13, అక్టోబర్ 2010, బుధవారం

మాల్ లో పాము నా కాళ్ళ కింద ...


మాల్ లో ఏవో అవసరమైనవి కొనుక్కొని బిల్ కట్టేసి ఆ ప్లాస్టిక్ సంచీలు బిల్లు పట్టుకొని నేను ఆ మాల్ లోంచి ఏదీ అక్రమంగా తేస్కేల్లట్లేదు , సరిగ్గా డబ్బుకట్టే సరుకులు తీస్కేల్తున్నాను అని సెక్యూరిటీ దగ్గర చెక్ చేయించు కొంటుంటే పక్కనాయన నా భుజం మీద తట్టి సర్ ఒకసారి కింద చూస్కోండి అంటే చూసా అంతే ఉలిక్కిపడి ఎగిరినంత పని చేశా నా కాలికి పక్కనే డోర్ మాట్ మీద ఆరు అంగుళాల పొడుగునా గోధుమ రంగు లో రెండు మూడు మెలికలతో ఒక యాభై రూపాయల నోట్ , మరి అది చూసి అంత ఉలిక్కిపడనేల అనుకున్నారు కదా కారణం అది నాజేబులోంచి పడిందా లేదా ఎవరిదో నా నిజం నిగ్గు తేలితే కాని నా ఉలికి పాటు తగ్గదు.
నీ వెటకారం కూలా నోట్ చూసి ఎందుకంత ఓవర్ ఆక్షన్ అనకండి .... అది నాది కాక పోతే నాకు అది పాము తో సమానం దాని బుసలు నాకు స్పష్టం గా విన పడతాయి, అవును పరాయి సొమ్ము పాము తో సమానం అని దృడం గా నమ్ముతా అలా నా చిన్నపట్నుంచి మా అమ్మ నాన్న ఇద్దరు తెగ నూరి పోశారు వెంకటేశ్వరస్వామిమహిమ గల , దేవుడు ఆంజనేయుడు మనకు రక్ష, సరస్వతి దేవి ని నమ్ముకుటే చదువు సంగతి ఆమె చూసుకుంటుదని ఎలా నమ్మేమో .. అలాగే ఈ పరాయి సొమ్ము పాము అని నాకు చిన్నప్పుడే చెప్పబడి ఉన్నది. ఆ నమ్మకం బాగా బల పడటానికి రెండు మూడు సంఘటనలు కూడా నాకు సాయం చేసాయి.
మీరు నమ్ముతా నంటే చెప్తా అది నేను ఐదో క్లాస్ చదివే రోజులు కొంచం పొడుగు నిక్కరు ఇంకొంచం లూస్ చొక్కా తో ( తొందరగా పొట్టి అవకూడని మా ప్రణబ్ ముకేర్జీ (అమ్మ) యోచన) వేస్కొని బుద్ది గా చదువు కుంటూ టి వి చూడకుండా( అప్పటికి ఇండియా లో ఇంకా టివి కనుక్కోబడలా) బుద్ది గా ఏ బల్ల కిందో మెట్ల కిందో చప్పుడు చేయకుండా చీమలతో ఆడుకునే వాడినని అస్సలు గోల చేసేవాడిని కానని మా వీధి వీధంత చెప్పుకునేవాళ్ళు.
అంత మంచి వాడినని మా అమ్మ అప్పుడప్పుడు నాకు అయిదు, పదీ పైసలు పాకెట్ మనీ ఇచ్చేది. అయిదు పైసలా అదేంటి అని ఆశ్చర్య పడే నవతరంగ చదువరులారా అప్పట్లో అదే నాకు ఎక్కువ. అయిదు పైసలకి అయిదు చిన్న చిన్న బిస్కెట్లు లేక ఒక చాక్లేట్. ఇలా చాలా వచ్చేవి తినేందుకు. వాటన్నిటి కన్నా మాఇంటి దగ్గర సూరయ్య బడ్డీలో ఇంకా మా రోడ్ లోని మసీదు పక్క ఇంట్లో ఉన్న మామూ కొట్లో నాకొక వ్యసనం ఉండేది అది లాటరీ.
ఒక షీట్ మీద చిన్న చిన్న కాగితాలు అతికించి ఉండేవి మనం అయిదు పైసలు ఇచ్చి ఆ స్టికర్ పీకి దాని వెనక ఏముందో చూస్కోవాలి 90 % జోకర్ బొమ్మ మిగతావి ఎమన్నా నెంబర్ ఉండేవి అదే అట్ట మీద ఆ నెంబర్ కి ఏదో బహుమతి రాసి ఉండేది డబ్బులో లేక ఏదన్న వస్తువో .. నేను నా పదో ఏట ఆ వ్యసనానికి లోనయ్యాను. మా అమ్మ ఇచ్చిన డబ్బులతో ఆ కొట్ల లో లాటరీలు ఆడటం రోజూ నవ్వుతున్న జోకర్ బొమ్మ చూసి ఏడుపు మొహం తో ఇంటికెల్లటం. ఇలా చాలా సార్లు అయింది.
ఒక మంచి రోజు ( నిజంగా మంచి రోజూ) మా అమ్మ ఇచ్చిన పది పైసలు తీస్కోని మా లాస్ వేగాస్ లో మామూ కొట్టు కెళ్ళి పెద్ద స్టేక్ లో ఉన్న లాటరీ ఆ రోజే రెలీస్ ఉన్నది చూసి పది పైసల కి ఒక టికెట్ పీకా ఫస్ట్ ప్రైజ్ అయిదు రూపాయలు అక్షరాల అయిదు రూపాయలు..... నెంబర్ ఒకటి కి. స్టికర్ పీకి దేముడిని తలచుకొని వణుకుతున్న చేతులతో తిప్పిచూసా నెంబర్ వన్..... యస్ నెంబర్ వన్ నన్ను అయిదు రూపాయలకు అధికారిని చేసిన స్టికర్ నెంబర్ వన్. ఎప్పటిలాగే మామూ జోకర్ వచ్చిందా బాబూ అంటూ నవ్వాడు .. లేదు మామూ చూడు అని ఇచ్చా... మామూ మొహం పాలి పోయింది ..... పొద్దున్నే వీడికేమీ పన్లేదా అన్నట్టు చూసి నేను విజయ గర్వం తో నవ్వుతుంటే తన బట్ట తల మీద గోక్కున్నాడు యా అల్లా అంటూ.... నేను ఫిక్స్ డ్ డిపాజిట్ మచ్యూర్ ఆయినా డబ్బులు రాని బ్యాంకు కస్టమర్ లాగ మామూ వంక అసహనం గా చూసాను లేట్ అయితే పెనల్టీ పడుద్ది అన్న బెదిరింపు కలగలిపి..... మామూ సాయంత్రం రా బాబూ అన్నాడు. సరే అని అయన కోరిక మన్నించి ఇంటికొచ్చ్చి మా అమ్మ కి విషయం చెప్పాను. మా అమ్మ వెంటనే నీకు బుద్ది లేదా ఆ లాటరీలు ఆడకు అని తిట్టింది. మా అమ్మకి లాటరీల వల్ల లాభం ఏంటో చెప్పా..
1975 లో అయిదు రూపాయలు సంపాదించడం అదీ లాటరీల్లో ఎంత పెద్ద విషయమో చెప్పా.. మా అమ్మ వినలేదు ఆ డబ్బులు ఏదన్న గుడిలో వేసేయి పుణ్యం అని చెప్పింది లేదా చిల్లరా మార్చి బోలెడు మంది అడుక్కునే వాళ్లకి వేసేయి అని కూడ ఒప్షన్ ఇచ్చింది. ఊరికే వచ్చిన డబ్బులు నిలవవు కస్టపడి సంపాదించే డబ్బులే మనవి, ఈ లాటరీల డబ్బు దేముడు నిలవ నీయడు కావాలంటే చూస్కో అని ప్రభోదించింది. నేను ససేమీరా అన్నాను నా మొదటి సంపాదన అలా చెయ్యలేను
మళ్ళీ లాటరీలో వచ్చినప్పుడు నీ మాట వింటాను అని చెప్పా.. మా అమ్మ ఒక కండీషన్ పెట్టింది ఇంకా ఎప్పుడూ అలా లాటరీల జోలికి వెళ్లనని ఒట్టేస్తే ఇప్పుడు నీ ఇష్టం అని అంది. సరే అని ఒట్టు కమిట్ అయ్యాను. మామూ నాలుగు రోజులు తిప్పించుకొని ఆ అయిదు రీ సైక్లింగ్ చేద్దామని తెగ ట్రై చేస్సాడు( తన కొట్లోనే మొత్తం లాటరీలు ఆడామని) కానీ మా అమ్మకేసిన ఒట్టు మహిమ వల్ల నేను ఒప్పుకోలేదు.
ఎలాగోలా నా అయిదు రూపాయల నోటు నా చేతికొచ్చింది. అప్పటికి ముందు రోజే నేను దాంతో ఏమేమి చెయ్యాలో నిర్నయించేస్కున్నా. ఒక మంచి ఇంకు పెన్ను. ఒక పెద్ద సైజు రబ్బరు బంతి. పెన్ను కోరిక బళ్ళో చేరిన రోజునుంచి ఉంది , రబ్బరు బంతి మాత్రం రేవతి హాలు వాళ్ళ అబ్బాయి హరి దగ్గర చూసా పసుపచ్చగా పంపరపనస కాయంత బంతి నెల కేసి కొడితే ఝామ్మని పైకి లేచే బంతి... అది కొనుక్కోవాలని ఉన్నా మా అమ్మని అడిగి తే ముందు టాకీసు కొందాం దాని మీద వచ్చే డబ్బుతో బంతి కొందా మంటుందని మానేసా. డబ్బులు రాగానే మా అన్న చేతి కిచ్చి నా కోరికల జాబితా చెప్పా వాడయితే లోకం చుట్టిన వీరుడు తెలీని విషయాలు లేవు అని నా గట్టి నమ్మకం.
నా కోరిక మీద ఒక గంట లో వగరుస్తూ వచ్చాడు బంతి , పెన్ను తో .. ఆ పెన్ను మంచి రోజూ చూసి స్కూలి పట్టుకేల్దామని అనుకున్నా .. అసలైతే స్కూల్లో పెన్సిలే వాడాలి కానీ పెద్దమనిషి తరహా ఉంటుంది కదా అని పెన్ను కొనుక్కునా. బంతి కూడా ఆదివారం స్కూల్లో ఆడుకోవటానికి తీస్కెలదామని నిర్ణయించాను.
కానీ ఆ శని వారం సాయంత్రం నాలుగు గంటలకి మా ఫ్రెండు శశి గాడు వాళ్ళ అన్న రవి అనే ఇద్దరు దుర్మార్గులు వచ్చి మా అమ్మని అడిగి ఆ బంతి పట్టుకెళ్ళి గ్రవుండు లో బాగా ఆడేసి ఆరు గంటలకి రెండు సగం సగం బంతులు తెచ్చేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయారు కామ్ గా .... నేను ఒక్క సారి కూడ ఆడలేదు ఆ బంతి తో . అది చూసి మా ఇంట్లో అందరూ నా వెనక ముసి ముసి గా నవ్వుకున్నారు. మా అమ్మయితే అర్జునా నీకు ముందే చెప్పితికదా అన్న కృష్ణుడిలా నా వంక సాకూతంగా చూసింది. నేను లోపల్లోపల బాగా ఏడ్చి బయటకి మాత్రం గుంభనం గా ఉన్నా. ఆదివారం వొదిలి సోమవారం స్కూలికి పెన్ను తీస్కేల్లా... రాసింది ఏమీ లేదు స్కూల్లో పెన్ ప్రొహిబిషన్ ఉంది గా కావున ఎగ్జిబిషన్ పెట్టి సాయంత్రం ఇంటి కొచ్చి నా ఆకుపచ్చ స్కూల్ లాగూ జేబులో చెయ్యిపెట్టి నా స్వయం సంపాదన అయిన నల్ల పెన్ను కోసం తడిమా .. అదేదో సామెత చెప్పినట్టు ఏమీ తగల్లా.. ఈ విషయం ఇంట్లో చెప్పగానే ముసి ముసి నవ్వులు మామూలే మా అమ్మ కృష్ణుడి పాత్ర తో సహా..
మా అమ్మ కేసిన ఒట్టు కోసం చాల కాలం నేను అలాంటి ఫ్రీ ల కి దూరమయ్యా. మా నాన్న భాష లో బేవార్స్ డబ్బు ఎప్పుడూ అచ్చిరాదు అన్నమాట నిజమవుతూ .. ఇంకెప్పుడూ నేను అలాంటి బేవార్స్ ల జోలి కెళ్లలా .... చాలా కాలం కాదు ఎప్పటికీ వెళ్ళలేదు.
ఈ సంఘటమే కాదు మా నాన్న చూపించి చెప్పిన మరో ఉదాహరణ కూడా నన్ను ఇలాంటి వాటికి దూరం గా ఉంచింది. ఎక్కువ సాగ తీయను ఇంచుమించు అదే వయసులోనే ఒక రోజూ మా నాన్న చేసే ఆఫీసు పని కోసం మాఇంటికి వేటపాలెం అనే ఊరు నుంచి ఒకాయన వచ్చారు , మా నాన్న ఇంటిదగ్గర అలాంటి విషయాలు మాట్లాడే వారు కాదు కానీ అయన వచ్చారు కదా అని మాట్లాడి చూస్తాలే అని చెప్పారు , ఆ వచ్చిన ఆయన వెళ్ళే ముందు సంచీ లోంచి ఒక అరకిలో జీడి పప్పు పాకెట్ బల్లమీద పెట్టారు , మా నాన్న ఆయన్ని ఎంత నివారించిన వినకుండా వెళ్ళిపోయాడు. అయన వెళ్ళగానే మా నాన్న ఆ పాకెట్ మా గోద్రెజ్ బీరువాలో పెట్టేసారు. మరుసటి రోజూమా నాన్న ఆయనకు ఆ పాకెట్ ధర ఎం.వో చేసానని చెప్పారు ఆ జీడి పప్పు పాకెట్ సంగతి కూడా మర్చి పోయాం మేము. ఎప్పుడో బీరువా సేఫ్ తీసినప్పుడు ఆ పాకెట్ ఖాళీగా ఉంది కొంచం పొడి మినహా మొత్తం చీమలు తినేశాయి. ఆ ఖాళీ కవర్ బయట పడేస్తూ మనం డబ్బులు పంపినా మనం తినలేదంటే అది ఎంత పాపపు తిండో అందుకే మనకు దూరమైంది అన్నారు. ఎందుకో నా మనసు లో అది బలం గా నాటుకు పోయింది.
అంత గట్టి పునాది ఉంది "పరాయి సొమ్ము పాము అని నేను నమ్మటానికి" కష్టపడి సంపాదించినదే ఎక్కువ ఆనందం ఇస్తుందని....
ఆ భావనే ఇప్పటికీ ఫ్రీ వస్తువులన్నా ఎవరన్న ఇచ్చిన గిఫ్ట్ లన్న నన్ను దూరం గా ఉంచుతుంది...
ఆయినా పరాయి సొమ్ము తినే వాళ్ళని , లంచాలు తినే వాళ్ళని మనం తిట్టుకుంటాం కానీ పాపం వాళ్ళేమీ సుఖం గా ఉండరు, CBI. ACB వాళ్ళ తాకిడి , భయం , టెన్షన్ ,
నిద్రలేమీ , మాత్రమే కాక, ఏదో రకం గా ఇంట్లో వాళ్లకు అనారోగ్యం , ధన నష్టం , కుటుంబ పరువు రోడ్ న పడటం ఇలాంటివెన్నో చూస్తుంటాం. అంతే కాదు ఏదీ బహిరంగంగా అనుభవించలేరు...ఇదే కాక లంచం ఇచ్చే వెధవలు తిట్టుకునే తిట్లు శాపనార్ధాలు , బూతుకానాలు అబ్బో .. . అదో ప్రత్యక్ష నరకం

8 కామెంట్‌లు:

  1. బాగా రాస్తున్నారు. అమ్మ కృష్ణుడిపాత్ర హైలైటు. సానుకూలంగా చూడ్డం కాదు, సాకూతంగా చూసింది అనాలి అక్కడ.

    రిప్లయితొలగించండి
  2. శీర్షిక చూసి ఏదో వీరగాధ ఊహించుకొని వచ్చాకదండీ.

    నాక్కూడా ఇలా ఉచితములు అచ్చిరాలా. పరులసొమ్ము సంగతిమటుకు తెలియదు, ఎప్పుడూ ఆశపడలా.

    'ముసిముసినవ్వులు ' బాగున్నాయండి. రబ్బరుబంతిని గంటలో, టెన్నిస్బంతి ఒక రోజులో రెండు చిప్పలు చేయడం మా రోజూవారి కార్యక్రమం.

    రిప్లయితొలగించండి
  3. @ కొత్త పాళీ గారు : ధన్యవాదములు మీలాంటి వారు చదివి నన్ను సరిదిద్దుతున్నారు మొత్తం ఆంద్ర కర్నాట గనులన్నీ లీస్ నాకే వచ్చినట్లు గా ఉంది
    @ JB గారూ: వీర గాధ లు ఉండటానికి నేనేమన్నా సిని హీరో నా .. ఇది జీవితం అండీ జీవితం (భావోద్వేగం తో చదువుకోండి)

    రిప్లయితొలగించండి
  4. andaru elaa anukorandi paraayi sommu em cheste vastundaa kastapadakundaa elaa tindaamaa ani chuse vaallu ekkuva.baagaa rastunnaru...kadhanam baagundi

    రిప్లయితొలగించండి
  5. meeru medadu vaidyula(psychology)naa lanti marchipoye gunam unna vaariki kooda patha gyapakalani gurthuchesthu mana chinnappati vishayalu bhale rasthunnaru.aa 5 paisala lottery tickets avi naaku kooda telusu but poorthiga marchipoya. malli mee maatala valla gurthukosthunnai.
    parayi valla sommuni paamu tho polchina vishayam paathadaina... chakkati udaharanalo tho sadharana vishayaltho baga chepperu.

    రిప్లయితొలగించండి
  6. బాగుంది మాష్టారు. చాలా బాగుంది. ఉద్వేగం డోసు సరిపోయిందా.మా చిన్నప్పుడు అనగనగా అను పూర్వకాలంలో కానులు ఉండెడివి. ఆ కాలంలో, భారత దేశానికి స్వాతంత్రం వచ్చినా మాకు ఆర్ధిక స్వాతంత్ర్యం ఉండేది కాదు. ఒక కాని సంపాదించాలంటే నానా పాట్లు పడాల్సివచ్చేది.అయినా వెరవక కిందపడి దొర్లి ఏడ్చి నానా హంగామా చేస్తే కానీ ఆర్ధిక స్వాతంత్రం వచ్చేది కాదు.అర్ధణా ఇచ్చి అనేక కండిషన్లు పెట్టేవారు.ఇప్పుడు తల్చుకుంటుంటే ఇంత నవ్వు వస్తోంది ఏమిటి? థాంక్స్ మంచి టపా పెట్టినందుకు.

    రిప్లయితొలగించండి
  7. బాగుంది మీ శైలి, ఇంకా రాయండి, మీ బాల్యం గురించి
    - గొల్ల హరనాధరావు

    రిప్లయితొలగించండి