21, అక్టోబర్ 2010, గురువారం

మా ఊర్లో వివేకానందుడు .......


నా మొట్ట మొదటి పుస్తకం నాకు తొమ్మిదేళ్ళప్పుడు సంపాదించా 1975 లో .. నా మొదటి పుస్తకం అనగానే నేను రాసిన గ్రంధం అనుకున్నారేమో కాదు, అమ్మ నాన్న డబ్బులిస్తే కొనుకున్న కధల పుస్తకం కూడా కాదు. నా సొంతం నా కష్టార్జితం ఆ పుస్తకం . అదెలా సంపాదించానో తెలుసుకోవాలని ఉందా.... అయితే రండి గుండ్రాల్లోకి....అలా వెనక్కి వెళ్తే నలుపు తెలుపు రంగుల్లో కనిపిస్తుంది నా రంగుల చిన్నతనం. నా జ్ఞాపకాల భోషాణప్పెట్టే లోపల దాక్కుని, అప్పుడప్పుడు బయటకి వచ్చి నన్ను గిలి గింతలు పెట్టే ఊసులలో ఒకటి.

సరే విషయానికొద్దాం ... మా బందర్లో బుట్టయిపేట లో త్రివేణి ప్రెస్ (భావరాజు నరసింహారావు గారిది) పక్కనే వివేకానంద మందిరం అనే ధ్యాన మందిరం ఉంది. ఇప్పటికీ ఉంది. రామకృష్ణ సమితి వాళ్ళు నడిపే ఒక ఆధ్యాత్మిక కేంద్రం. యోగ, మెడిటేషన్ నేర్పేవాళ్ళు.

ఆ రామ కృష్ణ సమితి వాళ్ళు ఒక జనవరి లో యువజన ఉత్సవాలు జరుపుతూ.. అందులో భాగం గా విద్యార్ధులకి వకృత్వం పోటీ పెట్టారు. అంశం : భారత యువత ప్రాశ్చాత్య నాగరిక ప్రభావం . ఆ విషయం తెలుసుకున్న మా నాన్న ఆ పోటీ లో పాల్గొనే వక్తల వయో పరిమితి తెలియక ఇంటి కొచ్చి ఇలా ఒక పోటీ ఉంది అందులో నువ్వు మాట్లాడాలి, నేను నీకు రెండు పేజీలు విషయం రాసిస్తా నువ్వు భట్టీ పట్టి అక్కడ అప్పచెప్పటమే. అదే వకృత్వం పోటీ అంటే అని నన్ను ఉసి గోల్పారు. ఇలాంటి విషయాలు మొదటి సారిగా వినటం తో నేను బాగా ఉత్తేజితుడయిపోయాను. అసలు జరిగిదేంటంటే నాకు చెప్పకుండా మా నాన్న అప్పటికే నా పేరు పోటీ లో నమోదు చేయించారు. నా వయసు వాళ్ళు అడగ లేదు అయన చెప్పలేదు.

పోటీ లో మాట్లాడటానికి మా నాన్న రెండు పేజీల విషయమ రాసిచ్చారు, గౌరవనీయులైన ...కి . నా వందనములు. ఈనాటి చర్చ నీయాంశం ... భారత యువత .... అంటూ మొదలయి చాలా పెద్ద పెద్ద మాటలతో సాగిపోయింది ... కొన్ని మాటలకి నాకు అర్ధం కూడ తెలీదు అవన్నీ తెలుసుకొని బాగా బట్టీ పట్టాను.


అసలు రోజూ రానే వచ్చింది ఆ ఆదివారం . మా అన్న పాపం ఇలాంటి వాటికి నాకు సైకిల్ డ్రైవర్, తను పాల్గొనక పోయినా ఇలాంటి విషయాల్లో నన్ను బాగా ప్రోత్స్తహించే వాడు ( అందుకే ఈ బ్లాగ్ ముఖం గా వాడికి జేజేలు) పొద్దున్న పదకొండు గంటలకి వివేకానంద మందిరం కి చేరుకున్నాము . అక్కడ మధ్య హాల్లో ఎర్రటి జంపకానా పరిచి ఉంది , అప్పటికే చాలా మంది ఉన్నారు ... అంత మంది జనం మధ్యలో ఒకే ఒక్క అయన నాకు తెలుసు. ఆయనే మా ఇంటి ఎదురుగా ఉండే డాక్టర్ శ్రీ కుప్పా వెంకటరామ శాస్త్రి గారు ( కీ.శే). అయన మా కుటుంబ మిత్రులు, వైద్యులు , మా కందరికీ గురుతుల్యులు మా వీధికే పెద్ద దిక్కు ..(అయన గురించి మరో సారి వివరించు కుంటాను)... ఒక్క సారి శ్రీ రామకృష్ణ పరమ హంస. శారద మాత. వివేకానందుడు ముగ్గురి కి దండం పెట్టుకున్న మీదే భారం అంటూ... నిర్వాహకుల దగ్గర కి వెళ్లి నేను వచ్చిన పని చెప్పా వాళ్ళు ముందు గట్టిగా నవ్వారు (అవును మీరు చదివింది నిజమే నవ్వారు) తర్వాత నా పేరు హాజరైన వాళ్ళ జాబితా లో రాసుకున్నారు.

పదకొండున్నరకు పోటీ మొదలైంది అంతా పెద్ద వాళ్ళు అంటే ఇరవై ఏళ్ళు ఆ పైబడిన వాళ్ళే ముప్పై లలో ఉన్న వాళ్ళే.. ఒకొక్కరు వెళ్లి మాట్లాడు తున్నారు. ఇలాంటి పోటీ లలో మిగతా వాళ్ళు ఏమి చెప్పారో తెలుకోవటం మంచి పని కదా, కానీ మొదటి సారి కదా నేను అలాంటివేం పట్టించుకోలా.. దిక్కులు చూస్తూ గడిపేసా చాలా మంది మాట్లాడినా నా వంతు రాలేదు , నా టెన్షన్ నాకుంది చదువు కెళ్ళిన కాస్తా మర్చిపోతానన్న చిన్న భయం....

చివరకి నా వంతు వచ్చింది అన్నదానికి గుర్తుగా నా పేరు పిలిచారు ...1893 సెప్టెంబర్ 11 చికాగో .... వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్ లో వివేకానందుడు " నా ప్రియమైన ఆమెరికా సోదర సోదరీ మణులారా ....." ప్రసంగించినట్లు ... నేను ఘంభీరం గా వెళ్లి నా బరువు దించుకునే పనిలో పడ్డా..స్కూల్లో పాఠం అప్పచెప్పినట్లు గడ గడ .. సాగి పోతోంది ఏమి చెప్తున్నానో నాకే తెలీదు మధ్యలో మర్చిపోయిన వాక్యాలు సగం లో ఒదిలేసి తర్వాత వాక్యానికి వెళ్ళిపోతూ ...సాగి పోతూ.. ముందుకు పోతూ... మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి లాగా మనవి చేస్కున్నా.. మధ్య మధ్యలో అందరూ నవ్వారు చప్పట్లు కొట్టారు అవి ఎందుకు చేసారో నాకు తెలీదు నేను మరింత రెచ్చిపోయా....కొన్ని నిముషాల తర్వాత నన్నెవరో ఎత్తుకు తీస్కెళ్ళి కూర్చో పెట్టారు.

పోటీ అయ్యాక ఒక అరగంట లో ఫలితాలు చెప్పేశారు ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలు ఎవరికో ఇచ్చేసారు ( బహుశా వయసు లో పెద్ద వాళ్లకి రిజర్వేషన్ ఉందేమో వాళ్ళకే ఇచ్చారు) చివర్లో మా డాక్టర్ గారు లేచి ఈ నాటి పోటీ లో అందరికన్నా చిన్న వాడైన ఈ చిరంజీవి కి ప్రత్యక బహుమతి ప్రకటిస్తున్నాం . అయితే ఆ బహుమతి త్వరలో అందజేయ బడుతుంది అని ప్రకటించారు.

నేను విజయ గర్వం తో మా అన్న వంక చూసా .. మా అన్న కూడ అరవ డబ్బింగ్ సినిమాల్లో లాగా "మన వంశానికి ఒకే ఒక్కడు అది నువ్వే రా .. నువ్వే నువ్వే." అని కొంచం ఆర్ద్రత తో అన్నాడు.


ఇద్దరం సైకిల్ మీద " దేశానికి జయం జయం రాష్ట్రానికీ జయం జయం....." అంటూ పాటలు పాడుకుంటూ ఇంటి కెళ్ళాం. చిన్న నిరాశ ఏంటంటే తలుపుదగ్గర మా అమ్మ గానీ మా అక్కగానీ దిష్టి తీసి లోపలకి తీస్కెళ్ళ లేదు. ఆయినా నా ఆనందం లో అది నేను పట్టించుకోలేదు.


అసలు కధ ఇక్కడ నుంచే మొదలు కొంచం జాగ్రత గా చదవండి మరి..... నా బహుమతి త్వరలో ఇస్తానన్నారుగా అందుకే మరుసటి ఉదయం మా డాక్టర్ గారిని కలిసి విషయమ కదిపాము. అయన అప్పుడే గుర్తొచ్చినట్లు అవును కదూ నీకు ప్రైజ్ ఇవ్వాలి కదూ అంటూ నే చూస్తాలే అని పంపించారు.


బుధవారం సాయంత్రం మళ్ళీ డాక్టర్ గారిని కలిసి మళ్ళీ విషయమ కదిపి చూసాం. కన్సల్టింగ్ టైం కదా రేపు చూస్తాలే అని పంపేసారు.

శుక్రవారం పొద్దునే వెళ్లాం అయన కొంచం ఇబ్బందిగా మొహం పెట్టి ఒరేయ్ నువ్వు రానక్కరలేదు నేనే కంపౌందరు కి ఇచ్చి పంపుతా పో అన్నారు.. నేను కొంచం చిన్న బుచ్చుకున్న మాట వాస్తవం...


ఆదివారం వేరే వంక పెట్టుకొని వెళ్ళా అయన దగ్గరకీ.
స్కూల్ ప్రేయర్ టైం లో నుంచుంటే కాళ్ళు నొప్పిగా ఉంటున్నాయి డాక్టర్ గారి దగ్గరికీ వెళ్లి వస్తా నని వెళ్ళా..
ఆయనకి కాళ్ళ నొప్పి సంగతి చెప్పా అయన నా చెయ్యి పట్టుకొని దీనికి మందులోద్దురా అన్నం బాగా తిను రోజూ పాలు తాగు అని చెప్పి వెళ్ళమన్నారు .

నేను వెళ్ళకుండా అయన బల్ల మీద ఉండే రక రకాల వస్తువులతో ఆడుకుంటూ అక్కడే ఉన్నా కాసేపు, అయన ఇంక వెళ్ళరా అన్న విన కుండా అక్కడే తచ్చాడు తూ...
మరీ మరీ మొన్న పోటీ లో నాకిస్తానన్న ప్రైజ్ అంటూ నసిగాను . అయన ఉలిక్కి పడి నిజమే నేను బాకీ ఉన్నా ఈ రోజూ తప్పక ఇస్తా నన్నారు.
నేను సంతుస్టుడనయి ఇంటికొచ్చేసా.

అప్పటికే మా ఇంట్లో విషయం లీకయి నే వెళ్ళిన వంక ఏంటో తెలిసి పోయి అందరూ నవ్వటం మొదలెట్టారు. మా అన్న గాడే లీక్ చేసాడు . ఇచ్చారా అంటూ మా ఇంట్లో నవ్వు దాచిన మొహాలతో అడగటం మొదలెట్టారు. నాకు రోషమొచ్చి ఇవ్వక పోయినా పర్లేదు అందరూ చప్పట్లు కొట్టారు మీకెవరికీ అలా కొట్టారా ? ఎప్పుడన్నా అని నిలదీసా. వాళ్ళు నిజమే కదా, మనలో వీడొక్కడే కదా , వంశానికోక్కడు అని గేలి చెయ్యటం మానేశారు. ఆయినా నవ్వు తాలూకు సవ్వడులు పక్క గది లోంచి వినపడుతూనే ఉన్నాయి.

ఇలా వెంట బడటం విషయం దర్శకుడు శ్రీ కె. విశ్వనాద్ గారికి ఎవరు చెప్పారో కానీ ఇరవై ఏళ్ళ తర్వాత తన స్వాతి ముత్యం సినిమా లో ఈ సన్నివేశం పెట్టుకున్నారు. ఒక రకం గా అది కూడ నాకు గర్వ కారణమే.

ఆ ఆదివారం సాయంత్రం సరిగ్గా వారం తర్వాత , అయిదు సార్లు వెంట పడి అడిగితే మా డాక్టర్ గారు రామకృష్ణ సమితి వారి ప్రచురించిన "వివేక చూడామణి" అనే పుస్తకం కొని దాని మీద మొదటి పేజీ లో శ్రీ _______ గారికి ప్రత్యేక బహుమతి శ్రీ రామకృష్ణ సమితి, ది: 5 జనవరి 1975 ఆదివారం అని రాసి ... వాళ్ళ కంపౌన్దర్ తో ఇచ్చి మా ఇంటికి పంపారు. ఆ పుస్తకం చేతిలో పడ్డ క్షణం నుంచి నేను భూమికి రెండు అంగుళాల ఎత్తులో నడిచా..

ఎక్కడికి వెళ్ళినా నాతోనే ఆ పుస్తకం , స్కూల్లో... హిందీ ప్రైవేట్ లో..... అన్ని చోట్ల నాకు పబ్లిసిటీ ఆ పుస్తక ప్రస్తావన తో నెల రోజుల పాటు నేల మీద నడిచే పరిస్థితి లేదు.

అలా నాకు నేను గా సంపాదిచిన మొదటి పుస్తకం
"వివేక చూడామణి" నా దగ్గర దాదాపు పాతికేళ్ళు ఉంది తర్వాత ఎలా పోయిందో తెలీదు.... కనపడలేదు.

ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా నా కు దిగులేస్తుంది .... ఒక పెద్దాయన స్వ దస్తూరితో ఇచ్చిన నా స్వార్జితం ..... జీవితం లో మొట్టమొదటి సారి పోటీ లో పాల్గొన్న సంఘటన నాకు ఇప్పటికీ కళ్ళ కట్టినట్లు ఉంటుంది.

అందుకే నన్ను ప్రోత్సహించిన మా నాన్నకి , నన్ను సైకిల్ మీద ఇలాంటి వాటికి తిప్పిన మా అన్నకి జేజేలు ఎంతో ప్రేమతో...




11 కామెంట్‌లు:

  1. ha ha ha chala bagundi andi... mee batti pattadam, akkada vappacheppadam.... annitikanna mukhyam ga mee hakku kosam(prize) mee baalya poratam chala bagundi... chaduvuthunnantha sepu thega tension padda ... inthaki mee prize adena leka inka emai untunda ani gaba gaba chadivesa. inthaki appulu mee vayasentha?

    రిప్లయితొలగించండి
  2. చిన్న చిన్న టైపింగ్ తప్పులు మినహా మీ భాషా శైలి కధనం మాత్రం చాలా చాలా బాగున్నాయి. ముఖ్యం గా ఎంతో అర్ధవంతం మీరు వేస్తున్న బొమ్మలు నాకు నచ్చాయి.
    తప్పులు పడకుండా చూస్కోండి ఆత్రేయ గారు. ప్రయత్నిస్తే మీరు పెద్ద కధలు కూడా బాగా రాయొచ్చు.- రమణ

    రిప్లయితొలగించండి
  3. Literature is all, or mostly, about sex.
    - Anthony Burgess
    but i say your writings are all about life's simple fun that you see in your life.
    have great life and great fun. God Bless You !!

    రిప్లయితొలగించండి
  4. @ లక్ష్మి గారు మొదటి వాక్యం లోనే చెప్పానండీ నాకు అప్పుడు తొమ్మిదేళ్ళు .
    @రమణ గారు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  5. @ Anonymous thanks for the blessings
    and wishes
    may i know your name ?

    రిప్లయితొలగించండి
  6. How beautiful are these memories :))

    నేను గుంటూరు హిందు హైస్కూలులో పదో తరగతి చదువుతున్నప్పుడు (1983) నాదీ ఇలాంటిదే ఓ అనుభవం. స్కూలు ఐపోయిన తర్వాత వస్తుంటే, ఎదురుగా వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏవో యువజన వారోత్సవాల సందర్భంగా అనుకుంటా విక్తృత్వ పోటీలు జరుగుతున్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే, అప్పటికే పోటీ మొదలవ్వబోతూ ఉంది. నా పేరు నమోదు చేయించుకోటానికి వెళ్తే, నిక్కరులో ఉన్న నన్ను ఎగాదిగా చూసి, ఇది కాలేజీ విద్యార్ధుల కోసం జరుగుతున్న పోటీ పిల్లలకు కాదన్నాడు అక్కడున్న వ్యక్తి. అయినా, వదలకుండా వెంటబడితే, అక్కడే ఉన్న స్వర్గీయ శ్రీ మన్నవ గిరిధర రావు గారు పిల్లాడు మాట్లాడుతా అంటున్నాడు కదా, మాట్లాడనీయండి అని రికమెండ్ చేసారు. ఆయన అక్కడ జడ్జిగా వచ్చారని పోటీ తర్వాత తెలిసింది.

    పోటీలో ఉన్న అందరూ మాట్లాడిన తర్వాత, నాకు అవకాశం ఇచ్చారు. అవినీతికి సంబంధించిన విషయం అని చూచాయగా గుర్తు. చివరికి, ఫలితాలు చెప్పి నన్ను అభినందిస్తూ శ్రీ గిరిధర రావు గారు, ఆయన వ్రాసిన లోకజ్ఞానం అనే పుస్తకం బహుమతిగా ఇచ్చారు.

    ఆ తార్వాతి సంవత్సరంలో, హిందూ కళాశాలలో జరిగిన ఇంట్రామ్యురల్స్ లో నాకు రెండో బహుమతి వచ్చింది. అప్పుడు హిందు కళాశాల వక్తృత్వ, క్విజ్ సంఘం అధ్యక్షులుగా ఉన్న గిరిధర రావుగారు నన్ను గుర్తుపట్టి మరీ ప్రశంసించారు.

    ప్చ్... ఇవన్నీ మధురస్మృతులండి.

    రిప్లయితొలగించండి
  7. కొండముది గారు: "విక్తృత్వ" కాదేమో, వక్తృత్వ పోటీ అనుకుంటా ;)

    రిప్లయితొలగించండి
  8. @కోతపాళీ: థాంక్స్ సర్
    @కొండముది : ఇంచు మించు మన అందరి బాల్యాలు ఒకటే అందుకే ఇక్కడ కలయ చేరాం
    @ witreal : మీ వ్యాఖ్య కొండముది గారికి అందజేయ బడింది
    అందరికీ వందనాలు

    రిప్లయితొలగించండి
  9. Wonderful narration with simple humour. Infact, it's the need of the day. I thoroughly enjoyed reading it.

    రిప్లయితొలగించండి