాత ఎప్పటికో తెలిసింది మా నాన్న జీసస్ ని మా ఇంట్లో లాకర్ లో ముఖ్యమైన కాగితాల లో నా సర్టిఫికెట్ల తో దాచి ఉంచారు. నాకున్న పాక శాస్త్ర ఉత్సాహం తో ఒకటి రెండు సార్లు స్టవ్ మీద కేకు బేకే ప్రయత్నం కూడా చేశా అప్పట్లో అవెన్ లేక పోవటం వల్ల, అది తిన్న వాళ్ళ క్రిస్మస్ ఎంత ఆనంద దాయకమో నన్ను అడగొద్దు... నాకు గుర్తులేదు.

మా
బందర్లో ఉన్న ఎన్నో పాత చర్చిలు చాలా ప్రసిద్దమైనవి, చరిత్ర కలవి. వాటిలో కాలేజీ రోజుల్లో ఫ్రెండ్ ఇజీకుమార్ (విజయకుమార్) తో కలిసి ఎన్నో సార్లు భయం భక్తీ లేని ప్రార్ధనలు చేశాము. ( అర్ధం చేస్కొండి చర్చి కి ఎందు కెళ్లామో ) అన్నిటినీ క్రీస్తు నవ్వుతూ క్షమించి స్వీకరించాడు. ఎందరి పాపాల కోసమో శిలువ నెక్కిన క్రీస్తు కి మా పిల్ల చేష్టలు పెద్ద పాపం లా కనబడలేదు.

అసలు
డిసెంబర్ నెల అంటేనే చాలా బాగుండేది ..చలి గాలులు, సెలవలు, చలికాలం సాయంత్రం మాత్రమే బాగా సువాసన విరజిల్లే నైట్ క్వీన్ పరిమళాలు, అన్నీ కలిసి జీవితం ఎంత బాగుందో అని పించే ఫీల్ గుడ్ ఫేక్టర్లు. బుట్టాయి పేట లో టవున్ హాల్ వెనక రోడ్ లో మా ఇంటి వెనక ఉన్న మసీదు లో రోజూ అయిదు సార్లు నమాజు, పక్కనే ఉన్న వినాయకుడి గుడి మైకులో వినపడే హిందూ భక్తి గీతాలు, దూరం గా మైకుల్లోంచి లీల గా విన పడే క్రైస్తవ కీర్తనల తో నెలంతా పండగలాగానే అనిపించేది. అప్పుడప్పుడే ప్రాముఖ్యం చెందుతున్న అయ్యప్ప దీక్షల తాలూకు భజనలు కూడా భలే ఉండేవి. అప్పట్లో ఇన్ని భజన పాటలు రాలేదు ఒక స్వామీ అయ్యప్ప సినిమా పాటలే ఉండేవి అందులో జగముల నేతా భాగ్య విధాతా.. అనే పాట అందరి దేవుళ్ళ గురించి పాడుతున్నట్లనిపించేది. అది విష్ణువా, క్రీస్తా , అల్లా నా అని తేడా లేకుండా.


మా ఇంటి బాల్కనీ లో నుంచుంటే దూరం గా కొండ మీద కనపడే ఎన్నో స్టార్లు చూసి, అట్కిన్సన్ స్కూల్లో చదివే మా అమ్మాయి కూడా ముచ్చట పడితే నేనూ స్టార్ తెచ్చి బల్బ్ పెట్టి మా ఇంటి మీద పెట్టేవాడిని, అది చూసి మా కాలనీ లో చాలా మంది ఫలానా ఆయన క్రైస్తవ మతం పుచ్చుకున్నాదట అని చెవులు కొరుక్కునే వాళ్ళు... నన్ను అడిగే దమ్ము లేక. నిజమే మా అమ్మకి తీవ్రమైన అనారోగ్యం చేసి నప్పుడు తగ్గితే నాగ పట్నం వచ్చి ఆరోగ్యమాత దర్శనం చేస్కుంటా నని మొక్కుకోని, వెళ్లి గుండు కూడా చేయించుకొచ్చా. అదే కాదు తమిళ నాడు లోని నాగూర్ బాబా దర్గా కి కూడా వెళ్ళా, ఇంకా గురుద్వారా లు తిరిగా, ఆపద వచ్చినప్పుడే దైవం విలువ, సర్వ మానవ సమానత్వం తెలిసేది.

ఇలా
తలచుకుంటే జ్ఞాపకాల్లో కొచ్చే నా చిన్న నాటి స్నేహితులందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలతో...



20, డిసెంబర్ 2010, సోమవారం

మా కాలనీ లో దీవార్ సినిమా




ఊదా రంగు చీర,ఆకుపచ్చ జాకెట్ చాలా వెరైటీ గా ముళ్ళ తో ఉంది, ఇంకా అక్కడక్కడ వేరే రంగు ముక్కలతో డిసైన్, పాదాలకు కొత్తరకం చెప్పులు, సన్నగా నాజూగ్గా ఉంది, నల్లగా ఉంది, దాదాపు పదేళ్లనుంచి చూస్తున్నా అన్నేళ్ల గా అంతే నాజూగ్గా ఉండటం ఆమె కే చెల్లింది. రహస్యం ఏంటో..? ఎన్ని జిమ్ ల కెళ్ళినా, ఎంత నడిచినా, యోగామొగ్గలేసినా, ఉహు అస్సలు కుదరలేదు, తగ్గటం జరగ లేదు, అనే డబ్బూ , ఒళ్ళూ చేసిన మారాజులూ, వాళ్ల రాణులూ, యువ తరాలు ఆమెని అడగాలి ఆ నాజూకు రహస్యమేంటో..!!

మా ఇంట్లో అందరికీ బాగా పరిచయమున్న మనిషే . ఆమె గురించి చెప్తా ... వర్ణన అంతా కరక్టే కాక పోతే వయసు అరైవై పైబడి ఉంటుంది, కానీ ఎనభై లా కనబడుతుంది, నే చెప్పిన ఊదా రంగు ముతక చీర మోకాళ్ళ దాక కట్టుకొని, పైన ఆకుపచ్చజాకెట్ ఆమె కి చాలా పెద్దదైతే బిగించి ముడి వేస్కుంటుంది. దానికున్న చిరుగులకి వేసిన అతుకులే వేరే రంగు ముక్కల డిసైన్. ఉదర పోషణ అర కొర ఉండటం వల్ల ముప్పై అయిదు నలభై కిలోల బరువు మించదు . ఇంకో కారణం కూడా ఉంది రోజుకి పది మైళ్ళ పైబడి నడవటం వల్ల బక్కచిక్కిన శరీరం, ఒక కాలికి ఎర్రరంగు స్లిప్పర్ ఇంకో కాలికి నీలం, పైన స్ట్రాప్ తెగిపోతే గుడ్డ పీలిక తో బంధనం, అందుకే కొత్తరకం గా ఉన్న చెప్పులన్నా. ఆ అమ్మాయి పేరు సైదమ్మ, మా కాలనీ లో ఎన్నేళ్ళ నుంచో అడుక్కుంటూ తిరుగుతూ ఉంటుంది.

ఈరోజు ఆఫీసు బంద్ అంటే ఇంటికొచ్చి, కాలి నడకన కాలనీ లో ఉన్న మా నాన్న స్నేహితుని ఒకాయన్ని కలుద్దామని బయలుదేరా. ఆయనకి డెబ్బై ఏడు ఏళ్ళు, ఆడపిల్లలంతా ఎక్కడెక్కడో ఉన్నారు. ఒక కొడుకు మా ఊళ్ళేనే ఉద్యోగం. కానీ వేరే ఉంటాడు. కారణం ఏమో తెలీదు కానీ విడి గా ఉంటాడు, తన చిన్న కుటుంబం చింత లేని కుటుంబం తో. ఏదో సమస్య ఉండి ఉండొచ్చు ఇమడలేక వేరే వేరే ఉన్నట్టున్నాడు. ఆ సమస్య ఎవరి వల్లనో కానీ ఇబ్బంది పడేది మాత్రం పెద్దాయనే. వయో భారం వల్ల, అనారోగ్యం వల్ల బయట చలాకీ గా తిరగలేరు, అందుచేత ఆయనతో కొంత సేపు గడుపుదామని బయలుదేరా.

అయన నన్నే సాయం అడగరు. కనీసం మందులు కూడ తెచ్చివ్వమని అడగరు. ఎప్పుడన్నా ఒక ఫోన్, లేదా ఇలా కలిసినప్పుడు నాలుగు కబుర్లు అంతే. ఆశ్చర్య మేంటంటే ఆయనకి తీవ్ర అనారోగ్యం చేసినప్పుడు కూడా ఆస్పత్రి లో చేరి పదిహేను రోజులున్న సంగతి నాకు తెలీదు, ఇంకా ఆశ్చర్యం ఊళ్ళే నే ఉన్న అయన కొడుకుకీ తెలీదు. ఎవరో బంధువులు వచ్చి చేర్చారట ఆస్పత్రి లో, ఈలోగా కూతుళ్ళు వచ్చి అందుకున్నారట సహాయ కార్యక్రమాలు.

ఈ విషయం లో ఎవరిదీ తప్పో బేరీజు వేసే శక్తీ నాకు లేదు, కారణం అయన కొడుకు నోట్లో నాలిక లేనట్లు ఉంటాడు, పెద్దాయన చూడ బోతే నాతో ఎంతో ఆపేక్షగా మాట్లాడుతారు. అసలు సమస్య ఎక్కడో ?
ఇంతకీ ఇందాకటి సైదమ్మ సంగతి కెళ్తే , నేను పెద్దాయన దగ్గరికి బయలు దేరిన రెండు నిముషాలలోనే ఆమె మా పక్క రోడ్ లో కనపడింది. ఆమె చేతిలో తోచిన డబ్బు పెట్టి, ఏంటి ఇంకా అవలేదా నీ రౌండ్ అని అడిగా, జవాబు గా "ఇంకా లేదు బాబూ! ఏ టైం కీ వెళ్ళినా తర్వాత రా అంటున్నారు. అందుకే ఇక్కడిక్కడే తిరుగుతున్నా. బాగా ఎండ ఎక్కితే ఏ చెట్టుకిందో కూర్చుంటా" నంది.

ఆమె ఇల్లు(?) మా కాలనీ కీ కొంచం దూరం లో ఉన్న క్రైస్తవ స్మశాన వాటిక గోడకి చేరవేసి నాలుగు వాసాలు దానిమీద కప్పిన నీలంరంగు ప్లాస్టిక్ గుడ్డ, అది కూడా ఆమె లాగానే అవసాన దశ లో ఉంది. కుటుంబం విషయం కొస్తే ఆమె మీదే ఆధారపడ్డ కూతురి పిల్లలు ఇద్దరు, వయసు లో పెద్ద వాళ్ళే కానీ ఏమీ చెయ్యరుట. కూతురు కూడా ఏదో పనిచేసి తెచ్చే సంపాదన చాలదుట. అందుకే సైదమ్మ యాచన మీద తెచ్చే వేన్నీళ్ళు కూతురి చన్నీళ్ళని వేడి చేస్తాయట. పోనీ నువ్వొక్కదానివే ఎక్కడన్నా వృద్ధాశ్రమం లో చేరొచ్చు గా అన్నా, నా తెలివి ఉపయోగించి సలహా ఇస్తూ. నేనెళ్ళి పోతే వాళ్లకు ఇబ్బందిగా బాబూ అంది, ఈ మాత్రం కూడా తెలీదు నీకు కళ్ళజోడు కూడా నా అన్నట్టు చూస్తూ .

నిజమే ఆమె కున్న భాధ్యతాయుత మైన ఆలోచన నా బుర్ర కి తట్టలేదు. ఆమె వయసు కి ఇచ్చే వృధ్యాప్య పించను, అప్పుడప్పుడూ అందే సహాయాలు, ఎవరెవరో క్లబ్బుల వాళ్ళు ఇచ్చే వంట పాత్రలు, బియ్యం, ఇంకా ఈ యాచనా ఇవే ప్రధాన ఆధారం వాళ్లకి. తనకి ఒంట్లో బాలేక పోయినా వాళ్ళే కదా చూడాలంది. ఎందుకో ఒక్క సారి సైదమ్మ భుజం చుట్టూ చేతులేసి దగ్గర తీస్కోవాలనుకున్నా, కానీ చెయ్యలేను ఏదో అడ్డొస్తుంది. కాలనీ లో ఎవరన్నా చూస్తే వీడికేంటి పిచ్చా అనుకుంటారు. ఒక బిచ్చగత్తె ని అభినందన గా కావచ్చు, లేక ఆలంబన గా కావచ్చు చేత్తో ముట్టుకోలేని నా తెల్లబట్టల సంస్కారం ఆమె ఊదా చీరా ఉదారం ముందు మరింత తెల్ల బోయింది.

మళ్ళీ ఇందాకటి పెద్దాయన విషయానికి వస్తే రెండు కోట్లు విలువ చేసే పెద్ద ఇల్లు, నెలకి ఒక పాతిక వేలు పెన్షన్, ఇంకా బ్యాంకు బాలన్సు, షేర్లు, ఇన్ని ఉండీ, సొంత కొడుకు ఎక్కడో ఈయన ఇక్కడ. ఏదన్నా అవసరం వస్తే దగ్గరలో ఉన్న దూరబ్బందువు ఆసరా, లేదా మిత్రుల తోడు ....
ఆమె చూడ బోతే ఆ వయసులో కూడా చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఇంకో ముగ్గురికి అండ గా ఉండాలన్న తపన, తను లేక పోతే వాళ్ళు బతక లేరన్న నమ్మకం....
మన కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది, బాగుంటుందన్న
మన గర్వాన్ని పరిహసిస్తూ అయన, భార్య తో కూడిన ఒంటరితనం.
మన ఆర్ధిక వ్యవస్థ పటిష్టం, బాగా అభివృద్ధి చెందుతున్నాం ,
మనిషి కో సెల్ ఫోన్, కుటుంబానికో కార్ అనుకుంటున్న,
మన అజ్ఞానాన్ని పరిహసిస్తూ సాంఘిక భద్రత లేని సైదమ్మ లాంటి వాళ్ళు.

పరిహాసం కాదు గానీ, ఎందుకో దీవార్ సినిమా లో
అమితాబ్,. శశికపూర్ ల సంభాషణ గుర్తొచ్చింది ...
మేరే పాస్ ఏ హై, వో హై ... తేరే పాస్ క్యాహై ..
జవాబు: ఖచ్చితం గా అందరి దగ్గరా ఏదో ఒకటన్నా ఉండదు.
ఆరోగ్యం , ధనం, అధికారం, సుఖం, సంతోషం, శాంతి,
కుటుంబ సౌఖ్యం , బంధు సఖ్యత ఏదో ఒకటి ఉండదు.
ఇవన్నీ ఉన్నా ఒకటి లేని వెధవ లుంటారు,
వాళ్ళని ఆశపోతు వెధవలంటారు.
అదిలేకే ఎప్పుడూ వెంప ర్లాడుతూ ఉంటారు ఉన్నవి ఒదిలేసి మరీ.
ఇంతకీ ఆ లేని ఒకటి ఏంటి అంటారా
తృప్తి.




17, డిసెంబర్ 2010, శుక్రవారం

సర్వే కష్టా సుఖినో జనంతు


అంటే సర్వర్ కష్ట పడితే జనం సుఖ పడతారని కాదు బాబోయ్....
అందరికీ నమస్కారం. నాలుగు రాతలు రాసి ఒకళ్లిద్దరి తో బావుందోయ్ అనిపించుకున్న తిమ్మిరి బావుంది, ఒక నెల రోజులుగా ఆ తిమ్మిరి లేదు, నెల పైబడి లిపిలేని భాష లో ఏమీ వ్యక్తీకరించలేక పోయా.కారణం పరీక్షలు. నాకేంటి పరీక్షలేంటి అని ఆశ్చర్యపడి పోకండి, ఉన్న వాడిని ఊరుకోకుండా పొయిన సంవత్సరం నాగార్జున యూనివెర్సిటీ దూర విద్య కేంద్రం లో MSc సైకాలజీ కీ ఫీజు కట్టా, మొదటి ఏడు పరీక్షలు బానే రాసా 63 %, వచ్చింది రెండో ఏడు పరీక్షలు ఇదిగో ఈనెల లో మొన్న 12 తో అయ్యాయి. దానికి ముందు అస్సైన్మెంట్లు అని తెగ టెన్షన్ పడి ఎలాగోల కానిచ్చా. ఆ హడావిడీ ఆఫీసు పని వత్తిడి తో సత మతమై ఈవయసులో నాకిది అవసరమా అని అనుకున్నా చాలాసార్లు.
కానీ ఆ టెన్షన్. పరీక్షల హడావిడి, ఎప్పుడో చిన్నప్పుడు పడి ఉన్నాకదా అందుకే మళ్ళీ ఇప్పుడు పడటం బాగుంది.
కాలేజీ రోజుల్లో ఎప్పుడు చదువుకి టెన్షన్ పడలేదు( అసలు సరిగ్గా చదివితేగా) బాగా కష్టపడి చదివి పరీక్షలు రాసి అదయ్యాక వచ్చే ఆనందమే వేరు. అలాంటి ఆనందం చాల కొద్ది సార్లు పడి ఉంటా. అందులో ఒకటి నాలుగో క్లాస్ లో హిందీ ప్రాధమిక రాసి ఇంటికొచ్చి ఆహా ఏమి హాయి ఇంక హిందీ ప్రయివేట్ కీ వెళ్ళక్కర్లేదు, ఇంకా ఎగస్ట్రా టయాం చదవక్కరలేదు అని. గోడలెక్కీ, గేటుఎక్కీ, మెట్లెక్కి దిగీ....చిత్ర మైన కపిస్వభావం చూపి పడ్డ ఆనందం ఇప్పటికీ నాకు గుర్తు ఉంది. అదయ్యాక అలా పరీక్షలైన ఆనందం ఏడో క్లాస్ లో అనుభవించా. సెవెంత్ కామన్ ఆఖరి పరీక్ష కాగానే హడావిడి గా ఫ్రెండ్స్ తో మా బందరు కృష్ణ కిషోర్ టాకీసు లో చూసిన "ఏజంట్ గోపి" సినిమా ఇంకా గుర్తుంది.

వేసవిలో కరెంట్ పోయి బాగా చెమట పట్టాక ,ఫాన్ తిరిగితే అనుభవించే చల్లదనం,
నవమాసాలు మోసి పడ్డ కష్టమంతా, పొత్తిళ్ళలో పాపాయిని చూసుకున్నప్పుడు మర్చిపోయినట్లు,
బజారు నుంచి రాగానే ఇరుకు బూట్లు విప్పిపడే సుఖం,
పరీక్షలయ్యాక వచ్చే ఆనందం గురించి చెప్పక్కర్లేదు.
అసలు పరీక్షలంటేనే అదో ఆనందం, రోజంతా స్కూల్లో ఉండక్కర్లేదు- సగం రోజే, అవయ్యాక కనీసం రెండు రోజులు రెస్ట్ ( పరీక్షల్లయ్యాయిగా ) పుస్తకాల బరువుండదు. హాయిగా అట్ట పెన్ను చాలు. పరీక్షలయ్యాక అట్ట ని బాట్ గా చేసి, పేపర్(పరీక్ష పేపర్ ) ని బాల్ (ఉండ) గా చుట్టి క్రికెట్ ఆడేవాళ్ళం. (ఇట్స్ మథర్స్ ఎగ్జామ్స్ అనుకుంటూ....తెలుగులో చదువు కొండే). ఇంకో ఆనందం ఏంటంటే ఆఖరు పరీక్ష రోజూ ఇంకు చల్లుకోవటం. పెన్నులో ఉన్న ఇంకంతా వేరే వాళ్ళమీద చల్లేసి ఆనక అమ్మయ్య ఇక ఇప్పట్లో ఇంకు తో పనిలేదు అని తృప్తిగా ఇంటికెల్లటం. అందుకోసం ఆఖరి పరీక్ష రోజూ రెండు పెన్నులతో , పాత చొక్కాలు వేసుకెళ్ళే వాళ్ళం.

మళ్ళీ పదో క్లాస్ లో కూడ ఏదో ఘనకార్యం చేసిన వాడిలా ఫీల్ అయ్యా. అప్పుడు వెళ్ళింది కొండవీటి సింహం సినిమాకి (సరిగ్గా గుర్తులేదుకానీ ఎన్టీవోడిదే). అనుకుంటా బోలెడు ఈలలు , కేకలతో చూసాం. తర్వాత కాలేజీ రోజుల్లో పరీక్షలైన ఆనందం ఎప్పుడూ లేదు, కారణం కాలేజీ రోజులాద్యంతం ఆనందో బ్రహ్మ నాకు. దీన్ని బట్టీ విషయమేంటంటే ఏదైనా కష్టపడ్డాక వచ్చే తీరిక సమయం నిజమైన ఆనందాన్ని ఇస్తుంది అని.

ఉద్యోగం లో చేరాక ప్రతి ఆర్ధిక సంవత్సర ముగింపు రోజూ మాకు (ఏప్రిల్ లో ఎప్పుడో బుక్స్ క్లోసింగ్) ఆ మార్చ్, ఏప్రిల్ రెండు నెలలూ రోజుకి 16 గంటలు పని చేసి ఆఖరి రోజూ రాత్రి ఏ రెండు గంటలకో విజయవంతం గా పూర్తి చేసి అప్పుడు ఆకళ్ళు , దాహాలు , గుర్తొచ్చి అప్పడు మా విజయవాడ బస్ స్టాండ్ కీ జ్జయ్యిమని ఒక పదిమందిమి వెళ్లి అక్కడ ఉండే 24 గంటల టిఫిన్ సెంటర్ లో వేడి వేడి ఇడ్లీలు, టమాట బాత్, ఇంకా మైసూర్ బజ్జీలు ఒకళ్ళ ప్లేట్ లోవి ఒకళ్ళు తిని జూసు తాగి, ఆనక సిగరెట్ తాగే వాళ్ళు ఒక ఘాడమైన దమ్ము లాగి రింగులు రింగులు గా పైకి పొగ ఒదిలి, ఒక సుదీర్ఘమైన శ్వాస విడిచి అమ్మయ్య ఇయరు క్లోజ్ చేసాం. అనుకునే లోపు మాతో వచ్చిన మా చీఫ్ రేపు (ఈరోజు డేట్ మారి చాల గంటలయింది ) ఎన్నింటికి కలుద్దాం అనే వాడు. ఒక్కసారి అందరం గట్టిగా నవ్వుకునే వాళ్ళం, మళ్ళీ మొదలా అని.

ఈ ఆఖరి రోజు సెంటిమెంట్ మాలో చాలామందికి ఉంది , ఇలా వచ్చి తిని తాగి కబుర్లాడి ఒకళ్ళ నొకళ్ళు సూటి పోటి మాటలనుకుంటూ, నవ్వుకోవటం.
ఆ టిఫిన్ సెంటర్ వాడికీ అలవాటయిపోయాయి మా కార్లు, మేము రాగానే మర్యాద చేసి వేడి వేడి టిపిని పెట్టేవాడు.
ఆ టైం లో మాలో రకరకాల సెంటిమెంట్లు మా సీనియర్ మానేజర్ జయప్రకాశ్ కైతే ఆ ఆఖరి రోజూ ఒక్క సిగరెట్టే తాగటం అలవాటు అంతే మళ్ళీ ఒక సంవత్సరం బంద్. ఇక పోతే టిఫిన్ బిల్లు నేనిస్తా నేనిస్తానని కొట్టుకోవటం అది కట్టటం (వచ్చే ఏడు బాగుంటుందని)ఒక సెంటిమెంట్ . పొయిన ఏడాది నేను బనానా షేక్ తాగా ఇప్పుడు అదే తాగుతా నెక్స్ట్ ఇయర్ కూడ బాగుంటుందనే వాళ్ళు, నా కార్లో వెళ్దాం నా కార్లో వెళ్దాం అని పోటీ పాడేవాళ్ళు, ఇది కూడ సెంటిమెంటే, అలాగే ఆ చివరి నెల రోజులు ఆఫీస్ కీ చాల క్యాసువల్ డ్రెస్ లో రావటం, ఒకోసారి నైట్ డ్రెస్ లో రావటం, నేనైతే కొన్ని సార్లు షార్ట్స్ లో కూడ వెళ్ళా ( ఫీల్ ఎట్ హోం) అంత మంచి ఆఫీస్ మాది అచ్చం ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది (గోల గోలగా నస నస గా). ఇన్ని ఆనందాలు పడ్డ కష్టాన్ని మర్చి పోయేలా చేసేవి. విజయం వెనక ఉన్న కష్టం అస్సలు కనపడదు అన్నది మాత్రం నిజం.
జీవితం లో అస్సలు టెన్షన్ లేక పోతే థ్రిల్లే లేదు, కష్టం లేక పోతే సుఖం విలువ తెలీదు.
"పొద్దత్తమానం ఒకేలా ఉంటే మనిషి దున్నపోతై పోవున్.. "(రమణ + గురజాడ అప్పారావు గార్లు కలిసి చెప్పారనుకోండి)
ఎవడికీ లక్షల జీతం ఊరికే ఇవ్వరు, కోట్ల లాభం ఊరికే రాదు,
దానెనక బోల్డ్ కట్టం, చెమట, వ్యధ, కొండొకచో రక్తం కూడ ఉంటాయి,
అలా లేక పోతే అది సత్సంపాదనే కాదు. మరేమంటారో మనందరకీ తెలుసు.
బయట పడిన కష్టమంతా ఇంటికొచ్చి మెట్లెక్కుతూ (లిఫ్ట్ కాదు) ఈల పాటేస్కుంటూ మరచిపోవచ్చు,
ఇంట్లోనే కష్టాలనే మగానుభావులకి ఆఫీసే సుఖనివాస్.
ఏది ఏదనేది ఎవడికి వాడి స్వానుభవం.

స్వగీత లో ఆత్రేయ ఏమన్నాడయ్యా అంటే
:సర్వే కష్టా సుఖినో జనంతు:
PS : నా తిమ్మిరి నాకు ఇచ్చెయ్యండి .. పిలీస్

15, నవంబర్ 2010, సోమవారం

ముడవని గొడుగు

కలిస్తే కలవని మనసులు
పిలిస్తే పలకని భావాలు
మడిస్తే ముడవని గొడుగుల్లాంటివి.
బయట వర్షం లో బానే ఉంటుంది
ఇంట్లో కొస్తే నే చీదర చిరాకు
ఎద్దు ఎండకు లాగితే ,దున్న నీడకి లాగినట్లు
కావిడి ని రెండు చేస్తే ఇంకా అరకెలా దున్నేదీ..
సేద్యమెందుకు చేసేది.
బుద్ది గడ్డి తిని వాళ్ళు దూక మంటే
దూకినాక కాళ్ళు విరిగాయాని ఏడ్చి ఏం ప్రయోజనం.
కాళ్ళే లేక ఎందాకా ఈ ప్రయాణం..??

13, నవంబర్ 2010, శనివారం

మా అమ్మ చాచా నెహ్రూ ని ఆపేసింది.


నవంబరు పద్నాలుగు మా ఇంట్లో ఒక ముఖ్యమైన రోజూ నెహ్రు పుట్టిన రోజని కాదు. మా అమ్మ పుట్టినరోజు.
ఆ రోజూ పుట్టిందనే మా అమ్మ పేరు ఇందిర అని పెట్టారు మా తాత అమ్మమ్మ.
చిన్నతనం లోనే వాళ్ల నాన్న చనిపోవటం తో మా అమ్మ పెద్దమ్మ ఇద్దరు పీ.యు.సి తోనే చదువా పేసి
టీచర్ ట్రైనింగ్ తీస్కోని పద్దెనిమిది ఏళ్ళ కే ఉద్యోగం లో చేరి పోయారు. అసలు వాళ్ళు ఏమి సాధించినా ఆ గొప్పతనమంతా మా అమ్మమ్మది.

చిన్న వయసులోనే భర్త పోతే ఇద్దరు హై స్కూల్ చదువుతున్న ఆడపిల్లలతో హైదరాబాద్ నగరం లో ఏ ఆధారమూ, ఉద్యోగమూ లేకుండా నెట్టుకొచ్చింది.

ఏం పెట్టిందో ,ఎలా పెంచిందో తెలీదు కానీ, ఒంటరిగా పిల్లలని పైకి తీస్కొచ్చి, పెళ్ళిళ్ళు చేసిన మా అమ్మమ్మ నా కంటికి ఒక కార్పోరేట్ కంపనీ CEO లా అనిపించేది. ఆమె ఐక్యూ ముందు మా ఇంట్లో అందరూ తక్కువే. ఆమె గురించి రాస్తే పెద్ద పుస్తకమే అవుతుంది.
పుట్టినరోజు మా అమ్మది కాబట్టి అమ్మ గురించే రాస్తా..

మా అమ్మ హైదరాబాద్ లో ఆమె బాల్యం గురించి అప్పుడప్పుడూ కధలు గా చెప్పేది అందులో ఒకటి
స్వాతంత్రానికి ముందు మా అమ్మ పదేళ్ళ లోపు నెహ్రు గారు హైదరాబాద్ రావటం,
రోజూ అయన బస నుంచి మీటింగ్స్ జరిగే స్తలానికి అయన కారులో వెళ్తుంటే
మా అమ్మ, పెద్దమ్మ, మిత్రులు ఆయన్ని చూడటానికి
ట్యాంక్ బండు మీద మాటు వేసి ఆయన్ని చూడలేక పోవటం
దాంతో కొంచం అల్లరి దైన మా పెద్దమ్మ నాయకత్వం లో పిల్ల లంతా చేతులు పట్టుకొని
రోడ్ కు అడ్డం గా నుంచున్నారు. కార్ ఆగి నెహ్రు గారు ఆ పిల్లలు ఎందుకు అడ్డం నుంచున్నారో
కనుక్కోమని పక్కనున్న వాళ్ళని పంపితే
మా అమ్మ వాళ్ళు నెహ్రు మాకు కనపడట్లేదు రోజూ అయన కోసం పొద్దున్నే ఇక్కడ ఎదురు చూస్తున్నాం
అని చెప్పారుట. మరుసటి రోజూ నుంచి నెహ్రు గారు ఓపెన్ టాప్ వాహనం లో నుంచొని
వాహన్నాన్ని చాలా నెమ్మది గా వెళ్ళమని చెప్పి అయన హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు
అలాగే వెళ్ళారుట. అంతే కాక వీళ్ళ తో కరచాలనం కూడా చేసారుట.

ఇంకా చిన్నప్పుడే సర్దార్ వల్లభాయి పటేల్ ని కూడ చూసింది.

ఇంకో ముఖ్య సంఘటన ఆంధ్రరాష్ట్ర ప్రధమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం గారు
చనిపోయినప్పుడు అయన చితా భస్మం గోదావరి లో కలపటానికి మా అమ్మ
వాళ్ల మేనమామ ఆయినా జొన్నలగడ్డ రామలింగయ్య గారితో రాజమండ్రి వచ్చి స్వయం గా గోదావరి లో ప్రకాశం గారి చితా భస్మం కలిపి వెళ్ళింది.
ఇలాంటివి విన్నప్పుడు నాకు ఒళ్ళు పులకరించేది. మా అమ్మ చెప్పిన జాతీయ నాయకుల కధలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.
నా పసితనం లో మా అమ్మ పాడిన జోల పాటలు ఇప్పటికీ నాకు నిద్ర తెప్పిస్తాయి అంతగా గుర్తున్నాయి.
అందులో ముఖ్యం గా శ్రీకర కరుణాల వాలా వేణుగోపాలా (బొబ్బిలి యుద్ధం) బాగా పాడేది,
అదే పాట మా మేనల్లుడు పుట్టాక కూడా జోల గా పాడేది. భానుమతి గారికి మంచి అభిమాని. ఎపుడూ ఆమె పాటలే పాడేది.
మా అమ్మ స్కూల్లో టీచర్ గా చేస్తూ మా అమ్మని అక్క అక్క అని పిలిచే
సరోజినీ టీచర్ పెళ్లి చూపుల కోసం సావిరహే .. పాట నేర్పించి పాడించి సుబ్బారావు బాబాయ్ ని మెప్పించి
మరీ దగ్గరుండి పెళ్లి చేయించింది. తను పని చేసే స్కూల్లో అందరికీ ఎంతో అభిమాన సహోద్యోగి.
అలాగే విద్యార్ధినులకి వాళ్ల తల్లి దండ్రులకీ కూడా అభిమాన టీచర్.
క్రమశిక్షణ కి మరో పేరు గా తను పని చేసిన 38 ఏళ్ళ సర్వీసు లో
ఒక్కరోజు కూడ ఆలస్యం గా వెళ్ళేది కాదు. వాన రానీ పిడుగులు పడనీ 9 : 30 కల్లా స్కూల్లో ఉండేది.
సాయంత్రం స్కూల్ అయ్యాక అన్నీ మూయించి 5 :15 ఇంటికొచ్చేది.
అప్పటి పరిస్థితుల వల్ల PUC వరకే చదివి నందువల్ల మేము పెద్దయ్యాక బి.ఏ , బి.ఈడి చదివింది.
కాకతాళియం గా డిగ్రీ పరీక్షలు నేనూ మా అమ్మ ఒకే బెంచ్ మీద కూర్చొని రాసాం.
అక్కడ కూడా నన్ను తిట్టింది రాయకుండా దిక్కులు చూస్తుంటే.
బందర్లో ఒకే ఇంట్లో స్థిరం గా ఉండటం వల్ల మా రోడ్ కి ఇందిర టీచర్ గారింటి రోడ్ అనే పేరు కూడా వచ్చింది. అంత ఫేమస్.
ఇలా రాస్కుకుంటూ పోతే ఎంతైనా తనివి తీరదు.
ఎవరి అమ్మ అయినా అంతే.... కానీ మా అమ్మ కదా ఇంకాస్త ఎక్కువ అంతే.

ఈ నవంబరు పద్నాలుగు కి డెబ్బై నాలుగు లోకి అడుగు పెట్టిన మా అమ్మ మనవడుపెళ్లి, మనవరాలి పెళ్లి చూసి ముని మనుమల ఎత్తుకోవాలి , నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఆనందం గా జీవించాలని కోరుకుంటూ...







5, నవంబర్ 2010, శుక్రవారం

రోలు కి కట్టేసినందుకు....


దీపావళి పండగ ఎందుకు జరుపుకుంటామో మన అందరికీ తెలుసు కదా మళ్ళీ చెప్పేదేముంది
కానీ ఈ రోజూ పొద్దున్నే పేపర్ చదువుతుంటే అందులోని ఒక శీర్షిక లో ఇంట్లో చనిపోయిన పెద్దల జ్ఞాపకార్ధం వాళ్ళకి స్వర్గ మార్గాన వెలుగు చూపటం కోసం దీపాలు పెడతారని... చదివా.
అయినా దైవ స్వరూపులైన స్వర్గస్తులకు మనం దీపం చూపట మేంటి అని నేను మా లేడీసు వితండ చర్చ చేస్కున్నాం.
ఆమాట కొస్తే దేవుడి ముందు చేసే దీపారాధన పెట్టే నైవేద్యం కూడ అంతేకదా..
దేవుడి కి లేకనా అయన అడిగారా మనల్ని
చీకట్లో ఉన్నాను బాబోయ్ కాస్త దీపం చూపించండి,
ఆకలేస్తుంది అమ్మాల్లారా ఏదన్నా పెట్టండి అని .....
మనమే దేవుని మీద నమ్మకం మీద,
అయన ఉన్నాడని ఆయనే మనకి అన్నీ సమకూరుస్తున్నాడని ,
అందుకే దేవునికి ఆ కృతజ్ఞాత చూపటానికి దీపం నైవేద్యం పెడుతున్నాం.
అంచేత పెద్దల కోసం ఇంటి ముందు దీపాలు వెలిగించుదాం,
గతించిన మన పెద్దల జ్ఞాపకార్ధం కోసమే కాదు
మన రక్షణ కోసం ప్రాణలోడ్డిన మన అమర సైనికుల కోసం కూడా
చెడు మీద మంచి గెలుపుకు చిహ్నం గా
చెడ్డ నరకాసురుడి మరణం గుర్తుగా
శత్రు దేశాల మీద మన సైన్యం విజయం జ్ఞాపకం గా
మన గుమ్మం ముందు దీపాలు ఉంచుదాం.
మా తాతయ్యలు అమ్మమ్మ నాయనమ్మ మా నాన్న, పెదన్నాన్న ,
ఇంకా మమ్మల్ని కన్న పిల్లల్లా చూస్కున్న మా చిన్నప్పటి ఇంటి ఓనర్ తాతయ్య అమ్మమ్మ బాబాయ్,
నాకు చదువు చెప్పి గతించిన కొందరు టీచర్లు,
నా ఉద్యోగమ్ లో ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు
ఇంకా విధి వశాత్తు మరణించిన ఒకళ్ళిద్దరు స్నేహితులు
అందరి ఆత్మ శాంతి కోసం మా ఇంటి ముందు నేను కూడ దీపాలు ఉంచుతా
లోక సమస్తా సుఖినో భవంతు.
విరకొట్టే వార్త ( బ్రేకింగ్ న్యూస్) ఇది రాస్తున్న ప్పుడే మా అమ్మాయి మేసేజ్ పంపింది
రావణుని చంపి అయోధ్యలో మొదటిసారి అడుగు పెట్టిన శ్రీ రాముని విజయం,
నరకాసురుడుని చంపిన శ్రీ కృష్ణుని జయం,
ఇంకా రోజే అమ్మ యశోద అల్లరి కృష్ణుని రోలు కి కట్టేసిందట
( ఎంత ముద్దుగా ఉందొ ఆలోచన మా అమ్ముగాడిలా ) అందుకే దీపావళి .
అందుకే అనందం లో దీపావళి చేస్కుందాం.




3, నవంబర్ 2010, బుధవారం

లక్ష్మి దేవి మీ గుమ్మం లో...


సారి నిజమైన ఆనందకరమైన మరియూ సురక్షిత మైన దీపావళి
జరగాలి.

మధ్య కాలం లో దీపావళి సందర్భంగా టీవీ లలో పేపర్లలో వచ్చే ప్రకటనలు ఇంకా సెలెబ్రిటి లు నాయకుల ఇచ్చే
సందేశాలలో " ఆనందకరమైన మరియు సురక్షిత మైన దీపావళి మీకు మరియూ మీ కుటుంబానికి.." అంటూ చెప్తున్నారు కదా
అందులో
భాగం గా ఎన్నో జాగ్రతలు ఉంటాయి.
పిల్లలను ఒంటరిగా టపాసులు కాల్చనివ్వద్దు అని.
బట్టలు నూలు వి వాడండి పట్టు మరియు టెర్లిన్ దుస్తులు వేస్కో కండి ..
దగ్గరలో నీటి బకెట్, ఇసక నింపిన బకెట్ ఉంచుకొండి..
ప్రధమ చికిస్థ సామాను రెడీ గా ఉంచుకోండి అని.
గట్టిగా
శబ్దం వచ్చేవి కాల్చకండి అని బోలెడు జాగర్తలు చెప్తారు కదా

మరి నువ్వేమన్నా అమలవా ? లేక జెనీలియా వా నువ్వేమి సందేశాలు చెప్తావోయ్ అని అనుకుంటున్నారు కదా
అవును మీకు తెలిసినవే ఆయినా మీకు సంభందం లేక పోయినా సరే
కొన్ని
ఉన్నాయి అవి మళ్ళీ తిరగేస్కుందాం

ప్రతీ పండగ లాగా నే దీపావలికీ కొత్త బట్టలు మిఠాయిలు కొనుక్కోవటం మామూలే
కాక పోతే దీపావళి కనుక టపాకాయలు కూడా కొనుకోవచ్చు
అందుకే దీపావళి కి నా సందేశం బలవంతంగా మీకు వినిపిస్తా
అన్ని
పండగలలో వృధా ఎక్కువయ్యే పండగ దీపావళి
కారణం టపాసులే చాలా వేల డబ్బు ఇచ్చి కొన్ని నిముషాల లో తగల బెట్టే టపాసులు
దానికి మనం వెచ్చించే ధనం...
ఏంటో ఆత్రేయ ఎప్పుడూ పిసినారి మాటలు రాస్తాడు అనుకో కండి
బాగా చిన్నప్పుడు నాకూ ఇష్టమే అలా తగలేయటం
మా నాన్న ఎన్ని కొన్నా ఇంక కొనచ్చుగా అనుకునే వాడిని బహుశా డబ్బు విలువ అప్పుడు అంత తెలియక పోవటం
వల్ల
క్రమేపీ కోరిక తగ్గిపోయింది
నేను టెన్త్ లోకి వచ్చేసరికే నాకు టపాసుల మీద ఆసక్తి పూర్తిగా పోయింది
అప్పటికి నాకు కొంత అవగాహన రావటం వల్ల కావచ్చు లేదా వేరే ఏదైనా కారణం కావచ్చు
నాకు బాగా గుర్తు " చిన్నపిల్లలు మిణుగురు పురుగులు చూసి పడే ఆనందం ఆశ్చర్యం ముందు
పెద్దాళ్ళు వేలు పెట్టి కొని కాల్చే బాణసంచ వెలుగులు ఏ మాత్రం ?"

వాక్యము నేను ఇలాగే చదివి ఉండక పోవచ్చు వాక్య నిర్మాణం వేరే రకం గా ఉండి ఉండవచ్చు కానీ భావం మాత్రం
నా మనసులో బలం గా నాటుకు పోయింది.
అప్పటి నుంచి నేను బాణా సంచా వదిలి మిణుగురు పురుగుల కోసమై ఆశగా వెతకటం మొదలు పెట్టా...
ఫలితం నేను ఎన్నో వెలుగులు చూసా మనసులో నింపుకున్నా అజ్ఞాతంగా నైనా ..
పండగ ముందు సుత్తి ఏంటి అనుకోకండి ..
మన ఇంటి ముందు ఎన్నో పదుల, వందల దీపాలు వెలిగించే ముందు చుట్టుపక్కల ఎక్కడన్నా చీకటి పేరుకు
పోయిందేమో వెతుకుదాం...
చీకటి లో ఒక్కటన్నా చిరు దీపం ఉంచి అప్పుడు మన గుమ్మం, ఇల్లు కాంతి మయం చేస్కుందాం.....
అప్పుడే శ్రీ మహా లక్ష్మి మరింత సంతోషిస్తుంది .. మన జీవితం కాంతి మయం చేస్తుంది.
ప్రాక్టికల్ గా చెప్పుకుంటే .... మన దీపావళి ఖర్చు లో ఒక పాతిక శాతం తగ్గించి ఏదైనా బీద కుటుంబానికి సాయం చేస్తే( దీపావళి చేస్కోవటానికి కాదు బతక టానికి ) అది విద్య కోసం కావచ్చు వైద్యం కోసం కావచ్చు లేక అసలు తినటానికే
కావచ్చు.
తృప్తి ముందు ఆనంద కాంతి లో మరే మతాబాల అవసరం ఉండదు.
మరే టపాసుల ఢమ ఢమ లు వినిపించనంత శ్రావ్యం గా ఆనంద రవం ఉంటుంది.

దీపావళి రోజూ మీ గుమ్మం లోకి నిజం గా లక్ష్మి దేవి రావాలని మనసారా కోరుకుంటూ....














1, నవంబర్ 2010, సోమవారం

నాకూ మా అన్నకూ పోరు....




నేను పెద్దమనిషి అయ్యా నువ్వెప్పుడురా..?? అంటున్నాడు మా అన్న నన్ను ఈమధ్య ...

మా అన్న నేను ఇద్దరం మంచి వాళ్ళం.
స్వర్ణ హరిత మయమయిన మా ఇంట్లో
మేము ఇద్దరం చాలా కాలం గా బానే ఉన్నాం.
మా అమ్మ నాన్న ఇద్దరినీ సమానంగానే పెంచినా...
వాడిని కొంచం ఎక్కువ సమానం గా చూసేరు.
అలాగే ఇద్దరం సమానంగా మంచి వాళ్ళమే
కానీ నేను కొంచం ఎక్కువ మంచాడినన్న మాట.

కావాలంటే వాడిని అడగండి ఇదే చెప్తాడు
నన్ను కొంచం ఎక్కువ సమానంగా చూసినట్లు
అలాగే వాడు కొంచం ఎక్కువ మంచాడయినట్లు.

ఇలా సమానంగా ఆలోచించు కుంటూ ఇద్దరం పెరిగాం
మా ఇంటి వనరులన్నీ సమానంగా పంచుకుంటూ..
కాక పోతే ముందే చెప్పాగా వాడు మా వనరులని
కొంచం ఎక్కువ సమానంగా వాడుకున్నాడు.
నాకని పిస్తుంది పెద్దవాడు,
మనకన్నా వయసు లో మా పెద్దాల్లకి దగ్గరవాడు అవటం వల్ల
వాడి మీద మా వాళ్ళు కొంచం ఖర్చు ఎక్కువే పెట్టారు,
ముద్దు ముచ్చట్లకీ చదువు కీ షోకులకీ.
చిన్న వాడవటం వల్ల నేను ఏదీ కావాలని అడిగే వాడిని కాను
కానీ అన్నీ నాకూ సమకూరేవి.
కానీ ఏమైందో తెలీదు ఈ మధ్య మా అన్న నా మీద పగ పట్టాడు.
చిన్నపట్నుంచి నాకూ ఏదీ ప్రతేకంగా కావాలని అడిగే అలవాటు లేదు
దొరికిన దాంతో సరిపెట్టుకోవటం అలవాటై పోయింది ,
అయినా నాకూ ఎక్కువే దొరికేది అనుకోండి.

అలిగిన మా అన్న ఊరుకోకుండా ఆస్తి పంచేస్కుందాం అన్నాడు
తన వాటా కింద మేము బోర్ వేసిన పడమటి వాటా భూమి
అలాగే మేము నడిపే ఖార్ఖానా ఉన్న రేకుల షెడ్డు
ఇంకా డబ్బు దస్కం లో ఎక్కువ శాతం తనకే కావాలని పేచీ మొదలెట్టాడు.

ఆ బోర్ వేసిన ఎకరాలు పోతే నా వాటా కి మిగిలేవి నీటి వసతి లేని ఎండు భూమే
నా దగ్గరున్న డబ్బులన్నీ పెట్టుబడి పెట్టిన ఖార్ఖానా ఉన్న షెడ్ పోతే
నాకూ ఇక మిగిలేది ఖాళీ ఇల్లు ...ఖాళీ సమయం ....
అందుకే నేనూ కలిసే ఉందామని మా పెద్దాళ్ళ తో కబురేట్టా....
మా అన్న ఉహు ససేమీరా అన్నాడు.
నేను మాత్రం తక్కువ?? వాడు అడిగిన దానికి ఏ మాత్రం కుదరదని చెప్పేసా..
ఏ మాటకామాటే చెప్పుకోవాలి
బోర్ పడమటి భూమిలో ఉన్నా నీరు పారేది నాకొచ్చిన తూర్పు వాటాలోకే ..
ఖార్ఖానా లో పని చేసేది మా అన్నే అయినా లాభాల మూట నాకే వస్తుంది, పెట్టుబడే నాది.
అందుకని ఇప్పుడున్న స్థితినే ఉండనిద్దామని నచ్చచెప్పే ప్రయత్నం చేశా..
అయినా వాడు వినటం లే.....
రోజూ తాగి వచ్చి గోల చెయ్యటం మొదలెట్టాడు.
దీనివల్ల మా ఇంటి పరువు రోడ్ కెక్కింది ,
ఈ పరిణామం చుట్టూ పక్క వాళ్లకి వినోదాన్ని ,
చెట్టుకింద లాయరు గారికిమంచి ఆదాయ వనరు లా,
పేపర్ మిత్రులకీ , టీవీ చుట్టాలకీ మంచి కాలక్షేపంలా తయారయ్యింది....
మేమిద్దరం ఇలా కొట్టు కోవటం మా అమ్మ భూదేవి కి భార మైన అవమానం గా ఉంది
పోయిన మా నాన్న ఏదో ఈ మాత్రమైనా అమర్చగలిగా ..
ఇది కూడా లేక పోతే దేనికోసం కొట్టుకునే వాళ్లురా
అన్నట్టు దీనం గా చూస్తున్నారు ఫోటో లోంచి
అయినా మా పంతం మాదే

మా పిల్లలు చదువు మానేసి
మా నాన్న కరేక్టంటే మా నాన్నే కరక్టంటూ వాదించు కుంటున్నారు

అసలు వేరే వేరే ఇళ్ళ నుంచి వచ్చిన మా ఆవిడా, మా వదిన
ఈ గోల లో బాగా దగ్గరయి ఈ అవమానం భరించలేక అప్పుడప్పుడూ కిరోసిన్ తో బెదిరిస్తున్నారు.
అయినా మాకు మాత్రం బుద్ది రావట్లేదు.
మేమిద్దరం ఇలా కొట్టుకుంటుంటే చిన్నప్పుడే అరవ దేశం లో ఉన్న
మా పెదనాన్నకి దత్తత వెళ్ళిన మా అక్క

ఇంట్లో నగలూ నట్రా అన్నీ ఊడ్చుకెల్లింది.
ఆమె ని ఎవరూ ఆపలేక పోయాం కారణం మా గొడవల్లో మేముండటమే.
ఇంకా దారుణం మా ఖార్ఖానా లో పని చేసే
పని వాళ్ళు వేరే చోట చేరి పోతున్నారు

ఇక్కడ ఉంటె పని ఉంటుందో లేదో అన్న భయం తో ....
ఇలాంటి గొడవల మధ్య మా అమ్మ 54 వ పుట్టిన రోజు వచ్చింది
ఏమి చేస్కుంటాం ? మేమిరువురం మా గోల లో ఉండి మా అమ్మ ను పట్టించుకోలేదు మామూలుగా అయితే పూర్ణాలు పులిహోర తినే వాళ్ళం..
కానీ మా అమ్మ మనసు బాలేక
ఇద్దరిలో ఎవరికీ సర్ది చెప్పలేక,
ఎవరిని సమర్దిస్తే ఇంకెవరు భాధ పడతారో అన్న భయం తో..
దగ్గుతూ, ఆయాసపడుతూ ఒంటరిగా తనే గుడి కెళ్ళి దండం పెట్టుకోచ్చింది
:

" దేవుడా త్వరగా సమస్యకి ఏదో పరిష్కారం చూపు స్వామి అని

నా ఇల్లు ని తిరిగి స్వర్ణ హరిత మయం చేయి స్వామి అని
నా పిల్లలు మధ్య సమతా సామరస్యం ప్రతిష్టించు దేవా అని
ప్రతి కుటుంబ క్షేమం సమాజ క్షేమం కనుక ఇంకెక్కడా ఇలా జరక్కుండా చూడు తండ్రీ అని.."

కుదిరితే
మీరు ప్రార్ధించండి మా ఇద్దరికీ బుద్ది రావాలని..!!








31, అక్టోబర్ 2010, ఆదివారం

ఒక్కడున్నాడు, అది నేనే !!




ఏంటి నువ్వు కూడానా నేనొక్కడినే అనుకున్నా...

1984
లో రీడర్స్ డైజెస్ట్ మగజైన్ లో చదివిన ఒక కొటేషన్ " friendship is born at the moment when one says to other " what you too... i thought i was only one !! " ఇద్దరు మనుషుల మధ్య స్నేహం మొదలవటానికి ముఖ్యమూలం ఏంటో పై చెప్పబడిన సూత్రం చాలుకదా. ఇద్దరు మనుషులు స్నేహం చెయ్యడానికి ఏదో కారణం ఉండాలిగా.. అవేంటో మాట్లాడుకుందాం కాసేపు...మొట్టమొదటి ఫ్రెండు అంటే అమ్మ నాన్న ఇంక మన సహోదరులు వీళ్ళే కదా మన మొదటి పరిచయం.

మనకీ వీళ్ళకీ ఉండే సామాన్య అంశం ఒకే కుటుంబం ఒకే ఇల్లు ఒకే రక్తం. కాబట్టి వీళ్ళ తో స్నేహం ప్రత్యేకంగా ప్రస్తావించను.
బంధువులు కూడా మన కుటుంబ సభ్యులే గా అందుకే వాళ్ళ తో స్నేహం విషయం కూడా పెద్ద పంచ్ లేని సబ్జెక్ట్.

మరి ఇక ఎవరు మిగిలారు బయటి స్నేహితులే ....
రక్త సంబంధమూ లేకుండా, మన ఇంట్లోవాళ్ళు కాకుండా , మనకి దగ్గరవ్వాలంటే ఏదో సామ్యం ఉండాలి.
అందుకే చిన్నప్పుడు ఒకే వీధి లో ఉండే వాళ్ళు ఒకే ఇంట్లో వేరే వేరే వాటాల్లో ఉండేవాళ్ళు మొదట గా స్నేహితులవుతారు.
బళ్ళో చేరాక ఒకే బడి ఒకే తరగతి లో ఒకే బెంచ్ లో వాళ్ళు స్నేహంగా మసలుతారు.
వాళ్ళంతా మన ఇష్ట అఇష్టాలతో సంబంధం లేకుండా యాదృచ్చికంగా దగ్గరయ్యే వాళ్ళు.

వయసు పెరిగాక మనకు మనమే ఎన్నుకున్న వాళ్ళు కొందరు ఫ్రెండ్స్ అవుతారు.
అందులో మనకు బాగా దగ్గరయ్యే వాళ్ళు మన మనస్తత్వం ,అభిరుచులతో సామ్యం ఉన్న చాలా కొద్ది మంది.

పుస్తాకాలు చదవటం లో కొందరు ఫ్రెండ్స్ అయితే,
మంచి సంగీతం వినటం లో కొందరు ఫ్రెండ్స్ అవుతారు.
సంఘానికి సాయం చేసే పని లో కొందరు కలుస్తే ,
స్వార్ధానికి చేసే పనుల్లో కొందరు కలుస్తారు..
ఇలా స్నేహితులవ్వాలంటే ఏదో సామ్యం ఉండాలి
ఒకే చోట ఉద్యోగం చెయ్యటం
ఒకే చోట కలసి నివసించటం
నుంచి ఒకే చోట కూరగాయలు కొనటం లో కూడా ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళున్నారు
నెట్ లో కొందరు ఆగంతకులు కలిస్తే హాయ్ మీ ఎస్ ఎల్ ఏంటి అని అడిగి చాట్ మేట్స్ అయితే
సెలూన్ లో కూడా కొందరు ఫ్రెండ్స్ అవుతారు "ఏమిటీ మీరు ఇక్కడే హెయిర్ కట్టింగ్ చేయిస్తారా అంటూ.."
ఒకే హాస్పిటల్ లాబీ లో కూడ ఫ్రెండ్స్ అవచ్చు :మీ నాన్న గారికీ కేటరాక్టేనా మా అమ్మ కూ అంతే నంటూ..
పిల్లల బడి బయట సాటి తల్లి తండ్రులు ఫ్రెండ్స్ కావచ్చు మా వాడు సరిగ్గా చదవట్లేదు లేదా మీ అమ్మాయి క్లాస్ టాపర్ కదా అంటూ...
ఇలా ఏదో ఒక కలిసే విషయం తో ఫ్రెండ్స్ కావచ్చు కదా
ఇప్పటి దాక నాకున్న ఫ్రెండ్స్ అంతా నాకున్న నిజం ఫ్రెండ్స్ కారు, ఉహు ఇంకోలా చెప్తా నేనే వాళ్లకి సరైన ఫ్రెండ్ ని కాదు
ఏదో ఒక అవసరానికి లేక అభిప్రాయ భాగస్వామ్యానికీ కలిసే ఇంకో మనిషి.
మరి నాకేంటి ఇన్నేళ్ళు వచ్చినా ఒక్క మంచి ఫ్రెండ్ లేడు లోపం నాలో ఉందా లేక నాతో కలిపే సామ్యం ఇంక వేరే వాళ్ళకీ లేదా ?
మనిషి సాంఘిక జంతువు (సోషల్ అనిమల్ ) అనటారు కదా నేనేంటి ఇలా గణిత జంతువు ( కాలి క్యులేటేడ్ అనిమల్ ) లా ఉన్నాను ?
అసలు ఇది మంచి స్థితా లేక ఏదన్నా మానసిక వ్యాధా.....
నాకే ఒకో సారి అనుమానం వస్తుంది
ఏమైనా మనలో మనం ఒంటరిగా ఉండటం కూడా బాగుంటుంది ( మన చుట్టూ వందల మంది ఉన్నా మనకు మనమే, మనలో మనమే అంతర్ముఖం లో ఉండటం కావాలంటే ప్రయత్నిచండి)

మూడు రోజులు ఒక మనిషి తో సుదీర్ఘం గా మాట్లాడి నేను తెలుసుకున్న విషయమిది.
మీరేమాన్నా సలహా ఇవ్వగలరా ఇలాంటి వ్యక్తికి ?
దాన్ని ఇంగ్లీష్ మానసిక శాస్త్రం లో ఏమంటారు ?
ఆ ...ఇలా మానసిక సమస్యలన్నీ నా ఫ్రెండ్ ఒకడుండే వాడు వాడికి ఈ సమస్య ఉంది అనే మొదలెడతారు అంటారా అది మీ ఇష్టం.....





23, అక్టోబర్ 2010, శనివారం

నేనే రాధ నోయీ...


ఒక చిన్న జ్ఞాపకం కానీ పెద్ద అయన గురించి ..... అయన మా పెద్ద నాన్న గారు అంటే మా నాన్న అన్నగారు కాదు... మా అమ్మ అక్క గారి భర్త ... వరసకి పెదనాన్న గారైనా ఆయన్ని హైదరాబాద్ డాడీ అని పిలిచే వాళ్ళం నేనూ, మా అక్క , అన్న ముగ్గురం. జ్ఞాపకాల పుస్తకం లో ఎన్నో పేజీల్లో ఎంతో మంది ఉంటారు ఈ రోజూ ఎందుకో ఎక్కువ అయన గురించే తలచుకున్నా కారణం పొద్దున్నే భానుమతి పాట నేనే రాధనోయీ (అంత మన మంచికే ,1972 ) విన్నా .. ఆ పాట కి అయనకి ఏంటి లింక్ అని అడక్కండి నాకెందుకో అలా అర్ధం లేని, ఉన్నా చెప్పలేని గొలుసు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, ఒకటి తలచుకుంటే వెంటనే వేరోటి కూడా గుర్తొస్తుంది .... అదే వరస లో ఎన్ని సార్లయినా.

అలా భానుమతి పాడిన ఆ పాట విన గానే నాకు హైదరాబాద్, ఇంకా మా హైదరాబాద్ డాడీ గారు గుర్తొస్తారు. ఎందుకో చెప్తా, ప్రతీ సంవత్సరం వేసవి సెలవలకి దాదాపు నెలా ఇరవై రోజులు మా అమ్మమ్మ దగ్గర కి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం. అక్కడ మా పెద్దమ్మ కుటుంబం తో సెలవలు గడపి మళ్ళీ స్కూల్ తెరిచే నాటికీ ఇంటికి చేరేవాళ్ళం.


హైదరాబాద్ అనగానే సెలవలు, ఆడుకోవటం, మా అమ్మమ్మ చేసిన రక రకాల తిండి తినటం సాయంత్రాలు హైదరాబాద్ రోడ్లమీద తిరగటం... తో బాటు నాకు ప్రత్యేకంగా గుర్తున్న మాటల ఖజానా .. మా పెదన్నన్న గారు. హై కోర్ట్ లో వకీల్ .

రెండు కుటుంబాల లో మేము మొత్తం అయిదుగురం పిల్లలం అందరి లో నేనే చిన్న. కోర్ట్ నుంచి ఇంటి కొచ్చాక అయన సాధ్యమయినంత సమయం మాతో గడిపే వారు. బయటకి తీస్కెళ్ళ టం , సినిమా లేదా ఒక రౌండ్ అలా తిరిగి పంజాబీ దుకాణం లో రగడా తిని పించటం , ఇలా అయన మాతో చాలా ప్రేమ గా చనువుగా ఉండేవారు. రాత్రుళ్ళు భోజనం చేసాక మా అమ్మ పెద్దమ్మ ఇంక స్నేహితులు ఆరుబయట మంచాలు వేస్కొని కబుర్లాడు తుంటే ఆయన తన ఆఫీసు రూం లో పని చేస్కుంటూ నో , లేదా ఒక రకమైన రాగ యుక్తం గా కవితలు చదువుతూ ( ఆ రాగం ఇక్కడ రాసి చూపలేను కలిస్తే పాడి విని పిస్తా ) లేదా బెడ్ రూం లో తలకింద చెయ్యి మడిచి పెట్టుకొని పెద్ద రేడియో లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ముఖ్యం గా వివిధభారతి గానీ సంగీత కార్యక్రమాలు చిన్న స్వరం లో వింటూ ఉండే వారు. ఆ టైం లో పిల్లలయిన మమ్మల్ని పిలిచి ఒరేయ్ కాళ్ళు నొక్కండిరా, వేళ్ళు లాగండిరా అని అడిగి అవి చేస్తుంటే కబుర్లు చెప్పేవారు.


అంచేత ఆ టైం లో రేడియో లో వచ్చే పాటలు మేమూ వినే వాళ్ళం , నాకన్నా పెద్ద వాళ్లైన నలుగురూ ఒక్కోల్లల్లె జారుకునే వాళ్ళు. చివరకి నేనే మిగిలే వాడిని .. నువ్వేమీ చెయ్యొద్దు గానీ ఇలారారా అంటూ కూర్చోపెట్టుకొని కబుర్లు చెప్పేవారు. ఆయనకూ నాకూ ఉన్న ఒక సామాన్య విషయం బందరు. అయన సుమారు 1945 కి ముందు చిన్నతనం లో కొన్నేళ్ళు అక్కడే పెరిగారు ,నేనూ చిన్నప్పుడు అక్కడే ఉండేవాడిని. సినిమాలు ,షికార్లు, చిరు తిళ్ళు కన్నా ఆయనదగ్గర నేనూ ఆశించినది ఆయన చిన్నప్పటి కబుర్లు.. బందర్లో అయన ఉన్న" చల్లరస్త " ప్రాంతం గురించి అక్కడ పొద్దున్నే అమ్మే పాలు పెరుగు గురించి అయన ఒక గిన్నె తీస్కోని పదేళ్ళప్పుడు అణ దమ్మిడీ కాణీ లతో కూరగాయలు, పెరుగు షాపింగ్ చేసి అవి అయ్యాక మంజప్ప హోటల్ లో తిన్న ఇడ్లీలు దోసాలు తాగిన కాఫీలు వాటి ధరలు చెప్తూ 1975 లో రేట్లు ఎంత మండి పోతున్నాయో చెప్పేవారు. పైసా విలువ ( రూపాయి కాదు) ఎంత పడిపోయిందో చెప్పేవారు. ఆ కబుర్లు నా అగ్రజులెవరూ వినే వాళ్ళు కాదు నేనే కూర్చొని వినే వాడిని ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అంటూ...

తాజమహల్ హోటల్ లో పూరీల కన్నా, మశాల దోసల కన్నా , చూసిన ముత్యాల ముగ్గు సినిమా కన్నా, , తిరిగిన పార్కులు, జూ, మ్యూజియం కన్నా అయన కబుర్లే నాకు భలే ఇష్టమైనవి. అవి నాకే సొంతం ఇంకెవరూ షేర్ కోసం రారు ... కాబట్టి అలా లైట్లు ఆపేసిన ఆ చీకటి గది లో , మంద్ర స్థాయి రేడియో పక్కన ... అయన పాత సంగతులు చెప్తుంటే కిటికీ కి కట్టిన సగం కర్టెన్ పైనుంచి రోడ్ మీద వెళ్ళే కార్లు, ఆటోల, బళ్ళ లైట్లు గది గోడల మీద పడి పరిగెడుతుంటే .... ఆ లైట్ల వేగం వెంబడే కాలం కూడా పరిగేట్టేది . చాలా రాత్రయింది ఇంక పడుకోరా బుజ్జిగా... అంటూ అవలించే వారు.

అలా గడిపిన చాలా రాత్రుల్లో రేడియో లో రోజుకొక సారైనా ఆ భానుమతి పాట " నేనే రాధ నోయీ... గోపాలా నేనే రాధ నోయీ ...." వచ్చేది

అంతటి తీయటి సమయం లో విన్న పాట కాబట్టీ ఆ పాట ఇప్పుడు కూడా ఎప్పుడూ విన్నా ఆ విషయాలన్నీ నా మదిలో రేగి కళ్ళ ముందు మెదులు తాయి.

నిండైన శరీరం ,ఎలాంటి పరిస్తుల్లోనూ చలించని మనస్తత్వం, రేపెంటీ అన్న సమస్యే లేకుండా ఈ రోజే జీవితం అన్నట్టుండే అయన కళ్ళ ముందు కనబడి ఎరా బుజ్జీ మన బందరు లడ్డు లేవి ? నల్ల హల్వా ఏదీ అని అడుగు తునట్టే ఉంటుంది.


మంచి భోజన ప్రియులైన అంత కు మించిన దాతృత్వం కలిగిన మనిషి.

అయన మాటలు మనసునే కాదు కడుపు కూడ నింపే సేవి ... అంత ఆప్యాయంగా ఉండే వారు.

యాభై ఆరవ ఏట కాన్సర్ మహమ్మారి కి అయన బలయ్యే సమయానికి పక్కనే ఉన్న నాకు అయన పోతూ పోతూ గొణుగు తున్నట్లు గా పెదాలు కదుపుతుంటే నాకే ఏదో బందరు సంగతులు చెప్తున్నారేమో అని పించింది.


తల కింద చెయ్యి పెట్టుకొని కొలువైతివా రంగ సాయీ అన్నట్టని పించే అయన పోయి ఇరవై నాలుగేళ్ళు అయినా ఇప్పటికీ ఇంకా అయన గది లో కొలువైనట్లే ఉంటుంది నాకు ........


నేనే రాధనోయి గోపాలా నేనే రాధనోయి ...
అందమైన ఈ బృందావని లో నేనే రాధ నోయి .....
విరిసిన పున్నమి వెన్నెల లో చల్లని యమునా తీరం లో ....
నీ పెదవుల పై వేణు గాన మై పొంగిపోదురా నేనీవేళ ...
నేనే రాధనోయి గోపాల నేనే రాధనోయి...
ఆడే పొన్నాల నీడలలో నీ మృదు పదముల జాడలలో..
నేనే నీవై నీవే నేనై అనుసరింతురా నేనీవేలా
నేనే రాధనోయి గోపాలా నేనే రాధనోయి ....

అన్నట్టు అయన పేరు శ్రీ అ.వి.రాధకృష్ణ గారు











.