31, అక్టోబర్ 2010, ఆదివారం

ఒక్కడున్నాడు, అది నేనే !!




ఏంటి నువ్వు కూడానా నేనొక్కడినే అనుకున్నా...

1984
లో రీడర్స్ డైజెస్ట్ మగజైన్ లో చదివిన ఒక కొటేషన్ " friendship is born at the moment when one says to other " what you too... i thought i was only one !! " ఇద్దరు మనుషుల మధ్య స్నేహం మొదలవటానికి ముఖ్యమూలం ఏంటో పై చెప్పబడిన సూత్రం చాలుకదా. ఇద్దరు మనుషులు స్నేహం చెయ్యడానికి ఏదో కారణం ఉండాలిగా.. అవేంటో మాట్లాడుకుందాం కాసేపు...మొట్టమొదటి ఫ్రెండు అంటే అమ్మ నాన్న ఇంక మన సహోదరులు వీళ్ళే కదా మన మొదటి పరిచయం.

మనకీ వీళ్ళకీ ఉండే సామాన్య అంశం ఒకే కుటుంబం ఒకే ఇల్లు ఒకే రక్తం. కాబట్టి వీళ్ళ తో స్నేహం ప్రత్యేకంగా ప్రస్తావించను.
బంధువులు కూడా మన కుటుంబ సభ్యులే గా అందుకే వాళ్ళ తో స్నేహం విషయం కూడా పెద్ద పంచ్ లేని సబ్జెక్ట్.

మరి ఇక ఎవరు మిగిలారు బయటి స్నేహితులే ....
రక్త సంబంధమూ లేకుండా, మన ఇంట్లోవాళ్ళు కాకుండా , మనకి దగ్గరవ్వాలంటే ఏదో సామ్యం ఉండాలి.
అందుకే చిన్నప్పుడు ఒకే వీధి లో ఉండే వాళ్ళు ఒకే ఇంట్లో వేరే వేరే వాటాల్లో ఉండేవాళ్ళు మొదట గా స్నేహితులవుతారు.
బళ్ళో చేరాక ఒకే బడి ఒకే తరగతి లో ఒకే బెంచ్ లో వాళ్ళు స్నేహంగా మసలుతారు.
వాళ్ళంతా మన ఇష్ట అఇష్టాలతో సంబంధం లేకుండా యాదృచ్చికంగా దగ్గరయ్యే వాళ్ళు.

వయసు పెరిగాక మనకు మనమే ఎన్నుకున్న వాళ్ళు కొందరు ఫ్రెండ్స్ అవుతారు.
అందులో మనకు బాగా దగ్గరయ్యే వాళ్ళు మన మనస్తత్వం ,అభిరుచులతో సామ్యం ఉన్న చాలా కొద్ది మంది.

పుస్తాకాలు చదవటం లో కొందరు ఫ్రెండ్స్ అయితే,
మంచి సంగీతం వినటం లో కొందరు ఫ్రెండ్స్ అవుతారు.
సంఘానికి సాయం చేసే పని లో కొందరు కలుస్తే ,
స్వార్ధానికి చేసే పనుల్లో కొందరు కలుస్తారు..
ఇలా స్నేహితులవ్వాలంటే ఏదో సామ్యం ఉండాలి
ఒకే చోట ఉద్యోగం చెయ్యటం
ఒకే చోట కలసి నివసించటం
నుంచి ఒకే చోట కూరగాయలు కొనటం లో కూడా ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళున్నారు
నెట్ లో కొందరు ఆగంతకులు కలిస్తే హాయ్ మీ ఎస్ ఎల్ ఏంటి అని అడిగి చాట్ మేట్స్ అయితే
సెలూన్ లో కూడా కొందరు ఫ్రెండ్స్ అవుతారు "ఏమిటీ మీరు ఇక్కడే హెయిర్ కట్టింగ్ చేయిస్తారా అంటూ.."
ఒకే హాస్పిటల్ లాబీ లో కూడ ఫ్రెండ్స్ అవచ్చు :మీ నాన్న గారికీ కేటరాక్టేనా మా అమ్మ కూ అంతే నంటూ..
పిల్లల బడి బయట సాటి తల్లి తండ్రులు ఫ్రెండ్స్ కావచ్చు మా వాడు సరిగ్గా చదవట్లేదు లేదా మీ అమ్మాయి క్లాస్ టాపర్ కదా అంటూ...
ఇలా ఏదో ఒక కలిసే విషయం తో ఫ్రెండ్స్ కావచ్చు కదా
ఇప్పటి దాక నాకున్న ఫ్రెండ్స్ అంతా నాకున్న నిజం ఫ్రెండ్స్ కారు, ఉహు ఇంకోలా చెప్తా నేనే వాళ్లకి సరైన ఫ్రెండ్ ని కాదు
ఏదో ఒక అవసరానికి లేక అభిప్రాయ భాగస్వామ్యానికీ కలిసే ఇంకో మనిషి.
మరి నాకేంటి ఇన్నేళ్ళు వచ్చినా ఒక్క మంచి ఫ్రెండ్ లేడు లోపం నాలో ఉందా లేక నాతో కలిపే సామ్యం ఇంక వేరే వాళ్ళకీ లేదా ?
మనిషి సాంఘిక జంతువు (సోషల్ అనిమల్ ) అనటారు కదా నేనేంటి ఇలా గణిత జంతువు ( కాలి క్యులేటేడ్ అనిమల్ ) లా ఉన్నాను ?
అసలు ఇది మంచి స్థితా లేక ఏదన్నా మానసిక వ్యాధా.....
నాకే ఒకో సారి అనుమానం వస్తుంది
ఏమైనా మనలో మనం ఒంటరిగా ఉండటం కూడా బాగుంటుంది ( మన చుట్టూ వందల మంది ఉన్నా మనకు మనమే, మనలో మనమే అంతర్ముఖం లో ఉండటం కావాలంటే ప్రయత్నిచండి)

మూడు రోజులు ఒక మనిషి తో సుదీర్ఘం గా మాట్లాడి నేను తెలుసుకున్న విషయమిది.
మీరేమాన్నా సలహా ఇవ్వగలరా ఇలాంటి వ్యక్తికి ?
దాన్ని ఇంగ్లీష్ మానసిక శాస్త్రం లో ఏమంటారు ?
ఆ ...ఇలా మానసిక సమస్యలన్నీ నా ఫ్రెండ్ ఒకడుండే వాడు వాడికి ఈ సమస్య ఉంది అనే మొదలెడతారు అంటారా అది మీ ఇష్టం.....





23, అక్టోబర్ 2010, శనివారం

నేనే రాధ నోయీ...


ఒక చిన్న జ్ఞాపకం కానీ పెద్ద అయన గురించి ..... అయన మా పెద్ద నాన్న గారు అంటే మా నాన్న అన్నగారు కాదు... మా అమ్మ అక్క గారి భర్త ... వరసకి పెదనాన్న గారైనా ఆయన్ని హైదరాబాద్ డాడీ అని పిలిచే వాళ్ళం నేనూ, మా అక్క , అన్న ముగ్గురం. జ్ఞాపకాల పుస్తకం లో ఎన్నో పేజీల్లో ఎంతో మంది ఉంటారు ఈ రోజూ ఎందుకో ఎక్కువ అయన గురించే తలచుకున్నా కారణం పొద్దున్నే భానుమతి పాట నేనే రాధనోయీ (అంత మన మంచికే ,1972 ) విన్నా .. ఆ పాట కి అయనకి ఏంటి లింక్ అని అడక్కండి నాకెందుకో అలా అర్ధం లేని, ఉన్నా చెప్పలేని గొలుసు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, ఒకటి తలచుకుంటే వెంటనే వేరోటి కూడా గుర్తొస్తుంది .... అదే వరస లో ఎన్ని సార్లయినా.

అలా భానుమతి పాడిన ఆ పాట విన గానే నాకు హైదరాబాద్, ఇంకా మా హైదరాబాద్ డాడీ గారు గుర్తొస్తారు. ఎందుకో చెప్తా, ప్రతీ సంవత్సరం వేసవి సెలవలకి దాదాపు నెలా ఇరవై రోజులు మా అమ్మమ్మ దగ్గర కి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం. అక్కడ మా పెద్దమ్మ కుటుంబం తో సెలవలు గడపి మళ్ళీ స్కూల్ తెరిచే నాటికీ ఇంటికి చేరేవాళ్ళం.


హైదరాబాద్ అనగానే సెలవలు, ఆడుకోవటం, మా అమ్మమ్మ చేసిన రక రకాల తిండి తినటం సాయంత్రాలు హైదరాబాద్ రోడ్లమీద తిరగటం... తో బాటు నాకు ప్రత్యేకంగా గుర్తున్న మాటల ఖజానా .. మా పెదన్నన్న గారు. హై కోర్ట్ లో వకీల్ .

రెండు కుటుంబాల లో మేము మొత్తం అయిదుగురం పిల్లలం అందరి లో నేనే చిన్న. కోర్ట్ నుంచి ఇంటి కొచ్చాక అయన సాధ్యమయినంత సమయం మాతో గడిపే వారు. బయటకి తీస్కెళ్ళ టం , సినిమా లేదా ఒక రౌండ్ అలా తిరిగి పంజాబీ దుకాణం లో రగడా తిని పించటం , ఇలా అయన మాతో చాలా ప్రేమ గా చనువుగా ఉండేవారు. రాత్రుళ్ళు భోజనం చేసాక మా అమ్మ పెద్దమ్మ ఇంక స్నేహితులు ఆరుబయట మంచాలు వేస్కొని కబుర్లాడు తుంటే ఆయన తన ఆఫీసు రూం లో పని చేస్కుంటూ నో , లేదా ఒక రకమైన రాగ యుక్తం గా కవితలు చదువుతూ ( ఆ రాగం ఇక్కడ రాసి చూపలేను కలిస్తే పాడి విని పిస్తా ) లేదా బెడ్ రూం లో తలకింద చెయ్యి మడిచి పెట్టుకొని పెద్ద రేడియో లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ముఖ్యం గా వివిధభారతి గానీ సంగీత కార్యక్రమాలు చిన్న స్వరం లో వింటూ ఉండే వారు. ఆ టైం లో పిల్లలయిన మమ్మల్ని పిలిచి ఒరేయ్ కాళ్ళు నొక్కండిరా, వేళ్ళు లాగండిరా అని అడిగి అవి చేస్తుంటే కబుర్లు చెప్పేవారు.


అంచేత ఆ టైం లో రేడియో లో వచ్చే పాటలు మేమూ వినే వాళ్ళం , నాకన్నా పెద్ద వాళ్లైన నలుగురూ ఒక్కోల్లల్లె జారుకునే వాళ్ళు. చివరకి నేనే మిగిలే వాడిని .. నువ్వేమీ చెయ్యొద్దు గానీ ఇలారారా అంటూ కూర్చోపెట్టుకొని కబుర్లు చెప్పేవారు. ఆయనకూ నాకూ ఉన్న ఒక సామాన్య విషయం బందరు. అయన సుమారు 1945 కి ముందు చిన్నతనం లో కొన్నేళ్ళు అక్కడే పెరిగారు ,నేనూ చిన్నప్పుడు అక్కడే ఉండేవాడిని. సినిమాలు ,షికార్లు, చిరు తిళ్ళు కన్నా ఆయనదగ్గర నేనూ ఆశించినది ఆయన చిన్నప్పటి కబుర్లు.. బందర్లో అయన ఉన్న" చల్లరస్త " ప్రాంతం గురించి అక్కడ పొద్దున్నే అమ్మే పాలు పెరుగు గురించి అయన ఒక గిన్నె తీస్కోని పదేళ్ళప్పుడు అణ దమ్మిడీ కాణీ లతో కూరగాయలు, పెరుగు షాపింగ్ చేసి అవి అయ్యాక మంజప్ప హోటల్ లో తిన్న ఇడ్లీలు దోసాలు తాగిన కాఫీలు వాటి ధరలు చెప్తూ 1975 లో రేట్లు ఎంత మండి పోతున్నాయో చెప్పేవారు. పైసా విలువ ( రూపాయి కాదు) ఎంత పడిపోయిందో చెప్పేవారు. ఆ కబుర్లు నా అగ్రజులెవరూ వినే వాళ్ళు కాదు నేనే కూర్చొని వినే వాడిని ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అంటూ...

తాజమహల్ హోటల్ లో పూరీల కన్నా, మశాల దోసల కన్నా , చూసిన ముత్యాల ముగ్గు సినిమా కన్నా, , తిరిగిన పార్కులు, జూ, మ్యూజియం కన్నా అయన కబుర్లే నాకు భలే ఇష్టమైనవి. అవి నాకే సొంతం ఇంకెవరూ షేర్ కోసం రారు ... కాబట్టి అలా లైట్లు ఆపేసిన ఆ చీకటి గది లో , మంద్ర స్థాయి రేడియో పక్కన ... అయన పాత సంగతులు చెప్తుంటే కిటికీ కి కట్టిన సగం కర్టెన్ పైనుంచి రోడ్ మీద వెళ్ళే కార్లు, ఆటోల, బళ్ళ లైట్లు గది గోడల మీద పడి పరిగెడుతుంటే .... ఆ లైట్ల వేగం వెంబడే కాలం కూడా పరిగేట్టేది . చాలా రాత్రయింది ఇంక పడుకోరా బుజ్జిగా... అంటూ అవలించే వారు.

అలా గడిపిన చాలా రాత్రుల్లో రేడియో లో రోజుకొక సారైనా ఆ భానుమతి పాట " నేనే రాధ నోయీ... గోపాలా నేనే రాధ నోయీ ...." వచ్చేది

అంతటి తీయటి సమయం లో విన్న పాట కాబట్టీ ఆ పాట ఇప్పుడు కూడా ఎప్పుడూ విన్నా ఆ విషయాలన్నీ నా మదిలో రేగి కళ్ళ ముందు మెదులు తాయి.

నిండైన శరీరం ,ఎలాంటి పరిస్తుల్లోనూ చలించని మనస్తత్వం, రేపెంటీ అన్న సమస్యే లేకుండా ఈ రోజే జీవితం అన్నట్టుండే అయన కళ్ళ ముందు కనబడి ఎరా బుజ్జీ మన బందరు లడ్డు లేవి ? నల్ల హల్వా ఏదీ అని అడుగు తునట్టే ఉంటుంది.


మంచి భోజన ప్రియులైన అంత కు మించిన దాతృత్వం కలిగిన మనిషి.

అయన మాటలు మనసునే కాదు కడుపు కూడ నింపే సేవి ... అంత ఆప్యాయంగా ఉండే వారు.

యాభై ఆరవ ఏట కాన్సర్ మహమ్మారి కి అయన బలయ్యే సమయానికి పక్కనే ఉన్న నాకు అయన పోతూ పోతూ గొణుగు తున్నట్లు గా పెదాలు కదుపుతుంటే నాకే ఏదో బందరు సంగతులు చెప్తున్నారేమో అని పించింది.


తల కింద చెయ్యి పెట్టుకొని కొలువైతివా రంగ సాయీ అన్నట్టని పించే అయన పోయి ఇరవై నాలుగేళ్ళు అయినా ఇప్పటికీ ఇంకా అయన గది లో కొలువైనట్లే ఉంటుంది నాకు ........


నేనే రాధనోయి గోపాలా నేనే రాధనోయి ...
అందమైన ఈ బృందావని లో నేనే రాధ నోయి .....
విరిసిన పున్నమి వెన్నెల లో చల్లని యమునా తీరం లో ....
నీ పెదవుల పై వేణు గాన మై పొంగిపోదురా నేనీవేళ ...
నేనే రాధనోయి గోపాల నేనే రాధనోయి...
ఆడే పొన్నాల నీడలలో నీ మృదు పదముల జాడలలో..
నేనే నీవై నీవే నేనై అనుసరింతురా నేనీవేలా
నేనే రాధనోయి గోపాలా నేనే రాధనోయి ....

అన్నట్టు అయన పేరు శ్రీ అ.వి.రాధకృష్ణ గారు











.

21, అక్టోబర్ 2010, గురువారం

టాగోర్ మళ్ళీ పుట్టారు..


టాగూరు 2010 లో గీతాంజలి రాస్తే :

ఎక్కడ పిల్లల చదువుకి రేట్ కట్టి అమ్మరో ...

ఎక్కడ పిల్లల వైద్యం పునాదిగా కార్పోరేట్ ఆస్పత్రులు లేవవో ..

ఎక్కడ పిల్లలు సినిమాయ లో పడి వాస్తవానికి దూరమవ్వరో....

ఎక్కడ పిల్లలు టీవీ ముందు తమ ఖాళీ సమయాన్ని గడపరో...

ఎక్కడ పిల్లల భవిష్యత్ అవినీతి రాజకీయాలకి బలి అవ్వదో....

ఎక్కడ పిల్లలు స్వేచ్చగా వాళ్ళ కి కావాలిసిన విద్య నేర్వ గలరో ...

ఎక్కడ పిల్లలు లంచగొండి తల్లి దండ్రులనైనా క్షమించరో....

ఎక్కడ పిల్లలు కులాలకి మతాలకీ అతీతం గా జీవనం సాగించ గలరో...

దేవా !! ఆ స్వర్గ లోకపు వాతావరణాన్ని మా పిల్లలకివ్వు ....

తండ్రీ !! ఆ లోకం లో నా దేశ పిల్లలకు తెల్లారనివ్వు....

ఇలా రాసిన టాగోర్ కి నోబెల్ ప్రైజ్ రానిస్తారా మన నాయకులు...?
టాగోర్ అభిమానులకు క్షమాపణలతో .....

మా ఊర్లో వివేకానందుడు .......


నా మొట్ట మొదటి పుస్తకం నాకు తొమ్మిదేళ్ళప్పుడు సంపాదించా 1975 లో .. నా మొదటి పుస్తకం అనగానే నేను రాసిన గ్రంధం అనుకున్నారేమో కాదు, అమ్మ నాన్న డబ్బులిస్తే కొనుకున్న కధల పుస్తకం కూడా కాదు. నా సొంతం నా కష్టార్జితం ఆ పుస్తకం . అదెలా సంపాదించానో తెలుసుకోవాలని ఉందా.... అయితే రండి గుండ్రాల్లోకి....అలా వెనక్కి వెళ్తే నలుపు తెలుపు రంగుల్లో కనిపిస్తుంది నా రంగుల చిన్నతనం. నా జ్ఞాపకాల భోషాణప్పెట్టే లోపల దాక్కుని, అప్పుడప్పుడు బయటకి వచ్చి నన్ను గిలి గింతలు పెట్టే ఊసులలో ఒకటి.

సరే విషయానికొద్దాం ... మా బందర్లో బుట్టయిపేట లో త్రివేణి ప్రెస్ (భావరాజు నరసింహారావు గారిది) పక్కనే వివేకానంద మందిరం అనే ధ్యాన మందిరం ఉంది. ఇప్పటికీ ఉంది. రామకృష్ణ సమితి వాళ్ళు నడిపే ఒక ఆధ్యాత్మిక కేంద్రం. యోగ, మెడిటేషన్ నేర్పేవాళ్ళు.

ఆ రామ కృష్ణ సమితి వాళ్ళు ఒక జనవరి లో యువజన ఉత్సవాలు జరుపుతూ.. అందులో భాగం గా విద్యార్ధులకి వకృత్వం పోటీ పెట్టారు. అంశం : భారత యువత ప్రాశ్చాత్య నాగరిక ప్రభావం . ఆ విషయం తెలుసుకున్న మా నాన్న ఆ పోటీ లో పాల్గొనే వక్తల వయో పరిమితి తెలియక ఇంటి కొచ్చి ఇలా ఒక పోటీ ఉంది అందులో నువ్వు మాట్లాడాలి, నేను నీకు రెండు పేజీలు విషయం రాసిస్తా నువ్వు భట్టీ పట్టి అక్కడ అప్పచెప్పటమే. అదే వకృత్వం పోటీ అంటే అని నన్ను ఉసి గోల్పారు. ఇలాంటి విషయాలు మొదటి సారిగా వినటం తో నేను బాగా ఉత్తేజితుడయిపోయాను. అసలు జరిగిదేంటంటే నాకు చెప్పకుండా మా నాన్న అప్పటికే నా పేరు పోటీ లో నమోదు చేయించారు. నా వయసు వాళ్ళు అడగ లేదు అయన చెప్పలేదు.

పోటీ లో మాట్లాడటానికి మా నాన్న రెండు పేజీల విషయమ రాసిచ్చారు, గౌరవనీయులైన ...కి . నా వందనములు. ఈనాటి చర్చ నీయాంశం ... భారత యువత .... అంటూ మొదలయి చాలా పెద్ద పెద్ద మాటలతో సాగిపోయింది ... కొన్ని మాటలకి నాకు అర్ధం కూడ తెలీదు అవన్నీ తెలుసుకొని బాగా బట్టీ పట్టాను.


అసలు రోజూ రానే వచ్చింది ఆ ఆదివారం . మా అన్న పాపం ఇలాంటి వాటికి నాకు సైకిల్ డ్రైవర్, తను పాల్గొనక పోయినా ఇలాంటి విషయాల్లో నన్ను బాగా ప్రోత్స్తహించే వాడు ( అందుకే ఈ బ్లాగ్ ముఖం గా వాడికి జేజేలు) పొద్దున్న పదకొండు గంటలకి వివేకానంద మందిరం కి చేరుకున్నాము . అక్కడ మధ్య హాల్లో ఎర్రటి జంపకానా పరిచి ఉంది , అప్పటికే చాలా మంది ఉన్నారు ... అంత మంది జనం మధ్యలో ఒకే ఒక్క అయన నాకు తెలుసు. ఆయనే మా ఇంటి ఎదురుగా ఉండే డాక్టర్ శ్రీ కుప్పా వెంకటరామ శాస్త్రి గారు ( కీ.శే). అయన మా కుటుంబ మిత్రులు, వైద్యులు , మా కందరికీ గురుతుల్యులు మా వీధికే పెద్ద దిక్కు ..(అయన గురించి మరో సారి వివరించు కుంటాను)... ఒక్క సారి శ్రీ రామకృష్ణ పరమ హంస. శారద మాత. వివేకానందుడు ముగ్గురి కి దండం పెట్టుకున్న మీదే భారం అంటూ... నిర్వాహకుల దగ్గర కి వెళ్లి నేను వచ్చిన పని చెప్పా వాళ్ళు ముందు గట్టిగా నవ్వారు (అవును మీరు చదివింది నిజమే నవ్వారు) తర్వాత నా పేరు హాజరైన వాళ్ళ జాబితా లో రాసుకున్నారు.

పదకొండున్నరకు పోటీ మొదలైంది అంతా పెద్ద వాళ్ళు అంటే ఇరవై ఏళ్ళు ఆ పైబడిన వాళ్ళే ముప్పై లలో ఉన్న వాళ్ళే.. ఒకొక్కరు వెళ్లి మాట్లాడు తున్నారు. ఇలాంటి పోటీ లలో మిగతా వాళ్ళు ఏమి చెప్పారో తెలుకోవటం మంచి పని కదా, కానీ మొదటి సారి కదా నేను అలాంటివేం పట్టించుకోలా.. దిక్కులు చూస్తూ గడిపేసా చాలా మంది మాట్లాడినా నా వంతు రాలేదు , నా టెన్షన్ నాకుంది చదువు కెళ్ళిన కాస్తా మర్చిపోతానన్న చిన్న భయం....

చివరకి నా వంతు వచ్చింది అన్నదానికి గుర్తుగా నా పేరు పిలిచారు ...1893 సెప్టెంబర్ 11 చికాగో .... వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్ లో వివేకానందుడు " నా ప్రియమైన ఆమెరికా సోదర సోదరీ మణులారా ....." ప్రసంగించినట్లు ... నేను ఘంభీరం గా వెళ్లి నా బరువు దించుకునే పనిలో పడ్డా..స్కూల్లో పాఠం అప్పచెప్పినట్లు గడ గడ .. సాగి పోతోంది ఏమి చెప్తున్నానో నాకే తెలీదు మధ్యలో మర్చిపోయిన వాక్యాలు సగం లో ఒదిలేసి తర్వాత వాక్యానికి వెళ్ళిపోతూ ...సాగి పోతూ.. ముందుకు పోతూ... మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి లాగా మనవి చేస్కున్నా.. మధ్య మధ్యలో అందరూ నవ్వారు చప్పట్లు కొట్టారు అవి ఎందుకు చేసారో నాకు తెలీదు నేను మరింత రెచ్చిపోయా....కొన్ని నిముషాల తర్వాత నన్నెవరో ఎత్తుకు తీస్కెళ్ళి కూర్చో పెట్టారు.

పోటీ అయ్యాక ఒక అరగంట లో ఫలితాలు చెప్పేశారు ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలు ఎవరికో ఇచ్చేసారు ( బహుశా వయసు లో పెద్ద వాళ్లకి రిజర్వేషన్ ఉందేమో వాళ్ళకే ఇచ్చారు) చివర్లో మా డాక్టర్ గారు లేచి ఈ నాటి పోటీ లో అందరికన్నా చిన్న వాడైన ఈ చిరంజీవి కి ప్రత్యక బహుమతి ప్రకటిస్తున్నాం . అయితే ఆ బహుమతి త్వరలో అందజేయ బడుతుంది అని ప్రకటించారు.

నేను విజయ గర్వం తో మా అన్న వంక చూసా .. మా అన్న కూడ అరవ డబ్బింగ్ సినిమాల్లో లాగా "మన వంశానికి ఒకే ఒక్కడు అది నువ్వే రా .. నువ్వే నువ్వే." అని కొంచం ఆర్ద్రత తో అన్నాడు.


ఇద్దరం సైకిల్ మీద " దేశానికి జయం జయం రాష్ట్రానికీ జయం జయం....." అంటూ పాటలు పాడుకుంటూ ఇంటి కెళ్ళాం. చిన్న నిరాశ ఏంటంటే తలుపుదగ్గర మా అమ్మ గానీ మా అక్కగానీ దిష్టి తీసి లోపలకి తీస్కెళ్ళ లేదు. ఆయినా నా ఆనందం లో అది నేను పట్టించుకోలేదు.


అసలు కధ ఇక్కడ నుంచే మొదలు కొంచం జాగ్రత గా చదవండి మరి..... నా బహుమతి త్వరలో ఇస్తానన్నారుగా అందుకే మరుసటి ఉదయం మా డాక్టర్ గారిని కలిసి విషయమ కదిపాము. అయన అప్పుడే గుర్తొచ్చినట్లు అవును కదూ నీకు ప్రైజ్ ఇవ్వాలి కదూ అంటూ నే చూస్తాలే అని పంపించారు.


బుధవారం సాయంత్రం మళ్ళీ డాక్టర్ గారిని కలిసి మళ్ళీ విషయమ కదిపి చూసాం. కన్సల్టింగ్ టైం కదా రేపు చూస్తాలే అని పంపేసారు.

శుక్రవారం పొద్దునే వెళ్లాం అయన కొంచం ఇబ్బందిగా మొహం పెట్టి ఒరేయ్ నువ్వు రానక్కరలేదు నేనే కంపౌందరు కి ఇచ్చి పంపుతా పో అన్నారు.. నేను కొంచం చిన్న బుచ్చుకున్న మాట వాస్తవం...


ఆదివారం వేరే వంక పెట్టుకొని వెళ్ళా అయన దగ్గరకీ.
స్కూల్ ప్రేయర్ టైం లో నుంచుంటే కాళ్ళు నొప్పిగా ఉంటున్నాయి డాక్టర్ గారి దగ్గరికీ వెళ్లి వస్తా నని వెళ్ళా..
ఆయనకి కాళ్ళ నొప్పి సంగతి చెప్పా అయన నా చెయ్యి పట్టుకొని దీనికి మందులోద్దురా అన్నం బాగా తిను రోజూ పాలు తాగు అని చెప్పి వెళ్ళమన్నారు .

నేను వెళ్ళకుండా అయన బల్ల మీద ఉండే రక రకాల వస్తువులతో ఆడుకుంటూ అక్కడే ఉన్నా కాసేపు, అయన ఇంక వెళ్ళరా అన్న విన కుండా అక్కడే తచ్చాడు తూ...
మరీ మరీ మొన్న పోటీ లో నాకిస్తానన్న ప్రైజ్ అంటూ నసిగాను . అయన ఉలిక్కి పడి నిజమే నేను బాకీ ఉన్నా ఈ రోజూ తప్పక ఇస్తా నన్నారు.
నేను సంతుస్టుడనయి ఇంటికొచ్చేసా.

అప్పటికే మా ఇంట్లో విషయం లీకయి నే వెళ్ళిన వంక ఏంటో తెలిసి పోయి అందరూ నవ్వటం మొదలెట్టారు. మా అన్న గాడే లీక్ చేసాడు . ఇచ్చారా అంటూ మా ఇంట్లో నవ్వు దాచిన మొహాలతో అడగటం మొదలెట్టారు. నాకు రోషమొచ్చి ఇవ్వక పోయినా పర్లేదు అందరూ చప్పట్లు కొట్టారు మీకెవరికీ అలా కొట్టారా ? ఎప్పుడన్నా అని నిలదీసా. వాళ్ళు నిజమే కదా, మనలో వీడొక్కడే కదా , వంశానికోక్కడు అని గేలి చెయ్యటం మానేశారు. ఆయినా నవ్వు తాలూకు సవ్వడులు పక్క గది లోంచి వినపడుతూనే ఉన్నాయి.

ఇలా వెంట బడటం విషయం దర్శకుడు శ్రీ కె. విశ్వనాద్ గారికి ఎవరు చెప్పారో కానీ ఇరవై ఏళ్ళ తర్వాత తన స్వాతి ముత్యం సినిమా లో ఈ సన్నివేశం పెట్టుకున్నారు. ఒక రకం గా అది కూడ నాకు గర్వ కారణమే.

ఆ ఆదివారం సాయంత్రం సరిగ్గా వారం తర్వాత , అయిదు సార్లు వెంట పడి అడిగితే మా డాక్టర్ గారు రామకృష్ణ సమితి వారి ప్రచురించిన "వివేక చూడామణి" అనే పుస్తకం కొని దాని మీద మొదటి పేజీ లో శ్రీ _______ గారికి ప్రత్యేక బహుమతి శ్రీ రామకృష్ణ సమితి, ది: 5 జనవరి 1975 ఆదివారం అని రాసి ... వాళ్ళ కంపౌన్దర్ తో ఇచ్చి మా ఇంటికి పంపారు. ఆ పుస్తకం చేతిలో పడ్డ క్షణం నుంచి నేను భూమికి రెండు అంగుళాల ఎత్తులో నడిచా..

ఎక్కడికి వెళ్ళినా నాతోనే ఆ పుస్తకం , స్కూల్లో... హిందీ ప్రైవేట్ లో..... అన్ని చోట్ల నాకు పబ్లిసిటీ ఆ పుస్తక ప్రస్తావన తో నెల రోజుల పాటు నేల మీద నడిచే పరిస్థితి లేదు.

అలా నాకు నేను గా సంపాదిచిన మొదటి పుస్తకం
"వివేక చూడామణి" నా దగ్గర దాదాపు పాతికేళ్ళు ఉంది తర్వాత ఎలా పోయిందో తెలీదు.... కనపడలేదు.

ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా నా కు దిగులేస్తుంది .... ఒక పెద్దాయన స్వ దస్తూరితో ఇచ్చిన నా స్వార్జితం ..... జీవితం లో మొట్టమొదటి సారి పోటీ లో పాల్గొన్న సంఘటన నాకు ఇప్పటికీ కళ్ళ కట్టినట్లు ఉంటుంది.

అందుకే నన్ను ప్రోత్సహించిన మా నాన్నకి , నన్ను సైకిల్ మీద ఇలాంటి వాటికి తిప్పిన మా అన్నకి జేజేలు ఎంతో ప్రేమతో...




16, అక్టోబర్ 2010, శనివారం

మీకు తెలుసా ఈ రోజూ....


విజయదశమి ఈ రోజూ ఇదే కాక 17 అక్టోబర్ నా జీవితం లో చాలా ముఖ్యమైన రోజు పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఉదయం 7 గంటలకి మా మామ గారినించి ఫోన్ వచ్చింది... మా అవిడ కి నొప్పులోస్తున్నాయంటే కొత్త పేట లో పద్మావతి ఆస్పత్రి లో జేర్చటానికి వెళ్తున్నాం అని. తొమ్మిది నెలలుగా లేని ఏదో టెన్షన్..... ఎందుకో తెలీని ఉద్వేగం... ఎక్కడో చిన్న భయం .....ఇవన్నీ కాక ఇరవై ఆరేళ్ళ వయసు లో ఉండే అర్ధం కాని ఒక రకమైన అయోమయ స్థితి .... ఇవన్నీ కలగలిపి నన్ను చుట్టేయగా , బైక్ మీద గుంటూరు వెళ్లాను. నేరుగా ఆస్పత్రి కే వెళ్లాను అప్పటికే మా ఆవిడని స్ట్రెచర్ మీద ఫస్ట్ ఫ్లోర్ కి మారుస్తున్నారు అక్కడ ఆపరేషన్ ధియేటర్ ఉందని.
మా ఆవిడ నేను దగ్గరకి వెళ్ళగానే నా చెయ్యి గట్టిగా పట్టుకుంది నా వల్ల కాదు ఇది అన్నట్టుగా చూస్తూ ..కొంచం ఏడుపు కొంచం నిస్సహాయం కలిసిన గొంతు తో నేను ... ఏమీ కాదు నీకేం కాదు అని గొణుక్కుంటున్నాను...అంత కన్నా ఏమీ చెయ్యలేరేమో ఎవరూ.. ఆ పరిస్థితి లో.

అంతకు ముందు వారం దాక ఇద్దరం బైక్ మీద తిరిగి సినిమాలు చూసి హోటల్లో తిని, ఇప్పుడు ఉన్నట్లుండి అలా హాస్పిటల్ స్ట్రెచర్ మీద చూడటం కొంచం కష్టమైన పని.
డెలివరీ కి ఇవన్నీ తప్పవ్ అన్న విషయం తెలిసినా ఏదో అమాయకత్వం. సరే సిసరియన్ చెయ్యాలి అంటూ హడావిడి చేసారు ... నాకూ అదే బెటర్ అని పించింది ఎవరికన్నా దెబ్బ తగిలినా మా ఆవిడ ష్ ష్ ష్ అబ్బ అబ్బా అంటుంది ఇక తను పురిటి నొప్పులు పడటమా చాలా కష్టం. అంచేత సిసరియన్ కి తయారయ్యాం.

తొమ్మిదింటికి ధియేటర్ లోకి వెళ్ళారు ..నేను, మా మామ గారు, అత్తగారు , మరదలు బయట సినిమాల్లో లా కూర్చున్నాం. పది గంటల పదికి నర్స్ వచ్చి తెల్లటి టర్కీ టవల్ లో చుట్టి లేత గులాబీ రంగు లో ఉన్న చిన్న పాపని దగ్గరకి వచ్చేదాకా చెప్పలేదు ఆడో మగో దగ్గరకి వచ్చాక మొదటగా చేతుల్లోకి తీస్కున్నది నేనే ....గులాబీ మొగ్గలా లేత రంగులో , కాశ్మీరీ ఆపిల్ ల పెద్ద బుగ్గలతో.. పిస్తా పప్పంత చిన్న చట్టి ముక్కుతో చెర్రీ లాంటి పెదాలతో ... నీకోసం ఒకటి తెచ్చానోయ్ అన్నట్టుగా ముడుచుకున్న గుప్పెళ్ళతో నర్స్ చేతిలోంచి నా చేతిలోకి వచ్చిన నా కూతురు .. నా ఒక్కగా నొక్క కూతురు ఆడయినా, మగ అయినా ఒక్కళ్ళే చాలని మేము నమ్మిన సిద్ధాంతానికి ప్రతీక గా మా కూతురు ... నిజాయితీ గా చెప్పాలంటే ఆస్పత్రి లో ఒకే ఒక క్షణం నేను ఆడపిల్లను పెంచాలి అన్న చిన్న భయం .. అది మన రక్తం లోనే ఉందేమో కుటుంబపరంగా, సమాజం నుంచి, ఇంకా మన భారత జాతి కి ఉన్న ఆ చిన్న అనుమానం ..ఆడ పిల్ల భారం భాద్యత అన్న అవకర భావం. ఒకే క్షణం నేను ఆ భావనకి గురయ్యా.. వెంటనే ఆ భావన పోయింది .. అప్పుడు నాకనిపించింది నేనూ సగటు భారతీయుడినే అని. ఒకే ఒక్క క్షణం అంతే.. మళ్ళీ ఎప్పుడూ అలా అనుకోలేదు.


కావ్య ...పేరు కి కావ్య కానీ నేను పిలవని పేరు లేదు కావీ, కాయా , స్వీటూ , హాటూ, బంగారం , నానీ , అమ్మూ, చిన్నూ.. ఇలా ఎలా తోస్తే అలా పిలుస్తా నా కూతురుని..
పుట్టినప్పటి నుంచి ప్రతి ఏడాదీ 365 రోజులు పండగే పన్నెండు నెలలు .యాభై రెండు వారాలు , ఇంట్లో ఉన్న ఆఫీసు లో ఉన్న నా కూతురిని తలచుకొని క్షణం లేదు.
మొదటి పుట్టిన రోజూ నుంచి ఇప్పటి దాక ఎంతో బుద్ధిగా, దేనికీ పేచీ పెట్టక , నాకో మంచి నేస్తం .. సినిమాల గురించి చెప్పినా .. వాళ్ళ స్కూల్ విషయాలు చెప్పినా,
ఏదైనా బుక్ చదివి దాని గురించి చెప్పినా , ఏమైనా ఆ వివరణ కధనం ఎవరివల్లా కాదు, అందుకేమొన్నటి దాక మా అమ్మ రాత్రి పడుకునే ముందు ఒక గంట ఏదోటి చెప్పించుకొని పడుకునేది ... ఎల్కేజీ లో చేర్చి స్కూల్ లో ఎలా ఉందొ లంచ్ తిన్నదో, కక్కుకున్నదో .. అని మధ్య మధ్య లో స్కూల్ కి వెళ్లి చూసి వచ్చేవాడిని.
ఇప్పుడు ఇంజనీరింగ్ లో చేరి హాస్టల్ లో దూరం గా ఉంటూ... ఫోన్ లో కుదిరినంత న్యాయం చేస్తోంది.

ఈరోజు మా అమ్మాయి పుట్టిన రోజూ పద్దెనిమిదో పుట్టినరోజు .... మా బంగారం పుట్టిన రోజంటే ఒక నెల ముందు నుంచే ఎంత హడావిడి పడేదో... కొత్త డ్రెస్ లని .. కొత్త చెప్పులనీ , పార్టీ ఎవరికి ఎక్కడ ఇవ్వాలని పన్నెండింటికి ఎవరు ముందు గ్రీట్ చేస్తారోనని ఇలా రక రకాలుగా టెన్షన్ పడుతూ మమ్మల్ని పెడుతూ ఇలా గడిపేది ..


కానీ ఈసారి మాకు దూరం గా ఉంది పార్టీ సంగతి అడిగితే చూస్తాలే కుదిరితే ఫ్రెండ్స్ కి ఇస్తానన్నది , కొత్త డ్రెస్ వేస్కో అంటే అబ్బ బోర్ అంది ...


మొదటి సారి మాకు దూరం గా పుట్టినరోజు చేస్కుంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా చదువై, పెళ్లి అయ్యాక ఎక్కడో ఉంటే మాకు ఎలా ఉంటుందో ...

ఏది ఏమైనా ఇవన్నీ తప్పవు.. నాలాగా కొన్ని కొట్ల మంది ఉండి ఉంటారు .....ఎప్పటి నుంచో .... నేను ఈరోజు కొత్తగా ఆ స్థానం లోకి వచ్చా కాబట్టి ..
ఇలా అనుకుంటున్నానా... వాళ్ళ సంగతి ఏమో కానీ నాకు మాత్రం లోపల దిగులు బెంగ ఉన్నాయ్ పైకి మాత్రం మేకపోతు ఘంభీర్యం ప్రదర్సిస్తున్నా..
నీకొక్కడికే కూతురుందా .. మరీనూ అనకండి ... కొత్త లో మీరూ ఇంతేనని నాకు తెలుసు .. మీరూ ఇంతేకాక పోతే ... మీరు మనుషులే కాదు ...ఆడపిల్ల ఉన్న
సగటు భారతీయులే కాదు ... ఆ మాట కొస్తే మగ పిల్లడున్నా సరే.... ఈ బెంగ తప్పదు !!
హాపీ బర్త్ డే నానీ ... బాగా చదువుకో.....!!!
బ్రేకింగ్ న్యూస్ : ఈరోజు నా బ్లాగ్ రెండో నెల పుట్టిన రోజూ కూడా .. అందుకే నా బ్లాగ్ కి కూడ యాపీ బడ్డే


15, అక్టోబర్ 2010, శుక్రవారం

నీ వల్లే.. నీ వల్లే...




ట్రింగ్ ట్రింగ్ .. ట్రింగ్ ట్రింగ్.... నా మొబైల్ లో పిలుపు చూస్తే
మా మేనల్లుడు కాంత్ ఏంటి సంగతి అంటే ...
"ఏంటి మొయ్యా ( మావయ్య అనే పిలుపు వాడలాగే పిలుస్తాడు ) నీ వల్ల చూడు..అన్నాడు నిష్టూరం ధ్వనిస్తూ ..
ఏమైందిరా.. అన్నా
చేసేది చేసేసి మళ్ళీ ఏమైంది అంటావా అని కొంచం గొంతు పెంచాడు ..
ఏమైందో చెప్పరా అని అడిగా కొంచం భయకంపిత స్వరం తో..... ఏమైందో అన్న అనుమాన బీజం నాటుకోగా....
నా జీవితం ఇలా ఉండటానికి నువ్వే కారణం మొయ్యా అన్నాడు ఈసారి గొంతులో నిష్టూరం తో బాటు నిరాశ కూడ పలికింది
వీడికేమైంది అందరు పిల్లల్లగానే ఇంజనీరింగ్ చదివి ఇరవై ఒక్క ఏళ్లకే కాంపస్ నుంచి డైరెక్టర్ గా కంప్యూటర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్కుంటూ
మూడు సినిమాలు ఆరు షాపింగ్ లు తో బానే ఉన్నాడు కదా అనుకోని .."నీ జీవితాని కేంటి రా బాబూ..." అన్నా.
" నీ వల్లే నేను ఈ సాఫ్ట్ వేర్ కంపనీ లోనే జేరాను హుహ్!! " అన్నాడు
వాడి చదువుకీ ఉద్యోగానికీ కంపనీకీ దేనికీ సంబంధం లేని నేను బుర్ర గోక్కుంటూ ఆలోచించాను
నా ఆలోచన మాలిక ను తెంపుతూ... 'పేపర్ చూడలేదా' అన్నాడు ,
'చూసాను' ఏముందా అందులో నన్న జిజ్ఞాస మొదలైంది
" చిరంజీవి ఇంకో మేనల్లుడు కూడా హీరో అయ్యాడు" అని చెప్పాడు ఈ సారి కాస్త దీనం గా..
"దాట్లో నా తప్పేం ఉందిరా అన్నా..." అయ్యో పాపం అనుకుంటూ...( ఎవరిని పాపం అని అడక్కండి ఎవరిక్కావాలంటే వాళ్లకి )
" ఆ ధరం తేజ వాళ్ళ మావయ్య పెద్ద మెగా స్టార్, అందుకే అయన మేనల్లుల్లిద్దరూ హీరో లయ్యారు
నువ్వేమో కనీసం కమెడియన్ కూడా కాదు అని నా గాలి తీసేసాడు.
నాకు పూర్తిగా లైట్ వెలిగింది తప్పు నాదే ఏదో నేను ఒక మెగా స్టార్ అయిఉంటే ఆ మెగా నీడ లో మా వాడు కూడా మంచి హీరో అయ్యేవాడు
దురదృష్టవంతుడు. తప్పు నాదే కాబట్టి సమాధానం చెప్పే వీలు లేక నీళ్ళు నమిలా.... నా బాధ అర్ధం చేసుకున్నాడో ఏమో మా కాంత్ గాడు సర్లే జరిగి పోయిందానికి నువ్వు మాత్రం ఏమి చెయ్య గలవ్ ? ఇక నుంచి ఇలా జగక్కుండా చూస్కో అని ఫోన్ పెట్టేసాడు. ఇక నుంచి ఇలా జరక్కుండా అంటే ఎలా రా బాబూ అనుకుంటూ... .ఆ. అనుభవ రాహిత్యం ఇంకా డయలాగ్ రాస్కోవటం కూడా రాని పసి కూన. అని సర్ది చెప్పుకున్నా.
రెండు రోజులయింది ఒక మధ్యాహ్నం ఆఫీసు లో పని చేస్కుంటుంటే ఫోన్ ట్రింగ్ ట్రింగ్ ... చూస్తే మా అన్న కొడుకు ప్రశాంత్
ఇంటర్ మొదటి సంవత్సరం చదువు తున్నాడు
వాళ్ళ అమ్మ ఫోన్ లోంచి కాల్ చేసాడు.
ఏంట్రా అంటే ...
"బాబాయ్ తెలీకుండానే నువ్వు అన్యాయం చేసావ్ "
నేనా అన్యాయమా ఎలా ఎప్పుడూ ఎక్కడ అని అడిగా ...
"అవును నువ్వే!! నువ్వు బాలకృష్ణ అయ్యుంటే నేను హాయిగా జూనియర్ ఎన్టీయార్ అయ్యే వాడిని కదా
చక్కగా ఈ దసరా కి "బృందావనం " రెలీస్ చేస్కొని కలెక్షన్ లు చూస్కుంటూ ఆనక ఛానల్స్ లో ఇంటర్వ్యూ లు ఇస్తూ ఉండేవాడిని కదా "
ఏదో కుట్ర లా ఉంది ...
ఈలోపు ఫోన్లో "అల్లో బుజ్జి బాబాయ్ నేను పనావ్ ని నీ వాళ్ళే ఇలా జరిగింది నేను కూడా సినిమాల్లో బాల నటుడిని అయ్యేవాడిని ( వాడు మూడో క్లాస్ మా అన్న రెండో కొడుకు ) సందేహం లేదు ఇది కుట్రే సర్లే సాయంత్రం మాట్లాడుతా ఆఫీస్ లో బిజీ అని పెట్టేసి .. ఆలోచిస్తే నిజం గానే కొంచం గిల్టీ గా అనిపించింది.

పన్లో పడి ఒదిలేసా...

ఆ రాత్రి టీవీ లో చానల్ వాళ్ళు ఏర్పాటు చేసిన సమైఖ్యంద్ర తెలంగాణా వాదుల పోట్లాట చూస్తుంటే ఎడమ కన్ను టికు టికు మంటూ కొట్టుకుంది ఇంతలో ట్రింగ్ ట్రింగ్ ఎక్కడో దూరం గా హాస్టల్ లో ఉంది చదువు కుంటున్న నా కూతురు .." హాల్లో నాన్న ఏమి చేస్తున్నావ్ తిన్నావా ? తినే ఉంటావ్ లే చేసే దంతా చేసి అంటూ.."
మళ్ళీ పరిచయమున్న ఆరోపణ లా ఉంది అనుకుంటూ నేనేమి చేసాని నానీ ? అన్నా..
ఏమి చెయ్యలేదు అదే నా బాధ నువ్వు హాయిగా కేసీఆర్ అయుంటే నేను చక్కగా కవిత నయ్యుండే దాన్ని హాయిగా.....బతకమ్మ ఆడేదాన్ని ఇంకా....
నేను ఆపి "ఒద్దు నువ్వేం చెప్పొద్దూ నాకూ తెలుసు నువ్వేవ్వేం చెయ్యోచ్చను కుంటున్నావో.... "
మా అమ్మాయి కి చాలా చాలా సారీలు చెప్పి పెట్టేసా.
ఎవరికీ ఫోన్లో సారీలు చెప్తున్నావ్ అని మా అవిడ అడిగింది
మూడు రోజులుగా వస్తున్న ఫోన్లు ,జరుగు తున్న విషయాలు చెప్పా .. అవును కదా అంటూ ఆలోచించటం మొదలెట్టింది ...
నాకూ మళ్ళీ కన్ను టికు టికు మానటం మొదలెట్టింది... అక్కడే ఉంటె ఎలా దారి తీస్తుందో అని టీవీ కట్టేసి వెళ్లి పడుకున్నా..
తెల్లారే ఫోన్ నా ఫ్రెండ్ ప్రభు గాడు తీయాలంటే భయమేసింది వీడేమి అభాండం వేస్తాడో అని తీరా తీసాక లయలా కాలేజీ లో ఫుట్ బాల్ ఆడదాం వస్తావా అంటూ.. సరే అని వెళ్ళే. కాసేపు ఒళ్ళు వంగ దీద్దామని. అక్కడ కాసేపు ఆడాక ఆయాసం తో కూర్చొని
మా వాడు ఆ నీ వల్ల తొందరగా ఆయాసం అన్నాడు ... అంటే ఏంటి నా వల్ల అంటే ??
నువ్వు ఇకెర్ కాసిల్లాస్ అయుంటే నేను డేవిడ్ విల్లా అయివుండే వాడినన్నాడు. మనం స్పయిన్ కి ఆడే వాళ్ళం వరల్డ్ కప్ గెలిచే వాళ్ళం. అన్నాడు
విషయం ముదిరే లోపు ఛీ ఛీ వెధవ గోల అంటూ లేచి ఇంటికొచ్చా.

స్నానం చేసి కాసేపు మెడి టేషన్ చేద్దామని కూర్చొని ఆలోచనలో పడ్డా ధ్యానం లో జ్ఞానం కలిగింది .... మనం ఏ పని చెయ్యలేక పోయిన

మన లోపాలన్నీ వేరే వాళ్లకి ఎలా బదలా ఇంచోచ్చో తెలిసింది.

చిన్నప్పుడు బాగా చదవక సరైన బడి లేదు సరైన మాస్టర్లు లేరు ఉండుంటే నాసా లో సైంటిస్ట్ అయ్యేవాడిని లేక పోతే అబ్దుల్ కలాం నయ్యుండే వాడిని , బాసు సరైన వాడు లేదు ఉండుంటే నన్ను సరిగ్గా గుర్తించుంటే ఈ ఏడాది శ్రమరత్న నాకే వచ్చేది. ఫలానా కులం లో పుట్టింటే బాగా ఎదిగే వాడిని అనవసరం గా ఇందులో పుట్టాను,
మా నాన్న అమితాబ్ బచ్చన్ అయుంటే నేను అభిషేక్ బచ్చన్ అయ్యేవాడిని ఐష్ ని పెళ్లి చేస్కొని చక్కని ఇడియాలు ఇస్తూ ఉండేవాడిని అని మనలో చాలా మంది అనుకోవచ్చు.
అది మనని మనకు సర్ది చెప్పుకునే సమాధానం లేక మనని మనం మోసం చేస్కోవటం .. మన జీవితం మనది మనదే అక్షరాలా మనదే
దాన్ని ఎలా తీర్చి దిద్దుకున్తామో అది మన చేతిలోనే ఉంటుంది అది తెలిసే పరిపక్వత వచ్చే సరికి చాలా జీవితం అయిపోతుంది .. అందుకే ..
దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టినట్లు .. ఎప్పటి భాద్యత అప్పుడు వహిస్తే ఆనక ఇంకోడిని దోషి ని చెయ్యకర్లేదు .

ఏమంటారు ..??


PS: ఇంకా నయం నాకూ కొడుకు లేడు ఉండుంటే " నాన్న నువ్వు వైఎస్సార్ వి కావు.. అయ్యుంటే నేను .... చక్కగా.....

...... తుండే వాడిని అంటే నేనెక్కడ హెలికాప్టర్ ఎక్కాల్సి వచ్చేదో....!! థాంక్స్ దేవుడా నాకూ నా జీవితమే ఇచ్చావ్ నాకిదే ఇష్టం... ఇలాగే ఇష్టం .





13, అక్టోబర్ 2010, బుధవారం

మాల్ లో పాము నా కాళ్ళ కింద ...


మాల్ లో ఏవో అవసరమైనవి కొనుక్కొని బిల్ కట్టేసి ఆ ప్లాస్టిక్ సంచీలు బిల్లు పట్టుకొని నేను ఆ మాల్ లోంచి ఏదీ అక్రమంగా తేస్కేల్లట్లేదు , సరిగ్గా డబ్బుకట్టే సరుకులు తీస్కేల్తున్నాను అని సెక్యూరిటీ దగ్గర చెక్ చేయించు కొంటుంటే పక్కనాయన నా భుజం మీద తట్టి సర్ ఒకసారి కింద చూస్కోండి అంటే చూసా అంతే ఉలిక్కిపడి ఎగిరినంత పని చేశా నా కాలికి పక్కనే డోర్ మాట్ మీద ఆరు అంగుళాల పొడుగునా గోధుమ రంగు లో రెండు మూడు మెలికలతో ఒక యాభై రూపాయల నోట్ , మరి అది చూసి అంత ఉలిక్కిపడనేల అనుకున్నారు కదా కారణం అది నాజేబులోంచి పడిందా లేదా ఎవరిదో నా నిజం నిగ్గు తేలితే కాని నా ఉలికి పాటు తగ్గదు.
నీ వెటకారం కూలా నోట్ చూసి ఎందుకంత ఓవర్ ఆక్షన్ అనకండి .... అది నాది కాక పోతే నాకు అది పాము తో సమానం దాని బుసలు నాకు స్పష్టం గా విన పడతాయి, అవును పరాయి సొమ్ము పాము తో సమానం అని దృడం గా నమ్ముతా అలా నా చిన్నపట్నుంచి మా అమ్మ నాన్న ఇద్దరు తెగ నూరి పోశారు వెంకటేశ్వరస్వామిమహిమ గల , దేవుడు ఆంజనేయుడు మనకు రక్ష, సరస్వతి దేవి ని నమ్ముకుటే చదువు సంగతి ఆమె చూసుకుంటుదని ఎలా నమ్మేమో .. అలాగే ఈ పరాయి సొమ్ము పాము అని నాకు చిన్నప్పుడే చెప్పబడి ఉన్నది. ఆ నమ్మకం బాగా బల పడటానికి రెండు మూడు సంఘటనలు కూడా నాకు సాయం చేసాయి.
మీరు నమ్ముతా నంటే చెప్తా అది నేను ఐదో క్లాస్ చదివే రోజులు కొంచం పొడుగు నిక్కరు ఇంకొంచం లూస్ చొక్కా తో ( తొందరగా పొట్టి అవకూడని మా ప్రణబ్ ముకేర్జీ (అమ్మ) యోచన) వేస్కొని బుద్ది గా చదువు కుంటూ టి వి చూడకుండా( అప్పటికి ఇండియా లో ఇంకా టివి కనుక్కోబడలా) బుద్ది గా ఏ బల్ల కిందో మెట్ల కిందో చప్పుడు చేయకుండా చీమలతో ఆడుకునే వాడినని అస్సలు గోల చేసేవాడిని కానని మా వీధి వీధంత చెప్పుకునేవాళ్ళు.
అంత మంచి వాడినని మా అమ్మ అప్పుడప్పుడు నాకు అయిదు, పదీ పైసలు పాకెట్ మనీ ఇచ్చేది. అయిదు పైసలా అదేంటి అని ఆశ్చర్య పడే నవతరంగ చదువరులారా అప్పట్లో అదే నాకు ఎక్కువ. అయిదు పైసలకి అయిదు చిన్న చిన్న బిస్కెట్లు లేక ఒక చాక్లేట్. ఇలా చాలా వచ్చేవి తినేందుకు. వాటన్నిటి కన్నా మాఇంటి దగ్గర సూరయ్య బడ్డీలో ఇంకా మా రోడ్ లోని మసీదు పక్క ఇంట్లో ఉన్న మామూ కొట్లో నాకొక వ్యసనం ఉండేది అది లాటరీ.
ఒక షీట్ మీద చిన్న చిన్న కాగితాలు అతికించి ఉండేవి మనం అయిదు పైసలు ఇచ్చి ఆ స్టికర్ పీకి దాని వెనక ఏముందో చూస్కోవాలి 90 % జోకర్ బొమ్మ మిగతావి ఎమన్నా నెంబర్ ఉండేవి అదే అట్ట మీద ఆ నెంబర్ కి ఏదో బహుమతి రాసి ఉండేది డబ్బులో లేక ఏదన్న వస్తువో .. నేను నా పదో ఏట ఆ వ్యసనానికి లోనయ్యాను. మా అమ్మ ఇచ్చిన డబ్బులతో ఆ కొట్ల లో లాటరీలు ఆడటం రోజూ నవ్వుతున్న జోకర్ బొమ్మ చూసి ఏడుపు మొహం తో ఇంటికెల్లటం. ఇలా చాలా సార్లు అయింది.
ఒక మంచి రోజు ( నిజంగా మంచి రోజూ) మా అమ్మ ఇచ్చిన పది పైసలు తీస్కోని మా లాస్ వేగాస్ లో మామూ కొట్టు కెళ్ళి పెద్ద స్టేక్ లో ఉన్న లాటరీ ఆ రోజే రెలీస్ ఉన్నది చూసి పది పైసల కి ఒక టికెట్ పీకా ఫస్ట్ ప్రైజ్ అయిదు రూపాయలు అక్షరాల అయిదు రూపాయలు..... నెంబర్ ఒకటి కి. స్టికర్ పీకి దేముడిని తలచుకొని వణుకుతున్న చేతులతో తిప్పిచూసా నెంబర్ వన్..... యస్ నెంబర్ వన్ నన్ను అయిదు రూపాయలకు అధికారిని చేసిన స్టికర్ నెంబర్ వన్. ఎప్పటిలాగే మామూ జోకర్ వచ్చిందా బాబూ అంటూ నవ్వాడు .. లేదు మామూ చూడు అని ఇచ్చా... మామూ మొహం పాలి పోయింది ..... పొద్దున్నే వీడికేమీ పన్లేదా అన్నట్టు చూసి నేను విజయ గర్వం తో నవ్వుతుంటే తన బట్ట తల మీద గోక్కున్నాడు యా అల్లా అంటూ.... నేను ఫిక్స్ డ్ డిపాజిట్ మచ్యూర్ ఆయినా డబ్బులు రాని బ్యాంకు కస్టమర్ లాగ మామూ వంక అసహనం గా చూసాను లేట్ అయితే పెనల్టీ పడుద్ది అన్న బెదిరింపు కలగలిపి..... మామూ సాయంత్రం రా బాబూ అన్నాడు. సరే అని అయన కోరిక మన్నించి ఇంటికొచ్చ్చి మా అమ్మ కి విషయం చెప్పాను. మా అమ్మ వెంటనే నీకు బుద్ది లేదా ఆ లాటరీలు ఆడకు అని తిట్టింది. మా అమ్మకి లాటరీల వల్ల లాభం ఏంటో చెప్పా..
1975 లో అయిదు రూపాయలు సంపాదించడం అదీ లాటరీల్లో ఎంత పెద్ద విషయమో చెప్పా.. మా అమ్మ వినలేదు ఆ డబ్బులు ఏదన్న గుడిలో వేసేయి పుణ్యం అని చెప్పింది లేదా చిల్లరా మార్చి బోలెడు మంది అడుక్కునే వాళ్లకి వేసేయి అని కూడ ఒప్షన్ ఇచ్చింది. ఊరికే వచ్చిన డబ్బులు నిలవవు కస్టపడి సంపాదించే డబ్బులే మనవి, ఈ లాటరీల డబ్బు దేముడు నిలవ నీయడు కావాలంటే చూస్కో అని ప్రభోదించింది. నేను ససేమీరా అన్నాను నా మొదటి సంపాదన అలా చెయ్యలేను
మళ్ళీ లాటరీలో వచ్చినప్పుడు నీ మాట వింటాను అని చెప్పా.. మా అమ్మ ఒక కండీషన్ పెట్టింది ఇంకా ఎప్పుడూ అలా లాటరీల జోలికి వెళ్లనని ఒట్టేస్తే ఇప్పుడు నీ ఇష్టం అని అంది. సరే అని ఒట్టు కమిట్ అయ్యాను. మామూ నాలుగు రోజులు తిప్పించుకొని ఆ అయిదు రీ సైక్లింగ్ చేద్దామని తెగ ట్రై చేస్సాడు( తన కొట్లోనే మొత్తం లాటరీలు ఆడామని) కానీ మా అమ్మకేసిన ఒట్టు మహిమ వల్ల నేను ఒప్పుకోలేదు.
ఎలాగోలా నా అయిదు రూపాయల నోటు నా చేతికొచ్చింది. అప్పటికి ముందు రోజే నేను దాంతో ఏమేమి చెయ్యాలో నిర్నయించేస్కున్నా. ఒక మంచి ఇంకు పెన్ను. ఒక పెద్ద సైజు రబ్బరు బంతి. పెన్ను కోరిక బళ్ళో చేరిన రోజునుంచి ఉంది , రబ్బరు బంతి మాత్రం రేవతి హాలు వాళ్ళ అబ్బాయి హరి దగ్గర చూసా పసుపచ్చగా పంపరపనస కాయంత బంతి నెల కేసి కొడితే ఝామ్మని పైకి లేచే బంతి... అది కొనుక్కోవాలని ఉన్నా మా అమ్మని అడిగి తే ముందు టాకీసు కొందాం దాని మీద వచ్చే డబ్బుతో బంతి కొందా మంటుందని మానేసా. డబ్బులు రాగానే మా అన్న చేతి కిచ్చి నా కోరికల జాబితా చెప్పా వాడయితే లోకం చుట్టిన వీరుడు తెలీని విషయాలు లేవు అని నా గట్టి నమ్మకం.
నా కోరిక మీద ఒక గంట లో వగరుస్తూ వచ్చాడు బంతి , పెన్ను తో .. ఆ పెన్ను మంచి రోజూ చూసి స్కూలి పట్టుకేల్దామని అనుకున్నా .. అసలైతే స్కూల్లో పెన్సిలే వాడాలి కానీ పెద్దమనిషి తరహా ఉంటుంది కదా అని పెన్ను కొనుక్కునా. బంతి కూడా ఆదివారం స్కూల్లో ఆడుకోవటానికి తీస్కెలదామని నిర్ణయించాను.
కానీ ఆ శని వారం సాయంత్రం నాలుగు గంటలకి మా ఫ్రెండు శశి గాడు వాళ్ళ అన్న రవి అనే ఇద్దరు దుర్మార్గులు వచ్చి మా అమ్మని అడిగి ఆ బంతి పట్టుకెళ్ళి గ్రవుండు లో బాగా ఆడేసి ఆరు గంటలకి రెండు సగం సగం బంతులు తెచ్చేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయారు కామ్ గా .... నేను ఒక్క సారి కూడ ఆడలేదు ఆ బంతి తో . అది చూసి మా ఇంట్లో అందరూ నా వెనక ముసి ముసి గా నవ్వుకున్నారు. మా అమ్మయితే అర్జునా నీకు ముందే చెప్పితికదా అన్న కృష్ణుడిలా నా వంక సాకూతంగా చూసింది. నేను లోపల్లోపల బాగా ఏడ్చి బయటకి మాత్రం గుంభనం గా ఉన్నా. ఆదివారం వొదిలి సోమవారం స్కూలికి పెన్ను తీస్కేల్లా... రాసింది ఏమీ లేదు స్కూల్లో పెన్ ప్రొహిబిషన్ ఉంది గా కావున ఎగ్జిబిషన్ పెట్టి సాయంత్రం ఇంటి కొచ్చి నా ఆకుపచ్చ స్కూల్ లాగూ జేబులో చెయ్యిపెట్టి నా స్వయం సంపాదన అయిన నల్ల పెన్ను కోసం తడిమా .. అదేదో సామెత చెప్పినట్టు ఏమీ తగల్లా.. ఈ విషయం ఇంట్లో చెప్పగానే ముసి ముసి నవ్వులు మామూలే మా అమ్మ కృష్ణుడి పాత్ర తో సహా..
మా అమ్మ కేసిన ఒట్టు కోసం చాల కాలం నేను అలాంటి ఫ్రీ ల కి దూరమయ్యా. మా నాన్న భాష లో బేవార్స్ డబ్బు ఎప్పుడూ అచ్చిరాదు అన్నమాట నిజమవుతూ .. ఇంకెప్పుడూ నేను అలాంటి బేవార్స్ ల జోలి కెళ్లలా .... చాలా కాలం కాదు ఎప్పటికీ వెళ్ళలేదు.
ఈ సంఘటమే కాదు మా నాన్న చూపించి చెప్పిన మరో ఉదాహరణ కూడా నన్ను ఇలాంటి వాటికి దూరం గా ఉంచింది. ఎక్కువ సాగ తీయను ఇంచుమించు అదే వయసులోనే ఒక రోజూ మా నాన్న చేసే ఆఫీసు పని కోసం మాఇంటికి వేటపాలెం అనే ఊరు నుంచి ఒకాయన వచ్చారు , మా నాన్న ఇంటిదగ్గర అలాంటి విషయాలు మాట్లాడే వారు కాదు కానీ అయన వచ్చారు కదా అని మాట్లాడి చూస్తాలే అని చెప్పారు , ఆ వచ్చిన ఆయన వెళ్ళే ముందు సంచీ లోంచి ఒక అరకిలో జీడి పప్పు పాకెట్ బల్లమీద పెట్టారు , మా నాన్న ఆయన్ని ఎంత నివారించిన వినకుండా వెళ్ళిపోయాడు. అయన వెళ్ళగానే మా నాన్న ఆ పాకెట్ మా గోద్రెజ్ బీరువాలో పెట్టేసారు. మరుసటి రోజూమా నాన్న ఆయనకు ఆ పాకెట్ ధర ఎం.వో చేసానని చెప్పారు ఆ జీడి పప్పు పాకెట్ సంగతి కూడా మర్చి పోయాం మేము. ఎప్పుడో బీరువా సేఫ్ తీసినప్పుడు ఆ పాకెట్ ఖాళీగా ఉంది కొంచం పొడి మినహా మొత్తం చీమలు తినేశాయి. ఆ ఖాళీ కవర్ బయట పడేస్తూ మనం డబ్బులు పంపినా మనం తినలేదంటే అది ఎంత పాపపు తిండో అందుకే మనకు దూరమైంది అన్నారు. ఎందుకో నా మనసు లో అది బలం గా నాటుకు పోయింది.
అంత గట్టి పునాది ఉంది "పరాయి సొమ్ము పాము అని నేను నమ్మటానికి" కష్టపడి సంపాదించినదే ఎక్కువ ఆనందం ఇస్తుందని....
ఆ భావనే ఇప్పటికీ ఫ్రీ వస్తువులన్నా ఎవరన్న ఇచ్చిన గిఫ్ట్ లన్న నన్ను దూరం గా ఉంచుతుంది...
ఆయినా పరాయి సొమ్ము తినే వాళ్ళని , లంచాలు తినే వాళ్ళని మనం తిట్టుకుంటాం కానీ పాపం వాళ్ళేమీ సుఖం గా ఉండరు, CBI. ACB వాళ్ళ తాకిడి , భయం , టెన్షన్ ,
నిద్రలేమీ , మాత్రమే కాక, ఏదో రకం గా ఇంట్లో వాళ్లకు అనారోగ్యం , ధన నష్టం , కుటుంబ పరువు రోడ్ న పడటం ఇలాంటివెన్నో చూస్తుంటాం. అంతే కాదు ఏదీ బహిరంగంగా అనుభవించలేరు...ఇదే కాక లంచం ఇచ్చే వెధవలు తిట్టుకునే తిట్లు శాపనార్ధాలు , బూతుకానాలు అబ్బో .. . అదో ప్రత్యక్ష నరకం

10, అక్టోబర్ 2010, ఆదివారం

సరిగ్గా ఇదే రోజు .....




10-10-10
ఇవేమీ కొలతలు కావు ఒకవేళ కొలతలైన అలా సమానం గా ఉంటే బాగోవు ఈ రోజు తేదీ టీవీ లో పేపర్లలో ఊదర వేస్తున్న విశిష్ట తేదీ ... మంచి ముహూర్తం ,మంచి అంకెల తో వంద ఏళ్ళకి ఒక సారి వచ్చే తేదీ కావటం తో కొంత హడావిడి ఉండటం తప్పని సరి కదా.
కానీ నావరకు ఈ తేదీ కి ప్రత్యేకత ఉండి అది మా నాన్న గారి 75 వ పుట్టిన రోజు. అయన లేరు అయన ఆశయ సాధనల కోసం మేము ఉన్నాం , అనే రొటీన్ మాటలు చెప్పను. ఎందుకంటే అయన బాగా సంపాదించి ఆకస్మికం గా చనిపోయిన రాజ కీయ నాయకుడు కారు. రియల్ ఎస్టేట్లో ఉన్నట్లుండి బాగా సంపాదించి నలుగురును వేనకేస్కోని తిరుగుతూ సెటిల్ మెంట్లు చేసి నింగికెగసిన గల్లీ నాయకుడు కాదు. చావగానే రౌడి షీట్లు పోయి బోలెడు ఆశయాలు ఉండే వ్యక్తిగా మారటానికి అయన థర్డ్ క్లాసు గూండా నాయకుడు కాదు.
ఒక ముప్పై ఆరేళ్ళు ఒకే ఊళ్ళో స్థిరంగా పనిచేసి తన ఆఫీసు వాళ్లకి , ఇంకా కొంతమంది దగ్గర మిత్రులకీ, ఎక్కువగా బంధువులకీ మరింతగా మా కుటుంబ సభ్యులకీ ఎంతో ఇష్ట మయిన మా కుటుంబ నాయకుడు. మా రాజు మహారాజు ....
కానీ అయన ఆశయ సాధన కోసం మేమంతా ఉన్నాం కుటుంబ సభ్యులం. ఇంతకీ అయన ఆశయాలేంతో మకిప్పటికీ తెలియదు. అంత తెలివి మాకు లేదు. కానీ ముప్పైరెండేల్లు అయన కొడుకుగా ఆయన్ని చూసి కొన్ని. అయన మిత్రుల ద్వారా విని, ఇంకా బంధువుల మాటల్లో తెలుసుకొని కొన్ని ముక్ష్య విషయాలు గ్రహించినవి గుర్తుచేస్కుంటా...
మా "డాడీ" అలా అంటేనే నాకు అయన గూర్చి మాట్లాడుతున్నానని అనిపిస్తుంది. ఎలా అలవాటు అయిందో చిన్నప్పటినుంచి మాకు డాడీ అనటం అలవాటు అయింది. నాన్న అనటం అలవాటు లేదు ( అందుకే మా అమ్మాయి తో అమ్మ నాన్న పిలుపు అలవాటు చేసాం ). అందుకే ఇక్కడ డాడీ గానే ప్రస్తావిస్తా...
బాగా చిన్న తనం లోనే తండ్రి పోయి తల్లీ, వయసు లో బాగా చిన్నపిల్లలయిన నలుగురు తమ్ముళ్ళు, ఒక చెల్లీ , సరిగ్గా లేని ఆర్ధిక పరిస్థితి తో 18 ఏళ్ళ వయసులో బతుకు మొదలు పెట్టి ఒక పక్క చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇంకో పక్క చదువు కుంటూ భాద్యత గా ఉండే వారుట. ఇంట్లో పాలు తాగే పసి పిల్లలున్నారని పాల ఖర్చు తట్టుకోలేక ఒక గేదె ని కొని దాని పెంపకం నిర్వహణ కూడా తానె చూసి పోషించిన మంచి అన్నయ్య. అలా కష్టాల్లో పెరిగిన జీవితం కావటం వాళ్ల పెద్దయ్యాక మంచి స్థితి లో ఉన్నాక కూడా నిరాడంబరం గా బతికే వారు. తన సొంత మనుషులనే కాక దూరపు బంధు వర్గం లో కూడ అవసరాలు చూస్తూ సాయాలు చేస్తూ..చేసిన ఏ సాయానికి కూడ ప్రతిఫలం ఆసింపక బతికిన మహాను భావుడు.
తను ఏదైతే మంచి అనుకున్నారో దానికి ఎప్పుడూ లోబడి, తను నమ్మిన నీతి నియమాలను మాకు నిలువెల్లా ఒంట బట్టించిన తండ్రి. జీవితం లో ఎప్పుడూ ఎవరికీ తలవంచక , ఎవరి సొమ్ము పైసా కూడ తినక అదే సూత్రం మాకు నేర్పించారు. ఇల్లు కట్టడానికి తప్ప అప్పు అనేది అయన అస్సలు చేయలేదు.
తలకి మించిన భారం ఎత్తుకోవటం, అడంబరాలకి ఖర్చు చేయటం ఏమాత్రం పడని వ్యక్తి.
మా బంధువులు గానీ , ఆయన మిత్రులు గానీ ఎప్పుడన్నా కలసి అయన గురించి చెప్తుంటే రామాయణ భారత గాధలు వింటున్నట్లని పిస్తుంది.
అందుకే అయన పోయినా అయన ఆశయ సాధన కి మేమంతా ఉన్నాం. ఇదంతా చదివి ఈయన నాన్న ఈయనకి గొప్ప మాకేంటి అనుకుంటున్నారా... నా ఉద్దేశ్యం అడ్డదిడ్డంగా అవినీతి లో సంపాదించి బాగా డబ్బు చేసి ఆనక ఏ జబ్బో చేసి పోయి పోంగానే వెనక మిగిలిన అవినీతి మొలకలు చేసే ప్రకటనలు ఆశయ సాధనకు పాటు పడే వెతలు చూస్తే వాళ్ళ కన్నా మా డాడీ లాంటి సామాన్యులేవరైనా నాకు పూజ్యనీయులే. సమాజానికి చెడు చెయ్యక తన పని తాను చేస్కొని పోయే నీతి మంతులు సరైన ఆశయాలున్నవారు ఉన్నారు . అందుకే మా డాడీ కే కాదు అలాంటి లక్షల మందికీ నా ప్రణామాలు.
అందుకే డాడీ !!
మీ పుట్టిన రోజున మరొక సరి వినమ్రం గా మీకు అంజలి ఘటిస్తున్నా
మీకు ఇష్టం లేని ఏ పనీ జీవితం లో చేయ్యననీ..
మీరు వేసిన బాటనే ఉన్నాననీ...
మీరు కట్టిన రాట నే తిరుగుతాననీ...
మీరిచ్చిన ఆత్మ విశ్వాసం తో..
మసక బారిన కళ్ళతో...
మీ బుజ్జిగాడు

9, అక్టోబర్ 2010, శనివారం

మరక మంచిదే ....


. ..ఆ మరక స్వార్ధమయితే
నే చదివిన ఒక బ్లాగ్ పోస్ట్ దానికి నేను రాసిన వ్యాఖ్య ఈ చిన్న పోస్ట్ కి దారి తీసింది. బాగుంటే ఆనందించండి లేకుంటే ఇక్కడే తిట్టండి ..
ఆ బ్లాగ్ పోస్ట్ ఏంటంటే పూడురి రాజి రెడ్డి గారు అడిగిన ప్రశ్న NARCISSIST అనే మాటకి మంచి తెలుగు పదం ఏంటి అని ?
దానికి వ్యాఖ్య రూపం లో నేను " స్వాభిమాని" అని రాసాను
దానికి అయన సమాధానం గా "పదం బాగుందికానీ ఇది పాజిటివ్ కదా. నార్సిసిజాన్ని నెగెటివ్ సెన్సులో కదా వాడేది."
మళ్ళీ దానికి నా జవాబు :అలాగని ఖచ్చితమైన రూలేమీ లేడు. ఉదాహరణకి : introvert . extrovert అనే మాటలు మన popular తెలుగు నవలా రచయితల పుణ్య మా అని negative / positive (respectively ) మాటలుగా స్థిరపడి పోయాయి. నిజానికి introvert గా ఉండటమనేది జబ్బు కాదు ఒక మానసిక స్థితి అనుసరణ !! అయినా మీకు తెలీకుండా ఉంటుందా రాజిరెడ్డి ..? అని రాసాను.
దానికి ఆయనేమంటారో నాకు ఇంకా తెలియలేదు.
కానీ ఆలోచిస్తే నార్సిస్సిసం (NARCISSISM) అనే మాట ఎందుకు వాడతారు ? నిజం గా నెగటివ్ అర్థం లోనే వాడాలా? అని ఆలోచిస్తే నాకిలా అనిపించింది

ఆ మాట ఆంగ్లం లో
సిగ్మండ్ ఫ్రాయిడ్ చే నాణెం చేయబడింది ( coined కి వచ్చిన నా తిప్పలు )లేక చేర్చ బడింది.
ఒక గ్రీకు పురాణ పాత్ర నార్సిసస్ ఇతి వృతం మూలం గా ఆ మాట కనుగొనబడింది. అసలు నార్సిసస్ అనే అయన గ్రీకు పురాణాల్లో ఉన్నాడట. అయన మన మన్మధుడి లా ( అంటే నాగార్జున కాదు) మంచి అందగాడు,
కానీ ఆయన్ని అయన ఎప్పుడూ చూస్కోలేదుట. నిమ్ఫ్ ఎకో అనే ఆవిడ గ్రీకు పురాణాల్లో ఒక స్త్రీ . ఆమె మన TV వాళ్ళ లాగా పుకార్లు వ్యాప్తి చేస్తుంటే వాళ్ల గ్రీక్ ఇంద్రుడు శాపం పెట్టాడట : ఎప్పటికి నీ మాట ఆఖరుమాట గా ఉంటుంది అని, అంటే మొదట గా ఆమె మాట్లాడ లేదు ఎవరన్న మాట్లాడితే అదే మాటలు తిరిగి అనగలడు అదీ శాపం. అందుకే చూడండి ఆంగ్లం లో ఎకో మాట తిరిగి వచ్చే ప్రతి ధ్వని గా ఉంచ బడింది, ఆ నిమ్ఫ్ ఎకో గారి పేరిట. సరే మన అసలు కధ లోకి వస్తే మన నార్సిసస్ గారి అడవి లో వెతుంటే మన ఎకో గారు చూసి మాట్లాడామని ప్రయత్నిన్చిందిట. అసలే అయన బాగుంటాడని చెప్పుకున్నాం కదా అందుకని అనుకోండి. కానీ గ్రీకు ఇంద్రుడి శాప ఫలితం గా ఆమె నర్సి గారి వెంట బడింది కానీ మాట్లాడ లేక పోయింది. సదరు నర్సి గారి తిరిగి తిరిగి అలసి దాహమేసి ఒక కొలను లో నీళ్ళు తాగుదామని వంగాడట నీళ్ళలో అయన ప్రతిబింబం ఆయనే చూస్కొని బాగున్నదని ఫీలయి అయన బొమ్మ తో ఆయనే లవ్ లో పడ్డాడట, ఇక ఆ లవ్ ముదిరి మాటలు ఆడుకుంటూ అలా ఉంది పోయాడుట పనిలో పని గా మన ఎకో అమ్మగారు అయన అన్న మాటలే మళ్ళీ అనటం మొదలు పెట్టిందిట .. ఆమె మాటలు తన బొమ్మే ( కొలనులో బింబం) అంటోందని నర్సి గారు ఇంకా తనతో తానె మాట్లాడుకోవటం తద్వారా తనని తానే ప్రేమించు కోవటం మొదలెట్టాడుట ఆక్రమం లో అయన ఒక పువ్వుగా మారి అదే కొలను లో ఉండి తనలో తానే లవ్వాడు కుంటూ ద్యూఎట్స్ పాడుకుంటూ ఉండి పోయాడుట ఆ పురాణం మనకెందుకు కానీ ....

ఇక్కడ అసలు నే చెప్పదలిచిన విషయం ఏంటంటే
నర్సిసం మంచిదా కాదా అంటే మన మంటే మనకి ఇష్టం ఉండటం మంచిదేనా?? మన మీద మనకు స్వార్ధం అభిమానం కొండొక చొ దురభిమానం ఉండటం గురించి చర్చ ..... అసలు మన మీద మనకు ఎంత ఇష్టం ఉండాలి మన మీద అంటే మన దేహం మీద మన జీవితం మీద మన మనుషుల మీద ఎంత వరకూ ఇష్టం ఉండాలి . నిస్వార్ధం గా ఉండాలనుకోవటం మంచిదే కానీ పైన చెప్పిన విషయాల్లో ఎక్కువ స్వార్ధం ఉండటమే మంచిది మన దేహం మీద స్వార్ధం, జీవితం మీద స్వార్ధం, మన మనుషుల మీద స్వార్ధం, ఉంటే చాలు ప్రపంచం మీద ప్రేమ ఉన్నట్టే బాగా స్థూల అర్ధం తీస్కోండి మన జీవితం బాగుంటే నే కదా సమాజం బాగున్నట్టు మన మనుషులు బాగుంటేనే కదా లోకం బాగున్నట్టు అసలు లోకం లో అందరూ మన మనుషులే కదా.. మన మానవులే కదా మన సోదరులే కదా మన వసుధైక కుటుంబ సభ్యులే కదా మరి మన బాగు మనం చూస్కోవటం లో స్వార్ధం ఏముంది చెప్పండి.

ఇక పోతే మన దేహం మీద స్వార్ధం మాత్రం కొంచం ఎక్కువ చూపించాలి ..... ఆరోగ్య విషయం లో .. అందం విషయం లో కూడా పెళ్లి కాగానే ఇక మనం ఆకర్షణీయం గా ఉండక్కర్లేదు అనుకునే మానసిక పెద్దలు మధ్య వయసు వచ్హాక మనకు సోకులేందుకు అనుకునే స్థిత ప్రజ్ఞులకు ఈ స్వార్ధం అర్ధం కావాలి అలవాటు కావాలి. ఇంట్లో మాములప్పుడు అప్పలమ్మలాగా అప్పలయ్యలగా ఉండి ఎక్కడో ఎవడో పెళ్లి అంటే పార్లోర్ కో సలూన్ కో పరిగెత్తి మెరుగులు పెట్టించుకునే మధ్య వయసు మానవులకు ఆ సోకులు మన కోసం మన మనుషుల కోసం తప్పని సరి అని తెలియ చెప్పాలి. మనం ఆకర్షణీయం గా ఉంటేనే మన మనవ సంభందాలు త్వరగా బల పడతాయని నా ఉద్దేశ్యం బాలేక పోతే సంభంద భాంధవ్యాలు ఉండవని కాదు. ఇద్దరు కొత్త వ్యక్తుల మధ్య మొదట కనపడేది బాహ్య రూపమే కదా. అలాగే మన వాళ్ల కళ్ళకు కొంచం అందంగా ఆకర్షణీయం గా కన పడటం తప్పేమీ కాదు. ఆ స్వార్ధం మంచిదే ఆరోగ్యకరమైన ఈ స్వార్ధం మన కీ మన మనుషులకీ మన సమాజానికీ అందరికీ ఆరోగ్యమే.. ఏమంటారు ?

8, అక్టోబర్ 2010, శుక్రవారం

మీ రెలా.... ??


పలకరిస్తారు ...

మీరెలా పలకరిస్తారు ? అదేనండి మీకు తెలిసిన వాళ్ళు కనబడితే మీరెలా పలకరిస్తారు ? హలో అనా ? హాయ్ అనా ? ఏమోయ్ ఎలా ఉన్నావనా? ఏమంటారు. ఈ అనుమానం ఎందుకొచ్చిందంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదివిన ఇంగ్లీష్ పుస్తకం వాట్ యు సే ఆఫ్టర్ సేయింగ్ హలో ( రచయిత :ఎరిక్ బెర్నె/ ప్రఖ్యాత మససిక విశ్లేషకుడు,/ ట్రాన్స్ అక్షనల్ అనాలిసిస్ పితమహహుడు) ఎందుకో గుర్తొచ్చింది. అసలు దానికంటే ముందు అంటే హలో కన్నా ముందు మనం ఎవరినైనా చూడగానే ఎలా స్పందిస్తాం?

బాగా తెలిసిన వాళ్ళు, కొంచం తెలిసినవాళ్ళు, తెలిసీ తెలియని వాళ్ళు ,ఇంకా అసలు తెలియని వాళ్ళు ఇలా నాలుగు రకాల జనం మనకు నిత్యం తారస పడతారు. అందులో మళ్ళీ మనకి ఇష్టమైన వాళ్ళు ,ఇష్టం లేని వాళ్ళు ,ఇష్టమయి, ఇష్టమవని వాళ్ళు అంటే సగమే ఇష్టం అన్నమాట ఆ మాట బయటకి అనం కదా అందుకే సగం సగం నటిస్తాం .
ఇలా నానా జాతుల వాళ్ళు మనకి పొద్దున్న లేస్తే కనబడీ లేక వినబడీ మన రోజులో పాలు పంచుకున్తుంటారు. వాళ్లకి ఏదో రకం గా మనం మన ప్రవర్తన ప్రదర్శిస్తాం. అందులో మొదటిదే పలకరింపు.
ఇష్టమైతే ఆప్యాయంగా ఒక పలరింపు కుదిరితే ఒక కప్ కాఫీ వీలైతే చిన్న పోట్లాట (బిల్ నేనిస్తా నేనిస్తానంటూ)
ఇలా సాగి పోవటానికి మొదటి పలకరింపు మీదైనా ఎదుటి వాళ్ళదైనా అది ఎలా ఉంటుంది మీరైతే ఏమంటారు ? ఎలా మొదలు పెడతారు ?

నాకు తెలిసిన కొన్ని పలకరింపులు చెప్తా చదవండి......
పదేళ్ళ క్రితం మా ఇంటి పక్కన ఇంట్లో ఒక కుటుంబం ఉండేది వాళ్ల అబ్బాయి నా వయసు అతనే. వచ్చిన మొదట్లో మా మెట్లు దిగుతుంటే ఎక్కుతుంటే వాళ్ల ఇంట్లోంచి పలకరింపు గా చూసే వారు మూడో రోజు నేను చిన్నగా నవ్వితే అయన ఎలా ఉన్నారు అన్నట్టుగా పెదవి విచ్చుకొని నవ్వేవారు. ఒక వారంయ్యాక మొదలైంది నాకు ఇబ్బంది నవ్వుల్లోంచి మాటల్లోకి దిగింది. బానే ఉందికదా అనుకుంటున్నారా...?అతను మాట్లాడే ఒకే మాట బాగున్నారా? "జవాబుగా నేను బాగున్నాను !! మీరు ? "అనేవాడిని. పొద్దున్న 6 గంటలకి ఇదే మాట... 8 గంటలకీ అదే మాట, 9 కి అదే మాట, మధ్యాన్నం 2 కి అదే, సాయంత్రం 6 కి అదే, రాత్రి 8 కి అదే, పడుకో బోయే ముందు కూడ అదే మాట (విసుక్కోకండి మీకే అలా ఉంటే ప్రత్యక్ష బలి చక్రవర్తిని నాకెలా ఉండాలి) ఇలా అయన ప్రతీసారి మలేరియా శాఖ వాళ్ల లాగా బాగున్నారా బాగున్నారా అని రోజుకి అన్ని సార్లు అడుగుతుంటే, తిరిగి బాగున్నాను.. మీరెలా ఉన్నారని అడగటం కష్టమై తోచి కొన్నాళ్ళకి మెట్లు దిగకుండా నీళ్ళ గొట్టం పట్టుకొని దిగే సాహసం కూడా చేశా.( మా మెట్లు వాళ్ళ వరండ వైపు ఉంటాయి కాబట్టి ఇంట్లో నే ఉంది లారీల వ్యాపారం చేసే అయన చూడకుండా నేను బయటకు వెళ్ళలేను) ఏమైనా ఈ సమస్యకి అంతం ఎలా అని ఆలోచిస్తుండగానే ఒక సంవత్సరం లో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కానీ నేను కొన్ని వారాలు మెట్లు దిగే టప్పుడు అదే ఆలాపన లో ఉండేవాడిని.
ఇంకో పలకరింపు గురించి చెప్తా .... మా ఇంట్లో అద్దెకి ఉన్న ఒక అయన అప్పట్లో ౩౦ ఏళ్ళు , బ్యాంకు లో ఉద్యోగం ఆ చేసేవాడు పొద్దున్న మాఇద్దరికీ భేటీ కుదిరేది కాదు సాయంత్రం ఇంటికొచ్చి బండి పెట్టేలోపు అతను పువ్వుల లుంగీ కట్ బనీను వేస్కొని ( ఆసరికే అయన ఇంటికొచ్చి సెటిల్ అయిపోయేవాడు) బయటకి వచ్చి ఏంటి సంగతులు సినిమాలు ఏమి చూసారు అని అడిగే వాడు. ఈ ప్రశ్న దాదాపు రోజు ఉండేది. నా సమాధానం ఒకటే రోజు "సంగతులు ఏమీ లేవు సినిమాలు ఏమీ చూడలేదు" ఇదే ప్ర.. జ .. కార్యక్రమం రోజూ... ఇలా చాలా నెలలయ్యాక నేను ఒక రోజు నా జవాబు మార్చా " నేను చూసే సినిమాలు ధియేటర్ లో రావట్లేదండీ చట్టాలు ఒప్పుకోవట అన్నా !! అప్పటినుంచి అయన ఆ ప్రశ్న మానేసాడు.
మా ఆఫీసు లో పనిమంతుడొకడు ప్రతీ రెందేల్లకీ ఒకసారి ఆఫీస్ ఇచ్చిన సౌకర్యం LTC వెళ్లి వచ్చి ఒక నెల రోజుల పాటు కనపడగానే, హలో సర్ ఈమధ్య ఎటన్నా టూర్లు వెళ్లారా ? అని అడిగి మనం సమాధానం చెప్పకుండానే, తను రెండునెలల క్రితం వెళ్ళిన టూర్ సంగతి పూస గుచ్చుతాడు.
మనం వదిలిచ్చుకోలేని ఉదంతాలు కళ్ళకు కట్టినట్టుగా డిల్లీ గిల్లీ బొంబాయి గింబై అంటూ సాగిపోతాడు మా సుబ్బూ ..
పైసా ఖర్చులేని యాత్ర స్పెషల్ అనుకుంటున్నారా ..
మీదాక వస్తే తెలుస్తుంది.

మా ఆఫీసు లోనే ఉన్న ఇంకో అయన పలకరింపు వింటే మన మీద మనకే ఎక్కడ లేని భరోసా వస్తుంది. గుడ్ మార్నింగ్ అని వెంటనే ఎలా ఉన్నారు అనకుండానే,
మీకేంటి సర్ హాయిగా.... అంటాడు.
అప్పటికి ఆయనకి రోసయ్యకున్నన్ని కష్టాలున్నట్లు .
నాకు మాత్రం అయన మాట తో ఆత్మ విశ్వాసం హద్దు మీరుతుంది.
ఒట్టు కావాలంటే మీరు ట్రై చేయండి మా కృష్ణారావ్ పలకరింపులు.

ఇవి కాక ఇంకా వివిధ రకాల పలకరింపులున్నాయి మీకు ఓపిక ఉందా?
కనబడగానే తనకున్న జలుబు, గాస్, ఇంకా తిమ్మిర్ల జాబితా తీసే రంగడు.
పక్కింట్లో వెల్లుల్లి వండారని నాకొచ్చి పిర్యాదు చేసే సత్యమన్న...
షేర్లు పెరగట్లేదని వాపోయే రమణ ..,
తన ఇంట్లోనే కాక చుట్టాలకి కూడ తనే ఖర్చు భరిస్తున్నాననే కృష్ణ బాబు
వీళ్ళంతా రోజు లో మొదటి పలకరింపు లో ఇవే చెప్తారు. మనం అడిగినా అడగక పోయినా....
మీరు అడగక పోయినా నేను ఇవి చెప్పినట్లే.....
ఇంకొన్ని విచిత్ర పలక రింపులు ఉంటాయి ...
సినిమా హాల్లో ముందు సీట్లోంచి వెనక్కి తిరిగి హాల్లో ఏంటి సినిమా కొచ్చారా అని అడిగే అనుమాన్లు , అలాగే పార్కులో .. పార్కొచ్చారా అని అడిగే హనుమాన్లు ..
ఎగ్జిబిషన్లో కుటుంబ సమేతంగా ఉంటే ...
ఎదురుబడి ఏంటి పిల్లలని తీస్కోచ్చారా అని అడిగే అచ్చెరువులు ఉంటారు,
మనమే సంభాలిచుకొని ఏదో సమాధానం చెప్పేయాలి తప్పదు.
నా చిన్నప్పుడు రామారావు అనే ఫ్రెండు ఉండేవాడు ప్రతీ వాక్యంలోను డైలీ అనే మాట బాగా అలవాటు మా ఇంటికొచ్చి హిందూ పేపర్ అడిగే వాడు అదీ శుక్రవారంది. అందులో అప్పట్లో సినిమాల గురించి రాసేవాళ్ళు. "ఫ్రైడే హిందూ ఇవ్వరా నేను డైలీ ఫ్రైడే హిందూ చదువుతా అంటూ అడిగే వాడు
" రోజూ ఫ్రైడే హిందూ నేనేక్కదినుంచి తెగలను రామా" అనుకునే వాడిని ...

ఇంకా ఒంట్లో బాలేక ఆస్పత్రి లో చేరిన వాళ్లనో ,వాళ్ళ బంధువులనో,
ఎలా వచ్చింది రోగం ఎప్పటినుంచీ అంటూ పలకరింపులతో
దాడి చేసే tv విలేఖరుల లాంటి మిత్రులు ,
చావు ఇంటి దగ్గర కొచ్చి పోయిన మనిషికి ఏమేమి అలవాట్లున్దేవి,
ఏమి జబ్బు పడి పోయారు అనే సందేహాలతో ఓదార్చే ప్రసాధువులుంటారు ...
ఒళ్ళు మండినా. ఓర్చుకోవాలి మరి ....

ఏదేదో రాసిన తిట్టుకోకుండా చదివారు..
ఇంతకీ మీరెలా పలకరిస్తారు .......
నాకైతే మౌనమైన చిరునవ్వు , ఆప్యాయతతో కూడిన చూపు చాలా ఇష్టం మరి నేనెలా....ప్రవర్తిస్తానో నా చుట్టూ ఉన్న వాళ్ళని అడగాలి ....

5, అక్టోబర్ 2010, మంగళవారం

అయన అన్నారూ ఆ .. నాదేం ఉంది అని..


ఓరి వెధవల్లారా....

తిరుమల
తిరుపతి దేవస్థానం వారి క్యాలెండరు లోని పైన చూపబడిన శ్రీ ఆంజనేయుని చూడగానే ఎప్పుడూ నామనసు లో కలిగే భావం ఇది. మనం పాపమో పుణ్యమో ఏదో చేసి ఎప్పడు కుదిరితే అప్పుడు తిరుమల కి వెళ్లిస్వామి దర్శనం చేస్కొని వస్తాం. క్రమం లో మనం కరవని, గడ్డీ లేదు చెయ్యని అక్రమం ఉండదు. అసలు శ్రీవేంకట నాధుని లాంటి దేవుడు ఇల లేడు ఎందుకంటే మిగతా దేవుళ్లంటే భక్తే కానీ అయన విషయం లో భయంకూడా... చిన్న తేడా ఉన్నా ఏమి జరుగుతుందో అనే భయం.
కలియుగానికి సరిగ్గా ఉండాల్సిన దైవం. ఎందుకంటే కేవలం భక్తి ఒక్కటే ఉంటే మనం మనల్నినియంత్రించుకోలెం, అందుకే కలియుగానికి భయపెట్టే దైవం అయన. ఏమైనా ఇంకా భయం లేని జనంఉన్నారు వెంకన్న మా వాడే ఎప్పుడూ చూసే వాడే కాబట్టి మమ్మల్ని ఏమీ చేయడు అనే ధైర్యమున్న జనంవాళ్ళే తిరుమల లోనే ఉండే అవినీతి బాటనే ఉన్న జనం. దేవుడి నే ముడి సరుకు గా గా పెట్టుకొనివ్యాపారం చేసే జనం. అయన సేవకులం అనిచెప్పుకుంటూ సేవ నే దొడ్డి దారిలో అమ్ముకునే ఘరానావ్యాపారులు. మద్యం మాంసం జూదం లాగానే దేవుడినీ లాభా సాటిగా చూడగల వ్యాపారులు.
వాళ్ళు
సరే ఎప్పటి నుంచో చూస్తున్నారు దేవుడికి బాగా దగ్గర( భౌతికం గా ) గా ఉన్న వాళ్ళు ఎప్పటిపుణ్యమో ఫలించి దేవ దేవుని సన్నిధి లో పడిన వాళ్ళు. కానీ ఏడాది కో రెండేళ్ళకో ఒక్కసారి వెళ్ళే మనలాంటి వాళ్ల సంగతేంటి..? వ్యాపారం లో మనం మంచి వినియోగదారులం కాదా... ? దొరికితే అడ్డ దారిలోవసతి, సేవ, దర్శనం సంపాదిద్దమనుకునే సగటు వినియోగ దారులం.
ఒక
రకం గా ఆక్కడి వ్యాపారుల కన్నా మనమే పెద్ద పాపులం. కాని ఏమి చేస్తాం ? అక్కడి పరిస్థితులకిఅలా లొంగిపోయే నిస్సహాయ భక్తి వినియోగ దారులం. బ్లాకు లో పాల డబ్బాలు కొనుక్కున్న రోజులనుంచి కిరోసిన్ సిమెంట్ చివరకి బియ్యం పప్పులు ఉప్పులూ కూడా బ్లాకు లో కొనడానికి వెనకాడని సగటువినియోగదారులం. అసలు అలా కొనక పోతే చేత కాని వాళ్ళం కుటుంబం ద్రుష్టి లో హీరో అవాలంటే బ్లాకు మార్కెట్ లో మన వినియోగం తప్పదు. అదే క్రమం లో తిరుమల లో కూడా ఏదో రకం గా దర్శనంవసతి సంపాదిస్తే కుటుంబం ద్రుష్టి లో పెద్ద హీరో అవొచ్చు. తిరుమల నుంచి తిరిగి వచ్హాక అందరికీచెప్పుకోవచ్చు గొప్పగా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు , తిరుమల లో పెద్ద భక్తి వ్యాపారవేత్త అయన దగ్గరస్వామి దర్శనం కొనుక్కున్నాం ac కాటేజ్ లో ఉన్నాం అంటూ .... గంటలో దర్శనం అయింది రెండునిముషాలు గర్బ గుడిలోనే ఉన్నాం పూజారి శతగోపం కూడ పెట్టారు ( బాగా) అంటూ కధలు కధలు గాచెప్పు కుంటూ మనకు మనమే సహభాష్ అనుకుంటాం.

ఇదంతా
భక్తే ... మనకు తెలీని విషయమేంటంటే తిరుమల లో ఉన్న పైన చూపబడిన అనిలాత్మజుని ఆశ్చర్య పూరిత భంగిమ. అయన అలా మూతిన చెయ్యి వేసి ఎందుకు ఆశ్చర్య పడుతున్నారో వేరే కధఉంది కానీ నాకు మాత్రం ఆయన్ని చూసినప్పుడల్లా స్పురించేది ఒక్కటే ... ఓరి వెధవల్లారా ఇన్ని యుగాలుగా నాదే భక్తి కి పరాకాష్ట అనుకున్నా స్వామి నా వాడే అనుకున్నా కానీ మీరు నాకన్నా పెద్ద భక్తులు, నాదేమి ఉంది అన్నట్టుగా చెప్పకనే చెప్పినట్లు అనుమాన భావన....మీరేమంటారు సాటి భక్త జనులారా...