
ఒక చిన్న జ్ఞాపకం పెద్ద పండగ గురించి.
రంజాన్ పెద్ద పండగ. ఆ పండగ తాలూకు నెల రోజులూ ఊళ్ళో ఎక్కడ తిరిగినా రోజులో ఎక్కువ సార్లు వినపడే నమాజ్, ముస్లిం సోదరులు సాంప్రదాయ దుస్తులు, బజారులో తిరుగుతుంటే వచ్చే అత్తరు పరిమళాలు, బురఖాల్లో బజారులలో పండగ సంబారాల కోసం తిరిగే వదినమ్మలు, నెల రోజుల పైగా జరిగే సందడి, రోజూ చీకటితో మూడింటికే లేచి, వంటల హడావిడి , మొదటి నమాజ్ అయ్యాక పొద్దునే తినే భోజనం, అదయ్యాక రోజంతా నీరు కూడా తాగని కటిక ఉపవాసం, కొంత మంది నోటిలో ఊరే లాలాజాలం కూడా మింగకుండా ఉమ్మెసేవాళ్ళూ, సాయంత్రం మళ్ళీ నమాజ్ అయ్యాక చేసే ఇఫ్తార్ విందు . సేమ్యాలు ఇంట్లో తయారు చేస్కోవటం, కొత్తబట్టలు కొనుక్కోవటం కుట్టించుకొవటం, ఇలా చాలా పనులుంటాయి. చివరి రోజు నెలవంక కనపడే వరకు జరిగే చర్చలు, సౌదీ లో ఇవాలే కనపడిన్దంట భాయి వాళ్లకి ఈరోజే మనకి ఇంకా డిల్లి లో ఇమాం గారి కబురు రావాలి అంటూ సాయంత్రం ఎదురు చూపులు. ఇలా వాళ్ళకే కాదు ముస్లిమేతరులకి కూడా ఎంతో సందడి.
నా బాల్యంలో అయితే బందరులో మేముండే బుట్టయిపేట అరవగుడెం సందులో ( ఈపేరు ఇప్పుడు ఎవ్వరికీ తెలీదు అందుకని ఎవరినీ అడక్కండి ) మా ఇంటి ఎదురు ఖాళీ స్థలం లో వెనక వైపు మొత్తం ముస్లింలే ఉండేవాళ్ళు. ఆర్ధికం గా చాలా దయనీయ పరిస్థితి లో ఉండే వాళ్ళు. మగాళ్ళు రిక్షా తొక్కేవాళ్ళు , రైసు మిల్లు లో పని చేసేవాళ్ళు, ఆడాళ్ళు ఇళ్ళలో పని చేసేవాళ్ళు, పిల్లలు ఐదో క్లాస్ లోపే చదువాపేసి, రోల్డ్ గోల్డ్ పనికో , చిన్న చిన్న పన్లకో వెళ్ళేవాళ్ళు. మా లాంటి మధ్యతరగతి కుటుంబాలు, కొంచం ఎగువ మధ్యతరగతికి చెందిన డాక్టర్ గారి కుటుంబంతో బాటు దిగువ మధ్యతరగతి కుటుంబాల చెంతన ఈ పేదరికపు అంచున వేలాడుతున్న పై చెప్పిన కుటుంబాలు కూడా ఉండేవి.
రంజాన్ రోజుల్లో వాళ్ళ సందడి భలే చూడ ముచ్చట గా ఉండేది, రంజాన్ నెల కి ఇంకా కొన్ని వారాల ముందే వాళ్ళ పండగ సంబరాలు మొదలయ్యేవి. వాళ్ళ ప్రతీ మాట లోనూ రంజాను ప్రస్తావన వస్తుండేది. అది చెయ్యాలి ఇది చెయ్యాలి అంటూ చెప్తుండేవాళ్ళు. వాళ్ళ ప్రభావం మామీద కూడా ఉండేది. అసలు ఆ రోడ్ లో పేద , మధ్య తరగతి, ధనిక వర్గాల మధ్య ఏ తేడా ఉండేది కాదు. చిన్న చిన్న తేడాలు ఉన్నా, అలిగినా మళ్ళీ రెండురోజులకే కలిసి పోయేవాళ్ళు.
రంజాన్ రోజుల్లో వాళ్ళ సందడి కొస్తే ఇత్తడి సేమ్యా మిషను తెచ్చి అది నులక మంచం పట్టీ కి బిగించి గోధుమపిండి ముద్ద కలిపి ఆ మిషను లో వేసి చేతిమర తిప్పితే జాలు వారే సేమ్యాలు ప్లేట్లు తిరగేసి , చేటలలోను వాటిని ముగ్గుల్లా పట్టి ఎండ పెట్టేవాళ్ళు. వాళ్ళల్లోనే ఇద్దరు ముగ్గురు మేన మామలు దర్జీ పని చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. పండగ బట్టలు తాడేపల్లివారి సత్రం అరుగు మీద ఉండే ఆ దర్జీలే కుట్టేవాళ్ళు. ఆమాట కొస్తే నేను కొంచం పెద్దయి సోకులు పెరిగేదాక నా లాగూలు చొక్కాలూ అక్కడే కుట్టించేది మా అమ్మ. పండగ రోజు రంగు రంగుల బట్టల్లో తిరుగుతూ, మా వీధంతా మసాల వాసనలు ఘుమ ఘుమ లాడిస్తూంటే, కొంతమంది మగాళ్ళు సూరయ్య బడ్డీ పక్కనే ఉన్న సారా కొట్టులో లయిటు గా తడిసి కొంచం తూగుతూ, ఎక్కువయితే కనపడని వాడెవడినో ..డెమ్మ ..డెక్క ...డాలి తిట్టుకుంటూ మా ఇంటి ముందు కరెంటు స్థంభం పట్టుకు నుంచొని మేమవరైనా బయట కనపడితే తువ్వాలు మూతికడ్డం పెట్టుకొని "ఏంటి బాబు పండగ భోజనం తినడానికి మాయింటి కొస్తారా అంటూ " మొహమాటపు నవ్వు నవ్వి వెళ్లి పోయేవాళ్ళు.
ఎంతో ఆనందం తో కళ కళల్లడుతూ తిరిగి రాత్రి తొలాట సినిమా చూసి మళ్లోక సారి పలావ్ తిని అలసి సొలసి ఆదమరచి ఆరుబయట నిద్ర పోయేవారు.
నేను హై స్కూల్లో ఉన్నప్పుడు మాతో చదివే అబ్దుల్ బారీ అనే అబ్బాయి రంజాను రోజుల్లో ఉపవాసాలుండి, క్లాస్ జరుగుతున్నప్పుడు ప్రతీ అయిదు నిముషాలకోసారి లేచి సార్ ఉమ్మేయాలి అనేవాడు, మాస్టార్లు ఏంట్రా నువ్వు ఉపవాసాలుంటున్నావా అని అడిగి వాడు అవునంటే భేష్ కానియ్ వెళ్లి ఉమ్మేసి రా అనేవాళ్ళు. అందుకని మా బారీ ప్రతీ సారీ సార్ ఉమ్మేయాలి అని సైగ చేసేవాడు, వాడి బాధ భరించ లేక మాస్టార్లు " ఒరేయ్ ప్రతీసారి అడగక్కరలేదు లేచి వెళ్లి ఉమ్మేసి వచ్చి కూర్చో అనేవాళ్ళు. వాడు అలా రోజులో సగం టైం బయటకీ లోపలకీ తిరుగుతూ మా వంక కొంచం గర్వం గా చూసేవాడు (చూసారా నాకు మల్టిపుల్ ఎంట్రీ పెర్మిషను ఉండీ అన్నట్టు) మేము వాడి అదృష్టానికి చాలా కుళ్ళుకునే వాళ్ళం కనీసం ఈ ఒక్కనెలైనా ముసల్మాన్ గా పుట్టి ఉంటే ఇలా క్లాస్స్ స్పెషల్ ట్రీట్మెంట్ దొరికేది కదా అని.
నాకు తెలిసిన కొందరు ముస్లిం స్నేహితులు మతపరమైన నియమ నిభందన, ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు, రిటైర్ అయి చాలా సార్లు హజ్ వెళ్లి వచ్చిన రెహ్మాన్ గారు ఈ రంజాన్ నెలలో పేద ముసల్మన్లయెడల చాలా వితరణ చూపిస్తారు. ఇంకో ముస్లిం కుటుంబం పెద్ద మాల్ యజమాని , పేదలకే కాక తెలిసిన వాళ్ళకందరకూ రంజాన్ విందు చేస్తారు. వాళ్ళ పద్దతులు చాలా ముచ్చట గొల్పుతాయి. పేద వాళ్ళకీ, స్నేహితులకే కాక ఇంకా కొంత మంది అధికార గణానికీ రంజాన్ తినిపింపుళ్ళు సేవ చేయాలని చెప్పినప్పుడు కొంచం భాధ కలిగింది. ఆ అధికార గణం ఎవరని అడక్కండి మీకు బాగా తెలుసు.
మా ఇంటికి రోజూ పూలు తెచ్చే రజాక్ చాలా పేద వాడు, సాయంత్రం ఏడు ఎనిమిది మధ్య టoచనుగా రోజూ పూలు తెచ్చి ఇస్తాడు మరుసటి రోజు పూజ కి.
ఏమి పెట్టినా తినకుండా ఇంటికి తీస్కెళ తాడు పిల్లల కోసం ఎన్ని మైళ్ళు సైకిలు తొక్కితే ఎన్నిమూరలమ్మేనూ? ఎన్ని మూరలమ్మితే ఎంత మిగిలెను ?
బహు కష్ట జీవి రంజాను పండగ ఎలా ఉందీ అని అడిగితే దీనం గా ఏమి రంజాను సారూ అన్నాడు.
ఆ మాట కొస్తే ఆయనే కాదు మన ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ముస్లిమ్స్ లో చాలా మంది ఆర్ధికం గా వెనకబడినవారే. ఆటోనగర్లలో పనులు ,చిన్న చిన్న వృత్తులలో ఉన్నవారూ,చాలీ చాలని జీవితం గడిపేవారు,అలాంటి వారి జీవితాలలో ఈ రంజాన్ నెలపొడుపు కొత్తవెలుగులు తేవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...ఈద్ ముబారక్!!