15, అక్టోబర్ 2010, శుక్రవారం

నీ వల్లే.. నీ వల్లే...




ట్రింగ్ ట్రింగ్ .. ట్రింగ్ ట్రింగ్.... నా మొబైల్ లో పిలుపు చూస్తే
మా మేనల్లుడు కాంత్ ఏంటి సంగతి అంటే ...
"ఏంటి మొయ్యా ( మావయ్య అనే పిలుపు వాడలాగే పిలుస్తాడు ) నీ వల్ల చూడు..అన్నాడు నిష్టూరం ధ్వనిస్తూ ..
ఏమైందిరా.. అన్నా
చేసేది చేసేసి మళ్ళీ ఏమైంది అంటావా అని కొంచం గొంతు పెంచాడు ..
ఏమైందో చెప్పరా అని అడిగా కొంచం భయకంపిత స్వరం తో..... ఏమైందో అన్న అనుమాన బీజం నాటుకోగా....
నా జీవితం ఇలా ఉండటానికి నువ్వే కారణం మొయ్యా అన్నాడు ఈసారి గొంతులో నిష్టూరం తో బాటు నిరాశ కూడ పలికింది
వీడికేమైంది అందరు పిల్లల్లగానే ఇంజనీరింగ్ చదివి ఇరవై ఒక్క ఏళ్లకే కాంపస్ నుంచి డైరెక్టర్ గా కంప్యూటర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్కుంటూ
మూడు సినిమాలు ఆరు షాపింగ్ లు తో బానే ఉన్నాడు కదా అనుకోని .."నీ జీవితాని కేంటి రా బాబూ..." అన్నా.
" నీ వల్లే నేను ఈ సాఫ్ట్ వేర్ కంపనీ లోనే జేరాను హుహ్!! " అన్నాడు
వాడి చదువుకీ ఉద్యోగానికీ కంపనీకీ దేనికీ సంబంధం లేని నేను బుర్ర గోక్కుంటూ ఆలోచించాను
నా ఆలోచన మాలిక ను తెంపుతూ... 'పేపర్ చూడలేదా' అన్నాడు ,
'చూసాను' ఏముందా అందులో నన్న జిజ్ఞాస మొదలైంది
" చిరంజీవి ఇంకో మేనల్లుడు కూడా హీరో అయ్యాడు" అని చెప్పాడు ఈ సారి కాస్త దీనం గా..
"దాట్లో నా తప్పేం ఉందిరా అన్నా..." అయ్యో పాపం అనుకుంటూ...( ఎవరిని పాపం అని అడక్కండి ఎవరిక్కావాలంటే వాళ్లకి )
" ఆ ధరం తేజ వాళ్ళ మావయ్య పెద్ద మెగా స్టార్, అందుకే అయన మేనల్లుల్లిద్దరూ హీరో లయ్యారు
నువ్వేమో కనీసం కమెడియన్ కూడా కాదు అని నా గాలి తీసేసాడు.
నాకు పూర్తిగా లైట్ వెలిగింది తప్పు నాదే ఏదో నేను ఒక మెగా స్టార్ అయిఉంటే ఆ మెగా నీడ లో మా వాడు కూడా మంచి హీరో అయ్యేవాడు
దురదృష్టవంతుడు. తప్పు నాదే కాబట్టి సమాధానం చెప్పే వీలు లేక నీళ్ళు నమిలా.... నా బాధ అర్ధం చేసుకున్నాడో ఏమో మా కాంత్ గాడు సర్లే జరిగి పోయిందానికి నువ్వు మాత్రం ఏమి చెయ్య గలవ్ ? ఇక నుంచి ఇలా జగక్కుండా చూస్కో అని ఫోన్ పెట్టేసాడు. ఇక నుంచి ఇలా జరక్కుండా అంటే ఎలా రా బాబూ అనుకుంటూ... .ఆ. అనుభవ రాహిత్యం ఇంకా డయలాగ్ రాస్కోవటం కూడా రాని పసి కూన. అని సర్ది చెప్పుకున్నా.
రెండు రోజులయింది ఒక మధ్యాహ్నం ఆఫీసు లో పని చేస్కుంటుంటే ఫోన్ ట్రింగ్ ట్రింగ్ ... చూస్తే మా అన్న కొడుకు ప్రశాంత్
ఇంటర్ మొదటి సంవత్సరం చదువు తున్నాడు
వాళ్ళ అమ్మ ఫోన్ లోంచి కాల్ చేసాడు.
ఏంట్రా అంటే ...
"బాబాయ్ తెలీకుండానే నువ్వు అన్యాయం చేసావ్ "
నేనా అన్యాయమా ఎలా ఎప్పుడూ ఎక్కడ అని అడిగా ...
"అవును నువ్వే!! నువ్వు బాలకృష్ణ అయ్యుంటే నేను హాయిగా జూనియర్ ఎన్టీయార్ అయ్యే వాడిని కదా
చక్కగా ఈ దసరా కి "బృందావనం " రెలీస్ చేస్కొని కలెక్షన్ లు చూస్కుంటూ ఆనక ఛానల్స్ లో ఇంటర్వ్యూ లు ఇస్తూ ఉండేవాడిని కదా "
ఏదో కుట్ర లా ఉంది ...
ఈలోపు ఫోన్లో "అల్లో బుజ్జి బాబాయ్ నేను పనావ్ ని నీ వాళ్ళే ఇలా జరిగింది నేను కూడా సినిమాల్లో బాల నటుడిని అయ్యేవాడిని ( వాడు మూడో క్లాస్ మా అన్న రెండో కొడుకు ) సందేహం లేదు ఇది కుట్రే సర్లే సాయంత్రం మాట్లాడుతా ఆఫీస్ లో బిజీ అని పెట్టేసి .. ఆలోచిస్తే నిజం గానే కొంచం గిల్టీ గా అనిపించింది.

పన్లో పడి ఒదిలేసా...

ఆ రాత్రి టీవీ లో చానల్ వాళ్ళు ఏర్పాటు చేసిన సమైఖ్యంద్ర తెలంగాణా వాదుల పోట్లాట చూస్తుంటే ఎడమ కన్ను టికు టికు మంటూ కొట్టుకుంది ఇంతలో ట్రింగ్ ట్రింగ్ ఎక్కడో దూరం గా హాస్టల్ లో ఉంది చదువు కుంటున్న నా కూతురు .." హాల్లో నాన్న ఏమి చేస్తున్నావ్ తిన్నావా ? తినే ఉంటావ్ లే చేసే దంతా చేసి అంటూ.."
మళ్ళీ పరిచయమున్న ఆరోపణ లా ఉంది అనుకుంటూ నేనేమి చేసాని నానీ ? అన్నా..
ఏమి చెయ్యలేదు అదే నా బాధ నువ్వు హాయిగా కేసీఆర్ అయుంటే నేను చక్కగా కవిత నయ్యుండే దాన్ని హాయిగా.....బతకమ్మ ఆడేదాన్ని ఇంకా....
నేను ఆపి "ఒద్దు నువ్వేం చెప్పొద్దూ నాకూ తెలుసు నువ్వేవ్వేం చెయ్యోచ్చను కుంటున్నావో.... "
మా అమ్మాయి కి చాలా చాలా సారీలు చెప్పి పెట్టేసా.
ఎవరికీ ఫోన్లో సారీలు చెప్తున్నావ్ అని మా అవిడ అడిగింది
మూడు రోజులుగా వస్తున్న ఫోన్లు ,జరుగు తున్న విషయాలు చెప్పా .. అవును కదా అంటూ ఆలోచించటం మొదలెట్టింది ...
నాకూ మళ్ళీ కన్ను టికు టికు మానటం మొదలెట్టింది... అక్కడే ఉంటె ఎలా దారి తీస్తుందో అని టీవీ కట్టేసి వెళ్లి పడుకున్నా..
తెల్లారే ఫోన్ నా ఫ్రెండ్ ప్రభు గాడు తీయాలంటే భయమేసింది వీడేమి అభాండం వేస్తాడో అని తీరా తీసాక లయలా కాలేజీ లో ఫుట్ బాల్ ఆడదాం వస్తావా అంటూ.. సరే అని వెళ్ళే. కాసేపు ఒళ్ళు వంగ దీద్దామని. అక్కడ కాసేపు ఆడాక ఆయాసం తో కూర్చొని
మా వాడు ఆ నీ వల్ల తొందరగా ఆయాసం అన్నాడు ... అంటే ఏంటి నా వల్ల అంటే ??
నువ్వు ఇకెర్ కాసిల్లాస్ అయుంటే నేను డేవిడ్ విల్లా అయివుండే వాడినన్నాడు. మనం స్పయిన్ కి ఆడే వాళ్ళం వరల్డ్ కప్ గెలిచే వాళ్ళం. అన్నాడు
విషయం ముదిరే లోపు ఛీ ఛీ వెధవ గోల అంటూ లేచి ఇంటికొచ్చా.

స్నానం చేసి కాసేపు మెడి టేషన్ చేద్దామని కూర్చొని ఆలోచనలో పడ్డా ధ్యానం లో జ్ఞానం కలిగింది .... మనం ఏ పని చెయ్యలేక పోయిన

మన లోపాలన్నీ వేరే వాళ్లకి ఎలా బదలా ఇంచోచ్చో తెలిసింది.

చిన్నప్పుడు బాగా చదవక సరైన బడి లేదు సరైన మాస్టర్లు లేరు ఉండుంటే నాసా లో సైంటిస్ట్ అయ్యేవాడిని లేక పోతే అబ్దుల్ కలాం నయ్యుండే వాడిని , బాసు సరైన వాడు లేదు ఉండుంటే నన్ను సరిగ్గా గుర్తించుంటే ఈ ఏడాది శ్రమరత్న నాకే వచ్చేది. ఫలానా కులం లో పుట్టింటే బాగా ఎదిగే వాడిని అనవసరం గా ఇందులో పుట్టాను,
మా నాన్న అమితాబ్ బచ్చన్ అయుంటే నేను అభిషేక్ బచ్చన్ అయ్యేవాడిని ఐష్ ని పెళ్లి చేస్కొని చక్కని ఇడియాలు ఇస్తూ ఉండేవాడిని అని మనలో చాలా మంది అనుకోవచ్చు.
అది మనని మనకు సర్ది చెప్పుకునే సమాధానం లేక మనని మనం మోసం చేస్కోవటం .. మన జీవితం మనది మనదే అక్షరాలా మనదే
దాన్ని ఎలా తీర్చి దిద్దుకున్తామో అది మన చేతిలోనే ఉంటుంది అది తెలిసే పరిపక్వత వచ్చే సరికి చాలా జీవితం అయిపోతుంది .. అందుకే ..
దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టినట్లు .. ఎప్పటి భాద్యత అప్పుడు వహిస్తే ఆనక ఇంకోడిని దోషి ని చెయ్యకర్లేదు .

ఏమంటారు ..??


PS: ఇంకా నయం నాకూ కొడుకు లేడు ఉండుంటే " నాన్న నువ్వు వైఎస్సార్ వి కావు.. అయ్యుంటే నేను .... చక్కగా.....

...... తుండే వాడిని అంటే నేనెక్కడ హెలికాప్టర్ ఎక్కాల్సి వచ్చేదో....!! థాంక్స్ దేవుడా నాకూ నా జీవితమే ఇచ్చావ్ నాకిదే ఇష్టం... ఇలాగే ఇష్టం .





6 కామెంట్‌లు:

  1. సారూ!
    మీ రచనా శైలి చాలా ఇంప్రూవ్ చేసారు.. "పాము కధ" కూడా బావుంది..మీ అనుభవాలన్ని ఇంచుమించు మాకూ జరిగినవే.. ఆ రొజుల్లో స్కూళ్ళళ్ళో కూడా "మోరల్ సైన్స్, ఎథిక్స్" పాఠాలు ఉండేవి.. నీతి కధల్ని మా చేత వారినికోసారి చెప్పించే వారు..అందుకే మనం దురలవాట్లకి దూరంగా వుండగలుగున్నాం.. ఇప్పుడు ఇంటర్ లెవెల్ కే అన్నీ అనుభవాలూ అయిపొతున్నాయి... మన భావాలు యువతరం స్ఫూర్తినివ్వాలని ఆశిస్తూ...

    రిప్లయితొలగించండి
  2. ఈ ఐడియా ఏదో బావుందే! :)
    నేను చిన్నప్పుడు దుర్యోధనుడవ్వాలని కలలు గనేవాణ్ణి, కృష్ణపాండవీయం చూసిన మహిమలో. మా అప్పని అన్యాయంగా ధృతరాష్ట్రుణ్ణి చెయ్యాల్సి వస్తుందని ఆ ఆలోచన్ని విరమించా.

    రిప్లయితొలగించండి
  3. మా నాన్న అక్బర్ అయితే నేను ..... ప్రిన్స్ పుల్ అప్లై చేసారా చాలా బాగుంది.
    అయితే మీకేమండి కొడుకు లేని అదృష్టవంతులు

    రిప్లయితొలగించండి
  4. మీరూ రివర్సులో కొట్టండి: నువ్వు సానియామీర్జా అయితే నేను వాళ్ళ నాన్నలా; నువ్వు కోనేరు హంపి అయ్యుంటే నేను కోనేరు అశోకులాగా, నువ్వు చిరంజీవయితే, నేను వెంకటేశ్వరరావులాగా;

    రిప్లయితొలగించండి
  5. మా నాన్న డాక్టర్ అందుకే నేను డాక్టర్ ని అయ్యా
    http://anvvapparao.blogspot.com/2010/08/blog-post_12.html
    http://anvvapparao.blogspot.com/2009/12/blog-post.html

    రిప్లయితొలగించండి